Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-4

[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఒక రచయిత తాను చెప్పాల్సిన కథాంశాన్ని ఎన్నుకోవటంలో రచయిత దృక్పథం, ఆలోచనా విధానం, లక్ష్యం, రచయిత వ్యక్తిత్వం వంటి విషయాలు తెలుస్తాయి. మామూలు సాంఘిక కథల ద్వారానే ఇన్ని విషయాలు గ్రహించే వీలున్నప్పుడు చరిత్ర ఆధారిత కాల్పనిక  రచనల ద్వారా ఇంకా ఎన్నో విషయాలను గ్రహించే వీలుంటుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే చరిత్ర ఆధారిత కాల్పనిక రచన అంటే, చరిత్ర  పరిశోధకులు నిర్ధారించిన చరిత్ర ఆధారంగా పూర్తిగానో, కొద్దిగానో కల్పన జోడించి సృజించే రచన. చరిత్ర రచనలో ప్రధానంగా రచయిత తాను ఎంచుకున్న కథ కాలానికి సంబంధించిన వర్ణనలు, సాంఘిక, రాజకీయ, ధార్మిక, ఆర్థిక వివరాలు ఉంటాయి. చారిత్రక ప్రాధాన్యం కల పాత్రలుంటాయి. అంటే, చరిత్ర ప్రకారం నిర్ధారితమైన వ్యక్తులు ఉంటారు కథలలో. వీరి చుట్టూ కల్పిత పాత్రలుండవచ్చు. చరిత్రలో నిర్ధారితమైన సంఘటనల చుట్టూ కాల్పనిక సంఘటనలు అల్లవచ్చు. అయితే ఈ కాల్పనిక సంఘటనలు, పాత్రలు చరిత్ర పరిశోధకులు నిర్ణయించిన కాల పరిమితిలో ఒదిగి, వారు నిర్ధారించిన సంఘటనల స్వరూపాన్ని మార్చకుండా, దాని చుట్టూ  కల్పనలు చేయవచ్చు.

చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు:

చరిత్ర ఆధారిత కాల్పనిక  రచనలు పలు రకాలుగా చేయవచ్చు. నిజమైన సంఘటనలను కల్పిత పాత్రలతో చెప్పవచ్చు. అలాగే చరిత్రలో ఉన్నట్టు నిర్ధారితమైన వ్యక్తుల గురించి కాల్పనిక సంఘటనలు, కథల ద్వారా చెప్పవచ్చు. నిర్ధారితమైన సంఘటనలను మరింత నాటకీయంగా, సంభాషణలను సృష్టించి, మనోభావాలను, సంవేదనలును ప్రకటిస్తూ రచించవచ్చు.

ఉదాహరణకు, ఒక రాజు ఫలానా కాలంలో రాజ్యం చేశాడు. అతడు ఫలానా రాజుపై యుద్ధం చేసి విజయం సాధించాడు అని చరిత్ర పరిశోధకులు తీర్మానించారు.  చరిత్ర ఆధారిత కాల్పనిక  రచన చేయాలనుకున్న రచయిత ఈ రెండు వాక్యాల సమాచారంతో రెండు వేల పేజీల నవల రాయవచ్చు. ఇందు కోసం రచయిత ఎంతో పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఆ రాజు ఏ కాలం నాటి వాడో, ఏ సంవత్సరానికి చెందినవాడో చరిత్ర పరిశోధకులు ఎలాగో చెప్పారు. దాని ఆధారంగా అతని పరిసర ప్రాంతాలలోని రాజ్యాలు, వాటి చరిత్ర, వాటితో ఈ రాజ్యానికి ఉన్న సంబంధాలు, అప్పటి సామాజిక పరిస్థితులు, మనస్తత్వాలు, సంప్రదాయాలు వంటివన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అయా రాజ్యాలలో చరిత్రలో జరిగినట్టు చెప్పిన సంఘటనలను పరిశీలించాలి. వాటి ఆధారంగా, మనం ఎంచుకున్న రాజు రాజ్యంలో పరిస్థితులను ఊహించాలి. వ్యక్తిత్వాలను ఏర్పాటు చేయాలి. ఆ పై మన రాజు పొరుగు రాజ్యంపై దండయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో, అప్పటి పరిస్థితుల ఆధారంగా ఊహించాలి. ఇక యుద్ధం, కుట్రలు, కుతంత్రాలు వంటివాటిని సృష్టించాలి. అనేక పాత్రలను సృష్టించాలి. ఓ ప్రేమ కథను జొప్పించాలి. ఇదంతా తర్కబద్ధంగా, ఔచితీమంతంగా, చదివే పాఠకుడికి ఇదంతా సృష్టించినది, కల్పన అన్న భావన ఎక్కడా రాకుండా, అంతా నిజంగా జరిగిందన్న భ్రమను కలిగిస్తూ రచనను సృజించాల్సి ఉంటుంది. ఈ సృజనలో ఎక్కడ ఔచిత్యం భంగం అయినా, ఎక్కడ లాజిక్ చెడినా రచన పాఠకులను ఆకట్టుకోలేదు.

