Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోపలి వెలుపలి పోరాటల అలజడి – ‘యుద్ధం మధ్యలో నువ్వు’ కవితా సంపుటి

[శ్రీ అఫ్సర్ గారి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ కవి, కథకుడు శ్రీ అఫ్సర్ తాజాగా వెలువరించిన కవితా సంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’. ఈ కవితా సంపుటిలో 2020 -2024 మధ్య వ్రాసిన 73 కవితలున్నాయి. ఇవి – కత్తి అంచుల మీద నిలబడి, ఆరుకాలాలూ మాయమైన చోట, పంజరాలని వోడించినప్పుడు అనే మూడు ప్రతీకాత్మక విభాగాలలో ఒదిగాయి. మొదటి విభాగం, వైయక్తిక, సాంఘిక వైర్యుధ్యాల అలజడిని; రెండవ విభాగం కాలపు హద్దులని అధిగమించి జరిపిన పరిశీలనని; మూడవది బాహ్యాంతర ఒరిపిడి నుంచి బయటపడి పునర్నిర్మాణానికై చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి.

ప్రస్తుత కాలంలో మనిషి తనతో తాను, వ్యక్తి – వ్యక్తి తోనూ, వ్యక్తి సమూహం తోనూ, సమూహం తోటి సమూహం తోనూ, దేశం మరో దేశంతోను ఎన్నో యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని యుద్ధాలు ప్రత్యక్షంగా కనబడతాయి. కొన్ని కనబడవు. కానీ అఫ్సర్ లాంటి కవులు బాహ్యాంతర యుద్ధాలను చూడగలరు, తమ కవితల ద్వారా వాటి గురించి ప్రజలను అప్రమత్తం చేయగలరు.

ఈ కవితల్లో – తన నుంచి తాను దూరమవుతున్న మనిషి కనబడతాడు.. అందుకు బాధపడతాడు.. అందరిని అల్లుకోవాలనుకుంటాడు.. కానీ అందనంత దూరం తెలియకుండానే పెరిగిపోతుంది. మనుషుల మధ్య మాటలు ఉండవు. ఆత్మీయ స్పర్శ లోపిస్తుంది. పలకరింపు తల దించుకుంటుంది.

పరస్పర విశ్వాసాలు సడలుతున్న సందర్భం, స్పందనలు కరువుతున్న విషాదాలు గోచరిస్తాయి. స్వంత ఊరికో, స్వదేశానికో దూరమైనవారి వలస వేదనని ప్రతిధ్వనిస్తాయి. ఉన్నచోటే విస్థాపనకి గురైనవారి హోంలెస్ ఫీలింగ్‌ని పరిచయం చేస్తాయి.

~

ప్రకృతి పట్ల కవికున్న ఇష్టం ఎన్నో కవితలలో కన్పిస్తుంది. ఆకాశం, మేఘాలు, వర్షం, కొండలు – కవితా వస్తువులవుతాయి. అందమైన అనుభూతులను అందిస్తాయి.

“చెట్లు కలలు కనవు/ఆకాశానికి ఇష్టంగా కౌగిళ్ళు ఇస్తూనే ఉంటాయి/ఆకాశం వాటికి పరాయీ కాదు” అనే ఈ పంక్తులు ‘చెట్టంత కావడం’ అనే కవితలోవి. ఇదే కవితలో “నీలోంచి నువ్వు- పారిపోయే/జారిపోయే క్షణాలు- నిన్ను నిజంగా పట్టించే యుద్ధాలు” అనడం ద్వారా వ్యక్తికి తనలో జరిగే ఘర్షణని గుర్తు చేస్తారు కవి.

మబ్బులోంచి చినుకులోకి’ అనే కవితలో “రాయని ప్రేమలేఖ/గాలి అలల మీంచి కాసిని వాన చుక్కల బుగ్గల మీంచి/అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది/హాయ్.. రే హాయ్.. అని కూనిరాగం పాడుకుంటూ” అంటారు. చివరికి ఏమవుతుంది? యిక ఏకధారగా వాన! ఈ కవితలో ప్రేమ భావన, ప్రకృతి ఆరాధన కలగలిసిపోయినట్లు తోస్తుంది.

కొండ కొమ్మున’ చక్కని కవిత. “తలెత్తుకుని నిలబడడం ఏమిటో కొండ మాత్రమే చెబుతుంది” అనడం ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది. “కొండ ఎక్కి దిగిన తరువాత/నీ దేహం కొత్త వాసనేస్తుంది/ఇప్పుడే నీకు నువ్వు దొరికినట్టు” అనే పంక్తులు – కష్టసాధ్యం అనుకున్నదాన్ని సాధించినప్పుడు కలిగే తృప్తినీ, విజయభావనని చాటుతుంది.

