Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆ నావ దాటిపోయింది ఆ ఒడ్డే చేరిపోయింది..

[‘సిపాయి చిన్నయ్య’ సినిమాలోని ‘ఆ నావ దాటిపోయింది’ అనే పాటని విశ్లేషిస్తున్నారు మొదలి పద్మ.]

క చిత్రంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో సన్నివేశాలు, మలుపులు. ఒక సన్నివేశాన్ని ఆ వెనుక కథను, ఒక్కోసారి కథ వివరించలేని అంతరార్థాన్ని కూడా స్పష్టం చేసేలా గీతాలు రాయగలిగే రచయితలు, రాయించుకునే దర్శకనిర్మాతలు ఎందరో. వారి అభిరుచికి ముందుగా అభినందనలు చెప్పుకోవాలి. అటువంటి అరుదైన సందర్భంలోనిదే ‘సిపాయి చిన్నయ్య’ చిత్రంలోని కృష్ణశాస్త్రిగారి కలం కురిపించిన ఈ గీతం.

చిన్నయ్య-కన్నమ్మ అన్యోన్యమైన అమాయకపు జంట. పడవ వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే అని పచ్చని ప్రకృతి సిరుల నడుమ హాయిగా పాడుకుంటూ గడుపుతుంటారు. పేదరికాన్ని దూరంగా తరిమివేసే సముద్రపు ఒడ్డు, పిచ్చుక గూళ్ళు, నావమీద పరుగులు వారి ప్రపంచం. మిలిటరీలో సిపాయి కింద పని చేసే చిన్నయ్యకు వారి కుటుంబంతో కూడా నమ్మకమైన అనుబంధం.

స్వార్థపరుల దురాగతానికి అనుకోకుండా సిపాయి చనిపోవడంతో, అతని తల్లి ప్రాణాలు కాపాడేందుకు అదే పోలికలతో ఉన్న ఈ చిన్నయ్య, సిపాయి స్థానంలో అతని ఇంటనే ఉండవలసి వస్తుంది. ఈ విషయాన్ని బయటకు తెలియనీయలేని పరిస్థితి. బాధను బాధ్యతగా స్వీకరిస్తాడు చిన్నయ్య.

ఇటు చిన్నయ్య హఠాన్మరణం తట్టుకోలేని భార్య, అటు తను బతికే ఉన్నా భార్యను చేరుకోలేని భర్త. ఆ వెనుక విషాదస్థితిలో వచ్చే ఈ గీతం చాలా సున్నితమైన భావోద్వేగాలకు ఆలంబనగా సాగుతుంది.

పల్లవి:
ఓహో.. హో.. ఆ నావ దాటిపోయింది
ఆ ఒడ్డే చేరిపోయింది
అట్లాగే మళ్ళీ పోయెనా
నన్నిడిచి వెళ్ళిపోయెనా..
నన్నిడిచి వెళ్ళేపోయెనా..

పాట ఆరంభంలో ఆలాపనే చాలా విషాదాన్ని మోసుకొస్తుంది. తన తీరాన లేని నావ, తనను దాటిపోయిన నావ, ఆ వెనుక తన మావ గురించి విలపించే నాయిక అంతరంగవేదన కడలి పొంగులా వెల్లువవుతుంది.

భర్త జ్ఞాపకాలు అలా ఎగిరి వచ్చి ఒక్కసారిగా ఆమె మీద మూకుమ్మడిగా దాడి చేస్తాయి. లోలోపలి బాధ ఆలాపనగా కన్నమ్మ కంట కన్నీరై ప్రవహిస్తుంది.

చరణం 1:
ఓహో.. హో.. రానైనా రాలేను
నిదురపోనైనా పోలేను
నిశిరాతిరి అయినా నీ పిలుపే నా ప్రియా
అదే పూలగాలి ఆనాటిదే జాబిలి
ఏదీ ఎదుట మసలీ ఏదీ లేదు నా చెలీ..

ఆహా.. హా.. నా నావ పగిలేపోయింది
నా రేవు వేరైపోయింది..
నా ఇల్లు మారేపోయింది
నాకన్నే మాత్రం మిగిలింది
నాకన్నే నాలో మిగిలింది..

అతనికి పదే పదే భార్య అనురాగం, పంచుకున్న ఆశలు, చల్లని చిరునవ్వు అన్నీ గుర్తుకొస్తాయి. తనను చేరుకోలేని స్థితి, వివరించలేని పరిస్థితి. అదే బాధతో తనను తాను ఓదార్చుకుంటూ, దూరాన్నుంచే మమతను పంచుతూ భార్యను ఓదార్చడం ఈ అక్షరాలనిండా అలలరోదనలా వెల్లువెత్తుతుంది మన మనసులను తడిపేలా.

