Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-6

[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

విశ్వనాథ ఆరంభంలో రాసిన ‘ఏకవీర’ లాంటి చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలలో భారతీయ ధర్మం, జీవన విధానం, భారతీయ  తత్వాలలోని ఔన్నత్యాన్ని ప్రదర్శించటం ఉన్న ఆ రచనలలో ఆయన లక్ష్యం వేరు. పురాణవైర గ్రంథమాల 12 నవలలు, కశ్మీర రాజవంశావళి ఆరు నవలలు, నేపాల రాజవంశావళి ఆరు నవలల రచనలలో విశ్వనాథ లక్ష్యం వేరు. ఈ 24 నవలల రచనలో విశ్వనాథ లక్ష్యం వేరు.  బ్రిటిష్ వారు ఇష్టం వచ్చినట్టు, రాసిన భారతదేశ చరిత్రను భారతీయ దృక్పథంలో సవరించి చూపించటం కోసం ప్రధానంగా ఈ ఇరవై నాలుగు రచనలు ఆయన రచించారు.

ఈ విషయం ఆయన పురాణవైర గ్రంథమాలలో చివరి నవల ‘నివేదిత’కు రాసిన ముందు మాటలో స్పష్టం చేశారు.

“పురాణవైర గ్రంథమాల యనగా మత్స్య వాయు విష్ణు భవిష్య భాగవతాది పురాణముల యందు చెప్పబడిన మహా విషయములు నేడు పాశ్చాత్యులు నేర్పిన కృతక విద్యల వలన పలుమంది మన దేశీయుల చేతనే నమ్మబడుట లేదు. ఆధ్యాత్మికములు నాధి దైవతములైన విషయముల మాట యట్లుంతుము. మన చరిత్రనే నమ్ముట లేదు. భారత యుద్ధము జరిగి యైదువేల యరువది యేండ్లు పైన జరుగుట నమ్మబడుట లేదు. పలుమంది మన కాల ప్రమాణమును నమ్ముట లేదు. దానికి కారణాలు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర. మన చేత చదివింపబడిన చరిత్ర. ఆ చరిత్రను వారిలో పలుమంది బుద్ధి పూర్వకముగా తారుమారు చేసిరి.”

విదేశీయులు  రంగుటద్దాలతో, తామే విజ్ఞానవంతులమన్న పాశ్చాత్య దురంహంకారంతో తాము పాలకులు కాబట్టి పాలితులకు తమ కన్నా అధికమైన చరిత్ర ఉండకూడదన్న కుత్సితంతో మన చరిత్రను  తమకు అనువుగా తమ ఆధిక్యతను నిలుపుకునే రీతిలో రచించారన్నది నిర్వివాదాంశం. ‘లార్డ్ కెల్విన్’ పరిశోధనలు, ప్రయోగాల ప్రకారం విశ్వం క్రీస్తు పూర్వం 40 మిలియన్    సంవత్సరం ప్రాంతంలో ఆవిర్భవించింది. అంటే సృష్టి క్రీస్తు పూర్వం నాలుగు వేల మిలియన్ సంవత్సరాల  క్రితం సృష్టి జరిగింది. వారి మత గ్రంథం కూడా దీన్ని ఆమోదించటంతో, క్రీస్తు పూర్వం 40 మిలియన్  ఏళ్లకన్నా ముందు ప్రపంచం లేదు. నాగరికతలు లేవు. మనుషులు లేరు. భూమి లేదు.

