[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
అద్య వాలిసముత్థం తే భయం వైరం చ వానర!।
ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే॥
అనృతం నోక్తపూర్వం మే వీర కృచ్ఛ్రేపి తిష్టతా।
ధర్మలోభపరీతేన న చ వక్ష్యే కథంచన॥
తదాహ్వాన నిమిత్తం త్వం వాలినో హేమమాలినః।
సుగ్రీవ కురు తం శబ్దం నిష్పతేద్యేన వానరః॥
(కిష్కింధకాండ, 14. 10, 14, 16)
శ్రీరాముడు: సుగ్రీవా! నేటి మీ ద్వంద్వ యుద్ధ సమయమున ఒకే ఒక్క బాణముతో వాలిని హతమార్చెదను. దానితో అతని వలన నీలో ఏర్పడిన భయము తొలగును. వైరం కూడా తొలగును.
ధర్మహానిని సహింపని వాడను గావున ఎట్టి కష్టములు ఎదురైనను ఇంతవరకును అసత్యమును పలుకలేదు. ఏది యేమైనను ఇక మీదట కూడా అనృతమును పలుకను.
కనుక ఓ సుగ్రీవా! బంగారు హారమును ధరించెడి వాలిని యుద్ధమునకు పిలుచుచు గట్టిగా గర్జింపుము. ఆ శబ్దమును వినినంతనే అతను తన భవనము నుండి బయటకు రాగలడు.
..’హేమమాలినః’ అని పలికాడు. దాని మహిమ గురించి ప్రస్తావించలేదు. యుద్ధప్రీతి గల వాలిని యుద్ధానికి ఆహ్వానించమని చెప్పటం, మీ ద్వంద్వ యుద్ధం జరుగుతుండగా ఒక్క బాణంతో హతమారుస్తాను అని చెప్పటం విశేషం. ఆయన స్వయంగా వాలితో తలపడటం అన్నది ముందుగానే నిర్ణయించుకున్న అంశం. సోదరుని భార్యను అతను బ్రతికుండగానే చెరబట్టడం కాకుండా అనుజుడిని పూర్తిగా హతమారుస్తున్న సందర్భం సృజిస్తున్న ఒక ప్రక్రియ ముందరికి వస్తున్నది.
‘ధర్మలోభపరీతేన’ – ధర్మహానిని సహింపను గావున.. ఆ సందర్భంలో ధర్మం వైపు నిలిచి వాలిని పూర్తిగా నేల కూల్చటం అన్నది వ్యూహాత్మకంగా ప్రతిబింబిస్తున్నది.
ధర్మం పట్ల అనురక్తి లేని వారు ఒక సరళిలో అధర్మాన్ని ఆచరిస్తూ ప్రాణాల మీదకి వస్తున్న ముప్పును లెక్క చేయరు.
అటువంటి వారిని ఆ పరిస్థితికి తీసుకురావటం, తద్వారా రూపుమాపటం దైవం అనుసరించే మార్గం.
వ్యావహారికమైన అంశం కూడా గమనార్హం. ఇక్కడ తగువు వాలి సుగ్రీవులకు. శ్రీరామునకు సూటిగా యుద్ధంలోకి వెళ్ళే అవసరం, అవకాశం రెండూ లేవు.
శ్లో.
న చ కార్యో విషాదస్తే రాఘవం ప్రతి మత్కృతే।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి॥
ముక్తస్తు వజ్రనిర్ఘోషః ప్రదీప్తాశనిసన్నిభః।
రాఘవేణ మహాబాణో వాలివక్షసి పాతితః॥
(కిష్కింధకాండ, 16. 5, 34)
వాలి తారతో: శ్రీరామునితో నాకు వైరము ఏమున్నది? ఆయన వలన నాకు ప్రమాదం కలుగునని శంకించటం గాని, అందులకై దుఃఖించటం గాని చేయవలదు. అతడు బాగా ధర్మమును ఎరిగినవాడు. కర్తవ్యాకర్తవ్యములు తెలిసినవాడు. అటువంటి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎట్లు తలపెట్టును?
..రఘువీరుడు ప్రయోగించిన మహాశరము వజ్రాయుధము వలె భయంకర ధ్వని చేస్తూ పిడుగు వలె నిప్పులు గ్రక్కుచు వాలి వక్షస్థలము నందు నాటుకొనెను.
శ్లో.
