[వి.ఆర్.విద్యార్థి గారి గురించి మెడికో శ్యాం గారు అందిస్తున్న రచన.]
విద్యార్థిగారనే వేలూరి రాములు గారు నాకు తెలిసి 10-11 ఏళ్ళే. అయినా ఇంకా ఎన్నేళ్ళబట్టో తెలిసినట్టు అనిపిస్తుంది. ఈయనా, నేనూ, మంచి విద్యార్థి అని నేననే విన్నకోట రవిశంకర్ కలిసి అట్లాంటా వెళ్ళడం నిన్నో మొన్నో జరిగినట్టు అనిపిస్తుంది.
అదే మొదటిసారి వి.ఆర్.విద్యార్థి గార్ని కలవడం. మళ్ళీ కలుస్తాననుకోలేదు. మళ్ళీ మళ్ళీ కలుస్తానని అసలు అనుకోలేదు. కాని కలవడం చాలాసార్లు మాట్లాడుకోవడం, ఇలా జరగడానికి మూల కారణం ఆయనలోని స్నేహ స్వభావం. ఇతరులపట్ల గౌరవం, అభిమానం. అందరిపట్ల ప్రేమ అని ఇప్పుడు తెలుస్తోంది.
చాలా చిన్నప్పుడు విద్యార్థి గారు ‘కవులు’ అంటే ‘కౌలు’ అనుకున్నారట. చిన్నప్పుడు కూడా సరిగ్గానే అనుకున్నారనిపిస్తోంది. రాజ్యాలకీ, ప్రభుత్వాలకీ, కౌలుకి పోయిన మన కవి రచయితల్ని చూస్తే.
నేనూ, నాతో మరి కొందరం కలిసి కవులని ‘కవ్స్’ అంటా సరదాగా. అదే వెయిన్‌లో ‘కథక్స్’ అనాలి కదా కథకులని.
మన కథక్స్ ఇద్దరి మధ్య మూడు గ్రూపులు, ఎవరికీ కథా రాయడం రాదంటాడు మన కుర్ర కథక్. నేనైతే మళ్ళీ కథ రాయలేననీ, పాస్టు గ్లోరీ మీదనే కథ నడుపుతున్నాననీ అంటాడు.. నా సంగతీ, కథక్స్ సంగతీ ఎలా వున్నా అదలా వుంచితే..
కవ్స్ మధ్య సామరస్యం, కలిసికట్టుగా ఉండటం ఎక్కువనుకుంటాను. ఆ భావన ఈ ఇద్దరు విద్యార్థుల్ని చూస్తే మరికాస్త బలపడుతుంది. అంటే ఆ వి.ఆర్. విద్యార్థి గార్నీ, ఈ మంచి విద్యార్థి రవి శంకరాన్నీ అని. వీళ్ళకి తెలియని తెలుగు కవులూ, రచయితలూ ఎవరూ లేరేమో. వీళ్ళవి అందర్తోనూ మంచి సంబంధాలే. వీళ్ళు వేరేలా రాస్తూ కరెంట్ గ్లోరీలోనే వున్నారు. విద్యార్థి గారు, ఒకనాటి ‘సైనికుని ఉత్తరం’ నుంచీ, అలనాటి ‘అపరిచితుల’ నుంచీ, ఇటీవలి ‘దృశ్యం నుండి దృశ్యానికి’ దాకా రాస్తూనే వున్నారు. మధ్యలో అలల, ఘర్మ సంద్రాల, మంచు మైదానాల పలకరింతలూ వగైరా వగైరాలు చేస్తూనే, ఖండాంతర కవితా విన్యాసాలూ చేసారు. ఒక ప్రాంతపు, ఒక దేశపు, కవిగా మిగలక విశ్వ విద్యార్థిగా విశ్వ కవిగా తన ప్రయాణం సాగిస్తున్నారు.
ఒక విధంగా చూస్తే, విద్యార్థిగార్ని కలిసినన్ని సార్లూ నేనంత మరీ మంచి షేపులో లేనేమో అన్పిస్తుంది. ఆ అట్లాంటా వెళ్ళివచ్చినపుడు గడిపిన కొన్ని గంటలూ నేనేమన్నానో, ఏం మాట్లాడానో నాకైతే గుర్తులేదు. కాని ఏదో ఏదో చాలానే మాట్లాడాను. “అజ్ఞానం అమితబలం” అన్నానొకసారి. ఆ బలం వలన ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఆయనతో ఎంతో సంభాషణ గావించాను, ఆయన తన సింప్లిసిటీ వలన, స్నేహభావం వలన, వినే శక్తి గలవాడవడం వలన, నా కూతలన్నీ కలకూడితలు కాకున్నా వింటూనే వున్నారు. అంతే కాదు. మెచ్చుకుంటూ పోయారు. ఇంకా మెచ్చుకుంటూనే వున్నారు.
