Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వ్యాసరచనా వ్యాసులు మన సుప్రసన్న

[కోవెల సుప్రసన్నాచార్య గారి 90వ జన్మదినం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. కొండపల్లి నీహారిణి.]

కాలం పరిభ్రమిస్తూనే కావలసినంత జ్ఞానాన్ని సుబోధపరుస్తుంది. జ్ఞాన సంపన్నులను సిద్ధం చేస్తుంది. వారిచేత జ్ఞానాన్ని అందరికీ అందేలా చేస్తుంది. ఇటువంటి గొప్పవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ సాహిత్య రచన వ్యాసంగం చేసే వాళ్ళల్లో గొప్ప రచనలు చేసేవాళ్ళు బహు తక్కువ. ఈ లోకం లో కోటానుకోట్ల జనులు. వీళ్ళల్లో మంచిని పెంచాలని కాలం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఇటువంటి రచయితలను ఎంచుకుంటుంది. అందుకే ఆనాటి వాల్మీకి, వ్యాసుడు వంటి పండితులను ఎంపిక చేసుకున్నది. అక్కడ నుంచి మొదలుకుంటే నన్నయ, తిక్కన, పోతన, పాల్కురికి సోమన, మొల్ల, గంగాదేవి, వేమన, కందుకూరి, గురజాడ, సురవరం, దాశరథి , కాళోజి వంటి కవులను రచయితలను భరతమాత బిడ్డలుగా అందించింది ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇప్పుడు సమాజానికి చాలా అవసరం అలాగే మన కవి… మన కాలం కవి.. మన రచయిత.. మన పండితులు అయిన కోవెల సుప్రసన్నాచార్యులు గారిని మనకు అందించింది. తెలంగాణలోని ఓరుగల్లు చేసుకున్న పుణ్యాలలో ఒకటిగా.. సమకాలీనులలో గణింప తగిన మహోన్నత వ్యక్తిగా.. మనకు సుప్రసన్న గారిని కవిగా పరిచయం చేసింది కాలం.

గతంలో సుప్రసన్న గారి 75 ఏళ్ల జీవితం గురించి ‘సన్నుతి’ అనే సంచికను ప్రచురించిన సందర్భంలో నేను సుప్రసన్న గారి సాహిత్యంలోంచి కవిత్వాన్ని గురించి విశ్లేషణ వ్యాసం రాశాను కాబట్టి, ప్రస్తుతం వారి 90 ఏళ్ళ సందర్భంగా సుప్రసన్న గారి వ్యాస సంపుటాలను స్పృశిస్తూ ఈ వ్యాసం వ్రాస్తున్నాను.

వ్యాసరచనలో సుప్రసన్న గారి క్రమణికను విశ్లేషిస్తే.. వారు విషయాలను ఎంచుకోవడంలోనైనా, విషయ విస్తరణ చేయడంలోనైనా ఒక ప్రణాళికతో సాగుతారు. పాఠకులకు వింగడించి, వివరించి చెప్పే విధానాన్ని చూస్తె ఆశ్చర్యం వేస్తుంది. ఏ విషయాన్ని చర్చించాలో, ఏ విషయాన్ని, విడమర్చి రచించాలో ఏ విషయంపై విభేదించాలో ఒక స్పష్టత ఉన్న రచయిత. ఏ వ్యాసాన్ని తీసుకున్నా వారి లోతైన అధ్యయనం తెలుస్తుంది.

Introduction, content, conclusion అనే మూడు ముఖ్య విభాగాలలో వారి రచన ఒరవడి గొప్పగా ఉంటుంది సమకాలీన సాహిత్యంలో సామాజిక రాజకీయ చారిత్రక అంశాలైనా సాహిత్యంశాలలో దాగివున్న రాజకీయాలైనా ఎక్కడ తప్పులు ఉంటే అక్కడ వాటిని ఎండ కట్టడం చూస్తాం. తాము అనుకున్న పద్ధతికి కట్టుబడని శైలి ఉంటే ఊరుకోరు. సర్వమానవ సౌభ్రాతృత్వం భావనలు లేకుంటే ఒప్పరు. ఇలా ఉండాలంటే నిజాయితీ ఉండాలి. నిబద్ధత ఉండాలి.

నన్నయ నుండి ప్రారంభమైన కావ్య ప్రక్రియలనైనా తర్వాత కాలంలోని ప్రబంధమైనా, ఆధునిక వచన కవిత విశేషమైనా వారి పుస్తకాలను చూస్తే, వారు చదవని గ్రంథం లేదా అనిపిస్తుంది! నవలలు, కథలు వంటి సమాజ పోకడలను తెలిపే సృజనాత్మక రచనలు కూడా వివరించేప్పుడు తమ సిద్ధాంతానికి వ్యతిరేకమైనవి, తమకు నచ్చనివి స్పృశించలేదు వారు. కానీ సాహిత్య సౌధాలు బీటలు వారే సందర్భం వచ్చినప్పుడు సాహిత్యం లోని వింత ధోరణులపై తమ వ్యతిరేకతను అక్షర రూపేణ ప్రదర్శించారు.

సుప్రసన్న గారు యువకులుగా ఉన్నప్పటి నుండి రచనలు చేస్తున్నారు. కవిత్వం, వచనం రెండింట్లోనూ వారికి వారే సమవుజ్జీలు.

