Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-9

[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

“నవల నవలగా వ్రాయుటయే గానీ దాని యందు, కశ్మీరు రాజుల చరిత్ర, వారి కాలము, పాశ్చాత్యులు నిరూపించిన కాలములోని దోషములు మొదలైనవి నిరూపించుట ఉండును.”

 కశ్మీర రాజవంశావళి నవలల్లో చివరి నవల ‘కవలలు’,  ముందుమాటలో రాజతరంగిణి ఆధారిత ఆరు నవలల రచనలోను ప్రేరణగా నిలిచిన ప్రధాన ఆలోచనను స్పష్టంగా చెప్పారు విశ్వనాథ.

విశ్వనాథ వారి ఈ ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుంది శ్రీ కోట వేంకటాచలం గారి పరిశోధనాత్మక రచన ‘Chronology of Kashmir History Reconstruction.’ ఈ పుస్తకంలో కోట వెంకటాచలం గారు భారతీయ సమగ్ర చరిత్రతో కశ్మీరు చరిత్రను పోలుస్తూ, కశ్మీరు రాజతరంగిణిలో కల్హణుడు సూచించిన కాలగణనను, రాజుల పాలన కాలాన్ని, భారత చరిత్ర కాలగణనతో, రాజుల కాలాలతో పోలుస్తూ, రాజతరంగిణి ఆధారంగా కశ్మీరు చరిత్రను నిర్మించి చూపారు. ఈ చరిత్రను పాశ్చాత్య చరిత్ర పరిశోధకులు ఏ రకంగా విస్మరించి, తమ ఇష్టం వచ్చినట్టు, ఎలాంటి ఆధారాలు, నిరూపణలు లేకుండా తమకు తోచిన రీతిలో నిర్మించారో వివరించి, వారు నిర్ధారించిన చరిత్ర సాంప్రదాయక చరిత్రతో సరిపోకపోవటం, లోపాలు పొరపాట్లు అన్నిటినీ ఎత్తి చూపించి, సవరించారు. అందుకు పుస్తకం పేరు ‘Chronology of Kashmir History Reconstruction.’.

‘Reconstruction’ ఎందుకంటే పాశ్చాత్య చరిత్ర రచయితలు అబద్ధాలు, ఊహల పునాదులతో కశ్మీరు చరిత్రను నిర్మించారు. వారి ఊహలు, అబద్దాలను బద్దలుకొట్టి, వాటి స్థానే నిర్ధారితమైన ఆధారాలు, పట్టిష్టమైన వాదనలు, సత్యం అధారంగా కశ్మీరు చరిత్రను పునర్నిర్మించారన్న మాట.

ఈ పునర్నిర్మాణానికి  నాందీ ప్రస్తావనగా  ఆయన కశ్మీరు చరిత్రలో  పాశ్చాత్యులు కావాలని చేసిన దోషాలను ఎత్తి చూపించారు. వాటిల్లో ప్రధానమైనది, అలెగ్జాండర్‌తో పొరాడిన ‘సాంద్రకోటస్’ విషయంలో మౌర్య, గుప్త చంద్రగుప్తుల నడుమ పొరపడి భారతదేశ చరిత్రను 1200 సంవత్సరాల పైగా కుచింపచేయటం. ఈ పొరపాటును సరిచేసి, భారతీయ కాలగణన ఆధారంగా సరైన చరిత్రను నిరూపిస్తూ విశ్వనాథ పురాణవైర గ్రంథమాల నవలలు రచించారు.

