[జార్ట్ స్ట్రెయిట్ పాడిన ‘‘యు నో మి బెటర్ దాన్ దట్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జార్ట్ స్ట్రెయిట్ – యు నో మి బెటర్ దాన్ దట్ (జూన్ 1991)
- ఆల్బమ్ – చిల్ ఆఫ్ ఆన్ ఎర్లీ ఫాల్
- రచన – అన్నాలిసా గ్రాహం, టోనీ హాసెల్డెన్
- నిర్మాత – జిమ్మీ బోవెన్, జార్జ్ స్ట్రెయిట్
~
U.S. బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సింగిల్స్ & ట్రాక్స్ చార్ట్, కెనడియన్ RPM కంట్రీ ట్రాక్స్ చార్ట్ రెండింటిలోనూ 1వ స్థానంలో నిలిచిన పాట ఇది. ‘చిల్ ఆఫ్ ఆన్ ఎర్లీ ఫాల్’ ఆల్బంలో రెండవ పాటగా ఇది రిలీజ్ అయింది. ఇలాంటి పాట నాకు మన భాషలలో కనిపించలేదు. దానికి సాంస్కృతిక భిన్నత్వాలు కారణాలు కావచ్చు. ఎందుకంటే రెండవ ప్రియురాలి గురించి మొదటి ప్రియురాలికి మొరపెట్టుకునే ఆధునిక సాహిత్యం మన దగ్గర పాటల రూపంలో దొరకదు. మన పురాణాలలో ఇలాంటి ఉదంతాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి ఇది మనకు కొత్తగానూ అనిపించదు. మన ఆధునిక సాహిత్యంలో మాత్రం ఇలాంటి గీతాలు ఇంచుమించు లేవు. కాని ఆ భావం మనకు పరిచయమే కాబట్టి ఈ పాటలోని నిజాయితీ మనల్ని ఆకట్టుకుంటుంది.
ఏదో కారణంతో కొన్నాళ్లు దగ్గరగానూ, ఒకటిగానూ మసిలిన ఓ జంట దూరం అవుతారు. కొత్త దారుల్లో, కొత్త జీవితాలను ఎంచుకోవడంలో మునిగిపోతారు. ఇద్దరూ మరెవరితోనో జత కడతారు. కాని వారి జీవితాలలోకి కొత్తగా వచ్చిన ఆ ప్రేమికులకు వీరి గురించి ఎక్కువ తెలియదు. ఎవరి ఊహల్లో వారు ఉండి ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు వాస్తవం కన్నా ఊహల ప్రభావం ఎక్కువుంటుంది. అంతా అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. విడిపోయిన ఆ ప్రేమికులకు ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఒకరి బలహీనతలు, కోపతాపాలు అన్నీ పూర్తిగా తెలుసు.
ఆ ప్రియుడి జీవితంలోకి వచ్చిన కొత్త ప్రియురాలు ప్రేమ మత్తులో ఈ ప్రియుడిని గొప్పగా ఆరాధించేస్తూ ఉంది. ఇది ఆ ప్రేమికుడికి ఇబ్బందితో పాటు భయం కలిగిస్తుంది. తనను ఎంతో ఎత్తులో ఊహిస్తున్న ఆ ప్రియురాలికి తన అసలు గుణం, సహజమన బలహీనతలు తెలిస్తే ఎలా అన్న భయం అతన్ని ఇబ్బంది పెడుతుంది. మొదటిసారి ప్రేమలో ఉన్నప్పుడు తనను అవతలి వ్యక్తి ఆరాధిస్తుంటే అతనూ ఆనందించాడు. కాని కొన్నాళ్లకు ఆమెకు తన గురించి పూర్తిగా అర్థం అయ్యాక విడిపోవడం అతనిలో అంతర్లీనంగా అభద్రతాభావాన్ని నింపింది. ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన ఈ అమ్మాయి తనని హీరోలా ఆరాధిస్తుంటే మొదటి అనుభవంతో అతనికి ఆనందం కన్నా భయం ఎక్కువ కలుగుతుంది. ఆ భయంలో మొదటి ప్రియురాలు అతనికి గుర్తుకొస్తూ ఉంది. ఆమెతో మౌనంగా సంభాషిస్తూ ఆలోచిస్తున్నాడు. అదే పాట రూపంగా జార్జ్ పాడుతుంటే మానవ బలహీనతలు, ప్రేమ బంధాలలో ప్రేమికులు ఆస్వాదించే ఊహాత్మక భావాలు, ఒకరిపై ఒకరేర్పరుచుకున్న అభిప్రాయాలు, అంచనాలుగా మారి ఎలా తర్వాత వారిని ఇబ్బంది పెడతాయో వివరించే పాట ఇది.
