Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధం

[డా. శ్రీమతి కొఠారి వాణీచలపతి రావు గారు రచించిన ‘యుద్ధం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

‘ఈ జీవితం ఓ యుద్ధరంగం. మనమంతా వీర సైనికులం. పొద్దున లేస్తే చిన్నదో పెద్దదో యుద్ధం. మనిషికి మనిషికీ యుద్ధం. మనిషికి మనసుకూ యుద్ధం. ఇంట్లో యుద్ధం – బయట యుద్ధం. బతుకుతో యుద్ధం – చావుతో యుద్ధం.

ఈ యాభైఏళ్ళ జీవితంలో నేనూ చిన్నా చితకా యుద్ధాలు చాలానే చేసాను. కానీ ఈ మధ్య మా పక్కింట్లో కాపురం ఉండే ఆ బ్రహ్మాజీరావుతో రోజుకో యుద్ధం చేయ్యలేక చస్తున్నాను.

మనసు ఎంత విసిగిపోయింది అనటానికి నా మనసులో వీరావేశంతో పుట్టకొస్తున్న యుద్ధపుటాలోచనలే అందుకు సాక్షి.

పొరుగువాడు మంచోడు కాకుంటే మహా కష్టమబ్బా! నిత్య న్యూసెన్స్!’ అనుకున్నాడు త్యాగరాజు తలపట్టుకుంటూ.

‘వాడు అసలు ఆ ఇల్లు కట్టుకునేటప్పుడే నా జాగాలో నుంచి ఆరు గజాలు వాడి జాగాలో కలుపుకొని కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు. ఆ విషయం రెండు సంవత్సరాల తర్వాత తను తన ఇంటి పునాదులు తవ్వటానికి ముగ్గు పోస్తున్నప్పుడు బయటపడింది. ‘అదేంటి’ అని అడిగితే ‘నేనేం కలుపుకోలేదు. సరిగా కొలుచుకో’ అంటూ అడ్డం వాదించాడు – అనుకుంటుంటే ఒళ్లు మండిపోతోంది త్యాగరాజుకు. అప్పుడే వాడితో వార్ మొదలుపెట్టడానికి శంఖం పూరించేవాడు గానీ శంఖుస్థాపన పనులలో బిజీగా ఉండి కొంతా, ‘వాడు గండ్రాగొండి మనిషిలా వున్నాడండీ చూస్తుంటే! పైగా పక్కలో బల్లెంలా పక్కనే చేరాడు, పగబట్టాడంటే ఇది అసలీ స్వంత ఇల్లు గనుక లాక్కోలేం, పీక్కోలేం అన్నిట్ట సంకటమైపోతుంది మన పరిస్థితి’ అంటూ త్యాగరాజు పెళ్ళాం భువనేశ్వరి వాడికన్నా ముందు తనే బస్సు బుస్సుమంటూ బుసలుగొట్టి హడలగొట్టింది. కొడుకులు సైతం ‘పోనీయ్ నాన్నా. ఆరు గజాలేగా. దుష్టుడికి దూరంగా ఉండాలిగానీ వాడ్ని రెచ్చగొడితే ఎలా? మనకే నష్టం.’ అంటూ యుద్ధభూమిలో వెనుదిరిగి వెన్ను చూపి పారిపోయివచ్చిన భీరువుల్లా దమ్ములేని మాటలు మాట్లాడారు.

దాంతో శత్రువు పక్కింట్లో లేడు, తన ఇంట్లోనే తనవాళ్ళ రూపంలోనే ఉన్నాడని అనిపించింది త్యాగరాజుకు. ‘పైకి ఆడకుయ్యిలా కనిపించే భార్య భువనేశ్వరి కిరీటంలేని మహారాణిలా సాఫ్ట్‌గా ఉంటూనే చక్రం తిప్పే మనిషి. కొడుకులు తన రాజ్యంలో తన పరిపాలన కింద ఉన్నట్టే వుంటూ వాళ్ళ పెళ్ళాలతో కలిసి రహస్యమంతనాలు చేస్తూ చాపకింద నీరులా చేరి సామ్రాజ్యాన్ని కొల్ల గొట్టాలని చూసే కుటుంబ ద్రోహులు. ఈ సామంతరాజులంతా ‘శత్రువు శత్రువు మిత్రుడు’ అన్నట్టు ఒకటై ఎప్పుడు తనను సింహాసనం మీద నుంచి దింపేసి పెత్తనం చేజిక్కించుకుంటారో తెలియదు.’ అనుకున్నాడు యుద్ధ భాష తప్ప మరో భాషరాని త్యాగరాజు,

