[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
‘లేతబుర్రలు కొక్కిరిస్తే
ఆతగాళ్లతో యేలగానీ
తాత తాతలనాటి కతలూ
తవ్వి పోస్తానోయ్!’
‘కోకిలమ్మ పెళ్లి’ అనే గేయ కావ్యంలో, కృష్ణశాస్త్రి, ‘నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు’ అన్న రీతిలోనే, ‘విశ్వనాథ’ సైతం, సాహిత్య సృజనలో తన అభిప్రాయం స్పష్టంగా చాలా సున్నితంగా చెప్పారు. ‘తాత తాతల నాటి కతలూ/తవ్వి పోస్తానోయ్’ అన్న మాట నెరవేర్చుకున్నారు. లేతబుర్రలు ఎంతగా కొక్కిరించినా, “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక, నాకేటి వెరపు” అన్నట్టే, తాను పట్టించుకునే ప్రసక్తి లేనే లేదని స్పష్టంగా చెప్పారు. తాను రాయాలనుకున్న రచనపట్ల స్పష్టమైన అవగాహన, తన రచనా ప్రతిభపై అమితమైన విశ్వాసం, తాను సాధించదలచుకున్న లక్ష్యంపై అచంచల విశ్వాసం కల సృజనాత్మక కళాకారుల మనస్తత్వం అది.
తాత తాతలనాటి కతలు తవ్వి పోయటం ఏమిటి? లేత బుర్రలు కొక్కిరించటం ఏమిటి?
‘తాత తాతలనాటి కతలు’ అంటే అభూత కల్పనలు కాదు. పిట్ట కథలు, పెట్టు కథలు, కట్టు కధలు, ఒట్టి కథలూ కాదు. ఈ మట్టి చెప్పే అచ్చమైన గట్టి కథలు. ఈ నేల అణువు అణువూ నిరంతరం ఘోషిస్తూ, కనులున్న వారికి చూపిస్తూ, చెవులున్న వారికి వినిపిస్తూ, తపన ఉన్న వారికి తెలుపుతూ, అన్వేషిస్తున్న వారికి ప్రత్యక్షం చేస్తూ.. మనసున్న వారు గ్రహించి, అనుభవించి, అర్ధం చేసుకునే రీతిలో చెప్తున్న చరిత్ర గాథలను త్రవ్వి, వాటిని సృజనాత్మక సరస్సు నీటిలో శుభ్రపరచి, ఆ సరస్సులోని కలువలతో, తామరపూలతో అలంకరించి అందించటం “తాత తాతలనాటి కతలు తవ్విపోయటం. అలా తవ్విపోసిన చరిత్ర నవలలు రాశులుగా పోసి అందించారు విశ్వనాథ. ఇవీ విశ్వనాథ తలపోసిన తాత తాతల నాటి కతలు.
అలా తవ్వి పోసిన తాత తాతల నాటి కతల ఒక రాశి ‘పురాణ వైర గ్రంథమాల నవలలు’. మరో రాశి ‘నేపాళ రాజవంశావళి’ నవలలు. ఇంకో రాశి ‘కశ్మీర రాజవంశావళి నవలలు’
మనకు సప్త సాగరాలు తెలుసు సాగరాల విస్తృతి, గాంభీర్యాలు తెలుసు. సాగరలోతుల గురించి ఒక ఊహ ఉంది. అలాంటి సప్త సాగరాలు మాత్రమే కాదు, అలాంటి సప్తశత సాగరాలు కలిపితే ఒకో విశ్వనాథ నవల అవుతుంది. అదీ మనకున్న పరిమిత పరిధులను దృష్టిలో ఉంచుకుని ‘సప్తశత’ దగ్గర అగాల్సి వస్తుంది.
విశ్వనాథ సమకాలికులు సామాన్యులు కారు. అసామాన్యులలో అసాధారణులు వారు. వారి ప్రతిభాపాటవాలు అద్వితీయాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క హిమాలయము. ఒక్కొక్కరు పాలసంద్రము. ఎవరివారే, ఆకాలంలో. అలాంటి వారి సరసన తల ఎత్తుకు నిలబడగలగటమే కాదు, కాలం గడుస్తున్నాకొద్దీ, నూతన తరాలలో సైతం తన అభిమానులను,మామూలు అభిమానులను కాదు, వెర్రి అభిమానులను సృష్టించుకుంటూ పోతున్నది విశ్నాథ సాహిత్యం. విశ్వనాథ సమకాలికుల రచనలకూ, విశ్వనాథ రచనలకూ తేడా ఇక్కడే తెలుస్తుంది. ఈనాటికీ, వారిలో కొందరి రచనలకు అభిమానులున్నారు. వెర్రి అభిమానులున్నారు. వారు సృజించిన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ మైమరచేవారున్నారు. కానీ, విశ్వనాథ సాహిత్యంలా తీవ్రమైన భావనలు రగిల్చి, పాఠకుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నవారు అరుదు.
