[వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు రచించిన ‘ఓటు ఎర – ఆకలి పొర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
మధ్యాహ్నం రెండు గంటలు. ఆకాశం నిప్పులు చెరుగుతోంది. సభాప్రాంగణంలో మైకు తుప్పుపట్టిన గొంతుతో అరుస్తోంది. ఊరి శివార్లలోని సభాప్రాంగణం ఒక రణరంగంలా ఉంది. వేలాది మంది జనం కేకలు, మైకుల కర్ణకఠోరమైన హోరు, వెరసి ఆ ప్రాంతమంతా ఒక దిగ్భ్రమ కలిగించే గందరగోళంతో దద్దరిల్లుతోంది.
“సోదర సోదరీమణులారా! ఈ దేశంలో పేదరికం అన్న మాట వినిపించకూడదన్నదే మా సంకల్పం! ప్రతి పేదవాడి కడుపు నింపడమే మా లక్ష్యం!” ప్రసంగిస్తున్నారు మంత్రిగారు.
ఆ ఉక్కిరిబిక్కిరి చేసే జనసందోహంలో, ఒక మూల అనామకుడిలా కూర్చుని ఉన్నాడు లక్ష్మయ్య. అతడి దైన్యం ఆ చిరిగిన చొక్కా చాటునే దాగి లేదు. కనీస గౌరవాన్నైనా కాపాడుకోలేనంతగా చినిగిపోయిన ఆ మాసిన పంచె అతడి పేదరికానికి నిలువుటద్దం. ఎండవేడికి పెదవులు ఆర్చుకుపోయి, పగుళ్లు తీరి తెల్లబారిపోయాయి. గొంతులో తడి ఆరిపోయి, శ్వాస కూడా బరువుగా మారుతోంది.
“వింటున్నావా లక్ష్మయ్యా? ఆయన చెప్పేది?” గొణిగాడు శరభయ్య.
ఆ జనంలో సగం మంది లక్ష్మయ్యల వంటి వారుంటే, శరభయ్య లాంటి కొందరు అక్కడ జరుగుతున్నది వినోదంలా చూడడానికి వచ్చిన వారే.
“వినడానికి ఏముందిలే శరభయ్యా.. పొట్టలో పేగులు ఒకదాన్నొకటి కొరుక్కుంటుంటే, ఆ గంభీరమైన మాటలు వినే ఓపిక ఎక్కడిది? నేనొచ్చింది కడుపునింపని మాటలకు కాదు, కడుపు నింపే నాలుగు మెతుకులకి”
“ఈ వయసులో, ఇంత ఎండలో ఎందుకయ్యా నీకీ తిప్పలు? ఇంటి దగ్గరే కూసంత గంజితో ఎంగిలిపడక” కడుపు నిండినవాడికి ఆకలతో ఉన్నవాడు లోకువ అనీ, జాలితో హితం చెప్పాడు శరభయ్య.
“ఇంట్లో ఉండే వెసులుబాటు అందరికీ ఉండాలిగా? పొయ్యి వెలగక రెండ్రోజులైంది బాబూ.. నా మనవడు ఆకలికి తాళలేక వాడి చిన్న చేతులతో కడుపు పట్టుకుని ఏడుస్తుంటే ‘మంత్రి గారు భోజనం పెడతారటరా, వెళ్లి పట్టుకొస్తా’ అని వాడికి ఆశ పెట్టి వచ్చాను. వాడు నా కోసం గడప దగ్గరే కూర్చుని ఉంటాడు” అంటున్న లక్ష్మయ్య కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి.
లక్ష్మయ్య కళ్లు వేదికపై గంభీరంగా ఉపన్యాసమిస్తున్న మంత్రి గారి వైపు చూడటం లేదు. ఆ అధికార దర్పం, ఆ హామీల హోరు అతడికి అనవసరం. అతడి చూపులన్నీ వేదిక వెనుక ఉన్న ఆ పందిళ్ల వైపే ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద పాత్రల్లో వండుతున్న వంటల నుంచి వస్తున్న ఆవిర్లు, ఆ వాసన అతడి కడుపులోని ఆకలి మంటను మరింత రగిలిస్తున్నాయి. గంటల తరబడి ఖాళీగా ఉన్న కడుపుని అడుగుతున్న ఆక్రందన అది. ఆశగా, ఆత్రంగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు సంజీవని కోసం చూసినట్టు, లక్ష్మయ్య ఆ వంటశాల వైపే దీనంగా చూస్తున్నాడు.
