[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘ఆత్మ సాక్షాత్కారం’. రచన శ్రీ రాజ మోహన్ ఇవటూరి.]
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. దుర్యోధనుడు తప్ప కౌరవులంతా మరణించారు. పాండవుల వైపు కూడా ఎందరో మహావీరులు స్వర్గస్తులయ్యారు. కానీ కౌరవుల తరపున యుద్ధం చేసిన అశ్వత్థామ, కృపాచార్యులు, కృతవర్మ ఇంకా బ్రతికే ఉన్నారు. మరణం కొరకు వేచిచూస్తూ యుద్ధభూమిలో నిస్సహాయ స్థితిలో ఉన్న దుర్యోధనుడిని చూడగానే ఆ ముగ్గురూ కన్నీరు పెట్టుకున్నారు.
ఆవేశపరుడైన అశ్వత్థామ “సుయోధనా! విచారించకు. యుద్ధం పరిసమాప్తం కాలేదు. నువ్వు మరణించేలోపు పాండవ వంశాన్ని నాశనం చేసి ఆ కబురు నీకు అందజేస్తాం. అప్పటివరకూ నీ ప్రాణాలు నిలుపుకో.” అన్నాడు.
తర్వాత అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు అర్ధరాత్రి పాండవుల శిబిరానికి బయలు దేరారు.
నిద్రలో ఉన్న దృష్టద్యుమ్నుడిని, శిఖండిని ముందు చంపిన తర్వాత అశ్వత్థామ ఆదమరచి నిద్రపోతున్న ఉప పాండవులని నిద్ర లేపి సరైన ఆయుధాలు అందుబాటులో లేకపోయినా చేతికి అందిన వాటితో పోరాడిన ఆ అయిదుగురిని నిర్దాక్షిణ్యంగా చంపాడు.
పాండవ సంతానం చనిపోయారని నిర్దారించుకున్నాక అశ్వత్థామ మిత్రుల వైపు తిరిగి ”మన ఆశయం పాండవ వంశాభివృద్ధిని అడ్డుకోవటమే. వివాహం కాని ఈ అయిదుగురి మరణం తర్వాత పాండవుల వంశం ముగిసినట్టే.” అన్నాడు. (వ్యాస భగవానుడి భాగవతం ప్రకారం ఉపపాండవులకి వివాహం కాలేదు.)
అవునన్నట్టు కృపుడు, కృతవర్మ తలాడించారు. తర్వాత వారు వాయువేగంతో యుద్దభూమికి వెళ్లారు.
అక్కడ తొడలు విరిగి మరణానికి దగ్గరగా ఉన్న దుర్యోధనుడిని సమీపించి “రారాజా! పాండవులకి ఇక వంశం లేదు. ఉపపాండవులకి ముందు అభిమన్యుడు కూడా యుద్ధంలో మరణించాడు కదా! కనుక వీరి మరణంతో పాండవుల వంశం పూర్తిగా అంతరించిపోయింది. ఇదే నీ మరణానికి ముందు నేను ఇచ్చిన కానుక” అని చెప్పాడు అశ్వత్థామ.
తన శత్రువులకి విజయోత్సాహం లేకుండా చేసిన ఆ ముగ్గురి వైపు కృతజ్ఞతతో చూస్తూ దుర్యోధనుడు సంతోషంగా ప్రాణాలు విడిచాడు.
***
పుత్ర శోకంతో పాండవులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అర్ధరాత్రి నిద్రలోనే శత్రువు చేతిలో కన్ను మూసిన తన పుత్రుల నిర్జీవ శరీరాలని చూడలేక ద్రౌపదీ దేవి భోరుమని విలపిస్తోంది. ఆమె దుఃఖాన్ని చూస్తున్న అర్జునుడు ఆవేశంతో ప్రతిజ్ఞ చేసాడు.
“ద్రౌపదీ. ఏ నీచుడు యుద్ధ ధర్మం పాటించకుండా వేళకాని వేళ దొంగలా మన శిబిరంలో ప్రవేశించి మన పుత్రుల తలలు నరికాడో వాడి తలని ఖండించి నీ కాలి ముందు పెడతాను. కసి తీరా ఆ తలని తన్ని నీ పగ తీర్చుకో.”
తర్వాత పార్ధుడు ఆలస్యం చేయకుండా కృష్ణుడి సారథ్యంతో రథం మీద అశ్వత్థామని వెంటాడాడు. పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని మట్టుపెట్టిన ఆ మహా వీరుడిని ఎదుర్కోలేనని తెలిసిన అశ్వత్థామ ప్రాణభయంతో పారిపోసాగాడు. అతని వెనకే వేగంగా వెంటాడుతున్న అర్జునుడి రథం అతన్ని సమీపిస్తున్న కొద్దీ అశ్వత్థామలో ప్రాణభయం పెరిగిపోతోంది. చివరికి ఏ దారీ లేక, ఎవరు నాశనమయినా తను మాత్రం బ్రతకాలని కోరుకున్న అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అతనికి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఆ అస్త్రాన్ని ఎప్పుడూ తనని కాపాడుకోవటానికి ఉపయోగించవద్దని తండ్రి ఇచ్చిన ఆజ్ఞని కూడా మరిచిన అశ్వత్థామకి ఆ అస్త్రాన్ని ఉపసంహరించటం తెలియదు.
