[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[నాలుగవ రోజు పటేల్ ఇంటికి వెళ్తాడు డాక్టర్సాబ్. ఏకాంతంగా మాట్లాడాలని అంటే, మిద్దె మీద హల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఓ విషయం అడుగుతాను, కోపం తెచ్చుకోకూడదని అంటాడు డాక్టర్సాబ్. అడగమంటాడు. పటేల్ పిల్లలు వరంగల్లులో హాస్టల్లో ఉంటారా అని అడిగితే, కాదంటాడు పటేల్. తమ దూరపు బంధువు, పేదావిడ భోజనశాల నడుపుతుందనీ, పిల్లలు ఆమె దగ్గరే ఉంటారని చెప్తాడు. వరంగల్‍లో ఏమైనా స్త్రీ పొందుకు ఏర్పాట్లున్నాయా అని అడుగుతాడు డాక్టర్సాబ్. కోపగించుకుంటాడు పటేల్. అప్పుడు వనజమ్మకి వచ్చిన జబ్బు లక్షణాలు చెప్పి, ఆ జబ్బు పటేల్ వల్లనే వచ్చి ఉంటుందని చెప్పి, పటేల్‍కి ఉన్న సమస్య కూడా చెప్తాడు డాక్టర్సాబ్. నిజమేనని ఒప్పుకుంటాడు పటేల్. తన వైద్యాన్ని నమ్మితే తాను మందులిస్తాననీ, తగ్గడానికి ఆర్నెల్లు పడుతుందనీ, అన్నీ అలవాటు మానుకోవాలని, బ్రహచర్యం పాటించాలని చెప్తాడు. పటేల్ అంగీకరిస్తాడు. ఎలాంటి ఇల్లు నిర్మించాలనేదే తేల్చుకోలేకపోవడం వల్ల వసంతపంచమి వచ్చి వెళ్ళిపోయినా, ఇంటి నిర్మాణం మొదలుపెట్టలేకపోతాడు డాక్టర్సాబ్. ఒకరోజు భార్తకి కాఫీ అందిస్తూ, వీరలక్ష్మి వచ్చి వెళ్ళిందని చెప్తుంది డాక్టరమ్మ. ఇంత పొద్దున్నేనా అని భర్త అడిగితే, పూర్తిగా తెల్లారకుండానే వచ్చి, పాలు ఇచ్చిందని చెప్తుంది డాక్టరమ్మ. వీరలక్ష్మి కొత్తగా పాడిబర్రెను కొనిందని, ఇకపై రోజూ పాలు పోస్తనని అందనీ, వాడుక వాడి దగ్గర ఎన్ని పాలు పోయించుకుంటున్నారో అన్నే పోయించుకుని, అతనికిచ్చినంత డబ్బులే ఇవ్వమని చెప్పిందని అంటుంది డాక్టరమ్మ. ఒకరోజు సారెదార్ రఘునాథరావు ఒక జింకపిల్లని తెచ్చిచ్చి డాక్టర్‍సాబ్‍ను పెంచుకోమంటాడు. ఎన్నో తర్జనభరజనలయ్యాకా, పెంచుకునేందుకు అంగీకరిస్తాడు డాక్టర్సాబ్. అక్కడ చేరిన పిల్లలు, డాక్టరమ్మ, వీరలక్ష్మీ, అమృత అందరూ సంతోషిస్తారు. ఇక చదవండి.]
“ఆర్నెల్లయింది” అన్నాడు బాల్రెడ్డి పటేలు.
“దేనికి” అడిగాడు డాక్టరు.
“మర్చిపొయినవా! నీ వైద్యానికి. ఆర్నెల్లయితె తక్కువైతదన్నవు కదా! నాకు తక్కువైందన్నట్టా. కాలేదన్నట్టా!” అడిగాడు పటేలు.
“రేపు చెప్త” అన్నాడు డాక్టరు.
మరునాడుదయం పది గంటలకల్లా బాల్రెడ్డి పటేలింట్లో వున్నాడు డాక్టరు గారు. “మిద్దెమీదికి పోదామేంది!” స్వతంత్రంగా అడిగాడు. బాల్రెడ్డి కాదనలేదు.
మిద్దె మీదకు వెళ్ళాక మందుల సంచిలోంచి కాగితాలు తీసి బల్లమీద పెట్టాడు డాక్టరు గారు. “రెండు తెల్ల కాయితాలు తెప్పిచ్చున్రి.” కిందకు కబురు వెళ్ళింది. కాగితాలు వచ్చాయి.