‘రామరాజభూషణుని కృతులు’ అనే అంశంపై పరిశోధన చేసిన సుప్రసన్న గారు ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసినంత వరకూ సాహిత్యంతో అనుబంధమే, ఇటు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 90 ఏళ్లలోనూ ఇంకా సాహిత్యానుబంధమే చూస్తాం.

ప్రస్తుతం నేను ఈ వ్యాసంలో పరిమితమైనది నాలుగైదు వ్యాససంపుటాల విశ్లేషణకే! సాహిత్య తాత్త్విక వ్యాస సంపుటాలైన ‘సమర్పణ’, ‘సమర్చన’, ‘దర్పణం’; కవిత్వ విమర్శనా వ్యాస సంపుటి ‘సాహిత్య వివేచన’, ‘తెలంగాణలో సాహిత్య చైతన్యం’ వంటి సాహిత్య వ్యాస సంపుటాలు దేనికదే నేటి తరానికి దిక్సూచులుగా ఉన్నాయి. ‘తెలంగాణలో సాహిత్య చైతన్యం’, ‘అధికారం సంకెళ్ళలో కవులు’, ‘ఎవరికోసం ఈ రచన విధానం’, ‘వైవిధ్యాన్ని ఆహ్వానిస్తున్న వాదాలు’, ‘స్వాతంత్ర్యానంతరం కూలిన ప్రగతివాదం’, ‘సాహిత్యంలో జాతీయ భావనకు తూట్లు’ వంటి శీర్షికలతోనున్న వ్యాసాలు ‘భావ సంధ్య’ పేరుతో కొత్త ఆలోచనలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సుప్రసన్న గారి జ్ఞాపకాలు అనుభవాలు చెబుతూనే ఆ కాలంన్నాటి సాహిత్యానికి ఇప్పుడు వస్తున్న సాహిత్యానికి మధ్యన ఉన్న వ్యత్యాసాలను చెబుతూనే అధికార దాహాలకు కవులు అర్రులు చాచడాన్ని ఎండగట్టడమైనా, పద్య రచన గద్య రచన అంటూనో మరి ఏ కారణం చేతనో సాహిత్యాన్నీ సాహిత్య సృజనకారులనూ చీల్చే పద్ధతిని నిరసిస్తూ, సాహిత్య కోణాలను చెబుతారు. సాహిత్య విమర్శ వికాసానికి పద్యమైనా గద్యమైనా ఒక్కటే. ఈ రెండింటినీ రస లక్షణంతో మాత్రమే సాహిత్యాన్ని ఏకరూపంగా దర్శించాల్సి ఉంటుంది అని చెబుతారు.

ఇక, ‘వచన పద్యము – రూపము, పరిణామము’, ‘నవ కవిత తత్వదర్శనము’, ‘ఆధునిక కవిత అంతర్ముఖీనత’ వంటి వ్యాసాలతో వెలువరించిన ‘సాహిత్య వివేచన’ అనే మరో సంపుటి విశేషమైన వ్యాసాల కూర్పు. ఈ వ్యాసాలన్నీ 1940 తర్వాత తెలుగు కవిత లోకంలోని పరిణామాలను ఉద్యమాలను వివరించేవి ఇవన్నీ 1958 నుండి 1971 మధ్యకాలం వరకు రాయబడ్డ వ్యాసాలు అని చెబుతూనే, “తెలుగు సాహిత్యంలో ఒక విమర్శన సంప్రదాయం ఉన్నది. మన మహాకవులందరూ గొప్ప కావ్య నిర్మాణ దక్షులే కాక కవితా తత్వమును గూర్చి స్వతంత్రంగా జిజ్ఞాస చేసిన మహానుభావులు ఈ మార్గమును గూర్చిన వివరణ కోతిక్కంగా కానవస్తున్నది కానీ ఈ సంప్రదాయ స్వరూపమును సృష్టిగా విచారణ చేసి దాని స్వరూపమును నిరూపించవలసి ఉన్నది నేటి మన విమర్శ ఒక వినూత్న తేజస్సుతో వెలుగొందడానికి ఈ పునాది అవసరం” అని సుప్రసన్న గారు వారి అభిప్రాయాన్ని రాయడంలోనే తెలుస్తుంది ఎంతటి పరిశోధనా తత్త్వంతో ఏ విషయాన్ని అయినా ఎట్లా విశ్లేషణ చేసి రాస్తారో వీరు అని!

‘సమర్పణ’ అనే వ్యాస సంపుటికి “ఆధునిక మహర్షి ఆచార్య సుప్రసన్న” అనే శీర్షికతో డాక్టర్ లంకా శివరామ ప్రసాద్ గారు రాసిన పీఠిక సుప్రసన్న గారి వ్యాసరచనా నైపుణ్యాన్ని బహిర్గతపరుస్తూ పాఠకులను చదివింపజేస్తుంది. సాధారణంగా Intelligence, Creativity, Capability అనేవి నవ్య రీతుల్లో ప్రదర్శితమవుతూ ఉంటుంది. అద్భుతమైన రచనను సృష్టించే శక్తి ఉంటుంది.