ఆ రోజు అలా తన ఇంటిస్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసిన పొరుగువాడైన ఆ బ్రహ్మాజీరావు, తనను ఆగర్భశత్రువుగా చూస్తూ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాడు. వాడి పెళ్ళాం నాగేశ్వరి అయితే నాగుపాము కన్నా ఎక్కువగా ఒళ్ళంతా విషం నింపుకొని దాన్ని మధ్య మధ్య ఇవతలి ఇంట్లోకి కక్కుతూ వుంటుంది. వారిని వూడ్చేటప్పుడు వాళ్ళ పనిమనిషి చెత్తను ఈ ఇంటివైపు నెట్టడం – ఎవ్వరూ చూడనప్పుడు సందు ఊడ్వగా వచ్చిన కసువును త్యాగరాజు సందునున్న స్థలంలోకి విసరడం వంటి చెత్తపనులు చేస్తూ వుంటుంది. అది కూడా ఆ శత్రుకూటమి లోని మనిషే గనుక లోలోపలే కత్తులు నూరుతూ వుంటుంది. వాటి తళుకులు దాని కళ్ళలో – నూరుడు శబ్దాలు దాని పళ్ళల్లో కనిపిస్తూ, వినిపిస్తూ వుంటాయి.

‘మీ బాదం చెట్టు ఆకులు మా ఇంటివైపు రాల్తన్నాయన్నో, మా మామిడి చెట్టు కాయలు మేడమీది నుంచి మీరే కోసారు – మీ వైపు వచ్చినంత మాత్రాన అవి మీవై పోతాయా?’ అనో అమ్మ, ఈ పరిచారిక కలిసి జంట స్వరాలు హై పిచ్‌లో ఆలపిస్తూ వుంటారు. అవన్నీ రోజూ వినే శ్రోతలు మా కాలనీవాళ్లు కావడంతో ‘ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు – వాళ్ళిద్దరికీ పడదు.’ అని మా రెండిళ్ళకూ పేరుపెట్టారు అది చేరవేసిన వాళ్ళతో.

‘పాపం కాకులనెందుకూ అనటం – అవి చాలా కవివిడిగా ఉంటాయి. ఒక కాకికి ఆపద వచ్చిందంటే అన్ని కాకులూ గుంపులుగా అక్కడవాలి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంటాయి. మనిషే మరీ స్వార్థపరుడు. మరో మనిషి పొడగిట్టని తగవుల మారివాడు. అందుకే ఈ యుద్ధాలు. ప్రతి ఒక్కడి తనే ఎదగాలన్న దుగ్ధ. తనే ఆధిపత్యం చలాయించాలన్నీ అధికార దాహం. పక్కవాడు ఎదుగుతుంటే ఓర్వలేడు. నా మతం గొప్ప – నా దేశం గొప్ప. నేనే ఈ ప్రపంచాన్ని ఏలే రారాజును అంటూ అహాన్ని బాగా తలకెక్కించుకుంతున్నాడు. దాంతో వార్ – వార్. అంతర్యుద్ధాలు, ప్రపంచయుద్ధాలు – అణుదాడులు, క్లిపణి ప్రయోగాలు, బాంబుల మోతలు. కింది స్థాయి నుంచి అంటే మన మనసు మూలల నుంచి రగిలి రగిలి బయటకు వచ్చే ఈ విస్ఫోటనం ఆగాలంటే ‘మనిషి’ దెగ్గరినుంచి ప్రక్షాళన మొదలు కావాలేమో. ఇంటిపోరు ఇంతింతై ప్రపంచమంతా ఆ మంటలు వ్యాపించక ముందే మనిషి మనసులోని విద్వంసకర ఆలోచనలకు ఆది లోనే చెక్ పెట్టేయాలేమో!’ అనుకున్నాడు త్యాగరాజు, యుద్ధభేరీ లేవో దూరంగా వినిపిస్తుండటంతో కళ్ళెం తెంచుకున్న ఆలోచనలు పరుగు లంకించుకోవడంతో..!

