Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆచార్యదేవోభవ-23

ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు.

యశస్వీయస్వీ:

ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ దిగ్గజాలలో యస్.వి. జోగారావు అగ్రగణ్యులు. పరిశోధనా రంగంలో ఆయన అద్వితీయుడు. 1956లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘ఆంధ్ర యక్షగాన చరిత్ర’ పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన జోగారావు 1957లో డాక్టరేట్ పొందారు. ఆ గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం 1961లో ప్రచురించింది. ఇందులో 802 యక్షగానాలున్నాయి. 465 మంది వాగ్గేయకారుల ప్రస్తావన వుంది. యక్షగాన ఉత్పత్తి, వికాసాలు, ప్రచారం, తెలుగు సాహిత్యంలో యక్షగాన ప్రాశస్త్యం, ఛందస్సు తదితర అంశాలు ఇందులో చర్చించబడ్డాయి.

శిష్ట్లా వెంకట జోగారావు (2 అక్టోబరు 1928 – సెప్టెంబరు 1, 1992) బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ సాహితీ పరిశోధకులు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ.లో స్వర్ణపతకాన్ని 1952లో సంపాదించారు. అప్పట్లో భారత ప్రభుత్వం వారి పరిశోధక పండితుడిగా 1954 నుంచి రెండేళ్ళు పని చేశారు.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖలో అధ్యాపకులుగా దశాబ్దానికి పైగా పని చేశారు. తూమాటి దోణప్ప తర్వాత 1976-79 మధ్యలో జోగారావు శాఖాధ్యక్షులుగా పని చేశారు. ఈ మధ్యలో 1965-67 సంవత్సరాలలో సోవియట్ దేశంలో లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిలో కీర్తి గడించారు. ఆ సమయంలో ‘తెలుగు-రష్యన్-తెలుగు వ్యవహార దర్శిని’ ప్రచురించారు.

హెలికాప్టర్‍లో క్షతగాత్రుని తరలింపు:

జోగారావు లెనిన్‌గ్రాడ్‌లో పని చేస్తున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సందర్భాన్ని గురించి కర్ణాకర్ణిగా విన్న ఉదంతం వివరిస్తాను. జోగారావుకు తక్షణమే – తలకు తగిలిన గాయాలకు మాస్కో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరగాలి. గంటలోపుగా ప్రభుత్వ హెలికాప్టర్‍లో ఆయనను మాస్కో ఆసుపత్రికి తరలించారు. ఆ విధంగా ఆయన మృత్యుంజయుడు. ఆ దేశవాసులు ప్రజల ఆరోగ్య విషయంలో తీసుకొనే అత్యవసర చర్యల గూర్చి ఆయన ప్రస్తావించేవారు. మృత్యుగహ్వరంలో వెళ్ళి బయటపడిన ఆయన సాహితీ సుధలు గ్రోలిన అజరామరుడు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేషనల్ ప్రొఫెసర్‍గా పరిశోధనలు చేశారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు వీరి చేత యక్షగానం మోనోగ్రాఫ్ వ్రాయించారు. 1989లో వీరు రచించిన ‘మణిప్రవాళం’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

ఫికీ ఆడిటోరియంలో..:

1990 ఫిబ్రవరిలో ఢిల్లీ లోని ఫికీ ఆడిటోరియంలో అకాడమీ బహుమతి ప్రదాన సభ జరిగింది. తెలుగు భాషకు జోగారావుకు ఆ పురస్కారం ప్రదానం చేశారు. మర్నాడు ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో తెలుగు సాహితి ఆధ్వర్యంలో ఆర్. యస్. గణేశ్వరరావు జోగారావు అభినందన సభను గురజాడ భవన్‍లో జరిపారు. నేనూ జోగారావు గారిని గూర్చి అభినందన వాక్యాలు పలికాను. వారితో బాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివిన ఒకరు సభకు హాజరయ్యారు. జోగారావు ఛలోక్తులు విసిరారు. గణేశ్వరరావు ప్రతి ఏటా అవార్డు స్వీకరించిన తెలుగువారికి అభినందన సభలు నిర్వహించేవారు. తెలుగు సాహితికి అప్రకటిక అధ్యక్షుడను నేనే. ఆచార్య ఎన్. గోపి, బలివాడ కాంతారావు (1999)ల అభినందన సభలకు కూడా నేనే సూత్రధారిని. గణేశ్వరరావు 40 సంవత్సరాలు తెలుగు సాహితిని పోషించారు. ఆయన హైదరాబాద్‍కు తరలివచ్చారు.

