[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘ఆదర్శ నారీ శిరోమణి’. రచన శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ.]
ఇది ‘దేవీభాగవతం’ లోని నవమస్కందంలోని వేదజనని ‘సావిత్రిమాత’ అనుగ్రహంతో జన్మించిన సావిత్రి కథ. సతీ సావిత్రి గాథ మన పురాణాలలో చాలా ప్రసిద్ధి పొందినది. నారాయణ మహర్షి ఈ కథను నారదమునికి అనుగ్రహించారు. వేదజనని అయిన సావిత్రిని మొట్టమొదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరువాత వేదములు ఉపాసించినాయి. పండిత బృందాలు అర్చించి తరించారు.
జంబూద్వీపంలోని పుణ్యభూమి అయిన భారత భూభాగంలోనున్న ‘మద్ర’ దేశాన్ని అశ్వపతి అనే మహారాజు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతని భార్య మాలతీదేవి పరమ సాధ్వి. ఇరువురూ చాలా అన్యోన్యతతో జీవించేవారు. కానీ ఎంతకాలానికీ వారికి సంతాన భాగ్యం కలుగలేదు. కులగురువైన వశిష్ఠ మహాముని ఉపదేశంపై వారు సావిత్రిదేవిని భక్తిప్రపత్తులతో ఆరాధించారు. అయినా ఫలితం కలగలేదు. ఆ మాత వారికి దర్శనమీయలేదు. అనుగ్రహించలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. అశ్వపతి ఓదార్పులు ఆమెకు ఊరట కలిగించలేకపోయాయి.
భార్య కోరికను తీర్చటానికి అశ్వపతి మహారాజు తానే ‘వేదజనని’ కరుణకై తపస్సు చేయటానికి పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై, ఏకాగ్రచిత్తంతో ‘నూరేళ్ళు’ తపస్సు చేశాడు. అయినా ఆ తల్లి ప్రత్యక్షం కాలేదు. చాలా కుమిలిపోయాడు అశ్వపతి. అప్పుడు ఆకాశవాణి ‘దశలక్ష గాయత్రీ’ మంత్ర జపం చేయమని చెప్పింది.
అదే సమయానికి పరాశర మహర్షి ఆ ప్రదేశానికి వచ్చాడు. అశ్వపతి ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడా మహర్షి గాయత్రీ మంత్ర ప్రభావాన్ని అశ్వపతికి వివరించాడు. “ఓ అశ్వపతి మహారాజా! నీవు ముందుగా గాయత్రీదేవిని ఉపాసించు. ఆ తరువాత సావిత్రిని ధ్యానించు. నీ కోరిక ఫలిస్తుంది” అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు.
ఆవిధంగానే అశ్వపతి ముందుగా గాయత్రీదేవిని ఉపాసించాడు. జ్యేష్ఠమాస బహుళ త్రయోదశినాడు శుభముహూర్తంలో సావిత్రీ వ్రతమారంభించాడు. కొద్దికాలానికే సావిత్రీదేవి తన చిరుమందహాస, సుందర వదనారవిందంతో దశదిశలకు కాంతులు నింపుతూ ప్రసన్నురాలై అశ్వపతికి కనులవిందు చేస్తూ ప్రత్యక్షమయ్యింది. మాతృవాత్సల్యంతో పలకరించింది. “ఓ అశ్వపతీ! నీవు చేసిన తపస్సుకు మెచ్చాను. నీ మనసులోని కోరిక పుత్రవాంఛ. అయితే నీ భార్య కూతురి కోసం పరితపిస్తోంది. మీ ఇరువురి కోరికలు రాబోయే కాలంలో తీరుతాయి” అని వరమిచ్చి ఆ తల్లి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది.