***

ఆ రోజు త్యాగరాజు తల్లి గంగాభవాని పెట్టేబేడాతో ఊరి నుంచి దిగబడిపోయింది. ఆయనకు యాభైయేళ్ళయితే ఈవిడకు డెబ్బయి యేళ్ళు. చిన్నతనంలోనే పెళ్ళి చేసుకొని, యవ్వనంలో ఉండగానే భర్తను పోగొట్టుకొని, తాగరాజును నానా కష్టాలు పడుతూ పెంచి పెద్ద చేసింది. జీవితమంతా అత్తింట్లో చాకిరీ, బండెడు బాధ్యతలు కావటంతో ఆమె తనకంటూ ఒక నిశ్చింతైన జీవితాన్ని నిర్మించుకొని సుఖపడింది లేదు. ‘అందుకే నా జీవితమే ఒక యుద్ధం. బతుకంతా పోరాటమే తప్ప గెలిచింది. లేదు. చచ్చిందీ లేదు. ప్రస్తుతానికి మాత్రం యుద్ధవిరామం. మళ్ళీ ఎప్పుడు యుద్ధ భేరీలు మోగుతాయో. రోగాలు, రొష్టులు చెప్పలేను. కష్టపడే వాళ్ళను – ఎలాగూ అలవాటయిందిగా! అలా కష్టపడుతూనే ఉండు అంటాడు ఆ దేవుడు’ అని రోజుకు ఏ నాలుగుసార్లయినా స్వగతం మాట్లాడుతున్నాననుకొని అందరికీ వినబడేలాగే అంటుంది ఆమె.

అత్తగారు దిగబడిపోయింది అనగానే త్యాగరాజు భార్య, ఆమెకు కోడలు అయిన భువనేశ్వరి గుండెల్లో రాయి పడింది. ఆమెకు పూజలు, రామాయణ మహా భారత పఠనాలు; వాటితో పాటు చాదస్తాలూ ఎక్కువ, మొదటినుంచే పాకశాస్త్రంలో పండితురాలేమో, రుచులూ ఎక్కువే. ఆ వెనకటి కాలం వంటలన్నీ వండమంటుంది. ‘అన్నీ పద్ధతిగా చెయ్యాలి’ అన్నది ఆమె ఆదేశం. అమ్మ రాగానే భార్య ముఖంలో మారిన రంగుల్ని పరిశీలనగా చూస్తూ ‘యుద్ధం మొదలవుతుంది ఇక. అత్తాకోడళ్ళ మాటల యుద్ధం’ అనుకున్నాడు మనసులో త్యాగరాజు! ఆయన అలా అనుకుంటుండగానే “ఏవో దేశాల మధ్య ఇప్పుడు బాంబుల యుద్ధం జరుగుతోందట కదరా – ఆ దేశాల పేర్లు నాకు నోరు తిరిగి చావవు గానీ” అంది కొడుకును ఉద్దేశించి.

గంగాభవాని గొంతు గంట కొట్టినట్టు ఖంగున మోగుతుంటుంది. మాటల్లో ధృడత్వం, కచ్చితత్వం, అంతా తనకు తెలుసునన్న ఆత్మవిశ్వాసం మాటిమాటికీ తొంగి చూస్తుండటంతో నసుగుడు, నాన్చుడు వ్యవహారాలు జాన్తానై అన్నట్టు వ్యవహరిస్తూ వుంటుంది.

“అవునమ్మా. యుద్ధం భయంకరంగా, బీభత్సంగా నడుస్తోంది. బాంబుల మోతతో ఇరు దేశాలూ దద్దరిల్లిపోతున్నాయి. దాంతో సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీస్తున్నారు. మిసయిల్స్ వచ్చి మీదపడిన వాళ్ళు ఇళ్లు కూలి సజీవ సమాధి అవటమో, భీకర ఆగ్నిజోలల్లో మాడి మసిపోవటమో జరుగుతోంది. దేశాలు ఏవయినా వాటి మధ్య యుద్ధాలు మాత్రం పంతాలు, పట్టింపులు, కోపాలు! ఆవేశాలు వీటి కారణంగా తప్పటం లేదు” అన్నాడు త్యాగరాజు!

