[‘విశ్వనాథ ‘వీరపూజ’లో ఇస్లామోఫోబియా? – ఒక విశ్లేషణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు హేలీ కళ్యాణ్.]
విశ్వనాథ ‘వీరపూజ’లో తురుష్కుల మతం గురించిన ప్రస్తావనలలో ఇస్లామోఫోబియా ఉన్నట్టా? ఈ నవలలో ఇస్లాం గురించి విశ్వనాథ చేసిన పరిశీలనాత్మక విమర్శల ఆధారంగా ఇప్పటి మేధావివర్గపు వర్గీకరణల ప్రకారం ఆయనను ఇస్లామోఫోబిక్ హిందుత్వవాది అని అనవచ్చునా? అన్న ప్రశ్నల గురించిన ఆలోచనలు ఈ వ్యాసం రాయటానికి ప్రధాన కారణం.
ముందుగా కొంత నేపథ్యం.
ఆ మధ్యన రచయిత రాణి శివ శంకర శర్మ గారితో భైరప్పలో ఉన్న హిందుత్వ వాదం విశ్వనాథలో లేదు అన్న విషయంపైన అంతర్జాల మాధ్యమంలో ఒక చర్చ జరిగింది.
“ఆయన ఆవరణ నవలలో సృష్టంగా కమ్యూనలిజం కనబడ్తుంది. ఇస్లామోఫోబియా ముస్లిం వ్యతిరేకత వుంటుంది. విశ్వనాథలో ఆ లక్షణం అంతగా కనబడదు”
“బైరప్ప సంస్కృతీకరణ వాది, విశ్వనాథ అలా కాదు. విశ్వనాథ యథాతథవాది”
“అలాగే బైరప్ప కులనిర్మూలనవాది అదే సమయంలో మతతత్వ వాది. ఈ లక్షణాలు గాడ్సే సావర్కార్ లలో కనబడతాయి. బైరప్ప అదే దారిలోకి వెళ్ళాడు కానీ విశ్వనాథ లో హిందుత్వవాదం అంతగా కనబడదు”
“సనాతనవాదంకి హిందుత్వకి కొంత ఘర్షణ ఉంటుంది. (హిందూత్వకు) ఆధునికతతో ఘర్షణ తక్కువ. ఆధునికతకే హిందుత్వ దగ్గర దారి. మోడీ కూడా ఇక్కడకు వచ్చినప్పుడు గురజాడ గేయం చదివాడు కానీ విశ్వనాథ పద్యం కాదు”
ఇలా తనదైన శైలిలో కొన్ని ప్రతిపాదనలు చేశారు శర్మ గారు.
భైరప్పలో ఇస్లామోఫోబియా ముస్లిం వ్యతిరేకత కనపడుతుందని విశ్వనాథలో అది లేదు అన్న శర్మగారి మాట నన్ను ఆలోచనలో పడేసింది. నేను భైరప్పను పెద్దగా చదవలేదు కానీ విశ్వనాథను చదివాను కనుక ఆ సందర్భంలో నేను ‘వీరపూజ’ నవల ప్రస్తావన తెచ్చాను ఆయనతో. శర్మగారు తాను ఆ నవల చదవలేదు అని అన్నారు. అయితే అందులో ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు వాడుకలో ఉన్న ‘ఇస్లామోఫోబియా’ నిర్వచనానికి సరిపోతుందని నేను అనట్లేదు కానీ తన ఇతర నవలల కంటే భిన్నంగా ఇస్లాం మతం గురించి ముసల్మాను పాలకుల దండయాత్రల గురించి కొన్ని ఘాటైన విమర్శలు ఖచ్చితమైన భావాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. వాటి గురించిన చర్చ ఈ వ్యాసం ఉద్దేశం.
‘ఇస్లామోఫోబియా’ అన్న పదం వాడుకలోకి ఈ మధ్యనే వచ్చింది. 90ల దశకం తర్వాత వాడుక పెరిగింది. అమెరికా ట్విన్ టవర్స్ ఉదంతం తర్వాత బాగా వ్యాప్తిలోకి వచ్చింది. విశ్వనాథ కాలంలో ఈ పదం వాడుకలో లేదు. కాబట్టి ఆయన కాలానికి ఈ పదాన్ని ఆపాదించడం బహుశా సరికాదేమో.
సనాతన సంప్రదాయ వాదానికి ఆరెస్సెస్ బీజేపీ ముందుకు తెచ్చిన హిందూత్వకు కొన్ని విషయాలలో తేడా ఉండి ఉండవచ్చు. కరపాత్ర స్వామి వంటి వారు ఎన్నో దశాబ్దాల కిందటే అప్పటి ఆర్ ఎస్ ఎస్ భావజాలం గురించిన విమర్శ చేస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. ఇటువంటి భావజాల చర్చలలో కొన్ని తేడాలు అభిప్రాయ భేదాలు సహజం. ఇవన్ని మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నవే. సంస్కరణ వాదానికి సంప్రదాయవాదులకు మధ్యన ఉన్న సంఘర్షణ కూడా సనాతనమైన సంఘర్షణే. ఆంగ్లేయుల కాలంలో అవి పెరిగాయి. ప్రపంచం మొత్తం మీద కూడా యూరోపు ఎన్లైటెన్మెంట్ ప్రభావం వలన నేషన్ స్టేట్ అన్న రూపకల్పన జరిగిన తర్వాత ఎన్నో కొత్త భావజాలాలు పుట్టుకు వచ్చాయి. క్రైస్తవ సమాజాలలో ప్రొటెస్టెంట్ భావాల గురించిన చర్చ ఎలాగూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే సనాతన వాదానికి హిందుత్వకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు ఉండచ్చు.
ఆధునికతతో ఘర్షణల గురించి శర్మగారి మాట సబబైనదే. ఆధునికత గురించిన విమర్శలో శర్మగారితో నాకు విభేదం తక్కువే.
విశ్వనాథను సనాతనవాదానికి ఒక ప్రతీకగానే భావిస్తాను నేను. కాబట్టి కొన్ని విషయాలలో ఆయన రాసిన మాటలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న హిందుత్వ రాజకీయాలకు మధ్యన కొన్ని విభేదాలు ఉండచ్చు. అది సహజం. విభేదాలు ఉండక పోతే ఆశ్చర్యం.
వీరపూజ నవలలో ఇస్లాం గురించిన వ్యాఖ్యలే ఈ వ్యాసానికి ప్రధానమైన ముడి సరుకు. సనాతనవాదానికీ గత వంద నూట యాభై సంవత్సరాలలో పైకి వచ్చిన హిందుత్వ భావజాలానికి మధ్యన గల అభిప్రాయ భేదాల గురించిన చర్చ ఈ వ్యాసం పరిధిలోకి రాదు. దాని గురించిన చర్చ జరగవలసిన అవసరం కూడా ఉంది. కానీ ఈ వ్యాసంలో అది కుదరదు.
అయితే ఇస్లాం విషయంలో సనాతనవాదులు నిర్లిప్తతతో కూడుకున్న దృష్టి కలిగి ఉన్నారు కొంత కలుపుగోలుతనం సామరస్య వైఖరిని కూడా కలిగి ఉన్నారు. హిందుత్వ వాదుల వలె ఇస్లామోఫోబియా సనాతన వాదులలో లేదు అన్న ఒక ప్రతిపాదన చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దానిని ఖండించటమే ఈ వ్యాసం ప్రధాన విషయం. సనాతనవాదం అంటే ఇతర మతాలపై తప్పనిసరిగా అభిమానం ప్రేమ ఉండాల్సిన అవసరం లేదనీ పదే పదే ఇస్లాం మతం పట్ల మరింకేదో మైనారిటీ మతం పట్ల ప్రేమాభిమానం వ్యక్తం చేస్తూ ఉదారవాద స్ఫూర్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పటమే ఈ వ్యాసం వ్రాయటం వెనుక నా ఉద్దేశం.
సనాతన సంప్రదాయవాది ఇస్లాం విషయంలో ఖచ్చితంగా నిర్లిప్త ధోరణి వహించాలి అన్న నియమేమీ లేదు. అలాగని ఇస్లాం పై వల్లమాలిన ప్రేమ మరియు అభిమానం ( ఇస్లామోఫిలియా) కురిపించాలన్న అవసరం కూడా లేదు. మితిమీరిన ద్వేషం (ఇస్లామోఫోబియా?) చూపించాల్సిన అవసరం కూడా లేదు.
సనాతన సంప్రదాయవాదికి తన సొంత సంస్కృతి పట్ల ప్రేమ అభిమానం అన్నది ప్రధానం. ఇందులో ఇతర మతాల గురించిన చర్చ తేవటం అనవసర రాజకీయం. సనాతన సంప్రదాయవాదికి సొంత ధర్మం సంస్కృతి అంటే ద్వేషం చిన్నచూపు అవమానభారం ఉండకూడదు. అది ప్రధానమైన లక్షణం. అంతేకాని ఇతర మతాల గురించిన వైఖరి గురించిన చర్చ ప్రధానం కాదు దాని ఆధారంగా సనాతన సంప్రదాయవాది శల్య పరీక్ష చేయనక్కర్లేదు.
ఈ వీరపూజ నవలలో విశ్వనాథ ఇస్లాం గురించిన చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత విశ్వనాథ వారిని శర్మగారి వంటి మేధావులు ఎలా చూస్తారు అన్నది తెలియవలసి ఉన్నది.
హిందుత్వ అంటే మెజారిటేరియనిజం హిందుత్వ అంటే ఇస్లామోఫోబియా అన్న ముద్ర కొన్నేళ్ళుగా నానుతూ ఉంది. అప్పుడు ఈ ఉగ్ర హిందుత్వకు ఒక సౌమ్యమైన సాత్విక ధార్మిక ప్రత్యామ్నాయంగా ఉన్నదే సనాతనవాదం అని ఒక సృజన జరుగుతోందా? అప్పుడు సనాతనవాది ఖచ్చితంగా ఇస్లామోఫిలియా లేదా మైనారిటీ మత ఫిలియా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మైనారిటీ మతాల పట్ల ముఖ్యంగా ఇస్లాం పట్ల కొంత సానుభూతి అభిమానం అన్నది చూపవలసి వస్తుందా? ఇతర మతాలతో కలుపుగోలుతనం స్నేహ దృష్టి వంటి వాటి ప్రదర్శన అన్నది నిరంతరం చేస్తూ ఉండాలా? ఈ కొత్త నిర్వచనం వలన ఇస్లామోఫిలియా అన్నది సనాతనవాదానికి ప్రధాన లక్షణం అవ్వనుందా? ఇటువంటి ఆలోచనల నుంచి మొదలైనదే ఈ వ్యాసం.
ఈ ‘వీరపూజ’ నవల ముసునూరి నాయకుల కాలం నాటి చరిత్ర ఆధారంగా రచింపబడింది. వికీపీడియాలో ముసునూరి నాయకుల గురించి చూస్తే వారు ఇస్లాం దండయాత్రలను ఎదుర్కొన్న విధానం గురించిన కొంత వివరం ఉంటుంది. ప్రతాపరుద్రుని పాలనా కాలం గురించి ఇస్లాం పాలకులతో ఆయన చేసిన యుద్ధాల గురించి ఇవన్నీ ముగిసాక ప్రోలయ నాయకుడు ఇస్లాం దండయాత్రను తిప్పికొట్టిన విధానం గురించి కాపయ నాయకుని గురించి కూడా సాధారణంగా చరిత్ర ఓ మోస్తరుగా చదువుకున్న వారందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది.
పధ్నాలుగవ శతాబ్దపు తెలుగు రాష్ట్రాలలో హిందూ ధర్మానికి చెందిన పాలకులకు ప్రజలకూ ఇస్లాం మతానికి చెందిన సైన్యాలకూ మధ్యన జరిగిన సంఘర్షణ గురించిన పుస్తకం ఇది. పైన చెప్పిన భైరప్ప హిందుత్వ గురించి ఆయనలో ఉన్న ఇస్లాం వ్యతిరేకత అన్న అంశంపై జరిగిన చర్చలో భాగంగా వీరపూజలో ఆ అంశాలకు సంబంధించి విస్తారంగా ఒక వ్యాసం రాయాలని అనుకున్నాను.
ఇది కాకుండా అడపాదడపా విశ్వనాథలో మత సామరస్యం అన్న ప్రస్తావన కూడా తరచూ చేస్తూ ఉంటారు శర్మ గారు. ఈ మధ్యన ఇది వరకటి లాగానే విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’ నుంచి హిందూ దేవాలయ విధ్వంసం గురించి ఒక వాక్యాన్ని ఉటంకించారు ఆయన మళ్ళీ.
శర్మ గారు తరచూ పునశ్చరణం చేసే విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’ వాక్యం ఇది:
“..వీరే (అంటే హిందువులే) తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, (దేవాలయమును) నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో”
దేవాలయ విధ్వంసం విషయంలో తప్పంతా హిందువులలోనే ఉంది. అప్పటి ముసల్మాను రాచరికం వారిలో అప్పటి ఇస్లాం మతానుయాయులలో బహుళదేవతారాధన విగ్రహారాధన కాఫిర్ల పట్ల ఇస్లాం మత సూత్రాలలో ఉన్న విషయాలలో తప్పేమి లేదు అన్నట్టుగా ఒక భావన వస్తుంది ఈ వాక్యం చదివితే. అయితే ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకుని ఒక సెక్యులర్ ఉదారవాద మత సామరస్య విశ్వనాథ సృష్టి జరిగింది అప్పట్లో. విశ్వనాథలో ఇస్లాం పట్ల ఏ విధమైన ఆక్షేపణ లేదనీ ఆయన ఉమ్మడి సంస్కృతిని అంటే హిందూ ముస్లిం కాంపోజిట్ కల్చర్ ను మెచ్చుకున్నాడని ఇలా ఒక చర్చ జరిగింది అప్పట్లో. ఆ ఉదారవాద సిన్క్రెటిక్ కల్చర్ కు (హిందూ ముస్లిం ఉమ్మడి సంస్కృతి) వత్తాసు పలికిన విశ్వనాథ అనే కల్పనను ఖండిస్తూ దీని గురించి ‘సంచిక’ లోనే విస్తారంగా ఒక వ్యాసం కూడా రాశాను అప్పట్లో (చూడు: https://sanchika.com/viswanatha-mroyu-tummedalo-islam-oka-vishleshana-essay-hk/).
ఇప్పుడు ఈ వాక్యం గురించి మళ్ళీ ప్రస్తావన రాగానే ఒక మిత్రుడు నాతో – ‘చూశావా మళ్ళీ మత సామరస్య విశ్వనాథ వచ్చేసాడు’ అని అన్నాడు. మరొకతను కూడా అడిగాడు ‘అదేమిటండీ నిజంగానే విశ్వనాథ అలా అన్నారా’ అని. ఈ వ్యాసం అటువంటి ప్రశ్నలకు ఒక వివరణ అనుకోవచ్చు.
ఇది కాకుండా భైరప్ప గురించి ఆ మధ్యన ఇంకొక విమర్శ కూడా చూసాను తెలుగు సాహిత్యపు ఫేస్బుక్ ప్రపంచంలో. ఇది ఇంకొక రచయితను ఉద్దేశించి వేరే ఎవరో చేసిన వ్యాఖ్య.
“వైష్ణవంతో మోహంలో పడిన, ఈ దేశసంస్కృతిలోని లోపాలను వేరే మతాల లోపాలతో కప్పిపుచ్చి ఆత్మ విమర్శ విడిచిపెట్టిన ఏ రచయితైనా చివరకు S. L. భైరప్పగా మారితీరతాడు. తెలుగు వారికి కూడా ఒక భైరప్ప లేని లోటు. ఇప్పుడు తీరిపోయింది”
ఈ వ్యాఖ్య ఇంకొక రచయితను ఉద్దేశించి చేసినది అయినప్పటికీ ఇందులో కూడా భైరప్ప ప్రస్తావన ఉంది. లోపం హిందువులలో హిందూ సంస్కృతిలో ఉంటే ముస్లిముల మీద పడతారెందుకు ఈ హిందుత్వవాదులు అన్న ఒక స్టీరియోటైపు భావనకు దగ్గరగా ఉంది.