సుప్రసన్న గారి వ్యాసరచనా వృక్షాన్ని అశ్వత్థ వృక్ష స్వరూపంగా భావిస్తూ, బోధిసత్వ తత్వాన్ని గుర్తుకు చేస్తూ, ప్రాక్ పశ్చిమ నాగరికతల ప్రాచీన ఆధునిక కవితల మేళవింపు కమనీయమై శాఖోప శాఖలుగా విస్తరించి సాహితీవనాన్ని స్వసంపన్నం చేస్తున్నది అనే స్పష్టమైన అభిప్రాయాన్ని ఇస్తారు. “యాంత్రిక ప్రపంచం సృష్టించిన త్రిశంకు స్వర్గాలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, జీవన సౌందర్య లహరిని ప్రేమ మార్గం ద్వారా చేరుకునేందుకు సుప్రసన్నాచార్యుల వారిచ్చిన పిలుపు మరల మరల వినిపిస్తుంది. ప్రతి యుగంలో ప్రతిభా వసంతంలో ప్రతి శతాబ్దంలో కొత్త దుస్తులు తొడుతుంది. అది విస్తరిస్తుంది.” అని ముగిస్తారు లంకా శివరామ ప్రసాద్ గారు. అటు ప్రాచీన సాహిత్యాన్ని, సంస్కృత కృతులను ఇటు ఆధునిక కవిత్వాన్ని వచన సాహిత్యాన్ని ఔపోసన పట్టిన కవి పండితులు సుప్రసన్న గారు. శివరామ ప్రసాద్ గారి అక్షరాక్షరం సుప్రసన్న గారిపై గౌరవాన్ని ప్రకటింప చేస్తున్నది.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ‘ఆంతర్యం’ అనే శీర్షికతో పీఠిక రాస్తూ, “సుప్రసన్న గారి జీవన సంస్కారంలో ఒక తాత్విక గాఢత, సారస్వత ప్రవహిత పెనగొని ఉన్నాయి” అంటూ ప్రారంభించి సుప్రసన్న గారు ఏ ఏ వ్యాసంలో ఏమేమి ప్రతిపాదించారు అవి నేటి తరానికి ఇక్కడే ఎలా అవసరమవుతాయో చెప్పారు. “భాష కాదు వస్తువు కవిత్వాన్ని సరళం చేసేది కఠినం చేసేది. సంవిధానం మరింత ముఖ్యం” అని, “భారతీయ నాయకత్వం సమగ్ర జీవన దృక్పథం నుంచి కాకుండా భౌతిక జీవన కోణం నుంచి భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేసింది” అని, ప్రధానంగా ఆధునిక కవిత్వం అంతా బుద్ధి ప్రధానమైంది” అని సుప్రసన్న గారు రాసిన వాక్యాలను ఉదహరిస్తూ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు “శ్రీ సుప్రసన్న స్వబుద్ధిగత తార్కిక ప్రజ్ఞతో వెల్లడించిన అభిప్రాయాలు ఆధునికత అంటే చాలు అసహనంగా ఉలికిపడే పండితుల పంథాలోని వారు కాదు సుప్రసన్న” అని అన్నారు. సాహిత్యాధ్యనం చేసి, ఆయా రచనలలోని నిగూఢమైన భావాలను తేటతెల్లం చేయడం వల్ల కనీసం ఆ మూల గ్రంథాలను ఆమూలాగ్రంగా చదవలేని వాళ్లకు విషయ పరిజ్ఞానమైనా దొరుకుతుంది అనే ఆలోచనతో సుప్రసన్న గారు ఈ వ్యాసాలను రచించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఏవైనా గ్రంథాలను చదివినప్పుడు కలిగిన ఆనందాన్ని, విసుగుని వెలిబుచ్చడం కొరకు కూడా వ్యాసాలు రాస్తుంటారు రచయితలు. ఇక్కడే వ్యాస రచయిత వివేచన తెలిసి వస్తుంది. గొప్ప పరిశోధనా స్వభావమున్న సుప్రసన్న గారి విశ్లేషణాత్మక వ్యాసాలలో సమాజ శ్రేయస్సుకు ఉపయుక్తమైన విషయాలను ప్రస్తావించడం చూస్తాం. జాతి మూలకందాలైన అంశాలపై దెబ్బ కొట్టే విధంగా వచ్చిన సాహిత్యాన్ని విమర్శ చేయడం గమనిస్తాం.

“ఈనాటి కవిత్వ సంభావన మహాకావ్య శిఖరాల దాకా” అనే వ్యాసం నుండి ప్రారంభిస్తే, “ఈ తరం వారి భాగ్యం” అనే వ్యాసం వరకు 31 వ్యాసాలున్న ఈ సంపుటిలో కవిత్వ పరిమళాలను ఆస్వాదింపజేశారు లక్షణాలను విలక్షణంగా వివరించారు, కవిత్వ ధోరణలను ప్రస్తావించారు.

