Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-2

[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

విశ్వనాథ సత్యనారాయణ సృజించిన సాహిత్యం గురించి లోతుగా చర్చించటం ఆరంభించే కన్నా ముందు కొన్ని అంశాలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఏ రచయిత అయినా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన సృజనాత్మక బీజం, సంస్కారాల వల్ల ఏర్పడిన మానసిక వ్యవస్థతో పాటు, ఆ రచయిత కాలంలో నెలకొని ఉన్న సామాజిక, రాజకీయ, ధార్మిక పరిస్థితుల ప్రభావాల నుంచి తప్పించుకోలేడు. రచయిత ఆలోచన, స్పందనలపై స్వీయ వ్యక్తిత్వంతో పాటు ఈ అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయి. రచయిత అపరిమితమైన సృజనపై ఇవి కొన్ని పరిమితులు, భౌతిక, మానసిక పరిమితులు,  విధిస్తాయి. ఈ పరిమితులు వ్యక్తిగతమూ,  సామాజికమూ కూడా! ఒక రచయిత రచనలను అర్థం చేసుకోవాలన్నా, లోతుగా విశ్లేషించాలన్నా మానసిక, భౌతిక, సామాజిక పరిస్థితులు, పరిమితులు కూడా పరిగణనలోకి తీసుకోవటం తప్పనిసరి.

విశ్వనాథ సత్యనారాయణ క్రీ.శ.1895 సెప్టెంబర్ 10న జన్మించారు. 1895వ సంవత్సరం సామాజికంగా, రాజకీయంగా, ధార్మికంగా, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తరువాత బ్రిటిష్ పాలకులు పద్ధతి ప్రకారం భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం తీవ్రతరం చేశారు. భారతీయ సమాజంలో కులం, ఆధారంగా చీలికలు తేవాలన్న ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. సంస్కరణల పేరిట భారతీయ సమాజంలో న్యూనతా భావాన్ని, నేర భావాన్ని శక్తిమంతంగా చొప్పించారు. మత మార్పిళ్లు కూడా ఈ న్యూనతా భావం, నేర భావాల ఆధారంగా వేగవంతమయ్యాయి. మరో వైపు సర్వ స్వతంత్రమయిన సామాజిక వ్యవస్థను దెబ్బతీస్తూ దాని స్థానంలో ఉద్యోగాలపై ఆధారపడే వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ రకంగా భారతీయ సమాజం పై దీర్ఘకాలిక ప్రభావం చూపగల చర్యలన్నీ 1895 నాటికి స్పష్టమైన రూపుదిద్దుకున్నాయి. 1875 లో బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రాసినా, 1882లో ఆనందమఠం నవలలో ఆ గీతాన్ని పొందుపరచారు. 1894లో బంకించంద్ర చటర్జీ మరణించారు. దాంతో, ఆయన జ్ఞాపకార్ధం, రవీంద్రనాథ టాగోర్, వందేమాతర గీతానికి బాణీకట్టి వినిపించటం 1895లో ఆరంభించారు. అధికారికంగా తరువాత సంవత్సరంలో వందేమాతర గీతాన్ని ఆయన వినిపించారు. దేశ స్వతంత్ర పోరాటంలో వందేమాతర గీత ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