ఇవన్నీ కూడా ఈ వ్యాసం రాయటానికి ఉత్ప్రేరకాలు. మైనారిటీ మతాల వారిని మెజారిటీ మతం వారు ఎప్పుడూ వేలెత్తి చూపకూడదు. తప్పంతా హిందువులు అనెడి మెజారిటీ వర్గం వారిలోనే ఉన్నది అన్న ఒక అప్రకటిత సిద్ధాంతానికి రచయితలు సాహిత్యకారులు తలొగ్గి ఉండాలి అని ఒక నియమం ఉన్నట్టుగా ఉంది. ఆ నియమం ఉల్లంఘించిన వారిని భైరప్పతో పోల్చటం ద్వారానో లేదా మెజారిటేరియన్ హిందుత్వ అనే ఒక భూతాన్ని సృష్టి చేసి ఆ ముద్రను వీరికి అంటగట్టడం ద్వారానో వారిని శిక్షించటం జరుగుతున్నట్టుగా ఉంది ఇప్పటి తెలుగు సాహిత్య లోకంలో.
ఇక విశ్వనాథకు ప్రస్తుత కాలపు హిందుత్వకు మధ్యన గల పోలికల గురించిన చర్చ కొంత కల్లూరి భాస్కరం గారి పుస్తకం ‘వేయిపడగలు నేడు చదివితే’ లో కూడా ఉంది. అప్పుడు కూడా ఇటువంటి చర్చలు కొన్ని జరిగాయి. కాబట్టి తెలుగు సాహిత్య లోకంలో అడపాదడపా ఇది చర్చకు వచ్చే అంశమే.
మన ఉదారవాద సెక్యులర్ మేధావి వర్గంలో రెండు రకాల వారు ఉన్నారు. నిజానికి చాలా రకాల వారు ఉన్నారు తెలుగు సాహిత్య లోకంలోని మేధావి వర్గంలో. భావజాల వైవిధ్యత వైరుధ్యం గురించి చెప్పుకోవాలి అంటే మన దగ్గర చాలానే ఉన్నది. కానీ ప్రస్తుత సందర్భంలో ఈ రెండు రకాల మేధావుల ప్రస్తావన సరిపోతుంది.
మొదటి రకం వారికి హిందూ సంస్కృతి సనాతన ధర్మం అంటే తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. వీరిది వీర విప్లవ వినాశవాదం. సనాతన ధర్మం పూర్తిగా తుడిచిపెట్టేసుకుంటే కానీ ఈ దేశ ప్రజలకు విముక్తి లేదు బంగారు భవిష్యత్తు లేదు అని అనుకుంటారు వీరు. హిందూ ధర్మాన్ని తక్కువ చేయటానికి వీరు ఎంచుకున్న మార్గం మెజారిటీ మైనారిటీ అనే ద్వంద్వము.
మీరు ‘హిందూ’ అన్న పదం వాడుతూ రెండు మంచి మాటలు చెప్పగానే వారు వెంటనే దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లు, గాడ్సే గాంధీని చంపటం గురించి, అయోధ్య దేవాలయాలం గురించి, బాబ్రీ విషయంలో జరిగిన అల్లర్ల గురించి, గోద్రా గురించీ ఇలా వరసగా కొన్ని ఉదంతాల గురించి ప్రస్తావించి హిందూ మతం లేదా హిందూ ధర్మం గురించి ఏ మాత్రం మంచి మాట్లాడినా కూడా అది మెజారిటేరియనిజంకు దారితీస్తుందని భయపెట్టేస్తారు. ఈ మెజారిటీ మతం వారు మైనారిటీల ఊచకోత జరిపే అవకాశం ఉంది అని హిట్లర్ ప్రస్తావన తెచ్చి మీలో మీ మతమంటే మీకే ఒక భయం తెప్పించి ఆలా మీ నోరు మూసి హిందూ అన్న పదం వాడినందుకు మీతో గోడకుర్చీ వేయించి సెక్యులరిజం ఉదారవాదం మైనారిటీ మతాల పట్ల సానుభూతి ఇటువంటి విషయాల మీద మీకు ప్రమాణ భావం వచ్చేటట్టుగా చేసి మెల్లగా హిందూ ధర్మం అంటేనే మీకు కూడా వాళ్ళకు మల్లే అసహ్యం ద్వేషం ఏర్పడే లాగా వారు పకడ్బందీగా ప్రణాళికకు అనుగుణంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇస్లామోఫోబియా సంగతి పక్కన పెడితే ముందు మీ మెదడు నిండా హిందూపోబియా అనేది సృష్టిస్తారు. సొంత సంస్కృతి అంటే ద్వేషం ఛీత్కార భావం ఉండేలా ప్రాపగాండా చేస్తారు. దీనిని ‘రోజర్ స్క్రుటన్’ వంటి కొందరు కన్సర్వేటివ్ మేధావులు ‘ఒయికోఫోబియా’ అని కూడా అంటారు. అంటే సొంత ఇంటి సంస్కృతి పట్ల సాంస్కృతిక వారసత్వంగా వచ్చిన సొంత సంప్రదాయాల పట్ల ఆచారాల పట్ల ద్వేషం అన్నమాట. పరాయి సంస్కృతుల భావజాలాల పట్ల అపరిమితమైన వ్యామోహం ప్రేమ. ఇవి ఒయికోఫోబియా ఉన్న వారి ప్రధాన లక్షణాలు.
పూర్వాచారాలు గత సంస్కృతి అంటే ఒక ఛీత్కార ధోరణి వచ్చేలా చేయటం ఈ మేధావి వర్గం వారి ప్రధాన ఉద్దేశం. పూర్వీకులు పాపాత్ములు అనే న్యూనతా ధోరణి తెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సమాజంలోని వారందరూ పాపాత్ములు కాదు. అందరినీ పాపాత్ములు అనేస్తే రాజకీయం చేసేది ఎలా? మళ్ళీ ఇందులో పీడకులు, పీడితులు అన్న విభజన. ‘అగ్ర’ కులాల వారు ప్రధానంగా బ్రాహ్మణులు రాజులు వర్తకులు వైశ్యులు భూములు ఆస్తులు ఉన్న కులాల వారు ఇలా వీరు మాత్రం ఖచ్చితంగా పాపాత్ములు అనే భావన పెంపొందిస్తారు. వీరికి వత్తాసు పలికి వీరి అజమాయిషికి చేయూతనిచ్చింది కాబట్టి పూర్వ సంస్కృతి మీద యుద్ధం ప్రకటించాలని ఈ మేధావి వర్గం వారి కోరిక. “లోపాలన్నీ మీ సంస్కృతిలోనే ఉన్నాయోయి” అని మీకు హితబోధ చేస్తూ ఉంటారు. ఇలా “పూర్వీకులు పాపం చేశారు ఆ పాపానికి మీరు ఇప్పుడు ప్రాయశ్చితం చేయండి” అని ప్రచారం చేసే హిందుత్వవాదులు కూడా ఉన్నారు. ఆ చర్చ పైన చెప్పినట్టు ఈ వ్యాసం పరిధిలోకి రాదు.
సాధారణంగా ఇలా మాట్లాడే మేధావివర్గం వారిలో ‘భగవంతుని మీద పగ’ పట్టిన (ఇది కూడా విశ్వనాథ పుస్తకమే) మార్క్సువాద నాస్తికులు ఎక్కువగా ఉంటారు తెలుగు సాహిత్య మేధావి జగత్తులో. హిందువులందరు మైనారిటీల పట్ల విద్వేషాన్ని లేపే మెజారిటేరియన్ మతతత్వవాదులు అన్నది వీరి నిశ్చిత అభిప్రాయం. కాబట్టి మైనారిటీ మతాల మీద అవసరం ఉన్నా లేకపోయినా సందర్భోచితమైనా కాకున్నా వల్లమాలిన అభిమానం కురిపిస్తూ ఉంటారు. మైనారిటీ మత సూత్రాల విమర్శ చేయటం ఇష్టం ఉండదు వీరికి. మైనారిటీ మతాల పై ప్రేమ వొలకబోసే సాకుతో మెజారిటీ మతాన్ని అదుపులో పెట్టచ్చు వారిలో అవమాన భారం పెంపొందించచ్చు అన్నట్టుగా ఒక కార్యాచరణను సృజించారు.
ఇక రెండవ రకం వారికి పై రకం వారికి ఉన్నంత ద్వేషం ఉండదు సొంత సంస్కృతి అయినటువంటి హిందూ సంస్కృతి అంటే. కానీ వీరికి ఈ మెజారిటీ మైనారిటీ ద్వంద్వ దృష్టి బాగా ఉంటుంది. హిందుత్వ మత శక్తులు మైనారిటీలను దేశం నుంచి తరిమేస్తాయి వారిని చులకనగా చూస్తాయి లేదా వారి ప్రాణాలకు హాని తలపెడతాయి అని వీరికి ఒక కంగారు ఉంటుంది. అందుకని వీరు ఊహించుకున్న ఉగ్రవాద హిందుత్వ నుంచి అసలైన హిందూ ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ కాపాడే ప్రయత్నంలో వీరు ఎంచుకున్న మార్గం చాలా విచిత్రంగా ఉంటుంది.
హిందుత్వ శక్తులకు ఇస్లామోఫోబియా ఉంది అని వీరి విశ్వాసం. అంటే వారు ఇస్లాం అంటే తీవ్రమైన వ్యతిరేక భావం కలిగి ఉంటారు అని వీరి అభిప్రాయం. అదే వారి ప్రధాన లక్షణం. కాబట్టి మేము వారి వంటి వారిమి కాము అని నిరూపించుకోవాలి అని వీరి కోరిక. మేము వారిలా కాదు అని నిరూపించుకోవాలి అంటే మేము మైనారిటీ మతాల పట్ల వల్లమాలిన ప్రేమ కురిపించే గొప్ప మానవతావాదిలాగా ఉండాలి అని తాపత్రయ పడతారు వీరు.
హిందుత్వవాదులలో వీరు ఊహించుకున్న ఇస్లామోఫోబియా గురించి విమర్శిస్తారు కానీ దానికి విరుగుడుగా వీరు ఇస్లామోఫిలియా అనే మత్తుమందు సేవిస్తున్నారు అన్న దృష్టి వీరికి ఉండదు. కాబట్టి వీరికి అయోధ్య మందిరం గురించిన వివాదం గురించిన చర్చ అసలు నచ్చదు. నా రాముడు నా మదిలో ఉన్నాడు. నేను హిందువునే కానీ నాకు అయోధ్యలో గుడితో సంబంధం లేదు ఇదంతా ఇప్పుడు అనవసరం అని అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. అయోధ్య వరకు వెళ్ళనక్కర్లేదు దానికంటే దశాబ్దాల ముందు నాటి సోమనాథ్ మందిర పునర్నిర్మాణం వంటి విషయాల గురించిన చర్చలు ఇటువంటివి కూడా నచ్చవు. మైనారిటీ మతాల వారికి ఇబ్బంది కలిగించే పని ఏది చేయరాదు అని వారి నియమం. కాబట్టి హిందూ చిహ్నాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఈ హిందూ చిహ్నాలు ఇతర మతాల వారిని ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి సెక్యులర్ చిహ్నాలను వాడటం సబబుగా ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది వీరి ఆలోచన.
మొన్నామధ్యన ప్రధాని మోడీ థాయిలాండ్ కు వెళితే అక్కడ వారు థాయ్ రామాయణం ఆధారిత కళా ప్రదర్శన చేసారు. మరేం చేస్తాం ఈ దేశం అస్తిత్వం హిందూ ధర్మంతో ముడిపడి ఉంది. ఇప్పుడు థాయిలాండ్ వారు రామాయణం అనే సాంస్కృతిక వారధిని వదులుకుని సమానత్వం స్వేచ్ఛ విప్లవం ఇటువంటి భావాల ఆధారంగా నృత్య రూపకం ప్రదర్శించాలా? ఎంత దూరం పోతాం హిందూఫోబియాతో? ఈ థాయ్ రామాయణం ప్రదర్శించిన నటులలో ఇతర మతాల వారు ఎంత మంది? అందులో మనకు కావలసిన మైనారిటీ మతపు నటులు సరైన పాళ్ళలో ఉన్నారా లేరా? ఇలా ఆలోచిస్తారేమో మన మెజారిటీ మత ఫోబియా మైనారిటీ మత ఫిలియా ఉన్న మేధావులు.
మనకెందుకు ఈ గుళ్ళు గోపురాలు హిందూ ఇతిహాసాలు పురాణాలు గురించిన చర్చ అని అంటారు ఈ మేధావులు. ఏదో హాస్పిటల్ గురించో స్కూలు గురించో ఐటీ పార్కు గురించి మాట్లాడుకుందాం అని సమస్యను దాటవేసే ప్రయత్నం చేస్తారు. మీరు హిందూ సమస్యల గురించి మాట్లాడితే వీరు గాంధీ బొమ్మనో లేక జాతీయ పతాకాన్నో చూపించి దేశభక్తితో మతానికి సంబంధించిన చర్చలను దాటవేసే ప్రయత్నం చేస్తారు. లేదా మానవత్వం గురించి ఎల్లలు లేని మానవతావాదం గురించి పోచుకోలు కబుర్లు చెప్పేసి తప్పించుకుంటారు.
హిందూ సంస్కృతి గురించిన చర్చలంటే అంత భయం వీరికి. ఈ జబ్బు బాగా తీవ్రంగా అయిపోయిన వారు ఇంకొన్ని విచిత్ర పోకడలకు పోతారు. నేను ఉర్దూ అరబ్బు భాషలు నేర్చుకుని నా ఉదారవాదం గొప్పతనం ప్రపంచానికి చాటుకుంటాను. ముస్లిం సాహిత్యం చదివి దాని గురించి చర్చించి నేను ఆ మతతత్వ ఇస్లామోఫోబిక్ ఉన్మాదుల వంటి వాడిని కాను అని అనిపించుకుంటాను అని అనుకుంటారు వీరు.
చూడండి నేను వారికి మల్లే చెడ్డ హిందువును కాను నేను మంచి హిందువును నాది ఎంత విశాల దృక్పథమో చుడండి అని చెప్పుకోవాలనే తాపత్రయం కనబరుస్తూ ఉంటారు వీరు.
పొరపాటున వీరిని ఒక హిందూ ద్వీపంలో పెట్టామే అనుకుందాం మాటవరసకు అక్కడ ముస్లిములు క్రైస్తవులు లేరని అనుకుందాం వీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు ఆ ద్వీపంలో. మైనారిటీ మతాల మీద సానుభూతి ప్రదర్శించే అవకాశం లేకపోతే వీరికి ప్రాణం నిలవదు మరి.
చివరికి ఈ సెక్యులర్ ఉదారవాద మైనారిటీ సానుభూతి వాదం ఎంత దూరానికి వెళుతుంది అంటే రామాయణం మహాభారతం పురాణాలు వీటిలో కూడా ఒక పాతిక ముప్పై శాతం ముస్లిములు క్రైస్తవులు ఉంటే బాగుండేది కదా అని నిత్యం మధనపడుతూ ఉంటారు. అప్పుడైతే ఎంచక్కా పురాణేతిహాసాలలో కూడా మత సామరస్యం చూపవచ్చును కదా అని వీరి తాపత్రయం.
