Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

249 వెడ్స్ 210

[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘249 వెడ్స్ 210’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రోజు డిసెంబర్ 31, 2037. సమయం రాత్రి 11:30 నిమిషాలు. బెడ్ రూములో కృష్ణ గోడ గడియారంలో టైం పన్నెండు ఎప్పుడవుతుందా అని అని ఆసక్తిగా చూస్తున్నాడు. పక్కనే పడుకున్న భార్యను కూడా ప్రేమతో చూడసాగాడు. అలా అరగంట అయిన తరువాత గడియారం సమయం పన్నెండు అయినట్లు మోగింది. ఇంటి చుట్టుపక్కల కుర్రకారు అంతా బాణాసంచా కాలుస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

కృష్ణ నిద్రపోతున్న భార్యను లేపాడు. “ఏమిటి! ఇప్పుడెందుకు లేపావు?” అని నిద్రమత్తులో అడిగింది.

“సత్యా! వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మన పెళ్ళి జరిగి ఇవాళ్టికి ఇరవై అయిదు సంవత్సరాలు నిండాయి. ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టాం” అని ఆనందంగా కరచాలనం చేసేందుకు చేయి చాపాడు‌. సత్య చేయి కలుపుతూ “రేపు పొద్దున్నే చెప్పొచ్చు కదా? నిద్రపోతున్న నన్ను లేపి మరీ చెప్పాలా? నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? అయినా నీకు కూడా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు” అని నవ్వుతూ చెప్పింది.

కృష్ణ సంతోషంతో “అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పండుగ చేసుకుంటుంటే మనం మాత్రం కొత్త సంవత్సరంతో పాటు, ప్రతి సంవత్సరం ఇదే రోజు పెళ్ళి రోజు కూడా జరుపుకుంటాం. ఎందుకంటే మనిద్దరం కలిసి జీవన ప్రయాణం చేసిన రోజు మొదలైంది జనవరి ఒకటో తేదీనే కాబట్టి. అందుకే నేను ప్రతి సంవత్సరం నీకు హ్యాపీ న్యూ ఇయర్ కంటే ముందు హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తాను” అని అన్నాడు.

సత్య “థాంక్యూ” అంది. రెట్టించిన ఉత్సాహంతో “మన పెళ్ళి జరిగి ఇరవై అయిదు సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ అయిన సందర్భంలో నీకు ఏం కావాలో కోరుకో భార్యామణి. నీకు వరమివ్వదలిచాను” అని నవ్వుతూ విష్ణుమూర్తిలా ఫోజు పెట్టాడు కృష్ణ. సత్య నవ్వుతూ “ఏదైనా ఇస్తావా?” అని కొంటెగా అడిగింది. “నా శక్తికి తగ్గది శక్తివంచన లేకుండా ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాను” అని చేతిలో చెయ్యేసి చెప్పాడు కృష్ణ.

కొంచెం సీరియస్ అయిన సత్య “నాకు రాజీవ్‌ను చూడాలని ఉంది. ఒకసారి ఇద్దరం వెళ్ళి ఎక్కడున్నాడో వెతికి కలుద్దాం” అని అంది.

“రాజీవ్ ఎవరు?” అని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ.

“అరెరె! మర్చిపోయావా? మనతో పాటు కాలేజిలో ఎమ్.సి.ఎ. చదివాడే, కాలేజి టాపర్ రాజీవ్” అని చిటికెలు వేస్తూ చెప్పింది సత్య. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కృష్ణ.

అసహనంతో కూడిన కోపంతో కృష్ణ “ఇప్పుడు, అదీ ఇన్ని సంవత్సరాల తరువాత వాడెందుకు గుర్తుకు వచ్చాడు?” అని అన్నాడు. సత్య నవ్వుతూ “విశేషం ఏమీలేదు మహానుభావా. అయినా రాజీవ్ నీ ప్రియ మిత్రుడే కదా! ఇరవై అయిదు సంవత్సరాల దాంపత్యపు బహుమతి, ఏదైనా ఇస్తానన్నావుగా. నాకు కావాల్సింది ఇదే. మనిద్దరం కలిసి రాజీవ్ ఎక్కడున్నాడో వెతికి కలుద్దాం. అదే నేను మన వివాహ సిల్వర్ జూబ్లీ యానివర్సరీకి నీ నుంచి నేను ఆశించే గిఫ్ట్. గుడ్ నైట్ డియర్” అని నిద్రకు ఉపక్రమించింది సత్య. దాంతో కృష్ణకు ఏమి చేయాలో పాలుపోలేదు. నిద్రపట్టక పోవడంతో ఇంటి టెర్రస్ పైకి వెళ్ళాడు. ఆలోచనలు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. ఫ్లాష్‌బ్యాక్ మైండ్‌లో గిర్రున తిరగసాగింది.