సంప్రదాయవాద కవిత్వాన్ని నవ్య కవిత్వాన్ని కొత్త కొత్త ప్రతిపాదనలతో వివేచన చేసారు. ప్రగతివాద కవిత్వం, విప్లవ కవిత్వమూ తీసుకురాలేని వేగాన్ని ఆవేశాన్ని వచనంలోకి ప్రతిఫలించేట్లు చేయటం, భాషలోని ముడులను విప్పి తాత్విక రహస్యాలను వెల్లడించడం కవిత్వాన్ని వ్యాఖ్యానించే ఎప్పుడూ తన చేతనను నిర్భయంగా ప్రకటించుకోవడం వంటి పన్నెండు లక్షణాలు ఆంధ్ర కవిత జగత్తును ప్రకాశింపజేసిన శేషేంద్ర ప్రధాన అంశాలుగా చెబుతారు సుప్రసన్న గారు. ఇట్లా వివరించి చెప్పాలంటే సమకాలీన సామాజిక సాంఘిక రాజకీయ పరిస్థితుల పైన సరైన అవగాహన ఉండాలి. అప్పుడే కవి హృదయాన్ని కవితా సౌందర్యాన్ని సామాజిక న్యాయం తోనూ, సాహిత్య సమతుల్యత తోనూ విమర్శించగలరు. శేషేంద్ర కవిత్వం గురించి ఇచ్చిన చిన్న ఉదాహరణ మాత్రమే! ఇట్లా.. కాల్పనిక కవిత్వ లక్షణాల విషయమైనా, వచన కవిత్వ పోకోడలనైనా, తిరుపతి వెంకట కవుల ‘బుద్ధ చరితం’ గురించి వ్రాసిన వ్యాసమైనా ఇటువంటి ఎన్నో ముఖ్య సూచనలతో సద్విమర్శలతో సాగిన వ్యాసాలే ఇవన్నీను..!

విశ్వనాథ, గురజాడ, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, దాశరథి, మాదిరాజు రంగారావు, మధునాపంతుల, రామచంద్రమౌళి కవిత్వ పరామర్శనే కాదు, కథానిక పరిమితి విస్తృతి అనే వ్యాసమైనా, అంతర్ముఖుడు శ్రీ నవీన్ వ్యాసమైన కథ, నవల, కవిత్వం అన్ని సాహిత్య ప్రక్రియల పట్ల సుప్రసన్నగారికున్న అవ్యాజమైన ఆసక్తిని అనురక్తిని చూపిస్తున్నాయి.

సాహిత్య వికాస దశలు, దిశలు వివరించిన నేర్పు ప్రతి వ్యాసంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తులను గురించి వివరించేప్పుడు వ్యక్తుల వ్యక్తిత్వాలపైన ఇటు వాళ్ళ రచనల పైన ఒక స్పష్టత ప్రస్ఫుటమవుతుంది.

ఈ విషయాలను ఉదాహరించుకుంటే నవీన్ గారిని గురించి వ్రాస్తూ, “‘అంపశయ్య’ద్వారా అంతవరకు తెలుగు సాహిత్యంలో అంతగా ప్రచరితం కాని చైతన్య స్రవంతి సంవిధానాన్ని ప్రయోగించి తొలి నవలలను పూర్తి చేశాడాయన” అంటారు. ప్రసాదరాయ కులపతి గారి గురించి రాస్తూ, “మంత్రసిద్ధులై అద్భుతమైన ఆవేశంతో ఐంద్రీ సాహస్రి, శివ సహస్ర అనే రెండు సహస్రకావ్యాలు రచించారు. రెండు కూడా ఉభయ భాషలలో సమకూర్చారు. అయింద్రీ సాహస్రిలో సప్తశతి సంస్కృతమై, తెలుగు త్రిశతి అయింది. శివ సాహస్రిలో అది వ్యత్యస్థమై సంస్కృతంలో త్రిశతియై తెలుగులో సప్తశతి అయింది” అంటారు. ఇక ‘కవితవసంత పునరాగమనం’ అనే శీర్షికతో చంద్రమౌళి గారి కవిత్వ వివేచన చేస్తూ మరి వ్యక్తిత్వాన్ని చెప్పే క్రమంలో, “చంద్రమౌళి కవిత్వంలో వాక్ తీవ్ర ధార ఒక పార్శ్వం మరొకచోట కరిగి కన్నీరే ప్రవహించగల చోట అతనలోని మృదు కుసుమ పార్శ్వమూ గోచరిస్తుంది” అంటారు. ఒక నిర్దిష్ట అంశం పైన ఆయా రచయితల స్వంత ఆలోచనలనే చెప్పడం, ఆ రచనలోని అంశాన్ని విశ్లేషణ చేయడం వ్యాసరచయితల ముఖ్య లక్షణం. వివరిస్తున్న సాహిత్య అంశంలోని జ్ఞానాన్ని కూలంకషంగా వివరించగలిగే సత్తా ఉండాలి తార్కికంగా చెప్పగలమా, వ్యవస్థీకృతంగా ఉన్న విషయాన్ని వ్యక్తపరచగలమా పరిచయమాత్రంగా చెప్తున్నామా అనే విమర్శనాత్మక దృష్టి వ్యాసరచయితలో ఉండాలి. ప్రసన్న గారి వ్యాసరచన ఇంత లోతుగా ఉంటుంది.

‘సమర్చన – సాహిత్య తాత్విక వ్యాసాలు’ అనే వ్యాస సంపుటికి అసాధారణ సమర్చన అంటూ బేతవోలు రామ బ్రహ్మంగారు, సౌహార్ధ సమర్చన అంటూ శ్రీ రామచంద్రాచార్య గారు పీఠికలు రాస్తూ సుప్రసన్న గారి సమర్చన భావం లోని స్థితిగతుల్ని వివేచన చేశారు.

