[పోర్టర్ వాగొనర్ పాడిన ‘వాట్ ఆంట్ టు బీ, జస్ట్ మైట్ హాపెన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- పోర్టర్ వాగొనర్ – ‘వాట్ ఆంట్ టు బీ, జస్ట్ మైట్ హాపెన్’ (1972)
- ఆల్బమ్ – వాట్ ఆంట్ టు బీ, జస్ట్ మైట్ హాపెన్
- ప్రొడ్యూసర్ – బాబ్ ఫర్గుసన్
- రచన – పోర్టర్ వాగొనర్
~
పోర్టర్ వాగొనర్ కంట్రీ మ్యూజిక్‌లో ఎంతో గౌరవాన్ని పొందిన గాయకుడు. ఈయన ప్రభావంతో ఈ శైలిలో గాయకులు అయినవారెందరో ఉన్నారు. పోర్టర్ పాటలను స్వయంగా రాసుకుని బాణీలు కట్టి గానం చేసేవారు. అప్పటి అమెరికన్ టెలివిజన్‌లో ఈయన కార్యక్రమానికి ఎంతో ప్రజాదరణ ఉండేది. డాలీ పార్టన్‌ను సంగీత ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఈయనే. ఈయన పాటలు చాలా వరకు భగ్నప్రేమ, ఒంటరితనాన్ని, ప్రేమలో మోసాన్ని గురించి సాగుతాయి. మరో పక్క గాస్పల్ పాటలు అంటే క్రైస్తవ భక్తిగీతాలు, తాత్విక గీతాలనూ ఆయన పాడి ఆనాటి సాంప్రదాయ అమెరికా ప్రజల అభిమానాన్నీ సంపాదించుకున్నారు.
జీవితంలో కష్టాలు వస్తాయి, ఆశాభంగాలు తప్పవు. కాని మనం ఊహించని విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏది జరిగినా దాన్ని ఆహ్వానిస్తూ మనలని పరిస్థితులకు అనుకూలంగా మలచుకుంటూ మనసుకు విషాదం అంటకుండా, అంటినా అది పూర్తిగా ఆక్రమించకుండా జీవించాలంటాడు గాయకుడు. జీవించడం ఒక కళ అని దాన్ని అభ్యసించి ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ గీతం. దీని సంగీతం కూడా చాలా ఉత్సాహవంతంగా సాగుతుంది. పార్టర్ గొంతులో రికార్డయిన ఈ పాటను వింటే ఆయన గాత్రం అన్ని రకాల రసాలను పలికించగలదని రుజువవుతుంది.
I’ve learned to live my life just a little bit lighter
Gonna look on the lonely days a little bit brighter
My heart’s been throwed around it ain’t done enough laughin’
What is to be will be what ain’t to be just might happen
(నేను నా జీవితాన్ని కాస్త తేలికగా తీసుకుని బ్రతకడం నేర్చుకున్నాను. ఇక రాబోయే ఒంటరి రోజులను కొత్త వెలుగుతో ఎదుర్కుంటాను. నా హృదయం ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. నేను కావల్సినంతగా నవ్వుకోలేదు కూడా. జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడదనుకున్నది కూడా జరిగిపోవచ్చు.)
It don’t do no good (no good, no good) to worry none (worry none)
Just turns your hair grey while you’re still young
Love can make you sing start your hands a clappin’
What is to be will be what ain’t to be just might happen
(అన్నిటికీ అలజడికి లోనవుతూ ఉండడం ఎవరికీ మంచి చేయదు. వయసుండగానే జుట్టు తెల్లబడిపోవడం తప్ప ఏం జరగదు. ప్రేమ మాత్రం నిన్ను పాడిస్తుంది, ఆడిస్తుంది. జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడదనుకున్నది కూడా జరిగిపోవచ్చు.)
లేనిపోని అనుమానాలు, భయాలతో జీవితం రసహీనం చేసుకోకూడదని అతనికి అర్థం అయింది. వయసుకు ముందే వృద్దాప్యం రావడం తప్ప దీనితో జరిగే మంచేమీ లేదని చెబుతూ, ఈ భయాలను వదిలి ప్రేమను ఆహ్వానించగల స్థితిలో ఉండిపోవడం ఒక్కటే మనిషి చేయవలసిన పని అని అంటున్నాడు కవి. ఏదెలా జరగాలో అదే జరుగుతుంది. దేన్నీ ఆపలేం. రాబోయే రోజులెలా ఉండాలని నిర్ణయించబడి ఉన్నాయో, అలాగే ఉంటాయి. అనవసర ఆందోళన దేన్నీ మార్చదు.
You can’t never tell when love might find you
Could be miles away or right beside you
Some makes you hurt real bad some makes you happy
What is to be will be what ain’t to be just might happen
(ప్రేమ నీకు ఎప్పుడు లభిస్తుందో నువ్వు ఎప్పుడూ చెప్పలేవు. అది ఎంతో దూరాన ఉండవచ్చు, లేదా నీ పక్కనే నిలిచి ఉండవచ్చు. కొన్ని సార్లు అది లోతుగా గాయం చేయవచ్చు, కొన్ని సార్లు అంతులేని ఆనందాన్నీ అందించవచ్చు. అందుకే జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడదనుకున్నదీ జరిగిపోతుంది.)
