[తాటికోల పద్మావతి గారు రచించిన ‘వివాహ బంధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తెంచుకుంటే తెగిపోయేది కాదు తీయటి బంధం
మూడుముళ్లతో ముడిపడి ఏడు అడుగులు వేశాక
ఇరువురి కొంగులు కలుపుకొని సప్తపదులను తాకి
చిటికెన వేలు పట్టుకొని అగ్ని చుట్టూ చేసే ప్రదక్షిణం
అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి
అనే అర్థానికి ఆలుమగలు కట్టుబడి ఉన్నప్పుడే
ఆ వివాహ బంధం కలకాలం వర్ధిల్లుతుంది.
మెడలో తాళి కట్టించుకున్నంత మాత్రాన
భర్తకు భార్య బానిస అయిపోదు
ఆ బంధం జీవితాంతం బలపరుచుకొని
కొడవడుకు కడితే వరకు
ఆ దేవుడు వేసిన బ్రహ్మకుడి విడిపోలేని పవిత్రమైనది.
వంశం నిలబడటానికి సంతానాన్ని ఇచ్చి
ఇంటికి దీపం ఇల్లాలై మహారాణిగా
వెలిగిన నాడు ఆ కుటుంబ వ్యవస్థ
పది కాలాలు వాడిపోని వసంతంలా
ఇగిరి పోని గంధమై పరిమళాలు వెదజల్లుతుంది.
అధికార పెత్తనానికి ప్రాకులాడకూడదు.
అనుమానాలు, అపోహలకు దారి తీయకుండా
నమ్మకం పెంచుకోవాలి.
చాలినంత లేదని, అలకలు సాధింపులు,
కోపతాపాలు పట్టింపులకు పోతే,
పంతాలు పెంచుకొని, సంపాదనలో పై చేయి నాదేనంటే
సంసారంలో పెత్తనం నాకేనంటూ
సంకుచిత స్వభావాలతో స్వార్థపరులైతే
నీది నాదని భేదాలు చూపిస్తూ,
ఎవరిదో వారిదే అంటూ మాటల యుద్ధం చేసుకుంటే,
కాపురం విచ్ఛిన్నమై విడిపోయి
చివరకు విడాకులే మిగులుతాయి.
మధ్యలో నలిగిపోయేది పిల్లలే!
అభం శుభం తెలియని పసి హృదయాలు
సమాజానికి చీడపురుగుల్లా మారకముందే,
ప్రతి భార్య భర్త ఆలోచించుకోవాలి.
ఒకరికొకరు అర్థం చేసుకున్న నాడే
తొలగిపోతాయి అపోహలు.
ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోసపోయాక
తెలుస్తుందా బంధం విలువ
పెద్దల మాట పెడచెవిన పెట్టి
నేటి కల్చర్ కి కొత్త రంగులు పులిమి
అర్ధనగ్నాలతో చాలీచాలని వలువలతో,
విలువల్ని కోల్పోయి అర్ధరాత్రి పబ్బులు క్లబ్బులంటూ స్వేచ్ఛగా
ఎగరాలని, కట్టుబాట్లను తెంచుకుంటే
బంధాలన్నీ ఆర్థిక సంబంధాలయ్యాక
వివాహ వ్యవస్థ ఎటు పోతుందీ సమాజంలో?