నిప్పులు కక్కుతూ అశ్వత్థామ విల్లు నుంచి విడిపడిన బ్రహ్మాస్త్రాన్ని చూసిన కృష్ణుడు “అర్జునా! ముల్లోకాలు నాశనమయ్యే ప్రమాదం ఉన్నా కేవలం తన ప్రాణాలు మాత్రమే మిగుల్చుకోవాలనే దురాశతో ఒక సద్బ్రాహ్మణుడికి ఉండవలసిన ఇంగితం లేకుండా అశ్వత్థామ పూర్తి అస్త్ర జ్ఞానం లేకుండానే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించు.” అని చెప్పాడు.
అర్జునుడు అలాగే అని తల ఊపి కృష్ణుడికి నమస్కరించి కృష్ణుడు నడుపుతున్న రథం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అతని గాండీవం నుంచి బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు. ఇప్పుడు రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానినొకటి ఢీకొంటుంటే ముల్లోకాలు హడిలిపోయాయి.
కలగబోయే విపత్తుని గ్రహించిన కృష్ణుడు “విచక్షణ లేని ఆ ధూర్తుడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించే విద్య తెలియదు. నిష్కారణంగా లోకులు బాధ పడకూడదు కనుక రెండు అస్త్రాలని నువ్వే ఉపసంహరించు.” అన్నాడు.
అర్జునుడు కృష్ణుడి ఆదేశం పాటిస్తూ రెండు అస్త్రాలనీ ఉపసంహరించి ఆ తర్వాత అశ్వత్థామని బంధించాడు. అతని కాళ్లు చేతులు కట్టేసి పశువుని ఈడ్చుకొచ్చినట్టు ద్రౌపది ముందుకు లాక్కుపోయి “ద్రౌపదీ. ఇప్పడు ఈ దుర్మార్గుడిని ఏ విధంగా శిక్షిస్తావో నీ ఇష్టం.” అన్నాడు.
ఎంత దుర్మార్గుడయినా అర్జునుడి గురుపుత్రుడిని చంపి అతని గురుపత్నికి తీరని గర్భశోకం కలిగించాలా లేక తనకి గర్భ శోకం కలిగించిన ఆ దుష్టుడిపై పగ తీర్చుకోవాలా అని ద్రౌపది సంశయిస్తోంది. ఆవేశంతో ప్రతిజ్ఞ చేసినా అర్జునుడి మనోగతం కూడా అలాగే ఉంది.
వారి సంశయాన్ని గమనిస్తున్న కృష్ణుడు “అర్జునా! అశ్వత్థామలో బ్రాహ్మణత్వం నశించింది. ఈ మనిషి, ఒకప్పుడు కురువృద్ధులూ, వికర్ణుడు మినహా కౌరవులు, సభలోని ప్రజలు, అంతా మౌనంగా చూస్తుండగా నిండు సభలో దుర్యోధనుడు పాంచాలిని అవమానిస్తున్నపుడు ద్రౌపది తరపున ఎదిరించిన సత్పురుషుడు కాదు. నీ ముందు ఈ క్షణం బందీగా ఉన్నవాడు ఒక ఆతతాయి. కారణం లేకుండా మనిషి చావుని కోరుకునే ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష అనివార్యం. నువ్వు ప్రతిజ్ఞ చేసినట్టు ఈ దుష్టుడి తల నరికి ఆ తలని ద్రౌపది పాదాల ముందు పెట్టు.” అన్నాడు.
అప్పుడు అర్జునుడు కృష్ణుడికి నమస్కరించి “కృష్ణా. నీకు చెప్పగలిగిన వాడిని కాను. కానీ నీనుంచి నేర్చుకున్న జ్ఞానంతో నాకు తోచినది చెప్పనివ్వు. ఈ మనిషిలో ఒక బ్రాహ్మణుడు, ఒక ఆతతాయి ఉన్నారు. ఆతతాయిని చంపాలి. బ్రాహ్మణుడిని చంపకూడదు. అందుకే ఇతన్ని చావుకి సమానమైన శిక్షతో వదిలిపెడతాను” అన్నాడు.
ఆ తర్వాత కృష్ణుని సలహాతో ఫల్గుణుడు అతని కత్తితో శిఖ కూడా మిగలకుండా అశ్వత్థామకి శిరోముండనం చేసి అతని శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచే మణిని కూడా బాణంతో అతని తలనుంచి వేరు చేసాడు.
