Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె చూపిన దారి

[హిందీలో శ్రీమతి సుష్మా త్రిపాఠీ రచించిన ‘మార్గదర్శిని’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

సౌందర్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతా నుండి కాన్పూర్ వెళ్తోంది. రాత్రి ఒంటిగంట అయింది. అకస్మాత్తుగా ఆమెకు మెలకువ వచ్చింది; వాష్‌రూమ్‌కి వెళ్లాలనిపించింది. బోగీలో ఉన్నవాళ్లంతా నిద్రపోతున్నారు. కారిడార్ లైట్లు తప్ప కూపేల్లోని లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి. ఆమె కూపే తలుపు తెరిచి బయటకు రాగానే.. సుమారు ఇరవై ఎనిమిదేళ్ల ఒక యువకుడు బోగీ బయటి తలుపు తెరవడానికి ప్రయత్నించడం చూసింది. అతను పై గొళ్ళెం తీసేసాడు, క్రింది గొళ్ళెం తీయడానికి క్రిందికి వంగాడు. సౌందర్యను చూడగానే అతను ఏదో దొంగతనం చేస్తూ దొరికిపోయినట్టు కంగారుపడ్డాడు.

“ఇంత అర్ధరాత్రి పూట తలుపు ఎందుకు తీస్తున్నావ్?” అని అడిగింది.

అతను ఏమీ మాట్లాడలేదు. సౌందర్య అతని ముఖాన్ని చదవడానికి ప్రయత్నించింది, కానీ అతను కళ్ళు దించేసుకున్నాడు. అతని ముఖంలో ఏదో లోతైన బాధ తాలూకు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆమె మనసులోనే అనుకుంది – ‘నిరాశ నిస్పృహల్లో ఉన్న మనిషికి సరైన సమయంలో సరైన సలహా దొరికితే, ఎంతో అనర్థం జరగకుండా కాపాడుకోవచ్చు.’

ఆమె మళ్ళీ అడిగింది – “ఏమైంది బాబూ? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టు ఉన్నావే.”

“ఏం లేదండీ ఆంటీ,” అంటూ అతను చకచకా లోపలికి వెళ్ళిపోయాడు.

సౌందర్య తిరిగి తన కూపేకి వచ్చేసరికి, అతను తన కూపేలోనే ఉన్న తోటి ప్రయాణికుడని గమనించింది. టూ-టైర్ ఏసీలో లోయర్ బెర్త్ సౌందర్యది, పై బర్త్ ఆ యువకుడిది. అంతకుముందు ఆమె రైలు ఎక్కినప్పుడు స్వయంగా తనే ఏదో బాధలో, ఆలోచనల్లో ఉండటం వల్ల ఆ యువకుడిని పెద్దగా పట్టించుకోలేదు. తన తండ్రి మరణవార్త విని ఆమె కాన్పూర్ బయలుదేరింది.

అరవై ఐదేళ్ల సౌందర్య తన నలుగురు తోబుట్టువులలో అందరికంటే పెద్దది. తల్లి చనిపోయిన కొన్నాళ్లకే ఆమె తమ్ముడు కూడా చనిపోయాడు. ఈ వరుస అకాల మరణాల వల్ల ఆమె చిన్న తమ్ముడు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఆమె అతడిని తన దగ్గరే ఉంచుకుని వైద్యం చేయించింది. చికిత్స సత్ఫలితాలను ఇచ్చింది కానీ, కాలక్రమేణా అతను మళ్ళీ పాత స్థితికే చేరుకున్నాడు. ఇప్పుడు తండ్రి కూడా చనిపోవడంతో ఆ చిన్న తమ్ముడిని సంబాళించడం ఆమెకు చాలా కష్టంగా మారుతోంది. వీడియో కాల్‌లో అతని పరిస్థితిని చూసి ఆమె ఎంతో ఆందోళన చెందింది.

సౌందర్య తన బెర్త్‌పై కాస్త పక్కకు జరిగి, “ఇలా వచ్చి కూర్చో బాబూ!” అంది.

