[జార్ట్ స్ట్రెయిట్ పాడిన ‘వేర్ హావ్ ఐ బీన్ ఆల్ మై లైఫ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జార్ట్ స్ట్రెయిట్ – వేర్ హావ్ ఐ బీన్ ఆల్ మై లైఫ్ (2009)
- ఆల్బమ్ – ట్వాంగ్
- రచన – షెర్రి ఆస్టిన్, విల్ నాన్స్, స్టీవ్ విలియమ్స్
- నిర్మాత – టోనీ బ్రౌన్, జార్జ్ స్ట్రెయిట్
~
ఈ ఆల్బంలోని ఇతర పాటలంతగా ఈ పాట పాపులర్ కాకపోయినా మనిషి జీవితంలో యవ్వనం అనే మూర్ఖత్వం నుంచి ప్రౌఢత్వం వైపు జరిగే ప్రయాణ క్రమం ఈ పాటలో కనిపించి మనల్ని ఆలోచనలో పడేస్తుంది. జీవితపు అవగాహన నుండి వచ్చిన ఆలోచనతో, మూర్ఖంగా గడిపిన రోజులను తలచుకుని అసలు నేను నా జీవితంతో ఇన్నాళ్లు ఏం చేసాను అని అనుకునే ఆ స్థితిని గాయకుడు వర్ణించిన విధానంలో ఒక లోతు ఉంది. అసలు మన జీవితకాలంలో మనమేం చేసాం, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాం, ఎన్నిటిని విస్మరించాం అని మనల్ని చూసి మనమే ఆశ్ఛర్యపోయే సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఒకో రకంగా వస్తుంది. ఈ పాట ఆ ఆలోచనను, దైనందిన జీవితంలో మనం విస్మరించిన సాధారణ విషయాలలోని లోతును గ్రహింపుకు తీసుకొస్తుంది. అపరికత్వం నుండి పరిపక్వత వైపు ప్రయాణించే జీవితంలోని గందరగోళాన్ని చాలా గొప్పగా పాట రూపంలో ప్రెజెంట్ చేసారు జార్జ్.
Been down the road to work and back
Been in what I thought was love a few times
But every once in a while I stop and ask
Where have I been all my life
యవ్వనం తిరుగుబాటుకు చిహ్నం. ప్రతి దాన్ని కాదనడం, మనకన్నీ తెలుసనే భావంతో ఉండడం, ఏదో మైకంలో జీవితం గడిపేయడం జరుగుతుంది. అనవసరపు హడావిడితో రోజులు గడిపేస్తాం. జ్ఞాపకాలు మదిలో ముద్రలుగా మారలేనంత వేగంగా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఒకే దారిలో రోజూ ప్రయాణిస్తూనే ఉన్నా అదేదీ మనసుకు ఎక్కదు. కొన్ని బంధాలు, ప్రేమలు ఏర్పడతాయి, మాయమవుతాయి. కుదురు లేని జీవితాలు, స్థిరత్వంలేని రోజుల నడుమ కాస్త అనుభవం వచ్చి చేరాక వేసుకునే ప్రశ్న అసలు నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను అన్నది. అన్నీ మసకబారిన రోజులే తప్ప అర్థం ఉన్న రోజులు ఆ గతంలో కనిపించవు. అందులో మనం ఎక్కడ ఉన్నామో, ఎందుకు ఉన్నామో అర్థం కాని స్థితి వస్తుంది.
