[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జి. ఉమామహేశ్వర్ గారి ‘యక్ష ప్రశ్న’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“మేడమ్, బాక్సు తీయండి. లంచ్ చేద్దాం, ఒంటిగంట దాటి పోయింది” ఉత్సాహంగా అన్నాడు శీను
“నీకు ఆకలెలా అవుతుందిరా, ఇందాక ఆ ముసలాయన పెట్టిన గడ్డి సరిపోలేదా?” దిగులుగా, విసుగ్గా అంది సరోజ.
“కస్టమరన్నాక వంద అంటాడు. అవన్నీ పట్టించుకుంటే ఎట్లా మేడమ్? ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వలేదనే బాధలో ఏదో అన్నాడు. అయినా దానికి, తిండికీ సంబంధం ఏంటి? అలా అయితే, మొన్న ఒక కస్టమర్ లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. ఆ రోజేమన్నా బిర్యానీ పెట్టించారా?” శీను వితండానికి విరక్తిగా నవ్వింది.
సరోజ సహాయ అనే ఫైనాన్స్ బ్యాంక్‌లో పనిచేస్తోంది. ఆమె చేరి పదిహేనేళ్లయినా గొప్పగా ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం. రెండేళ్ల క్రితం తమ బ్యాంకు ఛైర్మన్ వివాదాలకు గురవ్వడంతో చదువుకున్న వర్గాలు దూరమయ్యాయి. ఇదే అదనుగా పోటీ బ్యాంకులు తమ మీద దుష్ప్రచారం చేయడం , కొత్త డిపాజిట్లు గణనీయంగా పడిపోవడం, ఉన్నడిపాజిట్లను కస్టమర్లు వెనక్కి తీసుకోవడం, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అవి తమ జీతాల మీద, జీవితాల మీద పడటం వెంటవెంటనే జరిగిపోయాయి. రెండు మూడు నెలల జీతాలు కలిపి ఓకేసారి ఇవ్వడం, బ్రాంచులు తగ్గించి ఉద్యోగస్థుల సంఖ్య కుదించడం తదనంతర పరిణామాలు.
ఛైర్మన్ గారు కోర్టులను ఆశ్రయించారు. కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ మన బ్యాంకు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అప్పుడప్పుడూ టీవీలలో, పేపర్ ప్రకటనలలో కనిపించే మేనేజ్మెంట్ మాటలు చూపించి ఏజెంట్లు కొత్త కస్టమర్లను, డిపాజిటర్లను ఆకర్షిస్తుంటారు. ప్రతి డిపాజిట్ మీద ఏజెంట్లకు కొంత కమీషన్ ఉంటుంది. అందుకే చాలామంది ఏజెంట్లు కొత్త వాళ్ళను మభ్యపెట్టి డిపాజిట్లు తెస్తారు.
ఇప్పుడయితే కొత్త డిపాజిట్లు సేకరించి వాటితోనే ఉద్యోగస్థుల జీతాలు, భవనాల అద్దెలు చెల్లించమంటున్నారు. చిన్న మొత్తాలయితే వెంటనే డబ్బు చెల్లించేయమని తద్వారా చెడ్డ పేరు తగ్గించుకోవచ్చన్నారు. ఏవైనా పెద్ద మొత్తాలు మెచూరయితే డబ్బు చెల్లించవద్దని, ఎలాగోలా మ్యానేజ్ చేసి రెన్యువల్ చేయించమన్నారు.
సరోజ మనసును బాధకు గురిచేసిన ప్రస్తుత సంఘటన అట్లాంటిదే.
కస్టమర్ డబ్బు కావాలన్నాడు. వీళ్ళు రెన్యువల్ అన్నారు. నాకు అవసరం లేదు అన్నాడు. వీళ్ళు తప్పదు అన్నారు. మీ ఇబ్బందులు నాకెందుకు, నా డబ్బులు నాకివ్వండి అని రెట్టించాడు. సదరు ఏజెంటుకు కబురు పెడితే ఆయన ఫోన్ తీయలేదు. సర్దిచెప్పడాలు, అభ్యర్థనలు, ఆరోపణలు, బెదిరింపులు, సవాళ్ళు, ప్రతిజ్ఞలు అన్నీ మిగిసి తుఫాన్ వచ్చి వెలిసినట్లుంది.