కశ్మీరు చరిత్ర కలియుగారంభం నుంచి ఆరంభమవుతుంది. కల్హణుడు లౌకికాబ్దం ఆధారంగా కాలగణన చేసి రాజతరంగిణిలో ఆయా తేదీలను ఇచ్చాడు. విదేశీ చరిత్ర రచయితలు, మహా భారత యుద్ధకాలం, కలయుగారంభం వంటి ప్రామాణికాలను విస్మరించి, అలెగ్జాండర్ దండయాత్ర కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని అటూ ఇటూ చరిత్రను నిర్మించారు. భారతీయ కాలగణనను పూర్తిగా వదలి, పాశ్చాత్య లెక్కలకు తగ్గట్టు కశ్మీరు చరిత్రను రచించారు. దీంతో మహా భారత యుద్ధం ఆధారంగా కల్హణుడు చూపిన రాజుల పాలన కాలాలు తేదీలు తారుమారైపోయాయి. దీనికి తోడు శ్రీకృష్ణుడు చారిత్రక  పురుషుడు కాదు, అతడి లీలలు కట్టుకథలు, పురాణాలు నమ్మదగినవి కావు అంటూ ఓ ప్రచారం తీవ్రంగా సాగుతోంది. ఈ ప్రచారం ఈనాటికీ కొనసాగుతోంది. “మన పురాణాలు చరిత్ర కాదు, అన్ని కట్టుకథలు” అని పాశ్చాత్య కళ్లద్దాలు ధరించిన ఆధునిక మేధావులు  బల్లలుగుద్ది మరీ వాదిస్తున్నారు. కశ్మీరు చరిత్ర పునర్నిర్మాణం పుస్తకంలో కోట వెంకటాచలం గారు కల్హణుడి కాలగణన ఏ రకంగా ఇతర పురాణాల కాలగణనతో సరిపోతోందో, ఇతర ప్రాంతాల రాజవంశావళులతో ఎలా కచ్చితంగా సరిపోతోందో నిరూపించారు. ఇది విశ్వనాథకు ‘యశోవతి’ నవల రచనకు ప్రేరణ.

రాజతరంగిణిలో ‘యశోవతి’ గాథ ఉంది. ఆమె భర్త కృష్ణవైరం పాటిస్తాడు. కృష్ణుడి చేతిలో మరణిస్తాడు. అంటే, కృష్ణుడు చారిత్రక పురుషుడు. కృష్ణుడనే వాడు ఈ భూమిపై రక్తమాంసాలతో నడయాడాడు. అతడిని రక్తమాంసాలతో సజీవంగా చూసినవారు రాసిన రాతలు లభిస్తున్నాయి. ఆ రచనల ఆధారంగా కల్హణుడు రాజతరంగిణి రచించాడు. రాజతరంగిణి ఈ కథ ఆధారంగా భారతీయ కాలగణన కచ్చితత్వాన్ని నిరూపిస్తూ, శ్రీకృష్ణుడి చారిత్రకత విషయంలో ఉన్న సందేహాలను పటాపంచలు  చేస్తూ, నిజాన్ని నిరూపిస్తూ,  మొదటి తరంగిణిలో ఉన్న కథను ఆధారంగా చేసుకుని ‘యశోవతి’ నవలను సృజించారు విశ్వనాథ.

రాజతరంగిణిలో మొదటి తరంగంలో 59వ శ్లోకం నుంచి 74వ శ్లోకం వరకూ మహాభారత కాలంలో పాలించిన గోనంద వంశ పాలన కాలంలో సంభవించిన సంఘటనల వర్ణన ఉంది. బలరాముడు మొదటి గోనందుడిని సంహరించిన తరువాత మొదటి దామోదరుడు రాజు కావటం, అతడు శ్రీకృష్ణవైరం పూని,   శ్రీకృష్ణుడి చేతిలో మరణించటం, ఆ పై  శ్రీకృష్ణుడు  గర్భవతి అయిన యశోవతికి రాజ్యం కట్టబెట్టటం వంటి సంఘటనలు  ఉన్నాయి.

ఒక మహిళకు సింహాసనం అప్పగించటం పట్ల కనబడిన వ్యతిరేకతను అణచి శ్రీకృష్ణుడు ఆమెకు సింహాసనం అప్పగించటం, ఆ సమయంలో కశ్మీరు పార్వతి, రాజు శివాంజుడు అన్న ప్రసిద్ధ శ్లోకాన్ని చెప్పటం రాజతరంగిణిలో కనిపిస్తుంది. ఆ తరువాత తన సంతానం రాజ్యం చేసే వయసు వచ్చే వరకూ యశోవతి జనరంజకంగా రాజ్యం చేసి వయసు వచ్చిన కొడుక్కు రాజ్యం అప్పగించటంతో రాజతరంగిణిలో యశోవతి కథ పూర్తవుతుంది.

ఒక రచయిత కథను ఎన్నుకొనేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక లక్ష్యంతో రచన చేస్తున్న రచయిత కథాంశాన్ని ఎన్నుకునేందుకు అనేకానేక విషయాలను పరిగణించాల్సివుంటుంది. రాజతరంగిణిలో ప్రదర్శితమైన కథలో విశ్వనాథ లక్ష్యాలను, ఆధర్శాలను, సమాజానికి ఆయన వివరించదలచుకున్న  విషయాలను పొందు పరచేందుకు ‘యశోవతి’ కథలో  ఎంతో వీలుంది.

