Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వ్యామోహం-13

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అత్తగారింట్లో ఉంటాడు డాక్టర్సాబ్. సత్యమూర్తి – సైకిల్ ఇంట్లోనే ఉంచి స్కూలికి వెళ్తూ, ఇంట్లో కాలక్షేపం అవడం కష్టమని, సైకిల్ మీద దగ్గరలో సెరీకల్చర్ సెంటర్‍ని చూసుకుని స్కూలుకి వస్తే, ఇద్దరం కలిసి ఇంటికి రావచ్చని డాక్టర్సాబ్‍తో అంటాడు. సరేనంటాడు డాక్టర్సాబ్. స్నానం పూజా పూర్తి చేసుకుని సైకిల్ మీద సెరీకల్చర్ సెంటర్‌కి వెళ్ళి అక్కడి ఇంఛార్జి రామ్మూర్తిని కలుస్తాడు. సత్యమూర్తి ఆయనకి ముందే చెప్పి ఉంచడంతో, డాక్టర్సాబ్‌ని సాదరంగా ఆహ్వానించి, పట్టుపురుగుల కేంద్రమంతా చూపించి, వాటి పెంపకం గురించి, పట్టుదారం తీయడం గురించి వివరిస్తాడు. పట్టు పరిశ్రమను గురించి ప్రభుత్వం ముద్రించిన ఓ చిన్న పుస్తకాన్ని డాక్టరు గారికి బహూకరిస్తాడు రామ్మూర్తి. ఆయన దగ్గర సెలవు తీసుకుని సత్యమూర్తి పని చేసే బడికి వెళ్తాడు డాక్టర్సాబ్. హెడ్ మాస్టర్ గదిలో కూర్చుని, ప్యూన్ తెచ్చిచ్చిన దినపత్రిక చదువుకుంటాడు. కాసేపటికి స్కూలు ముగుస్తుంది. సత్యమూర్తి వస్తాడు. తన గదిలోకి స్టాఫ్‌ని బావగారికి పరిచయం చేస్తాడు. ఒక కుర్రాడిని పిలిచి సైకిల్‍ని తమ ఇంట్లో పెట్టేసి వెళ్ళమని చెప్పి, డాక్టర్సాబ్‍తో కలిసి నడుచుకుంటూ ఇంటికి చేరతాడు. అన్నం తిన్ని, చిన్న కునుకు తీసి, అత్తగారితో కలిసి బస్సెక్కుతాడు డాక్టర్సాబ్. ములుగురోడ్డు దగ్గర బస్సు దిగి కృష్ణమాచారిల్లు చేరేప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. అన్నపూర్ణ మంగమ్మగారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. భోజనాలయి అందరూ నిద్రించేసరికి రాత్రి పదిన్నర అవుతుంది. మర్నాడు అద్దె ఇంటికి కావల్సిన సామాన్లన్నీ కొంటాడు డాక్టర్సాబ్. మర్నాడు ఆ ఇంట్లో అన్నపూర్ణ పాలుపొంగిస్తుంది. డాక్టర్సాబ్ కుటుంబం ఆ ఇంట్లోకి మారుతుంది. ఆ మర్నాడు జోడెద్దుల పాలెం చేరుకుంటాడు డాక్టర్సాబ్. అమ్మకెట్లున్నదని అడుగుతుంది అమృత. బావుందని, ఇల్లు ఏర్పాటు చేసి వచ్చిన సంగతి చెప్తాడామెకు. వీలున్నప్పుడల్లా వరంగల్ వెళ్ళి భార్యాపిల్లల్ని చూసి వస్తుంటాడు. ఓ రోజు బాల్రెడ్డి పటేల్ నుంచి పిలుపొస్తుంది డాక్టర్సాబ్‌కి. వెళ్ళాక, ‘నాలుగు నెలలు ఉత్తరదేశ యాత్రకు బోతున్నం. సర్ది, జరం, కడుపు నొప్పి వస్తే తగ్గడానికి మందులు కావాలి’ అని అడుగుతాడు పటేల్. కొన్ని మందులు ఇచ్చి, ఎలా వాడాలో చెప్తాడు డాక్టర్సాబ్. అందరు దేవుళ్ళనూ నా తరఫున కూడ ప్రార్థించమని చెప్పి వీడ్కోలు తీసుకుంటాడు. ఇక చదవండి.]

