[శ్రీ అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచించిన ‘యువత – దేశ భవిత’ అనే కవితని అందిస్తున్నాము.]
బలంతో, ధైర్యంతో, బాధ్యతతో
పోరాడడం నేర్చుకో,..
నీ విధికి నీవే విధాత వని తెలుసుకో,
ఓ నవ యువతా మేలుకో,
‘నయగారం’ జలపాతంలా దూకాలిరా,
నవనిర్మాణ మానవ శిల్పివై,
నవ సమాజానికి దిక్సూచివై,
నిండుగా గుండెబలం నింపుకుని,
నిత్య చైతన్య జ్ఞాన కరణమై,
వెలుగులు నింపే జాతిరత్నమై, దేశ
భవితకు పునాది రాయివై,
మేల్కొని మేల్కొలిపే తారవై,
ఉత్సాహ ఉత్తేజ తేజోవంతులవై,
నిర్లక్ష్యం, నిర్లిప్తతను నిర్వీర్యం చేసి
జాతి జనులకు చైతన్య దీప్తివై,
అలసత్వాన్ని, అధైర్యాన్ని పారద్రోలి,
అభ్యుదయ ప్రగతిమార్గ
సూచివై, శక్తి యుక్తులను కూడదీసి,
విశ్వజ్ఞాన వినయ శీలుర
జేసి, నిత్య చైతన్య శీలుడవై,
నిలుపరా, నీ జాతి వైభవగీతి.