Baby, since you left me, there’s somebody new
She thinks I’m perfect, I swear
She likes my body, my class and my charm
She says I’ve got a confident air
She respects my ambition, thinks I’m talented too
But she’s in love with an image time is bound to see through
అతన్ని తన ప్రియురాలు గొప్పగా ఊహించుకుంటుందని ఈ ప్రియుడు భయపడుతున్నాడు. ఆమె తన ఊహాప్రపంచంలోని చిత్రాన్ని మాత్రమే ప్రేమిస్తుందని, తనను ఆ చిత్రంగా ఊహించుకుంటోందని, తాను ఆమె అనుకుంటున్నంత పరిపూర్ణమైన వ్యక్తిని కానని అతనికి తెలుసు. అతని మొదటి ప్రియురాలికి ఇది ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయి తనపై ఏర్పరుచుకుంటున్న అభిప్రయాలన్నీ కొన్నాళలకు వీగిపోతే, అది తమ మధ్య ఎలాంటి దూరం పెంచుతుందో అని తన మొదటి ప్రేమ ఇచ్చిన అనుభవంతో అతను భయపడుతున్నాడు.
Oh, you know me better than that
You know the me that gets lazy and fat
How moody I can be, all my insecurities
You’ve seen me lose all my charm
You know I was raised on a farm
Oh, she tells her friends I’m perfect
And that I love her cat
But you know me better than that
(నీకు నా గురించి అంత కన్నా బాగా తెలుసు. నాలోని ఒళ్లు పెంచుకునే బద్దకస్తుడు నీకు పరిచయమే. నేనెంత మూడీగా ఉండగలనో, నా అభద్రతాభావాలన్నీ నీకు తెలుసు. నా చార్మ్ అంతా పోగొట్టుకోవడం నువ్వు చూసావు. నేను ఓ ఫార్మ్‌లో పెరినవాడినని నీకు తెలుసు. ఆమె మాత్రం తన స్నేహితులందరితో నేను పర్ఫెక్ట్ అని, తన పిల్లిని కూడా ప్రేమిస్తానని చెప్పుకుంటుంది. కాని నీకు నా గురించి అంతకన్నా ఎక్కువే తెలుసు.)
అతని ఆకారాన్ని, ఆహార్యాన్ని చూసి అతనికి తన శరీరం పట్ల ఎంతో శ్రద్దని, క్రమశిక్షణ కలవాడని ఆ కొత్త ప్రియురాలు అనుకుంటోంది. కాని బద్దకంతో ఒళ్ళు పెంచేసుకునే అతని స్వభావాన్ని ఆమె ఇప్పటిదాకా చూడలేదు. ఇది అతనితో కొన్నాళ్లు గడిపిన ఆ పాత ప్రియురాలికి తెలుసు. అతను ఇప్పుడు చూపే చార్మ్ ఎంత త్వరగా పోగొట్టుకుంటాడో, ఎంత మామూలుగా మిగిలిపోతాడో దానికి ఆమె మౌన సాక్షి.
I miss picnics and blue jeans and buckets of beer
Now it’s ballet and symphony hall
I’m into culture, clean up to my ears
It’s like wearing a shoe that’s too small
(నేను ఆ పిక్నిక్‌లను. బ్లూ జీన్స్‌ను బక్కెట్ల కొద్ది బీరును మిస్ అవుతున్నాను. ఇప్పుడు బాలెట్లు, సింఫనీ హాల్‌ల చుట్టూ తిరుగుతున్నాను. సంప్రదాయాన్ని పాటిస్తూ, చెవుల దాకా శుభ్రం చేసుకుంటున్నాను. నాకు చాలా చిన్న షూ వేసుకుని తిరుగుతున్నట్లుగా ఉంది.)
