[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
భూషాభోగి ఫణారత్నరోచిః సిచయచారవే।
నమః ప్రతీనముక్తాయ హరకల్పరుహిరుహీ॥
(కల్హణ కశ్మీర రాజతరంగిణి, 1-1)
కల్పవృక్షం లాంటి శివుడికి, మెడలో అలంకృతమై ఉన్న సర్పాల పడగలపై వున్న మణుల వెలుగులో శోభిల్లుతున్న శివుడికి, సంసార దుఃఖాల నుండి విముక్తి కలిగించి శాశ్వతానందం అందించే వాడికి ప్రణామాలు.
ఇది భారతీయ కావ్య రచన సంప్రదాయం.
కావ్యారంభంలోనే భగవంతుడిని తలచుకుని ఆశీర్వాదాలు అభ్యర్ధించాలి. ‘నమస్క్రియ’తో కావ్యం ఆరంభవ్వాలి. అధిక శాతం భగవంతుడిని ప్రార్థించటంతో కావ్యం ఆరంభిస్తారు. కావ్యారంభం నమస్క్రియాత్మకం కావచ్చు. పాఠకులకు ఆశీర్వాదాత్మకారంభం కావచ్చు. ఆ తరువాత సాధారణంగా కవి తను ఏ రాజాస్థానంలో ఉంటూ కావ్యం రాస్తున్నాడో ఆ రాజవంశావళిని, గొప్పతనాన్ని వివరిస్తాడు. తరువాత కవి ప్రశస్తి చెప్పకుంటాడు. తన గురించి, తను జన్మించిన ప్రాంతం, తల్లిదండ్రులు, ప్రోత్సహించినవారు, స్నేహితులు, ఇతర రచనలు వంటివి ‘కవి ప్రశస్తి’లో ఉంటాయి. తరువాత సత్కవి ప్రశంస, కుకవి నింద, దైన్యోక్తి వంటివి ఉంటాయి. సత్కవి ప్రశంస, కుకవి నింద వంటి వాటి వల్ల అప్పటి సాహిత్య ప్రపంచ స్థితిగతులు తెలుస్తాయి.
ఇలా వాక్యారంభంలోనే అనేక చారిత్రకాంశాలు తెలుస్తాయి. కొందరు కవులు తాము ఏ కాలంలో రాస్తున్నారో కూడా చెప్తారు. గ్రహగతులు వివరిస్తారు. దాంతో వారు ఏ కాలం వారు, అప్పుడు రాజులెవరు వంటి విషయాలు కూడా తెలుస్తాయి. నిజానికి, భారతీయులకున్నంత కాలం స్పృహ, చరిత్ర స్పృహ ప్రపంచంలో ఏ నాగరికతకు కూడా లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. పాశ్చాత్యులు నిర్ణయించిన ‘చరిత్ర’ భారతీయల దృష్టిలో చరిత్ర కాదు. కేవలం రాజుల పేర్లు, తేదీలు, చేసిన యుద్ధాలు చరిత్రగా పరిగణనకు రాదు.
వంద్యః కోపిసుధస్సన్దాస్కందీ ససుకవేర్గుణః।
యేనాయాతి యశః వాయః స్థైర్యం సృస్యపరస్యచ॥
(కల్హణ కశ్మీర రాజతరంగిణి, 1-3)
కవుల శక్తి పరమాద్భుతమైనది. తమ కీర్తి వల్ల వారు అమరులయ్యారు. వారు తమ నైపుణ్యంతో గతాన్ని ప్రజల కళ్ల ముందు సజీవంగా నిలుపుతారు.
ఇది కవుల గొప్పతనం. భౌతిక శరీరం అదృశ్యవుతుంది. కావ్యాల ద్వారా కవులు చిరంజీవులు. వారి రచనల ద్వారా గతం అక్షరాలలో బంధితమై సజీవంగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకున్న వారి మనోయవనిక పై సజీవంగా ప్రత్యక్షమౌతుంది.
కావ్యాలు, శృంగార కావ్యాలయినా, భక్తిరసాత్మక కావ్యాలయినా, వాటిల్లో చరిత్ర ఉంటుంది. కవులు సజీవంగా నిలిపిన గతం ఉంటుంది. చూడగల మనస్సు కావాలంతే!
ప్రాయస్తృతీయగోనన్దాదారభ్య శరదా తదా।
ద్వే సహస్రే గత త్రింశదధాకంచ త్రింశత త్రయమ్॥
(కల్హణ కశ్మీర రాజతరంగిణి, 53)
మూడవ గోనందుడు పాలించి 2330 సంవత్సరాలయింది. ఇప్పటికి కల్హణుడు తాను రాజతరంగిణి రాస్తున్న కాలం ఎప్పుడో చెప్పాడు. మూడవ గోనందుడు పాలించి 2330 సంవత్సరాలయిన తరువాత తాను రాజతరంగిణిని రాస్తున్నాడని చెప్పాడు.
