[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
విశ్వనాథ చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు స్పృజించటంలో ఆయన ఉద్దేశ్యాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయన దృక్పథం గ్రహించిన తరువాత ఆయన రచించిన చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలను పరిశీలించాల్సిన దృక్కోణం కూడా సులభంగా బోధపడుతుంది.
‘కావ్యానందం’ రచనలో పాశ్చాత్యులు మన చరిత్రను రచించిన విధానం గురించి విశ్వనాథ అభిప్రాయం తెలుస్తుంది.
(పాశ్చాత్యులు) “ఇక్కడకు వచ్చిరి. కాలగతి చేతనీ దేశము నాక్రమించిరి. వారనుకోనట్లు భారతదేశమున రాజ్యములు ధర్మములు మొదలైనవి సమృద్ధిగా వ్యాపించి యున్నవి. తక్కిన దేశముల వలె దీనిని ధ్వంసము చేయుటకు వీలు లేకపోయినది. కుత్సితమైన రాజనీతి చేత దేశము నాక్రమించిరి. కాలమనుకూలించినది. ఇచ్చటి నాగరికతను చూచి వారిలో చాల మందికి కన్నుకుట్టినది. ఈ వ్యవస్థను తల్లక్రిందులు చేసినగాని తమ రాజ్యము సాగదనిపించినది.”
పాశ్చాత్య పాలకులు భారతదేశ వ్యవస్థను ‘తల్లక్రిందులు’ చేయాలని కంకణం కట్టుకోవటం వెనుక ఉన్న మనస్తత్వం గురించి విశ్వనాథ అభిప్రాయం ఇది.
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే కూడా ఇది కనిపిస్తుంది. ఒక జాతి మరో జాతిపై అధికారం సాధిస్తుంది. తమ అధికారం సుస్థిరం చేసుకోవాలంటే, తాను గెలిచిన జాతి తనకు విధేయంగా ఉండాలంటే, తాను గెలిచిన జాతికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండకూడదు. తాను గెలిచిన జాతి, తనకన్నా ఆధిక్య భావనను కలిగి ఉండకూడదు. ఓడిన జాతి గెలిచిన జాతి ఆధిక్యాన్ని ఆమోదించాలి. అప్పడే ఓడిన జాతి తన అస్తిత్వాన్ని సంపూర్ణంగా మరచి గెలిచిన జాతి అస్తిత్వాన్ని స్వీకరిస్తుంది. తనను తాను సంపూర్ణంగా రూపాంతరం చెందించుకుంటుంది. ఇది జరగనంత వరకు గెలిచిన జాతి గెలుపు సంపూర్ణం కాదు. భౌతికంగా గెలిచిన గెలుపు అసలైన గెలుపు కాదు. మానసికంగా ఆధిక్యం సాధించటంలోనే అసలైన గెలుపు దాగి ఉంటుంది.
ప్రపంచ చరిత్రలో ఏ నాగరితను పరిశీలించినా ఈ రాజకీయ, మానసిక, సాంస్కృతిక, ధార్మిక ఆధిక్య భావనను గెలిచిన జాతి సాధిస్తేనే వారివిజయం సంపూర్ణమయి కనిపిస్తుంది. ఒక జాతి మరో జాతిని – తన గతం, తన సంస్కృతి, తన దైవాలను మరపింపజేసినప్పుడే దీర్ఘకాలం అధికారం చలాయించగలగటం కనిపిస్తుంది. ప్రపంచ చరిత్ర మొత్తం ‘పరపీడన పరాయణత్వం’. ఈ పరపీడన కేవలం ‘ఆర్థికం’ మాత్రమే కాదు. అన్ని రంగాలలో అన్ని రకాలుగా, ముఖ్యంగా ధార్మికంగా సాగే ‘పీడన’. ఆర్ధిక పీడనను తట్టుకుని నిలబడవచ్చు . కానీ, ధార్మికంగా జరిగే మార్పు శాశ్వతం. మళ్ళీ ఆ జాతి తన పాత ధర్మాన్ని ఎన్నటికీ నిలుపుకోలేదు. ఒక్క భారతీయ ధర్మం తప్ప ప్రపంచవ్యాప్తంగా ఇతర ధర్మాలన్నీ, ఈ పరపీడన వల్ల తమ అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి అయిపోయాయి. ఇలా ఒక నాగరికతపై మరో నాగరికత సాగించిన పీడనను అధ్యయనం చేసేది మానవ శాస్త్రము (Anthropology). ఈ శాస్త్రం అటు చరిత్రను, ఇటు మానవ జీవనాన్ని పరిశీలించి, ఒక విజేత నాగరికత, పరాజితుడిని రూపాంతరం చెందించేందుకు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని తీర్మానించింది. అవి:
Military and Legal coercion – సైనికపరంగా, చట్టపరంగా ఒత్తిడి తేవటం.