అబ్బే రామరాజ్యంలో మత సామరస్యం ఎక్కడుందండీ అందులో అందరూ హిందువులే కదా ఇతర మతాల వారు ఉంటేకదా నేను మత సామరస్యం ప్రదర్శించే అవకాశం వచ్చేది అని బాధపడుతూ ఉంటారు. ఈ రామరాజ్యం ఫక్తు హిందూ మెజారిటేరియన్ సమాజంలా ఉందే వేరే మతాల వారే లేరు అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలా ఉంటుందనమాట వీరి ఆలోచన. మెజారిటీ ఫోబియా మైనారిటీ ఫిలియా అన్నది వారిని అంత దూరం తీసుకువెళ్తుంది అనమాట.
వీరికి హిందూ డెమోగ్రాఫిక్స్ అంటే హిందూ జనాభా నిష్పత్తి గురించిన చింతన కూడా ఉండదు. భారత ఉపఖండపు భూభాగంలో మన దేశపు చుట్టూతానే హిందువులు అల్ప సంఖ్యాకులై అంతర్ధానం అయిపోయినా కూడా వీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. హిందూ ధర్మం పట్ల తీవ్ర నిర్లిప్త వైఖరి ఉంటుంది. ఎక్కడ మైనారిటీ మతం వారిని తప్పు పట్టాల్సి వస్తుందో అని అసలు మత ధర్మ ప్రాతిపదికన జనాభా పెరుగుదల తరుగుదల అన్నది అసలు పట్టించుకోవలసిన విషయమే కాదు అని అంటారు వీరు. ఒకవేళ తప్పక మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆయా ప్రాంతాలలోని మత భావజాలాలను తప్పుపట్టకుండా తిరిగి మెజారిటీ మైనారిటీ వాదమే తెస్తారు. ఏ ప్రాంతంలోనైనా సరే తప్పు మెజారిటీ మతానిదే. ఇక్కడ మెజారిటీ హిందువులు కాబట్టి తప్పంతా మెజారిటీ మతం వారిదే అని తీర్మానిస్తారు. ప్రతిదానికి గుడ్డిగా మెజారిటీని తప్పుపట్టే జబ్బు గురించి ఆంగ్లంలో ఐఐఎం ప్రొఫెసర్ కౌశిక్ గంగోపాధ్యాయ్ గారు మెజారిటీరియన్ మిత్ అని ఒక పుస్తకం రాశారు ఈ మధ్యనే. ఉదారవాద మార్క్సువాద పోస్ట్ కలోనియల్ భావజాల సమూహాలు ప్రతీ విషయంలో గుడ్డిగా మెజారిటీని తప్పుపట్టే విధానం గురించి విమర్శ చేశారు.
సెమెటిక్ మతాలు అంటే క్రైస్తవం యూదు మతం ఇస్లాం మతం ఇటువంటివి ప్రపంచ పటంలో విస్తరించిన కొద్దీ కాఫిర్లు అన్న పేరు మీదనైతేనేమి పేగన్ మతాలు హీథెన్ జెంటైల్స్ అన్న పేరు మీదనైతేమి అవి తమకంటే వేరుగా ఉన్న ఇతర సంప్రదాయాలపై ఇతర మతాలపై చేసిన దాష్టీకాల గురించి వీరు మాట్లాడటానికి ఇష్టపడరు.
మొన్నటికి మొన్న ఆడ్రీ ట్రష్కీ అనే చరిత్ర పరిశోధకురాలు స్వాతంత్ర్యానికి పూర్వపు భారతీయ నాగరికతకు పాకిస్థాన్ వారు ఇండియావారు సమాన హక్కుదారు అని ఒక విచిత్రమైన వాదన చేశారు. తాను ఇండియా చరిత్రను గురించి రాసిన పుస్తకావిష్కరణ ఇప్పటి పాకిస్తాన్లో జరపటంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అన్న మాటలు ఇవి. నిజంగా ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ వారు దేశ విభజనకు పూర్వం నాటి సంస్కృతి పట్ల అంత అభిమానం కలిగి ఉన్నారా? పాకిస్తాన్లో హిందూ ధర్మం అసలు బతికి ఉందా? పాకిస్తాన్లో హిందూ క్షేత్రాల పరిస్థితి హిందూ దేవాలయాల ఏమిటి? అక్కడ హిందువుల మత మార్పిడి జరగలేదా? భారతీయ సంస్కృతి పైన అంత అభిమానమే ఉంటే అక్కడ హిందువులు అంతర్ధానమయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది?
ఇదే ఆడ్రీ ట్రష్కీ షాజహాన్ గురించి ఇలా అంటుంది. ఆయన ఆధునికతకు పూర్వం నాటి ఇండియాకు చెందిన రాజులలో ఒకడిగా చూడాలట. ఆయనను రాజ్ పుత్ వంశ పరంపరలోని వ్యక్తిలాగా చూడాలట. ఆయనలో తైమురు వంశం వారి అంశ కూడా ఉంటే ఉండచ్చు కానీ ఆయనలో రాజ్ పుత్ అంశ ఎక్కువగా ఉందట. అందుకని ఆయనను వేరుగా చూడకూడదట. బ్రిటీషు వారిలాగా బయట నుంచి వచ్చి దేశాన్ని ఆక్రమించుకున్న వలస ఆక్రమణదారుల లాగా చూడకూడదట.
ఇంకొక చరిత్ర పరిశోధకురాలు ఉంది. ఆవిడ కూడా ఇదే పాట పాడింది. ఆంగ్లేయులను మొఘలు పాలకులను ఒక గాటన కట్టకండి. బ్రిటీషు వలస పాలకుల దురాక్రమణ అనేది చాలా హేయమైనది మొఘలు పాలకుల కాలంలో దేశం ఎంతో వృద్ధిలోకి వచ్చింది. వారికి వీరికి పోలిక ఏమిటి అంటూ షాజహాన్ ను మొఘలులను వెనకేసుకు వచ్చింది.
మరొక ఉదారవాద (పుట్టుకతో మాత్రమే హిందువైన) లాయర్ ఒకాయన కూడా ఇటువంటి మాటే అన్నాడు. షాజహాన్ ముప్పావు భాగం రాజ్ పుత్ పరంపరకు చెందిన వ్యక్తి అనీ ఆయనను బ్రిటీషు వలస పాలకుల లాగా అక్రమణదారుడిలాగా చూడకూడదని అంటాడు.
ఇదంతా ఒక విచిత్రమైన ఇస్లామోఫిలియా వ్యవహారం. పొరపాటున కూడా ఇస్లాం ఆక్రమణదారుల గురించి అప్పటి పాలకుల గురించి పల్లెత్తు మాట అనరు. బ్రిటీషు వారిని తిడతారు కానీ ఇస్లాం పాలకుల కాలం గురించి అసలు ఒక తప్పు కూడా లేనట్టే మాట్లాడతారు.
మళ్ళీ వీరే భారతీయ సంస్కృతి గురించి ఉపన్యాసాలు ఇస్తారు. భారతీయత అంటే అంతా హిందూ ముస్లిం ఉమ్మడి సంస్కృతి అనీ కాంపోజిట్ సంస్కృతి అని అందరూ ఒకటే కుటుంబానికి చెందిన సోదర సామానులనీ అదే పాత పాట పాడుతారు. అబ్రహామిక్ మతాల మిశ్రమం లేకపోతే హిందూ ధర్మానికి అస్తిత్వమే లేదు వీరి ఉద్దేశ్యంలో. మిశ్రమ సంస్కృతి సాంకర్య వాదం వీరిది.
విలియం డాల్రింపుల్ వారసుడు సామ్ డాల్రింపుల్ ఇటువంటిదే ఒక పోస్టు పెట్టాడు ఈ మధ్యన ‘అబాండండ్ టెంపుల్స్ ఆఫ్ ఇస్లామాబాద్’ అని. అబాండండ్ అన్న మాట వాడటం ఏమిటి అసలు? ఊరికే ఎందుకు వదులుకుంటారు గుళ్ళను ఎవరైనా ఎక్కడైనా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? దీని గురించిన ఆలోచన చేయకుండా వక్ర భాష్యాలతో కృత్రిమ సామరస్యతను మతాతీత కారణాలను సృష్టించే మేధావి వర్గపు ప్రయత్నాలు ఇలా ఉంటాయి. వీరికి వత్తాసు పలికే తెలుగు మేధావులు ఎందరో. కాబట్టి ఇదేదో పాత సమస్యలను తిరిగి తోడే ప్రయత్నాలు కావు. ఇవి ఇప్పటికీ జరుగుతున్న చర్చలే.
వీటన్నిటి గురించి నిష్పాక్షికంగా శ్రద్ధగా పరిశోధన చేస్తే అప్పుడు తప్పు ఎంతో కొంత మైనార్టీ మతాలలో కూడా ఉంది అని ఒప్పుకోవలసి వస్తుంది కదా. దానికి మనసొప్పదు మన మేధావులకు. అంటే తప్పులన్నీ ప్రధానంగా సొంత సంస్కృతి అంటే హిందూ ధర్మంలో ఉన్నది అని అనాలి లేదంటే అన్ని మతాలలో తప్పొప్పులు సమపాళ్ళలో ఉంటాయి అందుకనే ఉదారవాద సెక్యులరిజం లేదా మార్క్సువాదం లేదా మతాతీతమైన ఎల్లలు లేని మానవతావాదం అన్నిటికంటే గొప్పది అని అనాలి. ఇవి రెండే మార్గాలు. అయితే హిందువులను తప్పు పట్టాలి లేదా అన్ని మతాల్లో తప్పులు ఉన్నాయి అని సెక్యులర్ లిబరల్ హ్యూమనిస్టు పాట పాడాలి.
అంతే కానీ పొరపాటున కూడా హిందూ ధర్మం ఇతర మతాల కంటే సెక్యులర్ ఉదారవాదం కంటే మార్క్సువాదం వంటి సిద్ధాంత మతాల కంటే గొప్పది అని అనకూడదు. సొంత సంస్కృతి అంటే ఏ విధమైన అభిమానం ప్రేమ ఉండకూడదు. పైన పేర్కొన్న రోజర్ స్క్రుటన్ పరిభాషలో చెప్పాలి అంటే ఒయికోఫోబియా అనేది ఉండాలి అంటే సొంత గూటి సంస్కృతి పట్ల ద్వేషం ఉండాలి ఒయికోఫిలియా అంటే సొంత సంస్కృతి పైన ప్రేమ అనెడి సహజ స్థితిలో ఉండరాదు.
హిందూ ధర్మం పై ప్రేమ అభిమానం నాకు ఉన్నది అన్న మాట మీరు అనగానే మళ్ళీ మెజారిటీ మైనారిటీ, మైనారిటీల ఊచకోత, గాంధీ గాడ్సే, దేశ విభజన, అయోధ్య , గోద్రా, మోడీ, ఆర్ ఎస్ ఎస్ హిందుత్వ సావర్కర్ గోల్వాల్కర్ ఇలా ఎన్నో భయానక ఆలోచనలు వచ్చేస్తాయి వారికి. వారి సున్నిత హృదయాలు వీటిని తట్టుకోలేవు. అందుకనే వెంటనే మళ్ళీ సాంత్వన కోసం మత సామరస్యం గంగా జముని తెహజీబ్ హిందుస్తానీ సంగీతం సూఫీ తత్త్వం మానవతావాదం ఇటువంటి విషయాలపై వీరి దృష్టి మళ్ళుతుంది. హిందూ సంస్కరణ వాదం కూడా ముందుకు వస్తుంది. నా సంస్కృతిలో ఎన్ని లోపాలు ఉన్నాయో! ఇన్ని లోపాలు ఉన్న నా సంస్కృతి మీద నాకు అభిమానం అనవసరం అన్న భావన వీరికి. మళ్ళీ పూర్తి వినాశవాద నాస్తికులా అంటే అదీ కాదు. దేవుడు భక్తి పండుగలు కొన్ని వ్యవహారాలన్నీ కావాలి. ఒక విచిత్రమైన స్థితి. పండుగ చేసుకున్నా ఇతర మతాల మిత్రులు పావు భాగం ఉంటే వారికి ఆనందం. ఖచ్చితంగా ఒక క్రిస్మస్ పండగో లేక ముస్లిం పండగో ఏదో చేసుకుంటూ ఉండాలి సామరస్య స్ఫూర్తి కోసం. లేదంటే మనస్తాపం. అలా ఉంటుంది వీరి ధోరణి. ఇతర మతాల వారి పండుగలను కూడా ఆనందంగా చేసుకోవాలి. అప్పుడే వారి ఉదారవాద స్ఫూర్తికి సార్థకత.
వెరసి చెప్పొచ్చేది ఏమిటంటే నిరంతరం వీరికి మైనారిటీ మతం అనే ఊతం ఉండాలి. ఆ మైనారిటీ మతం వారికి సానుభూతి చూపిస్తూ ఉండాలి వారి మెప్పు పొందుతూ ఉండాలి మత సామరస్యం అనే పానీయం సేవిస్తూ ఉండాలి. అలా మైనారిటీఫిలియా అనే సాంత్వన కావాలి వీరికి. ఇలా ఉంటుంది వీరి వ్యవహారం.
మీరు హిందూ మతం విషయంలో ఏ సమస్య అయినా తీసుకోండి తిమ్మిని బమ్మి చేసి చివరాఖరికి తప్పంతా మనదేనోయి హిందువులే వెధవలు దుర్మార్గులు చేతకాని వారు అన్న భావన రావాలి. ఈ విషయంలో వీరికీ మొదటి రకం మేధావులకు పెద్ద తేడాలేదు.
కాశ్మీర్ పండిట్ల గురించి మాట్లాడితే తప్పు అంతా అసలు ఆ పండిట్లదే అని అంటారు. ఉన్నత వర్గాల వారు ఇతరులని తొక్కేసారు కాబట్టి అలా వివక్షకు గురైన నిమ్న వర్గాల వారి తిరుగుబాటు స్పూర్తి ఈ ఊచకోతలో ఉంది అంటారు వీరు. హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో కలవటం గురించి రజాకార్ల గురించి మాట్లాడితే అప్పుడు తప్పు హిందూ భూస్వాములది రెండు మతాల ఉన్నత వర్గాల వారిది మాత్రమే. నిజాం పాలకుల ఇస్లాం మతం ప్రస్తావన తేకూడదు. కేరళ మోప్లా అల్లర్ల గురించి కూడా అంతే. పీడకులు పీడితుల మధ్యన సమస్య ఇందులోకి మతాన్ని తేకండి అంటారు. మరీ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే మళ్ళీ సాంత్వన కోసం సామరస్య పానీయం సేవించటానికి దేవాలయాన్ని ఆనుకుని మసీదు చర్చి ఎక్కడుందో చూసి ఓహో ఎంత బాగుందో నా దేశంలో సామరస్యత అని ఆనందిస్తూ ఆ మత్తులోకి జారుకుంటారు.
ఫలానా ఊరిలో అక్బర్ పేరు మీదో ఔరంగజేబు పేరు మీదో లేక టిప్పు సుల్తాన్ పేరు మీదనో ఒక వీథి ఉంటే వీరికి పేచీ ఉండదు. పై పెచ్చు అది ఉదారవాద సెక్యులర్ మతసామరస్యత వాదంలో కలిపేసుకుంటారు. కానీ మీరు ఛత్రపతి శివాజీ పేరు లేదా మహారాణా ప్రతాప్ పేరు ఒక రోడ్డుకు పెడతామని అన్నారంటే ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది. ఇది మెజారిటేరియనిజం అంటూ మళ్ళీ కలం లేదా కీబోర్డు పట్టుకొని అయ్యో నా దేశం ఈ హిందుత్వ వాదుల చేతిలో నలిగిపోతోందే అని వాపోతారు. ఇటువంటి వ్యాసం ఒకటి రామచంద్ర గుహ ఇది వరకే రాసారు పత్రికలలో వచ్చింది కూడా. కాబట్టి నేనేదో కట్టుకథ అల్లట్లేదు. జరుగుతున్న కథే చెబుతున్నాను.