“పటేలా! నేనిక్కడనె వుంట. ఇగో ఈ రెండు అక్కకు సంబంధించిన కాయితాలు. అక్క రోగలక్షణాలను గురించి మీరు రాసిచ్చినయి. కిందికి పోయి ఇవే ప్రశ్నలకు ఇప్పుడు అక్క ఏం సమాధానం చెప్తదో రాసుకోని రాన్రి. అప్పుడు అక్కకు నయమైందొ కాలేదొ మీకు తెలుస్తది, నాకు తెలుస్తది” అన్నాడు డాక్టరు.
“రేపిస్తె కాద!”
“కలువది పటేలా!”
“గట్టి పిండానివే. చాయ, నాస్త వస్తయి. ఒక్కన్నున్నననుకోకు. కానియ్యి. ఈ లోపట నేను రాసుకస్త” అంటూ కిందకు వెళ్ళాడు బాల్రెడ్డి.
కాసేపటికి కారపప్పాలు, జంతికలు వచ్చాయి. తిన్నాక టీ వచ్చింది. డాక్టరు గారు టీ గ్లాసు పక్కన పెడ్తుండగా వచ్చాడు బాల్రెడ్డి. “వనజమ్మకు పురాంగ నయమైంది” సంతోషంగా చెప్పాడు.
“ఆ కాయితాలియ్యుండ్రి. నన్ను కూడ చూడనియ్యుండ్రి” అడిగాడు డాక్టరు. కాగితాలనందించాడు బాల్రెడ్డి.
బల్ల మీద కాగితాలనన్నింటిని పరచిపెట్టుకొని పాత కాయితాలతో కొత్త కాయితాలను పోల్చి చూసుకొన్నాడు. కాసేపు కుర్చీలో చేరగిలబడి కళ్ళు మూసుకొని ఆలోచించాడు. అంతసేపు బాల్రెడ్డి డాక్టరు గారిని మౌనంగా పరీక్షిస్తూనే వున్నాడు. చివరకు కళ్ళు తెరచి చెప్పాడు. “అక్కకు ఇంకా రెండు నెలల వైద్యం అవసరం”.
“అగొ అప్పటి లక్షణాలేవి ఇప్పుడు లెవ్వు గద!” అడిగాడు బాల్రెడ్డి.
“అప్పటి లక్షణాలిప్పుడు లేకపోవడం మంచి పరిణామమే. కాని ఇప్పుడున్న లక్షణాలు ఆరోగ్యకరమైన వ్యక్తి కుండవలసిన లక్షణాలు కావు. అంటే అక్క అనారోగ్యవంతురాలు కాదు. అట్లని సంపూర్ణ అరోగ్యవంతురాలు కూడ కాదు. అనారోగ్యం ఏ క్షణంలనైన ఆమె మీద దాడి చేయవచ్చు. అందుకోసమే రెణెల్ల వైద్యం అవసరం అని చెప్తున్న” వివరించాడు డాక్టరు.
“మరి నా సంగతి”
“ఇదిగో మీ కాయితాలు కూడ తెచ్చిన. మీరు కూడ అదే నమూన సమధానాలు రాయున్రి” అన్నాడు డాక్టరు.
“పోలీసు పటేలు కొలువుకు కూడ నేను పరీక్ష రాయలె. బడె రాపిస్తున్నవు నాతోని” నవ్వుకుంటూ అన్నాడు బాల్రెడ్డి. సమాధానాలు రాయడం పూర్తయినాక కాగితాలు డాక్టరు గారికప్పచెప్పాడు.
“సమాధానాలు నిజాయితిగనె రాసిండ్రు గద. అక్కకు చెప్పినట్టె మీకు చెప్తనని జాగ్రత్తపడుకుంట రాయలే గద!”
“రామ రామ! అంతనుమానమా డాక్టర్సాబ్!”
“అనుమానం కాదు, నిజమే. తాను ఆరోగ్యంగ ఉన్నట్లుగ లోకం అనుకోవాన్నని ప్రతిరోగి అనుకుంటడు” అంటూ ఈ కాగితాలను కూడ ఇందాకటి పద్ధతిలోనే పరీక్షించాడు డాక్టరు గారు.
“మీరు రాసిన సమాధానాలు దైవ సాక్షిగ సత్యమే అయితే మీరు సంపూర్ణారోగ్యవంతుల కిందనె లెక్క”
“ఇమానం జెయ్యుమంటవ!”
“ఏంది పటేలా! నిన్ను ఇమానం జెయ్యుమంటనా! ఏమ్మాటది! నువ్విప్పుడు ఆరోగ్యంగనె వున్నవు” ప్రేమపూర్వకంగా చెప్పాడు డాక్టరు.
“అయితె నేను అన్ని పనులను ఎన్కటి లెక్కనె చేస్కొవచ్చునా!”