కూడబలుక్కున్నట్లుగా బావా బావమరుదులిద్దరూ ఒకేసారి చేరుకున్నారు వరంగల్లుకి. సత్యమూర్తి పనుందంటూ ఊళ్ళోకి వెళ్ళి వచ్చాడు. భోజనాలయినాక విశ్రమించేటప్పుడు చెప్పాడు. “బావా! ఈ ఇల్లు ఆసుపత్రికి చాలా దూరంగా వుంది. రిక్షాలో వెళ్ళి వస్తున్నామనుకో. అయినా అక్కయ్యకి ఇబ్బందిగా వుంది. వెళ్ళి రావడానికి ఓ పూట పడ్తోంది. అమ్మ నలుగురు మనుమల్నీ అంతసేపు సముదాయించలేకపోతోంది. హనుమకొండలో ఓ మిత్రుణ్ణడిగితే చెప్పాడు ఓ ఇల్లుందంట.”

“అలాగా చూద్దామ్మరి. ఇక్కడ కృష్ణమాచారి తోడుంటాడు కదా అనుకున్నాను” చెప్పాడు డాక్టరు గారు.

“నిజమే బావా! ఈ రెణ్ణాళ్ళ బట్టి అమ్మా, అక్కయ్య, పిల్లలు పట్నవాసానికలవాటుపడ్డారు కాబట్టి పరవాలేదు అనుకుంటున్నాను. అది మార్వాడి వాళ్ళ సత్రం. మిషన్ ఆసుపత్రి పక్కనే వుంటుంది. అక్కయ్య చూపించుకొనేది మిషనాసుపత్రి ఎదురుగా వున్న సర్కారు దవాఖానాయే కదా! ఇంటికి ఆసుపత్రికి రోడ్డే అడ్డం. కాలినడకన అయినా ఐదు నిమిషాలకన్నా ఎక్కువ పట్టదు” వివరించాడు సత్యమూర్తి.

“మీ తమ్ముడు చెప్పిందానికేమంటావు” అడిగాడు డాక్టరు గారు.

“వాడు చెప్పింది సమంజసంగానే వుంది. ఇక్కడ అన్నపూర్ణ తోడుగా వుంది. రోజూ కాకపోయినా రెండ్రోజులకొకసారి అయినా వచ్చి చూసిపోతోంది. అక్కడికెళితే అదొక్కటే లోటు” చెప్పింది డాక్టరమ్మ.

కృష్ణమాచారిని, అన్నపూర్ణని సలహా అడిగారు. “ఇప్పుడు పరవాలేదు గాని, నొప్పులొచ్చినప్పుడు వెళ్ళడం సమస్యాత్మకమౌతుంది. పురుడొచ్చాక రోజూ తిరగడానికి కూడ ఇబ్బందే. సత్యమూర్తి సలహా బాగుంది. మరీ ఇప్పట్లా రోజూ కాకపోయినా మధ్య మధ్య వచ్చిపోతూంటాంలే” చెప్పాడు కృష్ణమాచారి.

ఇల్లు చూశారు. ఇల్లంటే ఇల్లు కాదు. సత్రం. ఒకటే గది. దానిలోనే వండుకోవాలి, పడుకోవాలి. అలాంటి గదులు ఓ పది దాక వున్నాయి. వరండా మటుకు విశాలంగా ఈ చివర్నించి ఆ చివరి వరకు వుంది. గదికొక మంచంబల్ల, పలంగుపీట అంటారే అది వుంది. ఎండాకాలం కాబట్టి వరండాలో పడుకోవచ్చును. విశాలమైన స్థలం. తోట. మామిడి, చింత వంటి చెట్లు. సత్రానికి వెనుక భాగంలో మొక్కజొన్న వంటి పంటలు కూడ వేస్తారు. బావి వుంది, నల్లా వుంది. వరంగల్లులో నల్లా నీళ్ళు అంటే గోతిలో దిగి పట్టుకోవాలి. ఇక్కడలా కాదు. బాగా ఎత్తు మీద కూడ వస్తాయి. నల్లా కింద ఏకంగా నుల్చునే స్నానం చెయ్యొచ్చు.

రెండు విషయాల్లో ఇబ్బంది తోచింది. ఒకటి పాకీదొడ్లు బాగా దూరంగా వున్నాయి. రెండు ఆడవాళ్ళు స్నానాల గదిలోనే బట్టల మార్చుకుని రావాలి. మగవాళ్ళంటే తుండు చుట్టుకొని వచ్చేస్తారు. ఆడవాళ్ళకలా కుదరదు కదా! దానికి తోడు గదులు చాలా చిన్నవి. చీకటి చీకటిగా వున్నాయి. పాకీ దొడ్లకు పై కప్పు లేదు కాబట్టి వెలుతురు బాగానే వుంటుంది. స్నానాల గదులకు మాటుకోసం పైన రేకులు వేశారు.