ఇదే రామచంద్ర గుహ ఈ మధ్య ఆర్టికల్ 370 గురించి రాస్తూ కాశ్మీర్ అనేది మన దేశంలో ముస్లిం మెజారిటీ ప్రాంతమనీ అక్కడి ముస్లింలకు అన్యాయం చేయటానికే ఆర్టికల్ 370 రద్దు జరిగిందని అన్నారు. ఇదే మన మేధావులలో రామచంద్ర గుహ వంటి వారి కుటిల నీతి. అసలు కాశ్మీర్ ముస్లిం మెజారిటీ ఎలా అయ్యింది అన్న విషయం గురించిన చర్చ చేయరు కానీ వారి ఉదారవాద సెక్యులర్ రాజకీయాలకు ఈ మెజారిటీ మైనారిటీ ద్వంద్వాన్ని తమకు నచ్చినట్టుగా వాడుకుంటారు. ఇటువంటి వ్యాసాలను తెలుగు దినపత్రికలు తమ సంపాదకీయం పేజీలలో ప్రచురిస్తాయి. కాబట్టి ఇది తెలుగు సమాజానికి కూడా సంబంధించిన విషయమే కేవలం ఆంగ్ల మాధ్యమంలో ఉన్న చర్చ కాదు. ఇలా ఉన్నారు మన మేధో వర్గంలో కొందరు మేధావులు.
ఇలా సామరస్యత మత్తులో ఉన్న రెండవ వర్గం వారిలో హిందూ ధర్మం అంటే మితి మీరిన ద్వేషం ఉన్న మొదటి వర్గం వారిలో మన ఖర్మ కాలి దాదాపుగా తొంబై ఐదు శాతం వాళ్ళు రికార్డులలో హిందువుల పేరు మీదనే చెలామణి అవుతూ ఉంటారు. వీరంతా హిందూ కుటుంబాలలోనే పుట్టారు కాబట్టి వీరంతా ‘మన’ వాళ్ళే నా వరకు. తిట్టుకున్నా కొట్టుకున్నా హిందూ సమాజం గురించిన చింతన చేసేవారికి ఈ ఇంటి గోల తప్పదు కాబట్టి వారి ఆలోచనలో ఏమైనా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఈ విశ్వనాథ వీర పూజ వ్యాసం రాయటానికి పూనుకుంటున్నాను.
వీరికే కాక హిందూ మతం పట్ల ప్రేమ ఉన్నా కూడా సనాతన ధర్మానికి ఇతర మతాలకు తేడా తెలియని వారికీ ఇటువంటి సంవాదాలలో ఎన్నో సందేహాలు ఉన్న వారికీ కూడా విశ్వనాథ వీరపూజలో ఈ విషయాలపై చేసిన చర్చ ఉపయోగకరంగా ఉంటుందని ఈ వ్యాసం రాస్తున్నాను.
ఈ వీరపూజ నవల పైన యూట్యూబులో ‘విశ్వనాథ సాహిత్య అకాడమీ’ ఛానెల్ లో ‘కోనేటి మెట్లు’ అన్న శీర్షికన కొన్ని చర్చలు ఉన్నాయి. ఆసక్తి గల వారు అది కూడా చూడచ్చు.
అయితే ఇప్పటి దాకా ప్రస్తావించిన వారు మాత్రమే కాకుండా మరొక రకం హిందువులు కూడా ఈ వ్యాసం చదివి కొంత ఆలోచన చేస్తారు అని నా ఆశ. వీరు భాష మీద మంచి పట్టు ఉన్న ధర్మ బుద్ధి గల ఆస్తిక హిందువులు. కానీ వీరి దృష్టి ప్రధానంగా సాహిత్య చింతనలో (పద్య సౌందర్యం, వర్ణనలు , అలంకారాలు , ఛందస్సులు ఇలా) లేదా భక్తి సాగరంలో తలమునకలవడంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉంటుంది. ఇటువంటి చర్చల విషయంలో వీరు అంతగా ఆసక్తి చూపరు. ఇవి కొంత వృథా ప్రయాసలుగా అరణ్య రోదనల లాగా కూడా అనిపిస్తాయి వీరికి. వీటి వల్ల ఒరిగేది ఏమి లేదు పైగా ఇవన్నీ తమ సాధన నుంచి భక్తి ఉపాసన మార్గం నుంచి లేదా సాహిత్య ఙ్ఞాన మార్గం నుంచి దృష్టి మరల్చే అనవసర చర్చలు అని వీటన్నిటికి దూరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి తెలుగులో ఇటువంటి విషయాల పై రాతలు చర్చలు తగ్గిపోయాయి.
మత చర్చలకు రాజకీయాలకు దూరంగా శుద్ధ సాహిత్యం, భక్తి, ఆధ్యాత్మికత ఒక వైపు పై రెండు మేధావి వర్గాల హిందూ ధర్మం పట్ల ద్వేష పూరిత విప్లవ వక్రీకరణలు మరియు ఉదారవాద సెక్యులర్ మత సామరస్యత గురించిన సరస సల్లాపాల మధ్యన ఒక పెద్ద అగాధమే ఉంది మన సాహిత్య లోకంలో. విశ్వనాథ ఆ అగాధం కూడా పూరించే ప్రయత్నం చేసారు. ధర్మం అంటే కేవలం సమాజానికి దూరంగా ప్రయివేటుగా చేసుకునే పూజలు భక్తి మార్గాలకు ఉపాసనా సాధనలకు సాహిత్య అధ్యయనానికి మాత్రమే పరిమితం చేయలేదు విశ్వనాథ. సమాజ సంరచనలో రాజ్యపాలనలో విద్యా వ్యవస్థలలో కళలలో రక రకాల సామజిక వ్యవస్థలలో దైనందిన జీవితంలో రోజువారీ వ్యవహారాలలో అభివృద్ధి నమూనాలో ప్రభుత్వాల పాలసీలు వగైరాలన్నిటిలో కూడా సనాతన ధర్మం పట్ల ప్రమాణ భావం ధర్మ ఆధారిత దృష్టి అవసరం అని చెప్పారు ఆయన తన రచనల ద్వారా. అవన్నీ కూడా సనాతన ధర్మానికి కార్య క్షేత్రాలే అని చెప్పారు ఆయన. కాబట్టి ఆస్తిక హిందూ సమాజం వారు కూడా ఇటువంటి విషయాలపై తిరిగి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి వారు కూడా తిరిగి విశ్వనాథను ఈ దృష్టితో చదవటం ప్రారంభిస్తారు అన్న ఆశతో ఈ వ్యాసం రాస్తున్నాను.
ఇక పోతే మొన్నామధ్యన శివాజీ గురించి కూడా ఒక చర్చ జరిగింది. ఎక్కడో మహారాష్ట్రకు చెందిన శివాజీ గురించి మనకెందుకు? ఇదంతా ఉత్తర భారత హిందుత్వ వాదుల మతతత్వ వాదం. మీకు నిజంగా ఇస్లాం పాలకులను ప్రతిఘటించిన వారి గురించి రాయాలనే ఉంటే ముసునూరి నాయకుల గురించి రాయండి ప్రతాప రుద్రుడి గురించి రాయండి అని అన్నారు ఒకరు. విచిత్రంగా విశ్వనాథ శివాజీని గురించి ముసునూరి నాయకుల గురించి ఇద్దరి గురించి రాశారు తన గద్య సాహిత్యంలో (చారిత్రక నవలలు నాటకాలు వగైరా). ఇది కూడా ఈ వ్యాసం ఇప్పుడు రాయటానికి ఒక కారణం. ముసునూరి నాయకులు శివాజీ గురించిన చర్చ తిరిగి అంతర్జాల మాధ్యమాలలోకి వచ్చింది కనుక.
ఇక వీరపూజ పుస్తకం విషయానికి వస్తే వ్యాసం మొదట చెప్పినట్టు ఇది మన గత చరిత్రలో పధ్నాలుగవ శతాబ్దపు కాలం నాటి కథ. చరిత్ర కు ఊహా శక్తిని జోడించి రాసినది. ప్రతీ ప్రస్తావనకు దీనికి సైటేషన్ ఉందా దీనికి ఆధారం ఏమిటి ఇది నిజంగా ఇలాగే జరిగి ఉంటుందంటారా అని అడిగితే కుదరదు. చూఛాయగా ఆ కాలంలో జరిగిన సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది.
ఒక పాత్ర ఇలా అంటుంది:
“ఈ తురుష్కులు ప్రజలను సుఖపెట్టుటకు వచ్చుట లేదు. ప్రజలను బాధపెట్టుటకును, దురధికారమును చెల్లించుటకును తమ మతమును వ్యాపింప జేయుటకును వచ్చుచున్నారు..”
“ఇతర రాజ్యములు కొల్లగొట్టి సైనికులకు మాత్రం కడుపు నిండా అన్నము పెట్టి తక్కిన ప్రజలందరినీ మాడ్చునట్టి ఈ తురుష్కుల నీతి నీతియా!..”
తురుష్కుల దాడులను తప్పుపట్టటానికి వెనుకాడతారు మన మేధావులు చాలా మంది. హిందూ రాజులు కూడా ఒకరి పై ఒకరు దాడులు చేసుకునే వారు. రాచరిక వ్యవస్థే అంత. ప్రత్యేకంగా తురుష్కులను తప్పుపట్టటానికి ఏమి లేదు అని వాదిస్తారు వారు. ఇటువంటి వక్ర భాష్యాలకు తగిన సమాధానం ఇచ్చారు విశ్వనాథ ఈ నవలలో. ఇక మతము వ్యాపింపజేయుటకు వచ్చారు అన్నది ఒప్పుకోటానికి కూడా నామోషీ మన మేధావులలో కొందరికి. ఎక్కడ మైనారిటీ మతం వారిని ప్రత్యేకంగా తప్పు పడుతున్నామో అని కొందరు అసలు ఒప్పుకోరు ఈ విషయాన్ని.
మత మార్పిడులు నూటికి తొంబై ఐదు శాతం స్వచ్చందంగా జరిగినవే అని వాదిస్తారు వారు. అసలు హిందూ ధర్మమే పెద్ద మోసం దాని నిండా వివక్ష కూరుకుపోయి ఉంది. ఈ హిందూ ధర్మం లో పస లేదు కాబట్టే ప్రజలు స్వచ్చంధంగా ఇతర మతాలలోకి మారిపోయారు. ఊరికే అప్పటి ముస్లిం పాలకులకు సైనికులను తప్పుపట్టకండి అని వారికి వకాల్తా పుచ్చుకుంటారు.
ఇంకా మాట్లాడితే హిందూ ధర్మంలో కూడా ఒక సంప్రదాయం వారు మరొక సంప్రదాయం పై (శైవులు వైష్ణవులు వగైరా) మతమార్పిడి ప్రయత్నం చేసారని లేదా బౌద్ధం పై జైనం పై దాడి చేసారని కాబట్టి అసలు హిందువులకు ముస్లిములను తప్పుపట్టే హక్కే లేదని అసలు ఈ మతలనీ లోపభూయిష్టమైనవి అని వాదిస్తారు.
విశ్వనాథ ఈ మత మార్పిడి అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు ఈ నవలలో.
ఇక ‘తురుష్కుల నీతి’ అన్న మాటను గురించి కూడా ఆలోచించాలి మన మేధావులు కొందరు. వారు తురుష్కులు వీరు హిందువులు అన్న విషయంలో స్వ పర తేడాలను గుర్తించటానికి సిద్ధపడరు ఈ మేధావులు.
సనాతనం అనగానే అదొక అనంతమైన ధార అనీ దానిలో ఇది హిందూ ఇది ఇస్లాం అన్న తేడాలను చూపరాదని ఇప్పుడు రెండు మతాలు పాలు నీళ్ళలాగా కలిసిపోయాయి కాబట్టి ఇటువంటి చర్చలు చేయటం సబబు కాదని వారి అభిప్రాయం. విశ్వనాథ దీనిని కూడా నిర్ద్వంద్వంగా ఖండించారు. తురుష్కుల నీతిని తురుష్కుల మతాన్ని విమర్శిస్తూ వాటి లోపాలను ఎత్తిచూపారు ఈ నవలలో. ధర్మానికి మతానికి గల తేడా గురించి కూడా రాశారు.
“తురుష్క సైనికులు పల్లెలపై పడి స్త్రీల నెత్తుకుని పోవుచుండిరి. పసి బిడ్డలను చంపుచుండిరి. వృద్ధులను నరుకుచుండిరి” అని అంటారు మరొక చోట.
ఇలా తురుష్క సైనికుల దాష్టీకాలను వర్ణిస్తారు. ఇటువంటి ఘోరాలు తెలుగు ప్రజలెప్పుడు చూడలేదని అంటారు.
“రాజు నేలను ధర్మముగా పాలించవలయును అప్పుడే వాడు రాజు తక్కినప్పుడు వాడొక పిశాచము అట్టి పిశాచము లాంధ్ర దేశము నందు తాండవించెను” అంటూ ఇలా తురుష్కుల దుశ్చర్యలను వారి పాలనను పిశాచాల తాండవంతో పోలుస్తారు.
ఇటువంటి పోలికలు కూడా మన మేధావి వర్గంలో కొందరిని బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. మతాలకు సంప్రదాయాలకు అతీతంగా అందరు రాజులు ఇటువంటివి చేసారని వీటికి మతం రంగు పూలమరాదని అంటారు వారు. ఇవంతా రాచరిక వ్యవస్థలో లోపాలని మతాలకు సంబంధం లేని విషయాలని అందుకే రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయని అసలు విషయం వదిలేసి అక్కర్లేని అసంబద్ధ చరిత్ర పాఠాలు వల్లె వేస్తారు. ఇక్కడ ఇస్లాం మత రాచరిక పాలనను పిశాచముల తాండవంతో పోల్చారు కాబట్టి విశ్వనాథను కూడా ఇస్లామోఫోబిక్ మెజారిటేరియన్ హిందుత్వవాది అని అంటారో ఏమో?
దేవాలయాల విధ్వంసం గురించి విశ్వనాథ ఇలా అంటారు ఈ వీరపూజ నవలలో
“తురుష్కులు కోటలో ప్రవేశించి గుళ్ళు గోపురములు పడకొట్టిరి. దేవాలయములున్న చోట మసీదులు కట్టిరి”
ఇవంతా కూడా పైన చెప్పిన మన మేధావి మార్గం వారు ఒప్పుకోటానికి ఇష్టపడరు. అబ్బే ఇవన్నీ యుద్ధాలలో కామన్ అని కొట్టిపడేస్తారు.
దేవాలయాలు ఉన్న చోట మసీదులు కట్టారు అన్న విషయం గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞాన వాపి మసీదులో మత సామరస్యాన్ని దర్శిస్తారు. అలంపూరు జోగులాంబ ఆలయం ప్రాంగణంలో ఉన్న దర్గా విషయంలోనూ అంతే. వీరికి ఏ రకమైన బాధ ఉండదు ఇటువంటి విషయాలలో. వేములవాడ ఆలయ ప్రాంగణంలో దర్గా ఉండాల్సిందే అది మత సామరస్యానికి కాంపోజిట్ కల్చర్ కు చిహ్నమని కోర్టులలో వాదనలు వినిపిస్తున్న కాలం ఇది. ఈ వ్యామోహం ఉన్న హిందువులు ఎందరో! లేదంటే నా భక్తికి గుడి అక్కర్లేదు అని అడ్డగోలు వాదనలు చేస్తారు.