“నేను మిమ్ముల్ను ఏ పని కూడ బందువెట్టుమని చెప్పలేదే!”
“అబ్బ డాక్టర్ సాబూ! అదేదొ బ్రహ్మచర్యం పాటించుమంటివి కద! దాన్ని బందుపెట్టవచ్చునా!”
“ఇంక రెణెల్లు. అక్కకు నయమైందాక”
“మీ అక్క సంగతి కాదెహె!”
“వరంగల్లు సంగతా! అది జీవిత కాలం బందు”
“వరంగల్లు కూడ కాదు. ఈ ఊల్లెనె నాకో చిన్నిల్లున్నది.”
“వీరలక్ష్మి!”
ఉలిక్కిపడ్డాడు పటేలు. “నీకెట్ల తెలుసు”
“పటేలా! ఈ విషయం ఊరందరికి తెలుసు. కాకుంటే చర్చించుకోరు”
“అవుగని అది నీ దాకెట్ల వచ్చిందని”
“ఆమెకు వైద్యం చేసిన”
“నాకామె చెప్పనే లే!”
“ఏమో! నాకు సంబంధం లేని విషయమది”
“ఆమెనె వచ్చి చెప్పుకున్నదా!”
“లేదు. జ్వరంతో వచ్చింది. మందులిచ్చాను. గుణం కనపడలేదు. అనుమానం వచ్చి జబ్బు వివరాలన్ని అడిగి రాబట్టుకున్నాను. మళ్ళీ మందులిచ్చాను. రోగం లొంగలేదు. నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాను.”
“అప్పుడు చెప్పిందా!” పటేలు గొంతులో ఉత్కంఠ పెరిగిపోతున్నది.
“లేదు. ‘నా పెనిమిటి రాడు’ అని తలవంచుకొని చెప్పింది. వైద్యానికని చెప్పకుంట మామూలుగ రమ్మను. వచ్చినంక నేను సమజేపిస్త అన్న. ఆమె మాట్లాడలే. ఎంబడచ్చి నామె చెప్పింది”
“ఎవలా ఎంబడచ్చినామె” అడిగాడు పటేలు.
“ఏమో! తెలువదు. వచ్చినప్పుడల్ల కొత్త వ్యక్తినెంబడి పెట్టుకస్తది. నేను వైద్యం చేసే వ్యక్తినె గుర్తుపడ్డ. తతిమ్మ ఆడోల్లందరు నాకొక్కతీరె కన్పడ్తారు.”
“మరి నాతోనొక్క పారన్న అనకపోతివి” ఆరా తీశాడు పటేలు.
“ఎట్లంట. అది ఆమె వ్యక్తిగత రహస్యం. ఒక రోగి వివరం మరొక రోగికి కని, మరొక వ్యక్తికి కని తెలియనివ్వమని ప్రమాణం చేసినంకనె వైద్యవృత్తిని మొదలు పెడ్తాం.”
“ఇప్పుడెందుకు చెప్తున్నవు”
“ఎందుకంటె వీరలక్ష్మికి సంబంధించిన దస్త్రం నాదగ్గరున్నది. అది మీకిస్త. ఇప్పుడక్కకే నమూననైతె ప్రశ్నలకు సమాధానం రాసుకచ్చిన్రో అదే నమూన ఆమె దగ్గర రాస్కరండ్రి. అప్పుడు వచ్చిన సమాధానాన్ని బట్టి మీరు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టవచ్చునా! కూడదా! చెప్త.”
“అందరు రోగులకిట్లనె చెప్తవా!”
“చెప్పను. మీరు పోలీసు పటేలు కనుక ప్రత్యేకం. ‘వదినమ్మ పరిస్థితేం బాగలేదు. మంచిగ వైద్యం చేయండి’ అని ఇంట్ల మా డాక్టరమ్మ చెప్పెంది కాబట్కె ఈ శ్రద్ధ”
“మరి వీరలక్ష్మిని పరీక్షించినంక నువ్వు జాగ్రత్తగుండు అని నాకచ్చెందుకు చెప్పలే” ప్రశ్నించాడు పోలీసు పటేలు.
“అప్పటికి నేను మీకు వైద్యం చేయడం లేదు కాబట్టి”
“అబ్బో వైద్యవృత్తిల ఇన్ని మతలబులున్నయా!” ఆశ్చర్యపడ్డాడు పటేలు.
“మతలబులు కాదు విషయాలు” సరిదిద్దాడు డాక్టరు.
మరో రెండు రోజులకు డాక్టరు అనుమతితో తన బ్రహ్మచర్య దీక్షను వదిలి పెట్టేశాడు బాల్రెడ్డి. ఆ మరుసటి రోజున “వీరలక్ష్మికి జింకను బహుమతిచ్చినవట. జింక బాగున్నది.”
