Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వ్యామోహం-12

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కృష్ణమాచారి ఇంట్లో భోజనాలయ్యాకా, ఇక బయల్దేరుతానని అంటాడు డాక్టర్సాబ్. రేపటికల్లా అతగార్ని తీసుకురావాలి, జోడెడ్లపాలానికి త్వరగా వెళ్ళాలి, లేకపోతే తానేమైపోయానోనని ఊరివాళ్ళు ఆందోళన పడతారని అంటాడు. కృష్ణమాచారి సరేనంటాడు. తన ఆసుపత్రి చూపిస్తాడు. తను మందులు తెప్పించుకునే పద్ధతి, తయారుచేసుకునే విధానం వివరిస్తాడు.  మీరిద్దరూ కలిసి వైద్యం చదువుకున్నారు కదా, ఒకళ్ళు ఆయుర్వేదమెట్లా ఇంకొకళ్ళు హోమియోపతి ఎలా అని అడుగుతుంది అన్నపూర్ణ. డాక్టర్సాబ్, కృష్ణమాచారి ఆమె సందేహాన్ని తీరుస్తారు. తాము వైద్యులుగా ఎదిగిన పద్ధతిని తెలిపి, తమ గురువులను తలచుకుంటారు. తరువాత టీ తాగి, డాక్టర్సాబ్ బయల్దేరుతాడు. మందులకుంటలో బస్సు దిగి అత్తవారింటికి చేరుతాడు. అత్తగారు మంగమ్మ, బావమరిది సత్యమూర్తి ఆహ్వానిస్తారు. డాక్టర్సాబ్ స్నానం చేసి, పూజ చేసుకుని వచ్చే లోపు అత్తగారు అన్నం వండుతుంది. ఈ వేసవిలో మీ ప్రణాళికలు ఏంటి అని అడిగితే, సత్యమూర్తి మంగమ్మ గారి ప్రయాణాల గురించి చెప్తాడు. బావబావమరుదులు ఇద్దరూ తింటుంటే, ఆవిడ జంగారెడ్డి గూడెం వెళ్ళాల్సిన అవసరం గురించి చెప్తారు. ఆవిడ భోంచేస్తూ కూతురు మనవల గురించి అడిగితే, అందరూ క్షేమమే అని చెప్పి, భార్య మళ్ళీ గర్భం దాల్చిన సంగతి చెప్తాడు డాక్టర్సాబ్. తాను జంగారెడ్డి గూడెం వెళ్ళాలనుకోవడానికి మరొక కారణం కూడా ఉందని ఆవిడ చెబుతుంది. నిద్రకి ఉపక్రమించే ముందు – డాక్టరమ్మ మంచినీళ్ళ బిందెను వేసుకుపడ్డ దగ్గర నుండి వరంగల్లులో నివాసం నిశ్చయమయేంత వరకు వివరంగా చెప్పుకొస్తాడు డాక్టర్సాబ్. అమ్మ ప్రయాణాలకి ఇంకా సమయం ఉందనీ, తానెలాగో సర్దుకుంటాననీ, రేపు మధ్యాహ్నం నుండి అమ్మ తీసుకువెళ్ళమని అంటాడు సత్యమూర్తి. ఆవిడ అంగీకరిస్తుంది. ఇక చదవండి.]

దయం ఎనిమిదింటికల్లా బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సత్యమూర్తి. అప్పటికింకా డాక్టరు గారి స్నానం అవలేదు.