ఏడ్చి ఏడ్చి అతని కళ్ళు వాచిపోయాయి. ఆ ఎర్రబడిన కళ్ళతో అతను తన వైపు చూడగానే సౌందర్య మనసు ద్రవించిపోయింది. ఆమె ఎంతో అనుభవం ఉన్న స్త్రీ. ఆమె ఆ యువకుడి వీపుపై ఆప్యాయంగా తట్టింది. ఆ మాతృత్వపు స్పర్శకు అతను తనను తాను ఆపుకోలేకపోయాడు. సౌందర్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. సౌందర్య వాటర్ బాటిల్ మూత తీసి అతనికి అందించింది. అతను ఆ బాటిల్ అందుకుని ఒకే గుక్కలో నీళ్లన్నీ తాగేసాడు. ‘పాపం, ఈ అబ్బాయి అసలు ఎప్పటి నుండి తిండి తిన్నాడో, నీళ్లు తాగాడో’ అని సౌందర్య మనసులో అనుకుంది. నీళ్లు తాగాక అతను కాస్త తెరిపిన పడ్డాడు. సౌందర్య నిలకడగా అతని మనస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

“బాబూ! పోరాటమే జీవితం.. ఈ భూమి మీద ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. డబ్బుతో మనం ఏదైనా కొనగలం కానీ, ఎంత ఆస్తి ఉన్నా పోయిన ప్రాణాన్ని తిరిగి కొనలేం కదా. నీ సమస్య ఏంటో నాతో చెప్పు. ఏమీ కాకపోయినా మనసైనా తేలికపడుతుంది.”

అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

“ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా ఉంటుంది,” అని కాస్త ఆగి మళ్ళీ అడిగింది, “ముందు నీ పేరేంటో చెప్పు?”

“జితేందర్ అండి.”

“ఓహో.. నీ పేరుకు అర్థం నీకు తెలుసు కదా? తన ఇంద్రియాలను జయించినవాడే జితేంద్రుడు. కోరుకున్నది దక్కలేదని నువ్వు అఘాయిత్యానికి సిద్ధపడితే, నీ పేరుకే అవమానం జరిగినట్టు,” అంటూ ఆమె చిన్నగా నవ్వింది. దాంతో అతని మనసు కాస్త తేలికపడింది.

అతను తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.

~

“నేను బి.టెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లో.. ఆ రోజు కాలేజీలో ఫస్టియర్ స్టూడెంట్స్‌కి మొదటి రోజు. కొందరు సెకండియర్ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ‘ఊర్మిళా.. ఊర్మిళా..’ అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు.

‘అరే, ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని నేను గట్టిగా అడిగాను.

‘ఏం లేదు సార్!” అంటూ ఆ స్టూడెంట్స్ అంతా అక్కడికక్కడే చెల్లాచెదురైపోయారు.

అప్పుడు ఆ అమ్మాయి భయం భయంగా ‘థాంక్యూ సార్!’ అంది. ఆమె పెద్ద పెద్ద అందమైన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. పదిహేడేళ్ల ఆ అమాయకపు ముఖాన్ని చూడగానే నేను మనసు పారేసుకున్నాను.

‘నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?’ అని అడిగాను.

‘ఫిరోజాబాద్ నుండి.’

‘ఇక్కడ సాధారణంగా పెద్దగా ర్యాగింగ్ ఉండదులే, కానీ ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి. ఇదిగో నా నెంబర్ తీసుకో. ఏ ప్రాబ్లం వచ్చినా మెసేజ్ లేదా కాల్ చెయ్యి. నా పేరు జితేందర్.’ అని చెప్పాను.

‘సార్! నాకు హాస్టల్‌లో రూమ్ దొరికిందండి,’ అంది తను.

‘వెరీ గుడ్! ఇంకేదైనా హెల్ప్ కావాలా?’

‘మీరు నాతో పాటు మార్కెట్‌కి వస్తారా? కొన్ని అవసరమైన వస్తువులు కొనాలి,’ అని తను ఏమాత్రం సంకోచించకుండా అడిగింది.

‘సరే, సాయంత్రం ఐదు గంటలకి హాస్టల్ గేట్ దగ్గరకు వచ్చేయ్, నేను అక్కడే ఉంటాను,’ అని చెప్పాను.

మార్కెట్‌లో తను ప్రతి వస్తువునూ – అది బకెట్ అయినా, మగ్ అయినా, సోప్ కేస్ అయినా – అన్నిటికంటే తక్కువ ధరలో ఉన్న దాన్నే కొనడం నేను గమనించాను.

