Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యాదృచ్ఛికం

[నంద్యాల విజయ లక్ష్మి గారి ‘యాదృచ్ఛికం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఇరువైపుల పెద్దల పిల్లల అంగీకారముతోనే స్వప్న మోహన్‌ల పెళ్ళిజరిగింది. మోహన్ ఉద్యోగము కలకత్తాలో. అందుకని స్వప్న తను చేస్తున్న ఉద్యోగము మానేసి అతనితో వెళ్లాల్సి వచ్చింది. మోహన్ కూడా ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

తరాలు మారినా భార్యభర్తను అనుసరించి ఒకింత తగ్గి సంసారము చెయ్యాలిసిందే. కొత్త కాపురము సినిమాలు షికారులు కొత్త అనుభవాలు కొన్నిరోజులు ఆసక్తికరంగా ఉత్సాహంగానే గడిచాయి.

స్వప్నకు ఎందుకో తను ఏదో కోల్పోయిన భావన మొదలైంది.

ఆమెలో వచ్చిన మార్పు మోహన్ చూసీ చూడనట్లే ఉండేవాడు. తన పని తన అవసరాలు అంతే. స్వప్నకు ప్రత్యేకంగా ఏమైనా కావాలేమో అని ఆలోచించేవాడు కాదు. స్వప్నకు చిన్నప్పటినుండీ ఉగాది పండగ అంటే చాలా ఇష్టం.

రేపే ఉగాది. స్వప్న  చిన్నప్పుడు ఉగాది వస్తోందంటే అమ్మ చేసే హడావుడి పొద్దున్నే లేచి తలంటు పోసుకోవడము కొత్తబట్టలు వేసుకుని గుడికి వెళ్ళడం  పులిహోర బూరెలతో పాయసము  గారెలు అమ్మ ఇన్నీ ఓపికగా చెయ్యడము, ఎవరో ఒకరు అతిధులు భోజనసమయానికి రావడము, కబుర్లు, ఆ తర్వాత సాయంత్రం పంచాంగశ్రవణం, కవిసమ్మేళణం ఇలా రోజంతా సరదాగా గడిచిపోయేది.

పెళ్ళి అయిన తరవాత వచ్చిన మొదటి పండుగ ఉగాది. ఆ రోజు రోజూ కన్నా ముందే లేచి తలస్నానము చేసి  ఉన్న వాటిలో కట్టని కొత్తచీర తీసుకుని కట్టుకుంది. మోహన్ రోజూలాగే టిఫిను సమయానికి వచ్చి టేబుల్ మీద ఉన్న పాయసం గారెలు తిని వెళ్ళిపోయాడు.

స్వప్నకు ఈ తరహా చూసి విసుగ్గా అనిపించింది. ఏమీ చెయ్యాలనిపించలేదు.

ఉగాది అలా చప్పగా గడపడం నచ్చలేదు.

మనసు పది సంత్సరాలు వెనక్కి తీసుకొనివెళ్ళింది.

***

ఆ రోజు అనుకోని ఒక అతిధి ఇంటికి వచ్చాడు. దూరపు బంధువును అని చెప్పి వరసలు కలుపుకుంటూ “అత్తయ్యా మామయ్యా” అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు

స్వప్న అతనిని చూసి లోపలికి వెళ్ళబోయింది “ఏయ్. ఆగు నీ పేరేమిటి? చిన్నప్పుడు రెండుపిలకలు వేసుకుని గజ్జెలగుఱ్ఱంలా తిరిగేదానివి” అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే అమ్మ లోపలినుండీ వచ్చింది.

“నీ పేరు సురేష్ కదూ, ఏం పని మీద వచ్చావు?” అంటూ నిలదీసి అడిగింది. అతని మొహం చిన్నబోయింది.

“అవును అత్తయ్యా ఇప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నాను. మన ఊరివారిని అడిగి ఎలాగో మీ చిరునామా తెలుసుకున్నాను” అంటూ హాల్లో సోఫాలో కూచున్నాడు

ఇంతలో నాన్న బయటినుండీ వచ్చారు.

“నమస్కారం మామయ్యా” అని లేచి నిలుచున్నాడు సురేష్.

“ఎవరు ఇతను సుజాతా? ఎందుకు వచ్చినట్లు?” అంటూ ప్రశ్నార్దకంగా చూసి అడిగారు. అమ్మ వెంటనే “మా ఊరి వాడే. ఈ పూట మన ఇంట్లో అన్నం తిని వెళ్తాడు.” అంది.

సురేష్‌కి పరిస్థితి అర్ధం అయింది. నాలుగు రోజులు ఇక్కడే ఉందామనుకున్నాడు.

సురేష్ తెలివైనవాడే కానీ అతని కుటుంబ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. హైదరాబాదు ఉద్యోగ ప్రయత్నాలకు వచ్చినప్పుడల్లా వసతి భోజనానికి అదనపు ఖర్చు అవుతుంది. అందుకే ఈసారి వీళ్ల ఇంట్లో ఉండచ్చేమో అనుకున్నాడు.

కానీ సుజాత మాట తీరు చూసాక తన ఉద్దేశం మార్చుకుని “సరే అత్తయ్యా, అలాగే” అన్నాడు.