“బావా! నేను బడికి నడిచే వెళుతున్నాను. ఇంట్లో నీకు కాలక్షేపమవడం కష్టం. నా సైకిలు వేసుకొని బడికి వస్తే ఎవరినన్నా ఇచ్చి పంపుతాను. బడి పక్కన సెరికల్చర్ సెంటరుంది. చూడ్డానికి బాగుంటుంది. లేదా నువ్వు నేరుగా వెళ్ళినా పరవాలేదు. రామ్మూర్తి అని సెంటర్ ఇంఛార్జి వుంటాడు. మల్బరీ పళ్ళు ఇస్తాడు. మొహమాటపడకుండా తీసుకో. రామూ ఆ పళ్ళని ఇష్టంగా తింటాడు. అక్కయ్యకు కూడా మంచిదే. రక్తం పడుతుంది. మేన్ రోడ్డు మీద ములుగు వేపుకి వస్తుంటే కుడి చేతివైపు మొదట సెరికల్చర్ సెంటరుంటుంది. దాన్నానుకుని పంటకాలువ, ఆ పక్కనే బస్టాండు. బస్టాండు దాటగానే మా బడి” వివరంగా చెప్పాడు సత్యమూర్తి.

“సరేలే చూస్తాను” అన్నాడు డాక్టరు గారు.

స్నానం, పూజాదికాలయ్యేప్పటికి పది దాటింది. మంగమ్మగారు మడిగట్టుకుని వంటపనిలో నిమగ్నమయింది. హెన్రీసాండజ్ చేతిగడియారం చూసుకున్నాడు డాక్టరు గారు. పదింబావు. ఎంత లేదన్నా సత్యమూర్తి రావడానికి మూడు గంటల సమయముంది. కాలక్షేపం కష్టమే అనుకొని అత్తగారికి చెప్పి సైకిలు బయటకు తీశాడు డాక్టరు గారు.

ముందుగా పట్టుపురుగుల పెంపక కేంద్రం కనిపించింది. సైకిల్ను లోపలికి తిప్పాడు డాక్టరు గారు. గేటు వేసివుంది. సైకిలు మీద వచ్చే వ్యక్తిని చూచి పనిచేసుకుంటున్న మనిషి ఒకరు పరుగెత్తుకొంటూ వచ్చి గేటు తీశాడు.

“రామ్మూర్తి గారున్నారా!” అడిగాడు.

“ఉన్నరయ్యా లోపటికి పొండ్రి” అంటూ దారి చూపించాడతడు.

ప్రభుత్వోద్యాన వనాలలో వలె విశాలమైన దారి. దారికి రెండు పక్కలా సున్నం వేసిన ఇటుక బోర్డరు వున్నది. సమాన దూరంలో దాదాపు సమానమైన ఎత్తులో పెంచబడిన మల్బరీ చెట్లు నయనానందకరంగా వున్నాయి. చెట్లన్నిటికీ పాదులు తీసివున్నాయి. అక్కడక్కడ కుండలు వున్నాయి. బహుశః నీళ్ళు మోసుకొని వచ్చి పోయాలేమో. స్థలం మధ్యలో యాస్బెస్టాస్ రేకులతో వేయబడిన షెడ్డు వున్నది. ‘బహుశః ఇదే ఆఫీసేమో’ అనుకుంటూ సైకిలు స్టాండు వేసి మెట్లెక్క బోతున్నాడు డాక్టరు గారు.

“రండి డాక్టర్సాబ్ రండి” అంటూ ఎదురొచ్చి నవ్వుతూ పలుకరించాడు ఎర్రగా బక్క పలుచగా వున్న వ్యక్తి.

“మీరు.. రామ్మూర్తి” సందేహిస్తూ అడిగాడు డాక్టరు గారు.

“అవునండి. పెద్ద సారు చెప్పారు మీరు వస్తారని, సారు సైకిలు చూసి గుర్తుపట్టిన” చెప్పాడు రామ్మూర్తి.

ఆఫీసు గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు రామ్మూర్తి. ఒకరినొకరు పూర్తిగా పరిచయం చేసుకోవడమయే సరికి ప్యూన్ రెండు గ్లాసుల్లో మంచినీళ్ళను, మరో రెండు గ్లాసుల్లో టీని తెచ్చి పెట్టాడు ఆఫీసు బల్లమీద.

