[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘వృద్ధాప్యం ఓ వరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయం ఐదు గంటలకు అలారం చేస్తున్న శబ్దాన్ని నిశ్శబ్దం చేసి, నిద్రలేచింది అన్నపూర్ణ. కర్టెన్లు పక్కకి జరిపి, కిటికీ తలుపులు తెరిచింది. చల్లని గాలి రివ్వున లోపలికి వచ్చింది. పక్షుల కిలకిలరావాలు విన్పిస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకొని, ఫిల్టర్‌లో కాఫీ డికాషన్ పోస్తుంటే.. ఫోన్ మోగింది.
“హలో! అన్నపూర్ణా! యోగ క్లాస్‌కి వస్తావా? మేమిద్దరం బయలుదేరుతున్నాం.” అన్నాడు రాఘవ
“అయితే ఇక్కడికి రండి! కలిసి వెళ్దాం”
“రెండు నిమిషాల్లో వస్తున్నాం” అని ఫోన్ పెట్టేసాడు.
హాల్లో పెయింటింగ్ స్టాండ్ కి అసంపూర్తి కాన్వాస్ పెయింటింగ్, పక్కన టేబుల్ మీద పెయింటింగ్ ట్యూబ్స్, బ్రష్లు చూసి, ఆశ్చర్యంగా.. “అన్నపూర్ణా! నువ్వు పెయింటింగ్స్ వేస్తావా?” అన్నాడు.
“అవును. ఇంట్రెస్ట్. ఎక్కడా నేర్చుకోలేదు. సైన్స్ స్టూడెంట్‌ని, పైగా డ్రాయింగ్ అంటే ఇష్టం. వదలకుండా ఏదో వేస్తుంటాను..”
“ఈ వయసులోనూ హాబీని కొనసాగించడం ఇంత బాగా వేస్తున్నావంటే రియల్లీ గ్రేట్.. నీకు మంచి కాలక్షేపం” అన్నాడు రాఘవ
“అభిరుచికి వయసుతో పనిలేదు. మనసుంటే చాలు” అంది వసంత.
నిమ్మరసం, తేనె కలిపిన నీళళు ముగ్గురూ తాగి, ఐదో ఫ్లోర్ నుండి కిందికి వచ్చారు.
***
నగర శివార్లలో విశాలమైన ప్రదేశంలో ప్రకృతి ఒడిలో అధునాతన వసతులతో నిర్మించిన సీనియర్ సిటిజన్స్ లివింగ్ రెసిడెన్సిలో ఉంటున్న చాలామందితో రాఘవ దంపతులు సంవత్సరం క్రితమే వచ్చి చేరారు.. రాఘవ ద్వారా తెలుసుకుని అక్కడ ఓ ఫ్లాట్ కొనుక్కుని వారం క్రితమే వచ్చింది అన్నపూర్ణ.
***
యోగ క్లాసులో యోగాసనాలు, ప్రాణాయామం వంటి శ్వాసకోశ ఎక్సర్సైజులు చేశారు.
తర్వాత వసంత, అన్నపూర్ణ కిచెన్ వైపు వెళ్లారు. ప్రతిరోజూ కిచెన్‌లో మరో నలుగురితో కలిసి కూరలు తరిగి ఇస్తుంటారు. ఇప్పుడు అన్నపూర్ణ కూడా వాళ్లతో కలిసింది.
రాఘవ, గోపాలకృష్ణ, పార్థసారథి, భాస్కరరావులు కలిసి వాకింగ్ ట్రాక్‌లో నడుస్తున్నారు. ఐదు రౌండ్లు పూర్తి చేసేసరికి ఉదయపు ఎండ వచ్చింది. ట్రాక్ పక్కన ఉన్న బెంచీల మీద నలుగురూ కూర్చున్నారు. జిమ్‌లో స్వేదం చిందేలా వర్కవుట్లు చేసి వచ్చిన రాంబాబు.. రాఘవ వాళ్ళ దగ్గరకి వచ్చి కూర్చున్నాడు. లోకాభిరామాయణంతో మొదలై మొంధా తుఫాను నుండి, చాగంటి వారి ప్రవచనాలను కలుపుకుని, ట్రంప్ రాజకీయ నిర్ణయాల దగ్గర మలుపు తీసుకుని ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ దగ్గరకి వచ్చాయి.