బ్రిటిష్ వారు అమలు పరుస్తున్న పథకాలు, వాటి వెనుక దాగిన కుట్రలను అర్థం చేసుకున్న భారతీయ సమాజం, తీవ్రంగా ప్రతిస్పందించింది. 1893లో వివేకానంద ‘చికాగో’ ఉపన్యాసంతో ప్రపంచం ఉలిక్కి పడేట్టు చేశాడు. భారత దేశంలోనూ తమ సంస్కృతి సాంప్రదాయాల పట్ల, తాత్వికచింతన పట్ల గౌరవం పెంచాడు. అదే సమయానికి మన సమాజంలో, ఆలోచన విధానంలోని లోపాలను ఎత్తి చూపించాడు. 1895 ప్రాంతాలలోనే కాంగ్రెస్‌లో అతివాదుల ప్రాబల్యం పెరిగింది. ముఖ్యంగా, ‘మనలో లోపాలను మనమే సంస్కరించుకోవాలి. బ్రిటిష్ వాడెవడు మనల్ని సంస్కరించటానికి? ’ అని గర్జించి గద్దించిన తిలక్, ‘స్వరాజ్ బిల్’ ను కాంగ్రెస్ ఆమోదించేట్టు చేశాడు. ఈ సంవత్సరంలోనే తిలక్, ‘శివాజీ’ ఉత్సవాలను ఆరంభించాడు. ప్రజలలో జాతీయ  భావాలు రగిల్చి, ధర్మరక్షణ కంకణ బద్ధులను చేసే ప్రేరణను రగిలించాడు. లాలా లజపతి రాయ్, పూర్తిగా భారతీయ పెట్టుబడితో, బ్యాంకింగ్ రంగంలో బ్రిటిష్ వారి మోనోపలీని దెబ్బతీస్తూ ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ ప్రారంభించాడు. అంటే, 1895 సంవత్సరం ఒక రకంగా భారతీయ ధార్మిక,  సాంస్కృతిక, సామాజిక,  రాజకీయ, ఆర్థిక పునరుజ్జీవనానికి కీలకమైన సంవత్సరం అన్నమాట. ఆ సంవత్సరం విశ్వనాథ జన్మించాడు. అంటే, విశ్వనాథ ఆలోచనా విధానంపై, సృజనాత్మక ప్రవాహ దిశపై ఈ అనేక అంశాల ప్రభావం ఉన్నదన్నమాట.

విశ్వనాథకు ఊహ తెలిసి, చుట్టూ ప్రపంచాన్ని గమనించి, అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి దేశంలో స్వతంత్ర పోరాటం ఊపునందుకుంది. జాతీయ భావనల జ్వాలలు నలుదెసల విస్తరిస్తున్నాయి. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రేచ్ఛ దేశంలో పరవళ్లు తొక్కుతోంది. బ్రిటిష్ వారి పద్ధతుల పట్ల నిరసన కార్చిచ్చులా దేశమంతా ప్రాకుతోంది. సంస్కృతి సంప్రదాయాల రక్షణ, పునరుద్ధరణ, బ్రిటిష్ వారి విద్యావిధాన వ్యతిరేకత , సంస్కరణల పేరిట భారతీయ ధార్మిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం ద్వారా ఆత్మ న్యూనతాభావాన్ని సమాజంలో కలిగించటంతో పాటూ, తమ సమాజాన్ని తామే అసహ్యించుకుని దూషించి, ద్వేషించే ప్రేరణ కలిగించటం  వంటి చర్యలు  మనల్ని మనకు దూరం చేస్తాయన్న నమ్మకం దేశమంతా ప్రబలింది. వివేకానంద ప్రభావం పెరుగుతూనే ఉంది, ఇంతలో విప్లవ వీరుడు అరబిందో, మహర్షి అయ్యాడు. మహర్షి అవకముందు, అయిన తరవాత కూడా ఆయన తీవ్రమైన ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తాత్విక చింతన వంటి వాటి ద్వారా దేశ ప్రజలలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం రగిలించాడు తన రచనల ద్వారా,  సందేశాల ద్వారా. ఇలా దేశం మొత్తం ఒక నూతనోత్సాహంతో, నూతనోత్తేజంతో, నూతన ఆత్మవిశ్వాసంతో, ఆచంచలమైన ఆత్మగౌరవంతో తొణికిసలాడుతోంది. విశ్వనాథ సత్యనారాయణ రచనలను ఈ  నేపథ్యంలో పరిశీలించాల్సి ఉంటుంది.

పరాయి పాలనలో బానిసల్లాగా ఉండి, స్వతంత్రం కోసం పోరాడుతూ, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జాతీయ భావాల ఆధారంగా చేసే రచనలను వలసవాద సాహిత్యం (colonial literature) అంటారు. వలసవాద సాహిత్యం పాలకులు తమ చర్యలను సమర్థిస్తూ, తమకు  లోబడిన స్థానికులను అనాగరికులుగా చూపుతూ రాసిన సాహిత్యం కావచ్చు. దీన్ని Settler literature అని కూడా అంటారు. అంటే, బయట నుంచి వచ్చి   తాము గెలుచుకున్న ప్రాంతాలలో స్థిరపడి తమ ఆధిక్యాన్ని, స్థానికుల అనాగరికతను ఎత్తి చూపే  రచనలు చేసే వారన్నమాట.

