Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరిహద్దులు లేని కవిత్వం – అవధులు లేని ఆస్వాదనం

[ఎలనాగ గారి ‘ఆత్మలో రెక్కల పక్షి’ అనే అనువాద కవితా సంపుటికి కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన ముందుమాటను పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]

మానవ సంస్కృతిలో ఒక మౌలికమైన అంగం కవిత్వం. మనిషి లోపలి స్వరాన్ని శోధించేది కవిత్వం! కవిత్వం కొందరికి ఓ అవుట్‌లెట్, కొందరికి ఓ ఆయుధం, కొందరికి ధిక్కారం, కొందరికి ఓ ఆర్తి, కొందరికి పోరాటం, కొందరికి స్ఫూర్తిమంత్రం! ఇలా నిర్దిష్ట ప్రయోజనాలున్న సాహితీ ప్రక్రియ కవిత్వం.

కవిత్వం సహానుభూతిని కలిగిస్తుంది. మనలోకి మనం తొంగి చూసుకునేలా చేస్తుంది. మన ప్రతికూల భావాలను సరిగ్గా అర్థం చేసుకోడంలోనూ, వాటిని వదిలించుకోనడంలోనూ ఉపయోగపడుతుంది. మానసిక గాయాలను మాన్పుతుంది, సంకల్పాన్ని దృఢం చేస్తుంది. ప్రపంచం పట్ల మన అవగాహనని విస్తృతపరుస్తుంది. మనలో ఊహాశక్తిని రగిలిస్తుంది, సృజనాత్మకతకి దోహదం చేస్తుంది.

సొంతభాష లోని కవిత్వం సరే, పరాయి భాషలలోని గొప్ప కవిత్వాన్ని ఆస్వాదించాలంటే? ఎన్ని భాషలని నేర్చుకోగలం? మాతృభాషలో వాటిని చదవాలనుకుంటాం. అందుకు అనువాదాలు తప్పనిసరి కదా! విశ్వసాహిత్యమంతా మనకి అనువాదాల ద్వారానే అందుబాటులోకి వచ్చింది కదా!

మరి కవిత్వం అనువాదంలో ఒదుగుతుందా? ఈ విషయంలో దశాబ్దాల నుండి భిన్నాభిప్రాయాలున్నాయి. “Poetry is what is lost in translation”, అని అమెరికన్ కవి రాబర్ట్ ప్రాస్ట్ అననే అన్నాడు.

కవిత్వానికి అనువాదం అవసరమేమిటన్న ప్రశ్నకు సుప్రసిద్ధ బ్రిటిష్ కవయిత్రి కరోల్ రూమెన్స్‌ ‘ద గార్డియన్’ పత్రిక వారి బ్లాగులో, చాలా స్పష్టంగా, “So why translate? My first answer is that poetry in translation simply adds to the sum total of human pleasure obtainable through a single language. It opens up new language worlds within our own tongues, as every good poem does. It revitalises our daily, cliche-haunted vocabulary. It disturbs our assumptions, jolts us with rhythms flatter or stronger than we’re used to. It extends us in the way real travelling does, giving us new sounds, sights and smells. Every unique poetry village sharpens us to life.” అని అన్నారు. కవిత్వానికి అనువాదం ఎందుకు అవసరమో ఈ వాక్యాల ద్వారా గ్రహించవచ్చు.

“కొత్త దృక్పథాలను కనుగొనటానికి, మానవ భావోద్వేగాల సార్వజనీనతని అభినందించడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడానికి, భాషా నైపుణ్యాలు మెరుగుపరుచుకోడానికి, అనువాద కళకు మద్దతునివ్వడానికి, భాషా వైవిధ్యాన్ని గ్రహించడానికి, అలనాటి గొప్ప రచనలను కొత్తగా అనుభూతి చెందడానికి, భాషాపరమైన పరిధులను విస్తృతం చేయడానికి” – అనువాద కవిత్వం చదవాలని, https://readpoetry.com అనే వెబ్‍సైట్‌లో Thea Voutiritsas స్పష్టంగా చెప్పారు.

చక్కని కవిత్వం అనువాదంలో పాఠకులకి చేరువ కావాలంటే, అనువాదకులకి మూల భాష, లక్ష్య భాషలపై గట్టి పట్టు ఉండాలి, కవితాత్మక వ్యక్తీకరణలను గ్రహించే సూక్షమైన నేర్పు ఉండాలి. ఇవి కాక, వివిధ దేశాల కవితలని అనువదిస్తున్నప్పుడు ఆ కవితలు ఏ సందర్భాలలో రాయబడినవో, ఆ స్థలకాలాది పరిస్థితులపై అనువాద కవికి పూర్తి అవగాహన ఉండాలి.