సిగరెట్టుకని బయటకు పోయిన కామేశ్వరరావు లోపలికొచ్చాడు. ఆయన మూడు బ్రాంచులకు సీనియర్ మేనేజర్. ఇంటికి దగ్గరగా వుంటుందని ఈ బ్రాంచ్ నుండే పనిచేస్తాడు.
దూరంగా ఎవరో వస్తున్న చప్పుడుకి అందరూ మెయిన్ డోర్ వైపు చూశారు. కమీషన్ ఏజెంటు వెనుక ఎవరో కొత్త కస్టమర్.
వెంటనే శీను అది గమనించి నవ్వుతూ, “డిపాజిట్ కస్టమర్, కమాన్, యాక్షన్ రెడీ.. వన్, టూ త్రీ” అంటూ ఉత్సాహపరచాడు.
ఆ తరువాత కస్టమర్ వచ్చి యాభై వేలు డిపాజిట్ చేశాడు. ఏజెంట్ కూడా కస్టమర్‌తో పాటూ బయటకు నడిచాడు.
“ఏంటి మేడమ్, మీరు హ్యాపీసా? యాభైవేలు.. మీ రెండు నెలల జీతం.. ఇప్పుడన్నా తీయండి లంచ్ బాక్స్” అన్నాడు శీను.
“సార్‌ని అడుగు.. అది రెండు నెలల బిల్డింగ్ అద్దె అంటారు” సరోజ నవ్వుతూ లంచ్ బ్యాగ్ తీసి శీనుకిచ్చింది.
***
ఒకవారం తరువాత ఉదయం పదకొండుగంటలకు శీను ఏవో కామెడీ రీల్స్ చూస్తూ మధ్యమధ్యలో తనలో తనే నవ్వుకుంటున్నాడు. సరోజ ఏవో వీక్లీ రిపోర్టులు టైప్ చేస్తోంది. ఇప్పటివరకూ వచ్చినవి ఇచ్చినవి లెక్కతేలిస్తే గంతకు తగ్గ బొంత అని తేలింది. నెలాఖరు కావడం వల్ల ఇంక డిపాజిట్లేవీ రావు అనుకుని కామేశ్వర్రావు ఎవరో స్వామీజీ ప్రవచనం వింటున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి సుపరిచితమైన నవ్వొకటి వాళ్ళ వైపే వస్తుండటం వినిపించింది.
కూర్చున్న టేబిల్ మీద నుండి కిందకు దూకుతూ శీను ఉత్సాహంగా “వినోదన్న.. అంటే పెద్ద డిపాజిట్టే” అంటూ మెయిన్ డోర్ వైపు వెళ్ళాడు స్వాగతం పలకడానికన్నట్టు.
“నమస్తే” అని విష్ చేసి అక్కడే ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుని పక్కనే ఉన్న మరో రెండు కుర్చీలు తన వెంట వచ్చిన వాళ్ళకు చూపించాడు వినోద్. అతను బ్యాంకుకు చాలా విలువైన ఏజెంటు. లోకల్ కార్పొరేటర్ నీడలో పెరుగుతున్న చిన్ననాయకుడు.
వినోద్ కామేశ్వర్రావు వైపు చూస్తూ “సార్, ఈమె పేరు ఫాతిమా. మా పిన్నిలాంటిది. భర్త చిన్న వయసులో చనిపోతే కష్టపడి పిల్లల్ని పెంచింది. ఇప్పుడు కొడుకు పంపిన డబ్బు కూతురి పెళ్లికోసం దాచిపెట్టిందంట. పెళ్లి అవసరం ఎప్పుడొస్తుందో తెలియదని బ్యాంకులో వేస్తామంటే ఇక్కడ డిపాజిట్ చేయమని పట్టుకొచ్చినా” అంటూ కస్టమరును పరిచయం చేస్తుండగా ఆమె తన బురఖా తీసి చిరునవ్వుతో అందరివంకా చూసింది.