“యుద్ధాలు ఎప్పుడూ ఉండేవే. రామరావణ యుద్ధం, మహా భారతయుద్ధం, పల్నాటియుద్ధం, బొబ్బిలి యుద్ధం ఇలా ఒకటా రెండా. కాకుంటే అప్పుడు కత్తులు, కటార్లతో పోట్లాడుకున్నారు. ఇప్పుడు బాంబులు వేసుకుంటున్నారు” అంటూ గంగాభవాని గోడమీద వేలాడుతున్న కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి కృష్ణుడి గీతాబోధ చేస్తున్న చిత్రపటాన్ని చూసి “అయ్యో అదేంటిరా. ఈ బొమ్మను ఇంట్లో పెట్టారు. ఇది ఇంట్లో వుంటే కుటుంబసభ్యుల మధ్య గొడవలు వచ్చి అస్తమానం పోట్లాడుకుంటూ ఉంటారట. వెంటనే తీసెయి” అంది తీక్షణంగా దాని వంక చూస్తూ.

“ఎందుకమ్మా తియ్యటం – నీవన్నీ గుడ్డి నమ్మకాలు కాకపోతే. అయినా అది ఇంట్లో ఉన్నా నేను, భువనేశ్వరి బాగానే ఉంటాం. ఇక మనవడేమో హాస్టల్లోనే ఉంటాడాయే. నాలుగు నెలలకో ఆరునెలలకో ఒకసారి వస్తే ఎక్కువే. కాకుంటే మన పక్క నుండే ఆ బ్రహ్మాజీ గాడి తోనే ఎప్పుడూ ఏదో ఒక గొడవ వస్తుంటుంది. మహా మొండి మనిషిలే. వాడికి ఎంత తోస్తే అంతే తప్ప మనం చెప్పింది వినడు.” అన్నాడు త్యాగరాజు.

“అదే, ఏదయితేనేం మొత్తానికి నీకు మనశ్శాంతి లేకుండా పోతోందా లేదా? యుద్ధం అంటే కత్తులతో బాంబులతో చేసేదే కాదు. ఎదుటి వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం కూడా మాసికంగా ఒక పోరాటం లాంటిదే!” అంది గంగా భవాని.

ఇంతలో వెనక నుంచి భువనేశ్వరి అందుకుంటూ “మీ కొడుకు తక్కువేం కాదు లెండి అత్తయ్యా. ఆయన ధ్యాస అంతా ఎప్పుడూ పక్కింటివాళ్ళ మీదే! ‘ఏదోలే ఆ మనిషి స్వభావం’ అని అనుకోరు. కయ్యానికి కాలు దువ్వుతారు ప్రతిదానికీ. ఆయన్నేదో సాధించినట్టు అస్తమానం తిట్టిపోయటం. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. గమ్మునుంటే పోలా?” అంది భువనేశ్వరి.

“ఆ. అట్టా వుంటే వాడికి మరీ అలుసైపోతాం. టిట్ ఫర్ టాట్‌లా ప్రతీకారం చేయాల్సిందే. లేకుంటే ఆ శత్రువు రేపు మనింట్లో జొరబడి ‘ఇది నా ఇల్లు’ అంటాడు. నలుగురు మద్దతుదార్లను వెనకేసుకొని వచ్చి బెదిరిస్తాడు” అన్నాడు త్యాగరాజు.

“రేపు ఇంట్లోకి జొరబడి నానా యాగీ చేస్తాడా? అదంతా జరిగాక, ఇక ఆ గూండాగిరీ శక్తి ముందు మన శక్తులేం పనిచేస్తాయి?” అంది భువనేశ్వరి.

“బ్రిటీష్ వాడు అలా జొరబడిన బాపతే కదా” అన్నాడు త్యాగరాజు.