శక్రదత్తా వరా మాలా కాంచనీ వజ్రభూషితా।
దధార హరిముఖ్యస్య ప్రాణాంస్తేజః శ్రియం చ సా॥
స తయా మాలయా వీరో హేమయా హరియూథపః।
సంధ్యానుగతపర్యంతః పయోధర ఇవాభవత్॥
తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యశః శరః।
త్రిధేవ రచితా లక్ష్మీః పతితస్యాపి శోభతే॥
(కిష్కింధకాండ, 17. 5, 6, 7)
వజ్రములు పొదగబడిన ఇంద్రదత్తమగు ఆ బంగారుదండ వానర ప్రభువు యొక్క ప్రాణములను, బలములను, తేజస్సును కాపాడెను. ఆ వాలి సంధ్యా సమయము నందలి ఎర్రని కాంతులతో కూడి యున్న మేఘము వలె విలసిల్లుచుండెను. వాలి యొక్క శోభ అతడు ధరించిన మాల, అతని దేహము, దానిపై నాటుకొని యున్న బాణము అను మూడు రూపములుగా విరాజిల్లుచున్నది.
..ఈ వర్ణన వలన ఈ కాంచనమాల ప్రభావం చేత శ్రీరాముడు వాలికి ఎదురుగా రాలేదు అనే వివరణలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగి యుండవచ్చు. ఈ మాల అతని ప్రాణాలను, తేజస్సును కాపాడి యున్నది అన్న మాట మహర్షి చెబుతున్నాడు. ఆ మాల ప్రభావం శ్రీరాముని శక్తికి మించినది అని చెప్పలేదు. ఆ మాలను ఒక బాణంతో పెకిలించి ఆ తరువాత యుద్ధం చేసే సామర్థ్యం శ్రీరాముని లేదనుకోవటం కూడా సముచితం కాదు.
కాకపోతే ఈ చివరి శ్లోకంలో వాలి ధరించిన మాల, అతని శరీరం, శ్రీరాముని ద్వారా ప్రయోగింపబడిన బాణం – ఈ మూడునూ విచిత్రంగా శోభిల్లుచున్నవి అని చెప్పటం ఒక సంఘటన యొక్క వర్ణనకు పరాకాష్ట.
పశుబలం, ఆర్జించిన తపస్సు, వరములు, అధిష్ఠించిన సింహాసనం ఇత్యాదులు అధర్మం ముందు బలహీనములు అన్నది సుస్పష్టం.
రావణుని వర్ణిస్తూ ఆంజనేయుడు ‘యద్యధర్మం న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః’ అని చెబుతాడు. అధర్మం వలన బలహీనుడు గాని శక్రుడిని కూడా పాలింపగల సమర్థుడు అంటాడు.
ఆ సరళిలో వాలి ప్రశ్నలు, శ్రీరాముని సమాధానాలు – రెండింటినీ సమకూర్చి చూసినప్పుడు విషయం అర్థమవుతుంది!
శ్లో.
పంచనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ!।
శల్యకః శ్వావిధో గోధా శశః కూర్మశ్చ పంచమః॥
(కిష్కింధకాండ, 17. 37)
వాలి శ్రీరాముని ఆక్షేపించాడు. దొంగచాటుగా వేటాడావు. అనివార్యమైన పరిస్థితులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల మాంసం సేవించాల్సి వచ్చినపుడు అయిదు గోళ్ళ గల జంతువులతో ముళ్ళపంది, కుక్కలను చంపే వరాహము, ఉడుము, కుందేలు, తాబేలు అనునవే భక్షింపదగినవి.
(నా మాంసం వ్యర్థం కదా?)
శ్లో.
ఇక్ష్వాకూణామ్ ఇయం భూమిః సశైలవనకాననా।
మృగపక్షిమనుష్యాణాం నిగ్రహప్రగ్రహావపి॥
తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవాగృజుః।
ధర్మకామార్థతత్త్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః॥
(కిష్కింధకాండ, 18. 6, 7)
శ్రీరాముడు: కొండలతో, కోనలతో, అరణ్యములతో కూడిన ఈ భుమి అంతయును ఇక్ష్వాకు ప్రభువుల అధీనములోనిది. ఇచటి మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకును, అనుగ్రహించుటకును వారికి అధికారము కలదు. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పాలించుచున్నాడు. అతడు సత్యసంధుడు, ఋజువర్తనుడు, ధర్మకామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు.