These days broccoli don’t taste so bad
And neither does swallowing my pride
And I’m agreeing more and more with my old man
Where have I been all my life
(ఈ మధ్య బ్రోకలి రుచి అంత మరీ చెడ్డగా అనిపించట్లేదు. నా అహాన్ని మింగి జీవించడమూ తప్పనిపించట్లేదు. మా పెద్దాయన చెప్పే వాటిని ఈ మధ్య తరచుగా అంగీకరిస్తున్నాను. నేను నా జీవితంలో ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాను)
వయసులో ఉన్నప్పుడు అమ్మ వండి పెట్టినదేది యువకులకు నచ్చదు. ఇంటి ఆకుకూరలు రుచించవు. కాని ఇప్పుడు ఆ యువకుడికి ఆ కూరలు బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయట. వీటి కోసం అంత గొడవ ఎందుకు చేసేవాడినా అని ఆలోచిస్తున్నాడు. అహాన్ని మింగి తల ఒంచి జీవించడమూ అతనికి ఇప్పుడు సౌకర్యంగానే ఉందట. అప్పటి దాకా అమ్మ తిండి రుచించక, నాన్న మాటలు సహించక గొడవలు పడుతూ రోజులు గడిపేసిన ఆ యువకుడు ఇప్పుడు తండ్రి మాటలను మౌనంగా అంగీకరించడం చేస్తున్నాడు. మరి ఇన్నాళ్ళు తాను ఈ అనవసర గొడవలు ఎందుకు పడ్డానా అని ఆలోచిస్తున్నాడు. వాటి మధ్య నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎక్కడ దాక్కుండి పోయాను అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు.
Some years are clear and some a little blurry
Man how they fly by
Mom and dad sure got old in a hurry
Where have I been all my life
(కొన్ని సంవత్సరాలు స్పష్టంగా కొన్ని మసకగా గుర్తుకు వస్తున్నాయి. అవి ఎలా ఎగిరిపోయాయో కదా. అమ్మా నాన్నా హడావిడిగాగా ముసలివాళ్లయిపోయిరు. నేను నా జీవితంలో ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నాను)
యవ్వనంలో హడావిడి మధ్య గడిచిన సంవత్సరాలు అన్నీ స్పష్టంగా గుర్తుండవు. మసక మసక జ్ఞాపకాలే మిగిలి ఉంటాయి. రోజులు ఎలా గడిచిపోయాయో సంవత్సరాలు ఎలా ఎగిరిపోయాయో తెలియదు. మన కళ్ల ముందే అమ్మా నాన్నలు ఎప్పుడు పెద్దవయసువాళ్లయి పోయారో అర్థం కాదు. ఇంత కాలం గడిచిపోయిందా అనిపిస్తుంది. మది ఇన్ని గడిచిన రోజుల మధ్య నేను జీవించింది ఎప్పుడు? అసలు ఇంత కాలం నేను ఎక్కడ ఉండిపోయాను? అసలు నా జీవితంలో ఇప్పటి దాకా ఈ ‘నేను’ కనపడకుండా ఏమయ్యాను అనుకుంటున్నాడు అతను.
Been learning that forgiveness is as much for myself
As it is for the other guy
And I read the good book these days and believe it
Where have I been all my life
(క్షమించడం అవతలివారితో పాటు నాకూ మంచి చేస్తుందని నేర్చుకుంటున్నాను. పవిత్ర గ్రంథాన్ని కూడా చదువుతున్నాను, దాన్ని నమ్ముతున్నాను. నేను ఇప్పటిదాకా జీవితంలో ఎక్కడ ఉన్నాను)
యవ్వనంలో ఉన్నప్పుడు పగ, ప్రతీకరాలు గొప్ప ఆదర్శాలుగా కనిపిస్తాయి. ఆవేశం చాలా శక్తివంతమైన ఆయుధంగా అనిపిస్తుంది. కాని వయసు పైబడుతున్నప్పుడు ఇతరులను క్షమించి వదిలేయడం వారి కన్నా మనకు ఎంతో ప్రశాంతతను అందిస్తుందని తెలుసుకుంటాం. అలాగే భక్తి, దేవుడు లాంటి వాటిని ప్రతిఘటించి, దేన్ని నమ్మకుండా గడిపేసిన రోజుల నుంచి మెల్లిగా దేవుడు, మత గ్రంథాలను సహించడం, భరించడం మొదలయి దైవత్వాన్ని అంగీకరించడం వరకు వస్తాం. నమ్మకాలు రూపం మారుతుంటాయి. మొండితనం పోతుంది. అప్పటిదాకా సహించని విషయాలను స్వీకరించడం మొదలవుతుంది. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. అసలు నా జీవితకాలంలో నేనెక్కడున్నాను అని. ఆ గాయకుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు.