జోగారావు సాహితీ వ్యాసంగం:

వ్యక్తిగత పరిచయం:

నేను 1973 జూన్‌లో విజయవాడ శాతవాహన కళాశాలలో అష్టావధానం చేసినప్పుడు జోగారావు ముఖ్య అతిథి. 1976 అక్టోబరులో నేను యు.పి.ఎస్.సి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వారు పరీక్షాధికారి. 1976 చివర్లో నేను సిద్ధాంత వ్యాసం – కందుకూరి రుద్రకవి రచనలపై – తిరుపతి విశ్వవిద్యాలయానికి సమర్పించినప్పుడు వారు పరీక్షాధికారి. వారు యక్షగానాలపై పరిశోధన చేసిన తొలి వ్యక్తి. తొలి తెలుగు యక్షగానం రుద్రకవి సుగ్రీవ విజయమని నేను నిరూపించే విషయంలోవారి యక్షగాన సర్వస్వం వెలుగుదివ్వె. అలా వారితో బాదరాయణ సంబంధం. యక్షగాన వాఙ్మయం రెండు భాగాలుగా ప్రచురించారు (371 పుటలు + 502 పుటలు).

నండూరి వారు, పుట్టపర్తి వారు, దాశరథి గారి సమక్షంలో రచయిత

ప్రపంచ గురు పీఠాధిపతి:

సాహిత్య రంగంలో ఎంతటి ప్రతిభా సంపన్నులో ఆధ్యాత్మిక రంగంలోను ప్రపంచ గురు పీఠాన్ని (World Teachers Trust) అధిష్ఠించిన ఎక్కిరాల కృష్ణమాచార్య జగద్విఖ్యాతులు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‍లో తెలుగు ఎం.ఎ. (బి.ఎ. ఆనర్స్) చేశారు. పిదప గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అధ్యాపకులయ్యారు (1949). పరిశోధనపై వ్యగ్రత గల ఎక్కిరాల మూడు సంవత్సరాలు సెలవు పెట్టి 1962లో డిసెంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కె.వి.ఆర్. నరసింహం గారి పర్యవేక్షణలో తెనాలి రామకృష్ణ కావ్యపరిశీలనపై సిద్ధాంత వ్యాసం సమర్పించారు. 1966లో పి.హెచ్.డి. సంపాదించారు.

ఎక్కిరాల 1926 ఆగస్టు 11న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్ చేశారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పట్టు సంపాదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా చేరి ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. యూనివర్శిటీ విద్యార్థిగా బీచ్ వైపు ఓ సాయంకాలం వెళ్ళిన ఎక్కిరాల భావోద్వేగంతో సముద్ర కెరటాలపై పడుతున్న వెన్నెలను చూచి ‘రాసలీల’- పద్యకావ్యం రచించారు.

ధర్మ ప్రచారానికై ఉద్యోగం నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకొన్నారు. ఆ విషయం తెలిసి విశ్వవిద్యాలయ సిండికేట్ మెంబరు కె.సర్వేశ్వర రావు చొరవ తీసుకుని 1966లో తెలుగు విభాగంలో వేద, ప్రాచ్య భాషల లెక్చరర్‍గా నియమింపజేశారు. ధార్మిక కార్యక్రమాలకు అడ్డురాని రీతిలో ఆయనకు వెసులుబాటు కల్పించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల ఒత్తిడి, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ బాధ్యతలు పెరిగి 1974లో 48వ ఏట రాజీనామా చేశారు. పదేళ్ళ పాటు విస్తృతంగా పర్యటించారు.

ఐరోపా దేశాలలో పర్యటించి హిందూ ధర్మ ప్రతిష్ఠాపన చేసి జగద్గురువుగా పీఠాధిపతి అయ్యారు. ఎందరో శిష్య పరంపరగా ఏర్పడ్డారు. జెనీవాలో మోరియా విశ్వవిద్యాలయ స్థాపనకు ఎక్కిరాల కృషి విశేషం. భారత దేశ ఆర్థిక స్థితిగతులకు హోమియోపతి వైద్యవిధానమే ఉత్తమమని విశ్వసించి హోమియో విద్యా విధానాన్ని బోధించారు. పలు ప్రాంతాలలో తమ శిష్యుల చేత ఉచిత హోమియో విద్యాలయాలు ఏర్పరచారు. 1980లో నేను విజయవాడలో ఆకాశవాణిలో పని చేస్తున్న రోజుల్లో ఎక్కిరాల వారు నిర్వహించిన హోమియో తరగతులకు హాజరయ్యాను. సులభ రీతిలో బోధించేవారు. వారిని 1978లో కడపలోను, 1980లో విజయవాడలోను ఆకాశవాణిలో ఇంటర్వ్యూ చేశాను. 1996 మే లో కంకిపాడులో ధర్మక్షేత్రంలో నాకు ఇ.కె.అవార్డు ప్రదానం చేశారు. అదొక గొప్ప అనుభూతి.

