Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సాహిత్య తత్త్వ దర్శనం – సుప్రసన్న విమర్శనం

[ఈనెల 26న వరంగల్‍లో ఆవిష్కృతమవుతున్న ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ కోసం డా. గండ్ర లక్ష్మణ రావు రచించిన ప్రత్యేక వ్యాసం ఇది. 23 మార్చ్ 2026 నుంచీ 26 మార్చ్ 2026 వరకూ ప్రతిరోజూ ఈ పుస్తకం నుంచి ఒక వ్యాసం సంచిక ప్రచురిస్తున్నది.]

ఆకాశంబు హిరణ్యగర్భ రుచిరంబై పృథ్వి సౌగంధిక
శ్రీకల్పాగమునై రసోన్మదన గీర్నృత్య ప్రియంభావుక
బై కన్పట్టిన రోదసీ కుహరమందానంద వల్ల్యగ్రబిం
ద్వాకారంబున ధ్యానలక్ష్యమయినావా, సుప్రసన్నాకృతీ! (శ్రీనిరుక్తి – సుప్రసన్న)

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులుగారితో తొలిపరిచయం 1968 ప్రాంతం. అప్పుడు నేను జగిత్యాల డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. మాకు ప్రత్యక్షగురువుగారు కోవెల సంపత్కుమారాచార్యులు. వరంగల్లుకు వెళ్తున్నానని చెప్పినప్పుడు సంపత్కుమారాచార్యులుగారు పల్లా రామకోటార్య గారికి ఒక ఉత్తరం ఇవ్వుమని నాకిచ్చి అడ్రసు చెప్పారు. వరంగల్లు చౌరస్తాకు వెళ్తున్న రోడ్డుపై సినిమా టాకీసు ఎదురుగా విజయ ప్రెస్‌లో ఉంటారని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. ఆ ప్రెస్‌లో పల్లా రామకోటార్య గారెవరని అడిగాను. ఆయనే ముందుకు వచ్చి నేనే అన్నారు. అప్పుడు సంపత్కుమార ఉత్తరం ఇచ్చాను. ఆ ప్రెస్‌కు బయట చెట్టుకింద రెండువైపులా రెండు బెంచీలు. వాటి మీద పండిత మిత్రులు కూర్చున్నారు. వారికి నన్ను ‘ఈ పిల్లవాడు జగిత్యాల నుండి సంపత్తు పంపితే వచ్చాడ’ని పరిచయం చేశారు. ఆ పండితులు ఒకరు కోవెల సుప్రసన్నగారు, మరొకరు శ్రీభాష్యం విజయసారథి గారు. అప్పుడు పల్లా రామకోటార్యగారు తన ప్రెస్ నుండి ‘వినగదప్ప వెర్రివెంగళప్ప’ అనే శతకాన్ని నాకిచ్చారు. అప్పుడే సుప్రసన్నగారు తేజశ్చక్రము, శ్రీభాష్యం వారు ప్రహేళికలు ఇచ్చారు. ఈ ముగ్గురి పరిచయం అప్పుడే అయింది. అది ఇప్పటికీ నా కనులముందు కదలాడుతున్న దృశ్యం.

సుప్రసన్నగారి తేజశ్చక్రము చదివాను. అర్థం కాకపోయినా పద్యాలు చదివించాయి. అప్పటినుంచి అనేకమార్లు కరీంనగర్ అవధానం చేసినప్పుడు, గౌతమరావుగారింటిలో రామాయణ కల్పవృక్షం చదువుతున్నప్పుడు, సాహిత్య సభల సందర్భంగా, వరంగల్లులో నేను పరిశోధన చేస్తున్నప్పుడు, హైదరాబాదులో

డా. వెల్చాల కొండలరావుగారి విశ్వనాథ సాహిత్యపీఠంలోను, అనేక సభలలో వారిని కలుసుకోవడంతో అత్యంత సాన్నిహిత్యమూ కలిగింది. ప్రత్యక్షగురువులు కాకపోయినా అంతకన్నా గౌరవ ప్రదంగా చూశాను. చూస్తున్నాను. వారు ఎన్నో సందర్భాలలో నన్ను ప్రోత్సహించారు. నా సాహితీ వనమాలి వ్యాససంకలనానికి ముందుమాట రాసి ఆశీర్వదించారు. ఇటీవల రామాయణ కల్పవక్షానికి వ్యాఖ్యానం చెపుతున్నప్పుడు విని, కరీంనగర్‌లో గౌతమరావు గారి పేరు నిలబెడుతూ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విశ్వనాథను తెలంగాణలో ఎప్పటివలె గౌరవిస్తున్నామని సంతోషంతో దీవించారు.

వారిప్పుడు స్వయంగా దృష్టికారణంగా చదువలేకపోయినా నా రామాయణ కల్పవృక్షం లోకానుశీలనం పుస్తకాన్ని చదివించుకొని నాతో మాట్లాడి అభినందించి ఆశీర్వదించారు.

నా పరిశోధనలోను, సాహిత్య అధ్యయనంలోను సుప్రసన్నగారు, వారి సాహిత్యం ఒక భాగమయిపోయింది. వారి తేజశ్చక్రమునుండి, పరిక్రమం దాకా అనేక కావ్యాలు, విమర్శనా గ్రంథాలు చదివి మునకలు వేయడం వాటిలోని గాంభీర్యాన్ని కొంతకొంత గమనించడం జరిగింది. జరుగుతున్నది.

అంతర్ముఖా సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా” అన్నది లలితాదేవినే అయినా సుప్రసన్నగారు కూడా ఎప్పుడూ అంతర్ముఖులుగానే కన్పడుతుంటారు. ఆయన రచనల్లో ప్రసంగాలలో కొత్త చెలిమలు పుట్టుకొస్తాయి. కొత్త భావాలు, విమర్శనలు పర్వతంపై నుండి పరుగెత్తే జలధారల్లా వివిధ భంగిమల్లో కనిపిస్తాయి. అది వారి నిత్య ఆంతర చైతన్య స్వరూపం.

విశ్వనాథ వారితోను, వారి సాహిత్యంతోను నిత్యసంబంధం. దానికి కారణం భావైక్యత. జాతీయత, తాత్వికత, సరస్వతీ ప్రోతస్విని సమైక్యమై జీవితాలను శ్రీమంతంబు చేసుకున్న వారు. అట్లాంటి సుప్రసన్నగారి తొంబదవ జన్మదిన సందర్భంగా వేవేల నమస్సులర్పిస్తూ వారు పంచిన విశ్వనాథ సాహిత్యవిమర్శనాదృష్టిని కొంత పర్యాలోకనం చేసే ప్రయత్నం చేస్తున్నాను.