***

అవి సాఫ్ట్‌వేర్ బూమ్ ఎక్కువగా ఉన్న రోజులు. బిటెక్ చదువుకున్న ప్రతి విద్యార్థికి మెరిట్ ఉంటే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు రావడం చాలా సులభం అయిపోయింది. అలా ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి నెలకి ఇరవై వేలు సంపాదించే ఉద్యోగం దొరకడం సాధ్యమయింది. ఆ రోజుల్లో అది పెద్ద జీతం కిందే లెక్క. అటువంటి రోజుల్లో డిగ్రీ పూర్తి అయిన తరువాత మెజారిటీ స్టూడెంట్స్ లాగానే కృష్ణ ఐసెట్ పరీక్ష రాసాడు. కానీ అనుకున్నంత మంచి ర్యాంకు రాలేదు. దాంతో కృష్ణ తండ్రి సొంత ఊరు అయిన విద్యాధరపురంలో ఒక ప్రముఖ కాలేజ్ అయిన శర్మ కాలేజిలో మేనేజ్ మెంట్ కేటగిరీలో సీటు కొన్నాడు. అలా ఆ కాలేజిలో ఎమ్.సి.ఎ. మొదటి సంవత్సరంలో మంచి ముహూర్తం చూసుకుని చేరాడు కృష్ణ. మంచి ర్యాంకు తెచ్చుకుని అదే కాలేజీలో, అదే ఎమ్.సి.ఎ‌. గ్రూపులో చేరిన మెరిట్ విద్యార్థి రాజీవ్. మంచి తెలివితేటలు కలవాడు, అందగాడు. ర్యాంకర్ కూడా కావడంతో క్లాసులో మిగిలిన విద్యార్థులు అందరూ రాజీవ్‌తో స్నేహంగా ఉండసాగారు. ఇది గమనించిన కృష్ణ కూడా తనను తాను రాజీవ్‌ని పరిచయం చేసుకుని స్నేహంగా మెలగసాగాడు. రాజీవ్‌తో పాటు అదే కాలేజిలో ఎమ్.సి.ఎ.లో మీనా అనే విద్యార్థిని కూడా జాయిన్ అయింది. రాజీవ్, మీనా చిన్ననాటి స్నేహితులు. ఇళ్ళు కూడా ఇరుగు పొరుగు కావడం,ఇద్దరూ కలిసి మెలిసి పెరిగారు. దాంతో కాలేజిలో కూడా ఇద్దరూ మంచి క్లోజ్‌గా ఉండేవారు. అలా నెల రోజులు గడిచాయి. ఈ నెల రోజుల్లో రాజీవ్, కృష్ణ, మీనా మంచి స్నేహితులు అయ్యారు.నెల రోజులు గడిచాక రెండవ కౌన్సిలింగ్ లో, మొదటి కౌన్సిలింగ్‌లో వేరే ఊరిలో వచ్చిన కాలేజిని మార్పించుకుని మరీ, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేనని, శర్మ కాలేజిలో ఎమ్.సి.ఎ. గ్రూపులో జాయిన్ అయింది సత్య.

అలా రాజీవ్, కృష్ణ, మీనాలతో కలిసి పోయింది సత్య. మీనా, కృష్ణ , సత్య , రాజీవ్ ఇంట్లో కలుసుకునే వారు. అలా రాజీవ్ ఇల్లు అందరికీ మీటింగ్ స్పాట్ అయింది. రాజీవ్ తల్లిదండ్రులు రాజీవ్‌తో పాటే మిగిలిన ముగ్గురినీ సమానంగా చూసేవారు. అలా చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రెండు సంవత్సరాలు అందరూ బాగా చదివి మంచి మార్కులతో పాసయ్యారు. రాజీవ్ కాలేజీ టాపర్‌గా వచ్చాడు. మూడవ సంవత్సరం తరగతులు మొదలు కావడానికి వారం రోజుల ముందు, ఒక రోజు ఎప్పటిలానే కృష్ణ రాజీవ్ ఇంటికి వచ్చాడు. మాటల మధ్యలో కృష్ణ

“రాజీవ్! నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా” అని అన్నాడు.

