[పి.ఎల్.ఎన్. మంగారత్నం గారు రచించిన ‘వ్యాపార దృక్పథం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆ సాయంత్రం..
సూర్యుడు చల్లబడిన తరువాత..
ఎప్పటి లాగానే ఇంటికి దగ్గరగా ఉన్న ఒంటిమామిడి సెంటరులో ఉండే, ఆ చెప్పుల దుకాణానికి చేరుకున్నాను. ఆ షాపులో చెప్పుల అమ్మకంతో పాటు.. జిరాక్స్ మిషను కూడా పెట్టుకుని జిరాక్స్ తీస్తుంటాడు షాపు అతని కొడుకు.
తండ్రీ కొడుకులు ఉండి .. వంతులు వారీగా షాపును చూసుకుంటారు.
నేను వెళ్ళేసరికి కొడుకు ఉంటే ఫర్వాలేదు.
కావలసిన మెటిరియల్ ‘పెన్ డ్రైవ్’ లో పెట్టి ఇస్తే.. అర్థం చేసుకుని ప్రింటు తీసి ఇచ్చేస్తాడు. అదే తండ్రి ఉంటే “మా అబ్బాయి లేడండీ. బయటకి వెళ్ళాడు. కాస్సేపు అయితే వస్తాడు” అంటూ కుర్చీ చూపించేవాడు.
ఇలాంటి చోట ఎదురు చూపులు భయంకరం.
అది పది షాపులు ఉన్న చిన్న సైజు షాపింగు కాంప్లెక్సు. క్రింది అంతస్తులో అన్నీ షాపులే.. అయితే, పై అంతస్తులో అంతా కలిపి ఓ హాస్పిటల్ నడుస్తుంది. ఆ డాక్టరు వ్రాసే మందులు క్రిందనున్న మెడికల్ షాపులో దొరికేస్తాయి, మెయిన్ రోడ్డు వరకూ వెళ్ళకుండానే.
అందులోనే స్వీట్ల దుకాణం, డ్రై క్లీనింగు షాపు, ఫోటో స్టూడియో ఇంకా.. ఇంకా చాలానే ఉన్నాయి. బిల్డింగు అంతా ఒకే స్లాబు క్రింద ఉన్న ఒక్కరి ఆస్తే కావచ్చు.
నాలుగు రోడ్ల జంక్షన్ కావడంతో ఆ కాంప్లెక్సు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.
ఆ రోజూ..
అలాగే చెప్పాడు పెద్దతను “అబ్బాయి బయటకి వెళ్ళాడ౦డీ” అని.
ఆ జంక్షనులోనే.. ఎదురు లైనులో మరో జిరాక్స్ షాపు ‘విజయ దుర్గ’ పేరుతో ఉండడంతో తెలుసు. అక్కడికైనా వెళ్లి పని చేయించుకోవాలని అటు అడుగులేసాను.
ఇక్కడి కన్నా కాస్త అధునాతన మిషన్లతో.. కలర్ జిరాక్స్, స్కానింగు అన్నీ తీస్తారు. అలాగే, డబ్బులూ ఎక్కువ తీసుకుంటారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు.
“అబ్బే. ఒక పేపర్ ప్రింటుకి మూడు రూపాయలు కాదు. ఎక్కడైనా రెండు రూపాయలే. అలా అయితేనే, తీయించుకుంటాను. నాకు కధలు వ్రాసే అలవాటు. నా దగ్గర చాలా మేటర్ ఉంటుంది. ఆ చెప్పుల దుకాణం అతను అయితే, రెండు రూపాయలే తీసుకుంటాడు. ఇప్పుడు అతను లేడని.. ఇలా వచ్చాను” అంటూ ముందే గట్టేస్తాను.
ఈ పోటీ ప్రపంచంలో అతనికైనా ‘పని’ రావాలి కదా!
నేను అలా అనడంతో షాపులో ఉండే మరో అతను “అతనికైనా ఇందులో మిగిలేది ఏం ఉండదమ్మా” అంటాడు. వాళ్ళ లాభనష్టాలతో నాకు అంత పనిలేదు.
