[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘విశ్వంభర’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]
మబ్బుపూవులవెల్లి నీ నివాసము!
ఉరగమే శయనము!
ఉన్నతపథము వికుంఠము!
ఉన్నతోన్నత ముక్తిసాధనము!
నీ పావన నామస్మరణము!
ఓంకారమందు ద్యుమణియందు
నీవె స్వామి!
నీమది లోన సిరి దేవి కొలువు తీరుండు
అకార ఉకార మకార త్రయస్వరూప!
బ్రహ్మాండ మంతయు నీవే! విశ్వంభరేశ్వర!
విశ్వస్వరూప! సర్వాంతర్యామీ!
పదునారుకళల ముఖకమలదీప్తి!
ఆ నీలి గగనమే ఇంద్రనీలమణి!
మకరకుండలములు శైలరాజములు!
ఇలలోనిహరితమే మరకతమణి సరము!
మందారవిరిబాల అరుణకెంపుమాల!
కెంజాయ వన్నెతో మెరిసేటి తిరు లతిక
కరుణ, దయ, కృపాతేజోవికాసమున,
తులసీదళాల మాలిక ధరియించి,
సూర్యతేజముతో దినరాజబింబకళ!
చంద్రచంద్రికల రేరాజుకళలు!
దుష్టశిక్షణమున,శౌర్యకళలు!
శోభాయమానమగు దివ్యకళలతో
దేవాది దేవా! కరుణించు తండ్రీ!
మా యందు కృప చూపి ధన్యులను
చేయుమో వైకుంఠ నివాసా!
నీ పావన పాదములకు జోతలివె స్వామీ!
~
మబ్బుపూవులవెల్లి = సాగరము
ద్యుమణి = ఆదిత్యుడు