అప్పుడు కృష్ణుడు సంతృప్తిగా తలాడించి ద్రౌపది వైపు చూసి “సోదరీ! శిఖ లేని పూర్తి శిరోముండనం తర్వాత ఈ మనిషి చనిపోయినట్టే లెక్క. అతని తల మీద మణి తొలగిపోగానే అతని దివ్య శక్తులన్నీ నశించాయి. కాంతిహీనమయిన శరీరంతో చీము కారుతున్న శరీరంతో మూడు వేల సంవత్సరాలు దారీ తెన్నూ లేకుండా తిరుగుతాడు. ఈరోజు నుంచి ఇతని చిరంజీవత్వమే అతి భయంకరమైన శాపంగా మారుతుంది.” అన్నాడు.
తర్వాత పాండవుల వైపు తిరిగి “మిత్రులారా! శత్రుశేషం జరిగింది. మీ పగలు కూడా చల్లారాయి. ఇప్పుడు మీ కర్తవ్యం ధర్మ పరిరక్షణ, రాజ్య పాలన.” అన్నాడు.
అప్పుడు అర్జునుడు తలెత్తాడు.
“బావా. ఈ యుద్ధంలో శత్రుశేషంతో పాటు మా ఆప్తులని అందరినీ పోగొట్టుకున్నాం. పెద్దలు గురుతుల్యులు అయిన బంధువులు, బాల్యం నుంచి కలిసి పెరిగిన దాయాదులు, మాకు సాయంగా యుద్ధం చేసిన ఎందరో మిత్రులు, మాకెంతో ప్రియమైన సంతానాన్ని పోగొట్టుకున్నాం. ఇపుడు ఏమి మిగిలిందని నేను బ్రతకాలి? రాజ్యాన్ని ఏలాలి?” అన్నాడు.
“అర్జునా. చంపెడివాడినీ, చంపించెడివాడినీ నేనే. ఈ యుద్ధంలో జరిగినదంతా ముందుగా నేను నిర్ణయించుకున్నదే. నువ్వు అనుకున్నావని ఏదీ జరగలేదు. నువ్వు వద్దనుకున్నావని ఏదీ ఆగలేదు. అంతా దైవ నిర్ణయం. అందుకే మనోవ్యధ చెందకుండా నీ కర్తవ్యం నిర్వహించు” అన్నాడు కృష్ణుడు.
“శ్రీకృష్ణా! నేను నీలా నిర్వికారుడను కాను. ఈరోజుకి మా వంశాంకురాలు ఉప పాండవులు అన్యాయంగా మరణించారు. అధర్మ యుద్ధంలో నా కొడుకు అభిమన్యుడు మరణించాడు. భీముడి కొడుకు ఘటోచ్కచుడు నా మీద ప్రయోగించవలసిన అస్త్రం వలన హతుడయ్యాడు. పాండవులలో అగ్రజుడిగా రాజ్యమేలవలసిన కర్ణుడు నా చేతిలోనే నిర్దాక్షిణ్యంగా బలయ్యిపోయాడు. ఇంతమందిని కోల్పోయాక మనోవ్యధ లేకుండా ఎలా ఉండగలను? నేను ఇప్పుడే అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను. దయచేసి నన్నుఎవరూ ఆపవద్దు.” అన్నాడు.
“అర్జునా. ప్రతి పుట్టుకకి, మరణానికి అర్ధముంటుంది. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని నీ బాధ్యత నిర్వర్తించు. ఉప పాండవులు, అభిమన్యుడు శాపవశాత్తూ మానవులుగా జన్మించి వారు ఎంత కాలం మనుషులుగా జీవించాలో అంత వరకూ జీవించి వారి వారి స్థానాలకి చేరుకున్నారు. కర్ణుడు రాక్షస జన్మ నుంచి తప్పించుకుని మానవుడిగా పుట్టి కర్మఫలం అనుభవించాడు.” అన్నాడు కృష్ణుడు.
“వాసుదేవా. వారి గత జన్మ వృత్తాంతాలు నాకు తెలియదు. కానీ ఈ జన్మలో నేను అనుభవించిన ఈ అనుబంధాలు నాలో దుఃఖాన్ని కలిగిస్తాయి కదా! అందరినీ కోల్పోయి ఇప్పుడు మాతోనే వంశం అంతరించిపోతుంటే మనశ్శాంతిగా ఎలా జీవించగలను?” అన్నాడు.
కృష్ణుడు నిట్టూర్చి ”సరే. అర్జునా. నీకు మనశ్శాంతి కలిగించే చోటికి తీసుకువెళతాను. నాతో పద. “ అన్నాడు.
ఎక్కడికి అని అడగకుండా అర్జునుడు కృష్ణుడిని అనుసరించాడు. తక్కిన పాండవులు, కృష్ణుడిపై నమ్మకంతో వారిద్దరినీ సాగనంపారు.
***
అడవి మధ్యలోంచి రథం నడుస్తోంది. కృష్ణుడు, అర్జునుడు మౌనంగా ఉన్నారు. మహావృక్షాల మధ్య కొంత దూరం ప్రయాణించాక పచ్చికతో కూడిన ఒక మైదానం ఆ పక్కనే ఒక సెలయేరు వారికి కనిపించాయి.