..అమితమైన బలాన్ని కూడగట్టుకున్న వారు, శత్రువులను జయించిన వారు కొద్ది కాలంలో తారతమ్యాలను మరచిపోవటం సహజం. చిన్నగా చెప్పాలంటే శ్రీరాముడు ‘నువ్వెవరితో మాట్లాడుతున్నావో కొద్దిగా అర్థం చేసుకో’ అన్నట్లున్నది.
శ్లో.
త్వం తు సంక్లిష్టధర్మశ్చ కర్మణా చ విగర్హితః।
కామతంత్రప్రధానశ్చ న స్థితో రాజవర్త్మని॥
జ్యేష్ఠో భ్రాతా పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి।
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మ్యే పథి వర్తినః॥
యవీయాన్ ఆత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః।
పుత్రవత్తే త్రయశ్చింత్యా ధర్మశ్చేదత్ర కారణమ్॥
సూక్ష్మః పరమ దురజేయః సతాం ధర్మః ప్లవంగమ।
హృదిస్థః సర్వభూతానామ్ ఆత్మా వేద శుభాశుభమ్॥
చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః।
జాత్యంధ ఇవ జాత్యంధైః మంత్రయన్ ద్రక్షసే మ కిమ్॥
అహం తు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమి తే।
న హి మాం కేవలం రోషాత్ త్వం విగర్హితుమర్హసి॥
తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః।
భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనమ్॥
అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః।
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్॥
తత్ వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానర।
భ్రాతృభార్యావమర్శేస్మిన్ దండోయం ప్రతిపాదితః॥
న హి ధర్మవిరుద్ధస్య లోకవృత్తాదపేయుషః।
దండాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథప॥
న హి తే మర్షయే పాపం క్షత్రియోహం కులోద్భవః।
ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః।
ప్రచరేత నరః కామాత్తస్య దండో వధః స్మృతః॥
~
తదేభిః కారణైః సర్వైః మహద్భిర్ధర్మసంహితైః।
శాసనం తవ యద్యుక్తం తద్భవాననుమన్యతామ్॥
సర్వథా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహః।
వయస్యస్యోపి కర్తవ్యం ధర్మమేవానుపశ్యతః।
శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానుపశ్యతా॥
శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ।
గృహీతౌ ధర్మకుశలైః తత్తథా చరితం హరే!॥
(కిష్కింధకాండ, 18. 12-23, 29-32)
శ్రీరాముడు వాలితో:
రాజధర్మమును వీడి కామతంత్రములో ఉన్నావు. పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు – ముగ్గురూ ధర్మమార్గమున ప్రవర్తించువానికి తండ్రులు. చిన్నవాడైన సోదరుడు, కుమారుడు, శిష్యుడు – వీరందరినీ పుత్రుని వలె చూచుకోవాలి.
ధర్మము సూక్ష్మమైనది. సత్పురుషులకు కూడా పూర్తిగా తెలియనిది. అందరి హృదయములలో నున్న పరమాత్మ ఒక్కనికే తెలియును.
నీవు సహజంగా చపలుడవు. బుద్ధిహీనులతో చర్చిస్తావు. ఒక జాత్యాంధుడు ఇతర జాత్యాంధుల వలన మార్గము తెలిసికొనడు.
కోపావేశములో నన్ను నిందించుట తగదు. నీవు పరంపరగా వచ్చుచున్న ధర్మమును గంగలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. సుగ్రీవుడు నీకు తమ్ముడు. రుమ నీకు కోడలు లేదా కూతురు వంటిది. అతడు బ్రతికియుండగా రుమతో కామాతురుడవై పాపకర్మకు ఒడిగట్టావు. అందువలన ఈ దండన విధించవలసి వచ్చినది.
ధర్మ విరుద్ధముగా ప్రవర్తించువారిని ఈ విధముగా దండించుట కంటే మరొక మార్గము లేదు.
నేను క్షత్రియుడను. పాపాత్ముడవైన నిన్ను క్షమించరాదు. ధర్మశాస్త్రము ఈ పరిస్థితిలో ‘వధించుటయే శిక్ష’ అని చెప్పినది.
నీకు తగిన దండన భరతుని తరఫున విధించాను. బాగా అర్థం చేసుకో. ఈ శిక్ష అన్ని విధాలుగా ధర్మబద్ధము, న్యాయము అని తెలుసుకో.
‘నీవును ధర్మ దృష్టి గలవాడవు. అందుచేత నీకు విధించిన ఈ శిక్షను’ న్యాయముగనే భావింపుము.
నేను యును ధర్మశాస్త్రములనే అనుసరించాను.
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.