[28 సెప్టెంబర్ 2025న ప్రముఖ కవి శ్రీ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ‘విశ్వనరుడు జాషువా’ అనే రచనని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
ఆధునికాంధ్ర కవులలో విలక్షణమైన కవి జాషువా. ఆధునిక భావాలను ప్రాచీన ఛందస్సులో రచించిన కవి. గుర్రం జాషువా 1895వ సంవత్సరం సెప్టెంబరు 28 వతేదిన గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు వినుకొండకు సమీపంలోగల గ్రామంలో చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించాడు.
జాషువా నాకు ఇద్దరు గురువులన్నాడు. ఒకటి పేదరికం. రెండు కులతత్వం. పేదరికం సహనాన్ని నేర్పితే, కులతత్వం ఎదిరించే తత్వాన్ని నేర్పింది అన్నాడు. బాల్యము, విద్యాభ్యాసం వినుకొండ గ్రామంలో సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన జాషువాకు కష్టాలు ఎదురయినాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. పాఠశాలలో అందరితో కలిసి కాక దూరంగా విడిగా కూర్చో పెట్టేవారు. చిన్నతనంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే ఆయనకు ఎదిరించే తత్వాన్ని నేర్పాయి. బంతిని ఎంతగట్టిగా నేలకు కొడితే అంతకన్నా వేగంగా పైకి లేస్తుంది అన్నట్లు అవమానాలనే మెట్లుగా చేసుకుని అత్యున్నతస్థాయికి ఎదిగి మహాకవి అనిపించుకున్నాడు జాషువా.
“కులమతాలు గీచుకొన్న గీతలజొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను”
అని ఆత్మవిశ్వాసంతో ఎలుగెత్తి చాటిన మహాకవి, మధురకవి గుర్రం జాషువా.
అగ్రవర్ణాలవారు కులం పేరుతో హేళనచేస్తే ఎదురు తిరిగి తరిమి తరిమి కొట్టేవాడు. అవమానాలకు ఊరుకోక తిరగబడేవాడు. రోడ్డు మీద నడిచిపోతున్నప్పుడు అగ్రవర్ణాలవారు దూరముగా జరుగు, మమ్మల్ని ముట్టుకోవద్దని అని అవమానించగా కోపమున అంటరాదు అన్న మాటకు మనస్సు కలత చెంది, అక్కడ నుంచి పరుగు తీసేవాడు. ఆ విషయమును తన తల్లికి చెప్పుకుని ఏడ్చానని నాకథలో చెప్పుకున్నాడు. అగ్రవర్ణాలవారితో మనకు వైరము కూడదని బుజ్జగించి హితవులు చెప్పింది కన్నతల్లి. లోకంలోని అసమానతలను, ఎవరితో ఎలా మెలగవలసిన విషయములను బాల్యదశనుండ తల్లి తనకు చెప్పిందని తన కావ్యములలో వివరించి చెప్పుకొన్నాడు. కొంటె చేష్టలతో అల్లరి చేస్తూనే తల్లి హితబోధలతో లోకజ్ఞానమును నేర్చుకొన్నాడు. అలా చిన్నతనంలో పొందిన అవమానాలతో అతనిలో తిరగబడే మనస్తత్వం అలవడింది. ఆధునిక సాహిత్య చరిత్రలో సాహిత్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చిన ప్రజాకవి. వేమనవలె సమాజాన్ని చదివిన కవి. పద్యకవిత్వానికి పెద్దపీట వేశాడు. తక్కువ కులంలో జన్మించిన వాడని నిందించినచోటే ప్రముఖస్థానాన్ని పొందాడు. తాను కవిగా నిలబడటానికి ఎన్ని అవమానాలను నైరాశ్యాలను ఎదుర్కోవలసి వచ్చిందో తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. ఆయన భాష ప్రజలభాష.
జాషువా రాసిన ఏడు ఖండకావ్యాలలో 200 ఖండికలున్నాయి. ముంతాజ్ మహల్, స్వప్నకథ, కాందిశీకులు, గబ్బిలం, సాలీడు, గిజిగాడు వంటి సామాన్య వస్తువులను తీసుకొని కావ్య రచన చేశాడు. జాషువా పద్యాలు చదువు రాని వారి నోట కూడా ఒదిగిపోయినాయి. నేటికీ జాషువా రచనలలో శిశువు, స్మశానవాటిక, పిరదౌసి, గబ్బిలం వంటి కావ్యాల్లోని పద్యాలు పల్లెలలో ప్రతివారి నోట మనకు వినిపిస్తూ ఉంటాయి.
“యిచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన గరగిపోయె!
యిచ్చోటనే భూములేలు రాజన్యుని
యధికార ముద్రికలంతరించె!
యిచ్చోట నే లేత యిల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో గలిసిపోయె!