సైన్స్ ఫిక్షన్ – హిస్టారికల్ ఫిక్షన్:

‘సైన్స్ ఫిక్షన్’ రచనలలో ఎలాగయితే, మనకు పరిచయం లేని గ్రహాలను, నక్షత్రాలను, పరిచయం లేని లోకాలను రచయిత తన ఊహాశక్తితో పాఠకుడికి అంతా ‘నిజం’ అనిపించేలా చేరువ చేరుస్తాడో, చరిత్ర ఆధారిత కాల్పనిక  రచయిత కూడా మనకు తెలియని మన గతాన్ని మన కళ్ల ముందు సజీవంగా నిలుపుతాడు. ఈ రెండు ప్రక్రియలూ చాలా కష్టమైనవి. ఎంతో శ్రమ పడాలి రచయిత. పరిశోధనతో పాటు, ఊహా శక్తి అపరిమితంగా అవసరం. అయితే సైన్స్ ఫిక్షన్ రచయితకు, చరిత్ర ఆధారిత కాల్పనిక  రచనల రచయితకు లేని ఒక వెసులుబాటు ఉంటుంది. ‘సైన్స్ ఫిక్షన్’ రచయిత రాసేది ఇతర గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతల గురించి, భవిష్యత్తు గురించి, దాంతో అతను విజ్ఞానశాస్త్ర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఊహించే వీలుంటుంది. జరగబోయే విషయాల గురించి రాస్తాడు సైన్స్ ఫిక్షన్ రచయిత. పాఠకుడికి ఏ మాత్రం పరిచయం లేని అంశాల గురించి రాస్తాడు. కాబట్టి సృజనకు పరిమితులుండవు. తన ఊహను విశృంఖలంగా విహారం చేయించవచ్చు. ‘హిస్టారికల్ ఫిక్షన్’ రచయితకు ఆ వెసులుబాటు ఉండదు.

హిస్టారికల్ ఫిక్షన్ రచయిత, ఒక నిర్ధారిత చరిత్ర చట్రంలో ఒదిగి సృజించాల్సి ఉంటుంది. అతని కల్పనలు, ఊహలు, సంఘటనల సృష్టీకరణ, పాత్రల వ్యక్తిత్వ రూపకల్పనలన్నీ చరిత్ర నిర్ధారిత సత్యం పరిధిలో ఒదిగి ఉండాల్సిందే. ‘ఫలానా రాజు ఫలానా కాలంలో ఫలానా రాజుతో యుద్ధం చేస్తూ మరణించాడు’ అని చరిత్ర పరిశోధకులు నిర్ధారిస్తే, రచయిత ఎన్నెన్ని కల్పనలు చేసినా, ఎంతెంత ఊహలు చేసినా, ఫలానా రాజును ఫలానా రాజు యుద్ధంలో చంపాల్సిందే. మనకు చచ్చిన రాజుపై ఎంత సానుభూతి ఉన్నా, ప్రేమ ఉన్నా, ఆ రాజు ఇంకో రాజు చేతిలో చావాల్సిందే. అంటే చరిత్ర ఆధారిత కల్పిత రచనలు చేసే రచయిత కనక ఊహను, సృజనను ఎంత విశృంఖల విహారం చేయించినా, నిరూపిత చరిత్ర అన్న బరువుకు లోబడి ఉండాల్సిందే అతని సృజన. అంటే చరిత్ర పరిశోధకులు నిర్ధారించిన సత్యాన్ని మార్చకుండా, ఎన్నెన్ని కల్పనలు చేయాలనుకుంటే అన్ని చేయవచ్చు. ఇది చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసే రచయితలకు ‘లక్ష్మణ రేఖ’.