2

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఇరవయ్యవ శతాబ్దంలోని భారతీయ వాఙ్మయంలోని ఉదాత్త సంస్కృత శిఖరాలలో ఒకరు ( సుప్రసన్న – కావ్యప్రమితి పు. 64)

విశ్వనాథ సత్యనారాయణ ఒక తెలుగు కవి కాదు. భారతీయ కవి. కవి మాత్రమే కాదు సంస్కృతి ప్రతిరూపం. ఈ సంస్కృతి అనే మాట వెనుక జాతి, చరిత్ర జీవనగమనంలో పండిన ఆలోచనల, భావనల, అన్వేషణల, సాధనల పరిణామమైన ఒక విశిష్ట సమాజ దేశ ఆకృతి. ఈ యీ విచారణా సర్వస్వం ఆచార్య సుప్రసన్నగారి హృదయపాకం. ఈ పాకంలో రసమయమైన విశ్వనాథ సాహిత్యాన్ని మరింత రుచిమంతం చేసి చూపించిన అపార ప్రజ్ఞ ధురీణులు సుప్రసన్నగారు.

విశ్వనాథ సత్యనారాయణ గారిని వారి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ఆయనకు మిత్రులకన్నా శత్రువులెక్కువయినారు. (సాహిత్యం విషయంలో). విచిత్రమేమిటంటే ఎంత శత్రుత్వం పెరిగిందో అంత అభిమాన పాఠకులు కూడా పెరిగి ఇప్పటికీ ఆయన నిత్యస్మరణీయుడుగా, చర్వనీయుడుగా, చర్చనీయుడుగా మిగిలిపోయాడు. ఆ పరిణామమంతా విశ్వనాథను తెలిసిన చిన్నవయసునుండి చివరిదాకా గమనించి గ్రహించి విశ్లేషించగల వారు సుప్రసన్నగారు. అత్యంత సన్నిహితులుగా వర్ధిల్లిన జువ్వాడి గౌతమరావుగారు ఆ రసప్రపంచంలో మునిగి ముంచివేసే వారే తప్ప వివేచించి ప్రకటించే ప్రయత్నం కొంతవరకే చేశారు. సంపత్కుమారగారు వివేచించినా ప్రధానంగా శిల్పరామణీయకత, భాషాఛందోవైవిధ్యాలమీద విమర్శనా శాస్త్ర పరిధులలోని చింతనకు ప్రాధాన్యత నిచ్చారు.

విశ్వనాథ సమగ్ర భావనా సామ్రాజ్యాన్ని ఆమూలాగ్రంగా ఆవరించి ఉన్న జాతి శక్తి స్వరూపాన్ని, సమకాలీనమైన సాంస్కృతిక విప్లవ స్వరూపాన్ని సమగ్రంగా దర్శించి సమన్వయించి వివేచను చేయగలిగింది ఒక్క కోవెల సుప్రసన్నగారు మాత్రమేనని చెప్పడం అతిశయం కాదు, అవాస్తవం కాదు. సత్యప్రమాణం.

విశ్వనాథ ఎన్ని వేల పుటలు రచనలు చేశారో అన్ని వేల పుటలపై విమర్శ సుప్రసన్నగారు చేశారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలుకొని ఆధునిక సాహిత్య ప్రపంచమంతా ఆయన కరతలామలకమయింది. ఆధునిక భారతీయ తాత్వికులైన అరవిందులు, జిడ్డుకృష్ణమూర్తి, రమణమహర్షి, స్వామి వివేకానందులునుండి కందుకూరి శివానందమూర్తి వరకు గల వారి జ్ఞాన సర్వస్వం వారి హృదయావరణంలో నిలిచిపోయింది. భారతీయ మహర్షుల తపఃఫల రూపమైన జ్ఞానమంతా సుప్రసన్నగారి మనోజగత్తులో నిండిపోయింది. ఈ జ్ఞానసంపదనంతా కోశాగారంలో రాశి పోసినట్లుగా ఉండడం కాదు, ఒక సముద్ర మథనంగా నిరంతర అంతర్మథనం జరిగి అమృతప్రాయమైన సారాంశం అందుకొని అనుభవించారు. ఆ అమృత వాఙ్మయ ప్రమాణంతో విశ్వనాథ సాహిత్య వివేచన, విమర్శనం కొనసాగించారు. అందుకే విశ్వనాథ తెలుగు కవి కాదు, భారతీయ కవి అనగలిగారు. అంతేకాదు, అందుకు అనేక సాక్ష్యాలు సోదాహరణలు, ప్రమాణాలు పట్టి చూపించారు. ఎత్తి నిలబెట్టారు. తెలుగులోను సంస్కృతంలోను ఇంగ్లీషులోని అపార పాండిత్యంతో పాటు అటు సృజనకూడా చేసిన విశ్వనాథ ప్రధానంగా తెలుగు కవి, రచయిత, విమర్శకులు.

పద్యం, పాట, కథ, నవల, వ్యాసం, విమర్శ, నాటకం, రూపకం, అవతారికలు, వ్యాఖ్యానాలు, ప్రసంగాలు అన్నింటా తనదైన మార్గం, తనదైన ప్రతిభ, తనదైన అధికారికత, చూపించిన వారు విశ్వనాథ. ఆయన ఒక సాహిత్య సమ్రాట్టు. ఆయనదొక విశాలమైన సాహిత్య సామ్రాజ్యం. దానికి రాజధాని రసం. అందుకే విశ్వనాథ గురించి సుప్రసన్నగారు విమర్శనా సంపుటానికి రసరాజధాని అని పేరుపెట్టగలిగారు.

విశ్వనాథ బతికి ఉన్నంత కాలం ఆయనతోను, ఆయన అనుచరులతోను అత్యంత సన్నిహితంగా మెదిలిన సుప్రసన్నగారు ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా చెల్లాచెదురుగా పడిపోయిన వారి రచనా సర్వస్వాలను సేకరించి అసంకలిత సాహిత్యంగా వివిధ ప్రక్రియలుగా వింగడించి రూపొందించి అందించారు. అందుకే విశ్వనాథను ఆసాంతం సమగ్రదర్శనం చేసిన సాధికారికత వారికి మాత్రమే సాధ్యమయింది.