ఎందుకంటే, ఎవరి అవకాశ౦ వారిది. చేసే ప్రతి పనీ లాభాన్నే కలిగించదు.
పోటీకి పంపించే కధలు అన్నీ బహుమతులు గెలిచేసుకుంటాయని కాదు.. కనీసం సాధారణ ప్రచురణకు అయినా నోచుకుంటాయేమోనన్న ఆశ.
ఆ తరువాత.. కవర్ని రిజిస్టరు పోస్టులో పంపితేగాని అందుతుందన్న నమ్మకం లేదు.
అంతా వెరశి ఒక కధ పోస్టులోకి వెళ్ళాలంటే యాభై.. అరవై రూపాయల ఖర్చు.
ఆ పత్రికకు మెయిల్ ఐ.డి ఉన్నాగాని, పోటీల దగ్గరకు వచ్చేసరికి పోస్టు ద్వారానే పంపాలంటారు. వాళ్ళ పరిశీలనకు వీలుగా ఉంటుందని.
అందుకే ఇంకో వారం టైము ఉందనగా ప్రింటింగుకి వస్తుంటాను.
ఆ చెప్పుల దుకాణం నుంచి బయటకి వచ్చి.. విజయ దుర్గ వైపు చూసాను.
షట్టర్స్ వేసి ఉంది. అది చాలా రోజులుగా మూసి ఉండడమే కనిపించింది. ఇక తెరుస్తారో! లేదో! అన్నట్లు.
ఇప్పుడు అదీ లేదు. ఉన్నషాపులో మనిషి లేడు. పని జరిగే సూచనలు ఏమీ లేవు.
ఏం చెయ్యాలి? సరిగ్గా వారమే. ఎంతో టైటుగా పని చేస్తే.. తప్ప ప్రయోజనం లేదు.
ఇంటికి వెళ్లి చేసేది ఏముంది?
ఇదైనా పనిలో భాగమే కదా! అని తిరిగి వచ్చి చెప్పుల దుకాణంలో కూర్చున్నాను. కాస్సేపు ఎదురు చూడడం అవసరం అనిపించి.
***
షాపుకి జనాలు బాగానే వస్తున్నారు.
సాయంత్రం పనుల నుంచి ఇళ్ళకు వెళ్ళేవాళ్ళు.. పనిలో పనిగా పిల్లలకి స్కూల్ షూస్ అని, సాక్స్ అనీ కొనుక్కుపోతున్నారు.
చిన్న షాపే కాబట్టి, అన్నీ సెకండు క్వాలిటీ ఐటమ్సే.
మెయిన్ రోడ్డు మీద ఉన్న పేరుపొందిన బాటా, పాపులర్, వీకేసీ ప్రైడ్ లాంటివి బ్రాండెడ్ ఐటమ్స్ కాకపోయినా అక్కడ ఉండే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న రకాలు.. అందుబాటు ధరలు. వందా.. రెండొందలూ.
అయినా బేరసారాలూ.. తగ్గింపులు.
అలాగే..
ఓ నడివయస్కురాలు వచ్చి “మూర్తి అన్నా, ఉన్నావా! మా అత్తగారికి కాళ్ళ నొప్పులని ఒకటే గొడవచేస్తుంది. మొన్నిచ్చినటువంటివి కాక, వేరే రకం మెత్తటి చెప్పులు ఉంటే చూపించు” అడిగింది పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని. ఏదో పనికి వెళ్లి కేరేజీతో.. ఓ చిన్న పిల్లాడిని వెంటబెట్టుకుని మరీ వచ్చింది.
“మెడికేటెడువా? మాములువా?” అడిగాడు అతను.
“అబ్బే. మెడికేటెడ్వి వద్దు. మొన్న అవే ఇచ్చావని పట్టుకెళ్ళా.. ఆ బుడిపెలు కాలికి వత్తుతున్నాయని ఒకటే గొడవ. అందుకే ఈసారి మెత్తటివి చూపిస్తావని వచ్చాను”
ఓ నాలుగు జతలు తీసి చూపించాడు నచ్చినది తీసుకోమన్నట్లు.