అశ్వపతి సంతోషంగా తన రాజధానికి చేరుకున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ‘సావిత్రి’ అని నామకరణం చేశారు. సావిత్రి శుక్లపక్ష చంద్రునిలా పెరిగి యవ్వనవతి అయ్యింది. ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఒకరోజు నారదమహాముని అశ్వపతి మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజ దంపతులు ఆ మహర్షికి ఉచితసత్కారాలు చేశారు. సావిత్రి కూడా వచ్చి ఆయనకు నమస్కరించింది.
“ఓ రాజా! యుక్తవయస్కురాలైన నీ కుమార్తెకింకా వివాహం చేయలేదెందుకు?” అని అడిగాడు నారదముని.
“అదే విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నా కూతురికి తగిన వరుని తమరే నాకు తెలియజేయండి స్వామి” అన్నాడు అశ్వపతి.
“నువ్వే మీ అమ్మాయిని అడిగి తెలుసుకుని, ఆమె మనోవాంఛకు అనుగుణంగా మసలుకో?” అని చెప్పాడు నారదమహర్షి.
మహాముని మాటప్రకారం సావిత్రిని పిలిచి “తల్లీ! నీ మనస్సులో ఎవరినైనా వరునిగా తలచుకుంటున్నావా?” అని అడిగాడు అశ్వపతి.
“తండ్రీ! నా నెచ్చెలుల ద్వారా ద్యుమత్సేనుని కుమారుడైన ‘సత్యవంతు’ని అందచందములు, గుణగణములగురించి తెలుసుకున్నాను. ఆయనే నాకు తగిన భర్తగా ఊహించుకుంటున్నాను” అని చెప్పింది సావిత్రి.
దానికి అశ్వపతి “అమ్మా! విధివశాత్తు ఆ ద్యుమత్సేనుడు తన చూపుని పోగొట్టుకుని, శత్రువులవలన రాజ్యలక్ష్మిని కోల్పోయి, ప్రస్తుతం అడవులవెంట తిరుగుతున్నాడు” అని చెపుతున్న తండ్రి మాటలకు “సిరిసంపదలు, రాజ్యాలు లేకపోయినా సత్యవంతుని గుణవిశేషములే నాకు ముఖ్యమనుకున్నాను. అందుకే అతనితోనే నా వివాహం జరిపించండి” అని బదులిచ్చింది సావిత్రి.
అంతా విన్న అశ్వపతి, నారద మునితో “మహర్షీ! ఆ సత్యవంతుని గుణగణములెటువంటివి?” అని అడిగాడు.
“రాజా! అతని అసలు పేరు ‘త్రాశ్వుడు’. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. శౌర్యములో దేవేంద్రుని మించినవాడు. తేజస్సులో పున్నమినాటి చంద్రుని పోలినవాడు. అందములో అశ్వనీదేవతలతో పోటీ పడగలవాడు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. అన్నింటికన్నామించి అతడు ఎప్పుడూ సత్యమునే పలుకుటచే అతనికి ‘సత్యవంతుడు’ అనే నామధేయం వచ్చింది. ఆవిధముగా సత్యవంతుడు మంచి గుణములతో వర్ధిల్లుతున్నాడు. కానీ అల్పాయుష్కుడు. అతనికి వివాహమైన ఒక సంవత్సరంలోపుగా మరణిస్తాడు” అని సత్యవంతుని భవిష్యత్తును చెప్పాడు నారదముని.
అప్పడు సావిత్రితో “విన్నావుగా తల్లీ! ఆ సత్యవంతునికి సంపదలేకాదు ఆయుష్షు కూడా లేదు. ఏ తండ్రయినా తన కూతురికి తెలిసితెలిసి అల్పాయుష్కుడిని భర్తగా నిర్ణయిస్తాడా? నీకు అన్ని విధాల అర్హుడయిన వ్యక్తిని నీకు భర్తగా తీసుకొస్తాను” అన్నాడు అశ్వపతి.
“తండ్రీ! త్రికరణములలో మనసు ప్రధానమైనది కదా. అటువంటి మనస్సులో నేను సత్యవంతుని నా భర్తగా భావించుకున్నాను. అతను ఎలాంటి వాడైనను ఫరవాలేదు. అతనితోనే నా వివాహం జరిపించండి. నేను మరెవరినీ వరించలేను” అని పలికింది సావిత్రి.
