Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధ మేఘాలు

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘యుద్ధ మేఘాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మేఘాలు ముసిరితే వీచే గాలులకు
విచ్చుకుని వాన వెల్లువవుతుంది
స్వార్థం నిండిన మనిషి
మనసున మూగిన ద్వేషాలు
మారణకాండని సృష్టిస్తున్నాయి
యుద్ధమంటే రెండు రాజ్యాల మధ్య
రాజ్యకాంక్షతో భూమి కోసం జరిగేదానాడు
చతురంగబలాలలో ఏవో
కొన్ని ఆహుతయ్యేవి
నేడు జరిగే యుద్ధాలు
స్వార్థపరుల క్రీడా వినోదం
పైశాచికానంద వికటాట్టహాసం
ప్రపంచమంతా భీతిల్లేలా సాగుతున్నది
ప్రపంచపౌరులంతా భయంభయంగా
బతుకీడుస్తున్నారు
ఇంధనాల కొరత వస్తుందా
రైతు పంట పండించకపోతే
నిత్యావసరాలు కరువైపోతాయేమో
తినటానికి తిండి కరువై
డొక్కలు మాడుతున్న జీవులెన్నో
శరాఘాతం ఒక్క ప్రాణాన్నే బలికొంటే
బాంబుల వెల్లువకెందరు బలో
బడి మీద బాంబు పడి ఏమీ తెలియని
అమాయక పసిప్రాణాలెన్ని కాలిపోయాయో
బంకర్ల బంకర్లలో దోబూచులాటలలో
ఆబాల వృద్ధాదులకెన్ని యాతనలో
గుహ దాటితే మరణమే శరణ్యం
కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని
భూమ్యాకాశాలనడుమ దట్టంగా కమ్మిన
బాంబుల మేఘపటలాలు
భయం కలిగిస్తుంటే
యుద్ధమంటే ప్రాంతీయ సంఘర్షణ
ప్రపంచ సంక్షోభంగా మారితే
ప్రపంచ దేశాల పౌరులందరూ
తమ తప్పులేక తెలియక
తప్పు చెయ్యకపోయినా వచ్చే
పరిణామాలను ఎదుర్కోలేక
ప్రమాదం ముంచుకొస్తుందేమోనని
యుద్ధం పోయి శాంతి రావాలని
నీలాల గగనాన చూపు నిలిపి
కనురెప్ప వేయక చూస్తున్న
జనం కళ్ళల్లోని ఆశలకు
యుద్ధ మేఘాలు
ఆవిరి అయ్యేది ఎన్నడో
తెల్లని శాంతి కపోతం
స్వేచ్ఛగా ఏగిరేదెప్పుడో.

Exit mobile version