ఆమెను చూసి సరోజ నవ్వి, ఆమెను ఎక్కడో చూసినట్టనిపించి జ్ఞాపకాల గుట్టలో తవ్వకాలు మొదలుపెట్టింది. అయితే సరోజ మైండ్ గూగుల్ స్కాన్ కంటే వేగంగా ఆమె ఆనవాలు పట్టిచ్చింది. చిన్నప్పుడు తను చదివిన ఆంథోనీ స్కూల్లో ఆయమ్మ. గుర్తొచ్చింది. కరెక్టే.. పేరు కూడా అదే.. కానీ ఎక్కువ మంది టీచర్లు ‘బీబీ’ అనే పిలిచేవారు. ఆమెకు గుర్తు చేద్దామనుకుంది గానీ ఎందుకో మళ్ళీ వద్దనిపించి ఊరుకుంది.
కామేశ్వర రావు డిపాజిట్ ఫారాలు భర్తీ చేస్తూ “అమౌంట్ ఎంత?”అనడిగాడు యధాలాపంగా.
“నాలుగు లక్షలు సార్” అన్నాడు వినోద్.
“నాలుగు లక్షలు” ఒక్కసారే సరోజ, కామేశ్వరరావు, శీను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టారు.
బకాయిలు పోను ఇంకో రెండు నెలలు ఢోకా వుండదు అనుకున్నాడు కామేశ్వర రావు. వినోదన్న ఎప్పుడు తెచ్చినా ఇలాంటి బంపర్ ఆఫర్లే తెస్తాడు అని శీను వినోద్ వంక ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు.
సరోజ ఒక్క క్షణం కంగారుపడింది. ఆమె మెదడు స్తంభించి మనసు పనిచేయడం ప్రారంభించింది.
నాలుగు లక్షలు.
రెండు లక్షలు పైబడిన ఏ మొత్తమైనా బ్యాంకు నిర్వచనం ప్రకారం పెద్ద డిపాజిట్ కిందే లెక్క. ఒకవేళ ఫాతిమా కూతురి పెళ్లి కుదిరి డబ్బుకావాలని వస్తే ఆమెకు డబ్బురాదు. లేనిపోని రాధ్ధాంతమవుతుంది. గొడవలు, మాటకు మాట, శాపనార్థాలు తప్పవు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా! డబ్బులు సమయానికి రాకపోవచ్చు అని సూచనప్రాయంగా చెబుదామా అని నోటిదాకా వచ్చింది. తన ఆలోచనలన్నీ కళ్ళ తోనే కామేశ్వరరావుకు కమ్యూనికేట్ చేసి ‘మరేంటి’ అని కనుబొమలు పైకెత్తి ప్రశ్నించింది. దానికాయన తల కొద్దిగా వంచి ఎడమవైపుకు ఊపి ‘కానిద్దాం’ అన్నట్టు సమాధానమిచ్చాడు.
ఆయనకు ఈ పట్టింపేమీ ఉండదు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒకటి రెండు సందర్భాలు వచ్చాయి. అప్పుడాయన తన తత్వమేమిటో చెప్పాడు. “పిల్లికి ఎలుక ఆహారం. అయ్యో ఎలుకా అంటే మరి పిల్లి బతికేదెట్లా? ఎరేసి చాపలు పట్టడానికి వెళ్ళాము. చాప కూడా ఎర తిందామనే వస్తుంది. అయ్యో చాపా అంటే ఎట్లా? తక్కువో ఎక్కువో ఏదో ఒక మోతాదులో ఈ దోపిడీ తప్పదు” ఇదీ అతని ధోరణి.
బీబీ వంక చూసింది. అరవయ్యేళ్ళ ముసలి తల్లి. పాపం ఆమెకు విషయం చెప్పకుండా దాచడం మోసం చేయడమే కదా.. దీన్ని మోసమంటే కామేశ్వర్రావు ఒప్పుకోడు. దీనిని ప్రారబ్ధం అంటారని ఏవో పురాణాల కథలు చెబుతాడు.