ముందుగా, శ్రీకృష్ణుడి సమకాలీన సమాజాన్ని ప్రదర్శించవచ్చు. అంటే, శ్రీకృష్ణుడిని  చారిత్రక వ్యక్తిగా నిరూపించవచ్చు. శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శిస్తున్న సమయంలో, ఆయన సమకాలీనుల భావనలను వర్ణించే వీలు చిక్కుతుంది. శ్రీకృష్ణుడి పై ఆధునిక సమాజంలో ప్రదర్శితమవుతున్న వ్యతిరేకతను అప్పటి   సమాజంలో ఆరోపించి అప్పటివారికి సమాధానివ్వటం ద్వారా ఇప్పటి సమాజంవారికీ సమాధానాలివ్వవచ్చు.  ఇక్కడే చరిత్ర ఆధారిత కల్పనిక రచనల రచయితలకు ఉండే ఒక వెసులుబాటును ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

చరిత్ర గతానికి సంబంధించినదయినా దాని ప్రభావం వర్తమానంపై ఉంటుంది. వర్తమానం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.  అంటే, గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భవిష్యత్తును ఊహించే వీలు చిక్కుతుంది. కాబట్టి, వర్తమానంలో ఏవైతే  చేదు నిజాలను ప్రస్తావిస్తే, ప్రజల మనోభావాలు  దెబ్బతింటాయో, వాటిని గతంపై  ఆరోపించి నిర్మొహమాటంగా ప్రదర్శించే వీలు చరిత్ర ఆధారిత కాల్పనిక  రచయితకు లభిస్తుంది. ఇదే వర్తమానాన్ని భవిష్యత్తులో ఆరోపించి నిక్కచ్చిగా ప్రదర్షించే వీలు సైన్స్ ఫిక్షన్ రచయితలకు లభిస్తుంది. ఈ వెసులుబాటును విశ్వనాథ తన చరిత్ర ఆధారిత రచనలన్నింటిలో అద్భుతంగా ఉపయోగించారు.

‘యశోవతి’ నవలలో కొట్టొచ్చినట్టు కనబడే మరో అంశం కృష్ణ ద్వేషం.  కృష్ణప్రేమనూ, వ్యతిరేకతనూ   ఆనాటి సమాజంలో ఒకే వేదికపై చూపవచ్చు.  రెండు విభిన్న దృక్కోణాలున్న భార్య, భార్తలు సహజీవనం చేయటం చూపిస్తూ, భారతీయ జీవన విధానంలోని దాంపత్య సంబంధ ఔన్నత్యాన్ని అందంగా ప్రదర్శించవచ్చు. ప్రతి చిన్న విషయానికీ పురుషుడిని దూషించి, వివాహబంధాన్ని పెటాకులు చేసుకోమని చెవినిల్లు కట్టుకుని పోరాడుతున్న అభ్యుదయ విచ్ఛిన్నకారుల దురాదర్శాల వాదనలను తూట్లు పొడవవచ్చు.

ఇంకో ప్రధాన అంశం ఏమిటంటే, తెలిసీ తెలియని ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సమాజాలను చూసి, వాటిని భారత్‌లో ఆరోపించి, తరతరాలుగా భారతదేశంలో మహిళ అణచివేతకు గురవుతున్నదనీ, ఆమెని భారత పురుషుడు అణగదొక్కేస్తున్నాడనీ పలు రూపాల ఆకర్షణీయమైన అనారోగ్యకరమైన దుష్ప్రచారాలు ఎప్పటి నుంచో  చేస్తూనే ఉన్నారు. ‘యశోవతి’ కథ వారందరి ప్రచారాలలోని డొల్లతనాన్ని, అవగాహన రాహిత్యాన్ని, కావాలని సత్యాలను వక్రీకరించి చేస్తున్న అసత్య అనర్థపూర్వక ప్రచారాలనూ  తిప్పికొట్టే వీలునిస్తుంది.