“ఇవన్నీ ఎందుకండీ” మొహమాటపడ్డారు డాక్టరు గారు.

“పెద్దసారు బావగారంటే మీరు మాకు గౌరవనీయమైన అతిథి” నవ్వుతూ చెప్పాడు రామ్మూర్తి.

తేనీటి సేవనమయ్యాక డాక్టరు గారికి సిల్కుఫారం చూపించడానికి బయలుదేరాడు రామ్మూర్తి.

“పట్టు పురుగుల గుడ్లు మాకు బెంగుళూరు నుండి వస్తాయి. వాటిని తగిన ఉష్ణోగ్రతలో గుడ్డల్లో చుట్టి పెడతాం. అవి పురుగులుగా మారతాయి. ఈ పురుగులు కేవలం మల్బరీ ఆకులను మాత్రమే తింటాయి. ఆకు బరువును ఈ పురుగులు మోయలేవు. అందుకని ఆకును సన్నగా తరిగి జల్లెడలవంటి ఈ మేదరి తట్టల్లో వేస్తాము. చూశారా మీకు పురుగులు కనపట్టం లేదు. ఈ తట్టను జాగ్రత్తగా చూడండి. ఆకులూ పురుగులూ కలగలసి వుంటాయి.”

“అవునండీ నిజమే. పురుగులున్నట్లు తెలియడం లేదు”. ఆశ్చర్యపోతూ అన్నాడు డాక్టరు గారు.

“రోజు రోజుకి పురుగు పెద్దదవుతూ వుంటుంది. ఈ తట్ట చూడండి. ఇందులో ఆకుముక్కలు పెద్దగా వున్నాయి. పురుగులు కూడ కనబడుతున్నాయి. పదిహేనో రోజుకొచ్చే సరికల్లా పూర్తి సైజు మల్బరీ ఆకును వేసినా అవి తిని వేయగలుగుతాయి. ఇలా పాతిక రోజుల పాటు ఈ పురుగు ఆకును తింటూ పెరుగుతుంది.”

“ఆ తరువాత?” అడిగాడు డాక్టరు గారు.

“ఇరవై ఆరు నుండి ముప్ఫై రోజుల మధ్యలో వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి పురుగులు గూళ్ళు కట్టుకోవడం మొదలు పెడతాయి.”

“అంటే గొంగళి పురుగులాగ తన చుట్టు తానే గూడు కట్టుకుంటుందన్నమాట.” అర్థం చేసుకుందుకు యత్నిస్తూ ప్రశ్నించాడు డాక్టరు గారు.

“అవును బాగా అర్థం చేసుకున్నారు. గొంగళిపురుగు నేలనో, గోడనో, చెట్టునో ఆసరా చేసుకొని గూడు అల్లుకొంటుంది. మేమిక్కడ గడులు గడులుగా వుండే, ఇదిగో చూడండి, ఈ మేదరి తట్టల్లో ఒక్కొక్క గడికి ఒక్కొక్క పురుగు చొప్పున వేస్తాం. పురుగులు తమ గూడును ఈ గడులలో కట్టుకుంటాయి. ఇంకో విశేషం కూడా వుంది. గొంగళి పురుగు గూడు ఆసరాగా చేసుకొన్న చోటు ఉండి గొడుగువలె మూడు వేపులా మాత్రమే ఎదుగుతుంది. పట్టుపురుగలా కాదు. దాని గూడు దేనికీ అంటుకోదు. మెరుస్తున్న కాయ వలె వుంటుంది” అంటూ పట్టుపరుగులున్న గూళ్ళను చేతిలోకి తీసుకొని రెండు కాయలను డాక్టరు గారి చేతిలో పెట్టాడు.

“అంటే ఇప్పుడీ కాయల్లో మీరిందాక చూపించిన పురుగులున్నాయంటారు.”