యీవాళే యేరుకున్న ఆకులు కొన్ని’ చక్కని కవిత.

~

అలాగే సన్నిహితుల మధ్య ప్రేమనీ, ఆత్మీయతని వెల్లడించే కవితలున్నాయి. చెదురుతున్న ప్రేమని కూడదీసుకునే ప్రయత్నాలూ ఉన్నాయి. భరించలేని ఒంటరితనాన్ని ఆర్ద్రంగా చెప్పిన కవితలున్నాయి.

అవును, నువ్వెలా వచ్చావ్’ కవితలో, తను వచ్చిన తరువాత – “నా లోపలి వీధులన్నీ/వొక్కసారిగా కాంతి ద్వీపాలయ్యాయి/నా ఎడారి మొత్తం జలమయ్యింది” అంటారు.

వొక వైపు ప్రేమ, యింకో వైపు ద్వేషం’ కవితలో ప్రేమించుకోవాలి అనుకున్నవారి మనస్థితిని వివరించారు. ఐదు నొప్పించే పద్యాలు, లెక్కపెట్టుకున్న క్షణాలు – చెప్పుకోదగ్గ కవితలు!

~

హింస, రక్తపాతం, సామాజిక దుర్నీతులను ప్రశ్నించిన కవితలు ఉన్నాయి. అనేక యుద్ధ కాలాల తరవాత, యుద్ధం మధ్యలో నువ్వు, Reminder వంటి కవితలు యుద్ధపు గాయలను గుర్తు చేస్తాయి.

వివక్ష గురించి చక్కని కవితలున్నాయి. ‘నల్లమ్మ అనే వొక volcano గురించి’ అనే కవిత పాఠకుల మనసుని కాసేపు మొద్దుబారుస్తుంది. ‘An Alphabet of Breathing’ కవితా అంతే ఉద్విగ్నతని కలిగిస్తుంది.

కరోనా కాలంలో చెలరేగిన అంతరంగ ఘర్షణకు, భావాల అలజడికి కొన్ని కవితలు అద్దం పట్టాయి.

~

ఫెయిల్యూర్ స్టోరీ’ అనే కవిత, వైఫల్యాలని ఎలా అధిగమించాలో గొప్పగా చెబుతుంది. ‘తెరవెనుక’ కవితలో – క్రుంగుబాటుకి గురై ఆత్మహాత్య చేసుకుంటున్న విద్యార్థులను ప్రస్తావించి, వారి అంతరంగాన్ని ఆలకించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

***

కొన్ని కవితలు పైకి వైయక్తికమని అనిపించినా, తరచి చూస్తే, సామాజికమనే గ్రహింపు వస్తుంది. కొన్ని కవితలకి between the lines – అంతరార్థం ఉంటుంది, వాటిని సరిగ్గా గ్రహించాలి. అలా అని ఈ కవితలేవీ అస్పష్టంగా ఉండవు. తాను చెప్పదలచినదంతా, చాలా స్పష్టంగా, దాపరికం లేకుండా వెల్లడించారు అఫ్సర్.

ఈ సంపుటి లోని చాలా కవితల్లో కవిత్వానికి ఉండే స్ట్రక్చర్‌ (నిర్మాణం)ని వదిలి, పారాగ్రాఫిక్స్ అనే శైలిలో రాశారు. అందుకే కొన్ని వచనాలు కవితాత్మకంగా ఉండి మనసుని తాకుతాయి. కొన్ని కవితలు వచనమై పదాలలో ఒదగని వేదనని పంచుతాయి.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని యుద్ధాలు ఏళ్ళ తరబడి జరుగుతూ, జననష్టం ఆస్తినష్టం కలిగిస్తూంటే, ఆయుధ బేహారులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. అంటే, మనమందరం ఏదో ఒక యుద్ధం మధ్యనే ఉన్నాం. దీంతో నాకు సంబంధం లేదని తప్పించుకోలేం. ఆ వేదనా, ఆవేదనా మనది కూడా!

***

యుద్ధం మధ్యలో నువ్వు (కవిత్వం)
రచన: అఫ్సర్
ప్రచురణ: అజూ పబ్లికేషన్స్, నల్గొండ
పేజీలు: 184
వెల: ₹ 200/-
ప్రతులకు:
అజూ పబ్లికేషన్స్,
1-3-63/2,
మాల్‍బౌలీ స్ట్రీట్,
నల్గొండ. తెలంగాణ. 508001
ఫోన్: 9912460268
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Yudham-Madhyalo-Nuvvu-Poetry-Afsar/dp/8197454388

~
శ్రీ అఫ్సర్ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-afsar/

Exit mobile version