విశ్వనాథ ఆంధ్రప్రశస్తి మొదలు కల్పవృక్షం దాకా కవిత్వం, మాబాబు, ఏకవీర నుండి సాంఘిక నవలలు, పురాణ వైర గ్రంథమాల, కాశ్మీర రాజుల, నేపాళ రాజుల కథల ఆధారంగా అల్లిన చారిత్రక నవలలు, నర్తనశాల నుండి అనేక నాటకాలు, నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి నుండి కావ్యానందం వరకు విమర్శనా సాహిత్యం, వేయేండ్ల తెలుగు సాహిత్యం రూపకాలు ఇంకా ఎన్నో రచనల గురించి కొన్ని వేల పుటల విమర్శనా వ్యాసాలను వెలయించారు సుప్రసన్నగారు. వాటి గాఢతను కొలిచే ప్రమాణం లేదు. కొన్ని గుర్తులుగా మాత్రమే చెప్పగలను.

3

విశ్వనాథ సత్యనారాయణను కవిగా పరిచయం చేస్తూ “కవి మాతృగర్భంలో ఉన్నప్పుడే ఈ జగత్తంతా అతనిలో ఇమిడి ఉంటుంది. లేకపోతే ఇదంతా యిదంతా – అతనిలో ఎలా వ్యక్తమవుతున్నది” అని ఆయన పుట్టకముందునుంచే కవి అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. పైకి ఇది ఒక ప్రశంస వలె కనిపించవచ్చు కాని ఇది నిజం. అందుకు విశ్వనాథ రాసిన ప్రేమగీతాలు పద్యాలలోని కొన్ని పద్యాలు ఉటంకించి చూపారు.

అస్మదీయ హృదఙ్ఞ నాళాంతరమున
బీజరూపమ్ముగా నుండి విశ్వమంత
ఇది బహిర్గతమ్మగు దాక యెఱుగ లేక
అంత అవ్యక్త శిశుమూర్తి నైతినెట్లు – ( ప్రేమగీతాలు-68)

ఇంతకుముందు మరో రెండు పద్యాలు కూడా ఉన్నాయి. నిజానికి విశ్వనాథ రాసిన ప్రేమగీతాలు భావకవితా కాల ప్రభావంతో పుట్టినాయని, అవి ప్రణయగీతాలని, వాటిలోని ప్రేయసీ ప్రియుల భావన, లేదా ప్రేమ భావన గురించి ఎవరైనా ఆలోచిస్తారు. కాని సుప్రసన్నగారు మరింత లోతుల్లోకి వెళ్ళి పరిశీలించారు. అందువల్లనే కనిపించే ఈ ప్రకృతిని ప్రపంచాన్ని గురించి మాత్రమే కాదు ‘యిదం – తా’ అని వేదప్రమాణాన్ని అవే పొడి మాటల్లో విరిచి చూపించారు. ఇది అనితరసాధ్యమైన విమర్శనా దృష్టి.

విశ్వనాథ సాహిత్యాన్ని ఆయా కాలాల సాహిత్య ప్రభావాలుగా, ఆయా చారిత్రక సన్నివేశాలుగా, అనుభవాల సారాంశాలుగా, శిల్పనిర్మాణ ప్రతిభా విశేషాలుగా, మరికొంత తాత్వికంగా పరిశోధనలు చేసినవారు, పరిశీలన చేసినవారు, పరిచయాలు చేసినవారున్నారు. కాని ఆయన ఆంతర్యంలోని మూలాలను చూపించింది. సుప్రసన్న గారి విమర్శనా దివిటీ మాత్రమే.

అలవోకగా చెప్పినవని, అభ్యాసవశంగా చెప్పినవని, అప్రసిద్ధములని ఏ రచనను చులకనగా చూడలేదు సుప్రసన్న. ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి పద్యం, ప్రతి వాక్యం ఏదో మహార్థాన్ని వహిస్తున్నదనే దృష్టితో చూశారు. భ్రష్టయోగి, గిరికుమారుని ప్రేమగీతాలు, శశిదూతము, అంత ప్రసిద్ధాలు కావు. అయినా అవి విశ్వనాథ అశ్రద్ధగా రాసినవి కావని చెప్పటానికి వాటిలోనుండి ఎన్నో ఉదాహరణలు, ఉటంకింపులు చూపించి విశ్వనాథ హృదయాన్ని ఆవిష్కరించారు సుప్రసన్నగారు.

ఇతర కవుల వలె విశ్వనాథను అంచనా వేయటం కష్టం అని ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞను ప్రకటిస్తూ శృంగారవీధిలో ఆయన చెప్పిన పద్యాన్ని ఉదాహరించి చూపారు.

యదువులయందు చుట్టము, లతాంగుల యందున భర్త, ద్వారకా
స్పదులగు వారికిన్ ప్రభువు, భక్తులపాలిటి కామధేనువా
యదుకుల మౌళి యేదియగు నన్నియునౌమరియేదికాడు, ఎ
య్యదియును కాడుతత్ప్రభుదృగంతపు వెన్నెల సర్వమై చనన్.

“విశ్వనాథ సాహిత్య రంగంలో ఏది కాడు, అన్నీ ఔతాడు. అయినా నిర్వచనాల పరిమితులలో ఏదీ కాడు. అన్నిటికీ అతీతంగా ‘అత్యతిష్ఠద్దశాంగుళమ్’ అన్నట్లుగా ఉంటాడు” ఇది సుప్రసన్నగారి విశ్లేషణ.

విశ్వనాథలో నిద్రాణంగా అనేక శక్తులు అక్షరరూపంలో వెలికి వచ్చినాయి. ఆయన ఒక యోగి. వ్యక్తి చైతన్యాన్ని అవ్యక్త దశనుంచి సర్వచైతన్య పరిణామంగా భావించి అనుభవించగల ద్రష్ట. ఆ అనుభవాలను అనితర సాధ్యంగా మనముందు పెట్టగల స్రష్ట. ఈ లక్షణాలను సుప్రసన్నగారు వివేచిస్తూ ఇటు కిన్నెరసాని పాటలనూ, అటు అంధభిక్షువు పద్యాలను, రామాయణంలోని కబంధాది పాత్రల స్వభావాలను, ఒకచోటికి తెచ్చి ముడివేసి చూపించారు. అటు దైవికమైన భావన, ఇటు దైహికమైన చింతన, ప్రకృతి పరమాత్మల విచిత్రమైన చలన స్వరూపాన్ని విశ్వనాథ కవిత్వంలో ఎట్లా ఒదిగించారో తెలుసుకోవాలంటే విశ్వనాథ సాహిత్యాన్నంతా ఆయన మౌలికమైన సిద్ధాంతాల వెంబడి బడి శోధించాలి. అప్పుడే అర్థమవుతాడు విశ్వనాథ అని సుప్రసన్నగారి సమీకరణ. అందుకే ఏ చిన్న కావ్యంలోనో చెప్పిన అంశాలను, మహాకావ్యంలో ఉన్న చిన్న పాత్ర దగ్గర చెప్పిన అంశాలను కలిపే ఏకసూత్రత విశ్వనాథలో ఉన్న అంతశ్చేతన. అది చూడకపోతే విశ్వనాథ ఎందుకు రాశారో తెలియదు. ఫలితంగా చాలామంది పాండిత్య ప్రదర్శనమనుకునే ప్రమాదముంది. కాని ఆయన పాండిత్యమెంతటిదో ఆయన ఆవేదన అంతకంటె వేయిరెట్లు గొప్పదనే అంశాన్ని ఎక్కడెక్కడ చూపించారో పట్టి చూపించిన సూక్ష్మదర్శి సుప్రసన్న.