Colonial Literature లో మరో రకం, బానిసత్వానికి గురయిన ప్రజలు స్పష్టించేది. బానిసత్వానికి గురయిన ప్రజల రచనలలో వారి మానసిక వ్యథ, గుర్తింపు లేమి, సంపూర్ణ మానసిక పునః గుర్తింపు సాధిచటం, అంటే స్వీయ గుర్తింపును ఆత్మవిశ్వాసాన్ని, మానసిక శక్తిని పూర్తిగా అధీనంలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు కనిపిస్తాయి.

‘Post – colonial literature’ అంటే స్వతంత్రం సాధించిన తరువాత సృజించిన సాహిత్యంలో కూడా ఈ ధోరణులు కనిపిస్తాయి. ఇది వలస రాజ్యానంతర సాహిత్యం.

టూకీగా చెప్పాలంటే, వలసవాద సాహిత్యం తమను పాలించే వారి దృక్కోణంలో రచించినదయితే, వలస రాజ్యానంతర సాహిత్యం తమ గుర్తింపును, తమ చరిత్రను పునర్నిర్మిస్తూ, తమదైన ప్రత్యేక స్వరాన్ని వినిపించే సాహిత్యం. విశ్వనాథ సత్యనారాయణ బ్రిటిష్ పాలకుల ఆధిపత్యాన్ని భరిస్తూ, తన సంస్కృతి సంప్రదాయాలు, ధర్మం గొప్పతనాన్ని వివరిస్తూ, దాని పట్ల విదేశీ పాలకులు చూపిస్తున్న చులకన భావాన్ని నిరసిస్తూ, ఈ ధర్మాన్ని దెబ్బతీయాలని వాళ్లు చేస్తున్న కుట్రలను ఖండిస్తూ సాహిత్యాన్ని సృజించాడు. స్వాతంత్ర సాధన తరువాత, పరాయి పాలన తొలగినా, ఇంకా తొలగని విదేశీ భావదాస్యాన్ని నిరసిస్తూ విదేశీయుల కుట్రల వల్ల జరిగిన అనర్థాలను ఎత్తి చూపిస్తూ, వాటిని సరిచేస్తూ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, ధర్మం పట్ల బాధ్యతను, ప్రేమను రగిలించాలన్న ఉద్దేశంతో రచనలు చేశాడు. జాతీయ భావాలను ప్రదర్శించాడు. తమదన్న ప్రతిదాన్ని చులకన చేస్తూ, పరాయిదన్న ప్రతిదాన్ని అక్కున చేర్చుకుంటూ,  స్వేచ్ఛగా బానిస మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్న తరాన్ని చూస్తూ, భావితరాల పట్ల ఆందోళన చెందుతూ, వారికి నిజానిజాలు వివరించాలన్న తపనతో రచనలు చేశాడు విశ్వనాథ. రాజతరంగిణి వంశావళి నవలలు రెండవ కోవకు చెందుతాయి. భారతీయ చరిత్రతో అకాండ తాండవం చేసి, భారతీయులకు చరిత్ర గురించిన  స్పృహ లేదని తీర్మానిస్తున్న విదేశీయులను నిరసిస్తూ, విదేశీయులు  చెప్పిన దాన్ని వేదం కన్నా పవిత్రంగా భావిస్తూ, అదే నిజమని నమ్మేసి ప్రచారం చేస్తున్న స్వదేశీయులకు నిజానిజాలు వివరించాలన్న తపనతో రచించిన రచనలు పూరాణవైర గ్రంథమాల, నేపాళ వంశ నవలలు, కశ్మీర రాజవంశ నవలలు. ఇక్కడ తుపాకీ ఎక్కుపెట్టింది విదేశీ పాలకుల కుట్రల  పైన. కానీ గురి మాత్రం వారిని గుడ్డిగా అనుసరిస్తున్న స్వదేశీయుల పైన.

‘Frantz Fanon’ అనే మానసిక శాస్త్రవేత్త, రాజకీయ తత్వవేత్త, ‘పోస్ట్-కొలోనియల్ స్టడీస్’ పై విస్తృతంగా పరిశోధనలు జరిపాడు. ఈయన పరిశోధనలు భారతదేశీయుల వలస రాజ్యానంతర జాతీయ భావాల రచనల వైపు ప్రసరించలేదు. బానిస భావం నుంచి బయట పడాలని ప్రయత్నిస్తూ, తమ వారి ఔన్నత్యాన్ని ప్రదర్శించాలని తపన పడే రచయితల మనస్తత్వాన్ని ఈయన ‘Black skin, white mask’ ‘నలుపు శరీరం, తెలుపు ముసుగు’గా అభివర్ణించాడు. ఇలాంటి వారి రచనలు ఎలాగో విదేశీ పాలకులు మెచ్చరు.  విదేశీ పాలకుల మెప్పు కోసం ప్రయత్నించే స్వదేశీయులు కూడా మెచ్చరు. ఈ సంఘర్షణను, మానసిక వ్యథను Frantz Fanon, గుగి వా థియోంగో, చినువా అబేచే వంటి వారి రచనలు ప్రతిబింబిస్తాయి.

