[2026 మార్చ్ 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘విశ్వనాథ వారి దృష్టిలో రావణుడు..’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
నిజముగఁ చూడు రామ తరుణీ! శివునిం గికురించినాడఁ గం
ఠజ నవరక్త వారి విలుఠత్ఫల మూర్ధములే యొసంగి, యం
బుజ సదృశంబు నీ చరణ మోహన పీఠము నందు నాదు స
ర్వ జని ఫలంబు నర్పణము పట్టితి, ముట్టితి శ్రీ రహస్యమున్!
(రామాయణ కల్పవృక్షము- అరణ్యకాండము – జటాయుఃఖండము – 384)
ఈ పద్యంలో రావణుడు తన గొప్పదనాన్ని (శివునిం గికురించిన) చెప్పినా అనాలోచితంగానో, ఆలోచనాపూర్వకంగానో తాత్వికమైన రహస్యాన్నీ, తన అంతరంగాన్నీ ఆవిష్కరించాడు. “ఏవం చైత దకామాం తున త్వాం స్ప్రక్ష్యామి మైథిలి!” అని. (సుందర- 20-6). “నాపై అకామవైతే నిన్ను తాకను” అంటాడు రామాయణంలో రావణుడు. ఎందుకు అంటే.. శాపం అనే కారణాన్ని ప్రక్కన పెడితే.. “అక్షరాణాం అకారోఽస్మి” (భగవద్గీత) నీవు “విష్ణుమూర్తి (రాముని) భార్యవు కాబట్టి నిన్ను నేను తాకను”- అనేది రావణుని మాటలోని ఆంతర్యం. మరామెను ఏమాశించి తెచ్చాడు? అంటే మోక్షాపేక్షతోనే అనేది స్పష్టం. తనలోని జీవుని వేదనను రావణునిలో దర్శించిన విశ్వనాథ హృదయానికి దర్పణం పై పద్యం. శ్రీమంజూషిక అనే కల్పవృక్షంలోని మొదటి పద్యంలో శ్రీవిద్యారహస్యమున్న విషయాన్ని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారు సోపపత్తికంగా వివరించారు.. గుంటూరు శేషేంద్ర శర్మగారు రామాయణ రహస్యాల షోడశిలో కూడా ఈ విషయాన్ని వివరించారు.
నిజానికి వైరభక్తితో రాముని పదేపదే జ్ఞాపకం చేసుకుని హరిహర అభేద భావనతో అనంత చైతన్య స్వరూపంలో లయమవడానికి జీవుడు పడే వేదనకు.. సీతపై వ్యామోహాన్ని చూపడమనేది పైకి కనిపించే కారణం మాత్రమే. నిజముగ అనడంలో ఇదే నిజమనే విషయాన్ని రూఢిగా చెప్పుతున్నాడు. శాశ్వత సత్యానికి మూడు రూపాలున్నాయి. మొదటిది వాస్తవం. అది వస్తురూపమయినది. రెండవది నిజం. అది అందరూ ఒప్పుకున్నట్టిది. దార్శనికులైన ఋషులు, మునులు, ప్రవచకులు, సామాజిక శాస్త్రవేత్తలు తాము దర్శించిన సత్యాన్ని సమాజానికి అందించి, మీమాంసల ద్వారా నిరూపించి అందరితో ఒప్పించినది “నిజము”. వీటన్నింటికీ అతీతమైనది, శాశ్వతమైనది సత్యం. ఇది ధార్మిక జీవనం ద్వారా దర్శించదగినది. ఆచరించదగినది. ఎవరి ఇష్టాయిష్టాలకు లొంగనిది. ఆ నిజాన్ని చెపుతున్నానంటున్నాడు, రావణుడు. ఇక్కడ నిజాన్ని మాత్రమే చెపుతున్నాడు.
రామతరుణీ! అనడంలో రాముని యొక్క స్త్రీ, సీతా అనే సంబోధన ఉన్నది. కాని రామ అనడంలో రమింపచేసేది. రమింపచేస్తూ సౌందర్యలహరిని ప్రవహింపచేసేది ఆ లలితా పరమేశ్వరియే. ఆమెయే సౌందర్యంతో వెలుగుతూ ఆనందాన్ని కలిగించే రాజరాజేశ్వరుని రాణియైన శ్రీ లలితాంబిక. దేనిని రమింపచేసేది? అంటే తన నారాధించే, ఉపాసించే యోగుల, తాపసుల హృదయాలను రమింపచేసేది. హృదయం మనస్సుకు అతీతమైనది. మనసు లౌకిక కామభావనాపూర్ణమైనది.. దానికి అతీతమైనది హృదయం. మనస్సు ఇంద్రియాలపై ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలచే లభించేది సంతోషమే (pleasure). అది క్షణికం. ఆ ఇంద్రియాల ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని కాదని లేదా జయించి ముందుకు సాగే సాధకుడు హృదయం ద్వారా రమిస్తాడు. అది ఆనందం (Happiness). ఇది చైతన్యరసాన్ని ఆస్వాదిస్తుంది. నిరంతరమా చైతన్య రసాస్వాదన చేసే తల్లి లలితాంబికయే. హృదయావిష్కృత ఆనందం క్షణికం కాకపోయినా శాశ్వతం కాదు. అందులో తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలనే తపన ఉంటుంది.