“సుకము ఫాలమునందు వ్రాసుకొని ఎవరు పుట్టిరో వారికి వసంతము మనోజ్ఞము, హృదయ దుఃఖములు పాడటానికి ఆకాశంలో మేఘము, ఇక్కడ తానూ కవులమైనాము” అని ఆయన చెప్పిన పద్యాలుదాహరించి హృదయ దుఃఖములు పాడే పరిమితినుండి ఎదిగివచ్చి కవి శాంతిని జీవబీజంలో నుండి త్రవ్వుకొని వస్తున్నాడు. అనంతమైన వేదనననుభవిస్తున్నాడు.” అని కవి వేదనాస్థితిని అంచనా వేశారు సుప్రసన్నగారు. అందుకు సాక్ష్యంగా రామాయణ కల్పవృక్షంలో కబంధుని వేదననుదాహరించారు. వేదనపడటానికి కిన్నెర పథాంతరములు దాటి, రాళ్ళు దాటి వంటి ప్రయోగాలతో పాటు కబంధుని మనోమయ లోకం మేల్కొనడం వరకు చైతన్య యాత్ర ఒకటిగానే చూపిన విశ్వనాథ ఆంతర్యాన్ని పట్టి చూపించడం ఒక్క సుప్రసన్న వంటి గాఢ పరిశీలనా, పాండిత్యం, యోగిలక్షణం ఉన్న వారికి మాత్రమే సాధ్యం.

ఒక వర్తమాన దృశ్యాన్ని వర్ణిస్తారు విశ్వనాథ. అది ప్రకృతి కావచ్చు, ప్రపంచం కావచ్చు. మనిషి కావచ్చు. జంతువు కావచ్చు. కాని వాటన్నిటిలో ఏదో ఒక వేదన తొంగి చూస్తుంది. సామాన్య పాఠకుడికి అది అప్పటి విషయమే. లోతుగా చూసిన వారికి మాత్రమే మహార్థం స్ఫురిస్తుంది.

కోకిలమ్మ పెళ్ళిలో “ఉన్నవాళ్ళకు ఎంతనేలా దున్నుకుంటే చాలుతుందో, మించి ముట్టరు అంతకన్నా చిన్న చెక్కయినా,.” ఇది ఆదిమకాలం నాటి వర్ణన కాగా, తరువాతి పరిణామాల కారణంగా ఒక అంధభిక్షువు తన గతాన్ని చూసుకోవడానికన్నట్లుగా బావిలోనుండి పిలిచినయట్లుగా పాడుతున్నాడనీ, మరొక చోట రథచక్రాల కింద నలిగిన ప్రాణి రక్తాన్ని కడిగివేసిన తరువాత ఎవరి రక్తమనే గుర్తు ఎక్కడుందని, ఒక కుక్క నిర్దయగా చంపివేయబడిందనీ, ఎక్కడెక్కడి కావ్యాలో పద్యాలో ఉదాహరించి విశ్వనాథలోని వేదన, దయ, నిర్దయ, జీవపరిణామము, కవితాపాకము మొదలైన వాటిని ఒకచోట సంకలనం చేసి విశ్వనాథ కవిత్వాన్ని ఏకదేశంగా కాదు సమావేశంగా చదువుకోవాలనే హితవు చూపించారు సుప్రసన్నగారు.

గుణముల్ దోషములేల యెన్నికలు నీకున్ సాటియే లేదు, నీ
ధ్వని సౌందర్యము పుష్పవాటికలలో వ్యాఖ్యాన రమ్యంబ య
య్యెను సప్త స్వరముల్ భవద్గళమునందే పారి దీవ్యన్మహా
ధ్వని రాజ్యంబున నీకె పట్టంబు కట్టితిమిరా పుష్పందయా..

భ్రష్టయోగిలో తుమ్మెద గురించి రాసిన పద్యాలలోని ధ్వని సౌందర్యాన్ని కవితా ధ్వనిగా గమనిస్తే విశ్వనాథ సర్వకవితాధ్వని ఆస్వాదించవచ్చునని ఒక పరిచయం చేశారు సుప్రసన్న. విశ్వనాథ కవితావేదన మూలాల నన్వేషిస్తూ వాటిని సమన్వయిస్తూ వ్రాసిన విశ్వనాథ అన్న వ్యాసం (చందనశాఖి – విశ్వనాథ). ఇది విశ్వనాథ కవిత్వాన్ని పట్టుకోవడానికి ఒక ఊతం వంటి విమర్శనా వ్యాసం. అలవోకగా ఇక్కడి ఇది ఉన్నది, ఇక్కడ ఇది లేదు అని చెప్పడం సుప్రసన్న విమర్శనా లక్షణం కాదు. ఏది ఎక్కడ ఎందుకు చెప్పినా ఏకసూత్రత ఉన్నదా? స్వీయ వైరుధ్యాలు లేకుండా సిద్ధాంత ప్రతిపాదనలు ఉన్నాయా? అని చూపించడం లక్ష్యం. ఈ వ్యాసంలో ఇంకా శశిదూతం, పసివాడు, విశ్వేశ్వర శతకం, కృష్ణ సంగీతం, గోపికా గీతలు, అనార్కలి వంటి కావ్యాలలోని ఉదాహరణలు చూపించి సమన్వయించి చూపించారు. ఇది సుప్రసన్నగారు విమర్శ కోసం యోచించినది కాదు. విశ్వనాథ కవితాత్మను పట్టుకోవడానికి చేసిన మహాన్వేషణ. అందుకు సాధించిన, సంపాదించిన అనేక తత్వాల జ్ఞాన సంయోజన. ఆ అసమాన ప్రమాణాల మీద విశ్వనాథను చూడవలసిన సందర్భాన్ని, ఆవశ్యకతను వ్యక్తం చేయడం ద్వారా విశ్వనాథను సాహిత్య ప్రపంచంలో మరింత మహోన్నతుడుగా కనిపింపజేశారు.