బేతవోలు గారు “వైశాల్యం పెరిగితే లోతు తగ్గుతుంది అనేది సాధారణ సిద్ధాంతం. కానీ సముద్రానికి ఇది వర్తించదు. సుప్రసన్న గారు ఒక సాహితీ సముద్రం” అనే వాక్యంతో ప్రారంభించడమే సుప్రసన్న గారి ఆలోచన కడలి తరంగాలను పట్టుకోడానికి ప్రయత్నించారు అని చెప్పవచ్చు. ఎందుకంటే వసు చరిత్ర మీద సుప్రసన్న గారు చేసిన పరిశోధనను “అప్పటికి దొరకని ఒక కొత్త వెలుగు రేఖను వేరిప్పుడు ఈ కావ్యం మీదకు ప్రసరింప చేశారు” అనడమైనా, “పాండురంగ మహాత్మ్యం మీద రాసిన వ్యాసంలో వీరు చేసిన రెండు సమన్వయాలు ఆలోచన అమృతాలు” అని అనడమైనా, బేతవోలు రామబ్రహ్మం గారు “దివ్య క్షేత్రాలలో ఉన్న కొండనీ కొనని కూడా దైవ స్వరూపాలుగా కవులు ఎందుకు వర్ణన చేస్తారు అనే సంశయానికి మీరు గొప్ప ఆధ్యాత్మిక సమన్వయం చేశారు” అని.. “జీవనంలో భోగస్థానంలోనికి త్యాగం మమకార స్థానంలోనికి సర్వజీవస్వాత్మక భావం నింపుతాయి ఈ వర్ణనలు” అని సుప్రసన్న గారు వ్రాసిన వాక్యాలు ఉదహరించడమే చాలు బేతవోలు రామ బ్రహ్మంగారు చేసిన ప్రతిపాదన సార్వకాలీనం అని తెలుస్తుంది. ఇదంతా సుప్రసన్నగారి విస్తృతావలోకన ప్రతిఫలనమే!

ఇక, “ప్రతిభాశాలియైన వ్యుత్పన్ను డాయన. నిరుద్విగ్నంగా జనహిత కరంగా జగదానందకరంగా తన స్పందనను శ్రుతి సుభగంగానే కాదు, హృద్యానవద్యంగానూ శంకాంతకాలు లేకుండా ఆవిష్కరించగల ఆర్జవంకల వ్యక్తి. శబ్దం మీద చనవున అధికారం చలాయించగల సత్తా కలవాడు” అంటూ సుప్రసన్న గారి రచనను వారి సాహిత్య శక్తియుక్తులను గురించి చక్కని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు శ్రీరామచంద్రాచార్య గారు. ఇవి చదివితే, ఈ పుస్తక ప్రచురణ ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు “భారతీయ సాహిత్యాధ్యయన పద్ధతిలో నూతన రోచిస్సులు వెదజల్లుతూ ఈ ‘సమర్చన’ వ్యాస సంకలనం సాహిత్య తత్త్వాన్ని అవగాహన చేసుకునేందుకు మార్గదీపిక” అని అన్నది అక్షర సత్యం.

ఈ పుస్తకంలో ‘శ్రీమద్రామాయణము తపోమయమైన ఇతిహాసము’, ‘మహాభారత పరమార్ధం’, ‘పోతన భాగవతానుశీలనము – అధ్యయన కీలకము’, ‘భారతీయ చరిత్ర నిర్మాణం – ఆధారాలు పరిశీలన’ వంటి వ్యాసాలు 21 ఉన్నాయి. ఏ వ్యాసాన్ని కా వ్యాసమే ప్రత్యేకమైన వ్యాసం.

వ్యాసరచనకు మూలకమైన విషయం రాస్తున్న అంశం పైన సదవగాహన ఉండాల్సిన ఆవశ్యకత. వ్యాస వ్యవసాయం గొప్పది. రైతు పొలంలో పంట పండిస్తే చివరికి పంట ఎత్తుకున్నటువంటిది వ్యాసంలోని ఎత్తుగడ. ఈ ఉపోద్ఘాతం నుంచి మొదలుకుంటే ముగింపు వరకు వ్యాస రచయిత ఎత్తుకున్న అంశానికి తగినట్టుగా వ్యాస రచన నడక ఉండేలా ప్రతి అంశంలోనూ ద్యోతకమవుతుంది. ఈ విషయాన్ని సుప్రసన్న గారు ‘ప్రాచీన సాహిత్య వ్యక్తిత్వం’ అనే వ్యాసంలో “ప్రాచీన ఆంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేసేప్పుడు ప్రధానంగా దాని రూపాన్ని అభివృద్ధిని వస్తువును గూర్చిన ఒక అవగాహన ఉండడం అవసరం” అంటూ మొదలుపెట్టారు. పద్యాన్ని పద్యం లాగానే చదువుకోవాలని వచనంగా చదవడం వల్ల దాని లక్షణం వెలికి రాదు అని చెప్పడమైనా, ఛందస్సు అంటే నడక అని, సంస్కృత సాహిత్యంలో అనుష్ఠుప్పులతో ఛందస్సు ప్రయుక్తమై ఉంటుందని, తెలుగు సాహిత్య పరిణామంలో మార్గదేశీ పద్ధతులు రెండు కానవచ్చే విషయాలను చెబుతూనే కొందరు ప్రాచీన కవులను కొన్ని ప్రాచీన కావ్యాలను ఉదహరించారు.

“మన జాతీయ సాహిత్య సంప్రదాయము ప్రధానంగా మూడు విషయంల మీద ఆధారపడి ఉన్నది సాహిత్య స్రష్ట. అనగా కవి, కావ్యము, మూడవది సమాజం. ఈ త్రివేణి సంగమమే సాహిత్య ప్రయాగ” అంటూ ‘సాహిత్య సంప్రదాయము’ అనే వ్యాసంలో వ్యాసానికి తగిన విధంగా ప్రతిపాదనలు కూడా చేస్తారు సుప్రసన్న గారు.