అదివిన్న నారదుడు “రాజా! నీ కొమరిత గుణవంతురాలు. ఆమె మనసును మరల్చుట సాధ్యము కానిపని. ఆమెను సత్యవంతునికే ఇచ్చి వివాహం జరిపించుము. ఈమె చేసిన పుణ్యము వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడేమో? ఆ విధాత లిఖించిన తలరాతను ఈమె మార్పుచేయగలదేమో? మనందరం మంచి మనస్సుతో ఆ దంపతులను ఆశీర్వదిద్దాం” అని దీవెనలనందించి వెళ్ళాడు నారద ముని.
నారదుని ఆనతి మేరకు అశ్వపతి మహారాజు వివాహ సంబారాలతో అడవిలోనున్న ద్యుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. ద్యుమత్సేనుడు మహారాజుని తగురీతిని సత్కరించాడు.
“మహారాజా! ఈమె నా కూతురు సావిత్రి. ఈమెను నీ కోడలిగా స్వీకరించుము” అన్నాడు అశ్వపతి.
ఆ మాటలను విన్న ద్యుమత్సేనుడు “అయ్యా మేము ప్రస్తుతం రాజ్యహీనులం. అడవులలో జీవనం చేస్తున్నాము. మరి రాజభోగములతో తులతూగే సుకుమారి అయిన మీ కుమార్తె ఈ అడవులలోని కష్టాలను ఓర్చుకోగలదా?” అన్నాడు.
అంతట అశ్వపతి “రాజా! సిరిసంపదలు శాశ్వతం కాదు. ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి. ఈరోజు ఉండి రేపు పోయే క్షణభంగురమైన ఈ జీవితంలో వచ్చే బాధల గురించి ధీరులు దుఃఖించరు. నా కుమార్తె బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. కాదనకండి” అన్నాడు.
ఆ మాటలను విన్న ద్యుమత్సేనుడు కాదనలేకపోయాడు. సావిత్రీసత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కూతురికి వివిధ ఆభరణాలను, వస్తువులను ఇచ్చి తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు.
సావిత్రి ఆ అడవులలో నారచీరలను ధరించి అత్తమామలకు సేవలు చేస్తూ, భర్తతో హాయిగా ఉంటోంది. సావిత్రికి వివాహం జరిగి సంవత్సరం పూర్తికావటానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలాయి. సావిత్రి మూడు రాత్రుల దీక్షను తీసుకుంది.
ఆఖరి రోజు ఉదయమే స్నానాదికాలను పూర్తిచేసుకుని అత్తమామలకు నమస్కరించి, అందరికీ ఉపచర్యలను చేసింది సావిత్రి. సత్యవంతుడు “సావిత్రీ! నేను అడవిలోనికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను” అని బయలుదేరాడు. “నేనుకూడా మీ వెంటవస్తాను” అని చెప్పి అత్తమామల అనుమతి తీసుకుని సత్యవంతుని అనుసరించింది సావిత్రి. ఆ అడవి అందాలనో కంట ఆస్వాదిస్తూనే, భర్తను మరో కంట చూస్తూ అతనిలోని మార్పులను గమనిస్తోంది.
సత్యవంతుడు కొన్ని పండ్లను కోసిన తరువాత యజ్ఞ సమిధల కోసం ఒక ఎండిన చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తలభారంగా ఉందని, గొడ్డలిని కిందపెట్టి తూలుతూ వచ్చి కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తలను పెట్టుకుని సపర్యలు చేస్తూ ఉండగా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు.
అంతలో నల్లని ఆకారం కలిగి, కోరలతో, ఎఱ్ఱని నేత్రములు కలిగిన, బంగారు వస్త్రములను ధరించిన, అతి భీకరాకారుడు, చేతిలో పాశం ధరించిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసిన సావిత్రి భీతిల్లినదై, కొంతసేపటికి స్థిమితపడి “అయ్యా! తమరెవరు?” అని అడిగింది.