ప్రకృతి తత్త్వాన్ని పృథివికి దానితో దేశానికి అనుబంధాన్ని దృఢం చేసి మాతృదేశం పట్ల గల ప్రగాఢమైన అభిమానం చేత పొందిన అనుభూతిని తన కాలంనాటి దుస్థితిని చూసి పొందిన దుఃఖాన్ని చారిత్రక కావ్యాలుగా, కథలుగా, నవలలుగా విస్తరించడానికి ప్రేరణ అయింది. ఈ ప్రతిపాదన చేస్తూ సుప్రసన్నగారు పృథ్విని తల్లిగా, ధాత్రిగా, దేవతామతల్లిగా భావించిన దశకూడా దాటి ఆ దేవతామతల్లియైన జానకీదేవి జడప్రాయమైన లంకా చైతన్యంలో దివ్య చైతన్య ప్రతిష్ట చేయటానికి దిగి వచ్చిన అంశాన్ని ప్రతిపాదించే దశకు విశ్వనాథ పెరిగి భారతీయ తాత్విక చైతన్యపు అత్యంత నవీన పార్శ్వమైన శ్రీఅరవిందుల తాత్త్విక ధారతో సమన్వయాన్ని కల్పించుకున్నాడు. ఈశ్వరుణ్ణి పృథ్విగా భావన చేయడం ఇక్కడ ఈ దర్శనానికి మరొక సూచిక. “నీవే భూమివి నేను కర్షకుడ స్వామీ నిన్ను పండించెదన్” అని వ్యాఖ్యానం. ఇందులో ఇంకా విశ్వేశ్వర శతకంలోని పద్యాలు, ఝాన్సీ రాణి, శివార్పణం కావ్యాలుదాహరించారు. ఇది విశ్వనాథ దేశభక్తి. జాతీయోద్యమ కవితాసక్తి వెనుక గల చింతన అని సుప్రసన్నగారి సహేతుక వివరణ.

వర్తమానాన్ని విడిచిపెట్టకుండా భూతభవిష్యత్తులకు ముడివేసే లక్షణం విశ్వనాథలో ఎక్కడ చూసినా కనిపిస్తుందనడానికి కొన్ని పద్యాలు ఎత్తి చూపించారు.

ఒకటి దైవాన్ని చేరుకోవడంలోపడిన వేదన, ఒకటి రాక్షసత్వాన్ని వదలడానికి పడిన వేదన, మరొకటి మాతృదేశం కోసం పడిన వేదన, వర్తమాన దృశ్యాల పట్ల వేదన, అంతా వెరసి విశ్వనాథ సాహిత్యం జీవుని వేదన. ఇదే వేయిపడగలు. రామాయణ కల్పవృక్షం అవతరణకు వేదిక అని నిరూపించిన సుప్రసన్నగారు విశ్వనాథ సాహిత్యమథనం చేసి తీసిన అమృతాంశం. ఇది ఏకదేశమైన పాఠకులకు, విమర్శకులకు సాధ్యమయ్యే పనికాదు. సార్వకాలికమైన సార్వజనీనమైన భారతీయ తాత్వికతా ప్రాతిపదికలమీద నిలిచిన సుప్రసన్న విమర్శనా మార్గం.

4

విశ్వనాథ ఇతర రచనలన్ని ఒక ఎత్తు. కల్పవృక్షం వేయిపడగలు మరొక ఎత్తు. చారిత్రక సామాజిక తాత్విక చింతనలన్నీ మూటగట్టి ఈ రెండిటిలో కుమ్మరించారు విశ్వనాథ. ఈ రెండింటిలోను కథ, శిల్పము, అంతరార్థము లేదా పరమార్థము అను మూడంశాలుగా వింగడించుకోవచ్చు. కథలో లౌకికమైన కథ, ప్రతీకాత్మకంగా, ధ్వని గర్భితంగా సాగినకథ, అని స్థాయీ భేదాలుగా మరల కనపడుతుంది. ఏ స్థాయిలో చూసే వారికి ఆ స్థాయిలోనే అగుపడుతుంది. ఒక విధంగా ఏ అంతస్తులో ఉన్న వారికి ఆ అంతస్తే సర్వంగా అనిపిస్తుంది. కాని అన్ని అంతస్తులు ఆరోహణావరోహణలు అవలీలగా చేయగలిగిన సుప్రసన్నగారికి మాత్రం అంతస్తుల సమగ్ర దర్శనమిస్తాయి.

విశ్వనాథను 1951 లో అంటే తన ముప్పదవ యేట మొదటిసారి పరిచయమైనారని వ్రాసుకున్నారు. రచనల ద్వారా ఎప్పటినుండో పరిచయమైనా ప్రత్యక్షంగా మాత్రం అప్పుడే ఆనాటినుండి ఆయనతో ఆయన సాహిత్యంతో ఆయన అనుచరులతో సాహిత్య చర్చ బహిరంతరాలలో సాగించారు. విశ్వనాథ తమ్ముడు వేంకటేశ్వర్లు స్వయంగా వీరికి పాఠాలు చెప్పిన గురువు. వేంకటేశ్వర్లు ‘పరాప్రాసాదము’ అని దేవీపరమైన కావ్యం రాశారు. దేవీ ఉపాసకులు కావచ్చు. సుప్రసన్న గారిపై వెంకటేశ్వర్లుగారి ప్రభావం కూడా తక్కువకాదు. తాను స్వయంగా పరమ సంప్రదాయ వైష్ణవ పండిత వంశంలో జన్మించినా దేవీపరమైన చింతనలోకి నిమగ్నమయనారు. ఒకవిధంగా శాక్తేయం, శక్తి సిద్ధాంతాన్ని బాగా అవలోఢనం చేశారు. శక్తి స్వరూపాలను విశ్లేషించారు. ఆలోచనతో చూస్తే వేయిపడగలులోని కుండలిని ఆదిశక్తి స్వరూపంగానే కనిపించింది. అయితే తనకు తోచడం కాదు, మనకు అనేక ఆధారాలతో వేయిపడగలులోని మాటలు, వర్ణనలు, సన్నివేశాలు, పాత్రలు, కథాంశాలు మొదలైన వెన్నో ఉపపత్తులు చూపి వేయిపడగలు లోని కుండలినీ స్వరూపాన్ని నిరూపించారు. వేయిపడగలు విశ్వలయ అనే వ్యాసంలో వేయిపడగలు అఖిల విశ్వాన్ని పరాశక్తి ఏ విధంగా నిర్వహిసున్నదో తెలుపుతుందని చూపించారు.