కవిత్వం అనువాదంలో భాషాపరమైన, కళాసౌందర్యాత్మకమైన సమస్యలు, ఇంకా, సాంస్కృతికాంశాల ఇబ్బందులు ఉంటాయి. సమర్థులైన అనువాదకులు ఈ ఇబ్బందులను, సమస్యలను అధిగమించి, స్వభాషీయులకు ప్రపంచ కవిత్వాన్ని అందిస్తారు.

ప్రముఖ కవి, అనువాద రంగంలో అనుభవజ్ఞులు, నిష్ణాతులు; కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ (డా. నాగరాజు సురేంద్ర) ఇటువంటి బృహత్కర్యానికి పూనుకుని, దేశ విదేశాల చక్కని కవితలని ‘సంచిక’ ద్వారా పాఠకులకు అందించారు. సంచిక వారపత్రికలో 24 నవంబర్ 2024 నుంచి  కొనసాగుతున్న ‘అనువాద మధు బిందువులు’ అనే శీర్షిక లోని 52 కవితలని ఇప్పుడు పుస్తక రూపంలో వెలువరిస్తున్నారు.

~

ముందుగా కొన్ని విదేశీ కవితలను, వాటి అనువాద సొబగులను ప్రస్తావించుకుందాం.

మార్గరెట్ బర్న్స్ రాసిన Smile అనే చిన్న కవితని ‘చిరునవ్వు’ పేరుతో అనువదించారు ఎలనాగ. “But far more wonderful it is, to see what smiles can do, You smile at one, they smile at you, So One Smile makes Two.” అనే వాక్యాల్ని, “చిరునవ్వులేం చేస్తాయని యోచిస్తే/మరింతగా నివ్వెరపోతాం మనం/ఒకతణ్ని నువ్వు నవ్వుతో పలుకరిస్తే/నవ్వుతోనే బదులిస్తాడతడు” అని తర్జుమా చేశారు. ఎంత సరళంగా ఉంది కదా అనువాదం? అనువాదం అని చెప్పకపోతే, తెలుగు కవితే అని అనుకుంటారు.

Sara Teasdale రాసిన ‘There Will Come Soft Rains’ అనే కవితని ‘సన్నటి వానలు కురుస్తాయి’ అనే శీర్షికతో అనువదించారు. తెలుగు కవిత పేరే ఎంత చక్కగా కుదిరిందో! “And not one will know of the war, not one/Will care at last when it is done./Not one would mind, neither bird nor tree/If mankind perished utterly” అనే వాక్యాలని “కానీ యుద్ధం గురించి తెలియదెవ్వరికీ/అది జరుగుతున్నా ఎవ్వరూ/లక్ష్యపెట్టరు దాన్ని/మానవజాతి సాంతం మట్టిలో కలిసినా/పిట్ట, చెట్టు, మానవ సమాజం../ఏదీ దాన్ని పట్టించుకోదు.” అని అనువదించారు. ఇంగ్లీషులో ముందు వచ్చిన వాక్యాన్ని తెలుగులో వెనక ఉంచడం ద్వారా మూల భావం చెడకుండా, మరింత గాఢంగా అందించడంలో అనువాదకుడి ప్రతిభ తెలుస్తుంది.

ఎమిలీ డికిన్సన్ గారి ‘Hope’ అనే చిన్న కవితని ‘ఆశ’ పేరుతో అనువదించారు. “‘Hope’ is the thing with feathers/That perches in the soul/And sings the tune without the words/And never stops at all” అనే వాక్యాలని, “ఆత్మలో కూర్చునే రెక్కలపక్షి ఆశ/అది పదాలు లేని పాటను/పాడుతుంది నిరవధికంగా” అని అనువదించారు. ఆంగ్లంలో నాలుగు పాదాలుంటే, తెలుగులో మూడే వచ్చాయని కొందరు అనుకోవచ్చు. కానీ మొదటి రెండు పాదాలను – ఒకే పాదంలో మేళవించి భావుకతని జోడించి తెలుగులో అందించారు.