మేం నారాయణరావు (వెల్చేరు) గారింటి ముందు దిగగానే నన్నడిగారు, “మీ పుస్తకం (శ్యామ్యానా) తీసుకువచ్చారా?” అని
“లేదు. ఎందుకు?” అన్నాను నేను.
“ఆయనకివ్వడానికి” అన్నారు.
ఇంతలో “నేను తెచ్చాను.” అన్నాడు రవిశంకర్.
“వద్దు. అక్కర్లేదు.” అన్నాను
“ఏం?” అన్నారు విద్యార్థిగారు.
“ఎవర్నీ బాదర్ చెయ్యడం, అభిప్రాయాలు అడగడం నాకిష్టం వుండదు. ఎవరికైనా చదవాలన్పిస్తే వాళ్ళే చదువుతారు. అభిప్రాయాలడగడం వాళ్ళని ఇబ్బందిలో పెట్టడం అనిపిస్తుంది నాకైతే” అన్నాను.
ఈ లోపున, కారు ట్రంకులోంచి ఓ బండిల్ తీసారు విద్యార్థిగారు. ఆ బండిల్లో ఆయన రాసినవీ, ఆయన మీదా, ఆయన పుస్తకాల మీదా అనేకులు రాసిన రాతలన్నీ వున్నాయి. అంతే సిస్టెమెటిగ్గా, అంత ప్రిపేర్డ్‌గా వుండడం సాధ్యమా? అని ఆశ్చర్యపోయాను. తరువాత ఆయన నారాయణరావు గారిని తన అభిప్రాయాన్ని రాయమని అడిగిన తీరునీ, ఆ వినయశీలతనీ చూసి మరింత ఆశ్చర్యపోయాను.
అక్కడి నుండి పెమ్మరాజు వేణుగోపాల్‌రావు గారింటికి వెళ్ళాం. అక్కడ కూడా ఓ బండిల్ ఇచ్చారు. వాళ్ళింటి రూపు రేఖలూ, వాళ్ళ ఆతిథ్యం చూడముచ్చటగానూ, చెప్పనలవిగానివిగానూ వున్నాయి.
అన్నట్టు వేణుగోపాల్‌రావు గారి కుర్చీ పక్కనే వున్న బల్ల మీద శ్యామ్యానా మెరుస్తూ కన్పించింది.
“మీరొస్తున్నారు కదా అని..” అన్నారు.
అడుగడుగునా, వాళ్ళ బేస్‌మెంట్‌లోనూ, ఇంటి పూదోటలోనూ వేణుగోపాల్‌రావు గారి కళాభిరుచులూ, కళాకౌశలమూ కనిపించాయి. లక్ష్మిగారి కుక్ బుక్ లోనూ ఆయన ఫోటోగ్రఫీ అభినివేశం దర్శనమిచ్చింది.
పాక గేహలలో లక్ష్మిగారి అద్వితీయ ప్రదర్శన చూసి రుచి చూసి తీరవలసిందే. తెలుసుకోవలసిందే. ఇవన్నీ చూసిన ఎవరైనా సరే అబ్బురమూ ఆశ్చర్యమూ పడవలసిందే.
మరి విద్యార్థి గారు కవి.
అప్పుడో, ఆ తర్వాతో ఈ కవిత రాశారు, కవి విద్యార్థి గారు. మకుటం మాత్రం మంచి విద్యార్థి (కవి రవిశంకర్) గారి సూచన. చిత్తగించండి.
~
మిథునం
సూర్యుడు
రసవాదంతో
పరిసరాల్ని సువర్ణం చేస్తూ
కొండెత్తు
చెట్ల గుంపులో
పక్షులపాటల దర్బారు
సౌజన్యాన్ని వెదజల్లుతూ
చెట్లమధ్య
చుట్టూ
మృదులశాద్వలపు
తివాచీలు
ఇంట్లో
ఘోషించే శ్రుతులు
పలవరించే అక్షరాలు
ఉలి స్పర్శకు
దేవతలై
దీవించే దారువులు
గీతలో
పరిభ్రమిస్తూ..
రంగుల ఖగోళాలు
బ్రహ్మీపుత్రియై
నలభీములకు చెల్లెలై
గృహ ‘లక్ష్మి’
అతిథులను ఆదరిస్తూ
జడలు పెంచని
కమండలం ధరించని
త్రిదండం తిప్పని
తపోధనుడై
గృహ ‘పాలకుడు’
నిరంతరం
అంతర్ యానంలో”
డాలస్‌లో ఓ టాంటెక్స్ సమావేశంలో ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారితో తన పరిచయం గురించీ, తనపై ఆయన ప్రభావం గురించీ చెప్పగా విన్నాను. అందులో ఒక భాగంగానే సైన్యం నుంచి విరమించినట్టు తెలిసింది. ఒక విధంగా చూస్తే ఆయనలోని తాత్వికత కూడా ఈ ప్రభావ ఫలితమేమో అనిపిస్తుంది.