Fanon ప్రకారం ‘వలసవాదం’ కేవలం రాజకీయంగా అధిక్యం సాధించటం మాత్రమే  కాదు, మానసికంగా తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి కలిగించే ‘Psychological Neurosis’  కలిగిస్తుంది. ఇలా ఒత్తిడిలో ఆందోళనల్లో తమ ప్రత్యేక గుర్తింపును సాధించాలని జాతీయ భావాలతో రచించే రచయితలలో నాలుగు దశలుంటాయని ఆయన తీర్మానించాడు.

1. Epidermalization of Inferiority

దీనిలో రచయిత, జాతి పరంగా పాలకుల దూషణలు, విమర్శల వల్ల తనలో కలిగిన న్యూనతా భావాన్ని ఆధిక్య భావనగా మార్చాలనే defensive intellectual mimicry ని ప్రదర్శిస్తాడు. అంటే, తమకు పాశ్చాత్య తత్వం, విజ్ఞాన శాస్త్రం అంతా తెలుసని నిరూపిస్తూ, ఈ భావనల కన్నా తమ విజ్ఞాన శాస్త్రం, తత్వం ఎంతో గొప్పది అని ప్రదర్శిస్తారు రచయితలు.

2. Assimilation and Combat

రెండవ దశలో రచయిత విదేశీయులను అనుకరించాలని ప్రయత్నిస్తూ, విదేశీయుల కన్నా తమ గతం ఎంతో గొప్పది అని గతాన్ని అందంగా, అద్భుతంగా చూపుతాడు రచయిత. గతాన్ని ‘స్వర్ణయుగం’ లా అభివర్ణిస్తాడు రచయిత. ఫానన్ ప్రకారం ఇది ప్రమాదకరమైన దశ. ఎందుకంటే, ఈ దశలో రచయిత ఎంతగా గతాన్ని అద్భుతంగా చూపిస్తాడంటే, వర్తమానాన్ని మరచిపోతాడు. సంప్రదాయమన్నది ఆధునిక పరిస్థితులను అర్థం చేసుకుని మారాలన్న ఆలోచనను కోల్పోతాడు . ఈ దశ దాటితేనే రచయిత మంచి చెడులను బేరీజు వేసుకుని తన రచనల ద్వారా ప్రజలకు నిజానిజాలు వివరిస్తాడు. ఫానన్ ప్రకారం, భారతీయ ఆంగ్ల రచయితలు ఈ రెండవ దశలో ఆగిపోయారు.

3. Manichean Delirium and Splitting

Manichean అంటే తమ పై అధికారం చేసిన విదేశీయులు పూర్తిగా చెడ్డవారు,  తాము పూర్తిగా మంచివారు అన్న భావన . దీన్ని ‘White man bad. Black man good’ గా వివరిస్తాడు ఫానన్. దాని ప్రకారం పాశ్చాత్యమేదైనా చెడు, భారతీయం ఏదైనా ఉత్తమం అన్న భావన ఇది. మన రచయితలనేకులు, పల్లెలు గ్రామాలను ‘మన’ తనానికి ప్రతీకగా, నగరాన్ని పాశ్చాత్యానికి ప్రతీకగా తీసుకుని, నగరం అంతా మోసగాళ్ళు, పల్లె ప్రజలు అమాయకులు అన్న ‘మూస’ భావన ప్రదర్శించటం అన్నమాట ఇది. ఇదేభావన, సాంప్రదాయ దుస్తులు వేసుకున్న అమ్మాయి మంచిది, ఆధునిక దుస్తులు ధరించే అమ్మాయి, పాశ్చాత్యీకరణం చెందినట్టు కాబట్టి చెడ్డది అన్న భావనగా ప్రదర్శితమవుతుంది.