గోపాలకృష్ణ లేచి “ఎనిమిది అవుతోంది. వెళ్లి ఫ్రెష్ అయ్యి.. డైనింగ్ హాల్ కి వద్దాం.. లేవండి” అనేసరికి అందరూ లేచారు.
***
అన్నపూర్ణ, వసంత వెళ్లి తయారై కాంపౌండ్‌లో ఉన్న గుడికెళ్లారు.
“అమ్మా! ఇవ్వాళ శుక్రవారం. సాయంత్రం లలితా సహస్రనామ సామూహిక పారాయణ ఉందమ్మా! తప్పకుండా రండి” చెప్పాడు పూజారి.
“అలాగేనండి!” అంది వసంత.
తర్వాత డైనింగ్ హాల్‌కి వచ్చారు. అక్కడ అందరితోపాటు బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత.. పార్థసారథి, రాఘవ కార్లో బయటికి వెళ్లారు. వసంతతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నపూర్ణ.
“ఎలా ఉందిక్కడ మీకు?” అడిగింది వసంత.
“రాఘవ చెప్పిన దాని కంటే చాలా బాగుందిక్కడ. ముఖ్యంగా జారి పడిపోకుండా నాన్ స్లిప్ ఫ్లోరింగ్, ఎవరి సహాయం లేకుండా పట్టుకుని లేవడానికి ఎక్కడికక్కడ హ్యాండ్ రైలింగ్ చాలా బాగున్నాయి. ప్రస్తుత జీవితానికి అనుకూలంగా, ఆసరాగా ఉందిక్కడ”
“ఇక్కడికి రావడానికి, ఫ్లాట్ కొనుక్కోవడానికి మీ పిల్లలిద్దరూ ఒప్పుకున్నారా?” అంది వసంత.
అంతలో.. కాలింగ్ బెల్ మోగింది. వసంత వెళ్లి తలుపు తీసింది.
“అమ్మా! క్లీనింగ్”.. అని ఓ నడి వయస్కురాలు యూనిఫాంలో వచ్చింది.
గదులు క్లీన్ చేస్తుంటే.. వసంత అన్నపూర్ణ బాల్కనీలో కూచున్నారు.
“నా గురించి మీకు పూర్తిగా తెలియదు కదూ..!” అని చెప్పడం మొదలు పెట్టబోయింది అన్నపూర్ణ.
మళ్లీ డిస్ట్రబెన్స్..
ఓ కుర్రాడు వచ్చి “మేడం! లాండ్రీకి సార్ ఫోన్ చేశారు.. బట్టలివ్వండి” అన్నాడు.
వసంత లేచి బట్టలిచ్చి.. బాల్కనీకి వచ్చి కూర్చొని.. “చెప్పండి” అంది.
“రాఘవ, నేను టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఉద్యోగరీత్యా మా నాన్న మరో ఊరికి బదిలీ అయ్యాం. ఆ తర్వాత రాఘవని కలుసుకోలేదు.
బీ.ఎస్సీ, బీ.ఈడీ వరకు చదువుకున్నాను. నేను విశ్వనాథ్‌ని పెళ్లి చేసుకునేటప్పటికే ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన సంవత్సరానికి నాకు ప్రైవేట్ కళాశాలలో సైన్స్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం కూతురు సౌమ్య, తర్వాత రెండేళ్లకి కొడుకు అజయ్ పుట్టారు.
మా ఇద్దరికీ ఉద్యోగాలు తప్ప ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. పిల్లలు స్కూలింగ్‌లో ఉన్నప్పుడే లోను తీసుకుని ఐదొందల గజాల స్థలం కొనుక్కున్నాం. ఆ తర్వాత పిల్లలు చదువులతో.. ఇల్లు కట్టుకోవడానికి వెసులుబాటు కాలేదు. సౌమ్యకి మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది. అజయ్ ఇంజనీరింగ్ చదివాడు. సౌమ్యకి డాక్టర్ రాజేష్‌తో వివాహం అయింది. ఇద్దరూ చెన్నైలో ఉంటారు. అజయ్ అమెరికాలో ఎమ్మెస్ చేశాక, అక్కడే ఉద్యోగం వచ్చింది. అంజలిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. సౌమ్యకి ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ డెలివరీకి తీసుకొచ్చాం.