చరిత్ర ఆధారిత కాల్పనిక రచనల వర్గీకరణ:

చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలలో పలు రకాలున్నాయి. నిజానికి హిస్టారికల్ ఫిక్షన్ రచనలలో పలు వర్గీకరణలున్నా, ప్రధానంగా పన్నెండు రకాలను అధికంగా వాడతారు.

‘బయోగ్రఫికల్ ఫిక్షన్’:

ఇవి చరిత్ర పురుషుల జీవిత గాథల రచనలు. శివాజీ చరిత్ర, మాలిక్ కాఫర్, అక్బర్, నారాయణ భట్టు, మల్లారెడ్డి, రుద్రమదేవి… ఇలా వ్యక్తి ప్రాధాన్యం కల రచనలు.

‘హిస్టారికల్ రొమాన్స్’:

చరిత్ర నేపథ్యంలో చెప్పే శృంగార, ప్రేమ గాథలివి. అక్బర్-అనార్కలి, పృథ్వీరాజ్-సంయుక్త, శ్రీకృష్ణదేవరాయలు – చిన్నాదేవి.. ఇలా నిజమైన గాథలు, కల్పిత గాథలు ఏవైనా, చరిత్ర నేపథ్యం ఉండాలి. ‘మల్లీశ్వరి’ సినిమా కూడా హిస్టారికల్ రొమాన్స్ క్రిందకే వస్తుంది. కానీ ఆ ప్రేమ కథ పూర్తిగా కల్పితం.

‘హిస్టారికల్ మిస్టరీ, క్రైమ్’:

చరిత్ర నేపథ్యంలో చెప్పే క్రైమ్, మిస్టరీ గాథలు ఇవి. హిట్లర్ మరణించాడు. అతడి శవం దొరకలేదు. ఈ రహస్యం ఛేదించాలని చేసే పరిశోధన ఒక హిస్టారికల్ మిస్టరీ నవల అవుతుంది. చరిత్ర ఆధారంగా డిటెక్టివ్ రచనలూ చేయవచ్చు.

‘అల్టర్నేట్ హిస్టరీ’:

ఇవి ప్రత్యామ్నాయ చరిత్ర రచనలన్న మాట. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్‍పై ఎన్నో హత్య ప్రయత్నాలు జరిగాయి. అవి విఫలమయ్యాయి. దాన్లో ఒక ప్రయత్నంలో  హిట్లర్ చచ్చిపోయి ఉంటే, చరిత్ర గతి ఎలా ఉండేది? ఇలా ఊహించి, అసలైన చరిత్రకు ప్రత్యామ్నాయ చరిత్రను ఊహించి రాయటం అన్న మాట. పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరిని 18 సార్లు చంపకుండా వదిలాడు. దానికి బదులు 16వ సారో, 15వ సారో విసుగొచ్చి ఘోరీని చంపేసి ఉంటే? మరాఠాలు, నిజామ్ బ్రిటీష్ వారితో చేతులు కలిపి టిప్పును దెబ్బతీశారు. దీని బదులు, టిప్పు ఆహ్వానాన్ని అందుకుని మరాఠా, నిజామ్‍లు టిప్పుతో చేయి కలిపి బ్రిటిష్‌వారితో పోరాడి ఓడించి ఉంటే? 25 యుద్ధాలు గెలిచిన హేమచంద్ర, 26వ యుద్ధంలో ఎటో పోతున్న బాణం దారిలోకి రాకుండా ఉండి  అక్బర్‌ను ఓడించి ఉంటే? ఢిల్లీలో నెల రోజుల కోసం కాకుండా కొన్నేళ్లు ఆయన రాజ్యం చేసి ఢిల్లీ కోటపై భగవద్వజం ఎగరేసి  ఉంటే? ఇది ఊహించి రాయటం ప్రత్యామ్నాయ చరిత్ర రచన.