‘మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని అడిగాను.

‘ఆయన హోమియోపతి డాక్టర్. అమ్మ గృహిణి.’

‘సరే, షాపింగ్ అయిపోయింది కదా, పద ఏదైనా తిందాం.” అని చెప్పి, తనకి ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేసాను. తను ఎంతో ఇష్టంగా, ఆస్వాదిస్తూ తింటుంటే చూసి నా ముఖంలో నవ్వు విరిసింది.

అలా మేము మొదట్లో నాలుగైదు సార్లు కలుసుకున్నాం. ఆ తర్వాత ప్రతిరోజూ కలవడం అలవాటైంది. తను క్లాసులో జరిగిన విషయాలు, హాస్టల్ ముచ్చట్లు అన్నీ నాతో పంచుకునేది. ఈ మధ్యలో నేను వారం రోజులు లీవ్ తీసుకున్నాను. రెండు రోజులయ్యాక ఊర్మిళ నాకు ఫోన్ చేసింది.

‘ఎలా ఉన్నారు? రెండు రోజుల నుండి కాలేజీకి ఎందుకు రావడం లేదు?’

‘అయ్యో, మర్చిపోయాను. నీకు చెప్పలేదు కదా, నేను ఒక వారం రోజులు కాలేజీకి రావడం లేదు.’

‘నాకు అస్సలు బాగుండడం లేదండీ. చదువు మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను.’

‘చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఊర్మిళా, వచ్చే వారం నుండి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా.’

‘ట్రై చేస్తాను, కానీ మీరు త్వరగా వచ్చేయండి.’

ఆమె మాటలు విన్నాక నా మనసు కూడా కాస్త వికలమైంది. ఎందుకంటే నేను కూడా ఆమెను చాలా మిస్ అవుతున్నాను.

ఆ రోజు తన మొదటి ఎగ్జామ్. తను కాలేజీ గేట్ దాటి బయటకు వచ్చింది. రోడ్డు అవతలి వైపు నేను నిలబడి ఉండటం చూసి, అటు ఇటు చూడకుండా రోడ్డు దాటసాగింది. వేగంగా వస్తున్న ఒక కార్ని చూసి నేను వెంటనే చేత్తో ఆగమని సైగ చేసాను. కార్ స్పీడ్ తగ్గి, సరిగ్గా ఆమెకు ఒక మీటర్ దూరంలో ఆగింది. నేను పరిగెత్తుకెళ్లి ఆమె చేయి పట్టుకుని రోడ్డు దాటించాను. నేను ఆమె చేయి పట్టుకోవడం అదే మొదటిసారి.

‘చూసుకుని నడవలేవా?’ అని కాస్త కోపంగా అన్నాను.

‘మిమ్మల్ని చూసాక నాకు ఇంకేమీ గుర్తుండదు,’ అంది తను.

‘నాకు కూడా నీతో టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం ఊర్మిళా.’

‘నేను జీవితాంతం మీతోనే ఉండాలనుకుంటున్నాను.’

‘నువ్వు ముందు చదువు పూర్తి చెయ్యి. నేను ఎలాగూ ఇక్కడి వాడినే కదా. నా బి.టెక్ పూర్తి కాగానే కోల్‌కతాలోనే జాబ్ చూసుకుంటాను. అప్పుడు మనం కలిసే ఉండొచ్చు. నువ్వు ఇంకా నాలుగేళ్లు ఇక్కడే చదవాలి కదా.’

‘ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా, నెక్స్ట్ ఎగ్జామ్ ఎల్లుండే కదా,’ అంది తను.

‘బోటింగ్ కి వెళ్దామా?’

‘పదండి.’

నేను ఒక గంట సేపటికి పడవ మాట్లాడుకున్నాను. గంగమ్మ అలలపై పడవ సాగుతుంటే, ఊర్మిళ ఒక పాటను ముద్దుముద్దుగా పాడుకోసాగింది’…

‘గంగ అలలపై పడవ సాగుతోంది..’. తోడుగా నా ప్రియ సఖుడున్నాడు..

పెదవుల విప్పకనే ప్రేమ భాషలు పలుకుతున్నాడు..

