Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆచార్యదేవోభవ-39

ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు.

ఆచార్య నాగార్జునుని పేర…

ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గుంటూరుకు సమీపంలోని నల్లపాడు పి.జి. సెంటరు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలకు అది దోహదం చేసింది. 1976లో నాగార్జున విశ్వవిద్యాలయ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక చట్టం 43 ద్వారా స్ధాపించబడింది. 1976 సెప్టెంబరు 11న రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 2004లో దీనిని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు.

తొలి వైస్ ఛాన్సలర్‌గా 1976 ఆగస్టులో వి.బాలయ్య నియమితులయ్యారు. ఆ తర్వాత వరుసగా బి.సర్వేశ్వరరావు, బి.స్వామి, డా.డి. భాస్కరరెడ్డి, కె. రాజారామమోహనరావు, జి. జె. వి. జగన్నాధరాజు, డి. రామకోటయ్య, వై.సి.సింహాద్రి, యన్.వి.జె.లక్ష్మణ్, సి.వి.రాఘవులు, డి. విజయ నారాయణ రెడ్డి, యల్.వేణుగోపాలరెడ్డి, వి.బాలమోహనదాసు, కై.ఆర్.హరగోపాల్, కె.వి.రావు, ఏ. రాజేంద్రప్రసాద్, వి.సి.లుగా వ్యవహరించారు. 2019 నవంబరు నుండి ఆచార్య రాజశేఖర్ అదనపు ఛార్జి వి.సి.

1996లో అప్పటి వైస్-ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.వి.జె. లక్ష్మణ్‌తో రచయిత

తెలుగు శాఖ:

1976లో ప్రారంభమైన తెలుగు శాఖలో దిగ్దంతులైన అధ్యాపకులు బోధనలు చేశారు. ఆచార్య తూమటి దోణప్ప, ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం, ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, ఆచార్య యస్. గంగప్ప, ఆచార్య ఆకురాతి పున్నారావు, డా. సత్యనారాయణ కూడపాక, బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య యోగ ప్రభావతి, డా. యన్. వి. కృష్ణారావు, డా. ఇ. మాధవి, ఆచార్య పి. వరప్రసాదమూర్తి ప్రభృతులు తెలుగు శాఖను సుసంపన్నం చేశారు.

1987లో ఆచార్య తూమాటి దోణప్పతో రచయిత

2020 నాటికి ఈ విభాగం నుండి 200 మంది పి.హెచ్.డిలు, 185 మంది యం.ఫిల్ డిగ్రీలు పొందారు. అనుబంధ కళాశాల అధ్యాపకులు కూడా పర్యవేక్షణ చేసే అవకాశాన్ని ఈ విశ్వవిద్యాలయం అనుమతించింది. ఎం.ఏ తెలుగు, ఎం.ఏ సంస్కృతం డిగ్రీలలో బాటు పరిశోధనలకు అవకాశం లభించింది. ఇక్కడ చదివిన వారు వివిధ కళాశాలల్లో ఉపన్యాసకులుగా చేరారు. సినీ నటుడు బ్రహ్మానందం ఈ విభాగంలో తెలుగు ఎం.ఏ చేశానని సగర్వంగా చెబుతారు.

సాహిత్యనాభి పురుషోత్తముడు:

నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అఖండ ప్రతిభా వ్యుత్పత్తులతో పని చేసిన ఆచార్యులలో బొడ్డుపల్లి పురుషోత్తం అగ్రగణ్యులు. ప్రాచీన సంప్రదాయ సాహిత్యంపై పట్టు గల పురుషోత్తం ఎందరో విద్యార్థులకు మార్గదర్శి. ప్రముఖ సినీ హాస్యనటులు, సాహితీవేత్త అయిన పద్మశ్రీ బ్రహ్మానందం ఆయన శిష్యులలో ప్రముఖులు. నాగార్జున విశ్వవిద్యాలయ ప్రారంభ దశలో తూమటి దోణప్ప ఆచార్యులుగాను, పురుషోత్తం లెక్చరర్‌గా, తమ్మారెడ్డి నిర్మల రీడర్లుగా తెలుగుశాఖలో ప్రవేశించారు.

పురుషోత్తం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చేసి తదుపరి పి.హెచ్.డి పట్టా పొందారు. వీరి వద్ద నాగార్జునలో 18 మంది పి.హెచ్.డి, 19 మంది ఎం.ఫిల్ పట్టాలు సంపాదించారు. పురుషోత్తం గుంటూరు జిల్లా బాపట్లలో 1927 జులై 1న సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. 1954లో చీరాల కళాశాలలో డిగ్రీ చేసి 1958లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పూర్తి చేశారు. 1961లో బొబ్బిలి కళాశాలలోను, 1963లో బాపట్ల కళాశాలలోను అధ్యాపకత్వం వహించారు. 1968లో గుంటూరు పి.జి సెంటరులో ప్రవేశం చేశారు. 1977-87 మధ్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పని చేశారు.