ఈ విషయమై చర్చ జరిగాక అసౌకర్యాలతో సర్దుకు పోవడమే మేలనుకున్నారందరూ. పురుడప్పుడు మారొచ్చు కదా అనుకున్నారు. కాని అప్పుడా గదులు దొరుకుతాయో దొరకవో. అయినా అప్పుడా హడావిడిలో ఇల్లు మారడం లేనిపోని ప్రయాస అవుతుందేమో అనుకున్నారు.

అద్దె ఎక్కువనిపించింది. రోజుకి రెండ్రూపాయలు చెప్పారు. నాలుగు నెలల వరకు స్థిరంగా వుంటాం కదాని బతిమాలి బామాలి సత్రం యజమానికి నచ్చచెప్పేసరికి తలప్రాణం తోకకు వచ్చింది బావా బావమరుదులకు. చివరకు రోజుకి రూపాయి పావలాకి ఒప్పుకున్నాడా యజమాని. కాని రాబోయే ముప్ఫైరోజుల అద్దె ముందు గానే కట్టి, వారం వారం అద్దె చెల్లించాలన్న నియమం పెట్టాడు.

వీటన్నిటికీ ఒప్పుకొని సత్రంలోకి మారిపోయింది డాక్టరు గారి కుటుంబం. పెద్దలమాటేమో గాని, పిల్లలకు మటుకు ఈ ఇల్లు బాగా నచ్చింది. కారణం బోలెడంత ఆటస్థలం, మిగతా గదుల్లోకి వచ్చి పోతుండే వాళ్ళ పిల్లలు. పిల్లల సందడితో ఆ సత్రం ఒక ప్రాథమిక పాఠశాలలాగ కళకళలాడుతూ వుండేది.

బళ్ళకి సెలవులిచ్చేశారు. సత్యమూర్తి అక్కనీ పిల్లల్నీ చూచుకుంటానని చెప్పి మంగమ్మ గారిని రైలెక్కించాడు. ఏలూరులో రైలు దిగి జంగారెడ్డి గూడెం బస్సెక్కాలి. అవడానికి పెద్దావిడే అయినా ప్రయాణాలు చురుగ్గానే చేస్తుంది. ఒంటరిగానూ వెళ్ళగలదు. ఎవరో ఒకరు తోడు రావాలన్న నిబంధన లేదావిడకు. కోడల్ని మద్ది ఆంజనేయస్వామి గుళ్ళోలోని సాములారికి చూపించుకొని పదిరోజుల్లో తిరిగొచ్చిందావిడ. కోడలు పుట్టిల్లైన ఏలూరుకి తిరిగి వెళ్ళిపోయింది. సత్యమూర్తి మందులకుంటకు వెళ్ళిపోయాడు.

సత్యమూర్తి హెచ్.ఎస్.సి. తర్వాత బేసిక్ ట్రెయినింగు స్కూల్లో శిక్షణ పొంది టీచరైనాడు. పి.యు.సి. ప్రైవేటుగానే పాసైనాడు. ఇప్పుడు బి.ఎ. పరీక్షకు కట్టాడు. మందులకుంటలో అయితే చదువుకోవడానికి వీలుగాను, ప్రశాంతంగాను వుంటుంది. వరంగల్లుకు వచ్చినప్పుడు కావలసిన పుస్తకాలు కొనుక్కుంటాడు. లేదా మిత్రుల వద్ద అడిగి తీసుకువెళతాడు. ఆ రోజుల్లో పుస్తకాలు కొనుక్కొనే తాహతు అందరికీ వుండేది కాదు. నలుగురైదుగురు మిత్రులు కలసి ఒక పుస్తకాల సెట్టు కొనుక్కుని, పుస్తకాలను ఒకరికొకరు మార్చుకొంటూ చదువుకొనేవారు. చదువుకొనేప్పుడు స్వంతంగా నోట్సు తయారు చేసుకొంటుండేవారు. ఒకసారి నోట్సు తయారైందంటే అచ్చు పుస్తకం అవసరం లేదన్నమాట.

***

కృత్తికలోనే రోహిణిని మించిన ఎండలు మొదలయినయి ఆ సంవత్సరం. ఇంక రోహిణిని గురించి చెప్పేదేముంది. సాయంత్రం నాలుగు దాటుతోంది. కాని ఎండను బట్టి చూస్తే మధ్యాహ్నం రెండు కిందే లెక్కగా వుంది. ఉన్నట్టుండి ఆకస్మికంగా గాలి దుమారం మొదలైంది.