కళ్ళతోనే మనసును చదివేసాడు.. నేను అతని సొంతమైపోయాను..”

‘నీ వాయిస్ చాలా బాగుంది ఊర్మిళా.’

‘అంతా మీ సాంగత్యం చేసిన మాయే,’ అంది తను.

మేము ఇద్దరం ఒకరి ప్రేమలో ఒకరం పూర్తిగా మునిగిపోయాం. నేను తన చదువులో సాయం చేసేవాడిని, తన అవసరాలన్నీ తీర్చేవాడిని, ప్రతి విషయంలోనూ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడిని. అదృష్టవశాత్తూ నాకు కోల్‌కతాలోనే ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది.

ఊర్మిళ ఇంటి నుండి చాలా లిమిటెడ్‌గా డబ్బులు వచ్చేవి. కానీ ఈలోగా తన ఖర్చులు పెరిగిపోయాయి. తన రూపూ రంగూ మారిపోయి, ఎంతో అందంగా తయారైంది. తనని ఎవరు చూసినా అలా కొన్ని క్షణాల పాటు కళ్ళు తిప్పుకోలేకుండా ఉండిపోయేవారు. చాలాసార్లు తన కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు నేనే కట్టాల్సి వచ్చింది. తనకి ఇష్టమైన షాపింగ్ చేయించేవాడిని. మేమిద్దరం మా ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కనేవాళ్లం.

‘జీతూ! నేను కూడా కోల్‌కతాలోనే జాబ్ చేస్తాను. మనం మొదట ఒక ఫ్లాట్ కొనుక్కుందాం. ఒకరి శాలరీ లోన్ కట్టడానికి సరిపోతుంది, ఇంకొకరి ఇన్‌కమ్‌తో ఇల్లు గడుస్తుంది.’ అని ప్లాన్ చేసేది.

‘మరి పెళ్లి?’ అని నేను నవ్వుతూ అడిగితే…

‘ఫ్లాట్ కొనడంతో పాటే పెళ్లి కూడా చేసేసుకుందాం,’ అనేది తను.

అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. ఊర్మిళ లాస్ట్ సెమిస్టర్ రోజులు కూడా వచ్చేశాయి. నేను ఊర్మిళ కోసం ఎంతో ముమ్మరంగా ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభించాను. తన రెజ్యూమే అన్ని కంపెనీలకూ పంపేవాడిని.

అలాంటి సమయంలో ఒకరోజు తను అంది – ‘జీతూ! నువ్వు ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి బయటి నగరాల్లోని కంపెనీలకు కూడా నా తరఫున అప్లై చెయ్యి. మనకు కచ్చితంగా ఇక్కడే ఉద్యోగం దొరకాలని లేదు కదా.’

‘మనం ఒక రోజు కూడా విడిచి ఉండలేం కదా ఊర్మిళా,’ అని నేను ఎప్పుడూ చెప్పే మాటనే మళ్ళీ అన్నాను.

చివరి సెమిస్టర్ పూర్తయ్యాక తను తన సొంత ఊరు ఫిరోజాబాద్ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు రోజు మేమిద్దరం రోజంతా కలిసే గడిపాం.

‘జీతూ! నేను వెళ్తున్నాను కానీ, నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? కానీ ఇప్పుడు ఇంటికి వెళ్లకుండా ఉండటానికి నా దగ్గర ఎలాంటి కారణాలూ లేవు. ఈ నాలుగేళ్లలో నా సాకులన్నీ అయిపోయాయి, చదువు కూడా పూర్తయింది. వెళ్లక తప్పదు,’ అంది తను.

‘నేను మాత్రం ఎలా ఉండగలను? నా గురించి ఆలోచించావా? నీకు జాబ్ రాగానే నువ్వు తిరిగి వచ్చేయాలి. త్వరలోనే ఏదో ఒక కంపెనీ నుండి నీకు కాల్ వస్తుందని ఆశిస్తున్నాను,’ అని చెప్పి పంపాను.