వీరు తమను తాము మతాతీతమైన లౌకికవాద ఉదారవాద విశ్వమానవుల లాగా అనుకుంటూ ఉంటారు. ఇదంతా మతాల గురించిన అనవసర రాజకీయాలు అని వీరి ప్రగాఢ అభిప్రాయాం. గుడి మసీదు చర్చి పక్కపక్కనే ఒకటే కాంప్లెక్సులో ఒకటే కాంపౌండ్ వాల్ పంచుకుంటూ ఉంటే వారికి ఆనందం. అదే ఈ దేశం గొప్పతనం అదే ఈ దేశపు సంస్కృతికి ప్రతీక వీరి ఉద్దేశంలో.
దేవాలయాల విషయంలోనే మరొకమాట కూడా అంటారు విశ్వనాథ
“శిల్పమునకు పూజలందు విగ్రహమునకు భేదము తెలిసికొను తెలివి వారికి లేదు. అందుచేత సర్వమును నాశము చేసిరి”
శిల్పము విగ్రహము అన్న తేడా కూడా తెలియకుండా నాశనం చేశారు అని అంటారు విశ్వనాథ. ఇవంతా చదివినా కూడా మౌనంగా నిర్లిప్తతతో ఉండటం అలవాటు చేసుకున్నారు హిందూ పుట్టుక పుట్టిన కొందరు మేధావులు ఇప్పటి కాలంలో. ఏది ఏమైనా సరే అప్పటి కాలపు మైనారిటీ మత పాలకులను సైన్యాలను తప్పు పట్టరాదు అని ఒక అప్రకటిత నియమం ఉన్నట్టుగా ఉంది. అలా చేస్తే ఇప్పటి కాలపు ఆ మైనారిటీ మాతనుయాయులు నొచ్చుకుంటారని ఈ విషయంలో మౌనం పాటిస్తారు ఈ మేధావులు.
ప్రజలంతా తురుష్క సైన్యాలను ప్రతిఘటించిన విధానం గురించి చెబుతూ విశ్వనాథ అప్పటి వ్యవస్థను గురించి ఇలా అంటారు
“ఆ కాలమున పొలముదున్ను కృషికులును, నితర వృత్తులు సేయు వారును నందఱును సైనికులే! యుద్ధము వచ్చినప్పుడు కరవాలమును, డాలును గైకొని సర్వజనులు సైన్యములో చేరుదురు. స్త్రీబాలవృద్ధులు మాత్రమే గృహములలో నుందురు. అందఱకును సైనిక శిక్షణ యుండెడిది. ప్రతిగ్రామము నందు గరిడీశాలలుండెడివి. యువకులందఱకు కత్తియుద్ధములు చేతనగును. యుద్ధము లేనివేళ నెవరి వృత్తులు వారు చేసికొనుచుందురు”
పోనీ ఇలాంటివి చూసైనా భారతీయ సమాజం గురించి ఒక మంచి మాట అనచ్చు కదా. అది కూడా లేదు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనే మూడు వర్ణాల వారు కలిసి సమాజాన్ని తొక్కి పెట్టారు అన్న ఒకటే ఊకదంపుడు సందేశం ఇస్తూ ఉంటారు. భారతీయ సమాజం గురించి ఏహ్య భావం అన్నది నిరంతరం నూరిపోస్తూ ఉండాలి. ఒక వేళ విశ్వనాథ వంటి వారు ఇటువంటివి రాస్తే వారిని బ్రాహ్మణ ఆధిపత్య భావనతో రాశారు అని విమర్శించాలి. ఇక్కడ ఎలాగూ ముస్లిము సైన్యాల పైన దాడులకు సంబంధించిన ప్రస్తావన కాబట్టి సామాన్య ప్రజానీకాన్ని ముస్లిం సైన్యాలకు వ్యతిరేకంగా పని చేసిన రాడికల్స్ లాగా చిత్రీకరించారు కాబట్టి ఆయనను ఇస్లామోఫోబ్ అని కూడా అంటారో ఏమో ఈ మేధావులు పనిలోపనిగా.
గోవధను గురించి పదే పదే ప్రస్తావిస్తారు విశ్వనాథ ఈ నవలలో
“తురుష్కులు చేయు దుండగములకు మితిలేకపోయెను… ఒక రెడ్డికి వంద ఆవులు ఉండెను.. మహమ్మదీయులు దినమున కొక యావు చొప్పున తీసికొనిపోయి కోసికొని తినుచుండిరి” అని అంటారు ఒక చోట.
ఇప్పుడు గోవధ గురించి గోమాత గొప్పదనం గురించి గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి మాట్లాడాలి అన్నా కూడా కష్టమే పుట్టుకతో (మాత్రమే) హిందువులైన కొందరు మేధావులకు. గోవధ గురించిన చర్చ కూడా మెజారిటేరియన్ హిందుత్వ అయిపోయింది వారికి. కాబట్టి ఇటువంటి ప్రస్తావన వచ్చినా కూడా ఇది మతోన్మాదపు హిందుత్వ అయిపోతుంది. గోమాంస భక్షణను గోవధను ఖండిస్తూ ప్రత్యేకంగా మహమ్మదీయుల ప్రస్తావన చేసారు కనుక విశ్వనాథను మెజారిటేరియన్ హిందుత్వ ఇస్లామోఫోబ్ అని అనేస్తారేమో.
తురుష్క సేనలు పెట్టిన బాధల గురించి విశ్వనాథ ఇలా రాస్తారు
“ఆంధ్రులు బుద్ధిహీనులని పశువులని పందులని నోటికి వచ్చినట్టెల్లా మాట్లాడుదురు. వారికి స్త్రీలన్నచో మర్యాద లేదు. పసిబిడ్డ లన్నచో జాలి లేదు. బాలురన్నచో దయలేదు. వృద్ధులని వెనుకాడట లేదు. ఇంక పురుషులను వారు పెట్టెడు బాధకు లెక్కలేమి”
“మరునాటికి నాల్గు వందల తురుష్క సేన వచ్చెను. ఆ యూరును బెట్టిన బాధ యింత యంత అని చెప్పుటకు వీలులేదు. కనిపించిన స్త్రీ పురుషుల నందఱును వధించిరి. ఇండ్లు తగులబెట్టిరి. తగులబడుచున్న ఇండ్ల మంటలలో పసిపిల్లలను విసిరి పారవేసిరి. యువకుడైన ప్రతి వాడిని చిత్రవధ చేసిరి”
ఇప్పుడు ఈ మాట అన్నంత మాత్రానే ఇది ఇస్లామోఫోబియా అయిపోతుందా? ఓ మోస్తరు చరిత్ర చదివిన వారు ఎవరైనా కూడా ఇస్లాం సైన్యాల దురాగతాలు అనేవి అసలు జరగనే జరగలేదు అని అనగలరా? ఈ మాత్రానికి ఇస్లామోఫోబియా అని కంగారు పడిపోయి ‘మొఘలుల పాలనలో హిందూ ప్రజల మధుర జ్ఞాపకాలు’ అని పుస్తకం రాసేసి వెంటనే దాని ఉర్దూ అనువాదం కూడా చేసేసి ఇస్లామోఫిలియా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందా? ఇటువంటి వాక్యం విశ్వనాథ రాసినంత మాత్రాన ఈ వాక్యం గురించి చర్చ చేసినంత మాత్రాన దీనిని హిందుత్వ అనేసి వెంటనే హిందూత్వకు హిట్లర్ పాలనకు పోలికలు తెస్తే అది సమంజసమేనా?
హిందూ రాజ్యాల మధ్యన జరిగిన యుద్ధాల గురించి ఇలా అంటారు విశ్వనాథ
“పూర్వము రాష్ట్రకూటులు చాళుక్యులు కాకతీయులు మొదలైన రాజులు తమలో తాము యుద్ధములు చేసికొన్నచో దుర్గములు పట్టుకొనుట సైన్యములను జయించుట మాత్రమే చేసిరి గాని ఈ రీతిగా ఘోరములు చేయుట ఆంధ్రులెరుగరు.. ఆంధ్రులీరీతిగా గెలిచిన సైన్యము గ్రామములు తగుల బెట్టుటయు స్త్రీల నెత్తికొని పోవుటయు ముసలి వాండ్రను పసిపిల్లలను చంపుటయు తమ మతమును స్వీకరింపుడని హింసించుటయు ఇంటిలో నిలువ చేసుకున్న సంవత్సర గ్రాస మెత్తికొని పోవుటయు – నిట్టి వెన్నడు నెఱుగరు”
వీటన్నిటిని కేవల కల్పనలు అని కొట్టిపడేద్దామా? విశ్వనాథను కూడా ఇస్లామోఫోబిక్ హిందుత్వ మతోన్మాది అని అనేద్దామా? అలా అనేస్తే నిజాలు అబద్దాలు అవుతాయా అబద్దాలు నిజాలు అవుతాయా?
ఇది ఇప్పటికీ కొందరు మేధావుల చర్చలలో వినిపించే వాదనే. పైన చెప్పినట్టుగా వారు ఇస్లాం సైన్యాల పాలకుల దురాగతాల గురించిన చర్చను ఇష్టపడరు. ఈ దురాగతాలకు మతం రంగు పులమటం వారికి ఇష్టం ఉండదు. అన్ని మతాలూ సమానమే అన్ని మతాలలో మంచి చెడు సమపాళ్ళలో ఉంటుంది అనే పాఠం తిరిగి నెమరు వేసుకుంటూ ఉండాల్సిందే వారి ప్రకారం.
ఈ మేధావులు నడిపే సెన్సార్ బోర్డుకు అధికారం ఉంటే ‘తమ మతమును స్వీకరింపుడని హింసించుటయు’ అన్న మాటను తొలగించి వేసి పుస్తకాన్ని పునర్ముద్రించమంటారు కాబోలు. ఇటువంటి మాటలు మత విద్వేషాలను రెచ్చకొట్టేటట్టుగా ఉన్నాయని వారు తీర్మానిస్తారు.
ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు మత మార్పిడులలో నూటికి తొంభై ఐదు శాతం స్వచ్చందంగా హిందూ ధర్మంలోని దాష్టీకాలను తాళలేక ప్రజలు తమకు తాముగా మారినవేనని మన మేధావి వర్గం ఢంకా బజాయించి మరీ చెబుతుంది. ఉగ్ర హిందుత్వకు వ్యతిరేకంగా సౌమ్యమైన ఉదారవాద మతసామరస్య సనాతన హిందూ ధర్మానికి ప్రతీకగా విశ్వనాథను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది కదా. మరి ఆయనేమో ముస్లిం పాలకుల దండయాత్ర మత మార్పిడి హింస అంటున్నారు ఇక్కడ. దీనికి ఏం సమాధానం చెబుతారో మన మేధావులు.
ఇక్కడ ఒక విశ్వనాథ మార్కు పరిశీలన ఈ విషయంలో
“ముసల్మానులలో అధికులైనవారు విద్యావంతులు భగవద్భక్తి గలవారు దయ మొదలైన సద్గుణములు గలవారుగా నుందురు. కానీ సామాన్య ప్రజ వినయము లేని వారు. ఊళ్ళు దోచుకొనుటయు స్త్రీల చెర బట్టుటయు హింసా కార్యములు చేయుట యందు వెనుదీయ కుండుటయు ఇట్టి గుణములు గలవారు. ముసల్మానులు మానవులే వారి దేశము నందు వారున్నప్పుడు వారికీ గుణములు లేవు. పరదేశ మాక్రమించు నప్పుడిట్టి గుణములు వచ్చును” అంటారాయన.
పోనీ కనీసం ఈ విషయమన్నా ఒప్పుకోవచ్చు కదా మన మేధావి వర్గం? వారి వారి దేశాలలో వారి మానాన వారు వారికి నచ్చినట్టు ఉండేవారు పర దేశాన్ని ఆక్రమించుకోటానికి వచ్చినప్పుడు మోతాదుకు మించిన అక్రమాలు చేశారు మత మార్పిడికి ప్రయత్నించారు అని? ఎప్పుడో గతంలో జరిగిన విషయమే కదా? ఇప్పుడెందుకు కంగారు? కానీ ఈ విషయం గురించి కూడా చర్చించటానికి ఒప్పుకోరు మన మేధావులు.
ఇక వారి దేశాలలో కూడా ఇస్లామేతర మతాల గురించి వాటి ప్రస్థానాల గురించిన చర్చ గురించి సరేసరి. దాని గురించి తెలుగు సాహిత్యంలో రాతలే లేవు నాకు తెలిసి. ఈ మధ్య ఒకటో రెండో వచ్చాయి అవి తప్పిస్తే.
పశువుల హననం గోవధ గురించి మరొక చోట ఇలా అంటారు
“దేశములో నీ తురకదండు విడియుట చేత పశువుల సంఖ్య తక్కువగుచుండెను. గొఱియలు మేకలు హతమారుచుండెను. అమీరులు మలిక్కులు నున్న చోట నీ ఘోరములు చెప్పరాకుండెను”.
“గోవధతో ఊరంతయు గగ్గోలయ్యెను”
“మాకు గోవు పరమ దైవము”
ఇదంతా కూడా హిందుత్వ తప్పుడు కల్పనలు అనేసి సర్ది చెప్పుకుంటారా ఈ మేధావులు? ముసల్మానుల కాలంలోనే కాదు బ్రిటీషు కాలంలో కూడా ఇటువంటివి జరిగాయి. ధరంపాల్ వంటి వారు వీటి గురించి విస్తృతంగా చర్చిస్తూ పుస్తకం రాసారు.
ఒక సంస్కృతికి మతముకు చెందిన వారు తద్భిన్న సంస్కృతి మతము లేదా ధర్మము ఉన్న ప్రదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు సంఘర్షణలు జరగటంలో ఆశ్చర్యమేముంది? వారికి వీరికి ఆచార భేదాలు ఆహార అలవాట్ల భేదాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇటువంటి విషయాల గురించి మాట్లాడినా కూడా హిందుత్వ ఉన్మాది అని ముద్ర వేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అసలు స్వ పర అన్న తేడా చూపటమే పాపమై పోయింది ఇప్పటి చర్చలలో.
మరొక చోట ఇద్దరు హిందువుల మధ్యన సంభాషణలో ఇలా అంటారు
“మన దేశమునకు దైవము వక్రించినది.
అవునయ్యా మొదలు తుదలేని ఈ కాలములో జీవులు కర్మానుసార మనుభవించుచుందురు. మనము ప్రయత్నము చేయవలెను. ఫలితము దైవాధీనము”
ఇందులో కూడా దేశానికి తురుష్కుల దాడులు పాలన అనే కష్టం వచ్చింది అని ఉంది. నిరాశ నిస్పృహలలో పడిపోకుండా మన ప్రయత్నం మనం చేసి దైవాన్ని నమ్మాలి అని చెబుతున్నారు. ఇది ఇస్లామోఫోబియా అవుతుందా? దీనిని ఏమందాం? స్వజాతీయ సంస్కృతి పునరుజ్జీవనం కోసం చేసిన స్వాతంత్య్ర సంగ్రామం అనచ్చునా? నిజంగా సనాతనవాది అయిన విశ్వనాథలో సనాతన నిర్లిప్తత యథాతథవాదం ఉంటే అసలు ప్రయత్నం గురించిన చర్చ ఎందుకు. ఇదంతా మన ఖర్మ. ఇస్లాం పాలకుల పై సైన్యాల పై ప్రతి దాడి చేయరాదు. భగవంతునికి కావలసినది బహుశా ఈ ఇస్లాం పాలనే ఏమో అని నిష్క్రియాత్మక ధోరణిని పెంపొందించేలా రచన చేసేవాడు కదా అప్పుడు?