కృష్ణుడు నది వడ్డున రథాన్ని నిలిపి “అర్జునా! ఈ నీటిలో మూడు మునకలు వేసి నీ ప్రియమైన బంధువులందరినీ తలుచుకో. తర్వాత నీకు మనశ్శాంతి కలిగే ఉపదేశం చేస్తాను.” అన్నాడు.
అర్జునుడి గాండీవం, ఇతర ఆభరణాలు, దుస్తులు తన దగ్గర ఉంచుకుని కృష్ణుడు నదీ తీరంలో వేచి ఉండగా అర్జునుడు నదిలో మునిగాడు. ఒక్కొక్క మునకలో అతనికి ప్రియాతిప్రియమైన బంధువులు, మిత్రులని పేరుపేరునా తలుచుకుని మూడు మునకలు పూర్తి చేసి నీటిలోంచి పైకి లేచాడు అర్జునుడు. హఠాత్తుగా తన శరీరం తేలికయినట్టు అనిపించి నీటిలో తన ప్రతిబింబం చూసుకున్నాడు.
ఆశ్చర్యం! నీటిలో తన స్థానంలో ఒక అందమైన స్త్రీ ప్రతిబింబం కనిపించేసరికి అర్జునుడు విస్తుపోయాడు. ఏమిటీ వింత అని దిక్కులు చూస్తుంటే ఆకాశవాణి మాటలు వినిపించాయి.
“అర్జునా! కొన్నేళ్ల క్రితం ఇక్కడ స్నానం చేస్తున్న ఋషి పత్ని వన విహారానికి వచ్చిన కొందరు పురుషుల కంట పడినది. అప్పుడు ఆ ఋషి పత్ని సిగ్గుతో కుమిలిపోవటం చూసిన ఋషి ఆగ్రహంతో ఈ నదిలో స్నానం చేసే పురుషులంతా స్త్రీలుగా మారిపోవాలని శపించాడు. దురదృష్టవశాత్తూ నీవు ఈ నదిలోనే స్నానానికి దిగావు. ఆ మహాముని మనసు మారితేనే నీకు విముక్తి. అప్పటివరకూ విజయ అనే పేరుతో ఇక్కడే జీవించు” అని ఆకాశవాణి చెప్పిన మాటలు విని అర్జునుడు హతాశుడయ్యాడు.
అవసరార్ధం ఒక ఏడాది పాటు బృహన్నలగా విరాటుడి కొలువులో నివసించినా అజ్ఞాతవాసం తర్వాత పూర్వ రూపానికి చేరుకుంటానన్న నమ్మకం అర్జునుడికి ఉండేది. ఇప్పుడు అటువంటి అవకాశం ఎప్పుడు కలుగుతుందో తెలియదు. ఒక మహావీరుడిగా, శక్తిమంతుడైన పురుషుడిలా ముల్లోకాలలో ఎదురులేకుండా బ్రతికిన నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్న ఒక సుకుమారమైన స్త్రీగా బ్రతకవలసి వస్తోందని గ్రహించి విధి ఎంత క్రూరమయినది అని విచారించాడు అర్జునుడు.
వేరేదారి లేని అర్జునుడు ఆ చెరువునుంచి వడ్డుకి చేరి అక్కడే అడవిలో లభించిన పళ్ళు, కందమూలాలు తింటూ కాలం గడపటం ప్రారంభించాడు. అతనికి తెలియకుండానే అతనిలో ప్రతి ఆడదానికి సహజమైన సున్నితమైన ఆలోచనలు, మృదుత్వం, అందమూ-అలంకారాల పైన మోజు వంటి లక్షణాలు పెరిగి పరిపూర్ణమైన స్త్రీగా మారిపోయాడు. నెమ్మదిగా అతని గతం కూడా మరచిపోయాడు.
ఒకరోజు విజయ (స్త్రీ గా మారిన అర్జునుడు) నది ఒడ్డున కూర్చుని చుట్టూ ఎగురుతున్న పక్షుల కిలకిలారావాలు వింటూ నదిలో ఈదుతున్న బాతులు, హంసల కదలికలని చూసి ఆనందిస్తూ ఉండగా వనవిహారానికై ఆ అడవికి వచ్చిన ఒక రాజు ఆమెని చూసి ముగ్ధుడై పోయాడు.
“సుందరీ ఎవరు నీవు? ఈ నిర్జన ప్రదేశంలో వంటరిగా ఎలా ఉంటున్నావు?” అని అడిగాడు రాజు.
విజయ కూడా శౌర్యం, అందం కలగలిపిన ఆ మనోహరమైన రూపాన్ని చూసి మంత్రముగ్ధురాలవుతూ “రాజా! నా గతమేమంత గొప్పది కాదు. నాకెవరూ లేరు. ఇక్కడ వంటరిగా బ్రతుకుతూ విముక్తి కోసం ఎదురుచూస్తున్నాను.” అంది విజయ.