4. Cultural Amnesia and Therapeutic Catharsis

విదేశీపాలకులు ఎంతగా అధిక్యం నెరపుతారంటే, స్థానికులు తమ గతాన్ని సంస్కృతి, సంప్రదాయాలను సంపూర్ణంగా మరచిపోతారు. ఇది Cultural Amnesia. జాతీయ భావాల రచయితలు తమ సాహిత్యాన్ని ‘abreaction’ గా వాడుతారు. అంటే, బానిసత్వం వల్ల తమ గతాన్ని మరచిపోయిన ప్రజలకు రచనల ద్వారా తమ గతాన్ని జ్ఞాపకం చేసి, అప్పటి పరిస్థితులను వారు తిరిగి అనుభవించేట్టు చేయటం ద్వారా వారిలో అణచి పెట్టి ఉన్న భావోద్వేగాల ప్రక్షాళన జరుగుతుంది. తద్వారా విదేశీయులపై ఉన్న నెగటివ్ భావనలు తొలగి అవగాహన కలుగుతుంది. తమ గతం గొప్పతనాన్ని ప్రజలు గుర్తిస్తారు.

ఫానన్ వివరించిన నాలుగు దశలూ, వలస పాలన అనుభవించిన విదేశీయులకు ముఖ్యంగా నల్లవారికి అధికంగా వర్తిస్తాయి. ఎందుకంటే, వారి నాగరికతలు, విదేశీ పాలనలో సంపూర్ణంగా రూపాంతరం చెందాయి. వారి సంస్కృతి సంప్రదాయాలు మారిపోయాయి. కానీ భారతదేశం ఇందుకు భిన్నం. ఆద్యంతాలు లేనిది తమ ధర్మం అన్న నమ్మకంతో, విదేశీయుల కన్నా తాము ధార్మికంగా, తాత్వికంగా , సామాజికంగా, నాగరికంగానూ అధికులమన్న విశ్వాసంతో భారతీయ జాతీయ భావాల రచయితలు తమ కలాన్ని ఆయుధంలా వాడేరు. ఇతర వలసవాద సాహిత్యానికీ, భారతీయ సాహిత్యానికీ ఇక్కడే ప్రధానమైన తేడా వస్తుంది. ఈ తేడా, విశ్వనాధ సాహిత్యాన్ని, పాశ్చాత్య విమర్శకులు ఉత్తమ వలసవాద జాతీయ భావాల సాహిత్యంగా నిర్ధారించిన ‘చినువా అచెచే’ సాహిత్యాన్ని పైపైన పోలిస్తేనే అర్థమవుతుంది.

‘ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యానికి పిత’ లా భావించే ‘చినువా అచెబే’ నైజీరియా రచయిత. తల్లిదండ్రులు పెట్టిన పేరు అల్బర్ట్ చినువాలుమొగు అచెబే. వీరు ప్రొటెస్టెంట్ కాథలిక్కులు. ‘ఇగ్బో’ తెగకు చెందినవారు. ఎదుగుతున్న కొద్దీ అతనికి పాశ్చత్యులు ఎలా తమని సంపూర్ణంగా రూపాంతరం చెందించారో అర్థమయింది. ఆఫ్రికా గురించి పాశ్చాత్య సాహిత్యం వర్ణించిన తీరు అతనికి ఆవేదన కలిగించింది. వలస సామ్రాజ్య దృక్పథం నుంచి కాక తమను తమ  జీవితాలను స్వతంత్రమైన ‘ఇగ్బో’ దృష్టితో చూడలని ప్రకటించి తన పేరులోంచి క్రిష్టియన్ మత సూచనలను తొలగించి ‘చినువా అచెబే’ అని తమ భాష పేరుగా మార్చుకున్నాడు. పాశ్చాత్య ఆఫ్రికా నాగరికతల నడుమ ఘర్షణలో ఆఫ్రికా వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవటాన్ని ప్రదర్శిస్తూ, ఆఫ్రికా తెగలలో తమ సంస్కృతి, సంప్రదాయం దైవాల పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని పెంచేట్టు రచనలు చేయటం ఆరంభించారు.

‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ అన్న ఇతని నవల ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆప్రికా సాహిత్యాన్ని ప్రపంచ పటం మీద పెద్ద ఎత్తున నిలపటమే కాదు, ఇతర ఆఫ్రికా రచయితలకు చేయూతనిచ్చాడు చినువా. ఈ రచనలో చినువా అచెబే, క్రైస్తవ మిషనరీల ప్రవేశం తరువాత ఎలాగ, ఆఫ్రికా ప్రజలు తమ అస్తిత్వం కోల్పోయారో, ఎలాగ, వారిలో పోరాట పటిమ నశించిందో, ఎలాగ, వారి ఆత్మవిశ్వాసం, ఆత్మ న్యూనతా భావంలా మారి బానిస మనస్తత్వంగా రూపాంతరం చెందిందో, అత్యద్భుతంగా ప్రదర్శిస్తాడు.

ఇతని రచన ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ వలసవాద రాజ్యంతర రచన. కానీ వలస పాలనలో ఉంటూ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ ఒకే హృదయ స్పందన ప్రతిధ్వనుల్లా అనిపిస్తాయి.

ఇద్దరి రచనలలో, ‘విమర్శకులు వాడే పదం’ ‘civilizational grief’‘ నాగరికతా విషాదం’ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫ్రాంజ్ పానన్ సూచించిన దశలలో అచెబే  రచనలో సాంస్కృతిక విస్మృతి అధికంగా కనిపిస్తే, విశ్వనాథ రచనలో ‘అస్తిత్వ భయం’ కనిపిస్తున్నా, తన ధర్మం, నాగరికత ‘అధ్యంతాలు లేనిది’ అన్న విశ్వాసం కనిపిస్తుంది. ఇద్దరి రచనలలో పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ‘సాంస్కృతిక పతనం’, ‘నైతిక విలువల పతనం’, ‘ఆత్మవిశ్వాస రాహిత్యం’, ‘ఆత్మగౌరవ రాహిత్యం’ వంటి విషయాలు కనిపిస్తాయి. ‘అచెబే ’ రచనలో ‘అస్తిత్వ పునరుధ్ధరణ’ ఆలోచన కనిపించదు. నాయకుడు ఆత్మహత్య చేసుకుంటాడు.  విశ్వనాథ రచనలో అస్తిత్వ పునరుద్దరణ ఆలోచన కనిపిస్తుంది. కానీ గతం కొత్త రూపం, అవే  మౌలిక సూత్రాలతో ధరిస్తుందన్న విశ్వాసం కనిపిస్తుంది. చినువా అచెబే , విశ్వనాథ రచనలలో ‘భావోద్వేగ విముక్తి’ కనిపించినా, నూతన మానవ ఆవిష్కారం అన్న ఆశాభావం విశ్వనాథ రచనలోనే కనిపిస్తుంది. ఈ పైపై పోలికలతోనే,  విశ్వనాథ రచనలను అర్థం చేసుకోవటానికి పాశ్చాత్య విమర్శన సూత్రాలు సరిపోవు అన్న నిజం స్పష్టమవుతుంది.

ప్రపంచంలో విదేశీ పాలనలోకి వచ్చిన నాగరికతలన్నీ అస్తిత్వాన్ని కోల్పోయాయి. భారతీయ నాగరికత మాత్రం రెండు మార్లు, రెండు విభిన్న నాగరికతల పాలనను అనుభవించి,  తురకల భీభత్స దాడులు, రాక్షస పాలనల నుంచి తేరుకుని ఎదురు దాడి చేసి విముక్తి పొంది తన అస్తిత్వాన్ని సంపూర్ణంగా నిలుపుకునే లోగా, ఇంకో అతి తెలివైన యూరోపియన్ల పాలనను అనుభవించాల్సి వచ్చింది. అంటే, పాత గాయాలు పూర్తిగా మానేలోగా కొత్త గాయాలయ్యాయన్న మాట. తురకల కరుకు కత్తుల పాలన ఎంతటి క్రూరమైనదైనా ‘జిజియా పన్ను’ కడితే, కొన్ని నిబంధనలకు లోబడి తమ ధర్మాన్ని పాటించుకునే వీలుండేది. వారు, భారతీయులను ఉద్ధరించాలన్న తపన ప్రదర్శించలేదు. కానీ, బ్రిటిష్‌వారు తమ ఆధిక్యతను నిరూపించుకుని, తాము నాగరికులు, భారతీయులు అనాగరికులుగా భావించి,  అనాగరిక భారతీయులను ఉద్ధరించాలన్న తపన ప్రదర్శించారు. భారతీయుల సంప్రదాయాలు, పద్ధతులు అనాగరికం అని నిరూపించి, భారతీయులలో న్యూనతా భావం కలిగించి, వారిని సంస్కరించే నెపం మీద వారిలో నేర భావన కలిగించటం  ద్వారా, సమాజంలో విద్వేషాలు సృష్టించి సమాజాన్ని బలహీనం చేయాలని ప్రయత్నించారు. వీటన్నిటినీ తట్టుకుని భారతీయ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ‘సజీవం’గా నిలచి ఉన్నాయి. ఈ ‘విశ్వాసం’ ఈ ‘ఆత్మాభిమానం’ ‘ఆత్మగౌరవం’ నుంచి వచ్చిన రచనలు విశ్వనాథవి. పైగా, ఇతర వలస రచనలకు భిన్నంగా, సజీవంగా ఉన్న భారతీయ వాఙ్మయ సిద్ధాంతాలు, సూత్రాల ఆధారంగా సృజితమయినవి విశ్వనాథ రచనలు. కాబట్టి పాశ్చాత్య మానసిక శాస్త్ర సిద్దాంతాలు, రచన సూత్రాలు విశ్వనాథ రచనలకు  మాత్రమే కాదు, ఆ కాలంలో జాతీయ భావనల ప్రదర్శనను ఒక ఉద్యమంలా చేపట్టిన ఏ రచయిత రచనకు కూడా సరిపోవు.