“రామ రామ! అది బహుమతి కాదు. జింక మాదె. ఆమె దగ్గర అమానతుగ పెరుగుతున్నది. కావాన్నంటె సారెదారు రఘునాథరావును అరుచుకోండ్రి.” సమాధానమిచ్చాడు డాక్టరు.
“నాకు తెల్సుతియ్యి డాక్టర్సాబు. ఆందోళనపడకు. రఘునాథరావు జింకను నీకప్పజెప్పిన తెల్లారె నాకచ్చి విషయం చెప్పిండు. వాల్లింట్లందరికీ నువ్వె వైద్యం చేస్తవట కద”
“అవును” సమాధానం చెప్పాడు డాక్టరు.
***
“అమ్మా! మామయ్యెస్తున్నాడు!” ముందుగదిలోంచి గావు కేక వేసి వీధిలోకి పరుగెత్తాడు రాము. వాడి వెనకాల రెండవ వాడు సోము కూడా పరుగెత్తాడు. వంటింట్లో పని వదిలేసి నాలుగంగల్లో వీధి గుమ్మం దగ్గరకొచ్చింది డాక్టరమ్మ. ఉదయం పది దాటింది. డాక్టరు గారు ఏదో పనిమీద ఊళ్ళోకెళ్ళారు. గుమ్మంబయట కొచ్చి అటూ ఇటూ తేరిపార చూచింది. వీధి చివరి నుంచి మామయ్యకు చెరో పక్కా నడుస్తూ వస్తున్నారు మేనల్లుళ్ళిద్దరూను.
నవ్వుకుంటూ నిలుచుంది డాక్టరమ్మ. ఐదు నిమిషాల్లో గుమ్మంలో కొచ్చేశాడు డాక్టరమ్మ తమ్ముడు సత్యమూర్తి. మందులకుంటలో టీచరుద్యోగం. ఇంకా పెళ్ళి కాలేదు. తల్లి కొడుకు దగ్గరే వుంటుంది. “ఏరా కులాసానా! అమ్మ రాలేదా!” అడిగింది డాక్టరమ్మ లోనికి దారితీస్తూ.
“లేదక్కయ్యా! రైలు దిగి ఈ మూడు మైళ్ళూ నడిచొచ్చేటప్పటికి నాకే తలప్రాణం తోకకు వచ్చింది. అమ్మ నడవగలదా! ముందుగా ఉత్తరం రాస్తే బావ స్టేషనుకి బండి పంపిస్తాడనుకో. అయినా అంత వ్యవధి లేదు. నిన్న సాయంత్రం మిమ్మల్ని చూడాలనిపించిందంతే వెంటనే బయలుదేరాను. రాత్రికి వరంగల్లు వచ్చి ఓ మిత్రుడింట్లో పడుకున్నాను. తెల్లవారగట్ల ఐదింటికి కాజీపేటలో ప్యాసింజరెక్కితే ఉదయం తొమ్మిదింటికి మొలకలగూడెం స్టేషన్లో దిగాను. స్టేషన్నుంచి నడిచొచ్చేటప్పటికీ సమయమైంది” భుజానికేసుకొచ్చిన ఎయిర్ బ్యాగుని పక్కన పడేసి ఉస్సూరంటూ ఆసుపత్రి గదిలోనే కూర్చుండిపోయాడు.
“మంచినీళ్ళు తాగుతావా!” అడిగింది డాక్టరమ్మ. ఆ పాటికే నీళ్ళు తెచ్చిచ్చాడు రాము. చెంబెడు నీళ్ళూ గటగటా తాగేశాడు సత్యమూర్తి.
“అమ్మ ఎలా వుంది? ఆదిలాబాదులో అన్నయ్యా. వదినా కులాసానా!”
“బానే వుందక్కయ్యా! అన్నయ్యా వదిన కూడ కులాసా. నిన్ననే ఉత్తరం వచ్చింది. వారంవారం ఠంచనుగా ఉత్తరం వస్తుంది. ఉత్తరం ఒక్కరోజు ఆలస్యమైనా అమ్మ ఓ గొడవ పెట్టేస్తుంది. ‘వాళ్ళెలా వున్నారో! వాళ్ళెలా వున్నారో!’ అని” నవ్వుతూ చెప్పాడు సత్యమూర్తి.
“తల్లి ప్రాణం అలాగే కొట్టుకుంటుంది లేరా! లోపలికి రా!” అంటూ ఇంట్లోకి దారితీసింది డాక్టరమ్మ.