పెళ్లయిన రెండేళ్లకి అంజలి కన్సీవ్ అయింది. ఇద్దరం అమెరికా వెళ్లి అంజలికి డెలివరీ అయ్యాక వచ్చాం.
ఇరవైఏళ్ళ క్రితం కొన్న స్థలానికి రేటు పెరగటంతో.. సగం అమ్మగా వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నాం. అప్పటికి ఇద్దరం పదవీ విరమణ దశకి చేరుకున్నాం. వయసుతోపాటు వచ్చే అనారోగ్యం షుగరు, బీ.పీ లను ఆయనకిచ్చి, నన్ను మాత్రం బీ.పీ. తోసరిపెట్టుకోమంది.
క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవాడు విశ్వనాథ్.
ఆరోజు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లి వస్తూనే…
***
“పూర్ణా! అన్నపూర్ణా!” అంటూ.. లోపలికి వచ్చాడు విశ్వనాథ్.
“ఆఁ.. వస్తున్నా” అని కిచెన్లో నుంచి వచ్చేసరికి హాల్లో కూర్చొని సెల్‌ఫోన్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్ లకు రిప్లై ఇస్తున్నాడు.
“ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫోన్‌కి అతుక్కుపొయ్యేంత ఇంపార్టెంట్ మేటర్ ఏంటట” అని ఫ్యాన్ వేసింది అన్నపూర్ణ.
“మేటర్ లేదు ములక్కాయ లేదు. ఆకలి దంచేస్తోంది. టిఫిన్.. టిఫిన్” అన్నాడు.
“చేస్తున్నాను.. ఈ లోపల కాఫీ తాగండి”
ఒక్క గుక్క తాగి.. “రోజూ ఈ చేదు కాఫీ తాగి తాగీ.. నాలుక తీపి సంగతి మర్చిపోయి, మొద్దుబారింది. నాకొద్దు” అన్నాడు చిన్నపిల్లాడిలా.
“శరీరంలోనే షుగర్ ఫ్యాక్టరీ పెట్టారుగా! మీకింకా షుగరెందుకు మహాశయా?”
“ఎంతున్నా నీ కంటే ఫిట్ గానే ఉంటాను. యోగా చేసి, వాకింగ్ కూడా చేసేస్తున్నా.. చూడు నా బాడీ ఎంత స్ట్రాంగో”
“ఇది రోజూ ఉండే తమరి ఫిట్నెస్ పురాణమే గానీ, టాబ్లెట్ వేసుకున్నారా?”
“తినక ముందు వేసుకున్నా. అవునూ.. ఇలా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకున్నావా?, వాకింగ్‌కి వెళ్ళావా? టిఫిన్ తిన్నావా? అని గుర్తు చేస్తావెందుకు? నేనేమైనా చిన్నపిల్లాడినా! .. నీకంటే నాలుగేళ్లు పెద్దవాణ్ణి”
“చిన్నపిల్లలకైతే నయానో, భయాన్నో చెప్పొచ్చు. కానీ తమరు మతిమరుపు మహారాజు కదా! అందుకే ఈ తాపత్రయం.”
“టీచరమ్మా! నాలో ఏదో ఒక లోపం ఎత్తిచూపకపోతే తమరికి పొద్దు పోదు కదా!” అన్నాడు.
అంతలో ఫోన్ మోగింది. చూసి అజయ్ చేస్తున్నాడని..
“హలో అజయ్! ఎలా ఉన్నావురా? అంజలి, మనవడు బాగున్నారా?”
“అందరం బాగున్నాం నాన్నా? అమ్మ ఎలా ఉంది?”
“బావుంది? కొరియర్ అందిందా? “
“అందింది. అది చెప్పటానికే ఫోన్ చేశాను. అయినా ఇప్పుడు దానికి తొందరేం వచ్చింది?” అన్నాడు.