ఇంటిముందర గడంచె మీద ఎండబెట్టిన మామిడి వరుగులను ఆరబెట్టిన బట్టతో సహా లోనికి తీసుకు పరుగెత్తింది వీరలక్ష్మి. వరుగులను జాగ్రత్త చేసుకొని గడంచెను తీసుకువెళ్ళేందుకు బయటకొచ్చింది. గాలి తీవ్రంగా వుంది. గాలితో పాటు లేచిన దుమ్ము కళ్ళను తెరవనీయడంలేదు. చీరకొంగును అడ్డం పెట్టుకొని గడంచెను లేపుతున్న వీరలక్ష్మికి తన ఇంటి ముందర సైకిలుస్టాండు వేస్తున్న మనిషి లీలగా కనపడ్డాడు. పరిశీలనగా చూచింది. డాక్టర్సాబ్.

“అయ్యొ! డాక్సర్ సాబా! లోపలికి రండ్రి బాంచెను. సైకిలు గోడకు చేరబెట్టు. లేకుంటె గాలికి పడిపోతది” అంటూ గడంచెను చేత్తో లేపి పట్టుకొని గబగబ లోపలికడుగులేసింది వీరలక్ష్మి.

వీరలక్ష్మి చెప్పినట్టే సైకిల్ను గోడకానించి ఇంట్లోకి నడిచాడు డాక్టరు గారు. ముక్కులా నోటా దుమ్ము గొట్టుకుపోయింది. బట్టలూ ఒళ్ళూ ధూళిమయమైనాయి. డాక్టరు గారు లోనికి రాగానే తలుపువేసి గడియ పెట్టింది వీరలక్ష్మి.

“పెద్ద గాలి దుమారమయ్య! ఇగొ దుబ్బంత దులుపుకో” అంటూ తువ్వాలునందించింది వీరలక్ష్మి.

ఒళ్ళంతా దులుపుకొని, తువ్వాలుతోటే ముకం తుడుచుకొని వీరలక్ష్మి తెచ్చిచ్చిన మంచినీళ్ళు తాగి తేటపడ్డాడు డాక్టరుగారు.

“అయ్యొ నిలబడె వున్నవు. కుర్చిల కూర్చోన్రి గాద” అంటూ చేతులున్న చెక్క కుర్చీని ముందుకు జరిపింది. కూర్చున్నాడు డాక్టరు గారు. కుట్టు మిషను ముందరి స్టూలు మీద కూర్చుంటూ అడిగింది. “ఇంత ఎండల గాలిదుమారంల ఎక్కడికి పొయినవయ్య! అట్లనే సైకిలు తొక్కుకుంటొస్తున్నవు. ఏడనన్న ఆగలేక పొయినావు.”

“వరినాట్ల గూడెంల పట్వారి బిడ్డ లగ్గానికి పిలుస్తె పొయ్యెస్తున్న. బయల్దేరెటప్పుడు ఎండ ఏమంత లేకుండె. మొగులు మొగులున్నది. ఊరుదాటినంక ఎండ లగాయించి కొట్టుడు షురు జేసింది. మధ్యల ఒకట్రెండు తావులల్ల సుడిగాలి లేచింది గని నన్నిబ్బంది పెట్టలే. ఇగొ రైలు కట్ట దాటుతున్ననొ లేదొ గాల్దుమారుమందుకున్నది. ఎక్కడని ఆగాలె. రైలు కట్ట దాటినంక మొదటిల్లు నీదేనాయె. ఇక్కడనె ఆగిన” ఆమె యాసలోనే వివరించాడు డాక్టరు గారు.

నవ్వింది వీరలక్ష్మి. “ఎందుకు నవ్వుతున్నవు?” అడిగాడు డాక్టరు.

“నువు తొల్త వచ్చినప్పుడేమన్నవు. ఊరి కొసకు కట్టుకున్నవేంది ఇల్లు అన్నవు. ఇప్పుడు ఆపదబడితె మొట్టమొదటి ఇల్లంటున్నవు.” ఈ మాటలంటూ విరగబడి నవ్వింది వీరలక్ష్మి. శ్రుతి కలిపాడు డాక్టరు గారు.

లోపలికి వెళ్ళి పళ్ళెంలో నాలుగు సకినాలు పెట్టుకొచ్చి స్టూలు మీద పెట్టింది “తినయ్య” అంటూ.

“ఇప్పుడివన్నీ ఎక్కడ తినేది. పెళ్ళి భోజనం చేసివస్తున్నాను. భుక్తాయాసం ఇంకా తీరనే లేదు.”

“ఇంకెక్కడి బోయినం డాక్సర్సాబూ! ఎర్రటి ఎండల ఐదు మైల్లు సైకిలు తొక్కుకచ్చినవు. గాలి దుమారంల దుబ్బదుబ్బైనవు. ఈ నాలుగు సకినాలు తింటె ఏం గాదు గని తిను” అంది వీరలక్ష్మి చనువుగా. కాదనలేకపోయాడు డాక్టరు గారు.