‘లేత బుర్రలు కొక్కిరిస్తే’ అంటూ ఆరంభించాడు విశ్వనాథ. పరిణితి లేనివారు, పచ్చి పాల మీద మీగడ వెతికేవారు. సూర్యుడు పశ్చిమాన ఉదయించక పోవడం, విశ్వనాథ దోషం అన్నట్టు వాదించేవారు, ఎవరో ఏదో చెప్తే దాన్నే మరమనిషిలా వల్లె వేస్తూ, విశ్వనాథను చదవకుండానే అర్థం కాడని ఆరాటపడిపోయేవారు, హిమాయాలను చూడకుండానే ‘మా ఇంటికన్నా ఎత్తుంటాయా హిమాలయాలు?’ అని హుంకరించేవారూ.. ఇలా లేత బుర్రల ఉదాహరణలకు లెక్కనే లేదు. ఎలాగయితే, విశ్వనాథ రచనలు చదివిన ప్రతిసారీ కొత్తగానే ఉండి కొత్త కొత్త విషయాలపై వెలుతురు ప్రసరింపచేస్తూంటాయో, అలాగే తరాలు మారుతున్నా, ఎదగని బుర్రలతో, మారని వెక్కిరింతలతో, పసలేని వాదనలతో, పురాణవైర గ్రంథమాల నవలల్లో విశ్వనాథ నిరూపించిన మరణం లేని జయద్రథ భావ సంతతిలా, అక్కడ ‘పురాణవైరం’, ఇక్కడ ‘విశ్వనాథ వైరం’తో, అవే పాత పసలేని ఆక్షేపణలను కొత్తగా కనుక్కున్నట్టు ప్రస్తావిస్తూ, లేతబుర్రల లేతదనాన్ని మరింత తాజాగా ప్రదర్శిస్తునే ఉన్నారు లేతబుర్రలు. ఎలాగయితే విశ్వనాథ అభిమానులు ఎంత గాఢంగా ఆయనను విశ్వసిస్తారో, ఈ లేత బుర్రలకు అంతకన్నా తీవ్రంగా విశ్వనాథ పేరులోని ‘శ్వనా’ మాత్రమే పట్టించుకుని తీవ్రంగా ద్వేషిస్తారు. ఏదయినా తప్పుపట్టి, దూషించి, విమర్శించి, తమకు తెలిసినంతకూడా, విశ్వనాథకు తెలియదని ఈసడించి, విశ్వనాథను అభిమానించే వారందరినీ మూర్ఖుల్లా భావిస్తూ, వెక్కిరించి కాలర్లెగరేసేవారిని చూసే విశ్వనాథ అన్నారు “అర్ధం చేసుకునేవాడికి మనసు ఉంది, లేనివాడికి, నాలిక ఉండనే ఉంది” అని.
మూర్ఖులు అసత్యాన్ని ఎంత గాఢంగా నమ్ముతారంటే, సత్యం నిస్సహాయంగా, అసత్యం అందలాలెక్కుతుంటే చూస్తుండి పోవాల్సి వస్తుంది. కాబట్టి, తాము ‘ఇది సత్యం’ అని నమ్మిన వారు సత్యం చెప్పక పోతే, అసత్యం కొన్నాళ్లకి సత్యంగా స్థిరపడుతుంది. పైగా విశ్వనాథ వారి రచనల లోతు ఎంతంటే, ఉపరితలాన్ని కూడా స్పృశించకుండానే విశ్వనాథ రచన గురించి అంతా గ్రహించేసినట్టుగా ప్రకటించేసుకునేవారి వల్ల, విశ్వనాథను విమర్శించే వారివల్ల కన్నా, వీరి వల్ల, ఎక్కువ హాని కలుగుతుంది. సింధువును బిందువులో చూపించవచ్చు. కానీ వందల వేలాది సాగరాలు కలిస్తే, ఒక రచనగా అయ్యే విశ్వనాథ రచనలను ‘బిందువు’లో చూపించటం అంటే అనంతమైన విశ్వాన్ని అద్దంలో చూపించి, “ఇదే అనంతం” అనటం లాంటిది. విశ్వనాథ ప్రతి రచన ఒక అనంతమైన విశ్వం లాంటిది. ఎంతగా పరిశోధించినా, అధ్యయనం చేసినా అంతా అర్ధమయిందనే వీలు లేదు. కాబట్టి నా పరిధిలో నేను విశ్వనాథ రచనల ద్వారా గ్రహించినది, విశ్వనాథ రచనలలో గమనించినది, నేను అర్ధం చేసుకున్న రీతిలో, నాకు అర్థమైనట్టు ప్రకటించటం ద్వారా ఆ మహా విశ్వంలో ఒక చిన్న అణువులోని సహశ్రాంసం పైనైనా వెలుతురు ప్రసరింప చేసినట్టవుతుందన్న విశ్వాసంతో, అహంకారంతో, విశ్వనాథ రచనల వివరణాత్మక, విశ్లేషణాత్మక పరిచయం, ” కశ్మీర రాజవంశావళి నవలల” తో ప్రారంభిస్తున్నాను.
విశ్వనాథ రచనలనే మహామహా సాగారాలలో, ఎగసెగసి పడే తరంగాలపై, చిన్న పడవపై ప్రయాణానికి సిద్ధం కండి. ఈ ప్రయాణంలో “ప్రాణ రక్షణ కవచాలు”(లైఫ్ జాకెట్లు) ఉండవు, మీకైనా, నాకైనా!!
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