ప్రయాణం బట్టలు మార్చుకొని, అక్క ఇచ్చిన లుంగీ కట్టుకుని, గచ్చులో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని నవారు మంచమ్మీద కూర్చున్నాడు సత్యమూర్తి. వంటింట్లోంచి డాక్టరమ్మ కాఫీ తీసుకువచ్చేటప్పటికి ముగ్గురు మేనల్లుళ్ళు మామయ్యను ఎక్కి తొక్కుతున్నారు.
పెద్దవాడు మాత్రం పక్కన నుంచున్నాడు. ‘కాఫీ తాగరా!’ చెప్పిందక్కగారు చిన్న కొడుకును చేతిలోకి తీసుకుంటూ. ఈ కబురూ ఆ కబురూ చెబుతూ కాఫీ తాగడం పూర్తిచేశాడు సత్యమూర్తి. వంటింట్లోకెళ్ళిపోయింది డాక్టరమ్మ.
“ఎయిర్ బ్యాగు తీసుకురారా!” రాముని పురమాయించాడు సత్యమూర్తి. తెచ్చాడు రాము. బ్యాగు జిప్పుతీసి అందులోంచి తాను తెచ్చిన ఆట వస్తువుల్ని బయటకు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాడు. పెద్దాడి కోసం చెస్సుబోర్డు తెచ్చాడు. చెస్సు గురించి ఓ ప్రక్కన్న పెద్దాడికి వివరిస్తుండగా, రెండోవాడు బ్యాగు సర్దుతూ లోపల్నించి నల్లపెట్టెనొక దాన్ని బయటకు తీస్తూ “ఈ పెట్టె ఏంటి మామయ్యా!” అని అడిగాడు.
“ఒరేయ్ ఒరేయ్! జాగ్రత్త” అంటూ ఆ పెట్టెను వాడి చేతిలోంచి లాక్కొని చెప్పాడు. “దీన్ని కెమెరా అంటారు. పెట్టెకాదు.”
“కెమెరా అంటే ఏమిటి మామయ్యా!” అడిగాడు రాము.
“కెమెరా అంటే ఫోటోలు తీసే పరికరం”
గోడకున్న అమ్మా నాన్నల ఫోటోను చూపిస్తూ “ఫోటో అంటే అదేనా” అడిగాడు సోము. “అవును అదే” అన్నాడు సత్యమూర్తి.
“అయితే మమ్మల్ని కూడ ఫోటో తీస్తావా మామయ్యా!” అడిగాడు రాము.
“అలాగే తీస్తాడు లేరా! విశ్రాంతిగా పడుకోనివ్వండి కాసేపు” కోప్పడింది డాక్టరమ్మ.
“ఏమిటీ ఇల్లంతా సందడిగావుంది” అంటూ లోనికి ప్రవేశించాడు డాక్టరు గారు.
“నమస్కారం బావగారూ!” లేచి నుంచున్నాడు సత్యమూర్తి.
“నమస్కారం! నమస్కారం! ఏమిటి ఇదేనా రావడం. ఒక్కడివే వచ్చావా! అత్తయ్య కూడా వచ్చారా!”
“లేదు బావా! ఒక్కణ్ణి వొచ్చాను.”
“కూర్చో కూర్చో! భోంచేశావా ఇంకా లేదా!”
“లేదు బావా! మీరు రాకుండా ఎలా?”
“ఏమోయ్! అన్నాలు ఒడ్డించెయ్” పురమాయించారు డాక్టరు గారు.
“నేను స్నానం చేస్తాను బావా!”
“అలాగే కానియ్. నేను కూడ కాస్త ఆసుపత్రి పనిచూసుకుంటా!” అంటూ ముందు గదిలోకెళ్ళిపోయాడు డాక్టరు గారు.
ఆ కబురు, ఈ కబురు చెప్పుకుంటూ భోజనాలయ్యేప్పటికి రెండు కావచ్చింది. బావా బావమరుదులు కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ నిద్దర్లోకి జారుకున్నారు. లేచేసరికి ఐదు.
వేడి వేడి పకోడీలతో పాటు కాఫీలందించింది డాక్టరమ్మ.
“పిల్లలలికిడి లేదేంటక్కయ్యా!” అడిగాడు సత్యమూర్తి.
“ఆడుకోవడానికి పక్కింటికెళ్ళారు” జవాబిచ్చింది డాక్టరమ్మ.
రాత్రి దీపాలు పెట్టాక రాముకి చదరంగం నేర్పిస్తున్నాడు సత్యమూర్తి. బ్యాగులోంచి కెమెరాని తీసి బయటకు తెచ్చాడు సోము “మామయ్యా ఫోటో తియ్యవా!” అంటూ.