ఇవన్నీ ఆలోచించే టైము లేదు. ఇంకొద్ది నిముషాలలో ఆ పేపర్లు తన డెస్క్ మీదకు వస్తాయి. తను ఆ వివరాలన్నీ కంప్యూటర్లో ఎక్కించి సబ్మిట్ బటన్ కొట్టగానే అంతా అయిపోతుంది. అది కాస్తా హెడ్డాఫీస్ సిస్టమ్ లో వెళ్ళి కూర్చుంటుంది. ఈ అకౌంట్ ని రెడ్‌లో పెడతారు- అంటే దీన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తుండమని సూచన.
ఇప్పుడేం చేయాలి. ఈ బీబీని ఎలా కాపాడాలి? అసలెందుకు తను ఇలా ఆలోచిస్తోంది. ఈ డబ్బు వస్తే తనకూ ఇంకో రెండు మూడు నెలలు ఇబ్బంది ఉండదు. వినోద్ ఎంతో కొంత ముట్టచెబుతాడు. మరింకేంటి? ఆమె తమకు ఆయమ్మగా పనిచేసినందుకు సానుభూతా? పాపం వాళ్ళ కొడుకు చెల్లెలి కోసం ఎంత కష్టపడి ఈ డబ్బులు పంపాడో? లేదు, వీల్లేదు, ఇక్కడ డిపాజిట్ చేస్తే ఈ ముసలామెకు క్షోభ తప్పదు. ఈమెను ఎలాగైనా ఆపాలి.. ఎలా? ఎలా?
సరోజకు వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఎందుకో గుండె దడ పెరిగింది. ఏదో చేయాలి.. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. అందరూ ఇక్కడ గోతి కాడ నక్కల్లాగే ఉన్నారు. ఒకవేళ కామేశ్వర్రావుని పక్కకు పిలిచి తన ఆవేదనంతా చెప్పినా అర్థం చేసుకోకపోగా “మనం ఇక్కడ ఉద్యోగస్థులుగా మన బాధ్యత నెరవేరుస్తున్నాం. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళడం నీ సంస్థకు నువ్వు చేసే ద్రోహం” అంటూ ఉపన్యాసమిస్తాడు. ఇంకా ముందుకెళ్ళి “ఏమో, మనం కోర్టు వ్యాజ్యాల్లో గెలిచి మన బ్యాంకు మళ్ళీ లాభాల బాటలో పడొచ్చచేమో? ఎప్పుడడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చే స్థితి రావచ్చేమో? నందోరాజా భవిష్యతి” అంటూ మాట్లాడటం తనకింకా గుర్తుంది.
సరోజకు నీరసమొచ్చింది. నిస్సత్తువ ఆవహించింది. బీబీ మీద అసహనం పెరిగింది. కోపమొచ్చింది. బయట ఇంత ప్రచారం జరుగుతోంది కదా, ఈ బ్యాంకు గురించి. తెలిసి తెలిసి ఇంత పెద్ద మొత్తాలు ఎలా పెడతారమ్మా? ఎందుకమ్మా మోసపోతారు” అని బిగ్గరగా అరవాలనిపిస్తోంది. ఏ రకమైన మాయమాటలు చెప్పి, ప్రలోభాలు చూపించి పట్టుకొచ్చాడో అని వినోద్ మీద కోపం వస్తోంది.
“ఇక్కడ సంతకం చేయమ్మా” అని కామేశ్వర రావు ఆమె ముందుకు కాగితాలు జరిపాడు. ఆమె చేవ్రాలు పెట్టింది. అయిపోయింది. ఇక బీబీని ఆ బీబీనాంచారమ్మ భర్తే కాపాడాలి అనుకుని ఆ పేపరలోనుండి వివరాలను కంప్యూటర్లోకి ఎక్కిస్తోంది. అలా చేస్తుండగా ఆమెకు హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. అవును. అదొక్కటే చివరి మార్గం. వివరాలు ఎక్కిస్తూ కంప్యూటర్కి పవర్ కనెక్ట్ చేసిన బోర్డ్ మీద స్విచ్చిని తన కాలితో ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేసింది. స్క్రీన్ మొత్తం బ్లాక్ అయ్యింది. మళ్ళీ బూట్ అవుతోంది.
“షిట్, సిస్టమ్ రీబూటవుతోంది. యూపీఎస్ పెట్టించమంటే పెట్టించరు” అని విసుగు నటించింది.