గంగిరెద్దులను ఆడించే వైష్ణవ దాసరివాడు చేసే ప్రార్థన ఇది
“ముసల్మానులను ఈ దేశమునుండి వెడల నడిపించితివా తెలుగు దేశమున ఉన్న సర్వ తీర్థములకు పోయి సర్వ దేవతలకు పూజలు చేయించెదను”
ఈ గంగిరెద్దులను ఆడించే పాత్ర ఇప్పుడు ఇస్లామోఫోబియా వ్యక్తం చేస్తున్నట్టా? ఇటువంటి పాత్రల సృజన చేసినందుకు విశ్వనాథ కూడా (భైరప్ప లాగా?) హిందుత్వ తీవ్రవాది అయిపోయాడా?
మునుపటి కాలం నాటి యుద్ధాలకు ముసల్మానుల దండ యాత్రలకు తేడాలు చెబుతూ ఇలా అంటారు విశ్వనాథ
“ఒక రాజు తన దేశమును అధర్మముగా పాలించు చుండినచో ధర్మాత్ముడైన రాజు వచ్చి వానిని శిక్షించి ధర్మమును నెలకొల్ప వచ్చును. ఒక రాజు తానెక్కువ పరాక్రమవంతుడైనచో తానంతటి పరాక్రమవంతుడనని చూపించుటకు పరరాజు మీదకు దండెత్త వచ్చును. అప్పుడు రాజులకు రాజులకు యుద్ధము జరుగును. గ్రామములకు వచ్చిన భయము లేదు..”
అసలు యుద్ధాలే లేవు హిందువులందరు సఖ్యంగా ఉంటారు అని అనట్లేదు విశ్వనాథ. ఫలానా కారణాల వలన యుద్ధాలు జరిగితే జరిగాయి అయితే సామాన్యులకు నష్టం లేకుండా జరిగాయి అని అంటారు ఆయన. ఇటువంటి వాక్యాలు కొన్ని ఈ వ్యాసంలో ఇది వరకే ప్రస్తావించాను.
“..ఇట్టి యుద్ధములే తప్ప మరియొక విధమైన దండయాత్రలు పూర్వకాలము నందు లేవు. ఆ కాలములో మహమ్మదీయులు దండయాత్రకు వచ్చిరి. ఎందుకు వచ్చిరి ? ఇక్కడ ధర్మము సరిగా నడచుట లేదు. ధర్మమును నిలువ బెట్ట వలయునని వచ్చిరా. ఇక్కడ ధర్మము సరిగ్గా ఉన్నదో లేదో దాని స్వరూప మెట్టిదో కూడా వారికి తెలియదు. తమ పరాక్రమమును చూపించుటకు వచ్చిరా ? మహమ్మదీయులు వారి దేశములు జరుగుబాటు తక్కువయై కూడా రాలేదు.
వారు దేశమును కొల్లగొట్టి తినవలయునని వచ్చిరి. తమ మతమును వ్యాపింపజేయవలయునని వచ్చిరి”
ఈ వాక్యములలో తప్పేమీ లేదే? ఇటువంటి మాటలు అన్నా కూడా ఇస్లామోఫిలియా వర్గపు వారు విశ్వనాథ పైన ఇస్లామోఫోబియా ముద్ర వేసేస్తారా? ఈ ద్వంద్వాలను దాటి ఆలోచన చేయలేమా? ధర్మానికి మతానికి గల తేడా గురించి కూడా ప్రస్తావించారు ఇక్కడ విశ్వనాథ.
మొన్నటికి మొన్న రామచంద్ర గుహ దేశం హిందూ పాకిస్తాన్ అయిపోతోంది అని ఒక మాట అన్నారు కరణ్ థాపర్ తో ఒక ఇంటర్వ్యూలో. ఈ హిందూ పాకిస్తాన్ ప్రస్తావన అన్నది తరచూ తెస్తూ ఉంటారు కొందరు హిందుత్వ విమర్శకులైనటువంటి తెలుగు మేధావులు కూడా. అన్ని మతాలూ ఒక్కటే మెజారిటీ మతం మైనారిటీ మతాన్ని తొక్కేస్తుంది అన్న చట్రంలో నుంచి ఆలోచించటం వలన వచ్చే చిక్కు ఇది. ధర్మం పై ఆధార పడిన దేశానికి అబ్రాహామీయ మతాలు అంటే క్రైస్తవం ఇస్లాం యూదుల మతము వంటి వాటి మీద ఆధారపడిన దేశానికి లేదా కేవల జాతీయతావాదం పై ఆధారపడిన దేశానికి గల తేడాను గురించి ఆలోచించాలి.
ఈ విషయం గురించి అంటే ధర్మానికి మతానికి గల తేడా గురించి చాలా చోట్ల విస్తృతంగా చర్చించారు విశ్వనాథ. హిందూ పాకిస్తాన్ హిందూ తాలిబాన్ అన్న పోలికలు సరైనవి కావు. నిజానికి అటువంటి పోలిక చేస్తున్నాము అంటే అబ్రాహామీయ మతాల థియోక్రసి ని దాటి మన ఆలోచన వెళ్ళట్లేదు అని అర్థం.
మతానికి ధర్మానికి గల తేడా గుర్తించగలగాలి. దీని గురించి వివరించాల్సిన అవసరం సనాతన ధర్మానుయాయుల పై ఉన్నది. విశ్వనాథ రచనలు సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇస్లామోఫోబియా ఇస్లామోఫిలియా రెండిటిని దాటి ధర్మం గురించిన చింతన చేయగలిగే దిశగా మార్గదర్శనం చేస్తాడు విశ్వనాథ.
అప్పటి ముసల్మాను పాలకుల ఆకృత్యాల గురించి మరొకచోట ఇలా అంటారు విశ్వనాథ
“భారత దేశములోని మతము చెడ్డది. వారి మతము మంచిది. ఈ దేశములోని ప్రజలు మోక్షమును పొందలేరు. తమ మతమును పుచ్చుకొనవలయును”
“సుఖముగా ఉన్న గ్రామ జీవనమును నశింపజేసిరి. మా మతమును పుచ్చుకుని మోక్షమును పొందుడనిరి. ఇక్కడి ప్రజలొప్పుకొన లేదు. వారిని చంపిరి”
“వర్తకులు ఇండ్లలో ప్రవేశించి మూలమట్టుగా దోచుకొని పోదురు. వృత్తులు చేయువారి చేత పనులు చేయించుకొని వానికి ఏమియు ఇవ్వరు. కంటికి అందముగా ఉన్న స్త్రీల నెత్తుకొని పోదురు. ఒక స్త్రీ వివాహము చేసికొని బ్రతికి ఉన్నన్నాళ్ళామె తన భర్త తోడనే యుండవలయునన్న నియమము వారికి లేదు. ఒక భర్తను వదిలిపెట్టి మరియొక భర్తను కట్టుకొనవచును”
ఇందులో సత్యదూరమైన విషయాలు ఏవైనా ఉన్నాయా? అంత మాత్రం చేత ఇస్లామోఫోబ్ అనటం తగునా? మత మార్పిడి చేయాలన్న ఆలోచన వారి పవిత్ర గ్రంథములలో లేదా? వారి మతములు విస్తరించిన ప్రాంతాలన్నిటిలో ఎన్నో ఇతర మతాలు ఆచార సంప్రదాయాలు తుడిచి పెట్టుకు పోలేదా? (ఈ విషయాల గురించిన చర్చ కోవెల సంతోష్కుమార్ గారి కల్లోల భారతం పుస్తకం గురించిన వ్యాసంలో ఇక్కడ చూడండి https://sanchika.com/kallola-bharatam-book-analysis-hk/). వివాహం గురించిన ఆలోచనలలో తేడాల గురించిన మాటలో కూడా తప్పేమీ లేదే. ఉన్నమాటే కదా అన్నారు.
అన్ని మతాలూ ఒక్కటే అన్ని సిద్ధాంతాలు ఒక్కటే అన్న శుష్క సిద్ధాంతాన్ని పట్టుకుని ఎందుకు వేలాడాలి? ఫలానా భావజాలం పైకి వస్తే ఆ సమాజం రూపురేఖలు ఆ ప్రజల జీవనాలు ఇలా మారతాయి అని పరిశీలన చేయటం కూడా పాప కార్యం అయిపోయిందా మన ఉదారవాద మేధావులకు? అన్ని మతాలూ సమానమే అన్ని సిద్ధాంతాలు సమానమే అంటే ప్రపంచం అంతా ఒకేలాగా ఉండాలి కదా అన్ని సమాజాలు ఒకటే లాగా ఉండాలి కదా? మనుషులంతా ఒకేలాగా ఉండాలి కదా? అలా లేదు కదా.
ధర్మానికి మతానికి గల తేడా గురించి ఇలా అంటారు విశ్వనాథ. అద్భుతమైన పరిశీలన ఇది. ఇప్పటి కాలంలో యూరోపులో అమెరికాలో పెద్ద పెద్ద హ్యుమానిటీస్ ప్రొఫెస్సర్లు ఇప్పుడు చేస్తున్నారు ఇటువంటి ప్రతిపాదనలు. విశ్వనాథ ఈ తేడాను ఎన్నో యేండ్ల కిందటే దర్శించారు
“ధర్మము వేఱు మతము వేఱు. ఇతర దేశీయులది మతము. భారత దేశీయులది ధర్మము. వారిచ్చటి మతమును పోద్రోలి తమ మతమును వ్యాపింప జేయవలయునని వచ్చిరి. ఇచ్చట మతమే లేదు. ఇచ్చట ధర్మమును జూచి వారు మతమనుకొంటిరి. ఆ ధర్మమును పాడుచేయుటకారంభించిరి. సుఖముగా బ్రతుకుటకు ఏర్పడినది ధర్మము. కొట్టుకొని చచ్చుటకు ఏర్పడినది మతము”
ఇలానే ఇదే నవలలో మరొక చోట సిద్ధాంతాల మతాలు అంటే మార్క్సువాదం వంటివి జాతీయతావాదం అంటే నేషనలిజం గురించి కూడా ఇటువంటి మాట అంటారు విశ్వనాథ. కొట్టుకుని చచ్చుటకు ఏర్పడినది మతము అన్నది సరైన మాటే. అయితే దీనికి విరుగుడు మనం తిరిగి ధర్మం వైపుకు వెళ్ళటమే అంతే కానీ ఉదారవాదం లౌకికవాదం (సెక్యులరిజం) జాతీయతావాదం వంటి శుష్క సిద్ధాంతాల వెంబడి వెళ్ళటం కాదు.
ఇస్లామోఫోబియాకు విరుగుడుగా ఇస్లామోఫీలియాను పట్టుకుంటే ఈ కొట్టుకుని చావటం అనేది ఆగదు. ఎందుకంటే ఈ విరుగుడు వలన భారత దేశంలోని హిందువులు తమ స్వత్వానికి దూరం అవుతున్నారు కనుక. తమ గత సంస్కృతి గురించి తమ ధర్మం గురించి ఆత్మన్యూనతను నింపే ప్రణాళిక నడుస్తోంది ఉదారవాద సెక్యులర్ ఇస్లామోఫీలియా మేధావి వర్గం పుణ్యమా అని. హిందూఫోబియా ప్రచారం జరుగుతోంది వీరి వలన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి. దీని వలన తిరిగి వైషమ్యాలు పెరుగుతున్నాయే కానీ తరిగే అవకాశం లేదు.
నిజానికి ఇప్పుడు హిందుత్వ అని దేనినైతే ఆడిపోసుకుంటున్నారో దానిని పెంచి పోషించింది ఈ ఉదారవాద లౌకికవాద వైఖరే. అది ఇంతలా పైకి రావటానికి కారణం పుట్టుకతో (మాత్రమే) హిందువులైన ఈ మార్క్సువాద ఉదారవాద లౌకికవాద మేధావి వర్గం వారు ఇస్లామోఫిలియాను ఒయికోఫోబియాను అంటే పైన చెప్పినట్టు సొంత సంస్కృతి పట్ల ద్వేషం అనగా హిందూపోబియాను పెంచి పోషించారు. అందుకే దానిని ప్రతిఘటిస్తూ హిందుత్వ అన్నది బలపడింది.
మెజారిటీ మతం అని ఒక భూతాన్ని సృష్టించి హిందూ ధర్మం గురించి తీవ్రమైన అపరాధ భావాన్ని అసహ్యాన్ని నిర్లిప్తతను పెంచి పోషించింది ఈ మార్క్సువాద సెక్యులర్ ఉదారవాదం ఈ దేశంలో.
ఇదే ఇప్పటి భావజాల సంఘర్షణలకు ఆజ్యం పోసింది. అసలు మొదటి నుంచి ఈ ఒయికోఫోబియా అంటే ఇందాక చెప్పినట్టు సొంత సంస్కృతి పట్ల ద్వేషం విముఖత ఉన్న మేధావులు రాజ్యమేలారు కనుకనే ఈ సమస్య ఇక్కడి దాకా వచ్చింది. సొంత గూటి పట్ల మమకారం అంటే ఒయికోఫిలియా అన్నది మనుషులకు సహజమైన మానసిక స్థితి. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా.
ఈ దేశంలో పుట్టిన ప్రతీ హిందువు హిందూ సంస్కృతితో ఏదో రకమైన అనుబంధం ఉన్న ఇతర మతాల వారు కూడా సనాతన ధర్మం పట్ల అభిమానంతో ఉండేటట్టుగా వ్యూహరచన జరగాల్సింది పోయి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉదారవాద లౌకికవాద మార్క్సువాద కోరల్లో చిక్కుకుపోయి సొంత సంస్కృతి అంటే ఛీత్కార భావం పెంపొందించే ఒయికోఫోబియా మేధావుల హవా నడిచింది మన దేశంలో. బ్రిటిషు పాలకులకు కొనసాగింపుగా.
అందుకనే ఇప్పుడు పరిస్థితి ఇలా తయారయ్యింది. కొట్టుకు చావటమే మిగిలే దిశగా ప్రయాణిస్తున్నాం. సుఖంగా జీవించాలి అంటే తిరిగి ధర్మం వైపు అడుగులు వెయ్యాలి.
సుఖముగా బ్రతుకుటకు ఏర్పడిన ధర్మం అన్న ఆలోచనకు ఇప్పటి కాలానికి అనుగుణంగా సమాజ జీవన సంరచన జరగాలి. ఆలా జరగాలి అంటే ధర్మం గురించిన అపోహలు పోయి అవగాహన పెరగాలి. అంటే హిందువులలో ఇస్లామోఫోబియాను ఇస్లామోఫిలియాను రెంటిని దాటుకొని వచ్చి స్వత్వం గురించిన చింతన జరగాలి. మెజారిటీ మైనారిటీ అన్న ద్వందాన్ని దాటుకుని వచ్చి స్వత్వం గురించి స్వధర్మం గురించిన చింతన చేయాలి.