తరతరాలుగా అణగద్రొక్కేస్తున్నారు  మహిళను అని వాపోతూ,మహిళోద్ధరణ ముసుగులో   భారతీయ ధర్మ ద్వేషం ప్రదర్శిస్తున్న    వారందరినీ నిలదీసి “ఏ తరం నుంచి అణచివేత మొదలయింది?” అని నిక్కచ్చిగా  అడిగే వీలునిస్తుంది ‘యశోవతి’ కథ. యశోవతి రాణి.  గర్భవతి. ఆమె భర్త శ్రీకృష్ణుడితో యుద్ధంలో మరణించాడు. ఆమె రాజ్య బాధ్యతలు స్వీకరిస్తూంటే కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అభ్యంతరాలు చెప్పిన వారంతా  సింహాసనంపై కన్నేసినవారు. సింహాసనంపై ఆశతో వారు ‘రాణి’ రాజ్యభారం స్వీకరణకు అభ్యంతరం చెప్పారు తప్ప,  వారికి నిజంగా మహిళ రాజ్యభారం వహించటంపై అభ్యంతరం ఉండి కాదు. కశ్మీరులోనే కాదు, భారతదేశంలో, భారతీయ ధర్మంలో మహిళకు అత్యున్నత స్థానం ఉంది. అత్యంత గౌరవం ఉంది. ఈ నిజాన్ని ‘యశోవతి’, ఒక మహిళ, క్రీ.పూ.3000 సంవత్సర ప్రాంతంలో కశ్మీరును పాలించటం ద్వారా తిరుగులేని రీతిలో ప్రదర్శించింది. పైగా, రాణి, సామ్రాజ్యాన్ని స్వీకరించేందుకు ఎవరూ అడ్డు పెట్టలేని రీతిలో శ్రీకృష్ణుడు “కశ్మీరు పార్వతి” అని, “కశ్మీరు రాజు శివుడు” అనీ, “రాజు ఎంతటి దుష్టుడైనా కశ్మీరును చెడు దృష్టితో చూడకూడద”నీ స్పష్టంగా చెప్పాడు. అంటే, మహిళ రాజ్యాధికారం  స్వీకరించేందు దైవం అనుమతి, ధర్మం ఆమోదం కూడా ఉందన్నమాట. అంటే, ‘యశోవతి’ నవలను ఆధారం చేసుకుని భారతీయ మహిళ ఔన్నత్యాన్ని,  ఆమె అనుభవించిన గౌరవం,  స్వేచ్ఛ స్వతంత్రాలను నిరూపించ వచ్చన్న మాట. తద్వారా ఆధారాలు లేని, అవగాహన లేని విచ్ఛిన్నకర వాదనలను చెత్త డబ్బాలో పారేయవచ్చు.

వీటికి తోడు, ఇది హిస్టారికల్ ఫిక్షన్ కాబట్టి,  యశోవతి నవలలో సందర్భాన్ని, అవసరాన్ని అనుసరించి పాత్రలను ఔచితీపరంగా సృష్టించవచ్చు. వారి ద్వారా సందర్భానుసారంగా భారతీయ చరిత్ర, మనస్తత్వం, తత్వచింతన, ఆలోచనా విధానం, జీవన విధానం, అన్వేషణ, పరిశోధనల వంటి అనేక విషయాలను పాఠకులకు చేరువ చేయవచ్చు.

ఇదీ విశ్వనాథ ‘యశోవతి’ నవల రచన వెనుక ఉన్న ఊహకందే కారణాలు.

కొందరు తెలియనివారు, విశ్వనాథ నవలలు చరిత్ర కాదు, ఊహలు అంటారు. తనకు తోచింది రాసుకు పోయాడని వ్యాఖ్యానిస్తారు. వారికి  చరిత్ర ఆధారిత కాల్పనిక  రచనల విషయంలో తెలియని మౌలిక సూత్రం ఒకటి ఉంది. ఎలాగయితే, సైన్స్ ఫిక్షన్ రచనలో ప్రతిపాదితమైన  ప్రతి అంశానికి విజ్ఞాన శాస్త్రంలో ఆధారాలుండాలో, అలాగే చరిత్ర రచనలో రచయిత ప్రదర్శించిన ప్రతి విషయానికి ఆధారాలుండాలి. ఏదో గాలిలో ఊహించేసి, అసంబద్ధంగా, అర్థం పర్థం లేకుండా, అనౌచిత్యంగా రాసేయటం కుదరదు. ప్రతి వాక్యానికీ, ప్రతి ప్రతిపాదనకు, ప్రతి వాఖ్యకూ నేపధ్యం ఉండాలి. ఆధారం ఉండాలి. ప్రతి ఊహకూ బీజం నిజంలో ఉండాలి. నిరూపణ అయిన సత్యంతో సంబంధం  ఉండాలి. సైన్స్ ఫిక్షన్ రచన అయినా, హిస్టారికల్ ఫిక్షన్ రచన అయినా ఇది ప్రధాన సూత్రం. మౌలిక సూత్రం.