తరుణీ అంటే ఎల్లప్పుడు యౌవన శోభతో వెలుగు తల్లి. ఆమె తాపసులతో ఆరాధింపబడుతుంది. రావణుడు తాపసి. రావణుడు, పైకి చూస్తే ఇంద్రియవ్యామోహియై సీతను ఎత్తుకు వెళుతున్నాడని అనిపిస్తుంది. కాని సీతను తీసుకువెళ్ళడం ద్వారా తాపసారాధ్యయైన (తరుణీ తాపసారాధ్యా.. లలితా సహస్రనామాలు) సీతాదేవి కారణంగా తాను తరించేందుకు మార్గాన్ని వేసుకుంటున్నాడని భావించాలి. అందుకే తరుణీ అనే పదాన్ని ప్రయోగించాడేమో. తరుణీ అనడం తరింప చేసేది అనుకోవాలి. రామతరుణీ అనడంలో రమింపచేసేది, తరింపచేసేది అనుకోవచ్చు. హృదయాన్ని రమింపచేస్తూ, తనను ఈ జననమరణచక్రం నుండి తరింపచేసేది.. రామతరుణి. అదే సీతా.. అదే లక్ష్మీదేవి.. అదే రాజరాజేశ్వరి.. రావణుడు, ముందుగా ఇంద్రియలోలుడై తిరిగాడు. కొంత సాధన చేసాక తనకు అది శాశ్వతం కాదనే జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానంలో జరిగిన సాక్షాత్కారం (Realisation) తాను తరించేందుకు లేదా ఉన్న స్థాయికన్నా ఉన్నత స్థాయిని పొందేందుకు మార్గం చూపింది. తనను తరింపచేసే మార్గం తెలిసాక ఆ మార్గాన్ని అనుసరించే ప్రణాళికలో సీతాపహరణను చేసాడు. శివుడు ఆనందమయుడు.. నిరంతరానందమగ్నుడై రమిస్తుంటాడు. అతడే స్థాణువు. అంతటా నిండినవాడు. అంతటా నిండిన వాడిని కదిలించాను అనడంలో, అందులో తానూ ఉన్నాడు కదా.. ఎలా కదిలిస్తాడు? అంటే భౌతికంగాకాదు. తపోదీక్షలో కరిగించే ప్రయత్నం చేసాడు. కరిగితే కదిలే అవకాశం ఉంటుందికదా.. అహంకార భరితమైన వ్యామోహంలో అలాంటివాడినే కదిలించిన వాడిని అంటున్నాడు. అలా కైలాసాన్ని కదిలించినపుడు అమ్మ కోపించింది. నిరంతర ఆనందమయుడైన శివుడూ రావణుని సాధనకు కరగలేదు. స్పందన లేదు. “శివా” అనగా లలితాదేవి. ఆమె శుద్ధమై, శోభాయుతమై, శుభాన్ని కలిగించే తల్లి. ముట్టితి శ్రీరహస్యమున్ అనే మాటతో శివాయే లక్ష్మీదేవి లేదా సీతాదేవి రూపంలో వచ్చిందని.. అలా రావడం తనకు మోక్షం కలిగించడానికేనని గ్రహించినట్లుగా విదితమౌతుంది. తన జీవన ఫలసర్వస్వాన్ని సమర్పించి ఆమె మెప్పు పొందాలనుకున్నాడు. అమ్మవారిని ప్రార్థించాడు.. పాదాలవద్ద తన “సర్వజనిఫలము” (జన్మజన్మల తపః ఫలితాన్ని) సమర్పిస్తానన్నాడు. ఆమె శివుని ప్రియురాలు కాబట్టి ఆమెను ఆశ్రయించాడు. ఆమె కరిగిపోయింది. దానితో ఆమె ప్రసరింపచేసిన కడకంటి చూపుతో కరిగిపోయాడు శివుడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, రావణుడు. ఆత్మార్పణ అనే తర్పణముతో పూజింపబడే తల్లి (రహస్తర్పణతర్పితా) లలితాదేవి కాబట్టి తన శిరస్సులను ఖండించుకొని ఆ అమ్మలో సగమైన శివునకు పుష్పాలుగా సమర్పించాడు. తన క్రొన్నెత్తురు తర్పణంగా శివుడిని అభిషేకించాడు. నెత్తురుతో ఎందుకు అభిషేకించాడు? అమ్మవారు శక్తిరూపంలో రక్తంలో ఉంటుంది. అందుకే ఆమెను “రుధిరసంస్థితా” అంటుంది లలితాసహస్రనామాలు. దానితో అమ్మ సంస్పర్ష తగిలిన అయ్యవారు కరిగిపోయాడు. ఆ ప్రయత్నంలో తనకు కలిగిన ఆనందం పై స్థాయిలోని పరమానంద (Bliss) స్థితికి వెళ్ళింది. అయితే అక్కడ రావణుని అహంభావం పూర్తిగా అణగారలేదు.. ఇంకా ఏదో సాధించాలనే తపన చల్లారలేదు. అతని సాధన ముందుకు సాగింది. అక్కడ అతనికి మార్గం కనిపించింది. సీతామాత రూపంలో రాముని చేత మరణించి శాశ్వతానంద స్థితి లేదా బ్రహ్మానంద స్థాయికి (ecstasy) చేరవచ్చుననే సత్యం అవగతమయింది.
రావణునిది రాక్షస ప్రవృత్తి. శ్రీరాముని పొందడానికై సీతను తపింపచేసాడు. తాను అహంకారి కాబట్టి నారాయణుని పొందడానికై స్వయంగా ఆర్తిని ప్రకటించడు. సీతయందు ఆర్తిని సృష్టించాడు. సీత ఆర్తికి స్పందించిన రాముడు స్వయంగా లంకకు వస్తాడని ఆ జీవుని తపన. సీత తన వశమైతే.. తాను ప్రకృతిని జయించిన వాడవుతాడు. ఆమె తన వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేని నాడు తాను పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరేందుకు సీత కారణమౌతుంది. వైరభక్తిలో శిక్షయే వరం అవుతుంది.. (ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు).
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.