“అవును, సాలె పురుగు తన కడుపులోంచి వెలువడే దారంతో గూడు కట్టుకొన్నట్లుగా ఈ పురుగు తన నోట్లోంచి వెలువడే దారంతో ఈ గూడు నిర్మించుకొంటుంది. పట్టుపురుగు శ్రమించి తన నివాసంగా ఏర్పరచుకొనేందుకు సృజించిన దారాన్ని మనిషి తస్కరించి పట్టువస్త్రాలనుగా నేసికొని ధరిస్తాడు”.

“పట్టుదారం ఈ కాయలోంచే వస్తుందంటారా!”

“పట్టుదారం కారణంగానే ఈ కాయమెరుస్తున్నది. పది పన్నెండు రోజులకు పట్టు పూర్తి స్థాయిలో తయారవుతుంది. అంటే పట్టు పురుగు తన గూడు నిర్మాణాన్ని అప్పటికి పూర్తి చేస్తుందన్నమాట. ఇదిగో ఇటు చూడండి. ఈ ఇనుప డ్రమ్ముల్లో లేదా గంగాళాల్లో పట్టుకాయలను ఉడకబెట్టి ఆ తరువాత తడిలేకుండా ఆరబెట్టి హైదరాబాదుకి పంపిస్తాం. వాళ్ళు కాయల నుండి దారాలను తీసే యూనిట్లకు ఈ కాయలను పంపిస్తారు. వారు తీసిన దారంతోనే పట్టువస్త్రాలు తయారవుతాయి” వివరించాడు రామ్మూర్తి.

“కాయలనుడక పెట్టడం ఎందుకు. అలానే దారం తీయవచ్చుకదా!”

“కాయ తయారైన పన్నెండవ రోజున పట్టు పురుగు రెక్కలు సంతరించుకొని కాయను పగులగొట్టుకొని బయటకు వస్తుంది. కాయ పగిలిపోతే దారం ఎక్కడికక్కడికి తెగిపోతుంది. కాయను ఉడకబెట్టినప్పుడు లోపలి పురుగు చనిపోతుంది. ఒక్కొక్క కాయ నుండి యాభై అరవై గజాల దారం వస్తుంది.”

“శివా శివా! ఎన్నివేల పట్టు పురుగులు చనిపోతే ఒక పట్టుచీర వస్తుంది రామ్మూర్తి గారు” డాక్టరు గారు ఒక్కసారిగా లెంపలు వేసుకొని అపరాధభంగిమలో చెవులు మూసుకున్నారు.

పెద్దగా నవ్వాడు రామ్మూర్తి. “ఎన్నివేలకోట్ల జీవరాశులు నశిస్తే మానవుని మనుగడ ఈ భూమ్మిద సాగుతున్నదో మీకు తెలియని విషయమా డాక్టర్సాబ్.”

“తెలుసు. కాని ఈ హింస మన ప్రాణం నిలుపుకొందుకు కాదు కదా! అందుకే బాధ అనిపించింది.”

ఇరువురూ మళ్ళీ ఆఫీసు గదిలోకి వచ్చారు. పట్టు పరిశ్రమను గురించి ఇటీవలే ప్రభుత్వం వారు ముద్రించిన చిన్న పుస్తకాన్ని డాక్టరు గారికి బహూకరించాడు రామ్మూర్తి. ధన్యవాదాలు చెబుతూ అడిగారు డాక్టరు “ఈ తోట విస్తీర్ణం మూడెకరాలుంటుందా!”

“మంచిగనే అంచనా వేసిన్రు. మూడెకరాల ముప్ఫైగుంటలు” కొంత విరామం తర్వాత “మల్లేశం” పిల్చాడు రామ్మూర్తి. “అయ్యా” అంటూ తోటను చూచుకొనే మల్లేశం మల్బరీ పళ్ళను పెద్దపొట్లంగా కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు.

