[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘వ్యూహ రచనయే విజయానికి మూలము..’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
ముందర రాజుఁ బుచ్చి, బలముల్ గలయంబడి గోవ్రజంబులన్
దందడి బెట్టకుండఁ బిఱుఁదన్ నడిపింపఁగఁ బంచి, గట్టి మై
నందఱు నింతకున్ వెనుకయై మొనలేర్చి చనంగ, నెపుడు సం
క్రందన సూతి దగ్గఱియెఁ, కయ్యము సేయుట కప్పు డిమ్మగున్!
(మహాభారతము – విరాటపర్వము – 4-184)
విరాటపర్వములో విరాటరాజుకు చాలాకాలంగా రక్షణగా నున్న సింహబలుడు అనబడే కీచకుడు మరణించాడనే విషయం తెలుసుకున్న కౌరవులు.. ఆ రాజ్యంలోనే పాండవులు అజ్ఞాతవాసాన్ని గడుపుతున్నారని అనుమానించారు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తే పాండవులు తిరిగి 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది కాబట్టి వారి అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయాలనే భావనతో వ్యూహం రచించుకున్నారు. ఆ వ్యూహానుగుణంగ కౌరవులు విరాటరాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న ఆవులను పట్టుకున్నారు. వాటిని రక్షించేందుకు పాండవులు వస్తే వారిని గుర్తించి తిరిగి అడవులలోకి పంపాలనేది వారి అభిప్రాయం.
గోవులను విడిపించేందుకు విరాటనగరంలో బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరుని సారథిగా చేసుకొని కౌరవసైన్యంపైకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుని గుర్తించిన దుర్యోధనుడు గడువులోపల అర్జునుడు బయటకు వచ్చాడని చెప్పగా భీష్ముడు పాండవుల అజ్ఞాతవాసం ‘నిన్నటి’తో తీరిపోయిందని చెపుతాడు. ఎలాగూ గోగణాన్ని పట్టుకున్నాము కాబట్టి దానిని హస్తినాపురానికి తరలించడమూ, అర్జునుని బారినుండి దుర్యోధనుని రక్షించడం లక్ష్యాలుగాద్రోణుడు ఒక వ్యూహాన్ని రచిస్తాడు.
ద్రోణుడు అంటాడు.. మొట్టమొదట రాజును (దుర్యోధనుని) పంపించి, అతని వెంట సైన్యంలో నాలుగవ భాగాన్ని పంపాలి. ఆపై నాలుగవ వంతు సైన్యం, ఆవులమందను ఆర్భాటంగా చెదరిపోనీయకుండా, గోపాలురను భయపెట్టకుండా వాటి వెనుక నడిచే విధంగా నియమించాలి. ఆ తరువాత, తక్కిన సగభాగం సైన్యంతో చేయగలిగిన యోధులు వ్యూహంగా ఏర్పడి నెమ్మదిగా వెళుతూ ఉంటే.. అర్జునుడు ఎక్కడ ఎదురై అడ్డుకుంటే అక్కడ అతనితో యుద్ధం చేయాలి. దానితో దుర్యోధనుడు క్షేమంగా రాజధానికి చేరుకుంటాడు.. ఆవుల మందలూ పట్టణానికి చెదిరిపోకుండా చేరుకుంటాయి. అర్జునుడు ఎదిరించినా అటు దుర్యోధనుని చేరలేడు, ఇటు ఆవుల మందనూ చేరలేడు. కాబట్టి ఉభయతారకంగా లక్ష్యాన్ని చేరవచ్చుననేది ద్రోణుడి వ్యూహం. ఆ సైనిక వ్యూహంలో మధ్యలో ద్రోణుడు, కుడిపైపు కృపుడు, ఎడమ వైపు అశ్వత్థామ, ముందర కర్ణుడు ఉండగా.. మిగిలిన యోధులందరూ ఎక్కడెక్కడ ఉచితమో అక్కడ నిలిచే విధంగా ఏర్పాటుచేసాడు. భీష్ముడు సేనకు వెనుక భాగాన నడుస్తూ.. హస్తినకు బయలుదేరారు. అనుభవజ్ఞుడైన సేనాధిపతిగా భీష్ముడు, శత్రువు (అర్జునుని) సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేదు. అర్జునుడి ఆలోచనలను ముందుగానే గ్రహించాడు. సైన్యాధ్యక్షునిగా రాజును రక్షించడమే మొదటి కర్తవ్యమని భావించాడు, తదనుగుణంగా సైన్యాన్ని నడిపించాడు.