భారతీయ ధర్మం కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడుతుంది. కల్పాలంటుంది. సృష్టి నాశనమై మళ్లీ సృజితమవుతుందని; మళ్లీ నాశనమై మళ్లీ సృజితమౌతుందని, ఇలా  అనంతంగా సృష్టి సృజితమవుతూ, నాశనమవుతూ, సృజితమవుతూనే ఉంటుందని నమ్ముతుంది. దీనికి సంవత్సరాల లెక్కలు ఉన్నాయి. ఒక కల్పం 4.32 బిలియన్ సంవత్సరాలు. ఇది బ్రహ్మకు ఒక పగలుతో సమానం. ఒక కల్పం వెయ్యి మహాయుగాలతో సమానం. బ్రహ్మ ఒక పగలు 4.32 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మ ఒక రాత్రి 4.32 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మ ఒక రోజు 8.64 బిలియన్ సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 20 నుంచి   40 మిలియన్  సంవత్సరాల క్రితం భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని నమ్మిన జాతి, సృష్టి ఆద్యంతాలు లేనిదని, సృష్టి – ప్రళయం – సృష్టి అనేది చక్రనేమిక్రమేణ  అనీ నమ్మే జాతిపై అధిక్యం సాధిస్తే ఏమౌతుందో ఊహించటం కష్టం కాదు.

ఒక విజేత నాగరికత, పరాజిత నాగరికతను సంపూర్ణంగా రూపాంతరం చెందించేందుకు అవలంబించే పద్ధతులలో Military and Legal Action యుద్ధానికి పాలనకు సంబంధించినది. Cultural and Educational Assimilation క్రిందకు వస్తుంది – చరిత్రను విజేత అధిక్యతను నిలిపేట్టు రాయటం. చరిత్రను తారుమారు చేసి రాయటం, దాన్ని విద్య రూపంలో బోధించటం, తద్వారా స్వీయ దేశ చరిత్రను చిన్న చూపు చూసి, విదేశీయుల దృష్టితో స్వదేశానికి సంబంధించిన ప్రతీదాన్నీ చూసి,  విదేశీయులు  నేర్పినదే అసలు చరిత్ర అని నమ్మే తరాలను  తరతరాలుగా తయారు  చేస్తూండటంతో, Cultural and Educational Assimilation లక్ష్యం  పూర్తవుతుంది. దీన్ని విశ్వనాథ ‘నివేదిత’కు రాసిన ముందుమాటలో స్పష్టంగా చెప్పారు.

“ఇచటి విద్యలన్నియు బ్రాహ్మణులు వ్రాసినారనియు, బ్రాహ్మణులార్యులనియు, తక్కిన వారు ద్రావిడులనియు, వారి దేశములలో మతగురువులు సామాన్య ప్రజలను పీడించిన పోలిక  తెచ్చి ఇచ్చట బ్రాహ్మణులు తక్కిన వారిని హింసించిరని చెప్పిరి. తక్కిన వారిలో దున్నపోతీనినదనగా దూడను కట్టివేయమన్నట్టు బుద్దిని తమ విద్యాబోధన చేత రాజతంత్రము చేత సాధించిరి.”

పరాజితులకు తమకన్నా ఘనమైన చరిత్ర ఉండకూడదన్న ఆలోచనలతో, సృష్టి క్రీస్తు పూర్వం 40మిలియన్ సంవత్సరానికే  ఆరంభమయిందన్న నమ్మకంతో ‘కల్పాల గణన’ ‘కల్పన’ అనీ తీసి పారేసి భారతదేశ చరిత్రను తమకనువయిన రీతిలో రచించారు. బిలియన్ సంవత్సరాల చరిత్రను వేల సంవత్సరాలకు కుదించారు.  సాధారణంగా భారతీయ చరిత్రను, ధర్మాన్ని పౌరాణిక అంశాలను విమర్శించేప్పుడు ‘scientific temper’ అన్న పదం వాడతారు. మన పూర్వీకులకు  అది లేదని తీసి పారేస్తారు.

