[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
“కవి ప్రతిభలోన నుండును
కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి”
రామాయణ కల్పవృక్షం అవతారికలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది. రచన పట్ల విశ్వనాథ దృక్కోణాన్ని స్పష్టం చేస్తుంది ఈ పద్యం. కథ కన్నా రసపోషణానికి ప్రాధాన్యం విశ్వనాథ దృష్టిలో. కథ కొత్తదా? పాతదా? పాత్ర పోషణ ఏమిటి? వాతావరణాన్ని కల్పించటం అవసరమా? వంటి చర్చలు, మీమాంసలు అనవసరం. అన్నింటికన్నా ప్రాధాన్యం రస సృజన.
“ఇతర దేశ సాహిత్యములందీ బుద్దిలేదు. వారి పూర్వులు చెప్పలేదు కనుక. మన పూర్వులు చెప్పినారు గనుక మనది రససిద్ధాంతము” అంటారు విశ్వనాథ ‘కావ్యానందము’ అనే రస స్వరూప చర్చ ప్రధాన లక్ష్యంగా రచించిన గ్రంథం ‘పీఠిక’లో. అంతేకాదు, రసమీమాంస భారతీయ సాహిత్యము యొక్క ప్రథమ లక్షణము అని నిశ్చయముగా తెల్చి చెప్పారు.
‘కావ్యానందము’ గ్రంథం సాహిత్య సృజన, విమర్శల విషయంలో విశ్వనాథ వారి దృష్టిని, లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. విశ్వనాథ రచనలను చదవేందుకు, చదివి అర్థం చేసుకునేందుకు, అర్థం చేసుకుని విమర్శించేందుకు, ఆయన రచనలు చదివి ఆనందం పొందేందుకు, రసాన్ని అనుభవించి బ్రహ్మనందం పొందేందుకు సూచనలు, సూత్రాలు ‘కావ్యానందము’లో లభిస్తాయి. విశ్వనాథ ప్రకారం భారతీయ సాహిత్యంలో మూడు ప్రధాన మార్పుల వల్ల సాహిత్య స్వరూపం మారిపోయింది. ఆంగ్లేయ భాషా సంపర్కం, ప్రకృతి శాస్త్ర పరిశోధన, సామ్యవాదము. ఈ మూడు మార్పులను అర్థం చేసుకుంటే ఆధునిక తెలుగు సాహిత్య స్వరూప స్వభావాలు లు అర్ధమవుతాయి.
ఆంగ్ల భాషా సంపర్కం వల్ల భారతీయులకు వారి సాహిత్యం, వారి గ్రంథాలతో ఉన్న పరిచయం, రుచి స్వదేశీ, స్వభాషా సాహిత్యాలతో లేకపోవటం మన సాహిత్యం తెలియకపోవటం, తెలిసినా చిన్న చూపు ఏర్పడటం సంభవించింది.
ప్రకృతి శాస్త్ర పరిశోధనల వల్ల, బహిర్విషయములపై ఉన్న ఆసక్తి, అంతర విషయాలపై లేకపోవటం వల్ల బాహ్య ప్రపంచమే సర్వం అన్న నమ్మిక పెరిగిపోయింది. ఫలితంగా అంతవరకు ఉన్న ఆధ్యాత్మికము, దైవికము, అతీంద్రియము వంటివన్నీ పనికి రానివయ్యాయి. దీని వల్ల “ఈ ప్రకృతి పరిశోధనా సముత్పన్న మానవ జాతి బహుసుఖ సాధన వ్యామోహితమై మన దేశములోని పలు జనులు మన సారస్వత ప్రక్రియలందు విముఖులైనవారు అగుచున్నారు”.
