Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 1వ భాగం.]

దిభట్ల నారాయణ దాసుగారు 1940లలో అమ్మవారి వెయ్యి పేర్లకు (లలితా సహస్రనామాలు) అచ్చతెలుగు నుడుల్ని కూరుస్తూ వ్రాసిన ‘తల్లివిన్కి’ అనే కబ్బానికి మట్టు (కుదురు-ఉపోద్ఘాతం) ఇది.

ఎవరి అమ్మనుడి వాళ్లకి వేల్పునుడే(దేవభాష)! తెలుగు నుడి(భాష)ని వేల్పునుడిగా, ఓజ (శ్రేష్ఠత) ఒప్పారేదిగా మందితో ఒప్పించటం ఆయనకు ఎంతో నెనరైనది. తెలుగు నుడిచేవ పూర్తిగా ఎరుక ఆయనకి! నాటుతెనుగంటూ ఆయనే అచ్చతెలుగును మేటినుడిగా కొలిచారు.

ఈ “మట్టు”లో ఎక్కడా ఒక్క గీర్వాణ నుడి కూడా ఆయన వాడలేదు. కాకపోతే ఆ నాటి వ్రాతపోతల తీరుని బట్టి ఆ నడక ఇప్పటి మనకి కనుకలిగా(చూడగానే అర్థం అయ్యేలా) ఉండకపోవచ్చు. అందుకే, ఇప్పటి వ్రాత తెరవులకు తగ్గట్టుగా దానిని కొంత తేలికపరిచి ఎత్తివ్రాసి ఇక్కడ ఇస్తున్నాను.

ఒక్క సంసృత లేదా ఆంగ్ల నుడువు లేకుండా అచ్చంగా తెలుగులో అవధానాన్నే చేస్తున్న నా నేస్తుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాదుడి వంటివారు తెలుగు నుడులను వేలుపు నుడులనే నిండు తనివిని మంది ఉల్లములలో నింపుతున్నారు. మనదీ అదే దారి కావాలి.

ఇప్పటి వ్రాతకారులందరినీ ఒక్కటే అడగాల్సింది ఉంది.. పైనుడులు(పరాయిపదాలు) లేని రీతిలో చక్కని, చిక్కని తెలుగులో మనమూ వ్రాయలేమా.. అని! శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుడుగారు అలా వ్రాసి చూపారు. వారి దారినే వ్రాసే చిన్న పాటు ఇది.

తెలుగు నుడులు కనుమరుగు కాకుండా అవి నిండార మనేటట్లు చేసుకోవటానికి ఇదొక తంతు. ఉల్లము చెమ్మరించి చదువరుల తనివి తీరేనని కోరిక!

విజయనగరంలో నేటికీ పదిలంగా ఉన్న శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారింట్లో వారి చిత్తర్వులు, వారి పుత్తళిక(విగ్రం) వద్ద

ఎవ్వరికైనా తమ పుట్టువు ఈడేర్చుకునే తెరంగులు (విధానాలు) ఉన్నాయి. తోటి పాటి రాగల అందరితో ఎక్కువ పొత్తు కలుపుకోవాలి. ఎవ్వరినైనా ఎప్పుడైనా కొంచెమైనా నొప్పించకుండా ఉండాలి. అందరూ మెచ్చదగిన మంచి నడువడి పూటపూటకు పెంపారాలి. పొసరు చూపకుండా నలుగురితో కలిసిమెలిసి హాయిగా బ్రతుకు కొనసాగించుకోవటం కన్నా వేరే ఇంకేదీ లేదు.

మేనువంచి, నుదుట చెమట తుడుచుకుని నలుగురు మెచ్చుకొనే తీరున పాటుపడాలి. తమకు తామే కూడుగుడ్డలు కూర్చుకోవాలి. ఇరుగుపొరుగువాళ్లతో అన్ని ఆస్తుల్ని వంతు పరచుకోవాలి.

ఎక్కువ  తక్కువ తెగలవారనే వాసి ఎంచుకోకూడదు. కొండు (కొంచెం) ఒరిమిక (కలుపుగోలుతనం)తో, నెమ్మి(ప్రేమ)తో, నెనరు(కృతఙ్ఞత)తో, ఓర్పుతో నిండార మనుట (జీవించుట) మేలు.