గమనిస్తే, చినువా అబెచే, గుగి వా థియోంగో రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. ఈ అనువాదాలు చేసి, వాటిని గొప్ప రచనలు అని పొగిడే వారు విశ్వనాథను విమర్శిస్తారు.

చినువా అచెబె రచనల్లో ప్రధానంగా కనిపించేది పాశ్చాత్య సంస్కృతికి, స్థానిక ఆఫ్రికన్ సంస్కృతి, ఇక్కడ ‘ఇగ్బో’ సంస్కృతికి నడుమ ఘర్షణ, విదేశీయులు తమ అస్తిత్వాన్ని హరించి తమను అనాగరికుల్లా చిత్రించేకన్నాముందు, ఆఫ్రికాలో అత్యద్భుతమయిన సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవస్థలు ఉండేవనీ, విదేశీయులు వీటిని ధ్వంసం చేశారనీ నిరూపించటం. అంటే, ఆఫ్రికన్ల కథలను ఆఫ్రికన్ల దృక్కోణంలోనే చెప్పాలన్నది చినువా అచెబే అడుగడుగునా నొక్కి చెప్తాడు.

న్గూగీ వాన్ థియోంగో, రచనలలో ప్రధానంగా వలసవాదం వల్ల ధ్వంసమయిన ఆఫ్రికన్ సంస్కృతి ప్రదర్శన కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనవల్ల కీన్యా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు ఎలా నాశనమయ్యాయో చూపిస్తాడు. కీన్యా ప్రజల స్వతంత్ర పోరాటాన్ని గొప్పగా చిత్రిస్తాడు. స్వతంత్ర సాధన తరువాత వలసపాలకుల ప్రభావం కొనసాగుతూ, రాజకీయాల్లో అవినీతి ఎలా తీవ్రమై దేశాన్ని దెబ్బతీస్తున్నదో చిత్రిస్తాడు. ఇంగ్లీషులాంటి పరాయిభాష వదలి మాతృభాషలోనే రచనలు చేయాలని, సాంప్రదాయ భాషలను పునరుద్ధరించాలంటాడు. ఆఫ్రికా సాంప్రదాయ నమ్మకాలకూ, క్రిస్టియానిటీ నేర్పే విలువలకూ నడుమ ఘర్షణను చిత్రిస్తూ, ఆఫ్రికన్ల గొప్పతనాన్ని నిరూపిస్తాడు. అంటే, చినువా అచెబే కానీ, న్గూగీ వాన్ థియోంగో కానీ, ప్రధానంగా ప్రదర్శించేది, ఆఫ్రికన్ల జాతీయ భావనలు. ఆఫ్రికన్ల ఆధిక్యత.