సైన్యాన్ని మూడు పొరలుగా విభజించి పంపడం వల్ల ఒక పొరను ఛేదించ గలిగినా లక్ష్యాన్ని చేరడం అంత సులువుకాదు. ఇది ఈనాటి సైనిక వ్యూహ రచనలో కూడా రక్షణ వలయాలుగా నిర్మించడం కనిపిస్తుంది.
నిజానికి ఇందులో ద్రోణుడి వ్యూహరచనా నైపుణ్యం విశదమౌతుంది. రాజు లేదా నాయకుని రక్షణ అత్యంత ప్రాధాన్యతాంశం. యుద్ధంలో రాజు పట్టుబడినా, మరణించినా ప్రయత్నం వృథా అయినట్లే. రాజు వెంట రక్షణగా కొంత సైన్యం ఉంటుంది.. అర్జునుడు దుర్యోధనుని చేరినా ఆ సైన్యం రాజును కాపాడుతుంది. అంతలో యోధులందరూ అక్కడకు చేరుకుంటారు. తదుపరి గోగణము. వచ్చిందే గోగణాన్ని పట్టుకునేందుకు. ప్రయోజనం లేని గోగ్రహణ యాత్ర ఏందుకు? కాబట్టి దానినీ రక్షించుకోవాలి. ఇక మహావీరులంతా వాటి వెనుక.. వారితో యుద్ధంలో అర్జునుడు అలసిపోతాడు, ఆలస్యం అవుతుంది. ఈ లోగా హస్తినకు రాజు, ఆవుల మందా చేరుకుంటుంది.. రాజధానికి చేరుకున్నాక అర్జునుడు వారిని ఒంటరిగా ఎదిరించడం అసంభవం. ఇది గురువైన ద్రోణుని ఉపాయం.
దానికి దుర్యోధనుడు, అజ్ఞాతవాస సమయం అర్జునుడు రావడం వల్ల భంగమైనది కాబట్టి వారు తిరిగి అడవులకు వెళ్లాలని చెపుతూ భీష్ముని ఆ నిర్ణయం చేయమని అడుగుతాడు. భీష్ముడు సమయాన్ని గడియించి, అజ్ఞాతవాసం ‘నిన్నటి’ వరకు సరిపోయిందని చెపుతాడు. దానికి దుర్యోధనుడు, అర్జునుడే కాదు దేవతలు వచ్చినా, ఆవులను పట్టుకున్నాము.. అందరమూ సమష్టిగా పౌరుషాన్ని ప్రదర్శిద్దాము. అంటూ అందరినీ ఉత్సాహపరుస్తాడు. ఒంటరిగా వచ్చిన అర్జునుడు అంత పెద్ద సేనను ఎదిరించలేడని దుర్యోధనుని భావన, నమ్మకం కూడా.
అర్జునుడు కూడా రెండు క్రోసుల దూరం నుండే ఆ వ్యూహాన్ని, సైనిక ప్రణాళికను గమనించి, రాజులేని సేనతో అనవసరమైన యుద్ధానికి దిగకుండా రాజును పట్టుకోవడమే లక్ష్యంగా అతడిని కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా సారథియైన ఉత్తరునితో సైన్యానికి ఎడమ ప్రక్కకు పోనిమ్మని చెపుతున్నాడు. ఇది అర్జునుని బుద్ధి సూక్ష్మతకు ప్రణాళికా రచనా సామర్ధ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాజు చిక్కితే బలము అంతా పారిపోతుంది.. ఆవులను మరల్చడం సులువవుతుంది. ఒకవేళ రాజు కనిపించక పోయినా ఆవులను మరల్చుకొని వెళ్ళవచ్చు. ఇదీ అర్జునుని ప్రణాళిక. సైన్యాన్ని జయించే అవసరం లేదు. సైన్యానికి ప్రాణమైన నాయకుడిని పట్టుకుంటే చాలు.. సైనికుల మనోధైర్యం తగ్గిపోతుంది. విజయం అయాచితంగానే సిద్ధిస్తుంది. ఇదీ అర్జునుని ప్రతివ్యూహ రచనా పాటవం. ఈనాడు కూడా వ్యూహం పన్నేప్పుడు ఏది ముఖ్యమైనదో, ఏది అత్యంత సున్నితమైనదో దానిని ఛేదించే వ్యూహాన్ని రచించుకుంటారు.
