Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరిమళించిన ఆధ్యాత్మిక సౌరభాలు – ‘యద్భావం తద్భవతి’

[శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి ‘యద్భావం తద్భవతి’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి 19వ పుస్తకం ‘యద్భావం తద్భవతి’. మూడవ ఆధ్యాత్మిక పుస్తకం.

ఆధ్యాత్మిక సత్యాలను అలవోకగా చెప్పే నైపుణ్యం అందరికీ పట్టుపడదు. సార్వజనీన సత్యాలను సుబోధకంగా చిన్న చిన్న కథలుగా చెప్పడంలో ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి ప్రజ్ఞ అసమాన్యమైనది.

ఈ పుస్తకంలో 60 జీవిత సత్యాలతో కూడిన 60 చిన్న కథలున్నాయి. అన్నీ ఆసక్తిగా సాగుతాయి.

ధర్మం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి? ధర్మాచరణ ఎలా ఉండాలి? భక్తి ఎంత దృఢంగా ఉండాలి?యుక్తాయుక్త విచక్షణ ఎందుకు అవసరం? వంటి అనేక ప్రశ్నలకు ఈ కథలలో జవాబులు దొరుకుతాయి.

~

దేహం అశాశ్వతమని, జీవమనే చిలుక పంజరమనే దేహం నుండి ఎప్పుడైనా ఎగిరిపోతుందని, రాజుకి అచరణాత్మకంగా నిరూపిస్తాడు రాజగురువు ‘ఎగిరిపోవడం చిలుక నైజం’ అనే కథలో.

కష్టాలు కలకాలం ఉండవనీ, కష్టాలు ఎదురైనప్పుడు బెదిరిపోకుండా ఓపికగా, ఉన్నచోటనే ఉండి ఎదుర్కోవాలని, క్రుంగిపోకూడని తుంగ మొక్కల ఉదాహరణ ద్వారా వివరిస్తాడో గురువు. జీవితం అంటే సుఖదుఃఖాల కలయిక అనీ, అన్నింటినీ సమంగా ఆస్వాదించాలని ‘తుంగ’ కథ చెబుతుంది.

మనసుని వీడని ఆలోచనలను, బాల్కనీని వీడని పావురాలతో పోల్చి,  ప్రతికూల ఆలోచనలను వదిలించుకుని, సానుకూల ఆలోచనలను పెంచుకోవాలని అందుకు సత్సంగం అవసరమనీ చెప్తాడు గురువర్యుడు, తనని సంప్రదించిన ఓ మధ్యతరగతి వ్యక్తికి.

దేవుని సేవకి ఆసక్తి ఉన్నవాళ్ళు – తమ ప్రయత్నం తాము చేయాలి తప్ప, దేవుడే తనని పిలిపించుకోవాలని భావించకూడదని చెప్తుంది ‘మనవంతు ప్రయత్నం’ కథ.

దేవుడున్నాడన్న నమ్మకం ఎంత భరోసానిస్తుందో ‘కంకరలోనూ శంకరుడే’ కథ చెబుతుంది. సమస్యని చిన్నగా ఎలా చూడాలో, అప్పుడు సరైన పరిష్కారమెలా కనబడుతుందో ‘ఉత్తమ యోగి’ కథ చెబుతుంది.

ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో, బంధాలను ఎలా మళ్ళీ కలుపుకోవాలో ఓ గురువు గారు ‘కిటుకు’ కథలో అద్భుతంగా చెప్పారు. సులువుగా ఆచరించదగ్గ సూచన అది.

గ్రామస్థులకి, గీతాపారాయణం పట్ల ఆసక్తి ఎలా కల్పించాలో ఓ మహిళకి గ్రామపెద్ద చూపించిన ఉదాహరణ గొప్పది. ‘గీతాపారాయణం’ చక్కని కథ.

వ్యాపారానికీ – హారతికీ, కొబ్బరికాయకీ సంబంధం ఏమిటి? తన కొడుకికి వ్యాపారం కోసం డబ్బు ఇచ్చేముందు తండ్రి రోజు గుడిలో కొబ్బరికాయ కొట్టి, హారతి వెలిగించమనడంలోని ఆంతర్యం ఏమిటో పూజారి ఆ యువకుడికి అర్థమయ్యేలా వివరిస్తాడు ‘కర్పూర హారతి’ కథలో.

జీవిత పరమార్థం తెలుసుకోడానికి ఏ భాష నేర్చుకోవాలో అర్థం కాని యువకుడికి, ఓ గురువు నేర్చుకోమని చెప్పిన భాష ఏమిటో తెలిస్తే, పాఠకులు కూడా గురువు అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ‘గొప్ప భాష’ వివేకవంతమైన కథ.

వేటిని పక్కన పెడితే, ఆనందం, బ్రహ్మానందం లభిస్తాయో ఓ యువకుడి ఆచరణాత్మక ఉదాహరణతో గురువు ‘బ్రహ్మానందం’ కథలో చెబుతారు.

ప్రాణం ఉంటేనే దేహానికి ప్రాముఖ్యత అని లేకపోతే, రాజైనా బంటైనా ఒకటేననని ‘శరీరం విలువ’ కథ చెబుతుంది.

బంగారం కన్నా సింగారమైనదేమిటో తెలుసుకున్న రైతుకి, భార్య కోరికి తీర్చి ఆమెకు సంతోషం కలిగిస్తాడు ఒక కథలో.

‘జాలరి వల’ కథలో తండ్రి అనుభవంతో కొడుక్కి చెప్పిన జీవన మార్గం అందరూ అనుసరించదగ్గది. లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని, బాధ్యతగా నిర్వహించి, తృప్తితో జీవించాలని చెబుతుందీ కథ.

ఇంకా ఎన్నో చక్కని కథలున్న ఈ పుస్తకం – ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకునేవారికి చక్కని మార్గదర్శి అవుతుంది.

ఈ కథలు పరిమళించిన ఆధ్యాత్మిక సౌరభాలు అనడంలో అతిశయోక్తి లేదు.

***

యద్భావం తద్భవతి (ఆధ్యాత్మిక కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: ఆదర్శిని మీడియా, హైదరాబాద్
పేజీలు: 136
వెల:  ₹ 160/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు,
ఫోన్ 9393662821

Exit mobile version