ఇక్కడ కాస్త పక్కకు జరిగి విజ్ఞాన శాస్త్రాభివృద్ధి పద్ధతిని  ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిని ‘ప్లాటో’ చీకటి గుహలో కాగడా వెలుతురులో ప్రయాణంలాంటిది  అని వర్ణించాడు. కాగడా పట్టుకుని గుహలో అడుగు వేయగానే కొద్ది దూరం కాగడా వెలుతురు పడుతుంది. వెలుగు పడుతున్న  అంతదూరంలో కనబడుతున్న వాటి     అధారంగా కొన్ని సిద్ధాంతాలు ఏర్పడతాయి. మరో అడుగు వేసేసరికి, ఇంకొంత ప్రాంతంలో వెలుగు పడుతుంది. అప్పుడు క్రొత్తగా వెలుగు పడిన ప్రాంతంలోని అంశాలతో, ఇంతకు ముందు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలను పోల్చి చూసి, సరిపోయిన వాటిని కొనసాగిస్తూ, సరిపోని వాటిని వదలి, కొత్త సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తూ, మరో అడుగు వేయాలి. ఇది విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందే పద్దతి. అంటే విజ్ఞాన శాస్త్రం కనుగొన్నది సాపేక్ష సత్యం, తాత్కాలిక సత్యం తప్ప  సంపూర్ణ సత్యం కాదు. అంటే ఈ రోజు ‘సత్యం’ అనుకున్నది రేపు కొత్త సత్యాలు ఆవిష్కరణ అయితే మారిపోయే వీలుందన్న మాట. ఇలా కొత్తగా కనుగొన్న సత్యాలను కలుపుకుంటూ నిరూపణ కాని వాటిని వదులతూ ముందుకు సాగుతుంది విజ్ఞాన శాస్త్రం. ఎప్పటికప్పుడు కొత్త సత్యం ప్రకటితమవగానే శాస్త్రాన్ని update చేసుకుంటుండాలి.

పాశ్చాత్య భూగర్భ శాస్త్రవేత్తలు, భూమిపై లభ్యమయ్యే ఆధారాల ద్వారా భూమి ఎప్పుడు ఆరంభమయి ఉంటుంది? విశ్వ జననం  ఎప్పుడు జరిగి ఉంటుందని పరిశోధనలు చేస్తూ రకరకాల సిద్ధాంతాలు చేస్తూ వచ్చారు. చివరికి 1913లో ఆర్థర్ హోమ్స్(Arthur Holmes)  అనే శాస్త్రవేత్త, రేడియో ఏక్టివ్ పదార్థాలు పతనం అయ్యే వేగం అధారంగా (rate of Radio Active decay) సృష్టి ఆవిర్భావికి సంబంధించిన కాల పట్టికను (time line) ఏర్పాటు చేశాడు. ఋజువులతో, ఆధారాలతో హోమ్స్, భూమి వయస్సు 1.6 బిలియన్ సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవచ్చని ప్రతిపాదించాడు. కానీ శాస్త్రవేత్తలు, మత గురువులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. వారు కెల్విన్ చెప్పిన 40  మిలియన్  ఏళ్ల వయస్సుని వదిలేందుకు ఇష్టపడలేదు.

1930 దశకంలో ఆల్ఫ్రెడ్ నైర్ అనే శాస్త్రవేత్త యురేనియమ్ ఐసోటోప్‍లపై చేసిన పరిశోధనలను ఆధారం చేసుకుని హోమ్స్ మళ్లీ తన ‘జియోలజికల్ టైమ్‌లైన్’ను ప్రకటించాడు. చివరికి రకరకాల వాగ్వివాదాలు, చర్చలు తరువాత 1946లో భూగర్భ శాస్త్రవేత్తలు హోమ్స్ ప్రతిపాదించిన ‘జియోలాజికల్ టైమ్ స్కేల్’ని ఆమోదించారు. ఇప్పటికీ అదే అమలులో ఉంది.

‘Age of the Earth’ (1913) అనే పుస్తకంలో, తన టైమ్ లైన్‌ను ప్రతిపాదిస్తూ అర్డర్ హోమ్స్ “Long before it became a scientific aspiration to estimate the age of the earth, many elaborate systems of the world chronology had been devised by the sages of antiquity. The most remarkable of these occult time-scales is that of the ancient Hindus, whose astonishing concept of the Earth’s duration has been traced back to Manusmriti, a sacred book.” అన్న అభిప్రాయం ప్రకటించాడు.