విశ్వనాథ్ ఎదో చెప్పబోతుంటే, భర్త చేతి నుండి ఫోన్ తీసుకుని..
“అజయ్! ఎలా ఉన్నావురా? మీరు వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఎప్పుడు వస్తున్నారు?”
“అమ్మా! మళ్లీ మొదలు పెట్టావా? మీరిద్దరు రిటైరయ్యారు.. ఆరు నెలపాటు అమెరికా రమ్మని ఎన్నిసార్లు చెప్పాను. ఎప్పుడు ఫోన్ చేసినా మమ్మల్నే రమ్మంటావు! మీరు వస్తే ఒక చేంజ్ ఉంటుంది కదా!”
“అక్కలా నువ్వూ ఇండియాలోనే ఉంటే మేమే వచ్చి మనవణ్ణి చూసేవాళ్ళం”
“ఇది నువ్వు ఎప్పుడూ చెప్పే మాటే”
“మీ నాన్న కుంభమేళాకు వెళ్లాలని తెగ సంబరపడిపోతున్నాడు. వెళ్లొచ్చాక వస్తాంలే..!” అని, భర్తకి ఫోన్ ఇచ్చింది.
“అజయ్.. అక్కకి కూడా కొరియర్ చేశాను. అక్కతో మాట్లాడు.”
“అలాగే నాన్నా!” అని ఫోన్ ఆఫ్ చేసాడు అజయ్.
“టిఫిన్ పెట్టేదా?” అంది అన్నపూర్ణ కిచెన్ లోకి వెళుతూ.
“అది కాదు పూర్ణా! పిల్లలు ఫోన్ చేస్తే చాలు.. ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారని వెంబడిస్తే, ఫోన్ చేయటం మానేస్తాడేమో”
“అవును మరి.. దేశం కానీ దేశంలో ఎలా ఉన్నారోనన్న బాధ తల్లికుంటుంది కానీ మీకెందుకుంటుంది? అవునూ.. కొరియర్లో ఏం పంపారేంటి?”
“వీలునామా”
“ఇప్పుడే వీలునామా ఎందుకండీ?!? మనం రిటైరై సంవత్సరం కూడా కాలేదు.”
“పూర్ణా! కొడుకైనా, కూతురైనా వాళ్ళ పేర ఓ ప్రాపర్టీ ఉందంటే ఓ భరోసాగా ఉంటుంది. హెరిడిటరీ ఆస్తి తమకూ ఉందన్న ధీమా ఉంటుంది. మన తదనంతరం వాళ్ళిద్దరికీ సమానంగా రాశాను. ఇద్దరికీ అదే పంపాను. అంతేకాదు నీకూ ఓ సర్‌ప్రైజ్ ఉంది “
“ఏంటా సర్‌ప్రైజు!?.. కొంపతీసి నా పేరున కూడా ఏదైనా ప్రాపర్టీ రాశారా?”
“మనకు వీలునామాలతో పనేముందోయ్.. నువ్వు నాకు ప్రాపర్టీ,.. నేను నీకు ప్రాపర్టీ. ఈ ఇల్లు తప్ప.. మనకింకేం లేదని నీకూ తెలుసు.”
“అది సరే.. సర్‌ప్రైజ్ ఏంటో తొందరగా చెప్పండి.”
“మహా కుంభమేళా టూర్‌కి మనం వెళ్తున్నాం! హోటల్ రూములు, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి.”
“ఫస్ట్ క్లాస్ రైల్వే పాస్ ఉండగా.. ఫ్లైట్ ఎందుకండీ! “
“ఇన్నేళ్లూ రైల్లోనే కదా తిరిగింది. ఇప్పుడైనా అనుభవిద్దాం. కుంభమేళాకు వెళ్లొచ్చాక చార్ ధామ్ యాత్ర., ఆ తర్వాత మానసరోవరం యాత్రలకి ఏర్పాటు చేశాను.. రిటైర్మెంట్ లైఫ్ జాలీ.. జాలీగా ఎంజాయ్ చేద్దాం” అన్నాడు.