ఈ అంశంలో స్థానికుల నాయకత్వాన్ని, వ్యవస్థలను కూలద్రోసి వాటి స్థానంలో విజేత రాజకీయ, న్యాయ వ్యవస్థను ప్రతిష్టించటం ఉంటింది.
సామాన్యుడు రక్షణ కోసం, తమ సమస్యలు తీరటం కోసం నాయకత్వం వైపు చూస్తాడు. ఎప్పుడైతే ఈ నాయకత్వం విజేత చేతిలో ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా విదేశీ వ్యవస్థను పాటించక తప్పదు. తద్వారా, తన మూలాలను, వ్యవస్థను వదలక తప్పదు. రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థ. ఇది కూడా విదేశీ వ్యవస్థ అయితే, పాలనకు, సమస్యా పరిష్కారాలకు విదేశీ వ్యవస్థపై ఆధారక పడకతప్పదు. న్యాయం పొందాలంటే, విదేశీయులు చెప్పినట్టు చేయకతప్పదు.
సాంస్కృతిక, విద్యారంగాల నియంత్రణ:
దీన్ని Cultural and Educational Assimilation అంటారు. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. విద్యా బోధన పద్ధతులు, విద్యా బోధనాంశాలను మార్పు చేయటం వల్ల, సంస్కృతి, సంప్రదాయాల పట్ల చులకన భావాన్నీ, విముఖతను కలిగించటం వల్ల, తమదన్నదాన్ని అసహ్యించుకుని ఉత్తమము, ఉన్నతము గా భావించి పాలకుల పద్ధతులకు స్వీకరించేట్టు చేయటం. ఇది దీర్ఘకాలికం. ఎందుకంటే, ఈనాడు నాటిన విత్తనం ఎదిగి పెద్దగయి తరతరాలను ప్రభావితం చేస్తుంది. కొన్నాళ్లకు పాత విద్యనూ, సంస్కృతి సంప్రదాయాలను తరాలు సంపూర్ణంగా మరచిపోతాయి. రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో మార్పుల కన్నా అత్యంత ప్రభావం చూపేది, శక్తివంతమైనది ఈ మార్పు. తరాలకు తమ పట్ల తమకే న్యూనతా భావం కలిగించటం ద్వారా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లేక పరాయివారిని విశ్వసించి, వారిని అనుకరించే ‘జాతి’ని తయారు చేయవచ్చు. ఇది పద్ధతి ప్రకారం, బాల్యం నుంచి విషాన్ని అలవాటు చేయటం వల్ల ‘విషకన్య’ లను తయారు చేయటం లాంటింది. అందుకే తన ఆత్మకథలో విశ్వనాథ “ఈ దేశములో బ్రిటీషువాడు నాటిన బహు విషవృక్షములలో విద్యావిధాన విష వృక్షమొకటి. ఆ ముషిణి పండ్లు తినుటకు కలవాటు పడిన జాతి తినుచున్నది.. బ్రతుకుచున్నది. విషములో పుట్టిన పురుగు విషము తినియే బ్రతుకును” అన్నాడు.
ఇలా విద్యా విధానాన్ని విజేత తనకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల స్థానికులు తమ ప్రత్యేక భాషను కోల్పోతారు. సంస్కృతిని, సంప్రదాయాలను, ఆలోచనలను, తెలివిని.. సర్వం కోల్పోతారు. ఇదొక రకమైన బ్రెయిన్ వాష్, బ్రెయిన్ కంట్రోల్ లాంటి దన్నమాట. అంటే, భవిష్యత్తులో విదేశీ పాలకుడు దేశం వదలిపోయినా పరాయి పాలకులు ఏర్పాటు చేసిన విద్యావిధానం మారేంతవరకూ జాతి నరనరాన వారు నాటిన ‘విషం’ ప్రవహిస్తునే ఉంటుందన్న మాట.