ఒక జాతి సర్వస్వం ఉన్మీలితిమైనా కావచ్చు గాని శక్తి చావరాదు” వే.ప. 25వ అధ్యాయం. ఈ వాక్యాన్ని తీసుకొని ఎంత వ్యాఖ్యానం చేయవచ్చునో చూపినారు సుప్రసన్న. “వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలమునుండి పెళ్ళగించడం జరిగినా సహజంగా అంతరికమైన ప్రాణ శక్తి నిలిచి ఉంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును.” ఈ అంశమే ఈ అధ్యాయంలో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. ‘ఒక గొల్లవాడు ముసలియావునొకదానికి కబేలావాని కమ్మబోవుచుండెను. ఆ యావు శక్తి యుడుగనన్ని దినములు సమృద్ధిగా పాలిచ్చెను. గొల్లవాడు దానితో సుఖపడెను’. ఈ సన్నివేశంలో పసరిక ప్రవేశించింది. పసరిక పైరు పచ్చ. ప్రకృతి, భూమికి ప్రతీక. పసరిక అధీనమైన ఆవు మళ్ళీ ఉజ్జీవించింది. ఆ ఆవు పరిలీనాగ్నియైన శమీవృక్షము వలె నెమ్మదిగా తేజోధిదేవత వలె, నడిచింది. జాతి శక్తి మళ్ళీ ఉజ్జీవనం పొందింది. అందువల్ల దాని నడచినంత మేర చీకట్లు పరాభూతములైనవి. “ఈ అంశం నవలలో సూచ్యాంశం. నవలలో ఉన్మీలితమైన జాతిశక్తి ఆంతరమైన ప్రాణశక్తిచేత మళ్ళీ పాదులో నిల్పబడి అంతదాకా ఉన్న తమోమయ దశనుండి బయటపడిందని తాత్పర్యం. ఈ అంశాన్ని మూలంగా చేసుకొని ఈ నవల జాతీయ పునరుజ్జీవ చైతన్యం ఎట్లా విజయం వైపుగా చేస్తున్నదో వ్యాఖ్యానించి చెపుతున్నది”.

ఇది సుప్రసన్నగారి వ్యాఖ్యానానికి మచ్చు తునక. ఇట్లా వేయిపడగలులోని గిరిక పాత్రదేనికి ప్రతీక, మంగమ్మ దేనికి ప్రతీక, పసరిక మొదలైనవి ఏయే శక్తులకు ప్రతీకలో వివరించారు. ఆయా శక్తులు ఒకవైపుకు లౌకిక జగత్తులో కనపడుతూనే లోపలి ప్రయాణం చేస్తుండడం విశేషం. అవి సుప్రసన్నగారు చూపిస్తే తప్ప పాఠకులకు సులువుగా తెలియని మార్గాలు. ఆ మార్గాలను విశ్వనాథ మార్గం పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. ఒక్క వేయిపడగలు మాత్రమే ప్రతి రచనలో పాఠకుడు పయనించవలసిన మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో వెళితే విశ్వనాథ మరోవిధంగా మనకు దర్శనమిస్తారు. ఆయనలోని యోగమార్గము, ఋషి లక్షణము, ఒకవైపు కనిపింపజేస్తూ చారిత్రకంగా జాతీయోద్యమాలు, ఆర్థిక వ్యవస్థా పరిస్థితులు, వర్ణ వ్యవస్థలోని లోపాలు, వివాహ వ్యవస్థలోని మార్పులు, ప్రాపంచికమైన అనేక కొత్త మార్పులు మరోవైపు కనిపింపజేస్తారు. ఇక నవల, కథ, కావ్యం, పద్యం, నాటకం, మొదలైన వాటిలో శిల్పరూప వైవిధ్యాలను ఎప్పటికప్పుడు చూపుతూనే ఉన్నారు.

ఆది వటము, వృషన్నిధి అనే చిన్న కథ వేయిపడగలులో పర్యావరణాన్ని తెలుపడానికి కూర్చిందనేది సామాన్య పాఠకుడు కూడా కొంత గ్రహించడానికి అవకాశమున్న కథ. సుప్రసన్న గారు ఈ పర్యావరణ వివరణతో ఆగిపోక ప్రియాసంగమం, పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంకలనం అని జోడింపు వ్యాఖ్య చేశారు. “మేఘాన్ని ప్రియాసందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీచైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ”.

ఇక్కడ కాళిదాసు మేఘసందేశాన్ని ఎందుకు పోల్చారు. అది భార్యాభర్తల విరహానికి సంబంధించిన కావ్యం. ఇక్కడ కూడా అదివటము వృషన్నిధి ప్రకృతి పరంగా సంయోగించవలసినవే కాని విరహానికి గురికావలసినవి కావు. ఈ సంయోజనం సృష్టి మూలధర్మము. మూలమైన సృష్టి విలాసానికి, వికాసానికి ఈ రెండింటి విరహం భగ్న కారణమై విషాదపరిణామాలకు దారితీస్తుంది ఇది ప్రాణులనుండి జడములదాకా ఉన్న బంధాలను వ్యాఖ్యానించడం సుప్రసన్న వంటి వారికి మాత్రమే సాధ్యం.

వేయిపడగలు నవలలో జానపదకథల మూలాలున్నాయి. ఫ్రాయిడ్ సిద్ధాంతాల ప్రభావాల పాత్రలున్నాయి. పరతత్వాన్వేషణ సాగించే పాత్రలున్నాయి. ఆత్మ పరమాత్మల ఐక్యత కొరకు పరితపించే జీవాత్మల వేదనలున్నాయి. ఇట్లా ఎన్నో అంశాలు ఎట్లా పెనవేసుకున్నాయో చూపించే విశ్లేషణలు, విమర్శలు చేయడం వేయిపడగలు నవల గురించి వ్రాసిన వ్యాసాలనేకం ఉన్నాయి. వాటన్నిటినీ వివరించడం సాధ్యం కాదు. వేయిపడగలు – విశ్వలయ, వేయిపడగలు ఆధ్యాత్మిక భావభూమిక, వేయిపడగలు ఎందుకు చదువాలి? మొదలైన వ్యాసాలలో విపులీకరించారు. విశ్వనాథ ఇతర రచనలు వ్యాఖ్యానించినపుడు ఆయన కవితాతత్వాన్ని పరిశీలనగా వ్రాసినపుడు వేయిపడగలు గురించి అనేకానేక కొత్త విషయాలు ఎత్తి చూపుతూనే ఉంటారు.

