[టర్మీ భూంకప మృతుల హృదయ విదారక దృశ్యాలను చూసిన నేపథ్యంలో తన హృదయ స్పందనను కవితా రూపంలో అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు.]
నడిరేయి దాటినా
నిదుర రాని నా కన్నులు..
అంతు తెలియని అగాధాన్ని
శోధించాలని ఆరాటపడుతున్నాయి!
నిన్ను తెలుసుకోవాలని..
నీ సృష్టి రహస్యాన్ని ఛేదించాలని..
బలీయమైన ఓ కోరిక
నా మదిలో చేరి
అలజడి సృష్టిస్తోంది!
ఓ ప్రభూ..!
అనంతమైన నీ సృష్టిలో
అసమానతలను చూస్తూ..
మౌనవేదనను అనుభూతిస్తూ..
విచలితుడనై తల్లడిల్లిపోతున్నాను!
ఈ ఆధునిక విశ్వమానవుడు
ఎల్లలు లేని నీ సృష్టికి
ప్రతిసృష్టిని ప్రతిబింబించే రీతిలో
అద్భుతాలను ఆవిష్కరిస్తూ..
నిన్ను అవహేళన చేస్తున్న వేళ
నీ ఉనికిని చాటుకోవడానికేనా..
ఈ ధరిత్రీ ప్రకంపనలు!?
సృష్టి స్థితి లయలను శాసించే
అద్భుతమూర్తి సృష్టి బ్రహ్మను
మానవజాతి అపహాస్యం చేస్తున్నందుకా..
ఈ విలయ తాండవ హేల?
ప్రకృతిని
పంచభూతాలను
నిర్లక్ష్యం చేసి..
తానే జగజ్జేతనని
నవీన యుగ మనుష్య జాతి విర్రవీగుతున్నందుకా..
ఈ ప్రళయ తాండవ బీభత్సం!?
సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను
ఆలంబనగా జేసుకొని..
విలువైన జీవన మార్గంలో
పయనించాల్సిన మానవకోటి..
కక్షలు కార్పణ్యాలతో
ఆధునిక అణ్వాయుధాలతో
ఒకరిపై మరొకరు కాలు దువ్వుతూ..
మతాల మారణ హోమంలో
అమాయక జీవితాలను బలి చేస్తూ..
వికృత వికటాట్టహాసాలు చేస్తోన్న
మానవ మృగాలను కట్టడి చేసేందుకా..
ఈ భయంకర మృత్యు నర్తనం!?
నీ సృష్టి విన్యాసాల అంతరార్థాన్ని
హృదయం లోతుల్లో దాచుకొని..
నా మానవ జాతి ప్రతినిధిగా
‘మన్నింపు’ను వేడుకుంటూ..
నీ చరణ కమలముల చెంత
ప్రణమిల్లుతున్నాను ప్రభూ..
వినమ్ర అంతరంగానుభూతితో!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.