[డా. చిట్యాల రవీందర్ రచించిన ‘యుద్ధ మేఘాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కారుమబ్బులై కమ్ముకొచ్చెను కదన రంగమున యుద్ధ మేఘాలు
శతఘ్నుల గర్జనలతో బద్దలయ్యెను శాంతి కాముకుల గుండెలు
శవాల దిబ్బలపై వెలసెను రాజ్య కాంక్షల రాచరిపు గద్దెలు
నాడు కత్తుల వేటుకు నేల తల్లి రక్తపు ముద్దయై తల్లడిల్లెను
నేడు క్షిపణుల ధాటికి నింగి సైతం నిప్పుల కొలిమై మండిపోయెను
నాడు కవచాల సందున ప్రాణం విలవిలలాడి నేల రాలెను
నేడు బంకర్ల నీడన బ్రతుకు భయం భయంగా గడిచిపోయెను
ఆకలి కేకల మధ్య అల్లాడిపోయే పసిపిల్లల ఆర్తనాదాలు
ఆత్మీయుల బాహువులకై వేచి చూసే అభాగ్యుల నిరీక్షణలు
గ్రామాలకు గ్రామాలే స్మశానాలై మూగబోయిన దృశ్యాలు
చరిత్ర అంచున మిగిలినవి శోకంతో నిండిన వీర గాథలు
ఏ దేశము గెలిచినా ఓడిపోయేది మాత్రం మానవత్వమే
ఏ జెండా ఎగిరినా కూలిపోయేది మాత్రం సామాన్యుడి గృహమే
ఆధిపత్య పోరులో ఆహుతయ్యేవి అసంఖ్యాక అమాయక జీవాలు
అధికార దాహానికి బలైపోయేవి వెలకట్టలేని అందమైన కలలు
నాడు కౌరవ పాండవుల కురుక్షేత్రం నేల పచ్చదనం హరించెను
నేడు అగ్రరాజ్యాల పంతం అణు విస్ఫోటనానికి దారి తీసెను
గగన తలమున ఎగిరే పక్షుల రెక్కలు సైతం కాలిబూడిదయ్యెను
గర్భమున ఉన్న శిశువుకు సైతం మరణ వాసన చేరువయ్యెను
పంట పొలాలు నేడు బాంబుల గుంతలై దర్శనమిచ్చును
పసిడి వెలుగులు నింపాల్సిన కళ్ళు భయంతో మూతపడును
శాంతి కపోతాలు నేడు నెత్తురు తడిసి నేలకొరుగగా
విశ్వవ్యాప్త మానవత నేడు విష వలయంలో చిక్కుకొనును
ఎందుకీ రక్తపాతం? ఎందుకీ ప్రాణాల హరణం?
మట్టి కోసం మనిషిని చంపడం కన్నా ఏమున్నది ఘోరం?
సరిహద్దుల రేఖలు, ఆయిల్ వ్యాపారం, యురేనియం
నిక్షేపాలు సమూల సంక్షోభానికి కారణం
ఆయుధాల మోత కన్నా అమూల్యమైనది ప్రేమ కీర్తనం
శాంతి గీతం గొంతెత్తి చాటుదాం
ఆయుధాల వెలుగుల కన్నా అన్యోన్యతను పెంచుదాం
యుద్ధ మేఘాలు వీడి ప్రేమ జల్లులు కురియాలి
లోకమంతా ఒక్కటేనన్న సమభావన విరియాలి
వినాశనానికి చరమగీతం పాడుదాం ఏకమై
నిర్మాణానికి పునాదులు వేద్దాం నిశ్చల దీక్షతో
యుద్ధం లేని ప్రపంచమే రేపటి తరాలకు మనం ఇచ్చే కానుక
అదే మానవజాతికి అసలైన, అత్యంత అమూల్యమైన వేడుక!