ఈ పై చరణం వింటుంటే, ప్రేమికులు తమ ఐమేజ్ కోసం పడే తాపత్రయానికి నవ్వు వస్తుంది. నిజానికి ఆ అమ్మాయి అతనిపై పెట్టుకున్న అంచనాలు, ఏర్పరుచుకున్న అభిప్రాయాల కారణంగా ఈ ప్రేమికుడు తనను తాను మార్చుకుంటున్నాడు. ఇలా తాను ఎప్పటికీ ఉండలేనని అతనికి తెలుసు. అంతకు ముందులా స్వేచ్చగా పిక్నిక్ లకు వెళ్లలేక, హాయిగా జీన్స్ తో తిరగలేక, కావల్సినంత బీరు తాగలేక స్వేచ్చ కోల్పోయి జీవిస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి ఊహించుకుంటున్న స్టేటస్ చిహ్నాలు కావు. అందుకని వాటిని మానేసి బాలెట్లు చూస్తూ సింఫనీ హాల్‌లో సాంప్రదాయ నృత్యాలు చూస్తూ తనది కాని జీవితం జీవిస్తున్నాడు. ఇది తన కాలును చిన్న షూలో ఇరికించేసి నవడమన్నట్లుగా ఉంది. ఆ బాధ అతనికొక్కడికే అర్థం అవుతుంది. అతను అలాంటి అభిరుచులు ఉన్నవాడు కాదని తెలిసిన ఆ మొదటి ప్రేయసి, అందుకే ఆ ఇబ్బందిలో మరీ మరీ గుర్తుకొస్తోంది.
Oh, I caught her with an issue of Brides magazine
Starin’ at dresses and pickin’ out rings
But you know me better than that,
You know the me that gets lazy and fat
How moody I can be, all my insecurities
You’ve seen me lose all my charm
You know I was raised on a farm
(నేను ఆమె పెళ్లికూతుర్ల పత్రికలు చూస్తుండగా చూసాను. పెళ్లి దుస్తులు, ఉంగరాలను ఆమె ఆసక్తిగా చూస్తుంది. నీకు నా గురించి ఆమెకన్నా బాగా తెలుసు. నేను బద్దకస్తుడినని, ఒళ్ళు పెంచుకునే సోమరినని మూడీగా ఉంటానని, నా అన్ని అభద్రతలు నీకు ఎరుకే. నా చార్మ్ ఎలా కొన్నాళ్లకే నేను పోగొట్టుకుంటానో కూడా నీకు తెలుసు నేను ఓ ఫార్మ్ లో పెరిగినవాడిని)
ఆ ప్రియురాలు ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకే ఆసక్తిగా పెళ్ళి దుస్తులు ఉంగరాల డిజైన్లు చూసుకుంటుంది. కాని ఇతని అసలు గుణాలు, ఇతని నిజమైన హోదా పట్ల ఆమెకు అవగాహన లేదు. ఇతను ఆమె కలలకు అనుకూలంగా ఆ కాసేపు నడుచుకుంటున్నాడు. కాని ఇలా ఎన్నాళ్లు అన్న భావం అతన్ని కలవరపెడుతోంది. తానో పొలంలో పెరిగిన వాడినని ఆ కొత్త ప్రియురాలు ఊహించుకుంటున్న సామాజిక హోదాకు చెందిన వాడిని కానన్న నిజం అతన్ని భయపెడుతోంది.
Oh, she tells her friends I’m perfect
And that I love her cat
But you know me better than that
Oh, she tells her friends I’m perfect
And that I love that cat
Oh, but you know me better than that..
(ఆమె నేను ఫర్ఫెక్ట్ అని, తన పిల్లిని కూడా ప్రేమించగల గొప్ప ఔదార్యం ఉన్నవాడినని చెప్పుకుంటుంది. కాని నీకు నా గురించి బాగా తెలుసు)
ఈ పాటను జార్జ్ ఎంత బాగా పాడతాడంటే మనకు ఆ ప్రేమికుడి పట్ల జాలి కలుగుతుంది. చాలా మంది మగపిల్లలు ఈ పాటతో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. మగపిల్లల తల్లులు తమకు పరమ రోత కలిగించే తమ పుత్రరత్నాలు మరొకరి దృష్టిలో ఎలా హీరోలు అయ్యారా అని ఆశ్చర్యపోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ పాటతో అలాంటి తల్లులు కూడా ఐడింటిఫై అవుతారు. మన రోజువారి జీవితాలకు మనం బైటికి ప్రదర్శించే జీవితాలకు నడుమ వ్యత్యాసం ఎంత ఉంటుందో, అది మనకు కొన్ని సార్లు మేలు చేసినా, చాలా సందర్భాలలో ఆ వ్యత్యాసమే మనుష్యులు వీడిపోవడానికీ కారణం అవుతుంది. ఆ నిరాశల వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించే మంచి గీతం ఇది.
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/cx0tgdaXUe8?si=aNMOphUbS1iG0FAb )