“సావిత్రీ! నేను యమధర్మరాజును. నీవు పతివ్రతవు. కావున నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనిపించను. నీ భర్త ఆయువు తీరినది. అతడు ఎల్లపుడూ సత్యమునే పలుకుటచే గొప్ప పుణ్యపురుషుడైనాడు. అందుకే భటులను పంపక అతని ప్రాణములను గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను” అని పలికి యమధర్మరాజు పాశమును సత్యవంతుని పైకి విసిరి అతని శరీరమునుండి జీవుణ్ణి బయిటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుగా పయనమయ్యాడు. దక్షిణ దిక్కు యమస్థానం. అందుకే ఆ దిక్కున తల ఉంచి నిదురించరాదని పెద్దలు చెపుతారు.
సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ కనిపించకుండా పొదలమాటున దాచి, ఆ యమధర్మరాజుని అనుసరించసాగింది.
తన వెనుకనే వస్తున్న సావిత్రిని చూసిన యమధర్మరాజు “అమ్మా! నీవు నన్నెందుకు అనుసరిస్తున్నావు? ఇక మీదట ఈ దారిగుండా నా వెనుక రావటం నీకు సాధ్యం కాదు” అని పలికాడు.
అంతట సావిత్రి “యమధర్మరాజా! భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నా ప్రాతివత్యం వల్లనూ, నీ అనుగ్రహంచేతనూ నేను నిన్ను అనుసరించలేని చోటు ఉంటుందా ఈ లోకాన? అన్ని మార్గములలో ధర్మ మార్గం ప్రధానమైనది. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎన్నటికీ వృధాకాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శన భాగ్యం వలన పరమ శుభములను పొందక మామూలు మనిషివలే ఎటుల వెనుకకు పోగలను” అని పలికింది సావిత్రి.
పన్నెండేళ్ళు కూడా నిండని యువతి ఇంతటి జీవన సత్యాలను పలుకుట విన్న యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. “తల్లీ! నీ మాటలకు నా మనస్సెంతయో సంతసించినది. నీ భర్త ప్రాణములు తప్ప ఏదైనా ఒకవరం కోరుకొమ్ము” అన్నాడా యమధర్మరాజు.
అంతట సావిత్రి “యమధర్మరాజా! నా మామగారికి కంటి చూపులేదు. వారికి చూపు వచ్చేలా అనుగ్రహించండి” అని కోరుకుంది.
“సరేనమ్మా! నీ మామగారికి కంటిచూపును ప్రసాదించితిని. దీనితో తృప్తిపడి మరలిపో” అన్నాడా యమధర్మరాజు. సావిత్రి ఆగక ఆయననుసరించింది.
“ఓ యమధర్మరాజా! మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనులయెడ కరుణ చూపుట, దానధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట మొదలైనవి ‘ఆర్యధర్మము’లని మీకు తెలియును కదా. నీవు ధర్మదేవతవు. నీకు తెలియని ధర్మమేమున్నది? అందరి యొడల సమబుద్ధితో ఉంటావు కనుకనే నిన్ను ‘సమవర్తి’ అని పిలుస్తారు కదా నిన్ను” అని వినయంగా పలికింది.
ఆ మాటలకు ఎంతో సంతుష్టుడైన యమధర్మరాజు “సావిత్రీ! నీ మాటలు అమృతతుల్యంగా ఉన్నాయి. నీ పతి ప్రాణములు తప్ప మరియొక వరము కోరుకో” అన్నాడు.
అంతట సావిత్రి “యమధర్మరాజా! నా మామగారి రాజ్యం శత్రువులచే ఆక్రమించుకోబడి, వారు రాజ్య భ్రష్టులైనారు. వారి రాజ్యాన్ని వారికి ఇప్పించండి” అని వేడుకుంది.