విశ్వనాథ రచనలలో కారుణ్య రసమూలాలు అనే వ్యాసంలో వేయిపడగలను ప్రస్తావిస్తూ “‘వేయిపడగలు’ నవల మొత్తం శిథిలమై పోతూవున్న జాతీయ జీవన వ్యవస్థను దర్శింపజేసే దీర్ఘ విషాద వచన కావ్యం . దీనిలో చరాచర జగత్తంతా కారుణ్య వర్షంలో తడిసిపోయింది. వృషన్నిధి అన్న మబ్బు, ఆదివటమన్న చెట్టు, లక్ష్మణ స్వామి యన్న యేనుగు, తీగవంటి పాము మనిషి పసరిక, రంగాజమ్మ, కేశవరావు, గిరిక, అరుంధతి – వీరందరి శైథిల్యమూ మరణమూ దుఃఖపు లోతులు తవ్విన ఘట్టాలే” అన్నారు.

ఈ అస్పష్ట దుఃఖోద్వేగం ప్రధానాంశమైన కవి కావడం వల్ల ఆయన సాహిత్య సృష్టిలో అంతా జాగ్రత్ చైతన్యాంశం కంటే, అవచేతనాంశం, సమష్టి చేతనాంశం ప్రధానంగా ప్రసరించుతవి.

ఈ పాత్రల పరిశీలన, రచయిత అక్కడక్కడా ప్రయోగించిన పదాలలోని అంతరార్థాలు, అంతస్సాక్ష్యాలు, చేసిన వివరణలు, ముగింపు వాక్యాల్లో ఆయన దుఃఖోద్వేగం, అందుకు కారణమైన సమష్టి అవచేతనలను గురించి పాఠకులకు సువిదితం చేసిన తీరు సరికొత్త విమర్శనా, వివేచనా ద్వారాలు తెరచింది. ఒక విధంగా ఆధునిక నవలలనుకేవలం ఆధునికంగానే కాక తత్వప్రతిపాదితాంశాలను వెలికి తీసే విమర్శనా మార్గాన్ని ప్రవేశపెట్టినారు.

విమర్శకు సంబంధించి ఇక్కడ మరో అంశం గమనిస్తే విశ్వనాథ పూర్వకావ్యాలకు వ్రాసిన విమర్శనా గ్రంథాలు కూడా సరికొత్త విధానాలే. పూర్వాలంకార రసధ్వనులు మొదలైనవి ఆమూలాగ్రం తెలిసిన విశ్వనాథ తన విమర్శలో కొత్తదారులు వేశారు కతలు చెప్పటంలోని వైవిధ్యాన్ని, కథా సన్నివేశాల సంయోజనంలోని బిగిని, పద్యరచనలో, పదప్రయోగాల్లో ఛందో వైవిధ్యం చూపించడంలో కాకువులు పలికించడంలో, వ్యవహారం ధ్వనింపజేయడంలో ఆయా కవుల ప్రయోగాలు విడమరచి చూపించిన విశ్వనాథ విమర్శనుంచి నవలలు కూడా వేరు వేరు కోణాల్లో చూడగలిగే ఒక దృష్టిని కలిగించారు సుప్రసన్నగారు. విశ్వనాథ విమర్శ, వ్యాఖ్యానాలు, పీఠికలు, సమీక్షలు, అప్పటికి కావ్యాల గురించి ఉన్న సామాన్య విశేషాలు అభిప్రాయాలు వ్యక్తం చేసేవిగాకాక సరికొత్త ప్రతిపాదనలుగా చేసి చూపించారు. ఆ చూపించడానికి అనేక ప్రతిపత్తులు కావ్యం నుండి, లోకం నుండి గ్రహించేవారు. లోకమును వీడి రసమ్ము లేదు, అని ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏ సన్నివేశమైనా లోకాలోకాల సమ్మేళనంగా విశ్లేషించేవారు. ఆ త్రోవలో మరింత విశిష్ట మార్గం వేసినవారు సుప్రసన్న. లోక వ్యవహారము, సిద్ధాంతాల చర్చ, జాతీయ భావాల మూలాలు, పూర్వఋషుల నుండి రామకృష్ణ పరమహంస నుండి రమణ మహర్షిదాకా ఆత్మజ్ఞానాన్వేషణ సాధనా మార్గాలన్నిటినీ దర్శించి పాండిత్యానుభవమంతా విమర్శలో పరచుకొని పోవడం విశేషం. ప్రాగ్రూపాలు, మానసిక విశ్లేషణలు, చారిత్రక సామాజిక సందర్భాలు సమన్వయం చేస్తూ రచనను సమగ్రంగా అధ్యయనం చేసే విధానాన్ని సుప్రసన్నగారు చూపించారు. విశ్వనాథ నవలలు, నాటకాలు, కావ్యాలు మాత్రమే కాదు ఏ కవి రచనలు తీసుకున్నా ఇవన్నీ కనిపిస్తాయి. విశ్వనాథ చలం నవలల్లో స్త్రీ పాత్రలు అనే విమర్శనా వ్యాసం ఇందుకు ఒక ఉదాహరణ.

5

రామాయణ కల్పవృక్షము భక్తులకే కాదు సాహితీవేత్తలకు కూడా కల్పవృక్షమే. అది రామకథ కాదు. సీతకథ. వేద కథ. వేదనమూలమైన కథ. అని వేదానికి సీతాదేవికి భేదం లేని స్థితిని కల్పవృక్షం ద్వారా విశ్వనాథ ఎట్లా ధ్వనిమయం చేశారో వివరించారు సుప్రసన్నగారు. సీతాదేవి అంటే తపసా జ్వలంతీం అని దుర్గాసూక్తంలో చెప్పిన మాతయే సీతామాత అనీ, ఆమెయే మూల ప్రకృతి యనీ నిరూపించే ఉపనిషత్తులు కల్పవృక్షం నుండి చూపించారు. ఆ విధంగా విశ్వనాథరామాయణ హృదయాన్ని ఆవిష్కరించి మనకు కూడా కనిపింపజేశారు. అందుకు సీతాదేవి ఎన్నెన్నివిధములుగా ఎందరెందరికి కనిపించిందో, అనిపించిందో, భాషించిందో, భావింపజేసిందో, ఎన్ని ఘట్టాలలో ఎట్లా ఈ ప్రకృతి మూలతత్వాన్ని ప్రతిపాదనచేయడమే కాక పరచి చూపించారో ఆ వివరణలన్నీ ఎత్తి చూపించారు. ఒక సన్నివేశంపై వ్యాఖ్య, కళ్యాణఖండంలో వశిష్ఠుడు సీతాదేవిని మొదటిసారి ప్రస్తావించిన సందర్భంలో రెండు కందపద్యాలున్నాయి. వాటిలో రెండు మార్లు శ్రీమధురాకృతి, మధుసూదన పదాన్ని ప్రయోగించారు. ఎందుకు? సుప్రసన్న గారి విచారణ ఇది.

