[కీత్ విట్లీ పాడిన ‘వెన్ యూ సే నథింగ్ ఎట్ ఆల్’ అనే పాటను విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కీత్ విట్లీ – వెన్ యూ సే నథింగ్ ఎట్ ఆల్
- ఆల్బమ్ – Don’t Close Your Eyes (1988)
- రచన – పాల్ ఓవర్‌స్ట్రీట్, డాన్ ష్లిట్జ్ (1988)
~
ఈయన జీవించి ఉండగా మూడు ఆల్బంలు విడుదలయితే మరణించాక మరో మూడు రిలీజ్ అయ్యాయి. 2000లో రిలీజ్ అయిన ‘సాడ్ సాంగ్స్ అండ్ వాల్ట్జస్’ అల్బం ఆఖరిది. విట్లీ అంతకు ముందు రికార్డ్ చేసిన పాటలను ఈయన మరణానంతరం మూడు ఆల్బంలలో పొందుపరిచారు. 1988లో మరణించిన ఓ కళాకారుని పాటలను ఆల్బంగా 2000లో కూడా రిలీజ్ చేయగలిగారంటే ఈయనకు కంట్రీ మ్యూజిక్‌లో ఉన్న అభిమానులెంత మందో అర్థం అవుతుంది. జీవించినప్పటికన్నా మరణానంతరం ఎక్కువ పాటలు రిలీజ్ అయిన కంట్రీ గాయకుడు కూడా ఈయనే. 2022లో, విట్లీకి కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది.
రోనాన్ కీటింగ్ పాడిన ఈ పాట ‘నాటింగ్ హిల్’ చిత్రానికి సౌండ్‌ట్రాక్ కోసం రికార్డ్ చేసారు. అలాగే అది కీటింగ్ తొలి సోలో ఆల్బమ్ ‘రోనన్’లో కూడా కనిపించింది. ఈ కవర్ జూలై 26, 1999న యునైటెడ్ కింగ్డమ్లో విడుదలైంది. ఈ సింగిల్ UKలో డబుల్ ప్లాటినం, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్లలో ప్లాటినంగా ధృవీకరించబడింది. ఇప్పటికీ ఎన్ని ఇంగ్లిష్ ప్రేమ గీతాల సంకలనాలు వచ్చినా అందులో తప్పకుండా ఉండే గీతం ఇది.
రోనాన్ కీటింగ్ గీతం కంట్రీ పాప్గా వినిపించి ఎంతో ప్రజాదరణ పొందినా, ఒరిజినల్ కీత్ విట్లీ పాటను ఎక్కువగా ఇష్టపడతారు విశ్లేషకులు. రోనాన్ కీటింగ్ ఈ పాటకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. అయితే పాపులారిటీని పక్కన పెట్టి రెండు పాటలను వింటే కీత్ గానంలోని లోతు, పదాలను ఆయన పలికించిన తీరు మనసును హత్తుకుంటుంది. కీత్ పాటలో అనుభూతి ప్రధానమైన మౌన సాన్నిహిత్యం, ఆయన గానంలో అనుభవంలోకి వచ్చే ఆ సంయమనం ఈ పాటకు ఒక మార్మికతను, లోతును ఆపాదిస్తాయి. హృదయం నుండి ఆయన గానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక గొప్ప నిజాయితీ ధ్వనిస్తుంది. ఈ రెండు పాటలు నా కిష్టమే అయినా ఒంటరిగా ఉన్నప్పుడు కీత్ విట్లీ వెర్షన్ వినడం చక్కని అనుభూతి. మన చెవిలో మన కోసమే ఆయన పాడుతున్నట్లు, ఎవరినీ దేన్ని పట్టించుకోకుండా తన హృదయాన్ని విప్పి చెప్తున్నట్లు ఉంటుంది కీత్ గానం. ఏ వాద్య పరికరాలు లేకుండా కేవలం గిటార్ మీటుతూ కీత్ గొంతు మంద్రంగా పలుకుతూ మనల్ని మరో లోకానికి తీసుకెళుతుంది.
