[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘వ్యాధ మౌని గాథ’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]
~
16.
బ్రహ్మచారి యయిన నొక్క బడుగు వాని
నొక్క కన్యక ప్రేమించె నొప్పు మీర
నంత కళ్యాణ మాడిరా యనుఁగు జంట
అంతరంగముల్ సంతసం బందె మురిసి
17.
ఇచ్చ వచ్చిన రీతిగా నెచ్చెలియును,
తాను విహరించి వనసీమ, తనివి జెంది
ఝరుల,గిరులను, తరులను తిరిగి, తిరిగి
ఉల్లసం బంది రవ్వార లుత్సహించి
18.
కల్ల కపట మెరుగనట్టి మల్లె వంటి
మనసుల నడవిలో పలు మార్లు తిరిగి
అన్నపానీయముల యాస నెన్నఁబోక
ఆడి, పాడి యథేచ్ఛగా నలరి నారు
19.
వేట యాడుచు మృగ మాంస ప్రీతి జెలఁగ
నగ్నిపై కాల్చి, మాంసంబు నారగించి
మదిని యారాట మిసుమంత చెదర నీక
కాననాంతర సీమల గదలి నారు
20.
కొంత కాలమునకు గల్గె సంతు, వారి
మనసు దోచు సుత, సుతుండు గనుట మురిసి
అల్ల కల్లోల వనసీమ చల్ల గాను
బ్రతుకు గడిపిరి వారు యే బాధ లేక
21.
విద్య నేర్పు మార్గంబును వెదుక బోరు
చదువు చెప్ప నెవ్వరికిని చదువు రాదు
ధనము కూడ బెట్టగ చింత తనకు లేదు
బాణ విద్యయు, మృగవేట ప్రతిభ మెండు
జీవనాధార మది యొండె చేవ గూర్చు
22.
అట్టి తరిని యా వ్యాధుని యనుసరించి
మౌని యొక డరుదెంచె నెమ్మనము నందు
భావమే మున్నదో, యేమొ, పలుక దరమె
వ్యాధు డతనిని జంపగా పట్టు బట్టి
హుంకరించె నరుపులతో జంక జేసి
23.
జడ దారి ధరియించు జపమాల,సరములు
ధనమేమి దొరుక డతనిని వెదుక
కావి వస్త్రంబులు కనుమూసి జపమును
కావించు నమ్మౌని కనడు హింస
దైవ నామ జపము తత్త్వ చింతన బోధ
పట్టె వర్థనములున్ పెట్టె బూది
అంగ వస్త్రము పైన, నడుగున ధోవతి
ధరియించు, పల్కడెవరిని గూర్చి
వాని కేదియు స్వంతంబు లేని దగుట
స్వార్థ చింతనా శూన్యుడై సంచరించు
కంద మూలముల్, ఫలములు తిందు ననుచు
తిరుగును యథేచ్ఛ జగమున తిరుగు లేక
24.
కేశములు, గడ్డములు పెంచి, క్లేశ మెద్ది
లేశ మెరుగని యొక్క యావేశ పరుడు
జంతు సంహార నిరతుండు, చతురు డొకడు
కఠిన భాషలు, దృక్కులున్ గలుగు వాడు
వ్యాధు దటవిని, ముని యగు వాని గలిసె
25.
వ్యాధు జీవనమును మార్చు వాడ ననుచు
తలచె మది మౌని, యవ్వాని ధన్యు జేయ
ముని కడ ధనంబు దొంగిలి గొనగ నెంచె
వ్యాధు డమ్ముని గనినంత స్వాంత మందు
26.
ప్రాణ భయమె లేదు మునికి, భక్తి దక్క
ప్రాణములు తీయ వ్యాధుండు ప్రాకు లాడు
వీరి మది లోన భావముల్ వేరు,వేరు
అట్టి తరి ముని దరికేగె నతని జంప
27.
మౌని యులుకడు, పలుకడు, మాట లాడ
బోడు, బదులుగా నిశ్చల పూర్ణ హృదిని
చూచె నా వ్యాధు క్రౌర్యంబు చోద్యముగను
చలన రహిత శిల పగిది మెలగె తాను
28.
యతికి భయ మిసుమంతయున్, హాని గాని
తోచకను మిన్నకుండె నెంతొ సహనమున
అది గని కిరాతు డదలించె నమ్ముని వరు
డేమియును బల్క డరయబో డేమి యగునొ
29.
చంప బోయిన వ్యాధుని శాంత పరచి
చంప ఫలమేమి తెల్పుమా చంద మెల్ల
ననగ, వ్యాధు డాతని ధన మంత గొనుచు
సతిని, సంతతిన్ పోషించి సాకువాడ
సత్య మిది సామి! తప్పేమి సల్పువాడ?
ననగ నతనికి ముని తెల్పె నార్ష నీతి
30.
హింస పాపంబు గూర్చు, నహింస శాంతి
ధనము గొనిన కుటుంబము తన యఘంబు
కొనగ నొప్పు కొందురొ ఏమొ కనుము నీవు
నరయు మవ్వారి దరికేగి అడిగి రమ్ము
(సశేషం)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.