“సీతాదేవిని గురించి శ్రీమధురాకృతియనడంలో ఆమె శ్రీవిద్యాధిష్ఠాత్రియైన పరాశక్తి యని సూచన ఉన్నది. రాముడు కూడా మధురాకృతియనడం ఆమె చరిత్రలోని మాధుర్యాన్ని ధర్మ తత్పరతను తెలియజేస్తుంది. ఇక్కడ మధుసూదన శబ్దము సామాన్య విష్ణవ్వర్థమే కాక సప్తశతిలోని మధుకైటభ సంహార వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ ఘట్టంలో మహావిష్ణువు విష్ణుమాయకు లోబడి నిద్రలో ఉండగా దేవతలు అతన్ని స్తుతించి మేల్కొల్పి మధుకైటభ వధకు దోహదం చేస్తారు. శ్రీరాముడు సీతాకళ్యాణం తరువాత అయోధ్యలో సుఖావశుడై, యౌవరాజ్య పట్టాభిషేకానికి సిద్ధుడై యుండగా అతనిని అవతార కార్యం నిర్వహించవలసిందిగా దేవతలు ప్రార్థించి అతన్నిలోకములనుండి దివ్యత్వముఖం వైపుకు మళ్ళించినట్లుగా కల్పవృక్షం చెపుతున్నది. మధుకైటభవధాసందర్భంలో ఆధారభూతమైన శక్తి మహాకాళి, ఈమె తష్ణు స్వరూపిణి. దశమహా విద్యలలో మహాకాళి సంహారిణి. ఈ వృత్తాంతము అంతామధుసూదన శబ్దం రామపరంగా సీతాపరంగా రెండు సార్లు ఆమ్రేడితం కావడం విశ్వనాథ తెలియజెప్పిన ఇతిహాస రహస్యాన్ని సూచిస్తున్నది.”.

ఈ వ్యాఖ్యానం లేకుండా ఈ సూచన అందుతుందా? ఇవి కాక మూకపంచశతి, ఉమాసహస్రం, సౌందర్యలహరి, దేవిమహిన్న గ్రంథాలలోని అర్థాలతో సీతాసందర్భాలను సమన్వయం చేసి చూపించారు.

ఇట్లాంటి వెన్నో కల్పవృక్షం గురించి చేసిన వ్యాఖ్యానాలు “సీతాయాశ్చరితం మహత్”ను కూడా నిరూపిస్తాయంటారు సుప్రసన్న. ఇదంతా విశ్వనాథ వేంకటేశ్వర్లు గారు చూపిన పరావిద్యా రహస్య మార్గ అన్వేషణా ఫలితంగా కలిగిన అపారమై ప్రతిభాదర్శనం అనుకుంటాను.

రెండుస్తరాలలో అర్థాలున్నాయని, ఇటువంటి సంభాషణా చాతుర్యాన్ని తెలుగులో పోతన్న కొంత చూపించినా విశ్వనాథ ఎంతో పెంచారని చెపుతూ ‘ప్రఘస’ అన్న ఆమె మాట్లాడిన మాటల్లోని అంతరార్థాన్ని వివరించారు. “సర్వజీవులయందు అత్యంతికంగా పరమేశ్వర స్పృహ ఉంటుందనీ అందరూ ఎపుడో ఒకప్పుడు ఈశ్వరుని చేరవలసిన వారే అన్న భారతీయ తత్వచింతన దీనికి ఆధారభూతమైనది. దీనినే విశ్వనాథ జీవుని వేదన అంటారు”. జీవుని వేదన అనే ఆలోచన ఒకవైపు లౌకికమైన సాధారణ జీవుల దుఃఖాన్ని తెలియజేస్తుండగా రెండవది ఆంతరమైన అనంతమైన వేదనను తెలియజేస్తుండగా, మూడవది సమష్టి వేదనను తెలియజేస్తున్నది. కాగా ఆలంకారికులకు రస, ధ్వనుల వలె కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం విశేషం. ఈ అంశాలను సుప్రసన్నగారు కల్పవృక్షాన్ని గురించి రాసిన పలు వ్యాసాలలో స్పష్టం చేశారు. ప్రఘస అన్న రాక్షస స్త్రీ పలికిన పలుకుల్లో ఎందరి దుఃఖాన్ని వ్యక్తం చేసిందో చూపించారు.

6

విశ్వనాథ ఒక విరాట్పురుషుడు. ఒక వ్యాసుడు. వశిష్ఠుడు. ఒక వాల్మీకి వలె దర్శించి అనుభవించిన రసహృదయులు, నిత్యాన్వేషణా సాధకులు సుప్రసన్న గారు. ఆయన జీవితంలోని అనేక పార్శ్వాలకు వాటితో సంగమించే సాహిత్య సృజనను ప్రవాహంలో పడిఈదులాడిన హంస సుప్రసన్న.

ఒక సమాజం, ఒక దేశం, ఒక జాతి, ఒక చరిత్ర, ఒక తత్వం, భాష, రసము, ఒకటిగా నిలిచిన విశ్వనాథను ఒక విరాట్పురుషునిగా భావించారు. సాహిత్యాన్ని భూమార్గం నుండి ద్యౌమార్గం పట్టించిన విశ్వనాథ మార్గాన్ని తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేసిన ద్రష్ట సుప్రసన్న.

విశ్వనాథ సర్వసాహిత్య సాగరాన్ని మథనం చేసి రసామృతాన్ని సాహితీ ప్రియులకు చవి చూపించిన మహాసాధకులు సుప్రసన్న గారి విమర్శనా, వ్యాఖ్యాన వైభవాన్ని గురించి ఎంత చూపినా ఏదో ఒక మూలకే అవుతుంది. ఆమూలాగ్రంగా అందరూ చదివి అనుభవించాల్సిందే. “ఇప్పటికి నన్ను, నా జీవితాన్ని ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో ఒకరిద్దరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలిగింది. అందరలో ఒకరు విశ్వనాథ”. అని చెప్పుకున్న సుప్రసన్న గారి గురించి చెప్పగలిగే శక్తి నాకు చాలదు.

మా గురువుగారు కోవెల సంపత్కుమారాచార్యులు గారు సుప్రసన్న గారి గురించి ఒకసారి చెప్పిన పద్యాన్ని మననం చేస్తూ ముగిస్తాను.
అతని ఆలోచనమ్ము అనాహతమ్ము
అతని విశ్లేషణ విశుద్ద మతని వాక్కు
పద్మకోశ భ్రమరవినిస్వాన మధువు
అల సహస్రార మాతని అనుభవమ్ము.

Exit mobile version