“సంక్రాంతి సకినాలు ఇంకా ఉన్నయా!” అడిగాడు పంటి కింద నలుగుతున్న సకినం గుల్లదనాన్ని ఆస్వాదిస్తూ.

“ఎప్పటి సంక్రాంతి డాక్సర్ సాబూ! ఇంక ఉంటాయా. సమ్మక్క మరదలు అదే ఆమె మూడో తమ్ముని పెండ్లాం నాలుగొద్దులుండి పోదామని వచ్చిందట. కడుపుతోనున్నది. ‘సకినాలు తినబుద్దయితాంది వదినా!’ అని ఆడిబిడ్డ నడిగింది. సమ్మక్క నాకు జెప్పింది. దాన్దేం భాగ్యమని నిన్ననై చేసినం. ఒకలు చుడ్తుంటే ఒకలు గోలిచ్చుకుంట మాలెస్సగనె చేసినం. తినక్కా అని కొన్ని ఉంచి పొయింది. దాంట్లోనె నాలుగు నీకు పెట్టిన” వివరించింది వీరలక్ష్మి.

“జింకెట్లున్నది! ఈ గాల్దుమారానికేంగాలే కద!” అడిగాడు డాక్టరు గారు.

“ఎండలు ముదిరిన కాడికెల్లి పగటిపూట గుడిసెల్నె కట్టేస్తున్న. నీ జింకకేంగాత్తియ్యి. దాని పానానికి నా పానం అడ్డమేస్త సరేన!” వెటకారం రంగరించి చెప్పింది వీరలక్ష్మి.

“ఒక్క చదువు లేనట్టె గాని నీ దగ్గర అన్ని లక్షణాలూ ఉన్నాయి.” అదే స్థాయి అధిక్షేపాన్ని ఎదురిచ్చాడు డాక్టరు గారు.

సకినాలు తిని, మంచినీళ్ళు తాగి లేచాడు డాక్టరు గారు బయల్దేరడానికుద్యమిస్తూ.

“ఆగున్రి గద, గాలి తగ్గిందొ లేదొ చూస్త” అని తలుపులు తెరిచింది వీరలక్ష్మి.

గాలిలో వేగం తగ్గింది. కాని ఇంకా వీస్తూనే వుంది. వడగళ్ళా అనిపించేంత పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి.

“అయ్యా! ఆగాలె రాల్లవాన పడ్తాంది” చెప్పింది వీరలక్ష్మి. నిర్ధారించుకొందుకు ముందుకు వచ్చాడు డాక్టరు గారు. పక్కకు తప్పుకొంది వీరలక్ష్మి. “ఇవి వడగళ్ళు కావు వీరలక్ష్మీ” చెప్పాడు.

“ఆ సంగతి నాకు గూడ తెలుసు కని. చినుకు దెబ్బ గట్టిగనె తాకుతది. కొద్ది సేపుంటె తక్కువైతది. పోవచ్చు.”

తప్పని సరై లోనికొచ్చి కూర్చున్నాడు డాక్టరు గారు.

“అమ్మకెట్లున్నది నయమేన!” అడిగింది వేడి వేడి పాలగ్లాసు తీసుకొచ్చి ఎదురుగుండా స్టూలు మీద పెడ్తూ.

“పరవాలేదు. మందులు వాడుతున్నాం కదా! పురుడయ్యేదాకా ప్రయాణాలు మంచిది కాదన్నారు. అక్కడనే దవాఖానకు దగ్గర్లో ఇల్లు తీసుకున్నాం” చెప్పాడు పాలగ్లాసు తీసుకొంటూ.

“అవునూ. ఇంత గాలి దుమారంలో పాలెలా వెచ్చబెట్టావు” అడిగాడు డాక్టరు గారు.

“మా ఉపాయాలు మాకుంటయి గద. బొగ్గులపొయ్యి ఇంట్లనె వుంటది. ఇట్లనె ఎప్పుడన్న ధడాల్న వానగొడ్తా ఇంట్లనె వండుకుంటనన్నట్టు. నాదెంత వంట చెప్పున్రి. చారెడంత వండుకుంట బుక్కెడంత దింట”. నవ్వుతూ చెప్పింది వీరలక్ష్మి.

మేఘాల కారణంగా సూర్యాస్తమయం కాకుండానే చీకట్లు కమ్ముకొచ్చాయి. లాంతరు వెలిగించి ముందుగదిలో కుట్టుమిషను మీద పెట్టింది వీరలక్ష్మి. ఎక్కా వెలిగించి వంటగదిలో పెట్టింది.