యిచ్చోట నెట్టి పేరెన్నికన్ గనుగొన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె గదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
అవని బాలించు భస్మసింహాసనంబు.”
మనిషి జీవించిఉండగా వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలు రెండు. ఒకటి హాస్పటలు. రెండు స్మశానము. అలాంటి స్మశానాన్ని వస్తువుగా ఎంచుకొని రచనచేశాడు జాషువా. మనిషి చివరి గమ్యం స్మశానవాటిక. ఆ పేరుతో ఖండకావ్యాన్ని రచించిన గొప్పకవి జాషువా. ఆయన రచనలు ఎప్పుడు ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. అందుకే ఆయన ప్రజాకవి.
“రాజు మరణించె ఒకతార రాలిపోయే
కవియు మరణించె నొక తార గగనమెక్కె
రాజు నివసించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు”
అంటూ కవి శాశ్వతుడు అన్న సత్యాన్ని తెలియజేస్తాడు. తానెన్ని కష్టాలు అనుభవించినా ఒక స్థిరమైన అభిప్రాయం కలవాడు.
“చిన్న నిలయమొక్కటి దక్క
గడనసేయుట కాసపడను నేను
ఆలుబిడ్డలకునై ఆస్తిపాస్తులు గూర్ప
పెడత్రోవ పాదమిడను నేను.”
అని దృఢమైన తన అభిప్రాయాన్ని చెప్పాడు. శిశువులో తల్లిఒడిని చేరిన పసివాడై తాను ఒక యోగి అయినాడు.
“బ్రొటనవేల ముల్లోకములు జూచి లోలోన నానందపడు నోరులేని యోగి
తల్లిదండ్రుల తను వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప చను వెర్రి బాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారెడి చైతన్య ఫలము.”
అంటూ శిశువులో భగవత్తత్వాన్ని నిరూపించాడు.
పేదరికం చూసి బాధపడుతూ తాను అనుభవించిన పేదరికం గుర్తు చేసుకుంటూ పేదలదుఃఖాన్ని పోగొట్టే వారెవరూ లేరని
“ప్రతిమల బెండ్లి సేయుటకు వందలవేలు వ్యయించుగాని దుః
ఖిత మతులైన పేదల ఫకీర్ల శూన్యములైన పాత్రలన్
మెతుకు విడల్పదీ భరతమేదిని ముప్పది మూడుకోట్ల దే
వతలెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే”
యని విగ్రహపూజను ఖండించాడు. పేదల ఆకలిని తీర్చలేని పూజలేందుకన్నది ఆయన ఆలోచన. మానవసేవే మాధవవసేవయని చెప్పకనే చెప్పారు జాషువాకవి.
ఇవేకాక బాపూజీ, నేతాజీ చరిత్ర, ముసాఫిర్లు వంటి ఖండకావ్యాలు కాక రుక్మిణి కళ్యాణం, హిమదమార్క పరిణయం, కుశలవోపాఖ్యానం వంటి మొదలగు హిందూ కావ్యాలను కూడా రచించారు. హిందూకావ్యాలను రచిస్తున్నాడని పెద్దలు వెలివేయటం జరిగింది.
ఒకసారి వెంకటగిరి సంస్థానం రాజా వారి ఆహ్వానం మేరకు ప్రయాణమై వెళుతుండగా తోటి కవి కోరిక మేరకు తన కవితా గానం వినిపించగా అద్భుతంగా ఉన్నదని ప్రశంసించాడు. తరువాత మీదే కులమని ప్రశ్నించగా కులం చెప్పగానే అక్కడ నుంచి చివాలున లేచి వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు జాషువా
“నా కవిత వధూటివదనంబు నెగాదిగాచూచి రూపురే
ఖా కమనీయవైఖరులుగాంచి భళీభళీయన్నవారే మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర వచింప సిగ్గగున్.”
అని తన మనోవేదనను రాజావారికి విన్నవించుకున్నాడు జాషువా. సంఘంపెట్టిన కట్టుబాట్లను అధిగమించడానికి స్వయం ప్రతిభతో, చైతన్య స్ఫూర్తితో నిలదొక్కుకొని తనకు తాను కవిగా నిరూపించుకున్నాడు జాషువా.
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే న
నెవ్విధి దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే!”
అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు జాషువా.
దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలిసి అవధానాలు చేశారు. ఆ కాలంలో ఒక కవి అవధానాలు చేయటం గొప్ప విషయము. పిచ్చయ్య శాస్త్రి, జాషువా ఇరువురు కలిసి అవధానాలు చేసేవారు. కానీ వీరి ఇరువురి పేర్లు కూడా తిరుపతి వేంకట కవుల వలె జంట కవులుగా ప్రసిద్ధి పొందలేదు. వీరు ఇరువురి పేర్లలో ఏ పేరు ముందు వెనకలుగా వచ్చిన దాని అర్థమే మారిపోతున్నదని జాషువా ఈ విధంగా చెప్పెను
“నా పేరు ముందు నిల్పం
బాపం బదియేమో జాషువా పిచ్చులగు
నా పేరు చివర నిల్పిన
శాపం బిడినట్లు పిచ్చి జాష్వాలయ్యెను.”
అని తమ జంట ఎలా ఉంటుందనే విషయాన్ని చలోక్తిగా చెప్పాడు జాషువా. అలానే ఒకసారి విశ్వనాథ సత్యనారాయణగారిని, జాషువాను ప్రభుత్వం ఒకే సత్కరించటం జరిగింది. అప్పుడు విశ్వనాథవారు గుర్రాన్ని గాడిదని ఒకేగాట కట్టేశారని చమత్కరించారు. దానికి ఔను నిజమే నేను గుర్రాన్నేకదా అని చమత్కరించారు. ఆశపడటం, ఆరాటపడటం జాషువాకు మొదటినుంచి తెలుసు. జాషువా జీవితం ఒక కల్లోల సాగరం. ఉపాధ్యాయుడుగా, మూకీ సినిమా వ్యాఖ్యాతగా, యుద్ధ ప్రచారకుడిగా, ఆకాశవాణి కార్యక్రమం నిర్వాహకుడిగా పనిచేశాడు. గుంటూరు లూథరన్ కళాశాలలో 10 సంవత్సరములు ఉపాధ్యాయుడిగా పని చేయటం జరిగింది. కొంతకాలం శాసనమండలి సభ్యునిగా కూడా ఉన్నారు.
1970లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించి గౌరవించింది.
జాషువా ప్రజా కవి. భాషా ఛందస్సులలో భావకవిత్వాన్ని రచించిన అభ్యుదయకవి జాషువా.
విశ్వనాథ సత్యనారాయణ గారు జాషువా గురించి చెబుతూ శ్రీ జాషువా మధురకవి అనేవారు. ఒకానొక మాధుర్యం ఆయన కవిత్వంలో ఆ సరస్వతీదేవి అనుగ్రహంచేత లభించిందని విశ్వనాథవారు పేర్కొన్నారు. అదీ జాషువా గొప్పతనం.
“సుకవి జీవించు ప్రజల నాలుకల యందు” అని సత్యాన్ని గళమెత్తి చాటిన కవి వతంసుడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమిని దరిచేరనీయకుండా ముందు కడుగేసిన ధీశాలి.
కవులు విశ్వమానవ గోత్రేయలు అన్నాడు. మానవీయ సందేశం ఇచ్చిన మాన్యుడు. సమ సమాజ ఉద్యమ కేతనం, హేతువాదం, మానవతావాదం పరిమళించిన మనీషి. గుంటూరులో ఏకా ఆంజనేయులుగారు ఆయనకు స్థిర నివాసాన్ని ఏర్పరిచారు. 1947లో బెజవాడలో గజారోహణం చేయించి, కనకాభిషేకం చేసి సన్మానించారు. ఆ సభలో కడువృద్ధులు జంట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఆయన పాదములకు గండపెండేరమును తొడిగి సత్కరించారు. ఆ సందర్భమున
“తొడిగెన్ గాలికి చెళ్ళపిళ్ళ కవి ముద్దం గండ పెండారమున్
ముడిచెన్ గొప్పు నాకళాయశ! పుష్పంబున్ గుఛ్ఛంబుగా
నడిచెన్ గుర్రపు దండునా వెనుకనాంధ్రం బెల్ల పొంగారగా
జడ జన్మంబున నేమనో కవుల పూజలు సల్పి మెప్పించెనో”
ఎక్కడ అవమానాలు పొందారో అక్కడే సన్మానాలు పొందిన మహాకవి జాషువా.
“వడగాల్పు – నా జీవితమైతే
వెన్నెల – నా కవిత్వం
ఇది అక్షర సత్యం”
అన్న సత్యాన్ని గళమెత్తి చాటిన కవి.
“నా కవిత్వంబునందు రత్నములు గలవు
వాని బెకలించి చూపెడు వాడు లేడు”
అని జాషువా స్వాతిశయముతో తనకవిత్వాన్ని గురించి చెప్పుకొన్నాడు. జాషువా కవితాకంఠం విలక్షణమైనది. ప్రజల సుఖసంతోషాలకోసం, ఎవరూ అవమానాలు పొందకూడదని జాషువా కవితాహృదయం అహరహం ఆక్రోశించేది.
ప్రజల కోసమే కవిత్వమంటూ ‘విశ్వనరుడను’ నేనన్నాడు జాషువా.