“ఇంటికి తీసుక పొండి. రుచిగా వుంటయి” చెప్పాడు రామ్మూర్తి రుచి చూడమన్నట్లుగా ఓ నాలుగు పళ్ళను చేతిలో పెడుతూ. నోట్లో వేసుకొన్నాడు డాక్టరు. పుల్లపుల్లగా తియ్యతియ్యగా బాగున్నాయి. “రుచిగా వున్నాయి” మెచ్చుకొన్నాడు.

“ఆరోగ్యానికి కూడ మంచివే” చెప్పాడు రామ్మూర్తి.

రామ్మూర్తి వద్ద సెలవు తీసుకొని బడి వద్దకు వచ్చాడు డాక్టరు గారు. హెడ్మాస్టరు గది, స్టాఫ్ రూం విడివిడిగా వున్నాయి. సాధారణంగా మిడిల్ స్కూల్లో ఇలాంటి ఏర్పాటు వుండదు. భవనం పెద్దదిగా వుంది. కాబట్టి బహుశః ఇది సాధ్యమైంది.

చెప్రాసి ఇబ్రహీం ఎదురొచ్చి ఆహ్వానించాడు. “పెద్ద సారు పాఠం చెప్తున్నరు. పావుగంటల వస్తరు. బడి గూడ అయిపోతది. కూర్చోండ్రి” అంటూ హెడ్మాస్టరు గారి గదిలోకి తీసుకెళ్ళి కూర్చీ చూపించి, ఆంధ్రప్రభ దినపత్రిక తెచ్చి చేతికందించాడు.

“మంచినీళ్ళు తాగుతరా!” అడిగాడు. వద్దన్నట్లుగా సంజ్ఞ చేశాడు డాక్టరు గారు.

“వార్తాపత్రికలొస్తయా!” ఆశ్చర్యంగా అడిగాడు డాక్టరు గారు. జోడెడ్లపాలెంలో వార్తలంటే గ్రామపంచాయతి రేడియోలో వినడమే. ఎవరన్నా వరంగల్లు నుండి వస్తుంటే పత్రికను కొనుక్కొచ్చుకుంటారు.

“అవునయ్య. పదకొండు గంటల బస్సుకస్తయి. ఊళ్ళెకు నాలుగస్తయి. అండ్ల మన బడిదొకటనుకోరాదున్రి” చెప్పాడు ఇబ్రహీం.

డాక్టరు గారు వార్తాపత్రిక తిరగేస్తూండగానే స్టాఫ్ రూం నుంచి ఒక్కరొక్కరుగా ముగ్గురు టీచర్లు వచ్చి తమను తాము పరిచయం చేసుకువెళ్ళారు. ఈలోగా బడి విడచిపెట్టే గంట ‘చుట్టీ’ కొట్టారు. పిల్లలు బిలబిలమంటూ ఇళ్ళకు పరుగులు తీస్తుంటే టీచర్లందరూ స్టాఫ్ రూంకేసి అడుగులు వేశారు.

సత్యమూర్తి గదిలోకి వచ్చి బావగారిని పలుకరించాడు. మిగిలిన టీచర్లంతా అక్కడికే వచ్చారు. వారందర్నీ డాక్టరు గారికి పరిచయం చేశాడు సత్యమూర్తి.

ఓ పది నిమిషాల పిచ్చాపాటీ తరువాత “వెళదామా బావా!” అంటూ బయటకు దారితీశాడు సత్యమూర్తి.

“అరేయ్ వెంకన్నా!” గట్టిగా కేకేశాడు సత్యమూర్తి. “సార్!” అంటూ వెనక్కు పరుగెత్తుకొచ్చాడు స్కూలు గేటు దాటి వెళ్ళిన ఆ విద్యార్థి.

“అరేయ్! సైకిలు మా ఇంటి దగ్గర పెట్టిపోరా!” ఆజ్ఞాపించాడు సత్యమూర్తి.

“సరే సార్!” అంటూ సంతోషంగా సైకిలు హ్యాండిల్ పట్టుకున్నాడా విద్యార్థి. క్యారేజికి పుస్తకాలు బిగించిపెట్టి కైంచీ తొక్కుతూ బయల్దేరాడువాడు.

“ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడు వాళ్లింటికి వెళ్ళాలంటే మనిల్లు దాటిపోవాలి” బావగారికి చెప్పాడు సత్యమూర్తి. ఎండలో నడుచుకుంటూ ఇల్లు చేరేప్పటికి పావు తక్కువ రెండు కావచ్చింది. భోజనాలయ్యేప్పటికి రెండున్నర. కసేపు కునుకు. ఆపైన ముగ్గురూ కలసి బస్టాండు కొచ్చేటప్పటికి నాలుగున్నరయింది. ఒక చేసంచి తప్ప వేరే సామానేమీ లేదు. బస్సు ఐదింటికొచ్చింది. తల్లినీ బావనీ బస్సెక్కించాడు సత్యమూర్తి.

“జాగ్రత్త బావా! నేనాదివారం వస్తాను.” బస్సు బయల్దేరుతుండగా చెయ్యూపుతూ అరిచాడు సత్యమూర్తి.

వాళ్ళు ములుగురోడ్డు దగ్గర బస్సు దిగి కృష్ణమాచారిల్లు చేరేప్పటికి రాత్రి తొమ్మిదయింది.

“బాగున్నావా అత్తయ్యా!” అంటూ గుమ్మలోనే పలుకరించి కావలించుకొంది అన్నపూర్ణ. “బాగున్నానే. ఏంటీ ఇంతలా చిక్కిపోయావు” అంటూ ఆప్యాయంగా చెంపలు నిమిరింది మంగమ్మగారు.

ఆ రోజుల్లో ఏ సమయంలోనయినా ఒకరిద్దరు మనుషులకు సరిపడేంత అన్నం అందరిళ్ళల్లోనూ వుంటూ వుండేది కాబట్టి ఇల్లాలు అన్నపూర్ణ పెద్దగా శ్రమపడనక్కరలేకుండానే అతిథులకు అన్నం వడ్డించగలిగింది.

రాత్రి అందరూ పడుకునేప్పటికి పదిన్నర.

***

మరునాడు రంగాచారిని తోడు తీసుకొని బజారుకు బయల్దేరాడు డాక్టరు గారు. బట్టల బజారు, బీటు బజారు, పిన్నావారివీధి మధ్యలో వున్న దుకాణాలన్నీ తిరిగి వంట గిన్నెలు, చెంబులు, బిందెలు, గ్లాసులు, బక్కెట్లు ఇతర సామగ్రి కొన్నారు. మంచినూనె, కిరసనాయిలుతో సహా కిరాణా సామాన్లన్ని కొన్నారు. అప్పుడే కొత్తగా వస్తున్న ‘ఉమ్రావ్’ వత్తుల స్టవు కూడా కొన్నారు. అంతకు ముందు కిరసనాయిలు గ్యాస్ స్టవ్లు మాత్రమే వుండేవి.

అన్నపూర్ణ ఆ రోజు ఉదయమే వచ్చి కొత్త ఇంట్లో పాలు పొంగించి వెళ్ళింది. సామాన్లన్నింటిని సర్దుకొన్నాక మళ్ళీ కృష్ణమాచారి గారింటికి వచ్చారు. భోజనాలయ్యాక రాత్రి పడుకోవడానికి వెళ్ళేందుకు సిద్ధమయ్యేప్పుడు గాని గుర్తుకు రాలేదు వాళ్ళేం మరచిపొయ్యారో. “రేప్పొద్దుట అందరి భోజనాలూ అక్కడే. అమ్మాయి అన్నపూర్ణా నువ్వు పొయ్యి వెలిగిస్తే ఊరుకునేది లేదు” ఆజ్ఞాపించింది మంగమ్మ గారు.