నిదురపోని రేయిలో నిదురరాని సమయంలో ఆనాటి జ్ఞాపకాల పరిమళాలను ఎదనిండా మోస్తూ, తన ప్రేయసికి చేరవేస్తూ తలపోస్తుంటాడు భారంగా.

నా ఇల్లే మారిపోయింది ఆర్ద్రంగా అనిపించే ఈ ఒక్క మాటతో పరిస్థితిని మొత్తం వివరిస్తూ, వారి మనోస్థితిని అక్షరాలు నేరుగా అక్కున చేర్చుకుని ఓదార్చిన భావన కలిగించేట్టు వ్రాశారు కృష్ణశాస్త్రిగారు.

రణం 2:

ఓహో.. హో.. నాకోసం పిలిచావో
అపుడెంత కలవరించావో
ఆ రూపే తోచేను అదే గుండె కాల్చేను
ఇదే హోరుగాలి ఇదే పొంగు కడలి
ఇదే మసక జాబిలి
ఏడీ లేడు నా మావ ఏడీ లేడు..

నావ మీద తాము గడిపిన క్షణాలను ఒడిసిపట్టాలని సముద్రతీరాన కూలబడి దుఃఖపడుతూ, విడిపోయే క్షణంలో అతను పడిన వేదనను తలుచుకని మరింత కన్నీరవుతుంది నాయిక. నీవు నన్ను విడిచి వెళుతున్న క్షణాల్లో నాకోసం తప్పకుండా పిలిచే ఉంటావు అన్న ఆలోచనే దహించివేస్తోందని విలపిస్తూ ఉంటుంది.

చనిపోయిన అతనికి సాక్ష్యం లేనట్లే కడలి కడుపులో జారిపడిన ఆమె కన్నీటికీ ఆనవాళ్లుండవు.

ఆహా.. హా.. నా నావ పగిలేపోయింది
నా రేవు వేరైపోయింది
అట్లాగే మళ్లీపోయెనా
నన్నిడిచి వెళ్లిపోయెనా..
నన్నిడిచి వెళ్ళేపోయెనా..

ఆనాడు ఆనందించిన ఘడియలను ఆప్తంగా దాచుకున్న ఇదే గాలి, ఇదే కడలి, కాకుంటే ఈనాడు అన్నీ మసకబారి కొడిగట్టిన దీపంలా ఒడిలో వేదనను మిగిల్చాయి మదిని కన్నీటిమయం చేస్తూ. అదే పూలగాలి పరిమళం, అదే జాబిల్లి చల్లదనం కరువై క్షణాలను బరువుగా చేశాయి. అలతి పదాలలో గాఢమైన అనురాగాన్ని నింపారు రచయిత.

కృష్ణశాస్త్రిగారి ఏ గీతం తీసుకున్నా, ఏ భావంలోకి ప్రయాణించినా ప్రకృతి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాట చరణాల మొదటి వాక్యాల్లో గాఢంగా ప్రవహించి అలసిన వేదన చివరి వాక్యాలలో ఇదే హోరుగాలి ఇదే పొంగు కడలి అంటూ ప్రశాంతమైన పరిసరాల ఒడిలో నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది.

జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించిన సురేష్ ప్రొడక్షన్స్ వారి ‘సిపాయి చిన్నయ్య’ చిత్రం కోసం కృష్ణశాస్త్రిగారి కలం చిందించిన యీ విరహవిషాద భావనలను ఎమ్మెస్ విశ్వనాథన్ అపురూపంగా తన స్వరాలలో ఊరడించారు. ఘంటసాల-సుశీల అతి మార్దవంగా గానం చేసి పాటను మరింత దేదీప్యం చేశారు. ప్రత్యేకంగా పల్లవి, చరణాల ముందు వచ్చే వారి ఆలాపన మరీ ఆర్ద్రంగా హృదయాల్ని స్పృశిస్తుంది. అక్కినేని – కేఆర్ విజయల నటన సజీవంగా కళ్ళు మూసుకున్నా కళ్ళముందు కదలాడుతుంది మసకగా మౌనంగా.

పాట ముగిసినా అదే పూలగాలి, అదే గానపరవశం, అదే అక్షరాల పరిమళం కడలి ఒడిలో అలల్లా మన మనసు మూలల్లో కదలాడుతూనే ఉంటుంది. దాటిపోయిన ఆ నావను వెనుకకు పిలిచి మరల గుర్తుచేసుకుందాం. నావను ఊయలలూపిన ఆ గానాన్ని మరోసారి మననం చేసుకుందాం..వేదన అంచున ప్రకృతి సంతకాన్ని ముగింపు చుక్కలా పెట్టిన కృష్ణశాస్త్రిగారి పదచిత్రణకు మనసారా ప్రణమిల్లుతూ..

Exit mobile version