మత మార్పిడి లేక Religious Convention:
విద్య విషయం కన్నా అధిక శక్తివంతమైన అంశం ఇది. ‘మత మార్పిడి’ అన్నది కేవలం ‘దైవం’ మార్పిడి కాదు. ఒక నాగరికతను సంపూర్ణంగా రూపాంతరం చెందించటం. గత జన్మతో సంబంధం లేని నూతన జన్మను పొందటం లాంటింది. ‘మత మార్పిడి’ వల్ల కేవలం తాను చెప్పినట్టు విని విధేయంగా ఉండేవాడిని తయారు చేయటమే కాదు, తనకు ‘ప్రతిరూపం’, ‘క్లోన్’ లను తయరు చేయటం లాంటిది. తాను లేకున్నా, తనలాగే ప్రవర్తించి, ఆలోచించి, వ్యవహరించే తరాలను తయారు చేయటం.
నాలుగవ అంశం, స్థానిక ఆర్థిక వ్యవస్థను నిర్మూలించి తమ ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేయటం, తమ వ్యవస్థను పాటించిన వారికి ఆర్థిక లాభాలు అందిచటం. దీన్ని Economic integration and incentivization అంటారు. ఇది అర్థం చేసుకోవటం సులభం. ఎవరికివారు స్వతంత్రంగా జీవించే వ్యవస్థను నిర్మూలించి, అందరూ ప్రభుత్వంపై ఆధారపడి జీవించే వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వం ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాడికి జీవిక లభించదు. వాడికి సహాయం చేసే నెపం తోనో, ఉద్ధరించే నెపంతోనో, వాడి జీవికకు ప్రభుత్వం వాడిని దూరం చేస్తుంది. ఈ రకంగా, ఇంకా తన ‘పాత’ను పట్టుకుని వ్రేలాడేవారికి మనుగడ లేకుండా చేయటం ద్వారా తన ఆధిక్యతని సాధిస్తుంది ప్రభుత్వం.
ఈ నాలుగు అంశాలు మనం అనుభవిస్తున్నవే. ఒక్కో తరం ముందుకు వస్తున్న కొద్దీ, మనం ‘మనతనానికి’ ఎన్నో అడుగులు దూరమౌతున్నాము. విశ్వనాథ ప్రతి రచనలో ఈ నాలుగు అంశాలు తప్పసరిగా కనిపిస్తాయి. ఈ అంశాలను ఎత్తి చూపి ఖండించటమే కాదు, దానికి పరిష్కారాలు, తిరిగి ‘మనం’ మనలా అయ్యేందుకు మార్గాలు చూపించటం కనిపిస్తుంది. ముఖ్యంగా ‘మనం’ అన్నా, ‘మనది’ అన్నా తూష్ణీంభావం అవలంబించి, తిరస్కరించే బదులు, నిలచి ఆలోచించే వీలు కల్పిస్తాయి విశ్వనాథ రచనలు. ఏది మంచి మార్గమో, ఎత్తి చూపించి ‘మంచి మార్గం’ వైపు వేలు చూపిస్తాయి విశ్వనాధ రచనలు. అలాగని, ‘ఇదే పాటించ’మన్న ఒత్తిడి, ‘ఇదే గొప్ప’, అన్న తీర్మానాలు కనిపించవు. నిజానిజాలు పాఠకుల ముందు ఉంచి, భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛను పాఠకులకే వదిలేస్తాయి విశ్వనాథ రచనలు.