ఇంకో పావుగంటలో మళ్ళీ వివరాలు ఎక్కించాక మళ్ళీ ఆఫ్ ఆన్ చేసింది. అలా రెండుసార్లు చేశాక
“సార్, సిస్టమ్ క్రాష్ అయ్యేటట్టుంది. పైపెచ్చు నాకు ఈ రోజు మధ్యాహ్నం జోనల్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది. అన్నా, రేపు ఉదయం చేద్దాము. బీబీ గారు రాకపోయినా ఫరవాలేదు” అంటూ పేపర్లన్నీ మడిచి తన బ్యాగులో పెట్టుకుంది.
అందరూ కొంత నిరాశకు గురైనా ఎలాగూ రేపు చేసేస్తాము కదా అనే నిబ్బరంతో పైకి లేచారు. సరోజ బయటకొచ్చి తన స్కూటీ తీసుకుని జోనల్ ఆఫీస్ వైపు వెళ్ళింది.
***
ఐదుగంటలకు మీటింగ్ ముగించుకుని బయటపడింది సరోజ.
ముందుగా అనుకున్నట్టుగా బ్యాగులోనుండి ఫాతిమా అప్లికేషన్ తీసి అందులో ఆమె మొబైలుకు కాల్ చేసింది.
ఫోన్ తీయగానే తనను తాను పరిచయం చేసుకుని అలాగే ఆంథోనీ స్కూలు విద్యార్ధిని అని చెప్పుకుని ఆమె ఇచ్చిన అడ్రసు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆరయింది. వెళ్ళాక సరోజ ఆమెకు వివరంగా బ్యాంకు పరిస్థితి చెప్పింది. తను వేయబోయేది చాలా మొత్తం కాబట్టి అది తిరిగి తను అడిగినప్పుడు తనకు దక్కే అవకాశాలు తక్కువని చెప్పింది. అసలు ఒక బ్యాంకు ఉద్యోగస్థురాలుగా తాను ఇట్లా మాట్లాడగూడదని అయితే కష్టపడి సంపాదించిన డబ్బు, ఒక శుభకార్యాన్ని నిర్ణయించే డబ్బు తనని ఒక పట్టాన నిలవనీయలేదని, తానూ ఒక తల్లినేనని, అందుకే, ఆ బాధతోనే ఇంతకీ తెగించి ఆమె దగ్గరకు వచ్చానని, మధ్యాహ్నం తను కావాలనే పవర్ తీసేసి సిస్టమ్ క్రాష్ అయినట్లు నటించానని, తను లేకపోయినా బీబీ సంతకం చేసిన పేపర్లు ఉన్నాయి కాబట్టి, తాను వెళ్ళాక వాళ్లేమైనా ప్రయత్నిస్తారేమోనని ఆమె సంతకం చేసిన పేపర్లు తన బ్యాగులో పెట్టుకున్నానని, తనకు కూడా ఆర్థికంగా నష్టమైనప్పటికీ చిన్నప్పటి ఆయమ్మకు ఇలా సహాయం చేయడం తనకెంతో తృప్తినిస్తుందని చెప్పింది.
తాము కలిసిన విషయం ఐదోకంటికి తెలియకూడదన్నది – చివరికి వినోద్ అడిగితే కూడా ఏదో కారణం చెప్పి తప్పించుకోమని చెప్పింది. సంతకం చేసిన పేపర్లు ఉన్నాయని వాళ్లేమైనా చేయాలనుకుంటే కూడా తాను ఆ పేపర్లు ఇంట్లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నానని చెబుతానని చెప్పింది.
ఆయమ్మ అన్నీ ఓపికగా విన్నది. సంతోషం బిడ్డా అని దీవించింది. నీ చల్లని మనసు ఇలాగే ఉండాలని ఆశీర్వదించింది.
తిరిగి స్కూటీమీద ఇంటికెళుతుంటే సరోజ మనసు ఏదో గొప్ప విజయం సాధించినట్టు గాలిలో తేలిపోతోంది. తను ఇంత సాహసం చేసిందా అని ఆశ్చర్యపోతోంది. ఇంటికెళ్ళి భర్తతో అర్జెంటుగా అన్ని విషయాలు పంచుకోవాలని ఆమె మనసు తొందరపడుతోంది. తోటి మనిషికి చేసే సహాయం ఇంత ఆనందాన్నిస్తుందా అని అబ్బురపడుతోంది. అలాంటి ఉప్పొంగుతున్న సంతోషంతోనే ఇల్లు చేరింది.