వేదికపై నుంచి వినిపిస్తున్న ఆర్భాటపు ఉపన్యాసాలు, అంకెలు, వాగ్దానాలూ.. ఇవేవీ తన రాతను మార్చవని అతడికి బాగా తెలుసు. ఆ మైకుల గోలంతా అతడికి ఒక అర్థం లేని అరుపులాగే వినిపిస్తోంది. కానీ, అక్కడ వడ్డిస్తున్న ఆ ఒక్క పూట విస్తరి – అది అతడికి కేవలం ఆహారం కాదు, రెండ్రోజుల మృత్యువును వాయిదా వేసే అమృతం.
దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడికి పలవరిస్తూ నిద్రపోయిన మనవడి మొహం కళ్లల్లో కదలాడుతోంది. ఆకలితో వాడు ఏడుస్తుంటే, ఓదార్చడానికి మాటలు కూడా దొరకని దీనస్థితి. చివరకు వాడి కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ..
“మంత్రి గారు ఊళ్లోకి వస్తున్నారట. అందరికీ కడుపునిండా బువ్వెడతారంట. అక్కడికెళ్ళి నేనింత తిని, నీకంత పట్టుకొస్తాలే. అందాక ఏడవకుండా ఉండయ్యా! మా బాబు కదూ..” అబద్ధమో, నిలబెట్టుకోలేని వాగ్దానమో చేసి వచ్చాడు.
ఆ పసివాడి కళ్ళల్లో మెరిసిన ఆ ఆశే ఇప్పుడు లక్ష్మయ్యను ఈ మండుటెండలో, ఈ జనసందోహంలో ఒక పిచ్చివాడిలా నిలిపింది. ఆ వంటశాల వైపే ఆశగా చూస్తున్నాడు. గౌరవం, సిగ్గు, అలసట.. అన్నీ ఆకలి ముందు మోకరిల్లాయి. ఇప్పుడు అతడి ప్రపంచమంతా ఆ వంట పాత్రల చుట్టూ, ఆ విస్తరి చుట్టూనే తిరుగుతోంది. అతడు ఎదురుచూస్తున్నది ఆ ఎన్నికల ప్రచారాలతో దేశ స్థితి మారతుందని కాదు, తన మనవడి ఆకలి తీరుతుందని!
మైకులో మంత్రిగారు తన కంచుకంఠంతో “పేదరికాన్ని నిర్మూలిస్తాం, పేదవాడి ఆకలి తీర్చడమే మా లక్ష్యం!” అంటూ గర్జిస్తుంటే, లక్ష్మయ్య చెవుల్లో ఆ శబ్దాలు సీసం పోసినట్టుగా తాకుతున్నాయి. మంత్రి మాటల కంటే పేగుల్లో పుడుతున్న ఆకలి కేకలే అధికంగా వినిపిస్తున్నాయి. అది ఆకలి కాదు, కడుపులో కదులుతున్న మృత్యువు అరుపు.
***
సభ ముగిసి “జై హింద్” అని ప్రకటించీ ప్రకటించగానే అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న జనం ఒక్కసారిగా భోజనాల పందిరి వైపు సునామీలా ఎగబడ్డారు. అది సభాప్రాంగణం కాదు, బతుకుపోరాటం జరుగుతున్న రణరంగం. ఆకలితో రగిలిపోతున్న వందలాది మంది మనుషులు ఆ కాస్తన్నం కోసం ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ రాక్షసుల్లా మారుతున్నారు.
“అమ్మో! అన్నం దగ్గరికి వెళ్లనివ్వరేమో! శరభయ్యా, నా చెయ్యి పట్టుకో!” అంటున్న లక్ష్మయ్య ఆ తోపులాటలో కింద పడిపోయాడు. ఎవరి కాళ్లకో తగిలి అతడి భుజం విలవిలలాడిపోయింది.
భుజంపై పడుతున్న బూట్ల దెబ్బలు, రొమ్ము మీద పడుతున్న బరువు, నొప్పి ప్రాణాన్ని తీస్తున్నా, అతడు మాత్రం తన చేతిలో ఉన్న ఆ పాత టిఫిన్ డబ్బాను వదలలేదు. అది కేవలం స్టీలు డబ్బా కాదు, తన మనవడి ప్రాణం.