“అన్ని యాత్రలు ఎలా కుదురుతాయి. ఓ పక్క అమెరికా రమ్మని అజయ్ గొడవ పెడుతుంటేనూ”
“అంజలి డెలివరీకి అమెరికా వెళ్ళొచ్చాం కదా! ప్రస్తుతం మన ప్రోగ్రాం ప్రకారం అన్నీ చూసాకే అమెరికాకి ప్లాన్ చేద్దాం. ఉద్యోగాల్లో ఉన్నప్పుడు నీకు లీవ్ దొరికితే నాకు, నాకు లీవ్ దొరికితే నీకు దొరికేది కాదు. ఇప్పుడా బాధ లేదు కదా!” అన్నాడు అన్నపూర్ణ మొహం లోకి చూసి నవ్వుతూ.
డైనింగ్ టేబుల్ మీద అన్నపూర్ణ పెట్టిన హాట్ ప్యాక్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న మూడు ఇడ్లీ చూసి.. “పిసినారి” అన్నాడు గట్టిగా.
***
“మురుసటి నెలలో ఇద్దరం మహా కుంభమేళాకి వెళ్ళొచ్చాం. నాలుగు రోజుల్లో ఆయనని అనారోగ్యం ఆసుపత్రి వరకూ తీసుకెళ్లింది. రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్న తర్వాత.. మళ్లీ ఆయన ఇంటికి తిరిగి రాకుండా,.. మూడో రోజు అర్ధరాత్రి నాకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు విశ్వనాథ్.”
***
సరిగ్గా అప్పుడు రాఘవ వచ్చి.. “వసంతా! సి బ్లాక్‌లో ఉంటున్న చక్రపాణికి చెస్ట్ పెయిన్ వచ్చిందని కూలబడ్డాడు. వెంటనే కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్ళాం. మన కమ్యూనిటీ లోనే ఉంటున్న డాక్టర్ చలపతి రావు చూసి.. పరీక్షలన్నీ చేసి.. గ్యాస్ట్రిక్ పెయిన్ అని ట్రీట్ చేశాడు. నౌ హి ఈజ్ నార్మల్.” అని చెప్పాడు.
“ఇక్కడ క్లినిక్ కూడా ఉందా?” అడిగింది అన్నపూర్ణ.
“24 / 7 ఇక్కడ వైద్య సదుపాయం ఉంది. క్రిటికల్ కేసు అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి అంబులెన్స్ వసతి కూడా ఉంది” చెప్పాడు.
“అవునూ! అన్నమయ్య కీర్తనలు పాడే చక్రపాణి గారేనా?” అంది వసంత.
“అవును ఆయనే. బుక్స్, సెల్ ఫోను కారులో మర్చిపోయాను. వెళ్లి తీసుకుని వస్తాను” అని కిందకి వెళ్ళాడు రాఘవ.
***
అన్నపూర్ణ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
కాలం ఎవరికోసం ఆగదన్నట్టు కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. ఆ రోజు రాత్రి అన్నపూర్ణ పిల్లల దగ్గర వీలునామా సంగతి ప్రస్తావించింది. వాళ్లు ఆ సంగతి మాట్లాడుకుండా..
“అమ్మా! ఇక్కడ ఒక్కదానివే ఒంటరిగా ఏముంటావు. మాతో వచ్చి ఉంటే పిల్లలతో కాలక్షేపం అవుతుంది” అంది సౌమ్య
“అవునమ్మా! ముందు నాతో అమెరికా వస్తే, ఆరు నెలల తర్వాత అక్కయ్య దగ్గరికి వద్దువు గాని”
“మరి వీలునామా సంగతి ఏం చేద్దాం”
“మా ఇద్దరిదీ ఒకటే మాటమ్మా! ఈ ఇల్లు మీ కష్టార్జితం. మా ఇద్దరికీ మంచి చదువులు చెప్పించారు. అందుకు మీరిద్దరూ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఇల్లు కట్టడానికి మీకు ఎన్నేళ్లు పట్టింది కూడా తెలుసు. నాన్న తదనంతరమే కాదు నీ తదనంతరం కూడా ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇహ ఈ సంగతి మర్చిపోదాం” అంది సౌమ్య.