కాని బ్రిటీష్ వాడు మనకు మనుస్మృతిలో వర్ణభేదాలు, స్త్రీ అణచివేతలు, అన్యాయాలు  తప్ప మరేమీ కనబడకుండా చేశాడు. ఇప్పటికీ మన దృష్టి అక్కడే అగిపోయింది. మనకు అదే కనబడుతుంది. ‘మనుస్మృతి’ లోని భారతీయుల ‘కల్పం’ కాలమానం ప్రకారం భూమి వయస్సు 4.32 బిలియన్ సంవత్సరాలు.  విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు తెలిపిన సత్యం   ప్రకారం భూమి వయస్సు 4.54 బిలియన్ల సంవత్సరాలు. . లార్డ్ కెల్విన్ లెక్క కనుచూపు మేరలో కూడా లేదు. విజ్ఞాన శాస్త్రం లార్డ్ కెల్విన్ లెక్కలను  మరచిపోయింది. వదిలేసింది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమింటంటే, చీకటి గుహలో అడుగు వేయగానే వెలుతురులో కనబడిన సత్యాల ఆధారంగా భూగర్భ శాస్త్రం తన ‘టైమ్ లైన్’ మార్చుకుంది. Update చేసుకుంది. కెల్విన్ లెక్కలను వదిలేసింది. కానీ కెల్విన్ లెక్కల ఆధారంగా కుదించిన భారతీయ చరిత్ర లెక్కలను మాత్రం, ఇప్పుడు కొత్తగా తెలిసిన 4.32 బిలియన్ సంవత్సరాల లెక్కకు అనుగుణంగా సవరించలేదు. అలాంటి ప్రయత్నాలు కూడా జరగటంలేదు. ఏ లెక్కలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన  సత్యానికి దగ్గరగా ఉన్నాయో, ఆ లెక్కల ఆధారంగా ఏర్పరచిన  చరిత్ర  ని విశ్లేషించి  , భారతదేశ చరిత్రను   update చేసే వైజ్ఞానిక దృక్పథాన్ని ,scientific temper ను కూడా ప్రదర్శించటంలేదు.   అంటే ప్రపంచం మొత్తం A1 సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంటే, మన చరిత్రను మాత్రం మనం 18వ శతాబ్దంలో కరెంటు, గ్యాసు, కిరోసిన్ వంటివేవీ లేని కాలంలో, నెయ్యిని  ఇంధనంలా వాడే మట్టి ప్రమిదల వెలుతురు మాత్రమే ఉన్న కాలంలోనే ఉంచుతున్నామన్నమాట.

కేవలం మూడడుగుల ఎత్తు ఉన్న  పాలకుడు ఏడడుగుల ఎత్తున్న పాలితుడి కాళ్లు కోసి, వాడిని తనకన్నా తక్కువ ఎత్తులో ఉండేట్టు చేసినట్టు, విదేశీయులు మన చరిత్రను వారి స్థాయికి కుదించటాన్ని భారతీయ విద్వాంసులు నిరూపించారు. ఎందుకంటే భారతదేశంలో సువ్యవస్థితమైన కాలగణన పద్ధతులున్నాయి. చరిత్ర ఉంది. రాజుల వంశాలు, వారు పాలించిన కాలంతో సహా చక్కగా పద్ధతి ప్రకారం పొందుపరచి ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం భారత యుద్ధం జరిగిన కాలం, కలియుగ ప్రవేశ సంవత్సరం వంటి ఎన్నో అంశాలు  తెలుసుకోవచ్చు. పురాణాలలో ఉన్న రాజవంశావళుల పాలన కాలం రాజుల వరుసలు సరిగ్గా సరిపోతాయి ఎలాంటి తేడాలు లేకుండా.