తేరగా వచ్చిన ఆస్తుల్ని తెగనీల్గుతూ (నీలుగుబోతుతనం= Audacity, impudence. దుస్సాహసం, నిర్లజ్జత్వం, అవినయం, అహంకారం), సోమరులై తిరిగే చెడుగొట్టులకు నిండుతనివి (తృప్తి) కలుగబోదు.

కలలో కనిపించే మన ఒళ్లు చేసే పనులెల్ల కల్లలే అయినా నిక్కమే (నిజం) అనిపిస్తాయి. ఇరుగు పొరుగు వారి పచ్చచదనం గిట్టని పాపాల ముద్దలకే తనవారు, పైవారు, నేను, నాదనే వేరువేరు చెడు తలంపులు ఒదవి (పుట్టి, కలిగి) పెచ్చుపెరుగుతుంటాయి.

ఒరులకి కలిగిన మేలు తనకే కలిగినంతగా ఉప్పొంగే మంచివాళ్లే నిక్కంగా నింగి-నేలల్లో (ఇహపరాల్లో) జరిగే ఏ పనులకైనా “తగని పొంగు కుంగులు” లేకుండా ఉంటారు (స్థితప్రఙ్ఞత).

పిల్లలంటే కన్నతల్లి కన్నా పైవాళ్లకి (పరాయివాళ్లకి) కూర్మి అంతగా ఉండదు. కనుక, ఓజగా (శ్రేష్ఠమైనవిగా)  నింగికి నేలకు చెందిన దినుసులు అన్నీ (సృష్టిలోని సమస్తం) తన ఆటగా (లీలలు) తానే పుట్టించి, పెంచి, తనలోనే చేర్చుకోగలిగిన చేవయే (శక్తి) తల్లి(లలితామాత) అనే పిలుపుకి ఒప్పుతుంది. ఇది తెలిసిన తొల్లింటి పెద్దలు(మన పూర్వులైన మహర్షులు) ఆ కన్నతల్లినే వేల్పుగా (దేవతగా) కొలువసాగారు.

ఎల్ల కోర్కెలూ ఉడిగి (వదిలేసి), ఒరుల (ఇతరుల) మేలుకై పాటుపడే మంచివాళ్లు తప్ప ఆ తల్లిని కొలవటానికి తక్కిన కడుపు కక్కూర్తి గాళ్లు ఇసుమంతైనా కొరగారు.

తల్లి (లలితామాత) వెయ్యి పేర్ల విన్కి (శ్రుతి) చాటి చెప్పిన మాటలు అల్లేవాడు (కవి) తాను ఒడ్డెక్కి, తన తోటివాళ్లకు మేలు సల్పగలడని నా నమ్మకం.

నింగి నేల లన్నిటినీ తన కన్నతల్లిగా తలచి ఏ కోర్కే లేకుండా ఉండటం మైతాల్పులలో (శరీరాన్ని ధరించిన వారిలో) ఎవ్వరికి చెల్లునో (..ఆ మహాకవిని) మంచినడతలేని ములుచ (మూఢుడు) ఎట్లా కనిపెట్టగలడు?

ఆడకూతుళ్లే మందిలోనెల్ల (అందరిలోకెల్లా) నేట్లు(శ్రేష్ఠులు). నిండుకుండలు. కన్న తల్లులు. కనికరం ఓర్పు కలవాళ్లు. ఆడ వాళ్లను, మగవాళ్లను కూడా తమ కడుపున పదినెలలు మోసి, కని, పెంచి, నడవడి మప్పి(నేర్పి) అందరికీ మేలు సల్పగలవాళ్లు.

నిక్కంగా చెప్పాలంటే మగవాళ్లంతా తప్పకాయలే! టాటోటు పేలుడు పెంకులే! చమురు లేని పేలుడు గాయలే! కొంపచెరపులే! వేరువిత్తులే! నిండు మగవాడేడీ..? (ఇవన్నీ ధూర్తుడికి వర్తించే తెలుగు మాటలే!)