వీరలక్ష్మి ఎంత హాయిగా బతికేస్తోంది. దేనికీ చింతపడదు. వచ్చినదాన్ని వచ్చినట్లుగా స్వీకరించు, ఆనందంగా స్వీకరించు అన్న తత్త్వాన్ని వంటబట్టిచ్చుకున్న యోగినిలా తోచిందామె డాక్టరు గారికి ఆ క్షణంలో.

తన బాల్యం గురించి, పుట్టింటి గురించి, అత్తమామల గురించి ఆగకుండా ప్రవాహంలా చెప్పుకుంటూపోయింది వీరలక్ష్మి. డాక్టరు గారు ఆసక్తితో వింటూనే వున్నాడు.

అకస్మాత్తుగా ఆయనకు కాలిక స్పృహ కలిగింది. చేతికున్న హెన్రీసాండజ్ వాచిని చూసుకున్నాడు. ఏడున్నర కావస్తూంది. వెళ్ళడానికన్నట్లుగా లేచాడు. వీరలక్ష్మి కూడ అభ్యంతర పెట్టలేదు. వీధి తలుపు తీసి వెలుగుకోసం లాంతరు పట్టుకొంది. లాంతరు వెలుగులో వాన కనిపిస్తోంది. కుంభవృష్టి, వీధి మొత్తం జలమయమై చెరువులా కనిపిస్తోంది.

“అయ్యా లోపటికిరా! ఎత్తుగడ్డకున్న మా ఇంటి ముందట్నే ఇట్లుంటే మీ ఇంటికి పొయ్యె తొవ్వల సైకిలు పయ్య మొత్తం మునుగుతది. వాన వెలిసినంక గంట సేపటికి గని తొవ్వలు బాగ్గావు” అంటూ బయటడుగు వేస్తున్న డాక్టరు గారి దారి కడ్డంగా నిలచింది.

“నేను పోవాలి వీరలక్ష్మీ” విసుగ్గా అన్నాడు డాక్టరు గారు.

“నేను వద్దంటలేను గదనయ్య. ఈ చీకట్ల ఏ బొందల బడేద్దెలువది. సైకిలు తొక్కుకుంట పోజాలవు. వాన పురాంగ కమ్మయినంక బో” అంటూ వీధి తలుపును మూసి వెనుకకు తిరిగింది వీరలక్ష్మి.

వీరలక్ష్మికి డాక్టరు గారికి మధ్యన నాలుగంగుళాల ఎడం కూడ లేదు. గబుక్కున వెనుకడుగు వేశాడు. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వీరలక్ష్మి కూడ అలా అవుతుందనుకోలేదు. తలదించుకొని రెండు నిమిషాల పాటు అలాగే కొయ్యబొమ్మలా నుంచుండి పోయింది. ఆనక తేరుకుని లాంతరుని కుట్టుమిషను మీద పెట్టేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

అరగంట తర్వాత నిప్పుల మీద కాల్చిన రెండు జొన్నరొట్టెల్ని, చిన్న వెన్నముద్దని, పచ్చడిని కళాయి చేసిన ఇత్తడి పళ్ళెంలో పెట్టుకునొచ్చి డాక్టరు గారి ముందర స్టూలు మీద పెట్టింది.

“నాకు బట్టది” చెప్పాడు డాక్టరు గారు.

“నా కాకలయితుంది. ఇంటికచ్చిన మనిషి తినకుంట మనం దినకూడదని మా అత్తమామలు చెప్పిన్రు. నువు దినకుంటే నేను కూడ ఉపాసముండాలె.”

“ధర్మశాస్త్రాలు మంచిగ నేర్చినవు. తినక తప్పదంటవు. సరే తియ్యి. కాల్చేతులు కడుక్కోవాలె. వాన పడ్తున్నది కద!”

“ఇట్ల నా ఎంబడి రాండ్రి” అని లాంతరు చేతిలోకి తీసుకొని వంట గదిలోంచి పెరట్లోకి వెళ్ళే తలుపు తీసింది వీరలక్ష్మి.

“ఇగోన్రి. ఈ కందిలిపట్టుకోని చూరెంబడి ఆ కొసకు పోన్రి. ఏం తడువరు. వచ్చెటప్పుడు ఈ గల్మ పక్కకు గోలెంల నీల్లున్నయి కాల్చేతులు కడుక్కోన్రి.”

తన అవసరాన్ని ఎంత సులువుగా గ్రహించిందీ నిరక్షరాస్యురాలు. మనసులోనే ఆశ్చర్యపడ్డాడు డాక్టరు గారు. లఘు శంక తీర్చుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వచ్చాడు. తువ్వాలు నందించింది వీరలక్ష్మి. కాళ్ళు చేతులు తుడుచుకొని తువ్వాలును కుట్టుమిషను మీద ఆరేసి వచ్చి కుర్చీలో కూచున్నాడు డాక్టరు గారు.