లోపల గదిలో స్వప్న లెక్కల పరీక్షకి సిద్ధమవుతోంది. తెలివైందే కానీ లెక్కల్లో, చాలా తక్కువ మార్కులు రావడంతో భయం పట్టుకుంది. దానికి తోడు తరగతిలో టీచరు చెప్పిన విధానం స్వప్నకు లెక్కలంటే మరింత కష్టంగా అనిపించేలా చేసింది. “దేవుడా నువ్వే ఈ గండం గట్టెక్కించు” అని గట్టిగా అంది.

అది విని సురేష్ లోపలికి వెళ్లి, “నేను చెప్పనా?” అంటూ ఒక లెక్క ఎలా సులభంగా చెయ్యచ్చో చెప్పాడు. స్వప్నకు బాగా అర్థం అయింది.

కొన్ని చిట్కాలు కూడా చెప్పాడు. స్వప్నకు భయం స్థానంలో విశ్వాసం పెరిగింది. లెక్కలు చెయ్యగలననే నమ్మకం కుదిరింది.

ఈ సబ్జెక్ట్ చెప్పిన టీచరు ఎంతసేపు హడావుడిగా చెప్పడమే కానీ పిల్లలకు నచ్చేతీరులో చెప్పకపోవడంతో స్వప్నకు ఎలాగోలా పాసైతే చాలనుకుంది. అమ్మానాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులే ట్యూషనుకు వెళ్లాలంటే చాలా దూరము. తీరా పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలో సురేష్ రావడం, చొరవ తీసుకుని తన భయం పోగొట్టడం జరిగింది. అప్పుడు స్వప్న సురేష్ ఇంకో నాలుగురోజులు తమ ఇంట్లో ఉండాలని కోరుకుంది.

అలా మొత్తానికి స్వప్న పట్టుదల వల్ల సురేష్ అక్కడే ఉండిపోయాడు.

స్వప్న లెక్కల పరీక్ష రోజే సురేష్‌కు ఇంటర్వ్యూ. గబగబా తయారు అయి తన సంచీ తీసుకుని వెళ్ళాడు.

సాయంత్రం పరీక్ష బాగా రాసి చాలా సంతోషంతో ఇంటికి వచ్చిన స్వప్న సురేష్ కోసం వెతికింది

అంతే మళ్ళీ సురేష్ కనపడలేదు. అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు.

స్వప్న అంచెలంచెలుగా ఇంజనీరింగ్ పూర్తి చేయడం ఆ తర్వాత మోహన్‌తో వివాహం జరగడం జరిగాయి.

మోహన్ మంచివాడే కానీ స్వప్న మనసుకు దగ్గర కాలేదు. ఏదో యాంత్రికజీవితము గడుపుతున్నట్లు అంతే. అంతకుమించి సున్నితభావాలు, సరదాలు తక్కువ.

***

పోస్ట్ అన్న మాట విని స్వప్న గతం నుండీ వర్తమానానికి వచ్చింది.

తన పేరున వచ్చిన కవరు చూసి ఆశ్చర్యపోయింది. కవరు పైన తన పేరు అందంగా రాసి ఉంది.

ఆతృతగా కవరు విప్పి చదవడం మొదలుపెట్టింది.

“స్వప్న ఎలా ఉన్నావు? నేను సురేష్‌ని.

ఆ రోజు మీ ఇంటి దగ్గరనుండీ బయలుదేరి ఆఫీసుకు వెళ్తూ ఉండగానే అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన ప్రాణాపాయం తప్పింది. కానీ రెండు నెలలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో మా ఊరికి వెళ్లిపోయాను.

నేను మీ ఇంటికి రెండు సంవత్సరాల తర్వాత వెళ్లి అడిగితే మీరు ఎక్కడికి వెళ్లినది వివరాలు ఎవరూ చెప్పలేదు.

నిన్న అనుకోకుండా మా ఆఫీసులో నాతోపాటు పనిచేస్తున్న నీ స్నేహితురాలు నీ గురించి మాటల మధ్యలో చెప్పింది.

అందుకే ఈ ఉత్తరం రాశాను. నువు నీ భర్తతో సుఖంగా ఉన్నావని అనుకుంటున్నాను.

వీలైనంత త్వరలో అందరము కలుద్దాము.

ఇట్లు

సురేష్”

చదవడం పూర్తి అవగానే స్వప్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఎంత మంచి మనసు? ఏమీ కాని ఒక వ్యక్తి తన గురించి ఆలోచించడం ఏమిటో? నేను ఆనందంగా ఉన్నానా? ఏమో?

ఇంతలోనే మోహన్ హడావిడిగా వస్తూనే, “లే తయారవు. సినిమాకు వెళదాము. నా ప్రమోషన్ కాగితాలు ఇవాళే వచ్చాయి” అన్నాడు

స్వప్న అతనిని అనుసరించింది. సురేష్ రాసిన ఉత్తరం గురించి సరదాగా సంతోషంగా చెపుదామనుకుంది. ఇప్పుడు కాదులే అనుకుంది

కొన్ని అంతే. యాదృచ్ఛికంగా జరుగుతాయి. మనం అనుకున్నట్లు జరగవు.

Exit mobile version