రాజీవ్ “చెప్పరా” అని క్యాజువల్‌గా అన్నాడు. దాంతో కృష్ణ బిడియంగా “నేను సత్యను ప్రేమిస్తున్నానురా. తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. భయంగా ఉంది. నువ్వే ఏదైనా సలహా ఇవ్వాలి” అని సిగ్గుపడుతూ చెప్పాడు. అది విన్న రాజీవ్ “అదెలా? నేను సత్యను మొదటిసారి చూసినప్పుడే తనతో ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫైనల్ సెమిస్టర్ మొదలు అయిన తరువాత తనకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను. మా పేరెంట్స్‌కి కూడా చెప్పాను. అప్పుడప్పుడు తను మా ఇంటికి వస్తుంటుంది కాబట్టి, వారు కూడా చూసినట్టే లెక్క. అందుకే వారు కూడా ఒప్పుకున్నారు. మాకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఏమీ లేదు.”అని ఆశ్చర్యంగా అన్నాడు.

రాజీవ్ మాటలు విన్న కృష్ణ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక “మళ్ళీ కలుస్తాను రాజీవ్” అని వెళ్ళిపోయాడు. కృష్ణ వెళ్ళిపోయాక రాజీవ్ ఆలోచనల్లో పడ్డాడు. కృష్ణతో జరిగిన సంభాషణ అంతా తల్లిదండ్రులకు చెప్పాడు. యథావిధిగా మూడవ సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి.

ప్రారంభం అయిన మొదటి రోజే కృష్ణ తన ప్రేమను సత్యకు వ్యక్తపరిచాడు. అది విన్న సత్య ఆశ్చర్యపోయింది. “నా అభిప్రాయం చెప్పేందుకు నాకు కొంచెం టైం కావాలి కృష్ణా. నేను ఫస్ట్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలి. నువ్వు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టు” అని చెప్పింది. కృష్ణకు ఏమి చేయాలో అర్థం కాలేదు. సత్య, కృష్ణ తనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని రాజీవ్‍కు చెప్పింది. అది విన్న రాజీవ్ “సత్యా! నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను” అని కృష్ణకు తనకు మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. అంతా విన్న సత్య, రాజీవ్, కృష్ణ ఇద్దరూ తనను ప్రేమిస్తున్నారని అర్థం చేసుకుంది. ఆ సమయంలో “మళ్ళీ కలుద్దాం” అని చెప్పి రాజీవ్ దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. రాజీవ్, కృష్ణ ఇద్దరూ సత్యను ప్రేమిస్తున్నారనే విషయం అరవై మంది విద్యార్థులు ఉన్న క్లాసు అంతా పాకిపోయింది. రాజీవ్‌కి ఒక గ్రూపు, కృష్ణకు ఒక గ్రూపు తయారైంది. క్లాసులో సత్య రోల్ నెంబర్ 210. రాజీవ్ రోల్ నెంబర్ 249. సత్య లేనప్పుడు రాజీవ్, సత్య టేబుల్‌పై కూర్చుని, బల్లపై 249 వెడ్స్ 210 అని రాసాడు. రాజీవ్ గ్రూపు కూడా కాలేజిలో గోడలపై 249 వెడ్స్ 210 అని బొగ్గుతో, చాక్‍పీస్ లతో రాసేవారు. ఇదంతా గమనిస్తున్న సత్య వాటిని సరదాగా తీసుకునేది. కృష్ణ గ్రూపులో ఉండే ప్రవీణ్, సత్యతో రాజీవ్ గురించి చెడుగా చెప్పసాగాడు. కృష్ణను, సత్యను కలపాలని ప్రవీణ్ ప్రయత్నం. రాజీవ్ ఇంటికి కృష్ణ, సత్య వెళ్ళడం మానేసారు. మీనా మాత్రం ఎప్పటిలాగే వెళ్తుండేది. ఇది గమనించిన ప్రవీణ్, సత్యతో “రాజీవ్ మీనాను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు” అని చెప్పాడు. ఇది విన్న సత్య ‘రాజీవ్ తనను మోసం చేస్తున్నాడేమో’ అని రాజీవ్ క్యారెక్టర్‌ను స్టడీ చేయడం మొదలు పెట్టింది.