నిష్పక్షపాతంగా సాహిత్య విమర్శ చేయాలి. వస్తువు నచ్చకపోవచ్చు, కానీ రచనా విధానంపై విమర్శ రాస్తూ విశ్వసనీయత ఉండేలా వ్రాయాలి. వ్యక్తిగత కారణాలు అగ్నికి ఆజ్యం పోస్తూ వస్తాయి కాబట్టి దూషణ భూషణాలకు దూరంగా ఉండాలి. దృష్టి మొత్తం సాహిత్యం పైనే కేంద్రీకరించి విమర్శ వ్యాసాలు రాయాలి. ఈ లక్షణాలు సుప్రసన్న గారి రచనా విధానంలో శైలిలో ప్రస్ఫుటంగా ఉంటుంది.

‘దర్పణం’ అనే సాహిత్య వ్యాస విమర్శన వ్యాస సంపుటిలో ఉన్న వ్యాసాలన్నీ ఎంతో ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయి ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ చేకూరి రామారావు గారు “దర్పణానికి ఎదురుగా మరో దర్పణం” అంటూ సుప్రసన్న గారితో వారికున్న సన్నిహిత్యాన్ని సుప్రసన్న గారి ఆలోచన ధోరణులను వారి సాహిత్యంలోని విమర్శనా దృష్టిని స్పృశించారు. మా ఆలోచనలకు భిన్న తాత్త్విక మూలాలు ఉన్నాయి.

అయినా మా ఇద్దరినీ కలిపింది భిన్న భావ సహిష్ణుతనే సామాన్య అంశం అంటారు. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు సాహిత్య చర్చలు చేయడం, కవిత్వాన్ని గురించి మాట్లాడడం ఒక అలవాటు అంటూ.. వారు ఉస్మానియాలో బి.ఎ. చదువుతున్న సమయంలో సుప్రసన్న గారు ఎం.ఎ. చేస్తున్నారట. హాస్టల్లో దగ్గర వాళ్లు కలుసుకునే విషయాలను చెబుతూ, సుప్రసన్న గారు రాగాలు తీస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వాన్ని పాడేవారని, “ఆ రాగాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ ‘ఎ’ హాస్టల్ చుట్టూ ఉన్న రాళ్లలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్న అనుభవం కలుగుతుంది” అని అంటారు.

వీరి రచనను గురించి చెబుతూ “సుప్రసన్న అనేక ప్రాచీన పౌరాణిక గాథలను ప్రతీక మాత్రాలుగా గ్రహించి వాటి నుంచి తాత్త్విక సారాన్ని పిండుతాడు” అన్నారు. ఇది వాస్తవ విషయం. “నాకన్నా వయసులో చిన్నవాడే కానీ సాహిత్య వ్యక్తిత్వంలో నాకన్నా పెద్దవాడు. తన వ్యాసాల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమని అడగటం మా మైత్రి బంధానికి ఒక గుర్తు కోసమే కానీ ఇంకేది కారణం కాదనుకుంటాను. ఈ మైత్రికి సాహిత్య చరిత్రలో చిరస్థాయి ఉంటుందని ఆశపడుతున్నాను” అంటూ పీఠికను ముగించారు. వ్యాస నిర్మాణ ప్రాధాన్యత తెలిసిన అనుభవశాలురు సుప్రసన్న గారనేది నా దృఢమైన ఉద్దేశ్యం. చేరాతలు ఎంత ప్రభావం చూపాయో మనకు తెలుసు.

ఇక మరొక కవి పండితులైన లక్ష్మణ మూర్తి గారు, ‘దర్పణం’ సంపుటికి ‘సౌమిత్రం’ అంటూ పీఠిక రాసారు. సుప్రసన్న గారి రచన శైలిని గురించి సాహిత్యం పట్ల వారికి ఉండే ఆలోచన గురించి చెబుతూ, “తన అభిప్రాయాల్ని వ్యర్ధ పదాలు లేకుండా, ఆవేశరహితంగా, అనాసక్తంగా, యధాదృష్టంగా, ప్రీతి, భీతి లేకుండా చెప్పడం సుప్రసన్న స్వభావం” అంటారు. ఈ సందర్భంలో సుప్రసన్న గారు రాసిన వ్యాసంలోని కొంత భాగాన్ని వీరు ఉటంకిస్తూ, సాహిత్యనంలో అనుపాధేయ లక్షణాన్ని ప్రస్తావిస్తూ ఇలా వ్రాశారు సుప్రసన్న గారని చెబుతూ, కావ్య లోకంలోని విభావ జగత్తు గురించి ఏమన్నారో వ్రాస్తూ,”స్వభావ జగత్తు రెండవ దానికి ఆధారమైనదే అయినా విభావ జగత్తుగా పరిణమించి గొంగళి పురుగు సీతాకోకచిలుక అయిన రీతిగా పరిణమిస్తుంది” అని అన్నారనేది వివరిస్తూ లోతైన భావనశక్తితో రచయిత స్పందన ఇంతలా ఉండేది” అని అన్నారు. సుప్రసన్న గారితో ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిచయాన్ని, సాహిత్య అనుబంధాన్ని చెబుతూ, “ఈ సుదీర్ఘమైన కాలంలో ప్రశ్నకు తాత్కాలికమైన సమాధానాన్ని ఇచ్చి అప్పటికప్పుడు తప్పుకోవడమో లేదా ప్రశ్నను నిరాకరించడమో సుప్రసన్న చేయగా నేను చూడలేదు. అది ఆయన స్వభావానికి విరుద్ధం. ప్రతి ప్రశ్న ఆయన్ను అంతర్ముఖుణ్ణి చేస్తుంది. దాన్ని మనోరణి లో మథించాలి. అది అర్చష్మత్తు కావాలి. ప్రకాశించాలి. మనసుని ప్రకాశింప చేసి, ఆత్మకు ఆనందాన్ని కలిగించి, సత్య ప్రత్యయాన్ని స్థాపించాలి. అప్పుడు గాని ఆయన ప్రశ్నకి సమాధానం సూచిస్తారు. ‘తపసా తద్విద్య జ్ఞాసస్య’ అంటారు”. సుప్రసన్న గారి నిష్టాగరిష్టమైన తత్వాన్ని ఇలా పీఠికలో రూపు కట్టించి మనకు చూపించారు లక్ష్మణ మూర్తి గారు. సుప్రసన్నగారి వ్యాస రచనా విధానంలో భాష అత్యంత కీలకమైన విషయం. వాక్య నిర్మాణం రచనా శైలికి మరింత వన్నె తెస్తుంది. ఇది మనం ప్రతి వ్యాసం లోనూ చూడగలం.