“ఒక్క నిమిషం ఆగండయ్యా! నన్ను తొక్కకండి! చచ్చిపోతాను! అయ్యా.. నా డబ్బా చితికిపోతోంది.. ఆగండి!” అంటూన్నా వినే నాధుడు లేడు. మొరటుగా పక్కకు తోసేసారు. ఎలాగోలా పాకురుకుంటూ క్యూ దగ్గరికి చేరుకున్నాడు. వడ్డించే వ్యక్తి ప్రతి ఒక్కరినీ ఈసరించుకుంటూ విసుగ్గా అన్నం వేస్తున్నాడు.
నలిగిన శరీరంతో, ఊపిరి సలపని గందరగోళంలో లక్ష్మయ్య కళ్లు నీళ్లతో వడ్డించేవాడిని చేరాలని ఆరాటపడ్డాడు. పొట్ట ఆకలి ఆర్తనాదం చేస్తోంది.
“ఒక్క ముద్దయ్యా!! నాక్కాదయ్యా. ఇంటి దగ్గర నోరు తెరుచుకుని చూస్తున్న నా మనవడికి. ఆ పసివాడి ఆకలి చల్లారడానికి ఒక్క ముద్ద దొరికితే చాలు! నన్ను తొక్కేయండి, చంపేయండి కానీ ఆ డబ్బాలో కాస్త అన్నం పెట్టండయ్యా!” సేవకుడికి చేరువ అవుతూ తన వంతుకోసం నిలబడి రెండవ స్థానంలో ఉన్న లక్ష్మయ్య ఆశగా అర్థించాడు.
“జరుగు పెద్దయ్యా! నీ ఒక్కడికేనా? వెనక వేల మంది ఉన్నారు. ఇంద.. ఇక అవతలికి పో!” ఒక్క గరిటెడు అన్నం వేసి అన్నాడు మంత్రి గారి సేవకుడు.
“అయ్యా.. కొంచెం ఎక్కువే వెయ్యండి.. ఇంట్లో నా మనవడు ఉన్నాడు. వాడికి ఇంత ముద్ద పెడితానయ్యా మీకు పుణ్యం ఉంటాది” అన్న లక్ష్మయ్య మాటను విన్నవాడు లేడు.
ఆ వేడి అన్నం డబ్బాను గుండెకు హత్తుకుని లక్ష్మయ్య బయటకు వస్తుంటే, మంత్రి గారి కారు నిష్క్రమిస్తోంది. అద్దం దింపి ఒక కార్యకర్త నీళ్ల ప్యాకెట్లు ఇవ్వగా వారి చేతుల మీదుగా విసిరాడు మంత్రి. జనం ఆ ప్యాకెట్ల కోసం కొట్టుకోవడం ఆరంభించారు.
మంత్రిగారి ఉపన్యాసం, అక్కడ జరగనున్న సభను వినోదంగా చూడడానికి వచ్చిన శరభయ్య మనసు కదిలింది.
“చూసావా లక్ష్మయ్యా! పైన వేదిక మీద మంత్రిగారు పేదరికాన్ని నివారిస్తానని గర్జించాడు. కింద జనమేమో ఒక్క నీళ్ల ప్యాకెట్ కోసం మట్టిలో పొర్లాడుతున్నారు. వాళ్ళు విసిరేది వీళ్ళకు ప్రసాదం అవుతోంది. మనుషుల ఆత్మగౌరవం మంత్రిగారి కారు చక్రాల కింద నలిగిపోతోంది” అంటున్న శరభయ్య మాటలు వినే పరిస్థితిలో లక్ష్మయ్య లేడు.
ఆ క్షణాన అక్కడ కనిపిస్తున్న దృశ్యం శరభయ్యను నిలువునా కలచివేసింది.
సభ ముగించుకున్న నాయకులు తమ ఏసీ కార్ల అద్దాలు దించి, వాటర్ ప్యాకెట్లను విచ్చలవిడిగా రోడ్డు మీదకు విసిరేస్తున్నారు. ఆ నీళ్లప్యాకెట్ల కోసం జనం తొక్కిసలాట మొదలైయ్యింది. బురదలో పడ్డ ప్యాకెట్లను ఏరుకుంటూ, దాహం కోసం ఒకరినొకరు నెట్టుకుంటున్న జనాన్ని చూసి ఆకలి దప్పికల విలువ తెలిసింది శరభయ్యకు. కళ్లు చెమ్మగిల్లాయి.