ఇంతలో కాలేజీలో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ వారు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల సెలక్షన్స్ చేపడతారనే ప్రకటన డేట్‍తో సహా వెలువడుతుంది. అది చూసి అందరిలానే రాజీవ్, కృష్ణ, మీనా, సత్య, ప్రవీణ్ కూడా ఆ సెలక్షన్స్‌కు అప్లై చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్, మీనా ఇద్దరూ కలిసి ప్రిపేర్ అవసాగారు. కృష్ణ, సత్య, ప్రవీణ్ ముగ్గురు కలిసి కృష్ణ ఇంట్లో ప్రిపేర్ కాసాగారు. చూస్తుండగానే ఇంటర్వూ డేట్ రానే వచ్చేసింది. ఆ రోజున అందరూ గ్రూప్ డిస్కషన్‌కి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఆ మరుసటి రోజు ఫలితాలు వెల్లడి అయ్యాయి. రాజీవ్, మీనా ఇద్దరూ ఉద్యోగాలకు మంచి ప్యాకేజి జీతంతో సెలెక్ట్ అయ్యారు. కృష్ణ, సత్య, ప్రవీణ్ ముగ్గురూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఆ ఆనందంతో ఆ మరుసటి రోజు రాజీవ్, సత్యకు తన ప్రేమను మరోసారి వ్యక్తపరిచాడు. తాను క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయి సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించాడు కాబట్టి, సత్యను ఉద్యోగ ప్రయత్నాలు చేయవద్దన్నాడు. ఆరవ సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి అయిన తరువాత జాబ్ లో చేరుతానని, ఆ తరువాత రెండు సంవత్సరాలకి తనను పెళ్ళి చేసుకుంటానని సత్యకు తన భవిష్యత్తు ప్రణాళికను కూడా వివరించాడు రాజీవ్. ఇదంతా విన్న సత్య “నువ్వు క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యావని ఫోజు కొట్టకు. నేను జాబ్ చేస్తాను. అందుకోసమే చదువుతున్నాను. అంతే కాదు. నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే నీకు మరో షరతు. నువ్వు మీనాతో స్నేహం వదిలివేయాలి. ఈ రెండు షరతులకు నువ్వు ఒప్పుకుంటే, నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని రాజీవ్‌తో కుండ బద్దలు కొట్టింది.

అది విన్న రాజీవ్ ఆశ్చర్యంతో “సత్యా! మీనా, నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇరుగు పొరుగు వారం కూడా. వాళ్ళింట్లో నుంచి కూరలు మా ఇంటికి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. మా ఇంట్లో నుంచి అన్నం, పచ్చళ్ళు వాళ్ళింటికి వెళ్ళిన సందర్భాలూ ఉన్నాయి. తను నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమే. మన పెళ్ళికి తన స్నేహాన్ని అడ్డుపెట్టకు. దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో. ప్లీజ్” అని బతిమిలాడాడు. కానీ సత్య ఒప్పుకోలేదు. “నీకు నాలుగు రోజులు టైం ఇస్తున్నాను. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. మీనాతో స్నేహం కావాలో, లేక నాతో పెళ్ళి కావాలో తేల్చుకో రాజీవ్. ప్రస్తుతానికి గుడ్ బై” అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా గమనించిన మీనా ఆ రోజు సాయంత్రం రాజీవ్ ను కలవాలనుకుంది. అనుకున్నట్లే రాజీవ్‌ను వాళ్ళ ఇంట్లో కలవడానికి రాజీవ్ ఇంటికి వెళ్ళింది.

మీనా రాజీవ్‌తో “ఏం నిర్ణయించుకున్నావ్ రాజీవ్? సత్య నీకు వారం రోజులు టైం ఇచ్చిందిగా” అని అనుమానంగా అడిగింది.

రాజీవ్ ఆలోచిస్తూ “మీనా! నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావ్. నా గురించి నీకు తెలియదా? నాకు, నీతో చిన్న వయసు నుంచి ఉన్న స్నేహం కావాలి. సత్యతో పెళ్ళి కూడా కావాలి. రెండింటిలో ఏది కావాలో తేల్చుకో అంటే మాత్రం, నేను నీతో స్నేహాన్ని కోరతాను. ఎందుకంటే సత్య ఇవాళ నీతో స్నేహాన్ని, తద్వారా నిన్ను వదిలివేయమంది. రేపు నా తల్లిదండ్రులను వదిలేయమని అనదు అని గ్యారంటీ ఏమీ లేదుగా? అందుకే నేను సత్య కండిషన్ కి అంగీకరించడం లేదు” అని అన్నాడు. అది విన్న మీనా షాక్ అయింది.

“మరి 249 వెడ్స్ 210 అనేది శుభలేఖల దాకా రాదా?” అని అడిగింది. రాజీవ్ నవ్వుతూ “అది మన కాలేజి గోడల దాకా, బల్లల దాకా మాత్రమే” అని అన్నాడు. అలా వారం రోజులు గడిచాయి. రాజీవ్, సత్యతో ఏమీ మాట్లాడలేదు. ఇది గమనించిన ప్రవీణ్, కృష్ణతో సత్యకు ప్రపోజ్ చేయమని చెప్పాడు. కృష్ణ కూడా సత్యకు తన ప్రేమను మరోసారి వ్యక్తపరిచాడు. ఈసారి సత్య, కృష్ణ లవ్ ప్రపోజల్‌కి ఒప్పుకుంది. ఆ తరువాత అయిదవ సెమిస్టర్ పరీక్షలు అయిపోయాక, అందరూ ఎవరి ప్రాజెక్ట్ పనుల్లో వారు తలమునకలయ్యారు. అలా మరో ఆరు నెలలు గడిచాయి. దాంతో ఆరవ సెమిస్టర్ కూడా ముగిసింది. తమ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన రాజీవ్, మీనా ఇద్దరూ ఆ తరువాత క్యాంపస్ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అయిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు.