అర్జునుని ప్రణాళికను అర్థం చేసుకున్న భీష్ముడు, రాజుకు మనకు మధ్యన అర్జునుడు చొరబడితే దుర్యోధనుని కాపాడడం కష్టమౌతుంది. కాబట్టి అందరూ త్వరపడి దుర్యోధనుని వద్దకు సాగిపోవాలని సూచిస్తాడు. దుర్యోధనుడు అర్జునునికి చిక్కితే ఆవులు దక్కినా, మరే సంపద దక్కినా ప్రయోజనం ఉండదు కదా..
అర్జునుడు కూడా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాడు.. దుర్యోధనుని పట్టుకోవడం, ఆవుల మందను మళ్ళించడం అతని ముందున్న లక్ష్యాలు. తదనుగుణంగా భీష్మ ద్రోణులను ఎదిరిస్తే లక్ష్యం చేరడం ఆలస్యం అవుతుందని, వారికి దూరంగా రథాన్ని మిగిలిన రథికుల వైపు మళ్ళించమని చెపుతాడు, సారథితో.
ఆ యుద్ధంలో అర్జునుడు మోహనాస్త్రాన్ని ప్రయోగించి అందరినీ మూర్ఛలో ముంచుతాడు. నిజానికి ఆతడు తలచుకుంటే వేలమందిని ముఖ్య యోధులతో సహా చంపవచ్చు. కానీ అర్జునుడు శత్రువును సంహరించకుండా, వారి యుద్ధ సామర్థ్యాన్ని మాత్రమే నిలిపివేసాడు. ఎందుకు? అంటే.. అతని లక్ష్యం ‘విజయ’ సాధన మాత్రమే కాని, ‘విధ్వంసం’ కాదని స్పష్టమౌతున్నది. తానెదిరించే మహాయోధులలో భీష్ముడు అర్జునునికి తాత.. అతని రక్షణలో పెరిగినవాడు, కాబట్టి అతనిని సంహరించడు. భీష్ముడూ అర్జునుని చేతిలో మరణించడు. కృపాచార్యుడు.. చిన్ననాటి గురువు.. అలాగే ద్రోణుడు అతనికి అత్యంత ఆదరణియుడైన గురువు. అలాగే దుర్యోధనుని వధించేందుకు భీముడు ప్రతిజ్ఞ చేసియున్నాడు. కాబట్టి వీరిని ఎవరినీ తాను చంపాలని భావించడం లేదు.. వారిని జయించాలి.. తన శక్తిసామర్థ్యాలు దుర్యోధనునికి తెలియచెప్పాలి. తదుపరి దుర్యోధనుని అర్జునుడు అవమానించడం, భీష్ముని సూచనపై దుర్యోధనుడు యుద్ధాన్ని విరమించి హస్తినకు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ద్రోణుడిది లక్ష్యానికి ఆధారమైన వ్యూహం.. రక్షణ ప్రధానమనే భావన. ఓడిపోవద్దని చేసే యుద్ధానికి ప్రతీక. భీష్మునిది ఆచరణాత్మకమైన వ్యూహం.. అర్జునునిది సమయానికి ప్రాధాన్యత నిస్తూ.. అనవసరంగా మారణకాండను సృష్టించడం కన్నా ముఖ్యులను జయించాలనే ఉదాత్త భావన. అర్జునునిది ‘గెలవాలనే భావనతో చేసే యుద్ధానికి’ ప్రతీక. అంతేకాదు, అటు ద్రోణుడు కాని ఇటు అర్జునుడు కాని గుర్తించింది వారి వారి ప్రాధాన్యతలను మాత్రమే.
ఈ సన్నివేశం మనకు బోధించే పాఠం.. సంఖ్యాబలం కన్నా ఉత్సాహవంతమైన నాయకత్వం, విజ్ఞానంతో కూడిన నైపుణ్యం, సమయస్ఫూర్తి మాత్రమే విజయానికి మూలాధారాలు. నిజానికి ఈ ఘట్టం ఆయుధబలాని కన్నా ఇరువురు సమర్థులైన వ్యూహకర్తల మధ్య జరిగిన మేధకు సంబంధించిన వ్యూహ పోరాటం ఎలా ఉంటుందనే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నది. ఈ విధానంలో సైన్యాధిపతిగా భీష్ముని దూరదృష్టి, ద్రోణుని వ్యూహరచన సామర్ధ్యం ప్రశంసార్హములే, అయినా అర్జునుని అసాధారణ ప్రతిభ, దివ్యాస్త్ర సామర్థ్యం, వేగవంతమైన నిర్ణయశక్తి వల్ల భీష్మద్రోణుల వ్యూహాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి, అనుకోవచ్చు.
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.