ఒక పక్క విలాసవంతమైన కార్లలో తరలి వెళుతున్న అధికార గర్వం, మరోపక్క ఒక పూట తిండి కోసం, ఒక నీళ్ల ప్యాకెట్ కోసం మట్టిలో పొర్లాడుతున్న నిస్సహాయ జనం. రాజకీయ రంగుల విందు ముగిసింది. మంత్రి గారికి ఆ సభ తన అధికార పీఠాన్ని పదిలపరుచుకునే ఒక వ్యూహం. జనం నుంచి పిండుకోవాల్సిన ‘ఓటు’ కోసం విసిరిన ఎర. కానీ, లక్ష్మయ్య వంటి అభాగ్యులకది ఒక పూట మృత్యువును తప్పించుకునే ‘జీవన్మరణ పోరాటం’. ఆయన దృష్టిలో ఆ అన్నం కేవలం ఎన్నికల ఖర్చు. లక్ష్మయ్య దృష్టిలో అది తన మనవడి ప్రాణాలను నిలిపే ఒక ‘వరప్రసాదం’. ఆ నాయకుడికి ఆ సభ ఒక విజయ చిహ్నం అయ్యింది. లక్ష్మయ్యకు అది తన ఆకలిని సాటి మనిషికి తాకట్టు పెట్టిన ఒక అవమానకరమైన జ్ఞాపకం. ఆకలి రాజ్యమేలుతున్న చోట అభ్యుదయం అనేది కేవలం గోడల మీద రాసుకునే రాత మాత్రమేనని శరభయ్యకు అర్థమైయ్యింది.
లక్ష్మయ్య కళ్లలోని నీరు, ఊరి పొలిమేరల్లో ఆకలి కేకలు శరభయ్య గుండెల్లో అలాగే మిగిలిపోయాయి.
నోరి సుందరేశ్వర రావు, లలిత దంపతుల కుమార్తె, పూర్ణ కామేశ్వరి జన్మ స్థలం పిఠాపురం. దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వీరి ప్రస్తుత నివాసం చెన్నై.
2003 నుండి దక్షిణ రైల్వే కార్యాలయం చెన్నైలో నిర్వహించే హిందీ భాషా వ్యాస రచనల పోటీలు, పుస్తక సమీక్ష పోటీలలో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది. ఆంగ్లంలో కూడా చిన్నా పెద్దా వ్యాసాలు, కథలు వ్రాయడం ప్రవృత్తైంది. మాతృభాషలో వ్రాయాలనే ఆసక్తితో, 2020 తరువాత తెలుగులో వ్రాయడం ప్రారంభించి స్వల్పకాలంలోనే వీరి కథలు ప్రచురణకు ఎంపికవ్వడం, బహుమతులు గెలవడంతో సాహితీ ప్రయాణం అలుపెరుగనిదిగా సాగింది.
2021 నుండి అనేక కథలకు బహుమతులు పొందడం, మరెన్నో కథలు ప్రచురణకు ఎంపికవ్వడం జరిగింది. ఇంత వరకూ నూరుకు పైగా కథలు ప్రచురితమైయ్యాయి. లేఖిని సరసిజ, తపస్వి, తెలుగు తల్లి-కెనెడా, కథా మంజరి, విశాలాక్షి, సహరి, కథా వేదిక, రవళి, సాహో, ఉషా, సుమతి, నెచ్చెలి, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, పాలపిట్ట, సంచిక, సాహితీ కిరణం, జాగృతి మొదలగు సంస్థలు నిర్వహించిన పోటీలలో అనేక బహుమతులు పొదడం జరిగింది.
ఐదు నవలలు, మూడు నవలికలు పోటీల్లో ఎంపికై ప్రచురితమైయ్యాయి. మన తెలుగు కథలు.కామ్ లో వెబ్ సీరీస్ గా ఒక నవల ప్రచురితమవ్వగా, తపస్వి మనోహరం నిర్వహించిన పోటీల్లో వీరి నవలకు ప్రథమ బహుమతి లభించింది.
అనేక కవితలు, వ్యాసాలు, గజళ్ళూ కూడా వీరి కలం నుండి జాలువారి పత్రికల్లో ప్రచురితమైయ్యాయి.
సామాజిక ధృక్పథం కలిగిన మరెన్నో రచనలు చేస్తూ, సాహితీ పయనాన్ని కొనసాగించాలన్నదే వీరి అభిలాష.