మరునాడు మంగమ్మ గారు వంట పూర్తి చేసేసరికి రెండు చాపలు, నాలుగు దుప్పట్లు, రెండు పరుపులు దిళ్ళతో సహా కొనుక్కొచ్చారు డాక్టరు గారు రంగాచారి కలసి. కృష్ణమాచారి వాళ్ళింట్లోంచి నవారు మంచం కూడ తెచ్చుకున్నారు. డాక్టరమ్మ కింద పడుకోకూడదు కదా!

అందరి భోజనాలయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండయింది. జోడెడ్లపాలానికని బయల్దేరాడు డాక్టరు గారు. “రాత్రి రైలుకేం వెళతావు. ఉదయాన్నే వెళ్ళు” అన్నాడు కృష్ణమాచారి. అందరి అభిప్రాయమూ అదే అయ్యేప్పటికి ఆగిపోక తప్పలేదు డాక్టరు గారికి.

***

ఉదయం ఐదు గంటలకల్లా కాజీపేట చేరుకొన్నారు డాక్టరు గారు. మొలకలగూడెంలో రైలు దిగేప్పటికి తొమ్మిదిన్నరయింది. సైకిలు తీసుకొందుకు స్టేషన్ మాస్టర్‍ను కలుసుకున్నాడు. డాక్టరమ్మ యోగక్షేమాలు కనుక్కున్నాక టీ తెప్పించాడు స్టేషను మాస్టరు. టీ త్రాగి సెలవు తీసుకొని జోడెడ్లపాలానికి సైకిలు మీద బయల్దేరాడు డాక్టరు గారు.

ఇంటి తాళం తీసి లోనికొచ్చాడో లేదో ఆత్రంగా ఇంట్లోకొచ్చి అడిగింది అమృత “అమ్మకెట్లున్నది డాక్సరు సాబు” అంటూ. అమృత వెనుకే కృష్ణవేణి కూడ వచ్చింది.

“మంచిగనె వున్నది. మందులు వాడుతున్నది కద. ఇల్లు చూసుకోని ఠికానపెట్టి వచ్చెవరకు ఇన్ని రోజులైంది” వివరించాడు డాక్టరు గారు.

“అయితాయెతియి. మంచిగుంటే సరిపోతది” అంటూ వెళ్ళిన అమృత మంచినీళ్ళ బిందెతో వెనక్కు వచ్చింది. “అమ్మ వచ్చెదన్క మంచినీల్లు నేనె తెచ్చిస్త” చెప్పింది డాక్టరు గారికి. చిరునవ్వుతో అంగీకరించాడు డాక్టరు గారు.

“మరి వంటిట్ల! వండి పంపుమంటవ!” అడిగింది అమృత.

“అవసరం. నేనె వండుకుంట”.

“నీకు వంట సుత వస్తదా!” ఆశ్చర్యపోయింది అమృత.

“మీ డాక్టరమ్మకు వంట నేర్పింది నేనే!” నవ్వుతూ చెప్పాడు డాక్టరు గారు.

“ఇన్నేండ్లసంది అమ్మనె వండుతుండె. నువ్వు వండుడు మర్చిపోలేదా!’ అడిగింది అమృత.

“నెలకు మూడొద్దులు నేనె వండుతకద!” అసలు విషయం చెప్పాడు డాక్టరు.

“అట్లెందుకు”

“నువ్వెప్పుడు డాక్టరమ్మను గమనించలేదా! అమ్మ ఓరకుంటే ఇంట్ల కలుపుకోదు.”

“అమ్మ! పెద్ద ముచ్చట్నె వున్నదిగని నాకు తెల్వకపాయె” అంటూ వెనుదిరిగింది అమృత.

ఆ రోజే గాక మరో రెండు రోజుల పాటు డాక్టరు గారికి వాళ్ళావిడ ఆరోగ్యాన్ని గూర్చిన పరామర్శల తోటే సరిపోయింది.