“ఈ మాటలు యవ్వనంలో ఉన్న ఒక సౌందర్యవతి నుంచి వినపడవలసినవి కావు. నువ్వు అంగీకరిస్తే నిన్ను నా రాణిని చేసుకుంటాను. ఈ భూమండలంలో సగానికి పైగా నా ఆధీనంలోనే ఉన్న సామ్రాజ్యానికి నేను అధిపతిని.” అన్నాడు ఆ రాజు.
అప్పటికే అతనిపై ఇష్టంతో మైమరిచిపోతున్న విజయ వెంటనే తన అంగీకారం తెలిపింది. రాజు విజయని వివాహం చేసుకుని ఆమెని తన పట్టపురాణి చేసుకున్నాడు. అగమ్యగోచరంగా ఉన్న తన జీవితం ఒక దారిలో పడినందుకు విజయ ఎంతో సంతోషించింది. తన సామ్రాజ్యంలో ప్రజలని కన్న బిడ్డల్లా చూసుకుంటూనే భార్యని గాఢంగా ప్రేమించే భర్తతో ఆమె జీవితం ఎంతో సుఖంగా సాగిపోతోంది. కాలక్రమాన వారికి వేయి మంది పుత్రులు జన్మించారు. విజయగా బ్రతుకుతున్న అర్జునుడు అతని గతాన్ని మరిచి భర్తతో పిల్లలతో హాయిగా గడపసాగాడు.
కొన్నేళ్ళకి ఆమె కొడుకులు ఎదిగి మహావీరులయ్యారు. సామ్రాజ్యం మొత్తం మీద వారిని ఎదిరించే వీరులే లేరు. అందరూ పరాక్రమవంతులే అయినా సోదరులందరూ అధికారం కోసం పోటీ పడకుండా అగ్రజుడు అజేయుడికే గౌరవం ఇస్తూ వచ్చారు.
ఒక రోజు అజేయుడు, తన సోదరులతో పాటు తండ్రి దగ్గరికి వచ్చి “మహారాజా! మన సామ్రాజ్యంలో మనకి ఎదురు లేకపోయినా ఈ భూమండలం మొత్తాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకుని పరిపాలించటం వీరుల లక్షణం. మన రాజ్య విస్తరణకి అనుమతినివ్వండి” అని అడిగాడు.
తన సుపుత్రుల వీరోచితమైన పలుకులు విన్న తండ్రి గర్వంగా మీసం మెలివేస్తూ “అవును. శత్రుశేషం లేకుండా పరిపాలించటం వీరుల లక్షణం. ఇతర రాజ్యాలకి కబురు పెట్టి ముందు మన సంపూర్ణాధికారాన్ని అంగీకరించి మన రాజ్యంలో విలీనమవ్వటానికి ఆహ్వానించండి. అందుకు అంగీకరించని వారిని ఓడించి వశపరుచుకోండి” అని చెప్పి పెద్ద కొడుకుని అతని అఖండ సైన్యానికి అధిపతిని చేసాడు.
సమరోత్సాహంతో సోదరులంతా సైన్యంతో యుద్దానికి బయలుదేరారు. ఇతర దేశాలలో దాదాపు అందరు రాజులూ ఎటువంటి రక్తపాతం లేకుండా వారితో సంధికి అంగీకరించారు. కొంత మంది లొంగిపోవటం ఇష్టం లేక యుద్దానికి దిగినా మహా పరాక్రమ వంతులైన ఆ సోదరుల నాయకత్వంతో సేనలు శత్రువులని చీల్చి చెండాడాయి. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలని తెలుసుకుంటున్న మహారాజు అతని భార్యతో ఆ సమాచారం సంతోషంగా పంచుకుంటున్నాడు. దంపతులిద్దరూ పుత్రుల విజయ వార్తలని ఆస్వాదిస్తున్నారు.
సమస్త భూమండలం ఆధీనంలోకి తీసుకునే రోజు దగ్గర పడింది. యువరాజులందరూ విజయ గర్వంతో ఊగిపోతున్నారు. ఎన్నడూ లేనంత ఘనంగా సంబరాలు జరుపుకోవటానికి ఏర్పాట్లు చేసుకోమని రాజధానికి కబురు పంపారు.
ఇంతలో సేనాధిపతి అజేయుడి వద్దకు వచ్చి “యువరాజా! ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందించటానికి వచ్చాను” అన్నాడు.
“చెప్పండి సేనాపతి. ఈ భూమండలానికి మా తండ్రిని అధిపతి చేయటానికి ఇంకా ఎంత ఆలస్యముంది?” అని అడిగాడు అజేయుడు.
“దక్షిణ దిశలో ఈ సమస్త భూమండలానికి చివర ఒకానొక చిన్న రాజ్యం రెండు వందల మంది బిల్లుల అధీనంలో ఉంది యువరాజా! కేవలం అయిదు వేల చదరపుటడుగుల వైశాల్యమున్నఆ రాజ్యంలో చెప్పుకోదగ్గ సంపద ఏమీ లేదు. వారిని కనికరించి వదిలేస్తే మొత్తం భూమండలమంతా మనదే” అన్నాడు సేనాని.