“తిను డాక్టరు సాబు” పళ్ళాన్ని ముందుకు తోసింది వీరలక్ష్మి. సంశయించాడు డాక్టరు గారు.

“మీరు బ్రాహ్మన్లయితిరి. మా అసొంటోల్లింట్ల తినరు గద” చిన్నబుచ్చుకుంది వీరలక్ష్మి.

“ఛ ఛ అదేం లేదు. వీరలక్ష్మీ. డాక్టరు వృత్తిని చేపట్టాక అలాంటి వన్నీ పెట్టుకుంటే ఎలా కుదుర్తుంది. అయినా ఇందాక నువు పెట్టిన సకినాలు తిన్నాను గదా!” చెప్పాడు డాక్టరు.

“మరి అనుమానపడుతున్నవెందుకు?”

“ఇవాళ గురువారం. ప్రతి బేస్తవారం రాత్రి పూట నిలారమన్నట్లు. ఇంట్లో వుంటే మజ్జిగ తాగి పడుకుంటాను. నేనిప్పుడిది తినకపోతే నువ్వు తినవు. నా కొఱకు నిన్ను కష్టపెట్టడం మంచిదా! లేకపోతే నా దీక్షను విరమించుకోవడం మంచిదా! అన్నదే నా ఆలోచన” అంటూ రొట్టె ముక్కను విరిచి వెన్నలో ముంచి నోట్లో పెట్టుకున్నాడు డాక్టరు గారు.

“ఇంతకు ఏం నిర్ణయం చేసినవు” అడిగింది వీరలక్ష్మి.

“రొట్టె తింటుంటె గూడ అర్థం కాలేదా!”

“నువు దేవునివయ్య!” అంటూ డాక్టరు గారి కాళ్ళకు మొక్కింది వీరలక్ష్మి.

“రొట్టెలు మంచిగున్నయా!”

“బాగున్నయి వీరలక్ష్మీ! కాడెద్దులపల్లెలున్నప్పుడు ఎవరో పంపిస్తే తిన్నాను. మొహమాటానికి తిన్నాను కాని అవంత బాగులేవు.”

“జొన్నరొట్టెలు వేడి మీద తినాలె. అండ్ల ఈర్లక్ష్మి చేసిన రొట్టెలు తింటే ఢోక వుండది”.

“అవునా!” గలగలా నవ్వాడు డాక్టరు గారు. శ్రుతి కలిపింది వీరలక్ష్మి.

“ఇంకొక రొట్టె ఏస్కరావాన్న!” అడిగింది.

“పట్టది వీరలక్ష్మీ. పెండ్లి భోజనమే ఎక్కువైంది. అండ్ల ఆలస్యంగా తినుడైంది. రాంగనె సకినాలు పెడివి. పాలు తాగుమంటివి. కడుపు నిండుగ వున్నది చాలు” చెప్పాడు డాక్టరు గారు. “నువు తినవా!” అడిగాడు వీరలక్ష్మిని.

“తింట బాంచెను” అంటూ వంటింట్లోకి వెళ్ళి అక్కడే రెండు రొట్టెలు తినేసి వచ్చింది.

“పోత వీరలక్ష్మీ” అంటూ లేవడానికుద్యుక్తుడయ్యాడు డాక్టరు గారు.

“ఉండున్రి. వానకమ్మయిందొ లేదొ చూసస్త” అంటూ లాంతరు చేతబట్టుకొని వీధి తలుపు తీసింది. వాన ఉధృతి అలానే వుంది. మధ్యలో వీళ్ళు భోంచేస్తున్నప్పుడు కాస్త తగ్గినట్టు తగ్గినా మళ్ళీ వేగం పుంజుకొంది వాన.

“అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ కొస్తుందయ్య. కొద్ది సేపటికి మా తక్కువైతది గని పోదువు తియ్యి” అంది వీరలక్ష్మి.

“పొద్దు గూకొచ్చిన వాన తగ్గదంటారు వీరలక్ష్మీ. తడిసినా పరవాలేదు. నేను పోతాను” అంటూ లేచారు డాక్టరు గారు.

“చుట్టం గూడ పోడంటరు. పోడంటె చీకట్లే పోవుడు మంచిది కాదు కాబట్కె పోవద్దని” వీధి తలుపు మూసి గడియవేసి నవ్వుతూ చెప్పింది వీరలక్ష్మి.

“అయితే నేను చీకటి పడి వచ్చిన చుట్టాన్నంటావు”.