మొదట్లో ఇద్దరం రోజూ వీడియో కాల్స్ మాట్లాడుకునేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత తను కేవలం నార్మల్ కాల్స్ మాత్రమే చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మెల్లగా ఏదో ఒక సాకు చెప్పి ఫోన్ పెట్టేసేది – ‘అమ్మ పక్కనే ఉంది’, ‘పిన్ని కూతురు వచ్చింది’, ‘బాబాయ్ బాబుని నేనే చూసుకోవాలి’ ఇలా రకరకాల కారణాలు చెప్పేది.

ఇక్కడ నేనేమో తన జాబ్ కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ప్రతిచోటా నిరాశే ఎదురవుతోంది. ఒకరోజు ఊర్మిళ ఎంతో హ్యాపీగా ఫోన్ చేసింది.

‘జీతూ! నేను నోయిడాలోని ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ కంపెనీకి అప్లై చేసాను కదా, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు!’ అంది.

ఆ మాట వినగానే నాకు చాలా బాధేసింది. ‘అంటే ఇక మనం విడివిడిగా ఉండాలా?’ అన్నాను.

‘అయ్యో, కొన్ని రోజులే కదా. నేను అక్కడ ఉంటూనే ఇక్కడ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ రాగానే ఆ ఉద్యోగం వదిలేస్తాను,’ అంది. చేసేదేమీ లేక నేను కూడా సరేనన్నాను.

ఊర్మిళ ఉద్యోగంలో చేరింది. కానీ చేరిన కొద్దిరోజులకే తను నా ఫోన్ కాల్స్ నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ‘బిజీగా ఉన్నాను’, ‘కొత్త జాబ్ కదా’, ‘వర్క్ ఎక్కువగా ఉంది’, ‘అలసిపోయాను’ అనే మెసేజ్‌లు మాత్రమే వచ్చేవి.

ఒకరోజు నేను తట్టుకోలేక వరుసగా చాలాసార్లు ఫోన్ చేసాను, తను ఎత్తలేదు. రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తే తను ఎత్తింది. నేను కాస్త సీరియస్‌గానే అడిగాను – ‘నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు?’

‘అయ్యో ఫోన్ సైలెంట్‌లో ఉందబ్బా.’

‘మరి మిస్డ్ కాల్స్ కనిపించలేదా?’

‘అసలు ఫోన్ చూసుకునే టైమే దొరకలేదు. సరే గానీ, ఇప్పుడు ఏమైంది చెప్పు?’ అంది విసుగ్గా.

‘ఏమైంది అని అడుగుతున్నావా? నేను, మా పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి మీ అమ్మానాన్నలతో మన పెళ్లి గురించి మాట్లాడబోతున్నాం.’

‘పె.. పెళ్లా? వద్దు, ఇప్పుడు వద్దు!’ అంది కంగారుగా.

‘ఎందుకు వద్దు? మన రిలేషన్ గురించి ఇరువైపులా పేరెంట్స్‌కి ముందే తెలుసు కదా. మా అమ్మ అయితే ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమని చెప్తోంది.’

‘లేదు! ఇప్పుడు వద్దు! ప్లీజ్ నా మీద ప్రెజర్ తీసుకురావద్దు.’

‘అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? దేనికోసం వెయిట్ చేయాలి?’ అని గట్టిగా అడిగాను.

ఊర్మిళ వెంటనే ఫోన్ కట్ చేసి, స్విచ్ ఆఫ్ చేసేసింది. నా మనసులో ఏదో తెలియని అనుమానం మొదలైంది. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసాను. ఆయన అన్నారు – ‘బాబూ! పెళ్లి అనేది బొమ్మలాట కాదు కదా. ఊర్మిళ ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడే మేము పెళ్లి చేస్తాం, అంతవరకు మేము వెయిట్ చేస్తాం.’

ఆయనేమో అలా మాట్లాడారు, దాంతో నా అనుమానం నిజమే అనిపించింది. అలా ఒక నెల గడిచిపోయింది. ఊర్మిళ మాటల్లో, బిహేవియర్‌లో చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఇక లాభం లేదనుకుని, నోయిడా వెళ్లి నేరుగా తనతోనే మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. ట్రైన్ ఎక్కగానే తనకి మెసేజ్ చేసాను – ‘నేను నోయిడా వస్తున్నాను.’

వెంటనే ఊర్మిళ నుండి కాల్ వచ్చింది.