జీవితంలో మనిషిని నడిపించేది ఆశ మాత్రమే. ఎన్నో విషాదాల నడుమ మనిషికి ఆశ నుండే శక్తి పుడుతుంది. దాన్ని సజీవంగా నిల్పుకోగల మానవులు జీవితాన్ని ఎదుర్కోవడానికి భయపడరు. అందుకే ఈ గాయకుడు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. అది విషాద ఆనందాల సంగమం అని, కొన్ని సందర్భాలలో అంతులేని వేదనను మోసుకువస్తుందని తెలిసి కూడా దానికై ఎదురుచూస్తున్నాడు. విషాదం ఎదురవుతుందేమో అనే భయంతో జీవితంలో ఆనందానికి దారి లేకుండా అన్ని తలుపులు మూసుకుని కూర్చోనని, మనసులోని ఆశను వాడనివ్వనని ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ భవిష్యత్తు వైపుకు నడుస్తున్నాడు కవి.
It don’t do no good (no good, no good) to worry none (worry none)
Just turns your hair grey while you’re young
Love can make you sing start your hands a clappin’
What is to be will be what ain’t to be just might happen
(అన్నిటికీ అలజడికి లోనవుతూ ఉండడం ఎవరికీ మంచి చేయదు. వయసుండగానే జుట్టు తెల్లబడిపోవడం తప్ప ఏం జరగదు. ప్రేమ మాత్రం నిన్ను పాడిస్తుంది, ఆడిస్తుంది. జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడదనుకున్నది కూడా జరిగిపోవచ్చు.)
ఈ పాట విశేషం ఏమిటంటే, ఇది కవితలా సాగిపోతుంది. చరణం, పల్లవుల పద్దతిలో కాకుండా ఒక సంపూర్ణ కవితలా గానం చేస్తారు పోర్టర్. సాదారణంగా పాటలో పల్లవి ప్రతి చరణం తర్వాత వస్తూ ఉంటుంది. కాని ఈ పాటలో పై చరణం రిపీట్ అవుతుంది. నృత్య గీతాలలో కనిపించే శైలి ఇది. పైగా ఓ చరణం ఈ పాట ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది.
I had a love one time sent me out on a ledge
Fourteen stories high standin’ on the edge
I don’t want that kind no more to start my world a crackin’
What is to be will be what ain’t to be just might happen
(నేను గతంలో ఒక ప్రేమానుభవాన్ని పొంది చావు దాకా వెళ్ళాను. పద్నాలుగు అంతస్తుల పై భాగాన ఆ అంచు దాకా వెళ్లాను. అలాంటి మరో అనుభవం పొంది నా ప్రస్తుత ప్రపంచాన్ని ముక్కలు చేసుకోవాలని నాకిప్పుడు కోరికేమీ లేదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. జరగకూడదిని, జరగదనుకునేది జరిగిపోవచ్చు)
పోర్టర్ భగ్నప్రేమికుడి గొంతుకగా మారి ఎక్కువ గీతాలు రాసారు. ఇదీ అదే స్థాయిలో రాసిన గీతమే. కాని ఆ విషాదాన్ని స్వీకరించిన పద్ధతిలో ఇక్కడ తేడా కనిపిస్తుంది. తాను గతంలో ఒక ప్రేమానుభవాన్ని పొందానని, కాని అది తనను ఆత్మహత్య వరకు తీసుకుని వెళ్ళిందని, అంతులేని హింసను, వేదనను సహించి భరించానని, అలాంటి మరో అనుభవం కోసం తాను చూడట్లేదని కవి చెప్తున్నాడు. ప్రేమలో ఓడినా ఇతనిలో ప్రేమ పట్ల ఆశ, కోరిక, ఉత్సాహం చావలేదు. ఆ అనుభవం బాధించినా, అది ద్వేషంగా మారలేదు. అలాంటి అనుభవం త్వరత్వరగా మరో సారి అనుభవించాలనీ అతనికి లేదు. ప్రేమ కోసం ఎదురు చూస్తాను కాని గత అనుభవం నుండి నేర్చుకున్న పాఠాన్ని గుండెకు అద్దుకుంటూ సరికొత్త ప్రేమ కోసం, మార్పుకోసం ఎదురు చూస్తూ ఉంటానని అంటున్నాడు కవి.
It don’t do no good (no good, no good) to worry none (worry none)
Just turns your hair grey while you’re still young
Love can make you sing start your hands a clappin’
What is to be will be what ain’t to be just might happen
What is to be will be what ain’t to be just might happen
(అన్నిటికీ అలజడికి లోనవుతూ ఉండడం ఎవరికీ మంచి చేయదు. వయసుండగానే జుట్టు తెల్లబడిపోవడం తప్ప ఏం జరగదు. ప్రేమ మాత్రం నిన్ను పాడిస్తుంది, ఆడిస్తుంది. జరగాల్సింది జరిగి తీరుతుంది, జరగకూడదనుకున్నది కూడా జరిగిపోవచ్చు.)
తాను ఇక జీవితాన్ని అనుభవిస్తానని, వీలయినంత ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తానని, ప్రేమను నమ్ముతూనే అది నేర్పిన జీవితానుభవంతో దాన్ని మరో సారి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటూ ఈసారి ఏ మాత్రం తొందర చూపకుండా తెలివిగా నడుచుకుంటానని కవి చెప్తూ ఈ చరణాన్నితిరిగి గానం చేస్తారు. ఈ చరణంలో వినిపించే కోరస్ చాలా బావుంటుంది. పాటను కొత్త ఉత్సాహంతో నింపుతుంది. వ్యక్తిగతంగా పోర్టర్ గానం చేసిన పాటలన్నిటిలో నేను చాలా ఇష్టపడే పాట ఇది. పోర్టర్ గొంతులో వినిపించే ఆ ఉత్సాహం, జీవితం పట్ల ఆశను కలిగిస్తూ ఆయన స్వరంలో తొణికిసలాడే ఆ ఎనర్జీ చాలా బావుంటుంది.
పాటను వినదల్చుకున్న పాఠకుల కోసం యూ ట్యూబ్ లింక్ ఇది –
https://www.youtube.com/watch?v=TCT5f7qqNT8