“ఇప్పుడవన్నీ గుర్తు చేయకండి. గతం గతః. గుర్తొస్తే ఆ విన్న కథలు, కోపంతో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ‘నాకింత సైనిక, విమానశక్తి, నీకింత’ అని మాట్లాడుకోవడమే గానీ శాంతి కపోతాలను ఎగరెయ్యాలని ఒక్కళ్ళకూ అనిపించదు. అరేయ్ త్యాగీ.. నీకు ఇప్పుడే చెబుతున్నా.. రోజూ కాసింత సేపు ఆ భగవద్గీత చేతిలోకి తీసుకొని చదవరా. మంచిదంటారు. చదవటం అయిపోయాక ‘ఓం శాంతి. శాంతి శాంతిః’ అని మాత్రం అనటం మర్చిపోకు.. శాంతిమంత్రం చాలా శక్తివంతమైనది. కముకుంటున్న యుద్ధమేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తి దానికి వుంది” అని తల్లి అంటుంటే త్యాగరాజుకు ఒక అనుమానం వచ్చింది. “అర్జునుడు నేను యుద్ధం చేయను మొర్రో అంటుంటే, ‘చెయ్యి చెయ్యి. అది క్షత్రియధర్మం’ అని ప్రోత్సహించాడు కదా ఆ శ్రీకృష్ణుడు?” అని అడిగాడు.

“అది ధర్మయుద్ధం రా. ధర్మం గెలవాలంటే యుద్ధం చేయక తప్పదు. కాకుంటే యుద్ధానంతరం సామాజికంగా ఆర్థికంగా జరిగే కష్టనష్టాల గురించే విజ్ఞుల ఆలోచన, ఆందోళన. యుద్ధమంటే మాటలు కాదు. అందులోనూ ఇప్పుడు జరిగేది రసాయనాల యుద్ధం. ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు దీర్ఘకాల దుష్పలితాలను ఎదుర్కోవలసి వస్తుంది సైనిక వీరులు, సామాన్య జనం అంతా” అంది గంగాభవాని.

తల్లి యుద్ధపరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయాడు త్యాగరాజు. “అవసరమైనప్పుడు యుద్ధాలు తప్పవు. ప్రతి దేశానికి ఒక రక్షణశాఖ ఉండేది శత్రువుల నుంచి దేశాన్ని ఎవరికి వారు కాపాడుకోవటానికే. అయినా యుద్ధాలు మంచివి కావు. త్వరగా సంధి కుదిరి యుద్ధం ఆగిపోతే బాగు. ఎలాంటి పరిస్థితిలోనూ యుద్ధం మంచిది కాదు” అన్నాడు త్యాగరాజు తల్లికి వినిపించేలా.

“ఓం శాంతి శాంతి శాంతిః” అంది గంగాభవాని రెండు చేతులూ జోడించి కనిపించని దేవుడికి దండం పెడుతూ.

***

‘ఒక మనిషి మనసులోని విపరీత కోరిక చిన్నస్థాయిలో అయితే పోరాటానికి, పెద్దస్థాయిలో అయితే యుద్ధానికి దారితీస్తుంది. పదవీ మోహం; ఆధిపత్యం కోసం ఆరాటం; అలవిగాని చోటు అయినా అధికులం కావాలనే చొచ్చుకుపోయే స్వభావం – ఇవన్నీ ఆ బాపతువే. ఎంతటి భీకరాగ్ని అయినా ఒక్క నిప్పురవ్వతోనే రగులుకొని విశ్వమంతా వ్యాపించినట్టు యుద్ధకాంక్ష కూడా ఒక మనిషి మెదడులో పుట్టిన ఒక స్వార్థపూరిత ఆలోచన తోనే ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇంకేముంది సర్వనాశనం’ అనుకున్నాడు త్యాగరాజు యుద్ధవార్తల్ని టీ.వీలో చూస్తూ, ఆ తరువాత కొద్ది సేపటికీ బ్రేకింగ్ న్యూస్.. ‘యుద్ధం ఆగిపోయింది’ అంటూ.

ఇంతలో పూజగదిలో నుంచి గంగాభవాని పరుగులాంటి నడకతో బయటికి వచ్చి “అరేయ్ త్యాగీ, యుద్ధం ఆగిపోయిందటరా! హమ్మయ్య నా మొర విన్నాడు ఆ దేవుడు. రోజూ దేవుడి ముందు కూర్చొని – దేవుడా ఈ యుద్ధం ఆగిపోయేలా చెయ్యి. పాపం అన్నెం పున్నెం తెలియని జనం యుద్ధజ్వాలల్లో మాడి మసైపోతున్నారు. చంటిపిల్లల్ని పొట్టకు అదుముకొని పెద్దలు ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి కాకుండా పోతున్నారు. యుద్ధ భూమిలో ప్రాణాలకు తెగించి పోరాడే వీరజవానుల వీరమాతలు, వీరపత్నులూ ఎప్పుడు ఏ చెడువార్త యుద్ధ భూమినుంచి వస్తుందోనని భయపడుతూ -బితుకు బితుకుమంటూ రోజులు వెళ్ళదీస్తున్నారు అంటూ ప్రార్థించాను” అంది గంగాభవాని ఆవేశం, ఆవేదన కలగలిసి గొంతులో ధ్వనిస్తుండగా.