అజేయుడు గర్వంగా మీసాలు మెలివేస్తూ “సేనాపతీ! వారిని మాత్రం వదిలెయ్యటం ఎందుకు? వారికి మన సందేశం తెలియజేసారా?” అని అడిగాడు.
సేనాని తటపటాయిస్తూ “సందేశం ఇచ్చాము ప్రభూ. కానీ వారు స్వాతంత్ర ప్రియులు. మన సార్వభౌమత్వానికి వారు అంగీకరించలేదు. మన మిత్రులుగా కొనసాగటానికి మాత్రం వారికి అభ్యంతరం లేదు మన రాజ్యంలో కలిసిపోతే వారికి కలిగే ఎన్నో ప్రయోజనాలు వారికి వివరించినా ఫలితం లేదు. “ అన్నాడు.
వెంటనే అజేయుడు ఆగ్రహంతో కళ్ళెర్ర జేసి “ఎంత కండకావరం! అనాగరికంగా చెట్ల కింద బ్రతికే వారికి ఇంత అహంకారమా? వెంటనే వారిని లొంగదీసి ఈ రోజే నాకు విజయ వార్తని తెలియజేయండి” అన్నాడు.
ఇంతలో అక్కడే ఉన్న మహామంత్రి కలగజేసుకుని “ప్రభూ. మనకి ఏమాత్రం ఉపయోగపడని భూమి కోసం యుద్ధం సరైనది కాదని అనిపిస్తోంది. పిచుక మీద బ్రహ్మాస్త్రంలా మనం చేసే ఈ యుద్ధం భావి తరాలకి ఆదర్శప్రాయంగా ఉంటుందా? వారిని క్షమించి ఆ చిన్న రాజ్యం ఏలుకోమని పెద్ద మనసుతో అంగీకరిస్తే మన గౌరవం మరింత పెరుగుతుంది.” అన్నాడు.
“మంత్రి వర్యా. ఒక చిన్న తెగ చేసిన ధిక్కారాన్ని విస్మరిస్తే మాత్రం ఆదర్శప్రాయంగా ఉంటుందా? మన సామ్రాజ్యంలో ఇతర రాజ్యాల ముందు మనం తల ఎత్తుకోగలమా?” అని చెప్పి “సేనాపతీ. వెంటనే వారిని అణిచేయ్యండి” అన్నాడు అజేయుడు.
రాజాజ్ఞ శిరసావహిస్తూ సేనాని యుద్దానికి బైలు దేరాడు. శత్రువులు రెండు వందల మందే ఉన్నా రెండు వేలమంది సైనికులతో బైలు దేరాడు.
కానీ ఆశ్చర్యం కలిగేలా పిల్లలు, స్త్రీలు కూడా పురుషులతో కలిసి ఆ భిల్లులు భీకరంగా పోరాడి మొత్తం సైన్యాన్ని ఊచకోత కోశారు. సేనాని నిర్ఘాంతపోయి ఆ విషాద వార్తని అజేయుడికి తెలియజేసాడు.
“యువరాజా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వారు శివభక్తులు. దేశ భక్తులు. ఒక్కొక్కరు పదేసి మందితో పోరాడుతున్నారు. జరిగిన యుద్ధంలో మన సేన రెండు వేలమంది హతులయ్యారు. అతి చిన్న రాజ్యం కోసం జరిగిన ఈ ప్రాణ నష్టాన్నిమనం ఏవిధంగానూ సమర్దించలేం.” అన్నాడు మహా మంత్రి.
“మహా మంత్రీ! ఇంత వరకూ వచ్చాక మనం వెనుతిరిగేదే లేదు. లక్ష మంది సైన్యంతో వారిని ఒక్కొక్కరినీ వేటాడండి” అన్నాడు అజేయుడు ఆవేశంగా.
నిస్సహాయుడైన మంత్రి రాజాజ్ఞని పాటించి మరింత సైన్యాన్ని యుద్దానికి పంపించాడు. కానీ అందరూ విస్తుపోయేలా ఒక్కరిని కూడా మిగల్చకుండా భిల్లులు ఆ సైన్యాన్ని హతమార్చారు. ఆ రాజ్యాన్ని ప్రవేశించక ముందు ఒక ఇరుకైన దారి ఉంది. ఏ సమయంలో అయినా ఒక సైనికుడు తప్ప ముందు సాగలేరు. ఆ ప్రదేశంలో మాటు వేసిన భిల్లులు ఒక్కొక్కరినీ నరికిపారేసారు.