మంచి ఆడుదానికి చెడ్డ అలవాట్లు మప్పి(నేర్పి), చెడగొట్టి, తాము చెడటమే గానీ, ఆ కన్నకొడుకులు-మగవాళ్లు మరెందుకూ కొరగాక తమలో తాము తన్నుకొని పొలయుచుందురు (చెడుతుంటారు)

తల్లిని అమ్మవారితో పోల్చటానికి కొంతవరకైనా వీలుంది కానీ, తండ్రిని ఎవరితోనైనా పోల్చటం ఎవరి తరం? కాబట్టి ఆడది నిక్కం, మగవాడు కల్ల.. అనక తప్పదు. కాబట్టే, తొంటిపెద్దలు (మన పూర్వులు) తల్లినే వేలుపుగా నమ్మి కొలవటం తగినదిగా నమ్మవలసి వచ్చింది!

ఆడదానిని విచ్చలవిడి వదిలేసి, ఆపె (ఆమె) చెప్పిన చొప్పున మగవాడు నడుచుకుంటూ, తన ఇములు (లాభాలు) మానుకొనైనా సరే ఇసుమంతైనా ఏమరపాటు లేకుండా ఆవిడ కోరినట్టు ఎన్ని అగచాట్లకు లోబడవలసి వచ్చినా తప్పకుండా తీరుస్తూ నిక్కంగా ఆడకూతురే ఈ నింగీనేలలకు పట్టుకొమ్మ అని గట్టిగా నమ్ముకొన్నట్ట్లయితే ఆమె కనికరపు కుప్ప! తలచినంతనే ఎంత పనైనా చెయ్యగల చేవ!

ఓజ (శ్రేష్ఠత్వాన్ని)ని ఒప్పారే  ఆడదే మగవాణ్ని ఒడ్డెక్కిస్తుంది. ఆడదాని కడుపునపుట్టి, ఆమె చాచుల పోసనాలు (వ్యాపింపచేసిన కాంతులు) తాగి ఆమె చెప్పు చేతుల్లో పెరిగి, కూనని పెంచితే గండయినట్టు అవుతాడు మగవాడు. ఆవిడ మెడ కట్టి(తాళికట్టి), ఎన్నో పాట్లు పెట్టి, మేలు మరచే వెలితి తప్పకాయ మగవాడు! అటు తనకు ఇటు ఇంతికీ కాకుండా అటిటుకు తప్పి రెంటికి చెడిన రేవడి అయి, కోరి ముప్పు తెచ్చుకుంటున్నాడు. మగాడై తెగ నీలిగేకన్నా ఈ బతుకున ఆ గాడిదైతే కొంత మేలేమో!

ఆడదే మంచిది. ఆడది చేసేవన్నీ మేళ్లే! కానీ, మగవాడు సలిపేదంతా కీడే.. పాడే! ఆడది చేవ! మగాడు చెత్త! ఆడదానిలోనే మగవాడున్నాడు. కానీ, ఆడదానికి వేరుగా మగవాడు లేనే లేడు.

ఆడది చురుకైన ఎరుక. మగవాడు తెలివి లేని ఉత్త మొద్దు. కాబట్టి తొల్లింటి పెద్దలు(పూర్వులు) ఆడదానినే వేల్పుగా నిరుకు (నిర్ణయం) చేశారు.

గట్టు (కొండ) అంటే కోర్కెల్లేని ఉల్లం(హృదయం). మైమరచిన కూరుకు(నిద్రమత్తు), మెలకువ, కలకూర్కు (కలతనిద్ర) ఈ మూడింటినీ మించిన నాలుగవ ఉనికి ఆడది. అలాంటి నాల్వ ఉన్కి లోంచి పుట్టిన నిండు తనుపు (తృప్తి పొందించేది) కాబట్టి ఆడదానిని ఐదవ ఉన్కి, గట్టుపట్టి (హిమవంతుడి కూతురు-ఆదిశక్తి) అంటారు.

డెందపు (గుండె) తడిని (ఆర్ద్రత) నాలుగుసార్లు వడబోస్తే తుట్టతుదకు తేలిన నిగ్గే ఆడది. నింగి నేలల దినుసుల (సమస్త జీవరాశి) రాకపోకల కెల్లా మొట్టమొదటి కతగా (ఆదిదైవం) ఎన్నటికీ చెడక పగడం లాగా ఒప్పారే తనుపు చేవకు తల్లివేరు (మూలం).. ఆడదని!