***
మరుసటి రోజు పిల్లవాడికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండడంతో స్కూలుకు హాజరై అట్నుంచి అటే బ్యాంకుకి వెళ్ళేసరికి పన్నెండున్నరయింది. ఒకలాంటి విజయగర్వంతో స్కూటీ పార్క్ చేసి ఆఫీసులోపలికి అడుగు పెట్టింది. శీను, రావు గారు ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
తను సిస్టమ్ ఆన్ చేసి లాగిన్ అయ్యాక రావు గారి వైపు చూస్తూ
“ఇప్పుడు బాగానే పనిచేస్తోందండీ, నిన్నేమి రోగమొచ్చిందో” అని “అయ్యయ్యో నేను ఫాతిమా గారి పేపర్లు మర్చిపోయి వచ్చానే ఇపుడెట్లా?” అని పొరపాటుని నటించింది.
“ఫరవాలేదులేమ్మా, నా సిస్టమ్‌లో చేసేశాము” అన్నాడు కామేశ్వరరావు.
“అదేంటి, పేపర్లు లేకుండానే” అంది.
“కొత్త ఫారాలు నింపారు”
“ఎవరు? ఫాతిమా వచ్చిందా?” ఆశ్చర్యపోతూ అడిగింది
“అవును. వినోద్, ఫాతిమా వచ్చారు”
సరోజకు తల తిరిగిపోతోంది. శరీరం వశం తప్పుతోంది. ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది. పెద్దగా ఊదిన బుడగ ఠప్పుమని పగిలినట్టు ఆనందం ఆవిరైపోయింది. ఎంతకాలమూ ఇలా మోసపోవడమేనా? అంత వివరంగా నిజాలు చెప్పినా మళ్ళీ ఫాతిమా ఎలా వచ్చింది? ఏ ఆశ, ఏ మాయ ఆమెను ఇక్కడకు పిల్చుకుని వచ్చింది? యక్ష ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన వివరణే ఇక్కడా వర్తిస్తుందా? తన పక్కవాడు మోసపోతున్నా తనను మాత్రం ఎవరూ మోసం చేయలేరనే వెర్రి నమ్మకమే కారణమా?
ఎరలను ఆహారంగా తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరిన చేప మనిషి గాలానికి కట్టిన ఎరని కొరికి తానే ఆహారంగా మారినట్టు, అధిక వడ్డీ అనే ఎరకు ఫాతిమా కూడా బలవుతోందా? హఠాత్తుగా ఫాతిమా కొడుకు గుర్తొచ్చాడు. పరాయి దేశంలో తిన్నాడో, పస్తులున్నాడో తెలియదు. చెల్లెలి పెళ్లి అని ఎంత బాధ్యతతో పంపాడో? ఎంత రక్తం చెమట అంటిన డబ్బో కదా అది! అమ్మాయి పెళ్లి కుదిరినప్పుడు జరిగే సన్నివేశం గుర్తొచ్చి భయం వేసింది. వెంటనే బాధ దుఃఖం తన్నుకుని వస్తున్నాయి. ఎంత కాపాడాలని ప్రయత్నించినా ఆపలేకపోయిందే.
“ఆ ముసలామెకు ఎవరో బ్యాంకు గురించి చెప్పినట్టున్నారట. అందుకే ఏవేవో ప్రశ్నలేసిందన్నాడు. అయినా మనవాడు సామాన్యుడా? ఏవో మాయమాటలు చెప్పి మళ్ళీ తీసుకునొచ్చాడు” ఖుషీగా వినోద్ పట్ల ప్రశంశతో అన్నాడు కామేశ్వరావు.
సరోజ విరక్తిగా నవ్వింది. బాధగా తలవంచుకుని కూర్చుంటుంటే రావుగారి మొబైలులో నుండి ప్రవచనకారుడెవరో “సత్యాన్ని మాయ కప్పేయడమే జీవితం” అంటున్నాడు.