క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ కాకపోవడంతో కృష్ణ, సత్య, ప్రవీణ్‌లు తమ తమ ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించారు. దాంతో రాజీవ్, మీనాకు, మిగిలిన సహవిద్యార్థులతో సంబంధాలు క్రమంగా సన్నగిల్లాయి. అలా సంవత్సరానికి కృష్ణ, సత్య, ప్రవీణ్‌లు వేరు వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. అప్పటికే రాజీవ్, మీనాలకు ఉద్యోగంలో ఒక సంవత్సరం అనుభవం వచ్చింది. అలా చివరికి రాజీవ్, మీనా ఇద్దరూ ఒక గ్రూపుగా, కృష్ణ, సత్య, ప్రవీణ్ ముగ్గురు ఒక గ్రూపుగా విడిపోయారు. ఆ తరువాత ఆ రెండు గ్రూపుల మధ్య సంబంధ బాంధవ్యాలు లేవు.

***

అలా గతంలోకి తొంగి చూసిన కృష్ణ తిరిగి వర్తమానంలోకి వచ్చాడు. ఇంతకీ సత్య, తిరిగి రాజీవ్‌ను ఎందుకు కలవాలనుకుంటుందో కృష్ణకు అంతు పట్టలేదు. అలానే ఆలోచిస్తూ టెర్రస్ నుంచి బెడ్ రూమ్‌కి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారింది. పేపర్ చదువుతున్న కృష్ణకు సత్య కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతున్న కృష్ణతో సత్య “రాత్రి నేను కోరిన కోరిక గురించి ఏమి ఆలోచించావ్?” అని ప్రశ్నించింది. దానికి కృష్ణ “సత్యా! ఎందుకు రాజీవ్‍ను కలుద్దామంటున్నావ్? అదీ ఇన్ని సంవత్సరాల తరువాత” అని ఆత్రుతగా అడిగాడు. సత్య నవ్వుతూ “వాడు మన క్లాస్‌మేట్. మన ఫ్రెండ్. పైగా కాలేజ్ టాపర్. ఆ రోజుల్లో మన సబ్జెక్ట్ డౌట్స్ అన్నీ క్లియర్ చేసినవాడు. అందుకని ఒక సారి చూసొద్దాం” అని అంది. కృష్ణ “సరే భార్యామణి! సదా నీ సేవలో. మనిద్దరం విద్యాధరపురం వెళ్ళి పాత జ్ఞాపకాలు నెమర వేసుకుందాం. అయినా నీ కోరిక తీర్చడానికి నాకు కొంత వ్యవధి కావాలి. ఆలోచించి ప్రయాణానికి ప్లాన్ చేస్తాను.” అని అన్నాడు. సత్య నవ్వుతూ “తమరి ఇష్టం పతిదేవా” అని అంది.

చదువు అయిపోయి చాలా సంవత్సరాలు అయినా, ఉద్యోగంలో చేరి చాలా సంవత్సరాలు అయినా ప్రవీణ్‌తో స్నేహం కంటిన్యూ చేస్తూ ఉన్నారు కృష్ణ, సత్య ఇద్దరూ. దాంతో భార్య కోరిక తీర్చాలా వద్దా? అనే మీమాంసలో కృష్ణ, ప్రవీణ్‌కి ఫోన్ చేసి తన భార్య కోరిన కోరిక గురించి చెప్పాడు. ప్రవీణ్, కృష్ణ మాటలు విని మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత తేరుకుని కృష్ణతో “రేయ్ కృష్ణా! నీకు, సత్యకు పెళ్ళి అయిందని రాజీవ్‍కు తెలియదు. ఎందుకంటే చదువు అయిపోయిన తరువాత మనం కలవలేదు. ఇప్పుడు నువ్వు, సత్య వెళ్ళి రాజీవ్‌ను కలవడం వలన, తద్వారా నీ భార్య కోరిక తీర్చడం వలన ఈ వయసులో, అదీ యాభై సంవత్సరాలు దాటాక నీకు కలిగే నష్టం ఏమీ లేదు. పైగా మీ పెళ్ళి గురించి రాజీవ్‌కు తెలిసినట్టు ఉంటుంది. అలా సత్యతో ప్రేమ విషయంలో, నువ్వు రాజీవ్‌ను ఓడించినట్లు రాజీవ్‍కు తెలుస్తుంది. ఎలా చూసినా ఇది నీకు ప్లస్సే” అని అన్నాడు. అలా వారిద్దరి ఫోన్ సంభాషణ ముగిసింది.