Anthropologist లు ‘జాక్ వెస్లీ పావెల్’ నిర్వచించిన ‘acculturation’ కాని, రాబర్ట్ ఇ. పార్క్ అభివృద్ధి చేసిన ‘race relations cycle’ కానీ, Antonio Gramsci రూపొందించిన ‘Cultural Hegemony’ గానీ, Johan Galtung ప్రతిపాదించిన ‘Cultural Violence’ గానీ, Rudyard Kipling ప్రదర్శించిన ‘White Man’s Burden’ కానీ, ఇవన్నీ విశ్వనాధ రచనలలో కనిపించటమే కాదు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, వాటి వల్ల మనం ‘అస్తిత్వం కోల్పోవటం’, మనం పరాయివాడిగా రూపాంతరం చెందటం వంటి విషయాలను ప్రదర్శిస్తూ, వాటిలోని లోపాలను, దోషాలనూ విమర్శిస్తూ, మన గొప్పతనం అడుగడుగునా ప్రదర్శిస్తూ, ఇంట్లోని ‘మృష్టాన్నం’ వదలి ‘మురుగు అన్నం’ వైపు ఆకర్షితమవటం లోని అనౌచిత్యం, అనర్థాన్ని ప్రదర్శిస్తూ, ‘మన’ అన్న దాని పట్ల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం రగిలిస్తూ, ‘మన’ పరిరక్షణకు నడుం బిగించేందుకు ప్రేరణ కలిగిస్తూ సాగుతాయి విశ్వనాథ రచనలు.
“మొదటిది, నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను గనక. నేను వ్రాసిన దానిని అనంత విషయములు నేను చొప్పించి వ్రాస్తాను కనక. అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలుణ్ణయి వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నది కనక. ఈభావం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసును కనక. పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది. నేను పోతే నాతో పోయే వాళ్లు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు. ఊరికే ఒట్టి పూర్వకవులని కాదు – పద్యరచనాసామ్రాజ్య పట్టభద్రులు; కథాకథన శిల్పనూత్నాచార్యులు; వేదవేదాంగాది మహాగ్రంథస్థలు; మహావిషయనిర్ణేతలు; బహువిషయ వ్యాఖ్యాతలు; కావ్యకథాశిల్ప రహస్యవేత్తలు; అనే దృష్టితో ఆ పూర్వకవులను నిలబెట్టుకొంటే అప్పుడు నేనూ నిలుస్తాను. నేను చేసినపని అటువంటిది. రోజులు మారిపోయి తెలియటంలేదు.”
ఇలా అనగలిగిన కవి, రచయిత విశ్వనాథ ఒక్కడే. అందుకే విశ్వనాథ సమకాలికులలో ఎందరో గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు ఉన్నా, విశ్వనాథ కన్నా వెయ్యి రెట్ల పాండిత్యం, ప్రతిభావ్యుత్పత్తులు ఉన్నవారు ఉన్నా, ఈనాటికీ, తరతరానికి విశ్వనాథ రచనల పట్ల ఆసక్తి, కుతూహలం పెరుగుతూ వస్తుంది తప్ప, తరగటం లేదు. విశ్వనాథ రచనల ప్రాధాన్యం, ఈనాటికీ పెరుగుతున్న విశ్వనాథ రచనల ‘ప్రాసంగికత’, విశ్వనాథ రచనలు చదువుతుంటే గతం అర్థమయి, వర్తమానం అవగాహనకు వచ్చి, భవిష్యత్తు గురించి అలోచన కలిగిస్తుండటం వల్ల విశ్వనాథ రచనలు – సమకాలికుల రచనల కన్నా కాదు, ఏ తరం రచనల కన్నా ఉన్నత స్థానంలో ఉంటున్నాయి. ఉంటాయి కూడా. సాహిత్య అంధత్వంలో విర్రవీగే ‘వికల్ప నిరతులు’, ‘కల్పితా యోధులు’, ‘వికల్ప యుద్ధశాలుల’తో నేటి సాహిత్య ప్రపంచం నిండి ఉండటం కూడా విశ్వనాథ ఊహించాడు. వీరు విశ్వనాథ భౌతిక శరీరం పోయిందని సంబరంగా ప్రకటిస్తూన్నా, క్షరంలేని అక్షరం ద్వారా ఆయన, ఆయన ఆలోచనలు తరతరాలను ప్రభావితం చేస్తున్నాయి. భారతీయ ధర్మానికి సంబంధించిన ఆలోచనలు, అవగాహనలు ఆయన రచనల నిండా వెదజల్లి ఉన్నాయి. తాత్కాలిక ఉద్రేకాలను కలిగించే రచనల ఉనికి తాత్కాలికమే. కానీ, శాశ్వత సత్యాలను ప్రదర్శించే రచనల జీవితకాలం శాశ్వతం అని విశ్వనాథకు తెలుసు. అందుకే, విమర్శలు, దూషణలు, వెకిలి వెక్కిరింతలు, మూర్ఖ ప్రేలాపనలను ఆయన పట్టించుకోలేదు. తాను ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తూ, తనకు నచ్చిన రీతిలో రచనలు సృజిస్తూ పోయారు.