“చెప్పమ్మా! మాతో పాటు అమెరికా వస్తావా?” అన్నాడు అజయ్.
“ప్రస్తుతం నేనెక్కడికి రాలేను. కొన్నాళ్లు ఈ ఇంట్లోనే మీ నాన్న జ్ఞాపకాలతో గడపాలనుంది. ఎంతో ఇష్టపడి ఇద్దరం కట్టుకున్న ఇల్లిది. ప్రస్తుతం నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీకు వీలున్నప్పుడు రండి! అయినా ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్‌లో చూస్తూ మాట్లాడుకోవచ్చు” అంది అన్నపూర్ణ.
నాలుగు రోజుల తర్వాత జాగ్రత్తలు చెప్పి, పిల్లలిద్దరూ వెళ్లిపోయారు.
పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళ బిజీ జీవితాల్లో.. ఇమడలేక, జీవన విధానాన్ని అన్వయించుకోలేక.. వ్యాపకాలు లేకుండా జ్ఞాపకాలతో ఎన్నాళ్ళని జీవితం గడపగలను?.. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి.. ఎలా.. ఎలా..!” అని ఆలోచిస్తున్నాను.
***
రెండు నెలల తర్వాత..
ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. హైస్కూల్లో చదువుకున్నప్పటి రాజేశ్వరి చిన్న కూతురు పెళ్లి అదే ఊళ్లో చేస్తున్నట్టు.. తప్పక రావాలని మరీ మరీ చెప్పింది. చదువుకున్న ఆ ఊరికి అర్థ శతాబ్దం తర్వాత వెళ్ళాలనిపించింది.
పెళ్లికి వచ్చిన మిత్రులందరం వయసు మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ, మళ్ళీ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటుంటే జ్ఞాపకాలకు జీవం వచ్చినట్టనిపించింది.
ముఖ్యంగా రాఘవ అందరినీ కలుపుకుంటూ.. కబుర్లు చెప్తుంటే.. మనసుకు ఎంతో స్వాంతనంగా అనిపించింది.
నేను హైదరాబాదులోనే ఉంటున్నానని తెలిసి, నన్నూ తనతో కారులో రమ్మన్నాడు రాఘవ. మరో క్లాస్మెట్ ఇందుమతి కూడా మాతో కారులో బయలుదేరింది. మాటల మధ్య కుటుంబం, పిల్లల సంగతులు ప్రస్తావనకు వచ్చాయి.
రాఘవ తను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యానని, కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని, హైదరాబాదులో మంచి కంపెనీల్లో, మంచి పొజిషన్లో ఉండే వాళ్లని చెప్పాడు. హైదరాబాదులోనే అందరం కలిసి ఉండటానికి కొడుకు గేటెడ్ కమ్యూనిటీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. పట్టుమని సంవత్సరం అయినా ఉండకముందే వాళ్ళిద్దరికీ అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి. మా భార్యాభర్తలిద్దరినీ ఆ ఇంట్లో ఉండమన్నారు. ఇన్నేళ్లు స్వేచ్ఛగా ఇటు కుటుంబ జీవితంలోనూ, అటు ఉద్యోగ జీవితంలోనసమవయస్కులతో స్వేచ్ఛగా గడిపి ఇప్పుడు సడన్‌గా పోష్ ఏరియాలో, ఖరీదైన పంజరంలో బంధించినట్టు ఉండటం కష్టం అనిపించింది. తగరం లాంటిది నగర జీవితం. ముట్టుకుంటే శబ్దం. ముట్టకుంటే నిశ్శబ్దంగా పడుంటుంది. అందుకే కొడుకు కోడల్ని ఒప్పించి.. ఆ ఫ్లాట్ ని అద్దెకిచ్చాం. మానవ సంబంధాల మధ్య బతికిన మేము విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుని.. సీనియర్ సిటిజన్స్ లివింగ్ రెసిడెన్సీలో ఫ్లాట్ కొనుక్కుని సంవత్సరం క్రితమే అక్కడికొచ్చి ఉంటున్నామని చెప్పాడు. ఓల్డ్ ఏజ్ రెసిడెన్సీలో జీవన విధానం గురించ చెప్పాడు. నాకు జీవితంలో మార్పు కావాలన్న కోరిక బలంగా కలిగిందప్పుడే.