It’s amazing how you can speak right to my heart
Without saying a word you can light up the dark
Try as I may I could never explain
What I hear when you don’t say a thing
(నువ్వు నా హృదయంతో నేరుగా ఎలా మాట్లాడగలవో నాకెప్పటికీ ఆశ్చర్యకరమే. ఒక్క పదం పలకకుండానే, చీకట్లో వెలుగులు నింపగలవు. నువ్వు ఒక్క మాట మాట్లాడకపోయినా, నేనేం వింటుంటానో ఎంత ప్రయత్నించినా వివరించలేనే)
ఎంత గొప్ప వ్యక్తీకరణ ఇది. ఆ ప్రేమ జంట నడుమ ఎంత గొప్ప అనుబంధం ఏర్పడిందో అతను వివరిస్తున్నాడు. ఆమెను అతను ఎంతలా ప్రేమించాడంటే ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినా అతనికి ఎన్నో అర్థం అవుతున్నాయి. ఆ మౌనమే అతనికి ఎన్నో విషయాలకు తెలియజేస్తుంది. ఆమె మౌనంతో చేసే సంభాషణ అతనికి మాత్రమే చేరుతుంది. ఆ విషయాలను వివరించడానికి ఆ సంభాషణ సారాన్ని తెలపడానికి అతనికి శక్తి సరిపోదట. ఎంత ప్రయత్నించినా ఆ భావాలను పదాలుగా అతను మార్చలేడట. అతని హృదయంతో నేరుగా మాట్లాడగల ఆమె శక్తికి అతను ఆశ్ఛర్యపోతూ ఈ మౌన భాష తనను చేరడంలోని అద్భుతాన్ని ఆస్వాదిస్తున్నాడు.
The smile on your face lets me know that you need me
There’s a truth in your eyes saying you’ll never leave me
A touch of your hand says you’ll catch me if ever I fall
Yeah, you say it best
When you say nothing at all
(నీ వదనంలో చిరునవ్వు నా అవసరం నీ కున్నదని సూచిస్తుంది. నీ కళ్ళలోని నిజాయితీ, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్లవని చెబుతోంది. నీ చేతి స్పర్శ నేనెప్పుడు పడబోయినా, నువ్వు పట్టుకుంటావనే నమ్మకాన్ని ఇస్తుంది. అవును నువ్వు ఏం చెప్పనప్పుడే గొప్పగా సంభాషిస్తావు.)
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే వాక్యాలు ఇవి. ప్రేమలో ఉన్నప్పుడు, ఒకరికొకరు అర్థం అయిన జంటకు మాటలతో ఎక్కువ పని ఉండదు. వారి ఉనికి తోనే వాళ్లు ఎంతో సంభాషించగలరు. నిజానికి చెప్పకుండా తెలుసుకోగలగడమే ప్రేమ కదా. వాగ్దానాలు, వివరణలు, ప్రశ్నలు, జవాబులు ఇవన్నీ అపనమ్మం, అవగాహనలేమికి సూచనలే. ఇవేమీ లేకుండా ఒకరికి ఒకరు భరోసా ఇవ్వగలగడమే సంపూర్ణంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అది ఈ వాక్యాలలో ఆ జంట అనభవించే దగ్గరితనంలో కనిపిస్తుంది. కీత్ ఈ వాక్యాలను గానం చేసే విధానం చాలా బావుంటుంది. ఒక గొప్ప నమ్మకం, ధైర్యం ఆ వాక్యాలలో వినిపిస్తూ ఉంటుంది.