అమెరికన్ కవి Greg Kuzma వ్రాసిన Spring అనే కవితని ‘పూలకారు’ పేరుతో అనువదించారు ఎలనాగ. తెలుగు కవిత శీర్షికకి ‘వసంతం’ అని కాకుండా, ‘పూలకారు’ అని పేరుని ఎంచుకోడంలోనే అనువాదకుడి ప్రజ్ఞ తెలుస్తుంది. వసంతం అనే పదం వాడినట్టయితే, సాధారణ శీర్షిక అయిపోయేది. ‘పూలకారు’ అనే పదం ఎంచుకోడం వల్ల, అదే అర్థం ఉన్న మరో తెలుగు పదాన్ని, మళ్ళీ పరిచయం చేశారు. అనువాదంలోని గొప్ప సార్థకత అదే!

ఓ రష్యన్ కవితకు అనువాదంగా అందించిన ఓ కవితలో “హృదయపు రాచపుండ్లలో/సదమల కాంతిని వీక్షిస్తాను నేను” అని అన్నారు ఎలనాగ. ఎంతటి భావతీవ్రత! మూలంలోని ఉద్వేగాన్ని ఒడిసిపట్టిందీ కవిత!

జర్మన్ కవి నడ్యా కుషెన్‌మైస్టర్ రాసిన రాసిన కవితని అమీ ఖోర్ ‘Black Laundry’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించగా, ఆంగ్ల కవిత ఆధారంగా ఎలనాగ ఆ కవితని ‘నల్లని మురికి గుడ్డలు’ అని అనువదించారు. “the path that ran along the hedge was/a black piece of laundry, a view/a piece of laundry that got so heavy” అనే వాక్యాలని “కంచెపక్క నుండి పోయే తోవ కూడా/నల్లని ఒక మురికి గుడ్డ/దృశ్యం ఒక మురికి గుడ్డ/అది వానలో బాగా బరువెక్కింది” అని అనువదించారు. ఈ కవితలోని వేదన, గాఢతని సరళమైన పదాలలో తెలుగులోకి ప్రసరింపజేశారు అనువాదకులు. అయితే, కొన్ని కవితల విషయంలో, అనువాదంతో పాటు మూల కవితో లేదా ఆంగ్లానువాదమో కూడా చదివి ఆ గాఢతని తమలో మరింత ఇంకించుకోవాలనుకుంటారు పాఠకులు. అటువంటి కవితల్లో ఇది ఒకటి. గొప్ప ప్రతీకాత్మక కవిత!

Yongyu Chen అనే చైనా కవయిత్రి వ్రాసిన ఓ కవితని ‘ఔట్‍పోస్ట్’ పేరిట అనువదించారు. ఈ కవితలోని “We sit close on the stairwell & people walk between us. We seep/through them like smoke. The same people I knew/still here, but part/of the freedom” అనే వాక్యాలని “దిగుడుబావి మెట్ల మీద/మనమిద్దరం పక్కపక్కన కూచున్నాం/మనుషులు మన మధ్యలోంచి నడుస్తున్నారు/పొగ లాగా మనం వాళ్ల లోపలికి ప్రవేశిస్తున్నాం/నాకు తెలిసిన మనుషులే ఉన్నారిక్కడ/ కానీ వాళ్లు స్వేచ్ఛ లోని భాగాలు” అని అనువదించారు. స్వేచ్ఛ ఉన్న మనుషులకీ స్వేచ్ఛలేని మనుషులకీ పొగని, శీతాకాలాన్ని ప్రతీకలుగా చెప్పారు.

ప్రపంచంలో పలు దేశాల కవులు వివిధ భాషలలో రచించిన కవితలని అనువదించడంలో – అనువాద కవికి ఒక వెసులుబాటు ఉంటుంది – అదే వస్తువైవిధ్యం! కవితావస్తువులు అనేకం ఉండడంతో ఎంపికకు చక్కని అవకాశం ఉంటుంది. తనని కదిలించిన కవితలను, కవి సమహృదయులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఇతర దేశీయుల అనుభవాలూ, అనుభూతులూ మనవే అవుతాయి.

~

ఇక కొన్ని దేశీయ భాషల కవితల అనువాదాలని, అవి పాఠకులలో కలిగించే స్పందనని పరిశీలిద్దాం.

ఒడియా కవి, కథకుడు డా. మృత్యుంజయ్ సారంగి రాసిన కవితని ‘జూన్ నెలలో బంతిపూలు’ పేరిట అనువదించారు. “పరిణత కాంక్షల రూపం దాల్చే/ఏకాంతపు పరిమళాన్ని పీల్చాలనుకుంటాను” అన్న వాక్యాలు చదివినప్పుడు, ‘ఆహా, ఏమి భావ వ్యక్తీకరణ’ అని అనిపిస్తుంది.