‘జీతూ, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో!’ అంది.

‘ఎందుకు? ఇప్పుడు నీకు నన్ను చూడాలని కూడా లేదా?’

‘నువ్వు రావద్దు. నెక్స్ట్ స్టేషన్‌లోనే దిగి వెనక్కి వెళ్ళిపో.’

‘అసలు ఏం జరుగుతోందో స్పష్టంగా చెప్పు ఊర్మిళా!’ అన్నాను ఆవేశంగా.

కాసేపు అవతల నిశ్శబ్దం.. ఆ తర్వాత తను అంది – ‘నేను నిన్ను పెళ్లి చేసుకోలేను.’

‘ఏంటి? మరి ఈ నాలుగేళ్లుగా నువ్వు నాతో ఆడింది నాటకమా?’

‘నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను, అంతే.’

‘ఎందుకు? కారణం ఏంటి? కావాలంటే, మనం కాస్త టైమ్ తీసుకుందాం’ అన్నాను బ్రతిమాలుతూ.

‘లేదు, అలాంటిదేమీ లేదు.’

‘మరి ఇంకేంటి ప్రాబ్లం? ఫోన్‌లో చెప్పడం ఇష్టం లేకపోతే రేపు మార్నింగ్ నేను వస్తున్నాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం,’ అని నేను ఫోన్ పెట్టేయబోతుంటే తను ఆపింది.

‘జీతూ! నువ్వు ఇక్కడికి రావద్దు. ప్లీజ్, వెనక్కి వెళ్ళిపో. ఎందుకంటే.. వారం రోజుల క్రితమే మా ఆఫీస్‌లో నాతోటి ఉద్యోగిని నేను కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను క్షమించు. నేను ఇకపై నిన్ను ఎప్పటికీ కలవాలనుకోవడం లేదు. నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను.’

ఫోన్ కట్ అయింది.

ఆ మాట విని ఇప్పటికి ఐదు గంటలు కావస్తోంది. అప్పటి నుండి నేను ఈ పై బర్త్‌ మీద శవంలా పడి ఉన్నాను. మా ఇంట్లో వాళ్లంతా ఊర్మిళను ఎప్పుడో మా ఇంటి కోడలిగా ఫిక్స్ అయిపోయారు. ఈ నాలుగేళ్ల లాంగ్ రిలేషన్‌లో తనతో గడిపిన ప్రతి క్షణం గుర్తొచ్చి నా ప్రాణం విలవిలలాడిపోతోంది. నేను తనని ఎంతగా ప్రేమించాను! కానీ తను ఒక్క నిమిషంలో అంతా మర్చిపోయి వేరేవాడిని పెళ్లి చేసుకుంది.

నేను మా బావగారికి చాలా క్లోజ్. రాత్రి ఒంటిగంట సమయంలో ఆయనకు వాట్సాప్‌లో ఒక లాంగ్ మెసేజ్ రాశాను. అందులో ఊర్మిళ స్వార్థం గురించి, ప్రేమలో తను చేసిన ద్రోహం గురించి అంతా రాశాను. దాంతో పాటు.. ‘నేను ఇక బతకాలనుకోవడం లేదు. మన ఫ్యామిలీ, సొసైటీ, మన ఫ్రెండ్స్ అందరికీ మా లవ్ గురించి తెలుసు. ఇప్పుడు నేను అందరికీ ఏ ముఖం చూపించాలి? అందుకే వెళ్ళిపోతున్నాను’ అని రాశాను. ఆ మెసేజ్ పంపే సమయానికి ఆయన నిద్రపోతుండటం వల్ల చూడలేదు.” అంటూ చెప్పడం ఆపాడు.

~

సౌందర్య అతని వైపు తీవ్రంగా చూస్తూ, “అంటే నువ్వు చచ్చిపోడానికి సిద్ధమయ్యావన్నమాట!” అంది.

అతను తల దించుకున్నాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు బుగ్గలపైకి జారిపడ్డాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లు ద్రోహం వల్ల వచ్చినవి కావు, తను చేసుకోబోయిన అనర్థాన్ని తలచుకుని వచ్చినవి.

“నా వైపు చూసి జవాబివ్వు జితేందర్!” అంది సౌందర్య.

అతను మౌనంగా ఉండిపోయాడు.