“నీకు అన్నీ భలేగా తెలుస్తాయే అమ్మా, ఆ దేవుడొచ్చి నీ చెవిలో చెపుతాడేమో అన్నట్టు. అయితే రోజూ ‘రామా కృష్ణా’ అనుకోకుండాం ‘ఓం శాంతి శాంతి’ అంటూ శాంతిమంత్రాన్ని – సర్వజనా సుఖినోభవంతు అని ఫలశృతిని చదువుతూ ఆ విధంగా యుద్ధాన్ని నువ్వే ఆపించావన్న మాట” అన్నాడు త్యాగరాజు నవ్వుతూ.

“ఏమోరా – ఏదీ శాశ్వతం కాదన్నట్టు యుద్ధమూ అంతే. యుద్ధాలు వస్తూ పోతూ వుంటాయి; మనుషుల మధ్య అయినా దేశాల మధ్య అయినా ఈ రోజు గొడవ రేపటికి పాతబడి పోతుంది. ఈ రోజు కోపం రేపటికి తగ్గిపోతుంది. కానీ ఆ కోపంలో ఆ ఆవేశంలో ఉన్నప్పుడు జరిగిన విధ్వంసం మాత్రం ఆ చేసిన వాడ్ని జీవితాంతం పశ్చాత్తాప పడేలా చేస్తుంది. విధ్వంసం వల్ల చిత్రమైన ఎందరివో జీవిత శకలాలు – ఎందుకు చేసావీ సర్వనాశనం అని నిలదీసి ప్రశ్నిస్తూనే వుంటుంది. అందుకే చెడు చెయ్యటానికి ముందు ఎంతో ఆలోచన అవసరం. యుద్ధ బీభత్సం పట్ల ముందుచూపు ఉండటం అన్నది యుద్ధాన్ని అసలు దరిచేరనివ్వకుండా ఆపగల శక్తివంతమైన మంత్రం. నియంతలం అనుకుంటున్నవాళ్ళు మనసును అడ్డదార్లు తొక్కనివ్వకుండా అదుపులో పెట్టుకోగలిగితేనే అది సాధ్యం” చెప్పుకుంటూ పోతున్న తల్లి వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు త్యాగరాజు.

‘పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగి వంటిల్లు తప్ప మరో ప్రపంచం తెలియదన్నట్టు వుండే అమ్మది ఎంతటి విశాల ప్రపంచం. ఈ అవగాహన ప్రపంచం మొత్తాన్ని ఏలుతున్నామనుకునే పెద్దలకెందుకుండదు!’ అనుకున్నాడు త్యాగరాజు.

***

చెంపన చెయ్యి పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న భర్తను చూసి “ఏంటండీ, అంతగా ఆలోచిస్తున్నారు?” అని అడిగింది భువనేశ్వరి.

“కణకణ మండుతూ, ప్రళయాగ్నిలా లేచి ప్రపంచాన్నంతా భస్మం చేయగల మహాగ్ని కూడా ఒక్క నిప్పురవ్వలోనే ప్రారంభమవుతుంది భువనేశ్వరీ” అన్నాడు త్యాగి ఎటో శూన్యం లోకి చూస్తూ, తనలో తను మాట్లాడుకుంటున్నట్టు.

“అర్థం కాలేదు” అంది ఆమె.

‘దాన్ని ఆ రవ్వ దశలోనే ఆర్పకపోతే ప్రపంచాన్నంతా చుట్టబెట్టి బూడిద చేస్తుంది. ఆ అగ్గి రవ్వ పుట్టేది ఏదో ఒక రూపంలో మనిషి మనసులోనే’ అని అనుకుంటూ కూర్చున్న వాడు లేచి పొరుగువాడైన బ్రహ్మాజీరావు ఇంటివైపు నడిచాడు.

అప్పుడు అర్థమయింది భువనేశ్వరికి.

Exit mobile version