***
ఆ మర్నాడు పిల్లలిద్దరికీ ఫోన్ చేసి రాఘవ చెప్పిన సీనియర్ సిటిజన్స్ లివింగ్ రెసిడెన్సీ గురించి చెప్పి నా అభిప్రాయం చెప్పాను. వాళ్ళిద్దరూ అవునని, కాదని చెప్పలేదు. ‘వాళ్ళిద్దరికీ ఇష్టం లేదేమో!’ అనుకున్నాను.
ఇంట్లోనే ఉంటున్నాను. అనుక్షణం విశ్వనాధ్ జ్ఞాపకాలే. వాటి నుండి తప్పించుకోవడానికి.. బిజీగా గడపాలనుకుని వ్యాపకాల వేటలో భాగంగా.. ఇంటికి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో మళ్లీ టీచరుగా చేరాను. అయినా ఏదో అసంతృప్తి. మళ్లీ స్కూలు, పిల్లలతో అదే జీవితం. నిరాసక్తత, నిస్తేజాల మధ్య కాలం భారంగా గడుపుతున్నట్టు అనిపించేది. నాలో నిద్రిస్తున్న అసలైన వ్యాపకాలు వెలుగు చూడటం లేదనిపించింది.
***
సంవత్సరం గిర్రున తిరిగి వచ్చింది.
విశ్వనాధ్ సంవత్సరీకాలకి అజయ్, సౌమ్య కుటుంబాలతో వచ్చారు. కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఓ రోజు ఉదయాన్నే.. పిల్లలిద్దరూ నన్ను రాఘవ చెప్పిన సీనియర్ సిటిజన్స్ లివింగ్ రెసిడెన్సీకి తీసుకొచ్చారు. ప్రశాంత వాతావరణంలో ప్రవేశించినట్టు అనిపించింది. మేము వెళ్ళగానే రాఘవ కిందికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని, వాళ్ళింటికి తీసుకెళ్లాడు.
“థాంక్స్ అంకుల్” అంది సౌమ్య.
“ఇందులో ఏముందమ్మా! రండి ఫ్లాట్ చూసొద్దాం” అన్నాడు రాఘవ.
బి బ్లాక్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న కార్నర్ ఫ్లాట్‌కి తీసుకొచ్చాడు. త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మంచి గాలి, వెలుతురుతో బాగుందనిపించింది.
“అన్నపూర్ణా! నచ్చిందా!” అడిగాడు రాఘవ.
“నాకు నచ్చడంతో పనేముంది?”
“ఎందుకంటే ఇందులో ఉండబోయేది నువ్వే కాబట్టి.” అంది సౌమ్య తల్లి భుజాలు పట్టుకొని.
ఆశ్చర్యంగా పిల్లలిద్దరి వైపు చూస్తుంటే.. అన్నపూర్ణ కళ్ళలో తడి.
“ఆరు నెలల క్రితం అజయ్ గూగుల్ లో సెర్చ్ చేసి ఈ రెసిడెన్సి గురించి తెలుసుకుని, నన్ను కాంటాక్ట్ చేసి ఇక్కడ వివరాలు అడిగాడు. తర్వాత సౌమ్య మాట్లాడింది. పది రోజుల్లో ఈ ఫ్లాట్ నీ కోసం తీసుకున్నారిద్దరూ” చెప్పాడు రాఘవ.
ఆశ్చర్యంగా పిల్లలిద్దరు వైపు చూసింది అన్నపూర్ణ.
“అవునమ్మా! నువ్వు ఈ రెసిడెన్సీ గురించి చెప్పినప్పుడు, రాఘవ గారితో అక్క, నేను మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. నగర వాతావరణానికి దూరంగా, ప్రశాంతంగా సమవయస్కుల మధ్య గడపడం కంటే సంతోషం ఏముంటుందమ్మా? ఒంటరితనం లేకుండా నచ్చిన వ్యాపకాలతో నువ్వు ఉండటమే మాకు కావాల్సింది “ అన్నాడు అజయ్.