“సరే, ఒకటి చెప్పు.. నువ్వు అసలు ఊర్మిళను ఎందుకు ప్రేమించావు?”

“తను చాలా అందంగా ఉండేదండి. తన పెద్ద పెద్ద కళ్ళు కట్టిపడేసేవి. తనతో ఉంటే చాలా బాగుండేది. మా ఇద్దరి భవిష్యత్తు గురించి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకున్నాం. అందుకే నా సంపాదనలో ఎక్కువ భాగం తన కోసమే ఖర్చు పెట్టేవాడిని. ఎలాంటి గొడవలు లేకుండా నాలుగేళ్లు కలిసి ఉన్నాం. తను ఎంతో ముద్దుగా తన మాటలు నా చేత ఒప్పించేది, నేను కూడా సంతోషంగా ఒప్పుకునేవాడిని. నేను తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా బంధం భార్యాభర్తల బంధం లాంటిది. తను ఎంతో సపోర్టివ్‌గా ఉండేది. అందరు అమ్మాయిలూ తనలా ఉండరు ఆంటీ. నేను తనకంటే ఐదేళ్లు పెద్దవాడిని, అందుకే తనేదైనా తప్పు చేసినా చిన్నపిల్ల కదా అని వదిలేసేవాడిని.”

సౌందర్య అతని మాటలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నది. తన విశ్లేషణాత్మక ఆలోచనతో కాసేపు ఆలోచించి ఇలా అంది – “హుఁ.. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఊర్మిళను ప్రేమించలేదు, తను కూడా నిన్ను ప్రేమించలేదు!”

జితేందర్ ఆ మాట విని షాక్ అయ్యాడు. తను వింటున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా సౌందర్య వైపు చూడసాగాడు.

“నువ్వు చెప్పిన ప్రతి విషయాన్నీ ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించు. తను అందంగా ఉంది, కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయి, తనతో ఉంటే బాగుండేది – ఇదంతా  స్త్రీ పురుషుల మధ్య ఉండే ఒక సహజమైన శారీరక ఆకర్షణ మాత్రమే! తను ఫిరోజాబాద్ నుండి కోల్‌కతా లాంటి కొత్త సిటీకి వచ్చినప్పుడు, తెలియని వ్యక్తుల మధ్య ఆమెకు నీ రూపంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దొరికింది. మీరిద్దరూ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకున్నారు, నువ్వు డబ్బు గురించి పట్టించుకోకుండా తన అవసరాలకై ఖర్చు చేసావు – ఎందుకు? భవిష్యత్తులో భార్యాభర్తలు అయ్యాక ఇద్దరి సంపాదన ఒకటే అవుతుంది కదా అనే ఆలోచనతో! నీకంటే ఐదేళ్లు చిన్నది కావడం వల్ల నీలో ఒక రకమైన పెద్దరికం, బాధ్యత వ్యక్తమయ్యాయి. నువ్వు నీ తనువు, మనసు, ధనం, భావాలు అన్నీ తన కోసం ఖర్చు చేసావు – ఎందుకంటే వీటన్నిటికీ ప్రతిఫలంగా నీకు ఒక భార్య, ఒక సంసారం, పిల్లలు, సామాజిక హోదా లభిస్తాయనే ఆశతో! ఇవన్నీ లోకంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవే, నువ్వూ దాన్నే కోరుకున్నావు. ఇకపోతే – ‘అమ్మాయిలంతా తనలా ఉండరు’ అన్నావు కదా, అసలు నువ్వు ఎంతమంది అమ్మాయిలను అంత క్లోజ్‌గా చూసావని ఈ మాట చెప్తున్నావు? కాబట్టి, నీ మనసులో ఉన్న ఈ కోరికలన్నిటినీ పక్కన పెట్టి ఆలోచించు.. ఇందులో ‘నిజమైన ప్రేమ’ ఎక్కడ ఉందో నీకే అర్థమవుతుంది!”