“అయ్యొ అట్ల కాదు డాక్సర్సాబు! నువ్వు దేవునివి. నా అదృష్టం మంచిగుండి ఇంత సేపు నా ఇంట్ల వున్నవు. గాలి దుమారమె రాకుంటే మా ఇంటి ముందట ఆగుమంటె సుత ఒక నిముసం ఆగుతవా!” వీరలక్ష్మి గొంతులో ఆరాధనాభావం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

డాక్టరు గారికి నిద్రముంచుకు వస్తోంది. పెళ్ళికి వెళ్ళొచ్చిన బడలిక తీరలేదు. కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్నాడు.

“డాక్సరు సాబూ! నువ్వా మంచం మీద పండు. నేనీ కుర్చీల కూకుంట. వాన తక్కువకాంగనె లేపుత” చెప్పింది వీరలక్ష్మి. డాక్టరు గారు బిడియపడ్డాడు.

“ఏం తప్పు లేదయ్య! పండుకో! వాన ఇంతల తగ్గేటట్టులేదు” అంటూ లేచి వెళ్ళి పక్క మీద దుప్పటి మార్చి, పక్కనే వున్న చెక్క బీరువాలోంచి ఉతికిన దుప్పటి తెచ్చిచ్చింది కప్పుకోవడానికి.

మొహమాటపడుతూనే పడుకున్నా రెండు నిమిషాల్లో ఒళ్ళు తెలీని నిద్రలో మునిగిపోయాడు డాక్టరు గారు.

ఒక రాత్రి వేళ మెళకువ వచ్చింది డాక్టరు గారికి. కళ్ళు తెరచి చూచాడు. పై కప్పు కనిపిస్తోంది. ఎడమవైపుకి తిరిగాడు. కుట్టుమిషను, చెక్క కుర్చీ, మిషనుపైన లాంతరు అంతా కొత్తగా కనిపిస్తున్నది. అప్పుడు స్ఫురణకు వచ్చింది అది తన ఇల్లు కాదని. గబుక్కున లేచి కూచున్నాడు. లాంతరు వెలుగు సరిపోవడం లేదు. ఒత్తి చాలా తగ్గించి పెట్టి వున్నది. వీరలక్ష్మి కనపడలేదు. లేచినుంచుని పంచకట్టు సవరించుకున్నాడు. పెళ్ళికి కదాని పంచకట్టుతో వెళ్ళాడు. లేకుంటే ప్యాంటు చొక్కానే వేసుకువెళతాడు.

పడుకొనేప్పుడు విప్పిన కమీజు మంచం పక్కనే చిలక్కొయ్యకు వేళ్ళాడుతున్నది. కమీజు వేసుకొన్నాడు. వాచి చేతికే వున్నది. మసక వెలుగులోనే గుమ్మం వైపు వెళ్ళడానికి ముందుడుగు వేశాడు. కాలికి మెత్తగా పరుపు వంటిది తగిలి ముందుకు పడబోయి తమాయించుకొని, ఒక్క గెంతు గెంతి మిషను ముందరికొచ్చాడు. నిద్దట్లో ఏం జరిగిందో తెలియక గావు కేక పెట్టింది వీరలక్ష్మి.

డాక్టరు గారు పడుకున్నాక చాలా సేపు మెళకువగానే వుంది వీరలక్ష్మి. ఎంత సేపటికీ వర్షం తగ్గట్లేదు. తను నిద్రనాపుకోలేకపోతోంది. చాప పరచుకొని దానిపైన బొంత వేసుకొని పడుకుంది. మంచమ్మీద పడుకున్న వ్యక్తి గుమ్మంవైపుకి రావాలంటే చాపను దాటుకునే రావాలి. మసక వెలుగులో, అడ్డంగా పడుకున్న వీరలక్ష్మి డాక్టరు గారికి కనబడలేదన్నమాట.

గావుకేక పెట్టిన వీరలక్ష్మి గబుక్కున లేచి కూర్చుంది. కుట్టుమిషను దగ్గర బిత్తరపోయి నుంచున్న డాక్టరు గారిని చూచాక పరిస్థితి అర్థమయింది. ఆయన గారు చీకట్లో తనను తన్నుకుంటూ వెళ్ళాడన్నమాట. చిన్నగా నవ్వుకుంటూ లేచి వెళ్ళి లాంతరు దీపం పెద్దది చేసింది.

“నన్ను లేపచ్చు కద డాక్సర్సాబ్!” అంది చిరునవ్వుతో.

“నువు పడుకున్న సంగతి నాకు తెలిస్తే కద! అయినా నిద్రలేచాక కొద్ది సేపటికి గాని ఇది నీ ఇల్లని బోధపడలేదు” సంజాయిషీ నిచ్చాడు డాక్టరు గారు. “పరవాలేదు. ఇక నేను వెళతాను” అంటూ వీధి తలుపు గడియ తీశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version