విశ్వనాథ మాటల్లోనే “ఈ లెక్క 1930 లో మదరాసులోనున్న నారాయణ శాస్త్రిగారను నొక న్యాయవాది అప్పటికి తేల్చి చూపించేను. తరువాత కీ.శే. నడింపల్లి జగన్నాధరావను న్యాయవాది నర్సరావుపేటలో ‘మహాభారత యుద్ధ కాలము’  అన్న గ్రంథము వ్రాసి నిరూపించెను. ‘భారతదేశ చరిత్ర చతురానను’డైన బ్రహ్మభూతులైన శ్రీ కోటవెంకటాచలం గారు తన జీవిత మంతయూ పాశ్చాత్యులు చేసిన ఈ యన్యాయము విప్పి చూపుటకు వ్యయము చేసిరి. వారి గ్రంథముల ననుసరించియే నేనీ నవలలు వ్రాసితిని” అని పురాణవైర గ్రంథమాల, కశ్మీర రాజవంశావళి నవలలు, నేపాళ రాజవంశ నవలల రచనకు కారణము, లక్ష్యము,  ప్రేరణల విషయం స్పష్టంగా చెప్తారు విశ్వనాథ.

ఇది ప్రత్యక్ష కారణం. విశ్వనాథ ఈ 24 చరిత్ర ఆధారిత కాల్పనిక నవలలు రాయటం వెనుక పరోక్ష కారణం ఒకటి కనిపిస్తుంది. స్వతంత్రం సాధించటం కన్నా ముందు, బ్రిటిష్ వారి పాలన అంతమయిన తరువాత మన చరిత్రను మన దృక్కోణంలో మన లెక్కల ప్రకారం తిరిగి సరిచేసి రాసుకోవచ్చన్న ‘ఆశ’ ఉండేది. కానీ జాతీయ భావనలున్న వారు ఆశించినట్టు భారతీయ చరిత్రను ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల ఫలితాల ఆధారంగా update చేయటం అన్న ఆలోచనే ఎవ్వరూ ప్రదర్శించలేదు. పైగా బ్రిటిష్ వారికన్నా ఎక్కువగా వారు ఏర్పాటు చేసిన చరిత్రను  కొనసాగించటమే కాదు భారతీయమన్న ప్రతిదాన్ని పనికిరానిదిగా భావించి తీసి పారేయటమే ఆధునికం, అభ్యదయం, వైజ్ఞానికం అన్న భావన గట్టి పడుతూ వచ్చింది.

ఈ విషయాన్ని విశ్వనాథ “ఈ దేశమున వారు (పాశ్చాత్యులు) చేసిన అనేకములైన ఇట్టి పనులలో (అధికారాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన పనులు) మన పూర్వ చరిత్ర కల్పితమనియు, బ్రాహ్మణులు కల్పించి వ్రాసిరనియు అబద్ధములు వ్రాసిరనియు మనకు చరిత్రయే లేదనటయు నొకటి. పురాణముల యందలి వైరము పురాణవైరము. ఈ వైరము పాశ్చాత్య చరిత్రకారులు పూనినది. వారి యనుయాయులకు బోధించినది. మధ్య వైష్ణవులకు నామములు పెద్ద అనునట్లు ఆ అనుయాయులు తమ గురువులకంటే తీవ్రముగా నవలంబించునది” అని గురువుల కన్నా  ఘోరంగా ప్రవర్తిస్తున్న అనుయాయులను ప్రస్తావించారు. ‘నివేదిత’ నవలను విశ్వనాథ 1958లో రాశారు. అప్పటికే స్వతంత్ర భారతం ఏ దిశలో ప్రయాణిస్తున్నదో అర్థమైపోయింది.

‘సముద్రపు దిబ్బ’ నవల,  స్వతంత్రం సాధించినా,  స్వతంత్రం సాధించని భారతదేశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ మనస్తత్వాన్ని ఎత్తి చూపిస్తూ, ఖండిస్తూ స్వతంత్ర మనస్తత్వ సాధనకు మార్గం చూపించటం లక్ష్యంగా ఈ 24 చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు వ్రాశారు విశ్వనాథ. అందుకే ఆయన ముందుగా,  భారతీయులంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించారు.