ఆఫ్రికా రచనల్లో జాతీయ భావనలుంటే గొప్ప రచనలు. భారతీయ రచనలలో జాతీయ భావనలు ఉంటే అభివృద్ధి నిరోధిక రచనలు. ఇక్కడే అనువాదాల రాజకీయాలు గమనించాల్సి ఉంటుంది. అలెక్స్ హేలీ  ‘రూట్స్’ కానీ, అచెబే , థియోంగోల  రచనలు కానీ – మూలంలో కొట్టొచ్చినట్టు కనబడే  సంస్కృతి సంప్రదాయాలు, ధర్మం విధ్వంసం పట్ల ఆవేదన అనువాదంలో  కనబడదు. కేవలం అణచివేతలు, పీడకుడు.. పీడితుడు, అగ్రరాజ్యాల  దౌష్ట్యాలు  మాత్రమే కనబడతాయి. రసం వదలి ‘పిప్పి’ని మాత్రమే ప్రదర్శిస్తాయీ అనువాదాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక పునరుద్ధరణ వాదనకు  పేరుపొందిన రచనలు తెలుగులో ‘వామపక్ష భావాల ప్రచార రచనలు’గా అర్ధమౌతాయి. ఇది  ‘ఇజం’ అనువాదాల ‘నిజం’. ఆఫ్రికన్ రచయితల రచనలు చదువుతూంటే, విశ్వనాథ భావాలు, ఆలోచనలు, ఆఫ్రికా నేపథ్యంలో చదువుతున్నట్టుంటుంది. గమనిస్తే, విశ్వనాథ ఆఫ్రికన్ స్వతంత్ర పోరాటాన్ని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ పోరాటానికి  ఆపాదించి ‘య్యోర్హిషీఖేయ్’ అనే కథ  నీగ్రో స్వేఛ్చాకవి  గురించి  వీరందరికన్నా ముందే, ఎప్పుడో 1935లో  రాశాడు. ఆ కవి ద్వారా, ఏరకంగా విదేశీయులు ఆఫ్రికా సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని అణగద్రొక్కుతున్నారో చూపుతూ, భారతదేశ పరిస్థితిని తలపింపచేసే రీతిలో రచించాడు.

ఇక్కడే విశ్వనాథ రచనలను చదివేప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలన్నీ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ‘వేయి పడగలు’ స్వతంత్ర్యానికి పూర్వం రచించిన రచన. దానిలో విదేశీ ప్రభావాన్ని, విదేశీ ప్రభావంలో పడి అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్న భారతీయులను విమర్శించటం, హెచ్చరించటం కనిపిస్తుంది. కానీ రాజతరంగిణి నవలల రచన 1964-66 నడుమ జరిగింది. స్వతంత్రం వచ్చి రెండు దశాబ్దాలు దాటేయి. ఇప్పుడు విమర్శించేందుకు విదేశీయులు లేరు. ఇప్పుడంతా స్వదేశీ రాజ్యమే. కానీ స్వదేశీయులు, విదేశీయుల కన్నా అధికంగా ‘భారతీయ జాతీయతా వైరం’ ప్రదర్శిస్తున్నారు. స్వతంత్ర అభ్యుదయ భావాలు ప్రదర్శిస్తున్నామనుకుంటూ బానిసల కన్నా ఘోరమైన బానిస మనస్తత్వం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు విశ్వనాథ విమర్శ బయటి వారి మీద కాదు. తమవారిగా కనబడతూ తమకు అన్యాయం చేసే తమవారు కాలేకపోతున్న తమవారి మీదే విశ్వనాథ విమర్శ. ఇది పురాణవైర గ్రంథమాల నవలల్లో, నేపాళ రాజవంశ నవలల్లో, కశ్మీర రాజవంశ నవలల్లో కనిపిస్తుంది.

పాశ్చాత్య విమర్శకులు ఏర్పాటు చేసిన పోస్ట్ కొలోనియల్ సాహిత్య విమర్శ సూత్రాలు కానీ, పోస్ట్ కొలోనియల్ రైటర్స్ సైకాలజీ కానీ విశ్వనాథ రచనలను విశ్లేషించి, విమర్శించేందుకు పనికి రావు. ఈ నేపథ్యంలో రాజతరంగిణి నవలలను వలసవాద రచనలు, వలసవాద సామ్రాజ్య  వ్యతిరేక రచనలు అన్న వర్గీకరణల దృష్టిలో నుంచి కాకుండా భారతీయ సాహిత్య సృజనకే ప్రత్యేకమైన సూత్రాల ఆధారంగా విశ్లేషించాల్సి ఉంటుంది. వలసవాద రచనల సూత్రాలు ఒక స్థాయి వరకు మాత్రమే వర్తిస్తాయి. ఆ పై ఉపయోగించాల్సింది భారతీయ సాహిత్య సూత్రాలే.

(ఇంకా ఉంది)

Exit mobile version