ఈ దర్పణం సంపుటిలో ‘సాహిత్య విమర్శ- సాహిత్య చర్చ’ అనే వ్యాసం నుండి మొదలుకుంటే.. శబ్దము రసము అనుభవము సాహిత్య చేతన రూపం బ్రతుకు కర్తవ్యం ఇస్తా వంటే 18 వ్యాసాల సంపుటి ఇది. ఈ వ్యాస సంపుటిలో ఎన్నో ప్రతిపాదనలు చేశారు ఎన్నో అంశాలను సాహిత్య పరంగా చర్చను లేవనెత్తారు. పుస్తక ప్రచురణ జాతీయ సాహిత్య పరిషత్ వారు చేయడము ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి అభిప్రాయాన్ని నాలుగు మాటల్లో రాస్తూ, “దాదాపు అర్థ శతాబ్దం ఆవరించిన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల సాహిత్య నిర్మాణమంతా – అది కవిత్వమైనా, విమర్శయైనా.. సమగ్ర జీవన దర్శనంలో నుంచి, భారతీయ తాత్విక సార సంగ్రహణలోంచి ఆవిష్కరించుకున్నదే. ఇప్పుడు వెలువరిస్తున్న ‘దర్పణం’, ‘సమర్చన’ ఆ తపస్సాధన ఫలితాలే” అన్నారు. ఈ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సుప్రసన్న గారి ఈ సాహిత్య వ్యాసాలు సాహిత్య విమర్శనా సిద్ధాంతాలకు ఒక చేర్పు వంటివే అని నొక్కి వక్కాణించవచ్చు.

సుప్రసన్న గారి పర్యవేక్షణలో 16 ఎమ్.ఫిల్.లు; 20 పి.హెచ్. డి. లు వచ్చాయి అంటే చిన్న మాట కాదు. ఎంతో మంది విద్యార్థులు. ఎన్ని పుస్తకాలు చదివారో! ఎన్ని పుస్తకాలు రాసారో! ఆనాడు వరంగల్ ఇంట్లో లైబ్రరీలో ఎన్నెన్ని గ్రంథాలు? మహారణ్యంలో తపస్సు చేసుకునే మునిలా సుప్రసన్న గారు!! సౌమ్యులుగా, సచ్చీలురుగా , సార్థకనామధేయులుగా సుప్రసన్నగారు సాహితీ బంధువులందరికీ పరిచితులు.

నేను ‘ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం’ అంశం పైన పరిశోధన చేస్తున్న సందర్భంలో వారిని కలవడం జరిగింది. కొన్ని రోజులు వారింటికి వెళ్ళాను. సంప్రదాయంలో ఆధునికం, ఆధునికతలో సంప్రదాయం రెండూ సమన్వయపరిచిన కవులుగా సోదరులూ, సుప్రసన్న గారు.. అందుకే కొన్ని విషయాలు చర్చించాను. వారిదైన విధానంలో వివరించారు. నేను పరిశోధన చేసిన పి.హెచ్.డి గ్రంథం ‘తెలంగాణ వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు సుప్రసన్న గారు ఆవిష్కరించారు.

చాలా విషయాలు చెప్పాలన్న ఉబలాటంతో చెప్పడం కాదు. సాహిత్య విషయం ఉన్నదీ అంటే ఎంతో బాధ్యతగా ఉంటారు అని చెప్పడానికి..!