‘సాహిత్య సురభి’ అన్న పుస్తకం ‘ప్రవేశిక’లో పుస్తక లక్ష్యం వివరణ చూస్తే విశ్వనాథ దూరదృష్టి, భవిష్యత్తు పట్ల ఆలోచన, భవిష్యత్తు సమాజాన్ని అర్థం చేసుకుని దానికి సరైన మార్గం సూచించాలన్న తపనలు అర్థమవుతాయి.
“మన దేశములో నేడు మన గ్రంథముల యందు రుచి తగ్గిపోవుచున్నది. పూర్వము పలు మందికి మన కావ్యముల యందలి పద్యములు కంఠతః వచ్చేడివి. అట్లు వచ్చుట మూలముగా నొక యుపయోగ ముండెడిది. ఇప్పుడనేకములైన యింగ్లీషు మాటలు ప్రచారములో నుండి యింగ్లీషు నర్థము చేసికొన కొంత సులభంగా నున్నట్లు; పూర్వమనేకాంధ్ర పద్యములు కంఠస్థములై యుండుట చేత కావ్యములలో విశేష పద్యములు తెలిసెడివి. ఆధునికులైన కవుల కవిత్వము నేడు అర్థము కాలేదన్నంత దుస్థితి పూర్వముండెడిది కాదు!
ఏ మాత్రపు కఠినమైన శబ్దమున్నను, ఏ మాత్రపు లోతైన భావమున్నను సామాన్యులందరూ మనకు తెలియదని పెడవెగము పెట్టి పోపుచున్నారు.
ఇట్టి స్థితి దేశమునందు పోవలయునన్నచో నింగ్లీషు చదువుల నందలి వ్యామోహము పోవలెను. ఇంగ్లీషు చదువు మన దేశమునందు అంతరించవలయును.
అట్లు జరుగుట మన దేశమున నిప్పుడు సాధ్యము కాదు. గ్రుడ్డిలో మెల్లగా మనము మన సంప్రదాయములు, మన కావ్యములు, మన భాష యింత కంటే కొంత ఎక్కువగా ప్రజలకు తెలిసెడి ప్రయత్నము చేసికొనవలయును. ఇది అట్టి ప్రయత్నములలో నొకటి.”
భూత వర్తమాన కాలాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటమే కాదు, భవిష్యత్తును సరిచేసే ప్రయత్నం చేయటం వల్ల విశ్వనాథ ఇతర రచయితలందరికన్నా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఈ ‘సాహిత్య సురభి’ లో 300 ఎంపిక చేసిన పద్యాలు వ్యాఖ్యానంతో, లోతైన వివరణతో ఉంటాయి.
“ఈ మూడు వందల పద్యములు పనిగట్టుకొని మాటిమాటికీ చదువుచున్నచో ప్రతివాడునూ సామాన్యమైన ఆంగ్లభాషావేత్త యగును. వానిని పండితుడు అని అనవచ్చును. అతనికి బహువిషయాలు తెలియును. అతడు కవుల కవిత్వమును విని వాక్యములు చదివి తనకు తెలియలేదన్న దుస్థితిలో నుండడు. కాని పట్టుమని తిరిగి తిరిగి చదువుచుండ వలెను.
నేటి దేశమును మన యాంధ్ర భాషా జ్ఞానమును ప్రజలలో సముద్ధరించుటకు చేసిన ప్రయత్నమిది.”
ఇది విశ్వనాథ సాగించిన సాహిత్య పోరాటంలో ఒక పార్శ్వం. కార్తవీర్యార్జునుడిలా వేయి చేతులతో, వేయి విభిన్న రకాల సాహిత్య పోరాటాలను విశ్వనాథ సాగించాడు తన జీవిత కాలంలో తన రచనల ద్వారా. ఆ పోరాటంలో ఒక పార్శ్వం, ఒక రంగం, చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు. ఆ రచనలలో ఒక భాగం ‘కశ్మీర రాజవంశావళి’ నవలలు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