I heard ‘What a Wonderful World’ by Louis Armstrong
It brought a tear to my eyes
After all these years I finally get that song
Where have I been all my life
(లుయీ ఆర్మ్‌స్ట్రాంగ్ పాడిన ‘వాట్ ఏ వండర్ ఫుల్ వర్ల్డ్’ విన్నాను. ఆది నా కళ్లలో నీళ్లు తీసుకొచ్చింది. ఇన్నాళ్ల తర్వాత నాకు ఆ పాట అర్థం అయింది. ఇప్పటి దాకా నేను నా జీవితంలో ఎక్కడ ఉన్నాను)
లూయి ఆర్మ్‌స్ట్రాంగ్ పందొమ్మిదవ శాతాబ్దపు తొలి తరం అమెరికన్ గాయకుడు. ఆయన పాటిన ‘వాట్ ఏ వండర్ పుల్ వర్ల్డ్’ పాట చాలా మంద్రంగా సాగే గీతం. ప్రకృతిని, దేవుని సృష్టిని, ప్రాతఃకాలపు సౌందర్యాన్ని వర్ణించే గీతం ఇది. అయితే చాలా స్లోగా సాగే ఈ పాట కొత్త తరం యువకులు ఇష్టపడరు. అసలు అంత పరీక్షగా తీరిగ్గా గడ్డిపోచలనుంచి వర్ణిస్తూ పోయే ఈ గీతంలోని ఆ దృశ్యవర్ణన చాలా మందికి ఎక్కదు. జీవితంలో ఒక స్థాయికి వచ్చాక మనకు యవ్వనంలో అర్థం కాని చాలా విషయాలు అర్థం అవుతూ, మనలోని మనోనేత్రం తెరుచుకుంటున్నప్పుడు, మనసుకు హత్తుకునే విషయాలుగా మారతాయి. ఆర్మ్ స్ట్రాంగ్ పాట అలాంటిది. అది సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ భావనాప్రపంచం మనకు అందుతుంది. అప్పుడు ఆ పాటలోని ఆర్ద్రతకు కళ్ళు చెమరుస్తాయి. ఈ యువకుడికి అదే జరిగింది. మొదటిసారి ఆర్మ్‌స్ట్రాంగ్ పాట ఇతనికి కన్నీరు తెప్పించింది. ఇన్నేళ్ళుగా ఆ పాట వింటున్నా ఇప్పుడే అది అర్థం అయింది. అప్పుడు మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ బయలుదేరింది. “అసలు ఈ జీవితంలో నేనేం చేశాను? ఎక్కడ ఉన్నాను?”
జీవితాన్ని హడావిడిగా అర్థంలేని విషయాల కోసం పరుగు తీస్తూ బ్రతికేసాక, అసలు మనం జీవితంలో ఏం చేయలేదని, ఇంకా జీవించడమే మొదలెట్టలేదని తెలిసాక ఆ ఎరుక ఇచ్చే అవగాహనతో మనసు విషాదభరితం అవుతుంది. ఇది మనిషి జీవిత క్రమంలో తప్పకుండా దొరకవలసిన అనుభవం. ఈ విషాదం ఎంత త్వరగా మనసులోకి పాకితే మనిషి జీవితం అంత త్వరగా మొదలవుతుంది. ఆ విషాదాన్ని ఆ యువకుడు అనుభవిస్తున్నందుకు, అతనిలో వివేకం తలుపులు తెరుచుకుంటున్నందుకు ఆనందం కలుగుతుంది. అలాగే ఇంత కాలం అహంకారపూరితమైన అంధకారంలో జీవించిన ఆ యువకుడు ఈ తరపు యువతకు ప్రతినిధిగా కనిపించి బాధ, జాలి, అలాగే ప్రేమ కూడా కలుగుతుంది. నిజానికి టీనేజ్ నుంచి బైటపడే ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో కొంత ఇలాగే ఉంటుంది కూడా.
ఇన్ని భావాలను ఒకేసారి వెలికితీయగల ఈ గీతం అందుకే పాపులర్ గీతం కాకపోయినా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. దీన్ని జార్జ్ పాడిన విధానమూ, మానవ మస్తిష్కంలోని గందరగోళాన్ని ప్రకటించిన విధానమూ బావుంటాయి.
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://www.youtube.com/watch?v=xR6QTaqTXrQ )