“ఆహా.. ఈ ఎర్రరంగు పట్టిలవి వద్దు. ఇంకో రంగు ఉంటే చూపించు .. అమ్మో! దీని రేటు ఎక్కువ” అంటూ నచ్చినవి చూసుకుని, వాటి రేట్లు తెలుసుకుంటూ ..
“అన్నీ ఇంటికి తీసుకెళ్ళి.. మా అత్తగారికి చూపించి తీసుకొస్తాను. తీరా తీసుకెళ్ళిన తరువాత.. నచ్చలేదంటే.. మళ్ళీ డబ్బులు దండుగ” అనడంతో, వాటికి ఉన్న అట్టపెట్టెలు తీసేసి అన్నీ కలిపి ఒక పాలోధిన్ కవరులో వేసి ఇచ్చాడు అతను.
మనిషి సంఘజీవి..
చుట్టుప్రక్కల వాళ్లతో అలా స్నేహసంభంధాలు పెంచుకుంటేనే మనగలుగుతాడు. సిటీకి దూరంగా ఉన్న గాంధీనగర్లో ఆ రోడ్డే వ్యాపారనిలయం.
నాకూ తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపించినా..
ఓ పావుగంట గడిచేసరికి విసుగనిపించింది.
సంధ్య వాలుతుంది.
చలికాలపు పొద్దు తరుగుతుంది.
“మళ్ళీ వస్తాను లెండి. ఆ ఎదురుగుండా ఉన్న జిరాక్సు షాపూ తెరిచిలేదు. దగ్గరలో మరో షాపూ లేదు. ఈరోజుకి పని అయ్యేలా లేదు. టైమేమో దగ్గర పడింది” అంటూ స్వగతంలో అనుకుంటున్నట్లు లేచాను.
నా మాటలకి .. నవ్వేసి ఊరుకున్నాడు అతను.
ఇంకా వెతుతురు ఉండడంతో, బయటకి వచ్చి..
పట్టిన పట్టు వదలనట్లు.. చుట్టుప్రక్కల పరిసరాల్ని పరకాయించి చూస్తున్నాను. వీళ్ళ లాగే మరెవరైనా జిరాక్స్ మిషన్లు.. వాళ్ళ వ్యాపారానికి అనుబంధంగా పెట్టుకుని ఉన్నారేమోనని.
ప్రయత్నిస్తే గెలుపేదోరాదా అన్నట్లు .. వెతికినందుకు అలాగే ‘కనిపించింది’.
నా ప్రయత్నం విజయం సాధించింది.
ఆ కాంప్లెక్సు లోనే.. ఆ చెప్పుల దుకాణానికి.. రెండు షాపుల ప్రక్కగా ‘జెరాక్స్ సెంటర్’ అన్న బోర్డు. చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు అయ్యింది.
నేను దాన్ని దాటుకునే వెళ్ళాను. దృష్టి అంతా ఎప్పటి చోటే ఉండడంతో కొత్తగా తగిలించిన బోర్డు కనిపించలేదు.
దాదాపుగా అరగంటగా ఆ పరిసరాల్లోనే ఉన్నా..
మూర్తి అనబడే ఆ పెద్దతను దగ్గర ఎంతసేపు నా అవసరాన్ని వివరించి చెప్పినా అతనూ కదల్లేదు.
ఎందుకంటే, వ్యాపార దృక్పథం. నాకు దారి చూపించి, వచ్చే ఆదాయాన్ని.. చూస్తూ చూస్తూ వేరేవాళ్ళ చేతుల్లో పెట్టలేడన్నట్టు.
అతని చతురతకి మనసులోనే ఆశ్చర్యపోతూ .. కొత్త షాపులోకి అడుగు పెడుతూ అడిగాను “ఎన్నాళ్లయ్యి౦ది ఈ షాపు పెట్టి” అని పెన్నిధి దొరికినట్లు సంబరంగా.
అంతవరకూ ఉన్న టెన్షన్ చేత్తో తీసేసినట్లయ్యి.