విశ్వనాథ దృష్టిలో సామ్యవాదం వల్ల కలిగిన మార్పు మిగతా మార్పులన్నిటి కన్నా తీవ్రమైనది. విశ్వనాథ మాటల్లోనే చెప్పాలంటే “ఈ మార్పు కలిగించినంత సందిగ్ధావస్థ సాహిత్యములో నిదివరకు లేదు”. ఈ సందర్భంలో విశ్వనాథ, ఇప్పుడిప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతున్న సత్యాన్ని ఆ కాలంలోనే కుండ బద్దలు కొట్టి చెప్పారు. అందుకే ఇప్పటికీ విశ్వనాథ భావజాలాన్ని వ్యతిరేకించే జయద్రథ సంతతి, ఆయన పేరు తలవటానికి, వినటానికి, ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. సాహిత్యంలోని రాజకీయాలను, రాజకీయాలతో సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించారు విశ్వనాథ !
ఆ కాలంలో సామ్యవాద వామపక్ష సిద్ధాంతాన్ని స్వీకరించిన రెండు శక్తివంతమైన దేశాలు చైనా, రష్యా. “వాని శక్తి యెట్టిదనగా నెప్పుడే దేశమే దేశమును మ్రింగునో యన్నయటువంటిది. అది మ్రింగిన వెంటనే దాని లాలాజలమంటుకుని జాతులు బిగిసికొనిపోవును. అది కొండచిలువ వంటిది. ఈ మార్పు (సామ్యవాదం వల్ల సాహిత్యంలో వచ్చిన మార్పు) అట్టి పరిస్థితి కలుగుటకు ప్రతీక్ష చేయుచున్నది ఈ యుద్యమము సాహిత్యములో చెప్పుచున్ననూ ఒక ప్రతీక్ష్యా వ్యాపారము. దీని కనుబంధియైన రాజకీయ రంగములోని ప్రయత్నములు కూడ తదనుబంధ వ్యాపారములే!”
అంటే, విశ్వనాథ ప్రకారం సాహిత్యంలో మార్పులు, రాజకీయ రంగంలో మార్పుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడయితే, రాజకీయ రంగం అనుకూలంగా మారిందో, అప్పుడు జాతి జాతి సంపూర్ణంగా అస్తిత్వం కోల్పోయేట్టు చేసేందుకు సాహిత్య రంగంలో మార్పులు చేస్తూ సిద్ధంగా ఉన్నారన్న మాట. అందుకే వెంటనే ఇంకా స్పష్టంగా ఈ విషయం చెప్పారు విశ్వనాథ.
“కాని దైవమనుకూలించక యింతకు ముందు చెప్పిన యీ మహా శక్తిగల దేశములు కాని, వారి యనుయాయులుగాని వారి సిద్ధాంతములే ప్రమాణములనుకొను రాజ్యాంగవేత్తలు గాని దేశమును మార్చినచో, పురాతన కాలము నుండి వచ్చుచున్న భారతీయ సారస్వతము తన యథార్థ స్వరూపమును నిలబెట్టుకొనజాలదు.”. ఇది చదివిన వెంటనే భారతీయ సారస్వతము యథార్థ స్వరూపాన్ని నిలబెట్టుకోకపోతే ఏమౌతుంది? అన్న ప్రశ్న జనిస్తుంది. దానికీ సమాధానం ఇచ్చారు విశ్వనాథ.