శ్రీ పురుషోత్తమ సంస్కృతి – సత్యశివసందరాకృతి పేర స్మారక సంచికను ఆయన అభిమానులు ప్రచురించారు. 2009 మే 2న విజయవాడలో రసభారతి సదస్సులో శలాక రఘునాథ శర్మ ఆ సంచికను ఆవిష్కరించారు. గంటి జోగి సోమయాజి వద్ద ఎటమలాజికల్ డిక్షనరీలో పని చేస్తూ తెలుగు వ్యాకరణ వికాసంపై పరిశోధన చేశారు. ప్రారంభ ధశలో పెద్దపాలెం పాఠశాలలో అధ్యాపకులుగా చేరి ఆచార్యులుగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రిటైరయ్యారు. ఆయన యథార్ధవాది. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. “తనకు ప్రొఫెసర్ పోస్టు ఇంటర్వ్యూలో కూడా తను నమ్మిన సిద్ధాంతాన్నే మాట్లాడారు” అని శలాక వారు సంస్మరణ సభలో అన్నారు. యార్లగడ్డ బాలగంగాధరరావు మాట్లాడుతూ ఎవరినీ లెక్క చేయని స్వభావం వారిదనీ, ఇద్దరం ఒకే గదిలో తూర్పు పడమర దిక్కులుగా కూచొని పని చేశామని అన్నారు.

బొడ్డుపల్లి పురుషోత్తం గారు ప్రముఖ సినీ నటులు శ్రీ బ్రహ్మానందంకి గురువుగారు.

ప్రచురిత గ్రంథాలు:

గోపికా హృదయోల్లాసం, శ్రీకృష్ణార్జున సంవాదం, కాళిదాస కవిత, మహోదయం (చారిత్రక నవల), మానిషాదం, త్యాగరాజ సద్గురు సమారాధనం, వాగానుశీలనం, ఆధునికాంథ్ర కవిత్రయ శారదా సమారాధనం, తెలుగు వ్యాకరణ వికాసం (పిహెచ్‌డి థీసీస్) యుగపురుషుడు, విశ్వకవి, ఈడూ జోడూ, కుసుమాంజలి, శుచిముఖి, మన సారస్వతం, ఓ మానవతావాది, సత్యం-శివం-సుందరం, బాలవ్యాకరణ వికాస వ్యాఖ్య, భాషాశాస్త్ర పరిచయం, భక్త కవిరాజు బమ్మెర పోతరాజు, శివానందలహరి, గీతాంజలి, సౌందర్యలహరి, వైభవశ్రీ విశ్వనాథ, ప్రబోధ గీతావళి, త్రిలింగ లక్షణములు.

ఆంగ్లం – Truth, Bliss and Beauty, The Theories of Telugu Grammar.

చివరి రోజులు:

1987లో రిటైరయిన పురుషోత్తం గుంటూరులో స్థిర నివాసం ఏర్పరుచుకొన్నారు. ఆధ్యాత్మికానుభూతితో అరవిందాశ్రమ సాన్నిహిత్యం పొందారు. చివరిరోజు వరకు ఏదో వ్రాస్తూ ఉన్నారు. విజయవాడ శివరామక్షేత్రంలో రామయణోపన్యాసాలు అద్భుతంగా చేశారు. వీరి కుమార్తె గిరిజాలక్ష్మి నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో రీడర్‌గా రిటైరయ్యారు. 2000 ఫిబ్రవరి 3 గురువారం అరవిందాశ్రమ గీతాన్ని అనువదించారు. రాత్రి 11 గంటలలైంది, అలా పడకపై తల వాల్చారు. వేకువన కోమాలోకి వెళ్ళారు. 4వ తేది శుక్రవారం పుదుచ్చేరి ఆశ్రమం నుంచి పుష్పం పోస్టులో వచ్చింది. మనుమరాలు తాతగారి దిండుక్రింద పెట్టిన కొద్దిగంటలలో పురుషోత్తముడు పురుషోత్తమ ప్రాప్తి చెందాడు. వారి కుమారులు ముగ్గురు శాస్త్రవేత్తలుగా ప్రసిద్ధికెక్కారు.