బెంగాలీ కవి ప్రబల్ కుమార్ బసు రాసిన కవితకు ఔష్ణిక్ ఘోష్ ఆంగ్లానువాదం ఆధారంగా రాసిన ‘నేను నివసించే నగరం’ అనే కవిత ప్రతీకాత్మకమైనది. “నేను నివసించే నగరంలో/వర్షం కురిసినా కురవకపోయినా/ప్రతి మనిషి రెయిన్ కోటు తొడుక్కుంటాడు/సూర్యుడస్తమించాక కూడా/ప్రతివాడు నల్లని కళ్లద్దాలను ధరిస్తాడు” అనే వాక్యాలు చదివినప్పుడు – ఆ నగరంలోని జనాల ఈ ప్రవర్తన ఎందుకు అసహజంగా ఉందో తెలుసుకోవాలని పాఠకులు ఆశిస్తారు, కవితలోని మార్మికతని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

స్నేహప్రవా దాస్ ఆంగ్లంలో రాసిన ‘The Door I Never Opened’ అనే కవితలోని ఈ ఆంగ్ల వాక్యాలు చూడండి “A nonchalant mist settles calmly/Over the pensive trees./Dull and scarred leaves spread below in thick scatters/Like languishing memories..” ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా! ఇప్పుడు ఆ కవిత తెలుగు అనువాదం ‘ఎప్పుడూ తెరవని తలుపు’ లోని “ఉపేక్ష నిండిన పొగమంచు/దిగులులో మునిగిన చెట్లమీద/వాలి సర్దుకు కూర్చుంటుంది./కాంతిని కోల్పోయి గాయపు మచ్చలతో/కింద గుబురుగా పరచుకున్న/ఆకులలాగా కృశిస్తూ జ్ఞాపకాలు!” అన్న ఈ వాక్యాలు చదవండి! ఆంగ్లంలో కవయిత్రి వ్యక్తపరచిన భావాలకి ఏ మాత్రం తీసిపోకుండా, అంతే గొప్పగా తెలుగులో చెప్పారు కదా!

దౌత్యవేత్త, కవి కె. అభయ్ రాసిన ‘Sun Feast’ అనే కవితని ‘సూర్యునికి విందు’ పేరిట అనువదించారు. మూలంలోని “stare at my bare body as much you want/you can get into it an inch or two,/for a change, try/my limitless heart, infinite soul” అనే వాక్యాలని ఎలనాగ “ఎంత కావాలంటే అంత చూడు నా నగ్నశరీరాన్ని/మార్పు కోసం ఒకటి రెండంగుళాలు/దేహం లోపలికి కూడా వెళ్లొచ్చు నువ్వు/పరిధులు లేని నా హృదయాన్ని,/అనంతమైన నా ఆత్మను దర్శించు” అని అనువదించారు. గోవా బీచ్‌లలో విదేశీ మహిళలు ఎదుర్కునే ‘వెకిలి చూపుల’ సమస్యని ప్రస్తావిస్తుందీ కవిత.

~

ఈ పుస్తకం లోని కొన్ని కవితలు చల్లని వెన్నెలలా మనసుకు హాయి కల్పిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని కవితలు ఉద్విగ్నతకి గురిచేస్తే, మరికొన్ని మన అపోహలని తొలగిస్తాయి. ఇలా చక్కని కవితలని పాఠకులకి అందించారు ఎలనాగ. యథాతథ అనువాదం, భాషానువాదం కాకుండా భావానువాదం చేశారు, కొన్ని కవితలది అనువాదం కాదు, అనుసృజన అని చెప్పవచ్చు. అలా అని మూల కవిత పట్ల అవిధేయత చూపలేదు. స్వయంగా కవి అయిన అనువాదకుడు మూలాన్ని మరింత మెరుగుపరుస్తాడననడానికి ఈ పుస్తకంలోని కవితలు చక్కని ఉదాహరణలు.

ఈ కవితలను చదవడం, ఈ నాలుగు మాటలు రాయడం ఓ అనువాదకుడిగా నాకెంతో సంతోషం కలిగించిన సందర్భం. ఇందుకు అవకాశమిచ్చిన ఎలనాగ గారికి ధన్యవాదాలు.

***

ఆత్మ రెక్కలో పక్షి (అనువాద కవిత్వం)
అనువాదం: ఎలనాగ
ప్రచురణ: బోధి ఫౌండేషన్
పేజీలు: 94
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Aatmalo-Rekkala-Pakshi-Elanaga/dp/B0GBS7WXSS

 

 

 

~
ఎలనాగ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-elanaga/

Exit mobile version