గత కొన్నేళ్ళుగా నన్నెప్పుడూ మరిచిపోవుకదనీ అదే ఆయన స్నేహభావమనీ చెప్పగలను. నన్ను వాళ్ళ హన్మకొండకు రమ్మనీ, ‘మిత్రమండలి’ సమావేశంలో పాల్గొనమనీ, ఉపన్యసించమనీ చాలాసార్లు పిలిచారు. నా గురించి తనకి తెలిసిన కొందరిచేత ఏవేవో పత్రికలలో రాయించే ప్రతిపాదనలూ చేశారు. తనను ఇంటర్వ్యూ చేసిన కొందరి చేత నన్ను ఇంటర్వ్యూ చేయించే ప్రయత్నమూ చేశారు. నా రిలక్టెన్సు కారణంగా అవేవీ జరగలేదు. అఖరికి ఒకసారి చదివి వినిపిస్తాననీ అన్నారు. అవి పాతవనీ, అదనీ, ఇదనీ ఏవేవో కారణాలు చెప్పినా, చివరికి కొన్ని కవితలు ఆయనకి పంపేను.
ఆయన దానికి సమాధానంగా “ఔను. పాతవేగాని, ప్రెష్గానే వున్నాయి, ముఖ్యంగా డిక్షన్ ఎండ్ థాట్ అనుకుంటున్నాను. అన్నీ కలిపి ఓ సంపుటి వెయ్యొచ్చు” అన్నారు.
ఓసారి మాటల్లో “నీ ఉత్తరం అందింది” అని చాసోగారి మిత్రుల ఉత్తరాలు చాగంటి తులసిగారు వేసేరని నేనంటే, వెంటనే ఆవిణ్ణి కాంటాక్ట్ చేసి ఆ పుస్తకం తెప్పించుకున్నారు.
ఒకసారి ఆయన ఓ ‘కథక్’ నంబరు కావాలన్నారు. నవీన్ (అంపశయ్య) గారు మాట్లాడమన్నారట. అంత సిన్సియర్‌గా స్నేహితులు చెప్పిన పనులు చేస్తారాయన.
ఓ ఇంటర్వూలో మీకు లభించిన పురస్కారాల వివరాలు చెప్పండి అనే ప్రశ్నకి సమాధానంగా, “ఆ విషయంలో నేను చాలా వెనుకబడి వున్నానేమో అనిపిస్తుంటుంది. అయినా వచ్చిన పురస్కారాలతో తృప్తిగానే వున్నాను” అన్నారు. ఆయనకున్న పరిచయాలూ, కీర్తి ప్రతిష్ఠల దృష్ట్యా అది నిజమేనేమో కాని పలు పురస్కారాలైతే వచ్చాయి. ముఖ్యంగా ‘షాయర్’ అనే ఉర్దూ సాహిత్య పత్రిక ఆయన గురించీ, ఆయన కవిత్వం గురించీ ప్రత్యేక సంచికనీ, పత్రిక ముఖచిత్రంగా ఆయన ఫోటోతో తీసుకురావడాన్ని అత్యంత అరుదైన గుర్తింపుగా, గౌరవంగా నేను భావిస్తాను. ప్రభుత్వ పరమైన గుర్తింపులూ, గౌరవాలూ, అవార్డులూ, రివార్డులూ త్వరలోనే వస్తాయని ఆశిస్తాను.
వాళ్ళ గురువుగారు కాళోజీ గారి గురించి, “కాళోజీ విశ్వ మానవుడు. ఆయనకు భౌగోళిక సీమలు హద్దులు కావు. కాకుంటే తను పుట్టిన గడ్డకు అన్యాయం జరుగుతున్నది కనుక ‘విశాలాంధ్ర’ ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళలో ఒకడైన కాళోజి తరువాత తెలంగాణావాది అయినాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తెలంగాణా ఉద్యమంలో కాళోజీ పాత్ర అద్వితీయమైనది. అపూర్వమైనదీ, రాజకీయాలకు అతీతమైనదీనూ” అన్నారు.
కాళోజీ గారి గురించి ఆయనన్నది చాలా మట్టుకు ఆయనకి కూడా వర్తిస్తాయనిపిస్తుంది.
హింస గురించీ, దాని పునాది స్వార్థం గురించీ, హింసని ప్రోత్సహించే కులాలూ, మతాలూ, దేశాలు, ఇంకా నానారకాల సరిహద్దుల గురించీ విద్యార్థి గారి అభిప్రాయాలూ, ఆలోచనలూ ఆలోచింపజేసేవే. అందువలన ఆయన ఒక ప్రాంతపు, ఒక దేశపు కవిగాదు. ఆయన నిత్య విద్యార్థి, విశ్వ విద్యార్థి, విశ్వకవి.