ఇంతకీ భారతీయ సాహిత్య యథార్థ స్వరూప రహస్యం ఏమిటంటే ‘రసము’. రసము లేకపోతే కావ్యం లేదు. ‘రసోవైసః’. కానీ సాహిత్యంలో వచ్చిన మూడవ మార్పు వల్ల సాహిత్యం నుంచి రసం అదృశ్యం అయింది. అరస, విరస, కురస, నీరస, నో(No)రస రచనలు, రచయితలకే ప్రాధాన్యం హెచ్చింది. ఎప్పుడయితే, ఆధునిక సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, భారతదేశ సంఘాది వ్యవస్థలకు, ధర్మాది మహా సిద్ధాంతాలకు మూల భూతమైన వస్తువును కాదన్నదో, అప్పుడే సాహిత్యం లోంచి రసం వైదొలగింది. దాని స్థానాన్ని చరిత్ర, సంఘ వ్యవస్థ ఆక్రమించింది. ముఖ్యంగా, విద్యావంతులంటే భారతీయ విద్యలతో పరిచయం లేకుండా, పాశ్చాత్య విద్యలే చదివినవారు కావటంతో, విద్యావంతులకు భారతీయ విద్యల మూల రహస్యాలు తెలియకపోవటం, విదేశీ చరిత్రలు, కావ్యాలు తెలిసినట్టు, మన చరిత్ర, వాఙ్మయం గురించి తెలియకపోవటంతో సాహిత్యంలో ప్రధాన కథలు మారిపోయాయి. పురాణాలపై విశ్వాసం పోయింది. అన్ని కల్పితాలన్న వాదన మొదలయింది. దుష్టులు గొప్పవారయ్యారు. శిష్టులు దుష్టులయ్యారు. సమాజం మంచి బదులు చెడును ఆదర్శం తీసుకోవటం ప్రారంభించింది. ముఖ్యంగా “పాశ్చాత్యుడు నేర్పిన చదువు వీరి యందు (కొత్త తరాలు) మన సంప్రదాయమునందు వట్టి వైముఖ్యముకే సృష్టించ లేదు. ప్రతిక్రియా భావమును కూడ సృష్టించెను.” అంటారు విశ్వనాథ. ఈ ప్రతిక్రియా భావ దుష్ట ఫలితాలను విశ్వనాథ కాలం కన్నా ఇప్పటి కాలంలోనే మనం అధికంగా అనుభవిస్తున్నాము.
మన పురాణాలంటే గౌరవం లేదు. విశ్వాసం లేదు. రాముడు దుష్టుడు. రావణుడు, తాటికి, శూర్పణఖ వంటివారు గొప్పవారు. విశ్వాసం లేదు. రాముడి పరమభక్తురాలు, ఇప్పుడు రాముడిని ఎదిరించి నిలచి ఆటవికుల హక్కుల కోసం పోరాడే విప్లవవాది. సీత చర్చ్‌లో ఉంటే రాముడు బయట చెమటలు కక్కుతూ ఎదురు చూస్తాడు. గాయత్రి మంత్రం దర్గా ముందు మోకరిల్లుతుంది, మైరావణుడు క్రిష్టియన్ మతం పుచ్చుకున్న వీరప్పన్ లాంటి దేశ వ్యతిరేకతకల నక్సలైటు.. ఒకటా? రెండా? విశ్వనాథ ఆనాడు చెప్పిన ప్రతిక్రియ బహువేల ముఖాలుగా ఇంతింతై నభోవీధి నల్లంతై. సాంప్రదాయం, జాతీయం అన్నది గల్లంతై, భారతీయ వ్యతిరేకత, భారతీయ ధర్మ వ్యతిరేకత రాజకీయంగా, సాహిత్యంగా చెట్టాపట్టా లేసుకుంటూ ఎదుగుతూపోతున్నది. ఇదంతా ఎందుకంటే విశ్వనాథ ప్రకారం, ఈ రకమైన ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం వల్ల ఆధునిక సాహిత్యంలో రసం అడుగంటి ‘నేటి సాహిత్యమునకు ప్రధాన విషయము, ప్రధాన వస్తువు, ప్రధాన కథ సర్వ సమానత్వము, సంఘ సంస్కరణము’ కావటం. అంటే, రస ప్రాధాన్యము పోయి వస్తు ప్రాధాన్యము వచ్చింది. ఈ వస్తువు కూడా తమ సిద్ధాంతానికి అనుకూలంగా ఉండాలి. పీడితుడు, పీడకుడు ఉండాలి. సంప్రదాయ వ్యతిరేకత ఉండాలి. భారతీయ ధర్మం, సంఘం సర్వం లోపభూయుష్టం అని చూపాలి. “ఇది కుళ్లిన సంఘం, వయసు మళ్లిన సంఘం, దీని కీళ్లు విరిచివేయాలి. వ్రేళ్లు నరికి వేయాలి” అంటూ తాముంటున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం ప్రదర్శించాలి అదే ఉత్తమ రచన. అతడే ఉత్తమ రచయిత. మిగతాది సాహిత్యమే కాదు.
