[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘వివేచన!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎవరు వ్రాశారని కాదు
ఏం వ్రాశారని!
ఏ సిరా వాడారని కాదు
అక్షరం ఎట్లా పలికించారని!
ఏ రంగు వారని కాదు
పదాల వన్నెలను పలకరించారా అని
అర్థాల ఛాయలతో స్నేహం చేశారా అని
నాస్తికులా ఆస్తికులా అని కాదు
మనిషిని మనిషిగా గుర్తించారా అని
వసంతశిశిరాల వర్ణనలు చేశారా అని కాదు
జీవన ఋతురాగాల వినిపించారా అని!
అక్షరానికి, ‘కలం’కారుడి మతం పట్టదు
కలానికి, వ్రాతగాడి కులంతో పనిలేదు
జన హితమైనది, హిత వచనమైనది
ప్రసన్న రమణీయమైనది
ఒకే ఒక్క మంచి మాట చాలదూ
ఒక్క పదబంధం కట్టేసినా చాలదూ
ఒక్క వాక్యం తట్టి మేల్కల్పేది చాలదూ
గుండె తడి పోషించేది
మానససరసిలో సద్భావపద్మం విరియించేది!
అనామకుడి నోట అమృతవాక్యం దొర్లవచ్చు
ఆరంగేట్రానికే రంగమంతా పురి విప్పవచ్చు
భావ విహంగ విహరణకు హద్దేముంది
విస్తారాకాశం, నిస్సీమ సుందరం!
రసాంబుధిని కొలిచే సాధన మేముంది!?
అది అమేయం, అగాథం!
సరస్వతి ముఖాలు అనంతానంతాలు
దర్పణం ఎంత చిన్నదైనా
కనబడే ఆ రూపం సాకల్యమే
ఆ ప్రతిభా శంపాలతకు ప్రతిబింబమే!
పృథుకీర్తులు పొరబడవచ్చు
పేలవ గీతా లాలపించవచ్చు
తామసమో, అలసత్వమో, అహమికయో
పదం తడబడి, భావం నిర్భావం కావచ్చు!
ప్రాథమికు డెవరో ఆదిలోనె
పరిణతి చూపవచ్చు
సాహితీవనంలో తొలిపంటలోనే
పైడిపూలు పూయించవచ్చు!
వ్రాసిన అక్షరం పట్టే అర్హత
పల్కిన మాట బట్టే మన్నన
ఈ లోకంలో నైనా
సారస్వత లోకంలోనైనా!
చేసిన కర్త చిరునామా మరిచి
ఆ శిల్పపు గుణదోష నిర్ణయం జరిగితే
ఆ బ్రహ్మకి హితం, శిల్పానికి సార్థక్యం
అది సాక్షాత్తూ సరస్వతి మెచ్చే రాజపథం
వాజ్ఞ్మయ పుర రక్షకులనే ముద్రధారులకు
ఆత్మగౌరవ పరిరక్షకం,పదవికి ప్రతిష్టాకరం
అది, అక్షరాని కిచ్చే సముచిత నీరాజనం
వాణి సన్నిధిని చేసే సత్పూజా సమం!!
ఆ కలానికి జవనాశ్వ వేగాన్నిచ్చే వరం
ఆ గళానికి గొంతెత్తి పాడే కొండంత బలం!