ఆ రోజు రాత్రి భోజనం చేసాక కృష్ణ సత్య తో “శ్రీమతి! నీ కోరిక వచ్చే శనివారం తీరుస్తాను. ప్రవీణ్ కూడా మనతో వస్తాడు. అలా మనం ముగ్గురం కలిసి రాజీవ్‌ను చూడటానికి వెళ్దాం. రెడీగా ఉండు” అని సత్య భుజం తట్టాడు. అది విన్న సత్య “ధన్యవాదాలు శ్రీవారు” అని అంటూ నవ్వింది. కాలం అలా గడిచిపోయింది. కృష్ణ చెప్పిన శనివారం వచ్చింది. హైదరాబాద్ నుంచి కృష్ణ, సత్య, ప్రవీణ్‍లు ముగ్గురూ కార్‌లో విద్యాధరపురం బయలుదేరారు. తెల్లవారుజామున ప్రయాణం మొదలు పెట్టడంతో ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో మధ్యాహ్నానికల్లా ముగ్గురూ విద్యాధరపురం చేరారు. భోజన సమయం కావడంతో హోటల్లో భోజనం ముగించారు. సమయం మధ్యాహ్నం ఒంటిగంట. అప్పుడు ముగ్గురూ తమకు తెలిసిన రాజీవ్ ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా పాడుబడి ఉంది. చాలా సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఆ ఇంటిని చూసి ముగ్గురూ ఆశ్చర్య పోయారు. ఆ ఇంటి ప్రక్కన ఉన్న మరో ఇంటి తలుపు తట్టారు. ఒక మహిళ తలుపు తీసి “ఎవరు మీరు? ఎవరు కావాలి?” అని ప్రశ్నించింది.

కృష్ణ ”అమ్మా! ఇక్కడ ప్రక్క ఇంటిలో రాజీవ్ అని ఉండేవాడు కదా? వాళ్ళ ఫ్యామిలి ఇప్పుడు ఎక్కడ ఉంది?” అని ఆత్రుతగా వాకబు చేసాడు. దానికి ఆ మహిళ “రాజీవ్ వాళ్ళ నాన్నగారు రామకృష్ణాపురంలో సొంత ఇల్లు కట్టుకున్నారు. వారు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు” అని ఆ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. కృష్ణ ఆ అడ్రస్‍౬ను మొబైల్ లో నోట్ చేసుకుని, ఆ ప్రదేశానికి వెళ్ళి మరలా అక్కడి వ్యక్తులను వాకబు చేసి, అలా చివరికి ముగ్గురూ కలిసి రాజీవ్ ఇంటికి చేరారు. గేటు ఉన్న గోడకి కాలింగ్ బెల్ ఉండడంతో కృష్ణ, దాన్ని ప్రెస్ చేసాడు. ఆ ఇంటి వసారాలో మంచంపై పడుకున్న ఒక ముసలాయన “ఒరేయ్! యోగి ఎవరో బెల్ కొడుతున్నారు. ఒకసారి చూడు” అని అన్నాడు.

ఆ మాటలు విని ఒక కుర్రాడు వచ్చి, బయట ఉన్న కృష్ణ, సత్య, ప్రవీణ్ లను చూసి వినయంగా “ఎవరు సార్ మీరు? ఎవరి కోసం వచ్చారు?” అని ప్రశ్నించాడు. సత్యకు ఆ పిల్లవాడి ముఖకవళికలు, కొంచెం రాజీవ్ లాగా అనిపించాయి.

కృష్ణ ఆత్రుతగా “రాజీవ్ ఉన్నాడా?” అని అడిగాడు. ఆ కుర్రవాడు నవ్వుతూ ”రాజీవ్ గారి కోసం వచ్చారా? రండి” అని గేటు తీసి వారిని ఆహ్వానించాడు. తన గెలుపును రాజీవ్‌కు చూపించడానికి, రాజీవ్ ఇల్లు దొరికినందుకు కృష్ణ చాలా సంతోషించాడు.