‘హిస్టారిల్ ఫాంటసీ’:

హిస్టారికల్ ఫాంటసీ రచనలో రచయిత ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మ్యాజిక్, జానపద గాథలు, మాయా మంత్ర తంత్రాలు, టక్కు టమార విద్యలు అన్నిటినీ చరిత్రలో నిజంగా జరిగిన సంఘటనలతో మిళితం చేసి పాఠకుడు నిజమని నమ్మే రీతిలో రచించాల్సి ఉంటుంది. ఎక్కడ అనౌచిత్యంగా అనిపించినా, లాజిక్ కుదరకున్నా పాఠకుడు విముఖడయిపోతాడు. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ ఇలాంటి ‘హిస్టారికల్ ఫాంటసీ’ రచనల ప్రయోగాలు అధికంగా,  అద్భుతంగా చేశాడు. ‘పులి మ్రుగ్గు’ ఇందుకు చక్కటి ఉదాహరణ. ‘హిస్టారికల్ ఫిక్షన్’ అనే ఒక రచనా ప్రక్రియ ఉన్నదని తెలియని వారు, ఏ మాత్రం అధ్యయనం లేకుండా, తమతో పాటే తెలుగు సాహిత్యం పుట్టిందన్న భ్రమలో కూపస్థమండూకాల్లా జీవిస్తూ, తెలియని విషయాల గురించి అంతా తెలిసినట్టు వ్యాఖ్యలు చేసి కాలర్లెగరేసేవారు.. ఇలాంటి రచనలను చరిత్ర రచనలు కావని ప్రకటించేసి  ‘విశ్వనాథను విమర్శించేశా’మని విర్రవీగుతారు. తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నామన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి ఉండదు.

‘మల్టీ పీరియడ్ సాగాస్’:

అంటే కొన్ని తరాల గాథలు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ కుటుంబం, వంశానికి సంబంధించిన గాథలను చెప్పే రచనలు. రఘువంశం ఇందుకు చక్కటి ఉదాహరణ. మొత్తం రఘువంశానికి చెందిన రాజుల చరిత్రను కావ్య రూపంలో చెప్తుంది. కాబట్టి, చరిత్ర రచనలో ‘రఘవంశాన్ని’ ‘మల్టీ పీరియడ్ సాగా’ గానో ‘మల్టీ పీరియడ్ ఎపిక్’ గానో పరిగణించవచ్చు. ఇటువంటి రచనలు తెలుగులో గద్య రచన రూపంలో చేశాడు విశ్వనాథ.

ఇంకా విదేశీయులు పైరేట్ ఫిక్షన్, గోథిక్ హిస్టారికల్ ఫిక్షన్ వంటి ప్రక్రియలలో కూడా రచనలు చేస్తారు. పైరేట్ ఫిక్షన్ అంటే సముద్రపు దొంగల ఆధారంగా రచించే రచనలు. వారికి సముద్రపు దొంగలున్నారు. వారికి  వారు హీరోలు. కాబట్టి ఆ వర్గీకరణ ఉంది వారికి. అలాగే అమెరికా చరిత్ర ఆధారంగా రచించిన  రచనలను ‘వెస్టర్న్ హిస్టారికల్’ రచనలంటారు. అమెరికా స్థానికులు రెడిండియన్లు. వారికీ అమెరికాకు వలస వచ్చిన వారికీ నడుమ చారిత్రకంగా జరిగిన పోరాటాల నేపథ్యంలో రచించే చరిత్ర రచనలు ఈ కోవకు చెందుతాయి. జేమ్స్ ఫెన్నిమోర్ కూపర్ రచనలు ఈ వర్గీకరణకు చెందుతాయి. ఈ రెండు వర్గీకరణలు అమెరికా రచయితలకు ప్రత్యేకమైనవి.