“ఒరేయ్ కింద పడిపోగలదు జాగ్రత్త! చీకట్లో ఫోటోలు రావు. రేప్పొద్దుట దిగుదాం” అంటూ కెమెరా తీసుకొని పిల్లలకందకుండా భద్రంగా దాచాడు సత్యమూర్తి.
మర్నాడుదయం ఏడింటికల్లా డాక్టరుగారు మందుల బ్యాగు తీసుకొని బయల్దేరూ “సత్యమూర్తీ! నేనివాళ కాడెద్దులపల్లెకు వెళుతున్నా. ఒచ్చేప్పటికి రాత్రవుతుంది” చెప్పాడు.
“సాయంత్రం రైలుకి వెళ్ళిపోతాను బావా!” అన్నాడు సత్యమూర్తి.
“ఇంకా మూడ్రోజులపాటు బళ్ళకు సెలవులున్నాయి కదా! రేపు వెళుదువు గానిలే!” అంటూ సైకిలెక్కి వెళ్ళిపోయాడు డాక్టరు గారు.
“మరి బావకి భోజనం” అక్కనడిగాడు సత్యమూర్తి.
“మీ బావగారికి టిపిన్లకి, భోజనాలకి లోటెక్కడరా తమ్ముడూ! ఆయన తిననంటే బాధపడేవాళ్ళున్నారు కాని, పెట్టడానికి వెనుకాడే వాళ్ళెవరూ లేరు” చెప్పింది డాక్టరమ్మ.
స్నానాలు, టిపిన్లు అయ్యేటప్పటికి తొమ్మిదిన్నర పది కావచ్చింది. పొద్దుట్నించి పిల్లలు ఫోటో ఫోటో అంటూ గొడవ చేస్తున్నారు. “ఫోటోలకు ఇంట్లో వెలుగు సరిపోదర్రా” చెప్పాడు సత్యమూర్తి. ‘వీధిలో దిగుదా’మన్నాడు రాము.
“అలా ఎందుకు అమృత వాళ్ళింటి వాకిట్లో దిగండి” అంది డాక్టరమ్మ. అందరూ అమృత వాకిట్లోకి చేరారు.
పిల్లలందర్నీ ముస్తాబు చేసింది డాక్టరమ్మ. అక్కయ్యను కూడ తయారవమన్నాడు సత్యమూర్తి.
అందరూ కలిసి గ్రూపు గాను, విడివిడిగానూ ఫోటోలు దిగారు. “కృష్ణవేణక్క కూడ దిగాలి” పిల్లలు గొడవ చేశారు. అమృత, కృష్ణవేణి, డాక్టరమ్మలను కలిపి ఫోటో తీశాడు. ‘కళ్ళు మరల్చుకోలేనంత అందం కృష్ణవేణిది’ మనసులోనే అనుకున్నాడు సత్యమూర్తి. అంతా అయ్యాక జింకపిల్ల కూడా ఉండాలన్నాడు రాము.
“జింకపిల్లలు అడవిలో వుంటాయి. అవెక్కణ్ణుంచి వస్తాయిప్పుడు” కోప్పడ్డాడు సత్యమూర్తి.
“మీ బావగారికి అటవీశాఖలో పనిచేసే ఒకాయన జింకను బహుమతిగా ఇచ్చాడురా తమ్ముడూ. మనం దాన్ని పెంచుకొంటున్నాం” అర్థమయ్యేలా చెప్పింది డాక్టరమ్మ.
“ఏదీ మరి!” అడిగాడు సత్యమూర్తి.
“వీరలక్ష్మి చిన్నమ్మ ఇంట్లో వుంది” చెప్పాడు రాము.
“ఆవిడెవరు?”
“మీ బావగారి పేషెంటు. మనింట్లో స్థలం లేదని అక్కడ పెంచుతున్నారు” వివరించింది డాక్టరమ్మ.
“అందరం అక్కడికే వెళదాం” ప్రతిపాదించాడు రాము.
“మామయ్య అక్కడకు రాడు గాని, మీరే జింకను తీసుకురండి. నేను కూడా జింకతో పాటు ఓ ఫోటో దిగుతాను” అంది డాక్టరమ్మ.
జింకను తీసుకురావడానికి రాము సోము బయల్దేరారు. వాళ్ళ వెనకే కృష్ణవేణి కూడ బయల్దేరింది.
“వాళ్ళు రావడానికింకా గంట పడుతుంది కాని, ఈ లోపు భోంచేద్దాం రా!” పిలిచింది డాక్టరమ్మ.
“అప్పుడే!”
“అప్పుడే ఏంటి ఒంటిగంట దాటుతోంది.”