అజేయుడికి, మహావీరులైన అతని సోదరులకి ఈ వార్త మరింత ఉక్రోషాన్ని కలిగించింది. ఎప్పటికప్పుడు యుద్ధ సమాచారం తెలుసుకుంటున్న విజయ ఆందోళనగా భర్తని సమీపించి “మహారాజా! పిల్లలని యుద్ధం ఆపి వెనక్కి రమ్మని చెప్పండి. మనకి ఆ చిన్న రాజ్యం అంత ముఖ్యమా?” అంది.
“మహారాణీ. రాజ్యం చిన్నదా పెద్దదా అన్నది అప్రస్తుతం. మన నాయకత్వాన్ని ధిక్కరించే వారెవరైనా నాశనం కావలసిందే. అందుకే వారికి తోడుగా మరింత సైన్యాన్ని తీసుకుని నేను కూడా యుద్దానికి వెళ్తున్నాను.” అన్నాడు మహారాజు.
ఆ మాటలు వినగానే విజయ ఇంకా భయపడి వద్దని ఎన్ని రకాలుగా వేడుకున్నా వినకుండా మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకుని మహారాజు యుద్దభూమికి చేరుకున్నాడు.
తర్వాత విజయకి తెలుసున్న యుద్ధవార్తలు ఆమెలో ఆందోళనని మరింత తీవ్రతరం చేశాయి. యుద్ధంలో ఆమె పుత్రులు ఒక్కొక్కరే వీర మరణం పొందుతుంటే ఆమె దుఃఖంలో మునిగిపోతూ యుద్ధం ఇప్పటికైనా విరమించుకోమని ఎప్పటికప్పుడు తన భర్తకి సందేశాలు పంపుతోంది. కొన్ని రోజులకి మహామంత్రి అతి కొద్ది మంది సైనికులతో విచారంగా వెనక్కి వచ్చాడు.
అప్పటికే విషయం తెలిసిన రాజ గురువుతో పాటు ఆయన అంతఃపురానికి వచ్చి “మహారాణీ. మీరు భరించలేని దుర్వార్త తీసుకొచ్చాను. యుద్ధంలో మహారాజు, యువరాజులూ తీవ్రంగా పోరాడి వీర మరణం చెందారు.” అన్నాడు.
ఆ మాటలు వినగానే విజయ కుప్పకూలిపోయి ”ప్రేమాస్పదుడయిన భర్తనీ, మహావీరులయిన పుత్రులనీ పోగొట్టుకున్నాక నాకీ రాజ్యమెందుకు? చితి పేర్పించండి మంత్రీ. నేను అగ్నిప్రవేశం చేస్తాను” అంది.
మహా మంత్రి, సేనాధిపతి ఇతర పెద్దలు ఎంత సముదాయించినా ఆమె దుఃఖం తీరలేదు.
అప్పుడు రాజ గురువు ఆమెని సమీపించి “అమ్మా. జననమరణాల చక్రంలో మనమందరం భాగమే. దైవనిర్ణయాన్ని మనం ప్రశ్నించగలమా. నాతోరా. నీ కర్తవ్యం నిర్వహించు. ” అన్నాడు.
వీర మరణం పొందిన మహారాజుకి, యువరాజులకీ దహన క్రియలు పూర్తయ్యాక రాజ గురువు భర్త అస్తికలు కలపటానికి ఆమెని గంగా నది వద్దకు తీసుకువెళ్లి “అమ్మా. గుండె నిబ్బరం చేసుకుని కార్యక్రమం పూర్తి చెయ్యి” అన్నాడు.
దుఃఖాన్ని అణుచుకుంటూ కార్యక్రమంలో భాగంగా విజయ నదిలో ఒక మునక వేసింది. కోల్పోయిన తన ఆప్తులని తలుచుకుని భారమైన హృదయంతో ఆమె నీటి పైకి వచ్చేసరికి “అర్జునా! కాలాతీతమవుతోంది. త్వరగా స్నానం ముగించి పైకి రా.” అని నదీ తీరం నుంచి కృష్ణుడు పిలుస్తున్నాడు. పురుషుడిగా మారిన అర్జునుడు ఆశ్చర్యం అణుచుకుంటూ స్నానం ముగించి ఒడ్డుకి చేరుకుని “కృష్ణా. ఏమిటిది? నాకంతా అయోమయంగా ఉంది. నేను నీటిలో ఎంతసేపు ఉన్నాను?” అని అడిగాడు.
“ఒక రెప్పపాటు మాత్రమే.” అన్నాడు కృష్ణుడు.
“కృష్ణా. నాకు ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్ను చూస్తున్నట్టు అనిపించింది.” అన్నాడు అర్జునుడు ఆశ్చర్యంతో.
“అర్జునా. నాకంతా తెలుసు. నీవు ఒక రెప్పపాటు సేపు నీటిలో మునిగావు. నువ్వు ఆడదానిగా మారటం ఒక క్షత్రియుడిని వివాహం చేసుకోవటం, సంతానాన్ని కనటం, పెంచటం, అదే సంతానాన్ని యుద్ధంలో పోగొట్టుకోవటం… ఈ అనుభూతులన్నీ ఆ రెప్పపాటులోనే అనుభవించావు.” అన్నాడు కృష్ణుడు.