మరో ప్రక్రియ గోథిక్ ఫిక్షన్. చరిత్ర నేపథ్యంలో దయ్యాలు, భూతాలు, సస్పెన్స్, భయనకం అన్నిటికీ కలగలిపేది ఈ ప్రక్రియ. ఈ ప్రక్రియకు ఒక ఉదాహరణ టోనీ మారిసన్ రచించిన ‘బిలవెడ్’. గత చరిత్రను వర్తమానాన్ని ప్రతీకాత్మకంగా ఒళ్లు గగుర్పొడిచేలా ప్రదర్శించే గోథిక్ హిస్టారికల్ ఫిక్షన్ నవల ఇది. ఇలాంటిదే మరో నవల ‘జమైకా కిన్‍సైడ్’ రాసిన ‘ఒవాన్డో’. దీన్లో కలోనియలిజం భయంకరమైన రూపును ఓ దయ్యం పాత్ర ద్వారా ప్రదర్శిస్తుంది రచయిత్రి.

ఇవి కాక ఇంకా ఎన్నో రకాల హిస్టారికల్ ఫిక్షన్ రచనలున్నాయి. తెలుగులో సమస్య ఏమిటంటే, ఒక సరైన విమర్శ వ్యవస్థ లేకపోవటం. రచయితకూ పాఠకుడికీ నడుమ వారధిలా వ్యవహరించాల్సిన విమర్శకుడు ‘ఇదే రచన’, ‘ఇలాగే రాయాలి’, ‘ఆ అంశం గురించి రాయకూడదు’, ‘అలాంటి రచనలు చేయకూడదు’ అని రచయితలపై నిబంధనలు విధించి ఓ సూపర్‌వైజర్‌లా, అధికారిలా  ప్రవర్తిస్తున్నాడు తప్ప, అధ్యయనం, పరిశోధన, అవగాహనలతో వ్యవహరించటం లేదు. దాంతో, రచయిత ‘మూస’ రచనలకు భిన్నమైన రచన (వామపక్ష ధోరణికి భిన్నమైన రచన) చేస్తే దాన్ని విశ్లేషించేవాడు, అర్థం చేసుకునేవాడు లేకపోవటమే కాదు, చివరికి ఆ రచనను రచనగా కూడా పరిగణించని  దుస్థితి నెలకొంది.

కొందరు సాహిత్య పెద్దలుగా చలామణీ అయ్యేవారు ‘అహంకారం..’తో వారు రాసేవీ, వారికి నచ్చిన వారు రాసేవే తప్ప, ఇతరులు రాసినవి రచనలు కాదు, అది సాహిత్యం కాదు అని తీర్మానం చేస్తుంటారు.  తమకున్న మిడిమిడి జ్ఞానం వల్ల కలిగిన అపరిమిత అహంకారంతో చివరికి విశ్వనాథ చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలను “substandard” రచనలని ప్రకటించి గొప్పగా భావించుకుంటారు. కానీ వాళ్ళ  standard బయటపెట్టుకుంతున్నారన్న గ్రహింపు ఇసుమంతకూడా కలగదు వాళ్ళకు.  ఇలాంటి వారి వల్ల ప్రపంచ సాహిత్యంతో –  ఏ మాత్రం తీసిపోకుండా ఉత్తమ స్థాయిలోని రచనలను మనమే గుర్తించకుండా, గుర్తించినా తక్కువ చేసి తీసిపారేస్తున్నాం. ఫలితంగా మన సాహిత్యం పీడితుడూ, పీడకుడు, కులం, అణచివేతలు, అన్యాయాలు,  అక్రమ  ఉద్యమాల ‘ఊబి’లో కూరుకుపోయింది. అరస, విరస, కురస, నీరస, నోరస రచనలే తెలుగు సాహిత్యంగా చలామణీకి వస్తున్నది.

పైన మనం ప్రస్తావించుకున్న విదేశీయులకే ప్రత్యేకమైన రెండు ప్రక్రియలు తప్ప మిగతా అన్ని ప్రక్రియలలో విశ్వనాథ చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలను అత్యద్భుతమైన స్థాయిలో రచించాడు. ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు పాశ్చాత్య విమర్శకులకూ తెలియవు. ఎలాగయితే విదేశీ సాహిత్యానికి ప్రత్యేకమైన వర్గీకరణలున్నాయో, విశ్వనాథ సాహిత్యనికీ అలా ప్రత్యేకమైన వర్గీకరణలను మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version