చిన్నమేనల్లుణ్ణి ముద్దాడుతూ లోనికొచ్చాడు సత్యమూర్తి. పిల్లలు వచ్చేసరికి భోజనాలయిపోయినయి. సత్యమూర్తి ఓ కునుకు కూడ తీశాడు. డాక్టరమ్మ వంటిల్లంతా సర్దేసుకుంది.
“ఏంటర్రా! ఇంతాలస్యం. అన్నాలు కూడా తినకుండా వెళ్ళారు” కోప్పడింది డాక్టరమ్మ.
“ఈర్లక్ష్మత్త సర్వపిండి పెట్టింది. తిన్నం. ఏం బాధ లేదు” చెప్పింది కృష్ణవేణి.
సత్యమూర్తి బట్టలు వేసుకొని కెమెరా తీసుకొని అమృతావాళ్ళ వాకిట్లో కొచ్చాడు. పిల్లలు అన్నం అప్పుడే తినం అని చెప్పారు. డాక్టరమ్మ కూడా వాకిట్లోకి వచ్చింది. జింకపిల్ల చెంగు చెంగున ఎగుర్తొంది. అది బయటికి పారిపోకుండా వీధి తలుపు వేశారు. అమృతా వాళ్ళింటి వీధి గుమ్మాన్ని కూడా మూసేశారు.
“దండాలమ్మ!” నమస్కారం పెట్టింది వీరలక్ష్మి.
“అదేంటి నువ్వొచ్చావు” ఆశ్చర్యంగా అడిగింది డాక్టరమ్మ.
“లేకుంటే జింకపిల్ల ఈ చిన్నపిల్లలకాగుతదా!”
“కృష్ణవేణి వున్నది కదా!”
“కృష్ణమ్మ సరె. నేను సరె. ఆమె రెక్కలల్ల పానమె లేదు. జింకపిల్ల ఆయింత తప్పించుకున్నదనుకో. మనకు దొరుకుతదా! డాక్సర్సాబూకుంటడా! డాక్సర్సాబుకంటె ముందుగాల ఆ జంగ్లాత్ సారెదార్ నా ఇల్లు బుచ్చుకోడా!” గుక్కతిప్పుకోకుండా జవాబిచ్చింది వీరలక్ష్మి.
వీరలక్ష్మి వాగ్ధాటికి అబ్బురపడ్డాడు సత్యమూర్తి. పల్లెటూరి మనిషి. అందులోనూ నిరక్షరాస్యురాలివలె వున్నది. ఆమెలో ఇంత తర్కం, హేతుబద్దత వున్నాయా! ఆ మాటే అన్నాడు అక్కతో.
“చదువుకి ఆలోచనకి సంబంధం ఉండదురా తమ్ముడూ! ఒక్కోసారి చదువుకున్న వాళ్ళలో లోపించిన సంస్కారం చదువుకోని వాళ్ళల్లో నిలువెత్తున సాక్షాత్కరిస్తుంది” చెప్పింది డాక్టరమ్మ సమాధానంగా.
జింకపిల్లను, పిల్లలను, అక్కయ్యను, అమృతను, వీరలక్ష్మిని, కృష్ణవేణిని కలిపి గ్రూపులు గాను, విడివిడిగాను ఫోటోలు తీశాడు. అన్ని ఫోటోల్లోను కృష్ణవేణి వచ్చేట్టు మాత్రం జాగ్రత్తపడ్డాడు సత్యమూర్తి.
ఇదంతా గడిచేటప్పటికి పొద్దువారిపోయింది. జింకను తోలుకుపోవడానికి సిద్ధమైంది వీరలక్ష్మి. ముందే చెప్పి పెట్టిందేమో సరిగ్గా సమయానికి ఓదేలు వచ్చాడు. ఇద్దరూ కలిసి జింకను తోలుకుపోయారు.
పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. ఆటపాటల్లో అలసిపోయారేమో. అన్నం తినగానే పక్కలెక్కేసి గాఢ నిద్రలోకి జారిపోయారు. రాత్రి ఎనిమిదవుతుంటే వచ్చాడు డాక్టరు గారు. స్నానం చేసి వచ్చే సరికి ముగ్గురికి భోజనాలు వడ్డించింది డాక్టరమ్మ. ఆ రాత్రి వాళ్ళు పడుకొనే సరికి పన్నెండు దాటింది.
మర్నాడుదయమే లేచి ప్రయాణమయ్యాడు సత్యమూర్తి. పదిగంటలకల్లా మొలకలగూడెంలో కాజీపేటకు వెళ్ళే ప్యాసెంజరు రైలునందుకోవాలి మరి. పిల్లలింకా లేవలేదు. పెద్దాడు మాత్రం లేచాడు.