All day long I can hear people talking out loud
But when you hold me near you drown out the crowd
Old Mister Webster could never define
What’s being said between your heart and mine
(రోజంతా జనం బిగ్గరగా మాట్లాడుకోవడం నాకు వినిపిస్తూ ఉంటుంది. కాని నన్ను నువ్వు దగ్గరగా పొదుపుకున్నప్పుడు ఆ జనసమూహాన్నంతా ముంచేస్తావు. ఆ ముసలి మిస్టర్ వెబ్‌స్టర్ కూడా నీ మనసు, నా మనసు నడుమ జరుగుతున్నఈ సంభాషణను నిర్వచించలేడు కదా)
ఆమె దగ్గర లేనప్పుడు అతనికి అందరూ మాట్లాడుకునే మాటలు బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయట. కాలగ ఆమె అతన్ని హత్తుకున్నంతలో అన్ని శబ్దాలు మాయమయిపోతాయి. వారిద్దరూ ఒక ప్రత్యేకమైన లోకంలో విహరిస్తారు. ఆ ముసలి వెబ్‌స్టర్‌కి కూడా ఈ మౌన సంభాషణ వివరించడం సాధ్యం కాదట.
ఇక్కడ ఈ వెబ్‌స్టర్ ఎవరా అన్నది నాకు చాలా రోజులు అర్థం కాలేదు. చివరకు కనుక్కుంటే ఆ పాట రాసినవారి చమత్కారానికి నవ్వు వచ్చింది. ఈ పాటలో ప్రస్తావించిన వెబ్‌స్టర్ ‘మెరియం వెబ్‌స్టర్ ఇంగ్లిష్ డిక్షనిరీ’ తయారు చేసిన ‘నోహా వెబ్‌స్టర్’. అంటే అంత పెద్ద డిక్షనరీని తయారు చేసి ఇంగ్లిష్ భాషలోని అన్ని పదాలను నిర్వచించిన వెబ్‌స్టర్‌కు కూడా ఈ మౌన ప్రేమ సంభాషణ నిర్వచించే శక్తి ఉండదట. అమాయకత్వం, అపారమైన నమ్మకం కలగలసిన ఈ ప్రేమ వ్యక్తీకరణలో ఒక గొప్ప అందం ఉంది. అందుకే ఇది చాలా మందికి దగ్గరయిన ప్రేమ గీతం.
The smile on your face lets me know that you need me
There’s a truth in your eyes saying you’ll never leave me
A touch of your hand says you’ll catch me if ever I fall
Yeah, you say it best
When you say nothing at all
The smile on your face lets me know that you need me
There’s a truth in your eyes saying you’ll never leave me
A touch of your hand says you’ll catch me if ever I fall
Yeah, you say it best
When you say nothing at all
(నీ వదనంలో చిరునవ్వు నా అవసరం నీ కున్నదని సూచిస్తుంది. నీ కళ్ళలోని నిజాయితీ, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్లవని చెబుతోంది. నీ చేతి స్పర్శ నేనెప్పుడు పడబోయినా, నువ్వు పట్టుకుంటావనే నమ్మకాన్ని ఇస్తుంది. అవును నువ్వు ఏం చెప్పనప్పుడే గొప్పగా సంభాషిస్తావు.)
ఈ చరణం రెండు సార్లు మళ్లీ మళ్లీ వస్తుంది. నిజానికి ఈ పాటకు ఈ ఒక్క చరణమే ప్రాణం. దీన్ని కీత్ ఒక ట్రాన్స్‌లో ఉన్నట్లుగా పాడతాడు. ఆయన గొంతులోని ఆ సంయమనం, ఆ స్వరనియంత్రణ మరో లోకానికి తీసుకెళతాయి. ఆ ఆత్మీయ ప్రేమానుభవపు ఆనందాన్ని మనమూ కాసేపు అనుభవిస్తాం. అందుకే ఎంత మంది ఈ పాటను గానం చేసినా కీత్ విట్లీ గానం అందరినీ మరపిస్తుంది. ఎందరో క్రిటిక్స్ ఏకగ్రీవంగా కీత్ గాన శైలిని ప్రశంసించడానికి ఈ పాట ప్రధాన కారణం అయింది.
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/xNU7iIdw7Ss?si=vq081VcxQPa2-ejI )