నాలుగు రోజులకోసారి, వీలు కానప్పుడు వారానికోసారి వరంగల్లు వెళ్ళి భార్యాపిల్లలను చూచుకొని వస్తున్నాడు డాక్టరు గారు. డాక్టరమ్మ పరిస్థితి మెరుగ్గానే వుంది. ఒకట్రెండు సార్లు చెకప్‍కు కూడ వెళ్ళి వచ్చారు. సత్యమూర్తి కూడ క్రమం తప్పకుండా ప్రతి ఆదివారమూ వచ్చి అమ్మను, అక్కయ్యను, మేనల్లుళ్ళను చూచి వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఏమన్నా పనులుంటే చేసి పెడుతున్నాడు కూడ.

భార్యాపిల్లలను వరంగల్లులో దించొచ్చిన కొత్తల్లోనే, ఓ రోజున పోలీసు పటేల్నించి పిలుపొచ్చింది డాక్టరు గారికి.

“ఏం లేదు డాక్టర్సాబ్. ఒక నాలుగు నెలలు ఊరికి బోతున్నం. సర్ది, జరం, కడుపు నొప్పి గిట్ల వస్తె వేసుకునేటందుకు ఏమన్న మందులిస్తె తీస్కపోదామని మత్లబు జేసిన” అన్నాడు పటేలు.

“నాలుగు నెలలు ఏకమ్మున పోతున్నరా! ఎక్కడికి! అయిన పోలీసు పటేలు లేకుంట ఊరెట్ల నడుస్తది పటేలా!” నవ్వుతూ అడిగాడు డాక్టరు గారు.

“ఉత్తరదేశ యాత్రలకు. మీకు తెలుసు గద. మా బావ హైకోర్టు వకీలు. మా అక్క, బావ, వాల్ల దోస్తులు, చుట్టాలు ఓపది పదిహేనుమంది ఉత్తరదేశ యాత్రకు బోతున్నారు. అండ్ల మేమనుకో. చార్ధామ్ యాత్ర నుండి అమర్నాథ్ యాత్రవరకు. ఇగ ఉత్తరదేశంల చూసెద్దేం మిగులొద్దని మా బావ ప్రణాళిక. ఇక ఊరంటావు. నా తోని బుట్టిందా! నా తోని బోతదా! మాలీపటేలుకు బాధ్యతలప్పజెప్పిన. తాసీల్దారున్ను, డిఎస్పీ, ఒప్పినంకనే బోతున్న” వివరించాడు పోలీసు పటేలు.

జలుబు, దగ్గు, జ్వరము, విరేచనాలు, వాంతులు ఇలా దీర్ఘ ప్రయాణాలలో తరచు వచ్చే ఇబ్బందులకు సంబంధించిన మందులు సీసాలలో అరకుల రూపంలో ఇచ్చాడు డాక్టరు గారు.

“కొద్దిపాటి నీళ్ళల్లో రెండు చుక్కలు వేసుకొని తాగాలె. మందు వేసుకొనె దానికి ముందుగాని, తరువాత గాని అరగంట వరకు ఏం తినొద్దు. తాగొద్దు. అరకు అయితె వెంటనే పన్జేస్తది. అందుకే అరకులిచ్చిన. బిరడాలు గట్టిగ జూసుకోని. లేకుంటే అరకు కారిపోతది” జాగ్రత్తలు చెప్పాడు డాక్టరు గారు.

“అట్లనె డాక్టర్సాబ్! రేపు సాయంత్రం హైదరాబాదు ప్యాసెంజర్ల ప్రయాణం. అక్కడి నుంచి వచ్చె ఆదివారం బయలెల్తమనుకో” చెప్పాడు పటేలు.

“మంచిది. క్షేమంగా వెళ్లి, లాభంతో రండి. అందరు దేవుళ్ళనూ నా తరఫున కూడ ప్రార్థించండి” సెలవు తీసుకుంటూ చెప్పాడు డాక్టరు గారు.

(ఇంకా ఉంది)

Exit mobile version