[ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘వృత్తి విలువ’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
వెలుగును వెంట తెస్తుంది.
మందహాస పరిమళాలతో,
పలుకు వెన్నెల పంచుతుంది.
కంటి చూపుల క్రమ శిక్షణతో
మంచి మార్గం చూపుతుంది.
సహజ గుణం ప్రేమతో
తాహతులడుగని విద్యకు
ప్రథమ అక్షరం దిద్దుతుంది.
ప్రశ్నకు జవాబుల సహచర్యంతో
ఆలోచన కలిగిస్తుంది.
ఓర్పు కలిమి స్నేహం తో
తెలివి నేర్పుల పదును పెడుతుంది.
కొమ్ములు తిరిగిన వర్గ బుద్దికి,
సరళ నిర్దేశం చేస్తుంది.
పిరికి తనం జాడ్యానికి,
బ్రతుకు ధైర్య, తరుణాల
చదువులు చెబుతుంది.
ఆత్మ శక్తి, సాహసాల
చరిత్ర పుటలను తెరచి
ముందడుగు వేయమంటుంది.
కాలి నడకల వేకువలో.
కారు దిగిన శిష్యు డొకడు,
గొప్ప పదవులు చేరడానికి,
అడుగు జాడలు కారణమంటూ,
జోడించిన వందనానికి
ముచ్చట ఆశీస్సులను మనసారగ
అందిస్తుంది.
దేశ విదేశాల
విశాల పర్యంత భూమిలో
జన్మ మెత్తిన మట్టి ఋణానికి
గట్టి విద్యల విత్తు నాటింది.
మనిషి గౌరవ సంపాదనకు
ఉపాధ్యాయిని వృత్తి విలువల
ఉన్నతి పెరిగింది.
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