అర్జునుడు నమ్మలేక కృష్ణుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు.
“అర్జునా. ఇప్పుడు చెప్పు. ఇప్పటివరకూ నీవు అనుభవించినదంతా భ్రమగా భావించి మాయా భరితమైన ఈ ప్రపంచంలో నీ తదుపరి కర్తవ్యం కోసం జీవిస్తావా? లేక అవాస్తవమైన నీ భర్త , కుమారుల మరణానికి విచారిస్తావా?” అని అడిగాడు కృష్ణుడు.
అర్జునుడికి జ్ఞానోదయమయింది. ”జగన్నాటక సూత్రధారి అయిన ఓ కృష్ణా. నాకు సత్యం బోధపడింది. ఇంక మన రాజ్యానికి బైలుదేరదాం.” అన్నాడు.
“అర్జునా. పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతని బోధించిన తర్వాత ధర్మాన్ని తప్పకుండా నువ్వు అశ్వత్థామని సమతుల్యంగా శిక్షించిన విధానం చూసాను కనుకే నీ వంశం విచ్చిన్నం కాకుండా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి నీ కోడలి (ఉత్తర) గర్భంలో ఉన్న శిశువుని కాపాడి మీ వంశాన్ని నిలబెట్టాను. కానీ నీలో పరిపూర్ణమైన పరిణతి కలగటానికి ఈ కథంతా నడిపించవలసి వచ్చింది” అంటూ రథాన్ని ముందుకు నడిపించాడు వాసుదేవుడు.
(పురాణాల్లో ఉన్న కథల ఆధారంగా కొంత స్వేచ్చని తీసుకుని కల్పించిన కథ. వ్యాసుల వారి మహా భారతం, వారే రచించిన భాగవతం మధ్య అశ్వత్థామ ఉదంతం కొంచెం వేరు వేరుగా ఉంది. నేను చదివిన తెలుగు అనువాదాలలో గానీ మూల గ్రంధాల్లో గానీ ఈ తేడా ఉండిఉండవచ్చు. అందువలన ఏమైనా తప్పులు ఉంటే పెద్దలు క్షమించి ఈ కథని పురాణ పాత్రలతో వ్రాసిన కల్పిత కథగానే భావించి క్షమించవలసిందిగా కోరుతున్నాను.)
రాజమోహన్ ఇవటూరి స్వస్థలం విశాఖపట్నం. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. టెక్ మహీంద్రాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి, 2021 నుంచి సొంత సంస్థను నడుపుతున్నారు. 1994 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘ఓ తమ్ముడి కథ’.. రచనలో ప్రచురితమయింది. ఇప్పటివరకూ యాభైకి పైగా కథలు రాశారు. తిక్క శంకరయ్య కథ, విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు ‘మిసిమి’ పత్రికలో అచ్చయ్యింది. ఆరాధన (రచన), అవ్వగారు (సహరి), వారసత్వం (ముల్కనూర్ గ్రంధాలయం), చక్ర భ్రమణం (కథా మంజరి), క్రూరమైన వాస్తవం (ఉష పత్రిక), అమ్మ ప్రేమ (వారణాశి సాహితీ వారధి 2024),జీవితం నిత్య నూతనం (కథా మంజరి), యుగ ధర్మం (వెల్చేరు కళా వేదిక), బొమ్మా బొరుసు (పుణ్యమూర్తుల స్మారక కథల పోటీ 2025), ప్రవాస భారతం (రవళి – డా. అమృతవల్లి ఉగాది కథల పోటీ 2026), గోరంత సాయం (తెలుగు తల్లి-కెనడా డే పోటీలు 2026) కథలకి బహుమతులు దక్కాయి. “జీవితం నిత్య నూతనం” కథ కన్నడ భాషలో అనువదింప బడినది. వీరి తండ్రి జ్యేష్ఠ పేరిట ఏర్పాటుచేసిన ‘జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 1990 నుంచి ఏటా ఉత్తమ కథ, ఉత్తమ కథా సంకలనాలకు పురస్కారాలు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రచయితల ఎన్నో పుస్తకాలను ప్రచురించారు.
రాజమోహన్ రాసిన చాలా కథలు స్వీయానుభవం ఆధారంగా రాసినవే.
శ్రీయుతులు జ్యేష్ఠ, ముళ్లమూడి, నామినిసుబ్రహ్మణ్యంనాయుడు, డాక్టర్ కేశవరెడ్డి, గురజాడ, ఇంద్రగంటి జానకి బాల, యండమూరి రచనలని అభిమానిస్తారు. కొత్త తరం రచయితలు చాగంటి ప్రసాద్, పెమ్మరాజు విజయకుమార్, వేణు మరీదు, కైకాల సుమలత, గార్ల రచనలు ఇష్టపడతారు.
సహజ నటుడు చంద్ర మోహన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గార్లకి వీరాభిమాని.