ఈ శ్లోకం కన్నా ముందరి శ్లోకంలో తాను రాజతరంగిణి ఆరంభించిన కాలం గురించి చెప్పాడు కల్హణుడు.
లౌకికాబ్దే చతుర్వింశే శకకాలస్య సాంప్రతమ్।
సప్తత్యాభ్యధికం యాతం సహస్రం పరివత్సరాః॥
(కల్హణ కశ్మీర రాజతరంగిణి, 52)
ప్రస్తుతం లౌకికాబ్దంలో 24 సంవత్సరాలు, శక సంవత్సరాలు 1070 పూర్తయ్యాయి.
తన కాలం చెప్తున్నాడు. తన కాలం నుంచి మూడవ గోనందుడి కాలం చెప్తున్నాడు. మన లెక్కలన్నీ మహాభారత యుద్ధం నుంచి మొదలవుతాయి. అలా లెక్కకడుతూ వెళ్తే ప్రస్తుత లెక్కల్లో క్రీ.శ. 1148 కల్హణుడు రాజతరంగిణి ఆరంభించినట్టు తెలుస్తుంది. కల్బణుడు చెప్పిన 1070 సంవత్సరాలు ప్రస్తుతం లెక్కల్లో 4224 సంవత్సరాలు. అంటే 4224 నుండి 1148 తీసేస్తే క్రీ.పూ. 3776 సంవత్సరంలో లౌకికాబ్దారంభం అని తెలుస్తుంది. మూడవ గోనందుడు ఆ కాలం నాటి వాడు.
కానీ ఫ్రొఫెసర్ బ్యూహ్లర్ ఈ లెక్కలను ఒప్పుకోలేదు. కల్హణుడు పొరపడ్డాడని తీర్మానించాడు. కల్హణుడు ఊహించి, ఏదో తేదీ నిర్ణయించాడని కొట్టి వేసేసి ఎలాంటి ఆధారాలు చూపకుండా 2030 సంవత్సరాలను 1070 సంవత్సరాలుగా నిర్ణయించి, అలెగ్జాండర్ దండయాత్రకు తాము నిర్ణయించిన తేదీలతో సరిపోయేట్టు చేశారు. నేరం కల్హణుడి మీద నెట్టేశారు.
రాజతరంగిణి నవలల్లో మొదటి తరంగానికి చెందిన నవల ‘యశోవతి’ ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది.
“శ్రీకృష్ణదేవుడు పరమపదించిన దినమునందు ద్వాపర యుగము పూర్తియై కలియుగము ప్రవేశించెను. అంతకు పూర్వము ముప్పయి యారేండ్ల క్రింద మహాభారత యుద్ధము జరిగినది. హస్తినపురము నుండి యుధిష్ఠర మహారాజు ఆ ముప్పది యారేండ్లు భూమిని పరిపాలించెను. మహాభారత యుద్ధము నాటికి యుధిష్ఠర మహారాజునకు ఎనుబది యేండ్లు వయస్సు. భీమునకు డెబ్బది తొమ్మిది యేండ్లు వయస్సు. శ్రీకృష్ణదేవుడు పరమపదించిన నాటికి 120 యేండ్ల వయస్సు. అనగా కలియుగము ప్రవేశించక ముందు శ్రీకృష్ణదేవుడు ద్వాపర యుగము తొంబది యేండ్లుండేను, అనగా జన్మించెను. అది ద్వాపరాంతము. కలియుగము ఇంక ఎనుబది నాలుగేండ్లకు వచ్చుననగా కశ్మీర దేశము గోనందుడను రాజు పరిపాలించుచుండెను. ఆ గోనందుడు అప్పటికి ముప్పయిది యారేండ్ల రాజ్యము చేసెను. అప్పటికి శ్రీకృష్ణదేవుడు వయసు పదమూడేండ్లు. శ్రీకృష్ణుడు తన పండ్రెండవ యేట మధరాపురము నందు రాజ్యము చేయచున్న కంసుని సంహరించెను. పన్నెండేండ్ల శ్రీకృష్ణుడు రేపల్లెలో తన బాలలీలను నెరుపుచుండెను. మధురలో కంసుడు, మగధ రాజ్యమందలి గిరివ్రజపురము నందు జరాసంధుడు, కశ్మీరములో గోనందుడు, హస్తినపురములో ధృతరాష్ట్ర రాజును రాజ్యము చేయచుండిరి. పాండురాజు వానప్రస్థము నందు ఉండెను. అప్పుడు మిధిలానగరమును తద్దేశాధిపతికి కూతురు కలదు. ఆమె పేరు యశోవతి.”