లోపలికి వెళ్ళి ముగ్గురూ కూర్చున్నారు. ఇంతలో యోగి “బాబా! నీకోసం ఎవరో వచ్చారు” అని అంటూ లోపలికి వెళ్ళాడు. ముగ్గురూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు లోపలి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి “ఎవరు మీరు?” అని అడిగాడు. ప్రవీణ్ కల్పించుకుని “సార్! నేను ప్రవీణ్, తను కృష్ణ, ఈమె కృష్ణ వైఫ్ సత్య. మనందరం కలిసి విధ్యాధరపురంలో ఎమ్.సి.ఎ. చదువుకున్నాం. మీకు గుర్తుకు వచ్చిందా?” అని ప్రశ్నించాడు. అది విన్న రాజీవ్ ముగ్గుర్ని తీక్షణంగా చూసి “అవును. కరక్టే. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎలా ఉన్నారు? ఆల్ మోస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల తరువాత కలుసుకున్నాం కదా. సడెన్‍గా గుర్తుపట్టలేకపోయా” అని అంటూ కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ నవ్వుతూ “అందరం బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావ్? మీ పాత ఇల్లు ఏమైంది? మీనా ఎలా ఉంది? మీ గురించి చెప్పు. మీ పెళ్ళి అయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత మంది పిల్లలు?”అని నేరుగా ప్రశ్నించాడు. దానికి రాజీవ్ “మనం చదువుకునే రోజుల్లో మీరు వచ్చిన ఇల్లు, మీకు తెలిసిన ఇల్లు, మేము అద్దెకు తీసుకొని ఉన్న ఇల్లు. ఆ తరువాత మేము సొంత ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంటి ఓనర్ పట్టించుకోకపోవడంతో ఆ ఇల్లు పాడుబడింది. ఇదే మా సొంత ఇల్లు. నేను, మీనాను పెళ్ళి చేసుకోలేదు. అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను, మీనా స్నేహితులం. అంతే. ఆ తరువాత మీనా వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు తను నాకు టచ్‌లో లేదు కూడా. నేను ఎవరిని పెళ్ళి చేసుకోలేదు” అని అన్నాడు. అది విన్న కృష్ణ ఆశ్చర్యంగా “మరి ఇందాక మేము వచ్చినప్పుడు గేటు తీసిన పిల్లవాడు ఎవరు? ఆ పిల్లవాడిని పిలిచిన ఆ ముసలాయన ఎవరు?” అని రాజీవ్ పై ప్రశ్నలు సంధించాడు కృష్ణ. ఇంతలో ఒక పెద్దావిడ కాఫీ ట్రే లో అందరికీ కాఫీ తెచ్చింది. ఆ కాఫీ అందరికీ అందించిన రాజీవ్ నవ్వుతూ కాఫీ తాగుతూ “చూడు కృష్ణా! ఆ రోజుల్లో నేను కూడా సత్యను ప్రేమించిన మాట వాస్తవమే. కాలేజి మొత్తం తెలిసిన కథే అది. కానీ సత్య పెట్టిన షరతులకు నేను అంగీకరించలేదు. అందుకే సత్యకు, మీ అందరికీ దూరంగా వచ్చేసాను. ఒక వాచ్ దుకాణంలో మనం వద్దనుకున్న వాచ్‌ను వేరొకరు కొనుక్కుని ధరించవచ్చు. అలాగే ఆ తరువాత సత్యను నువ్వు పెళ్ళి చేసుకున్నావు. నీ పెళ్ళి గురించి,నీ కుమారుడు చేసే ఉద్యోగం గురించి కూడా నాకు తెలుసు” అని అనగానే సత్య మధ్యలో రాజీవ్‌ను ఆపి అనుమానంగా “మా విషయాలు అన్ని నీకెలా తెలుసు?”అని అడిగింది. దానికి రాజీవ్ నవ్వుతూ “మీరే కాదు, నేను కూడా సోషల్ మీడియా వాడుతుంటాను. మీ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్‌లకి మీరు మీ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో లైక్స్ కోసం పెడుతుంటారు కదా‌! అలా చూసాను. నాకు కూడా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇక నుంచైనా మీ పర్సనల్ విషయాలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యకండి, ప్లీజ్. ఎందుకంటే అందరూ నాలా మంచి విలన్లే ఉండరు కదా. ఇక నా పెళ్ళి విషయానికి వస్తే, నేను కొన్ని పెళ్ళి సంబంధాలు చూసాను. కానీ అన్ని సంబంధాలలో అమ్మాయిలు ఉద్యోగం చేస్తామన్నారు. నెలకు అయిదు వేలు వచ్చే ఉద్యోగం వదులుకోవడానికి కూడా ఎవరూ సిద్ధపడలేదు. అలా నాకు హౌస్ వైఫ్ దొరక్క నేను పెళ్ళి చేసుకోలేదు. మనం ప్రేమించిన అమ్మాయి మన ప్రేమను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపడం నేరం అదే విధంగా మనం చావడం మన తల్లిదండ్రులకు, తోబుట్టువులకు చేసే ద్రోహం. ఇది మా సొంత ఇల్లే కానీ ఈ ఇంటిని ఒక అనాథ బాలల వృద్ధ ఆశ్రమానికి నా తదనంతరం రాసిచ్చాను. నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇందాక మీరు వచ్చినప్పుడు తలుపు తీసింది కూడా ఒక అనాథ పిల్లవాడు. నన్ను బాబా అని పిలుస్తూ ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నాడు. ఆ పడుకున్న ముసలాయన పిల్లలు వదిలేసిన ఒక తండ్రి. ఆయనకు పక్షవాతం. దాంతో మంచానికే పరిమితం అయ్యారు. అలాంటి కుర్రాళ్ళు, అలాంటి ముసలివారు ఇరవై మంది దాకా ఉన్నారు నాతో సహా” అని కూల్‌గా సమాధానం చెప్పాడు. అంతా విన్న ఆ ముగ్గురికీ ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కొన్ని సెకెన్ల పాటు మౌనం రాజ్యమేలింది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ సత్య, “రాజీవ్! ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల తరువాత నిన్ను కలిసినందుకు మా ముగ్గురికీ చాలా ఆనందంగా ఉంది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా?” అని అడిగింది. రాజీవ్ నవ్వుతూ “ప్రేమించిన వ్యక్తితో స్నేహం చేయలేను. స్నేహం చేసిన వ్యక్తిని ప్రేమించలేను. మనది టెంపరరీ పర్మినెంట్ రిలేషన్ మాత్రమే. మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. దయచేసి ఇంక ఎప్పుడూ కూడా నా దగ్గరకు రాకండి. నన్ను కలవాలని ప్రయత్నించకండి. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. విష్ యు ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్” అని షేక్ హ్యాండ్ కోసం కృష్ణకు చేయి ఇచ్చాడు. ఆశ్చర్యంతో కృష్ణ, రాజీవ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తరువాత రాజీవ్, ప్రవీణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సత్య కరచాలనం చేసేందుకు చేయి చాపింది. కానీ రాజీవ్ ఆమెకు రెండు చేతులతో నమస్కరించాడు. సత్య కూడా తిరిగి ప్రతి నమస్కారం చేసింది. అలా ముగ్గురూ ‘గుడ్ బై ఫరెవర్ రాజీవ్’ అని మనసులో అనుకుని, పైకి “బై బై రాజీవ్” అని చెప్పి రాజీవ్ ఇంటి నుంచి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు.