కాబట్టి. మనం అంతా జంజాటతగులాల (చిక్కుముళ్లు) కడలిని కడచిన (జయించిన) గట్టుపట్టి (అమ్మవారు) ఐవరసమ (అచ్చివచ్చేది) దరి చేరాలి. అందుకు నింగి నేలల దినుసులన్నిటిని (ఇహపరలోకాలలోని జీవరాశులన్నిటిని) తమ కన్నతల్లిగా అనుకోవాలి. కనికరంతో, ఓర్పుతో చెలగి (ఒప్పైన నడవడి) ఎక్కడైనా నెగ్గెన్నక (అపకారభావన) తమ్మువలె (తమవారిలాగే) అందరిని కాపాడుకొస్తూ హాయిగా ఆ తల్లి వేయిపేర్లని ఎల్లప్పుడు పేర్కొంటూ ఉండటం మందికి తప్పని పని. ఆ తల్లి నిండు తనివి (పూర్తి తృప్తి, దయ) పొందగోరిన తెలివైన వారంతా దీనిని నమ్ముకోక తీరదు(తప్పదు).

ఆడదెల్ల ఒప్పే! మగవాడెల్ల తప్పే. ‘మెలకువ కల్గిన కూర్కులు (నిద్రిస్తున్నా మెలకువ గలవారు)’ ఉన్నారు. మరి నాకు తెలిసినంతవరకూ ఈ నింగీ నేలల్లో జరిగే పనులన్నింటిని తెలిసిన వేల్పులున్నారు.. వాళ్లు ఇరుగుపొరుగులకు కీడు చేసేవాళ్లకి తప్పక జెట్ట (యుద్ధహాని) చేస్తారు. అలాగే, అందరికీ మంచి కావించే వారికి తగినంత మేలు తప్పక చేస్తారు.

ఈ మెలకువకల కూర్కులు మందిలో (మనుషుల్లో) ఒండొరువులకు ఒండొరిమిక (ఒకరితో ఒకరికి ఐకమత్యం) పెంచారు. జట్లలో (సంఘంలో) పొత్తు రెట్టింపించారు. హాయిగా పెక్కేళ్లు (అనేక సంవత్సరాలు) బ్రతుకు వెరవు(ఉపాయము)గా మంచి చదువు (ఙ్ఞానం) నడతల్ని మొదటి నుండీ తోడివారికి పాడిగా (న్యాయంగా)ఎవరికి ఎంత తగునో అంత మేర మప్పుతూ (అలవాటు చేస్తూ) వచ్చారు.

కాబట్టి తనను కొలిచే పిల్లల (భక్తులు)కి ఎప్పుడూ మేలే కోరే నింగి నేలల తల్లి, మెట్టపట్టి (అమ్మవారు), వెయ్యిపేర్ల వినుకరి (ప్రసిద్ధినందినది) నాకు తెలిసినంతవరకూ, నాకు వచ్చిన నాటుతెలుగు మాటలతో చెప్పగలిగాను.

ఒక పలుకు(శబ్దం) చవి(రుచి)ని చేతితో వ్రాసి చూపించలేము. చెవులతో చూడటమూ, కంటితో వినటమూ వీలుకాదు. వేల్పు నుడువు (దేవభాష) గుట్టు ఎవరికివారే తెలియాలి.

మనం మాటలాడే పలుకుల్లో సీమపల్కులు (పరభాషాపదాలు) వేల్పునుడువులకన్నా (అచ్చంగా తెలుగు కన్నా) మీరి మెండుగా ఉన్నాయి. వ్రాతలోకి ఒదిగిన నాటు తెనుగు నుడువులకంటే, చదువరుల (పాఠకుల) వ్రాతలో చేరని పలుకులు వేయిరెట్లైనా ఉంటాయి. (సాహిత్యానికి, నిఘంటువులకూ ఎక్కని వాడుకపదాలు జనం నాలుకలమీద ఇంకా ఆడుతున్నవి, ఒకప్పుడు ఆడినవీ వేల సంఖ్యలో ఉన్నాయి).