“అట్లేకానిమ్ము. నీవు కోరిన విధముగానే వారికి రాజ్యం వస్తుంది. ఇక నీవు మరలి పొమ్ము” అన్నాడు యమధర్మరాజు.
యమధర్మరాజును విడువక అనుసరిస్తున్న సావిత్రి “ఓ యమధర్మరాజా! ధర్మాత్ములు ఎట్టి పరిస్థితులలోనూ ధర్మాన్ని విడువరు కదా! ఆ ధర్మాన్ని పరిరక్షించే మీరే నన్ను నా ధర్మ మార్గాన్ని విడువమని చెపుతున్నారా? భర్తను అనుసరించుట భార్య ధర్మం కదా! మరి ఆ ధర్మాన్ని నేనెలా విడిచేది?” అని పలికింది.
అంతట యమధర్మరాజు “సావిత్రీ! నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను. మరొక్క వరమివ్వ నిశ్చయించుకున్నాను” అన్నాడు.
సావిత్రి వెంటనే “యమధర్మరాజా! ‘అ పుత్రస్య గతిం నాస్తి’ అని కదా ఆర్యోక్తి. నా తండ్రికి పుత్ర సంతతిలేదు. ఆయనకు పుత్రులను అనుగ్రహింపుము” అని కోరుకుంది.
“అలాగే తల్లీ! నీ తండ్రికి నూరుగురు కొమరులనిచ్చెదను. అలసిపోయావమ్మా! ఇక వెనుకకు మరలు” అన్నాడు యముడు.
సావిత్రి “యమధర్మరాజా! సతికి పతి సేవయే పరమార్థం. నా భర్తసేవలో నిమగ్నమై, ప్రస్తుతం ఆయన ప్రాణాలకొరకై పోరాడుతున్న నాకు అలుపెక్కడిది? తన ధర్మాన్ని ఆచరించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్ఠ తోనే సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా ఏడుమాటలు మాట్లాడితేనే వారు బంధువులవుతారని నానుడి. నేను మీతో ఎన్నో మాటలాడాను. ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకున్నాను. ఇహ, పరలోక, జ్ఞానవైరాగ్య, వేదాంత పరిజ్ఞానం మీ ద్వారా నాకు లభించాయి. అందువల్ల మీరు నాకు బంధువులైనారు. కనుక నా కోరికను మన్నించండి” అంది సావిత్రి.
యమధర్మరాజు “తల్లీ!నా ధర్మం నిర్వర్తించటంలో నాకు ఎవరిపైనా రాగద్వేషాలు ఉండవు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నేను నడచుకోలేను. కానీ ఎందుకో నీ పట్ల నాకు కనికరం కలుగుతోంది. అందుకే నీకు మరియొక వరమిస్తాను. కోరుకొమ్ము” అన్నాడు.
“యమధర్మరాజా! ఇప్పటివరకు ముందుగా నా అత్తింటివారి, తరువాత పుట్టింటివారి శుభాలను కోరుకొన్నాను. ఇప్పుడు మీరు కోరుకోమన్న వరం నా కోసం కోరుతున్నాను. యమధర్మరాజా! సతికి పతియే ప్రత్యక్ష దైవమంటారు కదా! పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ వేడుకకైనా, మంగళకార్యక్రమాలకి పతిలేని సతిని పిలవరు. కనుక నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నా పతిని పునరుజ్జీవితుణ్ణి చేయండి” అని ప్రాధేయపడింది.
యమధర్మరాజు సావిత్రిని మెచ్చుకుంటూ “నీలో యోగులకు, జ్ఞానులకు మించిన జ్ఞానం కనబడుతోంది. ఎంతో శ్రమకోర్చి నన్ను అనుసరించి, ఎన్నో ప్రశ్నలను సంధించి, తెలివితో ఆలోచించి నా ద్వారా వివిధ ధర్మ సూక్ష్మాలను, వేదాంతజ్ఞానాన్ని తెలుసుకున్నావు. నువ్వు గొప్ప పట్టుదలగల వ్యక్తివి.