ఇస్లాం మతం వృద్ధి పొందిన విధానం గురించి ఇలా అంటారు విశ్వనాథ
“శత్రువు లిచ్చటి ధర్మమును చేతనైనంత వఱకు నాశనము చేయుచుండగా జనులకు సుఖజీవనము భగ్నమైనది. శాంతి లేకపోయినది. వారి కిచ్చటి ధర్మస్వరూపము చెప్పుటకు వారికీ దేశబాస రాదు. వారు పైగా కత్తులు పుచ్చుకొని యుద్ధము చేయుటకు వచ్చినవారు గాని ధర్మమిదని తెలిసికొనుటకు వచ్చినవారు గారు. ఏ దేశములో నైన, నే జాతిలో నైన, ధర్మమును గూర్చి మతమును గూర్చి విచారించు వారు తెలివిగల పెద్దలు కొందఱుందురు. ఒకదేశము తనమతము గొప్పదని పరదేశమునకు బోధించవలయునని తలచినచో, ఆ దేశములోని మతాచార్యులు రెండవదేశపు మతాచార్యులను గలిసి కొని, వారితో వాదించి, తమ మతము యొక్క యాధిక్యమును నిరూపించి, వారికి తమ మత మిప్పింప వలయును. సామాన్యప్రజల మీదికిపోయి “మీ మతము మంచిది. గాదు, మామతమే మంచిది, మామతము పుచ్చుకోనిచో మిమ్ము చంపెద” మని హింసించుట! “నా మతము పుచ్చుకొన్నచో నీ కుద్యోగ మిత్తును, నీకు డబ్బిత్తు” ననుట! ఇది మతముగాదు, మత ప్రచారము గాదు. దాని పేరేమిటో తెలియదు”
దీని గురించి నిజాయితీగా మాట్లాడే దమ్ము ఉన్నదా ఇస్లామోఫీలియా మేధావులకు? మెజారిటీ మతం ఏదో చేసేస్తుంది అన్న భయంతో భ్రమతో ముందుగానే సానుభూతిని ప్రేమను పంచేసి మోతాదుకు మించిన సామరస్యత చూపుదామని చేసే ఈ ఇస్లామోఫీలియా అనే నిరంతర నిత్య కర్మలో తలమునకలైనందున మన మేధావులకు అసలు వీటి గురించిన ఆలోచన చేసే సమయమే లేదు. సత్యశోధన జరిపే నిష్పక్షపాత దృష్టి అసలే లేదు. వారు ముందుగానే తమ సొంత మతమైన హిందూ మతం లేదా ధర్మం దోషి అని నిర్ణయించేసుకుని తర్వాత పరిశోధన ప్రారంభిస్తారు.
“మతము మాట దేవు డెఱుగును! గ్రామ జీవనము నాశన మగుచున్నది. దేశములో శాంతిలేదు. యమభటులు విహరించు చున్నట్లున్నది.. అని భీమన్న విచారించెను..”
ముసల్మానుల రాజ్య కాలాన్ని యుద్ధ కాలాన్ని యమభటుల విహారంతో పోల్చారు విశ్వనాథ. దీని వెనుక సమాజంలో జరిగిన దాష్టీకాలు ఆ తురుష్క మూకలు చేసిన దౌర్జన్యాల తాలూకా ఆవేదన సొంత ధర్మం పట్ల మరియు తరతరాలుగా పరంపరగా వస్తున్న సంప్రదాయాల పట్ల అభిమానం ఆచార వ్యవహారాల విచ్చిన్నం వలన వచ్చిన బాధ ఇవి కదా చూడాలి. ఇవంతా చూడకుండా ఇటువంటి మాటలు భైరప్ప అంటేనేమి విశ్వనాథ అంటేనేమి మునిమాణిక్యం నరసింహారావు అంటే నేమి ఇస్లామోఫోబియా హిందుత్వ అని అనేసేయటం భావ్యమేనా?
పుస్తకం చివరి అంకంలో ముసల్మాను సైన్యాల పై ప్రజా విప్లవం హిందూ రాజుల సైన్యాధికారుల తిరుగుబాటు గురించిన ప్రస్తావన వస్తుంది. అందులో భాగంగా దొమ్మరివారు పాములను ఆడించేవారు వీరందరిని ప్రవేశ పెడతారు విశ్వనాథ.
విశ్వనాథ ఊహించిన అప్పటి తెలుగు సమాజంలో పర మత పాలకుల చేతిలో దాష్టీకాలు అనుభవించిన సమాజం తాలూకా నైరాశ్యం నిరాశ ఇవేవి ఉండవు ఈ నవలలో. తనను తాను ఓడింపబడిన అవసాన దశలో ఉన్న పరాజిత సంస్కృతికి ప్రతినిధిగా చూడలేదు ఆయన సృజించిన తెలుగు సమాజం.
“ముంగిస యన్యాయము చేయునుగాని, తెలుగునాగు చేయదు. ముంగిసకు నీతి యేమి? న్యాయ మేమి? దానికి ధర్మము తెలియదు. పామును చంపవలయు నన్న మతపు పిచ్చియే కాని, యొడుపు తెలియదు. చురుకు లేదు. న్యాయము లేదు. ధర్మ మెఱుగదు. నాగములు విజృభించినచో మూఢమైన ముంగిస యేమి చేయగలదు?”
మత పిచ్చి గల ముంగిసను ముసల్మాను సైన్యాలకు ప్రతీకగా చూపారు ఆయన. సనాతన ధర్మానికి ప్రతీకైనటువంటి తెలుగు నాగము విజృంభించి ఆ ముంగిసను మట్టికరిపించిన విధానం కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. ఇందులో పోరాట స్ఫూర్తి ప్రతిఘటన చేసెడి లక్షణం ఉన్నాయి తప్పితే చేతగానితనం బానిస జాతి లక్షణం నిర్లిప్తత ఇటువంటివి లేవు. ఇందులో తన స్వత్వాన్ని తిరిగి గుర్తించి పునరుత్తేజంతో పర మత సైన్యాలను పాలకులను తిప్పికొట్టిన ఆత్మాభిమానం గల జాతి గురించిన చిత్రీకరణ ఉంది.
అదే జాతికి చెందిన ఇప్పటి మేధావి వర్గం వారు దీనిలో మెజారిటీ మైనారిటీ అనే ద్వందాన్ని చూడటం ఎంతవరుకు సబబుగా ఉంది? పాలకులు ఎవరైతేనేమి వారి పాలనలో మత మార్పిడులు జరిగితేనేమి అన్ని మతాలూ ఒక్కటే అన్ని ధర్మాలు ఒక్కటే అన్ని మతాల పాలకులంతా ఒక్కటే అనే ఉదారవాద నిర్లిప్త వైఖరి అవలంబించమని విశ్వనాథ చెప్పలేదు కాబట్టి ఆయన హిందుత్వ ఇస్లామోఫోబ్ అయిపోతాడా?
ఇక ఇస్లాం సైన్యాల పై పాలకుల పై జరిగిన ఈ ప్రజా విప్లవం గురించిన ఊహ ఇలా ఉంది.
“నాటినుండి తెలుగుదేశములో కోడిపందెములు జరుగుచున్నను, పొటేళ్ళ పందెములు జరిగినను, యిద్దఱు మల్లయుద్ధములు చేసినను, ఓడినపక్షము ముంగిస, గెలిచినపక్షము నల్లనాగు! తరువాత రెండుమూడు నెలలలో తెలుగుదేశ మొకకొస నుండి రెండవకొస వరకు పాములవాండ్రు, దొమ్మరులు, గంగిరెడ్లవాండ్రు, పంబలవాండ్రు, పిచ్చుకుంటవాండ్రు, నూనెగుడ్డలవాండ్రు- వారు వీరననేల! బిచ్చగాండ్రందఱు తమవినోదములలో, బిచ్చపు పాటలలో; తెనుగుజాతి తురుష్కుల కధీనమై పోయిన దన్న యర్థమును, తెనుగువాండ్రు నల్లనాగులు, తలచుకొన్నచో ముంగిసను నలిపివేయుడురని ధ్వనియు వచ్చునట్లే యాడుచుండిరి పాడుచుండిరి. జన మందఱకు మహమ్మదీయులను దేశము నుండి తోలి వేయుట యెట్లా? యన్న విచారమే కలిగినది”
విశ్వనాథలో బ్రాహ్మణ ఆధిపత్యం మాత్రమే చూసేవారు ఇటువంటి వాటి గురించిన చర్చ చేయరు. ఆయన భారతీయ సమాజం అణువణువులో సనాతన ధర్మాన్ని దర్శించారు. భిక్ష మీద ఆధారపడ్డ ఎన్నో కులాల వారిలో వారి వృత్తులలో వారి జానపద కళారూపాలలో కూడా విశ్వనాథ ధర్మ నిబద్ధతను ధర్మ సూక్ష్మాన్ని దర్శించారు. అది మాత్రమే కాకుండా రాజనీతిలో రాజ దౌత్యంలో ఈ కులాల వారి పాత్రను తమ కళలు విద్యల ద్వారా ప్రజలను ధర్మ యుద్ధానికి సన్నద్ధం చేయటంలో ప్రజలను చైతన్యవంతులను చేయటంలో ఈ కులాల వారి పటిమను గుర్తించి వర్ణించారు ఈ వీరపూజ నవలలో విశ్వనాథ.
ఇటువంటి విషయాల గురించి ఊహించగలిగే రచయితలు పరిశోధన చేసే పరిశోధకులు చరిత్రకారులు ఎంతమంది ఉన్నారు మన దగ్గర. కొద్దోగొప్పో పరిశోధన చేసినా కూడా అందులో మళ్ళీ పీడితులు పీడకులు ఇదే పాట. చివరికి సొంత సంస్కృతి అంటే న్యూనతా భావము అపరాధ భావము ఏహ్య భావన కలగాలి ఇదే మన మేధావులలో చాలా మందికి కావలసినది.
ధర్మం గురించి తెలుసుకోవటం అంటే వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ముందు లోపాలన్నీ హిందూ ధర్మంలోనే ఉన్నాయి హిందూ ధర్మంలో లోపాలు మాత్రమే ఉన్నాయి అవి తప్పితే ఇంకేమి లేవు ఇతర మతాల వారు గంగిగోవులు అనేటటువంటి భావనలనుంచి బయటపడాలి. ఇక్కడ విశ్వనాథ హిందూ సమాజమంతా ఏకత్రాటిపై నిలిచి మహమ్మదీయ సేనలను తరిమి వేయటం గురించిన ఆలోచన చేసింది అని అంటారు. దీనికి మెజారిటేరియనిజం ఎత్నో నేషనలిజం అంటూ పెడార్థాలతో వక్ర భాష్యాలు చేయాల్సిన అవసరం లేదు.
ఇక ఈ ప్రజా విప్లవం గురించి చెప్పుకొస్తూ విశ్వనాథ ఇలా అంటారు
“పూర్వము మన దేశపు రాజులకు నాల్గు విధములైన సైన్య ముండెడిది. రథముల సైన్యము, యేనుగుల సైన్యము, గుఱ్ఱముల సైన్యము, కాలిబంట్ల సైన్యము. ఈ నాల్గు విధముల సైన్యము కాక, ‘ఆటవికసైన్య’ మని యింకొక సైన్య ముండెడిది. ఎరుకలు, యేనాదులు, చెంచులు, దొమ్మరులు, పాములవాండ్రు. వీరంద రాటవిక సైన్యము! యుద్ధసమయము లందు వీరందరు శత్రురాజుల గ్రామములపై బడి దోచుకొందురు. సైన్యము నడచుటకు మార్గములను బాగుచేయుదురు. శత్రురాజుల గోధనము నపహరింతురు”
ఇలాగే మరొక చోట ఈ మాట అంటారు
“తురుష్క సైన్యము విస్మయపడి వారినెదిరించెను. ఏనాది నాయకులు, దొమ్మరి నాయకులు తురుష్క సైనికులను విరుగబొడిచిరి. తురుష్కులు వారిముందు నిలువలేకపోయిరి. తురుష్కులే కసాయివాండ్రనుకొనగా నేనాదు, లెఱుకలు, దొమ్మరులు, పాములవాండ్రు వారి కంటె గసాయివాండ్రు. ఇట్లు ప్రతిగ్రామమున జరిగెను. మహమ్మదీయ సైనికుడెచ్చోటను నొక్కడును మిగులలేదు”
ఇందులో కూడా సమాజంలోని రకరకాల వర్గాల వారి గురించిన ప్రస్తావన ఉంది. అందరు కలిసి మహమ్మదీయ సైన్యాలను ఎలా తరిమికొట్టారో దానికి సంబంధించిన వర్ణన ఇది. ఇందులో మళ్ళీ ఫలానా కులం వారికి ఫలానా పదం ఎందుకు వాడారు అని ఆక్షేపించే వారు ఎలాగూ ఉంటారు. విశ్వనాథ ఇస్లామోఫోబ్ మాత్రమే కాదు వర్ణ అహంకారం కూడా కలిగి ఉన్నాడు అని విశ్లేషించచ్చు కొందరు మేధావులు ఇది చదివి. కానీ నానా జాతుల సమాహారమైనటువంటి అప్పటి (ఇప్పటి?) తెలుగు హిందూ సమాజమంతా ఒక్కటై మహమ్మదీయ సైనికులకు ఎలా ఎదురు తిరిగిందో వర్ణించే ఘట్టంలో విశ్వనాథ చేసిన ప్రస్తావన ఇది. అది మరువకూడదు.
ఇక ప్రజలలో చైతన్యం రగిలించటానికి జానపద కళలు ఉపయోగపడిన విధానం గురించి మరికొంత విస్తృతంగా వర్ణిస్తారు విశ్వనాథ
“ఆనాడు హరికధలు, భజనలు విరివిగా నుండెడివి…నాగులమయ్య వ్రాసినది జంగము కధ. ఆకధలో నొకజాతివారు మరియొకజాతి నాక్రమించగా నాక్రమించిన జాతిని త్రోసివేయుట యెట్లో వర్ణింపబడి యున్నది..”
“ఆ దళవాయి ప్రతి యింటికి పోయి నాగులమయ్య చెప్పిన కధలో వలె చేసినచో వైరులను పారద్రోల వచ్చునని చెప్పును”
ఇక్కడ కూడా ఒక జాతి వారిని ఇంకొక జాతి వారు ఆక్రమించుట అన్న ప్రస్తావన ఉంది. వైరి వర్గం అన్న ప్రస్తావన ఉంది. స్వజాతి పరజాతి మిత్రుడెవరు శత్రువెవరు అన్న భావన ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాబట్టి విశ్వనాథ మాత్రమే కాదు ఆయన ఊహించిన అప్పటి కాలపు జానపద కళాకారులు అందరూ కూడా ఇస్లామోఫోబ్స్ అయిపోతారా? అందరం మనుషులమే మనం మతాలకు అతీతమైన విశ్వ మానవులము అని అనుకుని ఉండాల్సింది కాబోలు అప్పటి ప్రజలు.
ఈ ప్రజా విప్లవానికి ప్రజా సైన్యాల సమీకరణ కసరత్తు గురించి చెబుతూ ఆ ఊళ్ళలో ఉన్న దేవాలయాల వ్యవస్థను గురించి ఇలా అంటారు విశ్వనాథ.
“ఈయన్ని గ్రామముల యందు శివాలయము లున్నవి. ప్రతి శివాలయము నందును నదివఱకున్న చిన్నచిన్న గంటలు దీసివేసి పెద్దపెద్ద గంటలు కట్టబడెను. ఏనాడు వంద మందియు సమావేశమై మలిక్కున్న గృహము ముట్టడింపవలయునో, యానాటి ప్రొద్దున రెండుమూడు గడియల సేపు గ్రామమంతయు వినిపించునట్లు గంట మ్రోగింతురు. ఆనాడు సమావేశము కావలయునని సైనికుల కది గుర్తు”
మలిక్కులు అంటే ముస్లిం సైన్యాధికారులు ఈ నవల ప్రకారం. కాబట్టి ఈ మహమ్మదీయ దురాక్రమణదారులను తిప్పికొట్టడానికి ప్రజా సైన్యాల సమీకరణలో దేవాలయాల వ్యవస్థ ఎలా ఉపయోగపడింది అన్న విషయం పై విశ్వనాథ ఊహా చిత్రం ఇది. వీటన్నిటి గురించి రాసాడు కాబట్టి విశ్వనాథ హిందుత్వ మెజారిటేరియన్ ఇస్లామోఫోబ్ అయిపోయినట్టా?