నేలయందంతటా ( ఈ విశాల ప్రపంచంలో)  పలుసీమలకు ఎవరికివాళ్లు కడుదవ్వులైన పెక్కు చోట్లకు (దూరప్రాంతాలకు) ఏనాడో చెదరిపోయారు. ఆయా తావుల్లో నెలకొన్న(స్థిరపడిన) తెలుగువారు తెనుగు వ్రాత, చదువు మరచినప్పటికీ తమలో తాము తెలుగు పలుకుల్ని తరతరాల నుండి చివర వరకూ కూడా మానకుండా మాటాడుకొనే వాడుక ఉంది. వారివారి తెలుగు మాటలీ తెలుగునాడున ఇప్పుడు వాడకంలో లేవు. ఈ నాటి తెలుగు వ్రాతకారులున్నూ(రచయితలు) వాటిని చూపట్టక పోవటం (వ్రాయక పోవటం) చేత వ్రాతకు రాని ఎన్నో పాటలు, మాట కూర్పులు కోటానుకోట్లు నోటివాడుకలో (మౌఖికంగా) ఉండిపోయాయి. ఈ నేలమీద (ఈ విశాల ప్రపంచంలో) ఎన్ని సీమల్లో ఎన్ని చోట్ల ఎన్ని తెలుగు నుడులు ఇలా నోటివాడుకలో ఉన్నాయో, ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు.

తెలుగు నుడువుల్ని ఓజగా (శ్రేష్ఠంగా) చదువుకున్న తల్లిదండ్రులు ఎక్కడైనా మాటాడుకొనే వాడిక (అలవాటు) ఎప్పుడూ లేదు. పలురకాలైన ప్రాచదువులు మొదలైన 18 చదువులు (భారతీయ విద్యలు) చదివే వీలుకాని అట్టడుగు మిట్టమింటి దినుసులన్నీ (నిరక్షరాశ్యులైన ప్రజలు) తమతమ తలపుకొలదీ పన్నిన పన్నుగడలే చూడచూడ తలపతలప ‘వంచ నాటుమాటలు’ (ప్రాంతీయ మాండలికాలు) అయ్యాయి.

సీమతెలుగే (క్లాసికల్, నాగరిక భాష) ఈ నేలపైన తమతమ పుట్టినచోట్ల తమతమ తలిదండ్రులు తరాలుగా లెక్కించతరంగాని ఏ నాటినుండో వాడికలో ఉండటాన్నిబట్టి కనీవినీ ఎరుగన వీలైన దినసులను (విధానాలను)  కూర్చి తెలపగలగటం (ఈ రచన ఆశించే పరమప్రయోజనం).

వేల్పునుడి (సంస్కృతం) జోలి సుంతైనా లేని నోటిమాటగా (వాడుకభాష) నాటు తెలుగు మొదలైన ఆ యా సీమపలుకులనే కాని, తొలుపలుకులు (మూలపదాలు) మొదలైన 18 చదువుల మాటకూర్పు లన్నీ లేనిపోని వ్రాతలుగా, కవిలె కట్టలుగా డబ్బు దండుగ మనువు కూర్పులుగా మిగిలిపోతున్నాయి.

పెళ్లిళ్లు, వేల్ములు (హోమాలు), వేల్పుడులు(పూజలు), ఆటలు, పాటలు, వాయింపులు, కొల్పులు, గుడులు, బడులు, పలుతెగల కట్టుపాట్లు, విలువైన దుస్తులు, నగలు, బంగారు వెండి రాగి మొదలైన అచ్చుపడిన డబ్బులు(నాణాలు), గొప్పకొద్ది వాలకాలు (ఆడంబరాలు), వావివరసలు, మావి-మీవి-వారివి అనే వేరువేరు ఆస్తి హెచ్చుతగ్గు పొగరుబోతు తనములు వేయేల బ్రతకటానికి కావలసిన కూడుగుడ్డ కూటమి యిమ్ముల(దండిగా)కన్నా తక్కిన లేనిపోని అక్కరమాలిన(అవసరం లేని) పోకిరిపనులన్నీ కోరి తగిలించుకునే ముప్పులే!

పెక్కాస్తి (బాగా సంపద) కూర్చుకుని తిని తెగనీల్గి ఊరక కొవ్విపోయిన తుంటరులు అటు ఆడువారికి పనికిరాకుండా పోవటమే కాదు, ఎందునకూ పనికిరాక అన్ని ఇడుములకీ లోనై, గొప్పవాళ్లమనుకుని విర్రవీగేవారికి చివరికి అమ్మముందు తలవంచకతప్పదు. ఎలాగైనా బతకనీ, ఎవ్వరెట్లాగైనా తిరగనీ, కలలోని మనుషుల్లాగే మెలకువలో కూడా జరిగే పనులన్నీ కల్లలే!

ఓజవెజ్జు గం. వెం. పూర్ణచంద్రుడు

(ఇంకా ఉంది)

Exit mobile version