ఆమె ఇంకా ఇలా అంది – “నువ్వు నిజంగానే ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటే, ఆ నాలుగేళ్ల లైఫ్‌ని ఈ ‘జితేందర్’ అనే పాత్ర నుండి కాస్త దూరం జరిగి, ఒక మూడవ వ్యక్తిలా నిలబడి చూడు. నీకే అంతా తేటతెల్లమవుతుంది. చాలా రాత్రి అయింది, ఉదయం కల్లా కాన్పూర్ వచ్చేస్తుంది. నేను కాసేపు పడుకుంటాను.”

సౌందర్య, జితేందర్ ఇద్దరూ తమ తమ బెర్త్‌లపై పడుకున్నారు. అంతలోనే జితేందర్ ఫోన్ మోగింది. అతని అక్క, బావగారు ఫోన్ చేస్తున్నారు – “జీతూ! జీతూ! ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు అసలు?” అంటూ అక్క కంగారుపడుతున్న గొంతు వినిపించింది. “తమ్ముడూ.. ఏదేదో ఆలోచించి పిచ్చి పనులు చేయకు, డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేయ్!”

బావగారు ఎంతో ఆప్యాయంగా అన్నారు – “జీతూ! వెంటనే కోల్‌కతాకి తిరిగి వచ్చేయ్ బాబూ. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు.”

ఆయన నిద్ర లేచి టైమ్ చూసుకోవడానికి ఫోన్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ మెసేజ్ చూసి, ఇద్దరూ కంగారుపడి వెంటనే కాల్ చేశారు.

“మీరేమీ టెన్షన్ పడకండి అక్కా, నేను బాగున్నాను. తిరిగి వచ్చేస్తున్నాను,” అన్నాడు జితేందర్ నిలకడగా.

ఉదయం ఎనిమిది గంటలకు సౌందర్యకు మెలకువ వచ్చింది. ఆమె కంగారుగా పై బెర్త్ వైపు చూసింది. జితేందర్ ప్రశాంతంగా నిద్రపోవడం చూసి ఆమె ఊపిరి పీల్చుకుంది. కాసేపటికి జితేందర్ కూడా నిద్ర లేచి కిందకు వచ్చాడు.

“రాత్రంతా నిద్రపోయావా, లేక తెల్లార్లూ ఆలోచిస్తూనే ఉన్నావా?” అని అడిగింది సౌందర్య.

“మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకున్నానండీ.. అంతా మీ వల్లే. మీరు కనుక నిన్న రాత్రి నాకు కనిపించకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలియదు. మీరు చెప్పినట్టే నేను ఒక ప్రేక్షకుడిలా నా గత జీవితాన్ని తర్కించుకుని చూశాను. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఒక అవసరాల బంధం మాత్రమేనని అర్థమైంది. ఒక యువతీ యువకుల మధ్య జరిగే సహజమైన ఆకర్షణే అది. నేను మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు ఆంటీ. నేను అఘాయిత్యం చేసుకోకపోయినా, ఈ మోసం తాలూకు బాధ నుండి బయటపడటానికి నాకు ఎన్నేళ్లు పట్టేదో! కానీ ఇప్పుడు నా మనసు పూర్తిగా తేలికైంది. ఊర్మిళ తన స్వార్థం చూసుకుంది, నా ఫీలింగ్స్‌కి విలువ ఇవ్వలేదు. అందుకే తను అంత త్వరగా వేరే పెళ్ళి చేసుకోగలిగింది.”

రైలు కాన్పూర్ స్టేషన్‌కు చేరుకుంది. జితేందర్ సౌందర్య ఫోన్ నెంబర్ తీసుకుని, వాట్సాప్‌లో ఆమెకు ‘చరణ్ స్పర్శ్’ అని మెసేజ్ పంపాడు. ఆపై సౌందర్య బ్యాగ్‌ను, తన బ్యాగ్‌ను తీసుకుని ఆమెతో పాటు రైలు దిగాడు.

“నేను ఇక్కడి నుండే మళ్ళీ కోల్‌కతాకి వెళ్ళిపోతాను ఆంటీ. మీరు ఎప్పుడు కోల్‌కతా వచ్చినా నాకు తప్పకుండా తెలియజేయండి. మీతో నా బంధం జీవితాంతం ఇలాగే ఉంటుంది. నా జీవితానికి మీరే కొత్త దారి చూపించారు,” అన్నాడు కృతజ్ఞతగా.

హిందీ మూలం: సుష్మా త్రిపాఠీ

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version