25 ఏళ్ళ వయసులో నెల్లూరులో అష్టావధానం చేస్తున్న రచయిత

గురు పరంపర:

సనాతన ధర్మ ప్రచారం ఆయన ధ్యేయం. ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఆధ్యాత్మిక గురుపీఠాలకు అధిపతులు కావడం విశేషం. వీరి తమ్ములు ఎక్కిరాల వేదవ్యాస ఐ.ఎ.ఎస్. అధికారిగా వుంటూ, ఒక ఆధ్యాత్మిక పీఠం నిర్వహించారు. మరో తమ్ముడు భరద్వాజ నెల్లూరు వాకాడు కళాశాలలో పనిచేస్తూ సాయిగురు ప్రవచనాల ద్వారా శిష్యకోటిని తయారు చేసుకొన్నారు. కృష్ణమాచార్యులు 1984 మార్చి 17న 58వ ఏట మెదడు వాపు వ్యాధితో కన్నుమూశారు. ఈయన స్థాపించిన వరల్డ్ టీచర్స్ ట్రస్ట్‌కు ప్రస్తుతం కంభంపాటి పార్వతీకుమార్ అధిపతి. ఎక్కిరాల కుమారులు అనంతకృష్ణ కూడా విశాఖపట్టణం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఎక్కిరాల రచనా వ్యాసంగం:

విద్యార్థిగా ‘రాసలీల’ కావ్యం రచించిన ఎక్కిరాల భగవద్గీత రహస్యాలకు అద్వైతపరంగా విస్తృతభాష్యం చెబుతూ ‘శంఖారావం’ ప్రచురించారు. ఋతుగానం, గోదా వైభవం, అశ్వత్థామ, సుభద్ర, అపాండవము, స్వయంవరం, పురాణ పురుషుడు, పురుషమేధం, లోకయాత్ర – వీరి రచనలలో ప్రసిద్ధాలు. జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి  ‘పీయూష లహరి’ అనే పేరుతో అనువదించారు. జ్యోతిషం, హోమియో వైద్యంపై తెలుగు, ఇంగ్లీషు భాషలలో గ్రంథాలు వ్రాశారు. ఆముక్తమాల్యద, జ్యోతిర్విద్య, క్రీడామయుడు, మంద్రగీత, సనత్సుజాతీయం, పతంజలి యోగం, భాగవతం ప్రచారంలో వున్న గ్రంథాలు. ఆంగ్లంలో Our Heritage, Purusha Sooktam, Science of Homeopathy – ప్రముఖాలు.

1972లో విజయవాడలో అష్టావధానం చేస్తున్న రచయిత

వెలుగురేఖ:

24వ ఏట ఎక్కిరాల  ఒకరోజు ధ్యాన నిమగ్నుడై వుండగా ఒక వెలుగురేఖ తళుక్కున మెరిసింది. అది జీవన ప్రస్థానాన్ని నిర్దేశించింది. చదువుకొనే రోజుల్లోనే పెద వాల్తేరు లోని ‘శాంతి ఆశ్రమం’లో మర్రిచెట్టు క్రింద 12 గంటల పాటు ఏకధాటిగా గాయత్రీమంత్ర జపం చేశారు. ఈ నేపథ్యంలో 1971లో వరల్డ్ టీచర్స్ ట్రస్ట్‌ స్థాపించి యూరప్, అమెరికా దేశాలు పర్యటించారు. పతంజలి యోగము, భగవద్గీత, ఆధ్యాత్మిక జ్యోతిషం, ధార్మిక మనస్తత్వంపై ప్రవచనాలు చేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు విదేశాలలో విస్తృత ప్రచారం తెచ్చారు. వీరి ప్రవచనాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి వీరి ఏర్పాటు చేసిన సంస్థలో సభ్యులుగా క్రియాశీలక వ్యక్తులయ్యారు. ఒక తెలుగు అధ్యాపకుడు సాధించలేని ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన అజరామరుడు.

Exit mobile version