అందుకే విశ్వనాథ “నేటి సాహిత్యము చాల వరకీ మార్గమున బ్రోవుచున్నది.. వస్తువారీతిగా చెడినది. కథ యింకొక రీతిగా చెడినది. ఔచిత్యమింకొక పద్ధతిగా చెడినది” అన్నారు. మనోభావాలు, కామక్రోధాదుల లక్షణాలు, దేశాచారాలు తెలిసికొని వ్రాయటం ఔచిత్యం. ఔచిత్యం లేకుండా రసం పుట్టదు. రసవిహీనమైనది ఎట్టి పరిస్థితులలో సాహిత్యం కాదు.
“పూర్వులైన మహానుభావుల చేత కావ్యము నందు ప్రధానమైనది రసమని చెప్పబడగా, ఆ రస సాధనకు లోకము నుండి మానవ జీవితమును దీసికొనవలసి యుండగా నా జీవితము వేయి విధముల మారుచుండగా యిందులో ఏది రస దృష్టి చేత స్వీకరింపబడవలెను, ఏది స్వీకరింప రాదు, అన్న వివేచన పోయి, రసమన్న మాట ఎగిరిపోయి, కావ్యము జీవితము యొక్క ప్రతిబింబమన్న మాటకు ప్రాచుర్యము వచ్చి సాహిత్యము విడంచించుచున్నది” అని తీర్మానిస్తారు విశ్వనాథ.
రసముత్పన్నం చేసేందుకు వస్తవును, శైలిని, వర్ణనను, ఔచిత్యాన్ని, ధ్వనిని ఎలా వాడేరు అన్నది చర్చించాల్సి ఉంటుంది. ఒక వైపు ఈ విషయాలు పరిశీలిస్తూ, మరో వైపు ఆయన కథలను ఎన్నుకున్న విధానం, పాత్రల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన విధానం, సంఘటనలను సృష్టించి కల్పించి పోషించిన విధానాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. మరో వైపు కథను ఎన్నుకోవటం, వెనుక విశ్వనాథ ఆశించిన ప్రయోజనం ఎలా నెరవేరుతోంది? ఆయన చేసిన కల్పనలు ఊహలు ఏ రకంగా ఆయన సాధించాలనుకున్న లక్షణాన్ని ఉద్దీపింప చేస్తున్నాయి వంటి విషయాలను కూడా పరీక్షించాల్సి ఉంటుంది. అంటే, విశ్వనాథ రచనలు చదివేప్పుడు, ఇతర రచయితల రచనలు చదివేప్పటి మానసిక స్థితికి భిన్నమైన మానసిక స్థితి అవసరం అన్నమాట. మామూలు రచనలు చదివినట్టు చదివితే విశ్వనాథ కొరుకుడు పడడు. అర్థం కాదు. అజీర్ణమవుతుంది. వాంతి అవుతుంది. అందుకే విశ్వనాథ విషయం వచ్చేసరికి, ఇతరత్రా తెలివిగానే ఉండేవారు కూడా “Constipation of mind and diarrhoea of mouth” ను ప్రదర్శిస్తూంటారు.
‘కావ్యానందం’ గ్రంథం రాసే సమయానికి (1972) విశ్వనాథ ప్రధానమైన రచనలన్నీ చేసేశారు. ‘కావ్యానందం’ ప్రధమ ముద్రణ 1972లో జరిగింది. ఆ తరవాత ఆయన నాలుగేళ్లలో కేదారగౌళ, శివార్చనము, గోలోకవాసి, నారాయణుడు వంటి పద్యకావ్యాలు రచించారు. కల్పవృక్ష రహస్యములు, విశ్వనాథ సాహిత్యోపన్యాసములు వెలువడ్డాయి. పురాణ వైరగ్రంథమాల, రాజతరంగిణి నవలలు, నేపాళ రాజవంశ నవలలు అంతకు ముందే రాశారు. ‘కావ్యానందం’లో విశ్వనాథ వెలిబుచ్చిన అభిప్రాయాలు లక్ష్యాలు, లక్షణాల ఆధారంగా, ప్రథమంగా కశ్మీర రాజవంశావళి నవలలను విశ్లేషించటాని వచ్చే వారం నుంచీ “జై శ్రీగణేశ్” అందాము.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