~

దివ్యానుగ్రహం                           

ఏ పరిపాలకుడు చెలామణి చేసుకోలేని

అధికార మొకటి ఉన్నది,

ఏ భౌతిక విజయం సమకుర్చలేని

సౌఖ్య మొకటి ఉన్నది…

ఏ విజ్ఞత పొందని కాంతి ఒకటున్నది,

ఏ తత్త్వము, ఏ శాస్త్రము స్వాధీనం చేసుకొని

విజ్ఞాన మొకటిన్నది,

ఏ యిచ్చావాప్తి అందీయని

ఆనందానుభూతి ఒకటున్నది,

ఏ మానవ సంబంధము కల్గించని

ప్రేమ దాహ మొకటున్నది

ఎక్కడా చివరకు శ్మశానంలో కూడా

లభించని శాంతి ఒకటున్నది,

అదే అధికారం, సౌఖ్యం, కాంతి, విజ్ఞానం

ఆనందానుభూతి, ప్రేమ, శాంతి

దివ్యానుగ్రహం నుండి ప్రవస్తాయి.

– శ్రీమాత

సమర్పణ

బొడ్డుపల్లి పురుషోత్తం

1994లో డా. బెజవాడ గోపాలరెడ్డి, టి. కోటేశ్వరావు గారలతో రచయిత

భాషా ‘నిర్మల’

భాషాశాస్త్రంలో అధ్యయన అధ్యాపనాలు కొనసాగించిన విదుషీమణి తమ్మారెడ్డి నిర్మల. 1960లో విజయవాడ యస్.ఆర్.ఆర్.కళాశాలలో బి.ఏ. చదివారు. కృష్ణా జిల్లాలో 1940 ఆగస్టు 26 కృష్ణాష్ణమి నాడు జన్మించారు. 1962లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు ఎం.ఏ. చేశారు. ఆచార్య కె.వి.ఆర్ నరసింహం పర్యవేక్షణలో నన్నెచోడుని కుమార సంభవ పరిశీలన సిద్ధాంతవ్యాసం సమర్పించి 1966లో పి.హెచ్.డి పొందారు.

విజయవాడ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ, పొట్లపల్లి సీతారామారావు వీరికి గురువులు. ప్రస్తుతం ‘ఆంధ్ర మహాభారతం-స్త్రీ ప్రతిపత్తి’ అనే 300 పుటల గ్రంథం ప్రచురిస్తూ తమ గురుదేవులు కె.వి.ఆర్.నరసింహం, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి, షడంగి, తూమటి దోణప్ప, కొర్లపాటి శ్రీరామమూర్తిగారల కంకితమిస్తున్నానని సవినయంగా చెప్పారు. 1966-68 మధ్య ఉస్మానియాలో లింగ్విస్టిక్స్ ఎం.ఏ. చదివారు. చేరా గురువు గారు.

తెల్లకాగితంపై అప్లికేషన్:

1968లో కోఠీ ఉమెన్స్ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తుండగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ లెక్చరర్ ఖాళీ వుందని తెలిసి తెల్లకాగితంపై దరఖాస్తు పంపారు. రెండు నెలల్లో ఉద్యోగ నియామకం వచ్చింది. 1969-78 మధ్య 9 సంవత్సరాలు తిరుపతిలో జి.యన్.రెడ్డిగారి ప్రోత్సాహంతో ఉపన్యాసకులుగా పేరు తెచ్చుకున్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో ఖాళీ ఏర్పడినపుడు 1978లో రీడరుగా చేరారు. 1985 మార్చి నుండి 2000 ఆగస్టు వరకు ఆచార్య పదవి నధిష్టించారు. సున్నిత స్వభావురాలైన నిర్మలకు అధ్యాపకురాలిగా మంచి పేరు. వెంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలు రెండింటిలో 30 మంది దాకా పరిశోధకులు వీరి పర్యవేక్షణలో పి.హెచ్.డి / యం.ఫిల్ చేశారు.

తెలుగు అకాడమీ ప్రచురించిన తెలుగు భాషా చరిత్ర గ్రంథాన్ని నాయని కృష్ణకుమారి, టి.నిర్మల వ్రాశారు. ఆచార్య దోణప్ప సంపాదకులు. పదవీ విరమణనంతరం నిర్మల విజయవాడలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

ఇదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పని చేసిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం తరువాతి కాలంలో తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి, ఆపైన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యలుగా పదవి విరమణ చేశారు. ఆ విశ్వవిద్యాలయ సందర్భంలో వారి ప్రస్తావన తెచ్చాను.

Exit mobile version