‘యశోవతి’ నవలలో యశోవతి పాత్ర పేరు వచ్చేలోపల తాను చెప్పదలచుకున్న చరిత్రను చెప్పెశాడు విశ్వనాథ. కలియుగారంభం కేంద్రం. అటు నుంచి మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది, పాండవులు, కృష్ణుడు ఎప్పుడు పుట్టారు, ఆ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టారో మొత్తం చెప్పేశాడు. ఇది చరిత్ర.
ఈ చరిత్రలో ఈ కాలగణనలో ప్రతిదానికీ నిరూపణ ఉంది. కలియుగం మన లెక్కల ప్రకారం క్రీ.పూ. 3076 సంవత్సరంలో ఆరంభమయింది. ఇక్కడి నుంచి 25 ఏళ్ళకు లౌకికాబ్దం ఆరంభమయింది. ఇది ప్రామాణికంగా తీసుకుని పాండవుల వయస్సు, ఎప్పుడెప్పుడు ఎవరెవరు జన్మించారు, ఏ సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందో, సులభంగా గణించవచ్చు. ఇది పురాణాలలో ఇచ్చిన రాజవంశావళులతో పాలనకాలాలతో సరిగ్గా సరిపోతుంది. ఎలాంటి ఆధారం, కారణం నిరూపణలు చూపకుండా ఈ ‘లెక్కలు తప్పు’ అని, సత్యం నోరు నొక్కి నమ్మించటం లోనే అసలు ‘చరిత్ర’ దాగుంది.
అందుకే విశ్వనాథ ఆరంభంలోనే తన రచనలకు మన సాంప్రదాయిక కాలగణననే ప్రామాణికం అని నిర్ద్వంద్వంగా ప్రకటించేశాడు. ఈ ప్రకటనలో మరో నిరూపణ ఉంది. మహాభారతంలో పాత్రలన్నీ నిజంగా జీవించిన వారన్న సత్య ప్రకటన ఉంది. కంసుడిని ఎప్పుడు చంపాడుతో సహా, సంఘటనల వివరణ ఉంది. ఇదంతా ఒక్క పేరాలో చెప్పేశాడు రచయిత. మరో మాటకు తావు లేదు. ఆస్కారం లేదు. కథలోకి దిగాడు.
విశ్వనాథ రాసిన ఆరు రాజతరంగిణి నవలలు మొదటి మూడు తరంగాలకు చెందివి. కల్హణుడు కశ్మీర ఆవిర్భావం నుంచి క్రీ.శ.1140 వరకు కశ్మీరం చరిత్రను, 8 తరంగాలలో వివరించాడు. విశ్వనాథ ఆరు నవలలకు మొదట మూడు తరంగాల నుంచి మాత్రమే తీసుకోవటం వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది.
కల్బణుడి రాజతరంగిణి ‘European notion of history’ కి దగ్గరగా ఉన్నదని ఆమోదించినా, పాశ్చాత్య పరిశోధకులు మొదటి మూడు తరంగాలను చరిత్రగా అంగీకరించలేదు. ఎందుకంటే ఆ మూడు తరంగాలలో ఉన్న రాజుల చరిత్రలో వారి బుద్ధికి అందని, వారి మెదడు ఆమోదించని విషయాలు అనేకం ఉన్నాయి.
రాజు పూజకు వెళ్తుంటే వితస్త నది రాజుకు అందకుండా వెనక్కు వెళ్లటం, శాపం పొందిన రాజు పాములా మారిపోవటం, చచ్చినవాడు బ్రతికి వచ్చి రాజ్యం చేయటం, నాగులు పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి రాజ్యాన్ని నాశనం చేయటం, ఇలా వారి మేధకు అందని విషయాలు మొదటి మూడు తరంగాలలో అనేకం వస్తాయి. ఇదంతా చరిత్రగా అంగీకరించేందుకు పాశ్చాత్యులు ఇష్టపడలేదు. ఎందుకంటే, ఇది చరిత్రగా అంగీకరిస్తే, కల్హణుడు అవలంబించిన కాలగణనను ఆమోదించాలి. అది ఆమోదిస్తే పాశ్చాత్యులు ఏర్పరచుకున్న కాలగణన దెబ్బతింటుంది.