నిన్నటి దినమంతా పిల్లలతోనే గడిపింది. ఎప్పుడు చేసిందో తెలీదు స్టీలు క్యారేజీ నిండా తమ్ముడికి రవ్వలడ్డులు పెట్టిచ్చింది డాక్టరమ్మ.
“ఉండు బామ్మర్దీ! సైకిలు మీద దించుతా” నన్నాడు డాక్టరు.
“అంత దూరం డబల్ సవారి ఏం తొక్కుతావు బావా!” అన్నాడు సత్యమూర్తి.
“నువ్వే తొక్కు నేను వెనకాల కూర్చుంటా!” నవ్వుతూ అన్నాడు డాక్టరు గారు.
“దానికంటే నేన్నడుచుకుంటూ పోయిందుత్తమం కదా!” అంటూ ఎయిర్ బ్యాగు భుజానవేసుకొని ముందడుగు వేశాడు సత్యమూర్తి.
“అత్తయ్యనడిగానని చెప్పు” అన్నాడు డాక్టరు గారు.
“అలాగే బావా!” అంటూ నడక వేగం పెంచాడు సత్యమూర్తి.
తమ్ముడు కనుమరుగయే దాకా గుమ్మంలో నుల్చొని, నీళ్ళు నిండిన కళ్ళను చీరకొంగుతో ఒత్తుకుంటూ లోనికి నడిచింది డాక్టరమ్మ. వీధి చివరి వరకు మేనమామతో వెళ్ళిన రాము తిరిగి వచ్చేశాడు డీలాపడ్డ మొహంతో.
మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు అందరూ ఫోటోలు అడిగారు. “అక్కయ్యా! దాంట్లో రీలయిపోయింది. నేను చూసుకోలేదు. రీలు తిప్పినా కొద్దీ తిరుగుతూపోయింది. రీలుందనుకున్నాను” చెప్పాడు సత్యమూర్తి. అందరూ నిరాశ పడ్డారు.
“ఫోటువలు లేకుంటే లేకమాయె. ఆ రోజంత సంబురంగ గడిచింది గాద” అన్నది అమృతమ్మ.
అందరూ ఆమె మాటతో ఏకీభవించారు.
(ఇంకా ఉంది)
శ్రీ వరిగొండ కాంతారావు భారతీయ జీవిత బీమా సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత అయిన కాంతారావు గారు – ‘ఉద్యానం’, ‘ఝరి’, ‘సంద్రం’, ‘గగనం’, ‘అనలానిలం’, ‘ప్రణవం’ – అనే కవితా సంపుటులు; ‘దోస్తానా’, ‘కృష్ణార్పణం’ అనే కథా సంపుటులు వెలువరించారు. ‘దోస్తానా’ కథా సంపుటిని డా. యం. రంగయ్య గారు హిందీలోకి అనువదించారు. ‘సాహచర్యం’, ‘వ్యామోహం’ అనే నవలను రచించారు. ‘ఏలికకొక లేఖ’, ‘వినగనేర్తున భాజపా!’, ‘భరతసుతుడా మేలుకో!’, ‘స్వీయ ప్రకటనమ్’, ‘తల్లి భారతి!’, ‘వారు ఓటును నాకు వేసెను!’, ‘ముదమునందగ మోది వచ్చెను’, ‘దేహమన్నది భ్రాంతియేనా!’ – అనే గేయ శతకములు రచించారు. ‘బాసర జ్ఞానమనంత ప్రవాహము’, ‘శుభకృత్తంతయు మేలే జరుగును’ అను మకుట సహిత గేయాళి రచించారు. ‘శోభకృన్మాతృవత్సరం శుభములిచ్చు’ అనే పద్య శతకం వ్రాశారు. ఇవి కాక, ‘పంచాగాన్ని నమ్మడమెలా? ఒక ఆలోచన’, ‘ఇట్ల సుత – కురుక్షేత్ర రహిత మహాభారత గాథ’, ‘బమ్మెర పోతన చరిత్రలో కొన్ని విశేషాలు’, ‘శ్రీ అరవిందులు’ వంటి రచనలు చేశారు. ‘వరిగొండ కాంతారావు సాహిత్య విశ్లేషణ’ అన్న అంశంపై పరిశోధన చేసి శ్రీమతి తాండ్ర సునీత కాకతీయ విశ్వవిద్యాలం నుంచి పిహెచ్.డి. పట్టాను పొందారు. అభినవ కాళోజీ, కాకతీయ కవితాజు, ఖగోళ సరస్వతి వంటి బిరుదులు గల కాంతారావు గారు 2019 శ్రీ కాట్రగడ్డ సాహిత్య అవార్డు గ్రహీత.