“భారతీయులనగా భారతదేశమునందు పుట్టుట మాత్రమే కాదు. అనంతమై, అగాధమై, అపరిచ్ఛేద్యమై, నిత్యమైన యీ వేదవేదాంత పురాణేతిహాసములయందు విశ్వాసము కలిగియుండుట. ఇది యెట్టిదనగా తల్లి దండ్రులయందు భక్తి కలగి యుండుట వంటిది. ఆ తల్లిదండ్రులు వట్టి లక్కమ్మ లక్కయ్యలు కాదు. సీతారాములు, రుక్మీణీ కృష్ణులు.”

దేశమంటే కేవలం మనుషులు మాత్రమే కాదు. మట్టీ, ఆ మట్టిలో జనించిన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలు, తత్వాలు, ఆలోచనలు అన్నీ. ఈ విషయాల్ని భావితరాలకు వక్రీకరించి అందించిన  చరిత్రను సరిచేసి చూపిస్తూ, నిజానిజాలు   చెప్పటం ఈ 24 చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలలో కనిపిస్తుంది.

రచయిత పని పాఠకుల మనస్సులలో ఆలోచన బీజం నాటటమే. ఆ బీజం ఎదిగి వృక్షమయ్యేట్టు జాగ్రత్త పడటం రచయిత పని కాదు. ఆ బీజానికి సారవంతమైన నేల లభిస్తే, అది ఎదిగి వృక్షమై,  సంపూర్ణంగా పరిసరాలను మార్చివేస్తుంది. అలా కాక రాతినేలలో పడితే లాభం లేదు. బీజం ఫలవంతమవటం అది నశించటంతో రచయితకు పని లేదు. అతని కర్తవ్యం సమాజంలో ఆలోచనా బీజాలను విస్తరింప చేయటమే. విశ్వనాథ తన రచనలలో ఆ ఆలోచనలను పొందుపరచాడు. తన కర్తవ్యాన్ని  నిర్వహించాడు. తన  బాధ్యతను నెరవేర్చాడు.

ఈ 24 నవలల ద్వారా విశ్వనాథ చరిత్ర రచయితలు, భారతదేశ చరిత్రకు చేసిన అన్యాయాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. ప్రదర్శించాడు. సమాజానికి భారతదేశ చరిత్ర విషయంలో ఒక ఆలోచనను ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడు.  ఆలోచన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

“మన పురణాములును, రాజతరంగిణియు, కలియుగ రాజ చరిత్రయు. నేపాళ రాజచరిత్ర చెప్పిన సంగతులన్నియు మహాభారత యుద్ధము 5101 సంవత్సరమునకు పూర్వము జరిగినదని యొప్పుకున్నచో సరిపోవుచున్నది. ఒప్పుకోనిచో సరిపోవుట లేదు. సరిపోవు లెక్క యుండగా సరిపోని లెక్కని బట్టుకుని ఆ వ్రాసిన వారందరూ తప్పు వ్రాసిరనుటలో న్యాయమేమున్నది?”

ఇదీ విశ్వనాథ ప్రశ్న. ఈ ప్రశ్నకు మద్దతుగా,  సమాధానంగా ఈ ఇరవై నాలుగు నవలలు  రచించి  సత్యాన్ని నిరూపించారు. కానీ కళ్ల ఎదురుగా ఉన్న విజ్ఞానాన్ని చూడలేని కళ్లున్న గుడ్డివాళ్లకి నిజం ఎవరు చూపించగలరు? కాని ప్రయత్నించటం మన వంతు. ప్రయత్నించకుండా ఉండలేము. ప్రయత్నించటమే మన కర్తవ్యం. ప్రయత్నించటమే మన ధర్మం. కర్తవ్యము మాత్రమే మనుషుల వంతు.

(ఇంకా ఉంది)

Exit mobile version