ఇక అప్పటి రాచరిక వ్యవస్థలో వచ్చిన మార్పును గురించి విశ్వనాథ పరిశీలన ఇలా ఉంటుంది
“వేంగిలో, అనకాపల్లిలో నున్న చోళరాజు సంతతివారిని కూడ పోయి పర్వతయ్య కలిసికొనెను. వారు “మాకిప్పు డూరా? పేరా? మేము క్షత్రియులము. కలికాలము వృద్ధి పొందినది. రాజ్యము క్షత్రియుల చేతులలో నుండి పోయినది. శూద్రుల వశమైనది. సేనానాయకులందఱు స్వతంత్రులై రాజ్యములు నిర్మించుచున్నారు.” అని తమ గోడు చెప్పికొన్నారు”
ఇందులో శూద్ర రాజ వంశాల ప్రస్తావన ఉంది.
“పర్వతయ్య యిట్లనెను, “అయ్యా! అదృష్టము చక్రము వలె తిరుగును. పై యాకులు క్రిందికి వచ్చును. క్రిందియాకులు పైకిపోవును. ఈ యాకులన్నియుకలసి చక్రము లోనివి, చక్రము తిరుగక తప్పదు. తిరిగినగాని దూరము పోదు. ఏకాలమునందైనను పరాక్రమవంతుని కాదనలేము. అని ప్రయోజనము లేదు. మీరు చెప్పినట్లే యొప్పుకొందము. మహా సమర్థులు, ప్రతాపవంతులు, బుద్దిమంతులు సర్వకాలమొక్క వర్ణములోననే పుట్టుదురా? తక్కిన వర్ణము లేమి కావలయును? మన కాలము గడచిపోయినది. ఇతరులకు మంచివేళ వచ్చినది. వారిని చూచి మన మీర్ష్య పొందినచో తొలుత మనకు నష్టము. తరువాత దేశమునకు నష్టము. మన నష్టమునకు మన మొప్పుకొన్నను దేశమునకు కలుగు నష్టమునకు మన మొప్పు కొనరాదు. అది ద్రోహము,” అని”
ఇందులో అంతర్గత తేడాలను దాటి దేశం గురించి ఆలోచించాలి అన్న సందేశం ఉంది.
“వారును, “మనసులో నున్న భావము చెప్పితిమే గాని మేము సాయపడ మంటిమా? శ్రీ ప్రతాపరుద్రదేవ చక్రవర్తి క్రింది సామంతులుగా లేమా? పైగా నిప్పుడు చక్రవర్తిత్వము లేదు. సామంతత్వము లేదు. మన ధర్మమును ధ్వంసముచేయు వారిని దేశము నుండి వెడల గొట్టెడు నీ పవిత్ర మైన కార్యమునుండి మేము విముఖులము కా”మనిరి”
ఇలా ఈ వాక్యాలలో శూద్ర రాజులు సైన్యాధికారుల గురించిన ప్రస్తావన ఉంది. ఈ దేశంలో వర్ణాల మధ్యన కులాల మధ్యన నిరంతరం మనస్పర్థలు ఉండేవని కొందరు తరతరాలుగా పీడకులని కొందరు తరతరాలుగా పీడితులు అనే కదా మనకు చెప్పిన చరిత్ర. ఇటువంటి చిత్రీకరణల గురించిన చర్చ ఏది? శూద్ర వర్ణానికి చెందిన కులాల వారు ఎందరు రాజులవలేదు? ఎంతమంది వీరులు సైన్యాధికారులు ఉన్నారు ఆ వర్ణాలలో కులాలలో కూడా? ధరంపాల్ వంటి గాంధీ అనుయాయులైన చరిత్రకారులు కూడా ఇటువంటి పరిశీలనాత్మకమైన విమర్శ చేశారు ఈ విషయమై.
సొంత వర్ణాన్ని కులాన్ని దాటి దేశం గురించి ఆలోచించమని ఒక మాట అన్నారు ఇక్కడ విశ్వనాథ. ధర్మమును ధ్వంసం చేసే వారిని దేశము నుంచి వెడలగ్గొట్టాలి అనేది ఒక పవిత్రమైన కార్యం అని కూడా అంటున్నారు. అంటే మీలో మీకు ఎన్ని తేడాలు ఉన్నా కూడా అందరూ సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఇది అని చెబుతున్నారు ఈ పాత్ర ద్వారా విశ్వనాథ. ఇది ఒక దేశం ఒక జాతి తన స్వత్వాన్ని కాపాడుకోవటం చేసిన ఒక యుద్ధం గురించిన వర్ణన. ఇందులో ఇస్లామోఫోబియాను చూడనక్కర్లేదు. దీనికి భయపడిపోయి మెజారిటేరియనిజం అని ఒక పేరు పెట్టేసి దానికి విరుగుడుగా అసంబద్ధంగా ఇస్లామోఫిలియా ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదు. తన స్వత్వం గురించిన చింతన ధర్మం గురించిన అవగాహన తన ధర్మానికి పర మతాలకు మధ్యన ఉన్న తేడా దేశం యొక్క స్వత్వం గురించిన చింతన అంటూ ఉంటే ఈ భావనలలో తప్పేమీ కనపడదు సగటు భారతీయునికి.
వర్ణ కుల వైరుధ్యాలు తారతమ్యాల గురించే కాకుండా సంప్రదాయ భేదాల గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది ఈ నవలలో
“పర్వతయ్య వీరశైవుడు. గంగిరెడ్ల వారు వైష్ణవులు. పర్వతయ్య వీరశైవ వాఙ్మయమును చదివినవాడు. వీరశైవులు కానివారిని వీరశైవులు భవులందురు. వీరశైవుడు భవియైనవాని మొగము చూడడు. వానితో మాటాడడు. కాని పర్వతయ్య యిటువంటి వాడు కాడు. అతడు తెలుగుజాతి యంతయు నొక్కటిగా చూచెడి మానిసి!”
ఇటువంటిదే ఇతర ధార్మిక సంప్రదాయాల గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది మరొక చోట. అంటే ఇటువంటి వైరుధ్యాలు ఎన్ని ఉన్నా కూడా ఒక చారిత్రక అవసరం కోసం అందరూ ఎలా కలిసిపోయారో వర్ణిస్తారు అనమాట. కాబట్టి బహుళత్వం అనేది ఐకమత్యానికి అడ్డు ఎప్పుడూ కాదు. వర్ణాల జాతుల సంప్రదాయాల ఆచారాల భాషా సంస్కృతుల బహుళత్వం ఉన్నంత మాత్రన అందరూ కొట్టుకుచచ్చారు కొందరు కొందరిని వందల వేల ఏళ్ళు అణగదొక్కారు అన్న దృష్టితో చూడనక్కర్లేదు. ఈ బహుళత్వాలన్నీ ఒకటితో ఒకటి నిత్య సంఘర్షణల మధ్యనో లేక అసలు ఈ సంబంధం లేకుండా వాటికవే అన్నటుగా ఎప్పుడూ లేవు. ఈ బహుళత్వాలు అన్నింటితో సుఖశాంతులతో సమాజం ఉందంటే అది సనాతన ధర్మం గొప్పతనం. అంతేకానీ మరింకేదో కాదు.
ఇన్ని బహుళత్వాలు వైరుధ్యాల మధ్యన ధార్మికమైన వారధులు ఉండేవి. ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా ఉండేవి. రకరకాల కులాల వర్ణాల సంప్రదాయాల వృత్తుల వైరుధ్యాల మధ్యన కూడా ఒక ఐకమత్యం అనేది ఉండేది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ ధార్మిక ఏకత్వమే. ఇటువంటి సమాజ నిర్మాణం అన్నది మతాల మీద ఆధార పడ్డ సమాజాలలో సిద్ధాంతాల మీద ఇతరత్రా భావజాలాల మీద (లిబరలిజం నేషనలిజం మార్క్సిజం సెక్యులరిజం) ఆధారపడ్డ సమాజాలలో జరగదు. అవన్నీ కూడా పైన విశ్వనాథ వారు చెప్పినట్టు కొట్టుకుచావటానికి మాత్రమే పనికొచ్చేవి. బహుళత్వాల మధ్యన సఖ్యతతో ఉండటం అనేది ధార్మిక పునాదులపై నిర్మించిన సమాజంలోనే సాధ్యం. ఉదారవాద సమాజం పేరుకు బహుళత్వాలను కాపాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి బహుళత్వాలను నిర్మూలించి అంతా ఒకటే మూస ఏకత్వం దిశగానే ఉదారవాద సమాజాల ప్రయాణం కూడా. భాషల విషయంలో భావజాలాల వైరుధ్యాల విషయంలో ఇది ప్రస్తుత ఉదారవాద సమాజాలలో కనిపించే విషయమే. దీని గురించి రాస్తున్న మేధావులు పరిశోధకులు కూడా చాలానే ఉన్నారు. హెన్రీ ఫోర్డు ఒక మాట అన్నారు అని చెబుతూ ఉంటారు. కస్టమర్ తనకు నచ్చిన రంగు కారు తాను కొనుక్కునే వెసులుబాటు ఉండాలి కానీ ఆ కారు నల్ల రంగుదై ఉండాలి అని అన్నాడట ఆయన. అలా ఉంటుంది ఉదారవాద ఆధునిక బహుళత్వం. చెప్పేదోకటి జరిగేదొకటి ఆధునిక సమాజంలో. ఆహార వైవిధ్యత కట్టే బట్టలలో వైవిధ్యత అన్ని తగ్గుతూ ఒక మూసలోకి వెళ్తున్నాం తప్పితే బహుళత్వాలను కాపాడుకున్న దాఖలాలు తక్కువే మన కాలంలో ఈ ఉదారవాద లౌకికవాద ఆధునిక పారిశ్రామిక విప్లవానంతర సమాజ భావజాలల హయాంలో.
ధార్మిక బహుళత్వాలు ఈ నేలలో ఇంతలా వర్ధిల్లటానికి గల కారణాలు వందేళ్ళు కూడా దాటని నేటి రాజ్యాంగంలోనో లేక మొఘలుల పాలనా వైశిష్ట్యంలోనో బ్రిటీషు పాలకుల ప్రాపకంలోనో వెతికితే దొరకదు అది సనాతన ధర్మంతో పూర్తిగా మమేకమైన ఒక ప్రజా సమూహంలో ఉన్న లక్షణం.
అయితే ఈ బహుళత్వం అనేది విచ్చలవిడితనం వైపు విశృంఖలత్వం వైపు అస్తవ్యస్తమైన అసంబద్ధ వైవిధ్యత వైపు కేవల భౌతికవాదం వినిమయతత్వం వంటివాటి వైపునకు పోకుండా కాపాడింది కూడా ఈ ధార్మిక లక్షణమే. ఇటువంటి వైవిధ్యత సెమెటిక్ మతాల సమాజంలో ఉదారవాద సమాజంలో మార్క్సువాద సమాజంలో కేవలం జాతీయవాదం అంటే సివిక్ నేషనలిజం పై నిలబడ్డ సమాజాలలో సాధ్యం కాదు. అసలు ఆధునిక వాదాలలో ఈ బహుళత్వాన్ని పెంపొందించే లక్షణమే లేదు.
ఇక నవల చివరన ఇలా అంటారు విశ్వనాథ ప్రోలయ నాయకుడు కాపయ నాయకుడి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ
“ఈ రీతిగా తెలుగు దేశమునకు ప్రోలయ్య నాడు స్వాతంత్య్రము తెచ్చెను. తెనుగు నాయకులు స్వతంత్రులైరి. తెలుగు దేశము నందు సనాతన ధర్మము నిలచెను”
“తరువాత పదియేండ్లకు కాపయ్య పెద్దవాడై, తురుష్కులను ఓరుగల్లు నుండి కూడ తరిమి వైచెను”
స్వాతంత్య్రము రావటం అంటే పర పాలన నుంచి పర మత ఆధిపత్యం నుంచి విముక్తి వచ్చి సనాతన ధర్మం నిలబడటమే అని చెప్పారు విశ్వనాథ ఈ నవలలో. తురుష్కులను తరిమికొట్టడం అనే దానిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ నవల మొదట్లో ఒక మాట అంటారు విశ్వనాథ
“చరిత్ర యనినంతనే కొన్ని విషయములు తప్పక యుండును. ముసల్మాన్ సోదరులు, హిందువులు వారి సంఘర్షణ పూర్వ ముండెడిది. ఆ సంఘర్షణ చెప్పినంత మాత్రము చేత భిన్న మతములకు ద్వేషము కల్పించుట కాదు. ఈ చిన్ని పుస్తకము సంపూర్ణముగా చదివినచో, అట్టి భావము యీ గ్రంథమునం దెచ్చటను లేదని తెలియును. అంతియేకాక యెవరిమతము నందు వారుండి సాంఘికముగ స్నేహ భావము పెంపొందింప వలయు ననియే యీ గ్రంథము యొక్క తాత్పర్యార్థ మనియు తెలియును.”
ఈ మాట అనటంలో విశ్వనాథ ఉద్దేశం తాను ఈ రచన రాసినప్పటి కాలం నాటి తెలుగు సమాజంలో వైషమ్యాలు రగల్చాలన్న భావన తనకు లేదు అని తెలియజెప్పటం. ద్వేషం కల్పించటం ఆయన ఉద్దేశం కాదు. అది ఆయనే రాసుకున్న మాట. ఎవరి మతంలో వారు ఉంటే చాలు ఇతర మతాల వారితో స్నేహ భావం కలిగి ఉంటే చాలు అని కూడా అన్నారు. ఈ విషయంతో ఈ వ్యాస రచయితగా నాకు కూడా పేచీ లేదు.
అయితే ఇస్లామోఫోబియా ఇస్లామోఫిలియా అన్న ద్వంద్వాన్ని దాటి సొంత సంస్కృతి పట్ల ఉన్న ద్వేషం ఏహ్య భావం న్యూనతా భావం కలగలిసిన ఒయికోఫోబియా అన్నది పోయి సనాతన ధర్మంతో ఉన్న తల్లిపేగు బంధాన్ని తిరిగి గుర్తు తెచ్చుకుని సొంత గూటి సంస్కృతిపై ప్రేమ అంటే ఒయికోఫిలియా అన్నది తిరిగి పునరుజ్జీవితమై హిందువులందరూ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలన్నదే నా అభిప్రాయం. అది తెలియబరచేటందుకే ఈ వ్యాసం రాయటం. ఈ నవలలో విశ్వనాథ చెప్పినది కూడా అదే. ఇస్లాం పట్ల ద్వేషం చారిత్రక అవసరంగా భావించి రాయలేదు ఆయన ఆ నవల. కేవలం సనాతన ధర్మం స్వాతంత్య్రము గురించిన చింతనతో రాసిన నవల ఇది. స్వ పర అన్న తేడాను గుర్తించాలి హిందువులు అందరు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్న గీతా వాక్యాన్ని ఈ సందర్భానికి అనుగుణంగా అర్థం చేసుకోవాలి.
అన్ని మతాలూ ఒక్కటే అన్ని భావజాలాలూ సమానమే అనే శుష్క తటస్థ వైఖరి అవలంభించాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మానికి భారత దేశానికి గల విశేషమైన సంబంధాన్ని గుర్తించి ఆ విషయం చెప్పటానికి జంకు బొంకు లేకుండా ఉండే స్థాయికి మరికొందరు హిందువులు ముందుకు రావాలి.
ఈ విషయాలలో అవగాహన పెంచుకోవటానికి సమకాలీన సాహిత్య చర్చలలో సప్రమాణంగా ధర్మం గురించి మాట్లాడటానికి విశ్వనాథ సాహిత్యం ఖచ్చితంగా ఉపకరిస్తుంది. విశ్వనాథ సాహిత్యం మరికొందరు చదువుతారని ఆశిస్తూ తెలుగు సాహిత్య లోకంలో ఇటువంటి విషయాలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని మరొకసారి పాఠక లోకానికి మనవి చేస్తూ ఈ వ్యాసం ముగిస్తున్నాను.