“మరి మారేడ్‌పల్లిలో ఉన్న ఇంటిని ఏం చేస్తారు? అమ్మేస్తారా?” అడిగాడు రాఘవ.
“లేదంకుంల్!.. ఇది మా నాన్న రాసిన వీలునామా. ఒకసారి చూడండి.”. అని వీలునామా కాపీ ఇచ్చాడు అజయ్.
ప్రియమైన సౌమ్య, అజయ్!
నేను లోకంలోకి ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానే వెళ్తాను. ఈ ఇల్లు మా ఇద్దరి కష్టార్జితం. ఇది కేవలం ఆస్తి కాదు. మా ఇద్దరి శ్రమ, ప్రేమలకు ప్రతిరూపం.
తదనంతరం అనే దానిపై నాకు నమ్మకం లేదు. ఈ ఇంటి మీద మీ అమ్మతోపాటు మీకు సంపూర్ణ హక్కులున్నాయి. కేవలం ఇది ఇటుకలు, సిమెంటు కాదు.
ఇది జ్ఞాపకాల గోపురం. అనివార్యం అయితే తప్ప దీనిని అమ్మొద్దు. అమ్మాల్సి వస్తే మీ అమ్మకు సరైన ఆధారం, శాశ్వత నివాసం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయండి. సంపాదన కంటే విలువైనవి మనుషుల మధ్య మానవ సంబంధాలు. మాకు చేతనైనంతవరకు మిమ్మల్ని అలాగే పెంచాం. మీరు పిల్లలకు అవి నేర్పుతారని కోరుకుంటున్నాను.
ఇట్లు, మీ నాన్న
విశ్వనాథ్.
రాఘవ చదివి మౌనంగా తిరిగిచ్చాడు.
“మా అమ్మానాన్నల జ్ఞాపకంగా ఆ ఇల్లు ఎప్పుడూ మా ఇద్దరికీ కావాలి. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్తే మా అమ్మ నాన్న మాతో ఉన్నట్టే ఉంటుంది.” అన్నారిద్దరూ.
ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే..” చెప్పటం ముగించింది అన్నపూర్ణ.
“చాలా సంతోషంగా వుంది. పిల్లల్ని మనం అర్థం చేసుకుని బాధ్యతగా వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యడానికి కష్టపడతాం. అది శ్రమ అని పించదు. వాళ్లు ప్రయోజకులై ఎంత ఎత్తుల్లో ఉన్నా, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని.. చూడటానికి వంతులు వేసుకుంటున్న ఈ రోజుల్లో.. మీ పిల్లల నిర్ణయం హర్షనీయం. పిల్లలు తల్లిదండ్రుల అభిప్రాయాల్ని గౌరవించటం ఎంతో సంతోషాన్నిస్తోంది.” అంది వసంత.
“మీ అందరి మధ్య స్వేచ్చగా, స్వఇచ్ఛలతో మనసుకు నచ్చినట్టుగా ఉంటున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, జీవితం సరైన బాటలో నడుస్తున్నట్టన్పిస్తోంది. బరువు, బాధ్యతలు దించుకున్నాక అవి కొత్త జీవితాలుగా మారతాయి. వాళ్ళని చూసి ఆనందించే అదృష్టం ఒక్క వృద్ధాప్యానిదే. వృద్ధాప్యం ఓ వైభవం అనుకుని, దానిని మన అనుభవంతో అనుకూలంగా మలుచుకుని, సానుకూల దృక్పథంతో జీవితం సాగిస్తే.. అనుక్షణం వర్తమానం ప్రశాంతంగా ఉంటుంది.
వృద్ధాప్యం అనేది జీవితంలో ఓ కొత్త అధ్యాయం. సంతోషం, ప్రేమలను అనుభవాలతో రంగరించి పదుగురితో పంచుకున్నప్పుడే ‘వృద్ధాప్యం వరం’ అవుతుంది” అంది అన్నపూర్ణ.
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.