సుప్రసన్న గారికి 1954 లోనే సాహితీ బంధు బృందం అనే సంస్థను పెట్టాలన్న ఆలోచన రావడం అనేది గొప్ప విషయంగా భావిస్తాను. ఇది కదా? సాహిత్య సేవా మార్గంలో వెళ్లడానికి దారులు వేసే ఆలోచన! వరంగల్ అంటేనే మిత్రమండలి మిత్రమండలి అంటేనే వరంగల్ కవితా లోకమని పేరు తెచ్చుకున్న మిత్రమండలిని 1957లో స్థాపించి నిరంతర సాహిత్య దీపన చేస్తూ వచ్చారు. రసధుని సంస్థను స్థాపించే వరకు వారి అనుభవ శాలిన్యతమంతా మరింత ధృడబడింది. మాదిరాజు రంగారావు గారు, మొదలి నాగభూషణ శర్మ గారు వంటి కవులతో సుప్రసన్న గారి మైత్రి పెరిగింది రచనోద్దీపన కారణమైందంటారు. విస్తృత పఠనం, లోతైన వివేచన వీటికి తోడైంది. ఏదైనా కార్యక్రమాన్ని నిశ్చయించుకున్నారంటే నిరంతరం సాగాలి.. అప్పుడే సార్ధకత సాధించుకుంటుందనేది వీరి ధ్యేయం. వీరు ఆరోజుల్లో జాతీయ సాహిత్య పరిషత్ లో సభ్యత్వం తీసుకున్నా, పోతన సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యులుగా ఉన్నా అది వారి లోని సాహితీ తృష్ణనే కారణం.

అరవిందుల తత్వాన్ని ఆకళింపు చేసుకొని, తమలోని అంతర్గత శక్తిని జాగృత పరుచుకొని, సాహిత్య రహస్యాలనూ కళాత్మకతను అక్షరబద్దం చేశారు. అటు సాహిత్యంలో నిలదొక్కుకున్న కవులను, ఇటు సాహిత్య విమర్శనాగ్రేసరులనూ చదివిన పరమ పాఠకులు , ఇటు భారతీయ లక్షణకారుల వివేచనలను ఔపోసన పట్టిన అనుభవజ్ఞులు అనేది వారి ఏ వ్యాసాన్ని చదివినా స్పష్టంగా తెలుస్తుంది.

సంప్రదాయ కళాభావాల అనుస్యూతిని భావితరాలకు అరటిపండు వలచి పెట్టినట్టు వారి రచనల ద్వారా అందించారు.

వర్ణన, రసజ్ఞత, సాహిత్య సమన్వయత దర్శించి, దర్శింప చేశారు. చాలామంది రచయితలు లోతుగా చదవరు, చదివినా వివరించలేరు. సుప్రసన్న గారిలో ఈ రెండు పుష్కలంగా ఉన్నాయి. శోధన, సాధన సాహిత్య సంబంధంగా ఉండడం చాలా అరుదుగా చూస్తాం. సంప్రదాయానురక్తులై, సామాజిక సమతుల్యత కాంక్షులై సుప్రసన్నమైన భావంతో జీవిస్తున్నారు..

“నేను జీవాన్ని, వృక్షాన్ని, ఫలాన్ని, రసాన్ని
నేను ఆవర్తాన్ని, బుద్బుదాన్ని, తరంగాన్ని
తథాగతము, తథాదృష్టము, తథా భావితము
నిత్యభావం కనిన స్వప్నము, అర్ధరాత్రి గర్భంలో..”

అంటూ రచించిన కవిత్వం చూస్తే తాము దర్శించిన జీవన తాత్త్వికతనూ, ఆధ్యాత్మిక అమృత వాహిని అర్థం చేసుకుని విశ్లేషణ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

తనలో సంవేదన శీలాన్ని పెంచుకోగలిగితే జగత్తులో చరాచరమైన ప్రత్యక్షము నిన్ను పలకరిస్తుంది పలకరిస్తుంది ఒడిసి పట్టుకుంటుంది తూర్పులతో స్పృశిస్తుంది అంటూ ఈ ప్రకృతిలో ప్రకృతిగా జీవించగలిగే జీవులకు సంవేదన శీలం ఉండవలసిన ఆవశ్యకతను చాటారు.

“ఒక్కొక్కప్పుడు నీవు లేవనుచు నేనున్నానటంచెంచెదన్
ఒక్కొక్కప్పుడు నేను లేవనుచు నీవున్నా వటంచెంచెదన్
ఒక్కొక్కప్పుడు నీవు నేనొకటియే యోగంబటంచెంచెదన్
ఒక్కొక్కప్పుడు తండ్రి బిడ్డల మటంచూహింతు సర్వేశ్వరా!”

అని తమ హృద్గీతిలో సూచించిన సుప్రసన్న గారు ఎన్నో జీవితాంశాలను ప్రోది చేస్తూ అద్భుతమైన పద్యాలను రచించారు. ఇంతటి అనుభవంలో నుండి వచ్చిన భావపరంపర ఇది.

“ఈనాటి బ్రతుకులో వేగం, ఒత్తిడి, అనుస్థితి, అభద్రత, విశ్వాస రాహిత్యం జీవితాన్ని శుష్కంగా చేస్తున్నవి. తల్లిదండ్రులు, సోదరులు, కుటుంబం, గ్రామం ఇలా ఆత్మీయ పరిమితులు తొలగిపోతున్నాయి. దారం తెగిన పతంగి లాగా ఉంది స్థితి” అని రాసారు ఓ చోట. ఈ మాటలు ఏనాడో చెప్పారు. క్రాంతి దర్శకుడు కవి అనడానికి నిదర్శనంగా వారి ఈ భావాలను ఉదహరించుకోవచ్చు.

తొంభై వసంతాలు చూసొచ్చిన కవి పండితులు సుప్రసన్న గారికి వేనవేల నమస్కారాలతో హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

Exit mobile version