***

అలా క్షేమంగా ఇంటికి చేరారు కృష్ణ, సత్య, ప్రవీణ్.

రెండు రోజుల తరువాత రాత్రి భోజనం చేసాక కృష్ణ, సత్యతో “సత్యా! నువ్వు ఏమీ అనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతాను” అని సందేహిస్తూ అడిగాడు.

సత్య అనుమానంగా ”ఏమిటో! ఆ ప్రశ్న?” అంది.

“ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకు రాజీవ్ గాడిని కలుద్దాం అని అన్నావ్?” అని బిడియంగా అడిగాడు.

సత్య నవ్వుతూ “ఇంకా నీకు ఇంకా ఏదో అనుమానం అని నాకు అర్థం అయింది. జరిగింది చెప్తా విను. నేను పోయిన నెలలో ఆఫీస్ పనిమీద బెంగళూరు వెళ్ళాను కదా! అక్కడ అనుకోకుండా ఒక షాపింగ్ మాల్‌లో మీనాను కలిసాను. ఆమే నన్ను గుర్తు పట్టింది. మాటల మధ్యలో తను తన భర్త, పిల్లలు, రాజీవ్ గురించి చెప్పింది. రాజీవ్ అప్పుడు తనకు స్నేహితుడని, పెళ్ళి తరువాత తాను, రాజీవ్ కాంటాక్ట్‍లో లేమని చెప్పింది. ఆ తరువాత నాకు తను చెప్పిన మాటలు నిజమా కాదా అని తెలుసుకుందామని సరదాగా అనిపించింది. జస్ట్ ఫర్ ఫన్. అందుకే మన పెళ్ళి సిల్వర్ జూబ్లీకి నిన్ను ఆ కోరిక కోరాను” అని వివరించి చెప్పింది.

అది విన్న కృష్ణ, సత్య చేతిని, తన చేతిలోకి తీసుకొని ప్రేమతో “ఐ లవ్ యు 210” అని అన్నాడు. సత్య సిగ్గుపడుతూ “సేమ్ టు యు మై ఎవర్ గ్రీన్ లవర్” అని అంది.

Exit mobile version