Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధ దృశ్యాలు

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘యుద్ధ దృశ్యాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

స్థితి అతి భీకరంగా ఉన్నది!
మారణాయుధాలు
నిప్పులు గ్రక్కుతూ
జనావాసాలపై కురిసి
విస్ఫోటిస్తుంటే
ప్రాణ రక్షణకై ప్రజానీకం
కాకావికలౌతున్న దృశ్యాలు
హృదయ విదారకాలౌతున్నవి!
దుర్భర దుఃఖ దాయకాలౌతున్నవి!

భారీ బాంబుల పేలుళ్లతో
భవనాలు నేల మట్టమై
నుగ్గు నుగ్గౌతుంటే
తూట్లు పడిన
మృత దేహాల మధ్య నుండి,
గాయపడి దొర్లుతూ రోదించే
అనేకుల నడుమ నుండీ
రక్షిత ప్రాంతాలకై కొందరు
పటాపంచలౌతున్న సన్నివేశాలు
దుస్సహ బాధా కారకాలౌతున్నవి!

పరిస్థితి
అత్యంత బీభత్సంగా ఉన్నది!
ఇదేమి క్రూర సమరం!
ఇదేమి ఘోర సంహారం!
ఇదేమి అమానుషత్వం స్వైరవిహారం!
ఇదేమి కర్కశ కాలాచారం!
పసి పిల్లలను
నిరపరాధులనూ
పాశవికంగా బలిగొంటున్న
దానవీయ యుద్ధ దండ యాత్రలో
సర్వస్వం కోలుపోయిన పౌరులు
వెర్రెక్కినట్లు
చెల్ల చెదరౌతున్న రీతులు
గుండెను చీల్చే రంపపు కోతలు!

కదన రంగం
కడు భయంకరంగా ఉన్నది!
కలహానికి
యుధ్ధోన్మాదుల రుధిర దాహానికీ
కనికరం ఉండడం కల్ల!
‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ’
రణ నినాదాలు డొల్ల!

యుద్ధ పర్యవసానం ఎంత దారుణం!
నిరాశ్రితుల ఆర్తరావాలు
క్షత గాత్రుల రక్త స్రావాలు
ధరాపటలమౌతున్న
జన సమూహలు
సమసిపోతున్న మూగ జీవాలు
దద్దరిల్లుతూ ప్రతిధ్వనిస్తున్న
పర్వత గహ్వరాలు
సమూలంగా
సర్వనాశనమౌతున్న
స్థానికుల స్థావరాలు
నీచ నికృష్ట రణ రక్త
పిపాసకులకు
వినోదం కలిగించే
ఘాతుక ఘటనల ప్రతిరూపాలు!

అంతటా
రాకాసి పోరు కసి క్రమ్ముకున్నది!
దగ్ధ గృహాల బూది నుసి ముసురుకున్నది!
జ్వలిత కళేబరాల ఉసి అలముకున్నది!
మండి మంట గలిసిన
మానవత్వపు మసి నిండి ఉన్నది!

Exit mobile version