“అది విదేహ రాజ్యము. మిథిలా నగరము. త్రేతా యుగములో పరమ వైరాగ్యవంతులు వేదాంతవేత్తలు అయిన మహరాజులు పాలించిన నేల. ఆ రాజులు అనాటి నుండి సామ్రాజ్యములు నిర్మించు నూహలేని వారు. తత్త్వవేత్తలు. ఆ రాజ్యము ద్వాపర యుగమునందు ధర్మ రాజ్యముగా నుండెను. ఇతర రాజులు ఆ దేశమును ఆక్రమించుటకు ప్రయత్నమే చేయలేదు. చేయట భారతదేశము మర్యాదకు భంగమైన విషయము.”

ఇవి ‘యశోవతి’ నవల ప్రారంభ వాక్యాలు. ఇందులో ప్రతి వాక్యం వెనుక ఎంతో ఆలోచన ఉంది. ప్రతి పదం వెనుక మహత్తరమైన అర్థం ఉంది. తెలియనివారు ఇదంతా పుక్కిటి  పురాణం, అనవసరం, కథ ఆరంభమైపోవాలి, ఇదంతా అనవసరం అనే వీలుంది. విశ్వనాథ భారతీయ ధర్మం గొప్ప చెప్పేందుకు కల్పించి రాశాడనే వాదన చేసే వీలూ ఉంది.

ముందుగా ‘ఇతర రాజులు ఆ దేశమును అక్రమించుటకు ప్రయత్నమే చేయలేదు. చేయుట భారత దేశము మర్యాదకు భంగమైన విషయము.’ అన్న వ్యాఖ్య దగ్గరకు వస్తే, భారతదేశం శాంతికాముక దేశం. పొరుగు దేశాలపై దాడి చేయటం కానీ, ఆక్రమించి అణచివేయటం కానీ, అనవసరంగా హింసించటం కానీ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా తీవ్రవాదులు చావగొడుతుంటే, మాకూ శక్తి ఉందని నిరూపించేందుకు ఒకటో, రెండో స్థావరాలను ధ్వంసం చేసి ఆగుతున్నాం. అంతలోనే దేశంలో “యుద్ధం వద్దు. శాంతి ముద్దు” అంటూ గోల చేసేవాళ్లు, పొరుగు దేశాన్ని ప్రేమించమని బోధించేవాళ్లు; ఒక చెంప కొడితే, ఇంకో చెంప చూపమని హితవు చెప్పేవాళ్లూ,  అడుగడుగునా దేశంలో ఉన్నారు. కాబట్టి, ఒక దేశాన్ని ఆక్రమించటం, ప్రజలను హింసించటం, వారి కట్టడాలను ధ్వంసం చేసి, మతాన్ని రుద్దటం భారతీయ ధర్మం కాదు. దీనికి నిరూపణ ‘యశోవతి’ కథనే.

దామోదరుడిని సంహరించిన తరువాత రాజు లేని కశ్మీరును ఆక్రమించమని మంత్రులు సలహా ఇస్తే శ్రీకృష్ణుడు “కశ్మీరాః పార్వతీ” అన్న శ్లోకం చెప్పి, యశోవతికి కశ్మీరు రాజ్యం అప్పచెప్పాడు. ఇతర రాజ్యాన్ని ఆక్రమించటం భారతదేశ మర్యాదకు భంగమైన విషయం  అనటం వెనుక ‘పరాయివాడి దానిపై కన్నేయకూడదు’ (“మా గ్రుధాః కస్య-స్విత్ ధనం) అన్న భారతీయ తత్వం  ప్రభావంతో ఎదిగిన భారతీయ జీవన విధానం, తద్వారా రూపొందిన భారతీయ మనస్తత్వం ఉన్నది.

“అది విదేహ రాజ్యము. మిథిలా నగరము. త్రేతా యుగములో పరమ వైరాగ్యవంతులు వేదాంతవేత్తలు అయిన మహరాజులు పాలించిన నేల” అన్న వ్యాఖ్య గురించి కొంతలోతుగా చర్చించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version