మిగతా తరంగాలతో సమస్య లేదు. ఈ మూడు తరంగాలలోని కాలగణనను ఆమోదిస్తే, మిగతా తరంగాలు వాటంతట అవే సరిపోతాయి. అందుకే విశ్వనాథ రచన ప్రణాళికను పలు భిన్నమైన కోణాల నుంచి విశ్లేషించి విమర్శించాల్సి ఉంటుంది. ఆయన ఒక నవలలో ఎన్నెన్నో విషయాలను ఎన్నెన్నో కోణాలలో పొరలు పొరలుగా పొందుపరచాడు. ఉల్లిపొరలు విప్పినట్టు యాంత్రికంగా ఈ పొరలను తొలగించి పరిశీలించటం కుదరదు. విశ్వనాథ రచనా వైదుష్యం, ప్రతిభ, మహత్య రచన పటుత్వం సాలెగుడులా ఒక దారంతో మరో దారానికి సంబంధం ఉంచుతూ, ఎక్కడా ఎలాంటి తేడా ఉండని సమరూపత్వంతో అవయవానురూపత్వాన్ని సాధిస్తూ ఒక్కో దారంలో పలు సూక్ష్మ దారాలతో పటిష్టంగా తయారు చేస్తాడు. ఒకో పొరను అంటే, పొరపొరలుగా విడగొట్టటమే కాదు, ఒక్కో పొరలోని అపరిమితమైన సూక్ష్మ దారాలతో అల్లికతో ఏర్పాటు చేసిన అతి సుందరమైన symmetry ని గమనిస్తూ, అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలన్న మాట.
కవిత్వంలో చిత్ర కవిత్వం అని ఉంటుంది. అక్షరాలు, పదాలు, వాటి అమరికలను ప్రత్యేకమైన అసాధారణమైన నియమాలకు, గణిత, చరిత్ర రూప బంధాలకు లోబడి రాసే ఒక విశిష్టమైన, అతి కఠినమైన కావ్య రూపం చిత్రకవిత్వం. చిత్రకవితలు పలు రకాలు. శబ్ద చిత్రాలలో స్వర చిత్రం, వ్యజన చిత్రం, అక్షర చిత్రం, శబ్ద చిత్ర మిశ్రమ చిత్రం ఇలా బోలెడన్ని రకాలున్నాయి. దీన్లోనే బంధాలుంటాయి. మాగళిక బంధము, ఆయుధ బంధము, ప్రకీర్ణ బంధము ఇలా అనేక చిత్రమైన కవిత్వ రూపాలున్నాయి. ఇంకా అనేక. గూఢ చిత్రాలు, ప్రశ్నోత్తర చిత్రాలు, ప్రహేళికల చిత్రాలు ఇలా ఎన్నెన్నో రూపాలున్నాయి. గద్య రచనలో ఈ ప్రక్రియలన్నిటినీ విశ్వనాథ అతి గొప్పగా, పొందుపరచారు. నవల రచనలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చో అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఎన్ని ప్రయోగాలు చేశారంటే, ఆయన తరువాత ప్రపంచవ్యాప్తంగా,ఏ భాషలోనయినా, ఎవరు ఎన్నెన్ని చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసినా, వారందరి కంటే ముందుగా ఆ ప్రయోగాలు విశ్వనాథ రచనలో కనిపిస్తాయి.
కాబట్టి విశ్వనాథ రచనలను ముఖ్యంగా గద్య రచనలను తేలికగా, ఏదో మామూలు నవల చదివినట్టుగా చదివి ‘విశ్వనాథను చదివేశాను’ అనటం కుదరదు. ఏదో ఒక నవల చదివితే విశ్వనాథనంతా చదివినట్టే అనేవాళ్ళూ, అది నమ్మేవాళ్ళూ, బిందెలో నీళ్ళు చూసి ప్రపంచంలోని సముద్రలోతులన్నీ తెలిసిపోయాయనుకునేటటువంటి గొప్ప మేధావులు. పురాణవైర గ్రంథమాలలోని నవలలు కానీ, రాజతరంగిణి నవలలు కానీ, నేపాళ రాజతరంగిణి నవలలు కానీ కాస్తయినా అర్థం కావాలంటే, విశ్వనాథకు ప్రేరణగా నిలచిన మూల పుస్తకాల గురించి కొంతయినా తెలిసి ఉండాలి. విశ్వనాథ ఆలోచనా సరళి తెలుసుకొని ఉండాలి. భారతీయ తాత్త్విక చింతనతో కాస్తయినా పరిచయం ఉండాలి. ముఖ్యంగా, విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో పాటూ, భారతీయ ధర్మం అంటే కనీస గౌరవం ఉండాలి.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