నీ తండ్రి ఆ వేదజనని అయిన సావిత్రీదేవిని ఎంతో కఠోర నిష్ఠతో పూజించి, ఆ తపఃఫలంగా నీకు జన్మనిచ్చాడు. అందుకే ఆ మాత పేరును నీకు పెట్టుకుని అపురూపంగా చూసుకున్నాడు. పన్నెండేళ్ళ వయస్సుగల నీవు నీ భర్త ప్రాణాల కోసం నన్ను అనుసరిస్తూ ఎంతో శ్రమకోర్చావు.
ఆ శ్రీహరికి శ్రీలక్ష్మిలా, చతుర్ముఖుడికి సరస్వతిలా, శంకరునికి పార్వతిలా ఈ సత్యవంతునికి నీవు సౌభాగ్యదేవతవు. నీవు కారణ జన్మురాలివమ్మా. సుప్రియవు నీవు. అన్నిటా ఆ సావిత్రీదేవికి సమానురాలివి.
సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలివి అవుతావు” అంటూ ఎంతో సంతోషించి సత్యవంతుని జీవుని అతని శరీరంలోకి ప్రవేశపెట్టాడు. “నీవు నీ పతితో సుఖ సంతోషాలతో వర్ధిల్లవమ్మా” అంటూ ఆశీస్సులనందించాడు. ఆ పిమ్మట ‘దేవీ వర్ణన’, ‘దేవీ స్మరణ’, ‘దేవీ స్తవన’, ‘దేవీ వందన’, ‘దేవీ మంత్ర పఠన’, ఉత్తమ మార్గములని సావిత్రికి బోధించాడు. ఆ విధంగా యమధర్మరాజు నోట ‘శక్తి సంకీర్తన’ విన్న సావిత్రి ఆయనను స్తుతించి, కీర్తించింది.
ఈ కలియుగంలో మనం చూస్తున్న ఎన్నో కుటుంబాలలోని కలహాలకు, సమస్యలకు ఈ సావిత్రి కథ ద్వారా పరిష్కారం తెలుసుకోవచ్చును. నేటి సమాజాన భార్యా భర్తలు ఓర్పును కోల్పోయి ‘నీ’ ‘నా’ అనే పట్టుదలలకుపోయి దూరమవుతున్నారు. ఒకరిపై మరొకరికి అనుమానాలు, మనస్పర్ధలతో తమ జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఇరువైపులనున్న పెద్దలకు తీరని వ్యధను కలిగిస్తున్నారు.
ఇలాంటి పురాణ ప్రసిద్ధమైన గాథలను చదివిన కుటుంబాలలో చిన్నా పెద్దా సమస్యలెదురైనా ఓర్పుతో ధైర్యంగా ఎదుర్కొని హాయిగా జీవిస్తున్నారు. మన రామాయణ, భారత, భాగవతాలలోని కథలతో పాటు అష్టాదశపురాణాలలోని మంచి వ్యక్తిత్వం, సుగుణాలను కలిగిన అనేక మహనీయుల పాత్రలు ప్రస్తుత సమాజ కళ్యాణానికి తోడ్పాటునందిస్తున్నాయి.
ఉప్పలూరి మధుపత్ర శైలజగారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఒక స్ఫూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణాన్ని అవ్యక్త భావనను మనసులో దాచుకోలేక అక్షరాలతో సొబగులద్ది కవితగానో, కథగానో మార్చటం వారికి ఇష్టమైన పని. ఆ క్రమంలో ఇప్పటివరకు దాదాపుగా 300 కథలు, 100 కవితలు రాశారు. ‘మధుపత్రాలు’, ‘మధుమాలిక’, ‘మధువనం’, ‘మధుమంజీరాలు’ అనే కవితా, కథా సంపుటాలను ప్రచురించారు. తన రచనలకు బహుమతులనిస్తూ, ప్రచురిస్తున్న సాహితీ సంస్థలకు, పత్రికలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
